MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
అప్పిచ్చి'వాడు -వైద్యుడు- 4
నువ్వు నా అమ్మవీ కాదు, నేను నీ కొడుకునీ కాదు!
చింతపల్లి గిరిజా శంకర్
ఒకానొక అర్థరాత్రి.
ఒక తాగుబోతు ఇంటికెళ్ళి తలుపు గొట్టాడు.
"ఎవడ్రా అదీ?" లోపల్నించి ఒక బొంగురు కంఠం.
"నేనే నాన్నా. తలుపు తియ్యి! వాన పడుతోంది"
ఆ మీసాల ముసలాయన తలుపు తీసీ తీయగానే "నేను నీ తండ్రినీ గాదు, నువ్వు నా కొడుకువీ గాదు. ఫో" అని గర్జించాయి మీసాలు.
"క్షమించు నాన్నా. ఇంకెప్పుడూ చెయ్యను. నువ్వు నాన్నని కాదంటే ఎక్కడికి పోతాను" అర్థించాడు తాగుబోతు.
"నేను నిజంగా నీ నాన్నని గాదురా అబ్బాయి. నువ్వు తప్పింటికొచ్చావు. మీ యిల్లు కాదు ఇది. మీది పక్కిల్లు. అక్కడికి పో. మీ నాన్న ఎదురుచూస్తున్నాడు"
చీకట్లో తాగుబోతు పొరపాటింటికి వెళ్ళాడు సరే, ఇలాంటివి మరి తాగిలేనివారికీ సంభవిస్తాయా??
**
"అయ్యా! అమ్మగారొచ్చారు చూట్టానికి" చెప్పాడు బంట్రోతు విశ్వనాధం తో.
"తీసుకురా మరీ!" అన్నాడు విశ్వనాధం ఆత్రుతగా. తనకి కార్ ఆక్సిడెంట్ జరిగి వారం రోజులయింది. తలకి బాగా గాయాలు తగిలాయి. సర్జరీ గూడా చేశారు. డిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో స్పెషల్ రూంలో కొంచెం కొంచెం కోలుకుంటున్నాడు.
కాంతమ్మని లోపలికి తీసుకొచ్చాడు, బంట్రోతు. పాపం కళ్ళనీళ్ళతో చీరంతా తడిసిపోయింది. రాగానే కుప్పలా కూలబడింది పక్కనున్న కుర్చీలో.
"ఎలావుంది నాయనా?" అడిగింది అమ్మ.
"ఎవరండీ మీరు? అమ్మేదిరా?" అన్నాడు బంట్రోతు వేపు చూసి.
కాంతమ్మగారికి మూర్చ వచ్చినంతపనయ్యింది. "నేనేరా విశ్శూ"
"ఎవరండీ మీరు? ఎందుకొచ్చారు? ఏమిటిదంతా?"..విసుక్కున్నాడు.
కాంతమ్మ గారు దుః ఖం ఆపుకోలేక కింద పడిపోయింది. కొంతమంది నర్సులూ, చాకర్లూ వచ్చి ఆమెను వెయిటింగ్ రూం లోకి తీసుకెళ్ళారు. కొంతసేపటికి, ఆపరేషన్ చేసిన పెద్ద డాక్టర్, న్యూరో సర్జన్ వచ్చి, జరిగిందంతా విన్నాడు. కాంతమ్మ దగ్గరికొచ్చి, ఫోన్ డయల్ చేసి, "అమ్మా! ఇప్పుడు మాట్లాడండి" అని ఫోన్ ఆమెకిచ్చాడు. ఏడుపు దిగమింగుకొని, ఫోన్ లో "హలో" అన్నది, భయం భయంగా. "అమ్మా! ఎక్కడున్నావు? ఎలావున్నావు?" విస్సూ గొంతు
"ఇక్కడే. వెయిటింగ్ రూంలో"
"అక్కడేం చేస్తున్నావే? లోపలికిరా. విజిటర్స్ రావొచ్చు"
కాంతమ్మగారు, తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఆశ్చర్యం, అద్భుతం అన్నీ మేళవించిన ఆత్రుతతో దాదాపు పరుగెడుతూ మళ్ళీ రూం లోకొచ్చింది.
"ఎవరండీ మీరు? అమ్మేది? డాక్టర్! మా అమ్మేదీ?"
"నేనేరా మీ అమ్మని"
"నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గుంటూర్లో ఉంటుంది. ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను."
కాంతమ్మగారి పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. భోరున ఏడవటం మొదలెట్టింది.
ఇంతలో డాక్టర్, "ఒక్కసారి ఇల్లా రండమ్మా" అని మళ్ళీ వెయిటింగ్ రూం లోకి తీసుకొచ్చి,ఇందాకటిలాగానే ఫోన్ డయల్ చేసి ఆమెకిచ్చి, "మీ అబ్బాయిని పేరుతో పిలవండి" అన్నాడు.
అలా ఏడుస్తూనే, కాస్త ఊపిరి తెచ్చుకొని, "నాయనా! విశ్శూ..." అన్నది.
అవతలనించి విశ్వనాధం గొంతు, " అమ్మా! ఎక్కడున్నావు? లోపలికి రాలేదేం?"
***
అదండీ పరిస్థితి. మీకు ఈ పాటికే పరిస్థితి కాస్త అర్థమయింది కదా? మరి పూర్తి వివరం ఆ న్యూరో సర్జన్ నే అడుగుదాం పదండి, ఏం చెప్తాడో. అదిగో ఆయన కాంతమ్మగారికి చెప్తున్నాడు. మనం గూడా విందాము రండి.
"అమ్మా! మీ అబ్బాయికి ఉన్న జబ్బుని Capgras Syndrome కాప్గ్రాస్ సిండ్రోం] అంటారు. తలకి బాగా దెబ్బలుతగిలినా, స్ట్రోక్ వగయిరా వచ్చినా, బ్రెయిన్ లో ట్యూమర్ లాంటివొచ్చినా కొంతమందికి ఇలాటి వ్యాధి వస్తుంది. ఆక్సిడెంట్ అయ్యాక, మేము ఆయన బ్రెయిన్ లో చాలా బ్లడ్ క్లాట్స్ అవీ తీసివేయాల్సొచ్చింది. అందువల్ల మీవాడికి కంటినుండి వెళ్ళే సందేశాలు,వాటిని ఫలానా అని గుర్తుపట్టే కేంద్రాలకి చేరటం లేదు.అందుకని మిమ్మల్ని మనిషిగా గుర్తిస్తున్నాడు గాని, అమ్మలా భావించలేకపోతున్నాడు. అంటే ఎవరు ఎవరో తెలిపే "విచక్షణా శక్తి" [discriminatory capability] కోల్పోయాడు. కాని మాట, చెవినించి వెళ్ళే నరాలు ఆ సందేశాలని గ్రహించే కేంద్రాలకి నిరాఘాటంగా చేరవేస్తున్నాయి. అందుకని మీ మాట వినగానే మిమ్మల్ని గుర్తు పట్టాడు. కానీ చూపుకి సంబంధించిన సందేశాలు, ఆక్సిపిటల్ [Occipital lobe] కి చేరటం లేదు. అవి మధ్యలో తెగి ఉండవచ్చు లేదా దారి తప్పి ఇంకో కేంద్రానికి వెళ్ళి ఉండవచ్చు. ఉదాహరణకి, ఆ నరాలు దారి తప్పి, రుచి కేంద్రానికి [Taste center] వెళ్ళాయనుకోండి, మీ మాట గూడా గుర్తుపట్టకపోవచ్చు. అప్పుడు మీరు చేసే మామిడికాయ పప్పు తిని మిమ్మల్ని గుర్తుపట్టవచ్చు, మాటద్వారా కాకుండా. ఇలాగా, ఎంతమందిని, ఎన్ని దృశ్యాలని ఆయన పోగొట్టుకున్నాడో ప్రస్తుతం చెప్పలేము. అయితే ప్రాణాపాయం ఏమీ లేదు.
కాంతమ్మగారి మొహంలో కత్తి వేస్తే నెత్తురుబొట్టులేదు. డాక్టర్ చెప్పింది ఆమెకి ఏమీ అర్థం కాలేదని వేరే చెప్పక్కరలేదు. తల్లిని గుర్తుపట్టలేని ఈ మాయదారి రోగం ఏమిటో ఆమెకు బోధపళ్ళేదు. శోక దేవతయిపోయి, వేమరు దేవుళ్ళని వేనోళ్ళ ప్రార్థిస్తూ ఏడుస్తున్నది. విస్సూ నిద్రపోతున్నాడు. ఆ పక్కనే కూచు oది అమ్మ.
ఇంతలోనే కోడలు వచ్చింది, భోజనం క్యారియర్ తో.
నిద్ర లేచి, "చూడు దుర్గా ఈమెవరో మా అమ్మనంటుంది!" అన్నాడు అబ్బాయి. కాంతమ్మగారి దుఃఖం కట్టలు తెంచుకుంది. అంతలోనే సందేహం "నన్ను గుర్తు పట్టనివాడు, పెళ్ళాన్నెలా గుర్తుపట్టాడు?"
దుర్గ అది గమనించి, "అత్తయ్యా! ఈవారం రోజుల్నించీ నా గొంతు గుర్తుబడుతున్నారు, నేనని సమర్థించుకుంటున్నారు అంతే"
మనకి అర్థం కావడం కోసం ఈ క్రింద రెండు బొమ్మలు వేశాను
కంటినుంచి వెళ్ళే నాడులు, మధ్యే మధ్యే ఆగుతూ మిగిలిన కేంద్రాలతో పలకరిస్తూ, చివరికి దృశ్య నిర్థారణ కేంద్రానికి [Occipital lobe] కి చేరతాయి. అంటే, కేవలం చూసింది identify చెయ్యడమే కాకుండా, ఆ చూసిన సంఘటనలపూర్వాపరాలూ, సంఘటనలూ, వాటి అనుభవాలూ, అనుభూతులూ, emotions, ఇత్యాది సవాలక్ష "గుణాలు" [అందాములెండి], వేరే పేరు లేదు గాబట్టి, ప్రేరేరింపబడతాయి. మన బ్రెయిన్లో ఉన్న బిలియన్ కణాలూ, ఇలాగా ఇరుగుపొరుగు స్నేహాలతో ఎన్ని కనెక్షన్లు పెట్టుకుంటాయంటే, ఆ సంఖ్య మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల సంఖ్యకంటే ఎక్కువ.
ఉదాహరణకి, ఒకానొక ఆర్ట్ విద్యార్థి, గాలరీలో తనకి బాగా నచ్చిన ఆర్ట్ చూసి ఆనందించటానికి, ఆ దృశ్యం అతడి బ్రెయిన్ లొ దాదాపు 26 కేందాల ద్వారా ప్రసరిస్తుంది. మన మిత్రుడూ, శత్రువూ మనుషులేగదా. వాళ్ళ దృశ్యం చివరికి ఆ కేంద్రానికే చేరునుగదా. మరి మనకి వాళ్ళని చూసినప్పుడు విపరీత భావాలు కలుగుతాయి. దృశ్యం ఒకటే అయినా, ఆ దృశ్యానికి సంబంధించిన అనేక సందేశాలన్నీ ఒక "చిప్" లో దాచబడతాయి. కాగితం పూల గుత్తి [boquet] చూస్తే వచ్చే అనుభూతి వేరే, మంచి నిజమయిన పూల గుత్తి చూస్తే వచ్చే అనుభవం వేరే. ఇట్లా ఒక వస్తువుకి , దృశ్యానికి సంబంధించిన "సవా లక్షా గుణాలన్నీ" దాదాపు బ్రెయిన్లో 26 సెంటర్ల ద్వారా, ప్రయాణించి చివరికి అదుగో ఆ ఆక్సిపిటల్ లోబ్ చేరతాయి. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ లో చెప్పిన తతంగమంతా ఒక చిప్.ఇంతటితో ఆగలేదండోయ్. మరి అనుభూతికి మనసు కావాలిగదా.అసలు మన కష్టాలన్నిటికీ మూల విరాట్టు అదేకదా. అదెక్కడుంటుంది? ఆ రహస్యం తెలిస్తే నేను ఇక్కడ 3 గంటలనించీ టైపు ఎందుకు చేస్తాను?
భగవద్గీత ఆరో అధ్యాయంలో "ఆత్మైవ ఆత్మనో బంధుహు, అత్మైవ రిపురాత్మనహ్" ఇక్కడ ఆత్మ అంటే మనసు అని అర్థం చెప్పారు పెద్దలు. మనసే మనకి మిత్రుడు మనం దాన్ని కంట్రోల్ చేస్తే…ఒద్దులెండి అది పద్మవ్యూహం. ఇక్కడే ఉందాం
మీరు ఎయిర్పోర్ట్ లో మీ ఆవిడకోసం చూస్తున్నారు. నెలయింది చూసి. ఇంతలో మీ పక్కింటావిడ కనిపించింది. నవ్వుతూ మాట్లాడారు. ఉభయకుశలోపరి, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. 10 నిమిషాల తరవాత మీ ఆవిడ కనిపించింది. బాగా అలిసిపోయి, నీరసంగా కనబడింది. నవ్వుతూ పలకరించారు. అందరి గురించీ అడిగారు. కానీ ఇప్పుడొక హృదయస్పందన కొత్తగా వచ్చింది, ఇందాక పక్కింటావిడతో లేనిది [ఆ ఫీలింగ్ రాకపోతే మరి కష్టాలే!]
ఈ విధంగా మన మెదడులో రోజురోజుకీ పెరిగిపోయే, ఈ facts, emotions వగయిరా, వ... ముద్రలు వేస్తుంటాయి మన మెదడులో . ఒక పాత పాట వింటున్నారు. వెంటనే ఆ సినిమా పేరు, మీతోబాటు కూచున్న girl friend విగ్రహం, ఆమె పేరు, ఏ సినిమా హాలు, ఏ వూరు, మిరపకాయ బజ్జీలు తిన్నారా లేదా... ఈ మెమొరీస్ అన్నీ ఒక చిప్. అటువంటి సన్నివేశం ఎప్పుడొచ్చినా, ఆ చిప్ "టింగ్" మని వెలుగుతుంది. అంతే. పరధ్యానంలో, పాత స్మృతులలోకి, సినిమాల్లో చూపించే గిర గిర తిరిగే జిలేబీ లో కి ...అన్నీ సక్రమంగా ఉండి "మనసు" లేదనుకొండి [hypothetical] ఎన్ని clues ఇచ్చినా ఆ అనుభూతి కలగదు. అదే, నిస్సంగత్వం. "నిస్సంగత్వే, నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తిహి."
వాల్మార్ట్ కి వెళ్ళి బయటకి వచ్చాను. కార్ ఎక్కడపెట్టానో మర్చిపోయాను. కాని ఎక్కువ కాలం కాకుండానే, నాకారు గుర్తుపడతాను. మా చిన్నప్పుడు మా పల్లెటూళ్ళో, మా పాలేరు చాలా మంది ఆవుల్ని తీసికెళ్ళేవాడు మేపడానికి. వచ్చేటప్పుడు, ఇది ఫలానా వారి ఆవు అని వాడికెలా తెలుస్తుందీ అని నాకిప్పటికీ ఆశ్చర్యం. నాకన్నీ తెల్లగానే కనిపిస్తాయి. All in the family show , Archie Bunker కి అందరు చైనా వాళ్ళు ఒకలాగే ఉండేవారు. నలభయ్ యేళ్ళ తరవాత ఒక ఫ్రెండ్ ని కలిశారు. ఈ టైం లో అతన్ని గురించి ఆలోచించలేదు. ట్రెయిన్ లో అకస్మాత్తుగా కనిపించాడు.
ఓ. ఇంక కబుర్లే కబుర్లు. చిన్ననాటి సంగతులు, మాస్టర్లు, మిరపకాయ బజ్జీలూ.. దీన్నే ప్రత్యభిజ్ఞ [RE-Cognition] అంటారు. అభిజ్ఞ అంటే తెలుసుకోవడం. ప్రత్యభిజ్ఞ అంటే గుర్తుకు తెచ్చుకోవడం అందుకే కాళిదాసు, "అభిజ్ఞాన శాకుంతలం" అన్నాడు. అంటే ఆ కథలో అతడు శాపవశాత్తు నిజంగానే మర్చిపోయాడు. భారతంలో మరిచిపోయినట్టు నటిస్తాడు - రాజకీయంగా.
చిన్నప్పుడు మనం బట్టీ పట్టిన ఎక్కాలూ, శతకాలూ ఇంకా మర్చిపోకుండా ఉన్నాయి అది అభిజ్ఞ. [cognition] ఇప్పుడు ఏకరువు పెట్టడం ప్రత్యభిజ్ఞ. [RE-Cognition] మనకథకీ దీనికీ సంబంధం ఇదే. మన కథానాయకుడికి, వాళ్ళమ్మకి సంబంధించిన ప్రత్యభిజ్ఞ పోయింది [దృశ్యపరంగా]
అసలు, అహం బ్రహ్మాస్మి అయి ఉండి, మనం ఈ ఎక్కాలూ, శతకాలూ బట్టీవేయడమేమిటి అని సందేహం కలుగుతుంది కదా. అదే అన్నాడు వివేకానందుడు. "విద్య అంటే బయటనించి వచ్చేది కాదు. లోపల ఉన్న సమాచారాన్నే బయటకి లాగడం. ఏవరయినా సరే, 100% బ్రెయిన్ ఉపయోగిస్తే , ఇంక తెలుసుకోదగ్గది ఏముండదట. ఉపనిషత్తులలో చెప్పిన సత్యం , "ఏది తెలుసుకుంటే ఇంకేదీ తెలుసుకోనక్కరలేదో, అదీ విద్య. అప్పుడు అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుందిట.
*****
పదేళ్ళ కిందట ఒక హాలీవుడ్ సినిమా చూశాను LUCY అనీ. ఆ తరవాత చాలా సార్లు చూశాను. ఆ సినిమా చూడండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతిపాదన అర్థమవుతుంది. మీలో కొందరికయినా తమలో తమరు మాట్లాడుకునేవారూ, , ఫోన్ లేకుండానే ఇంకెవరితోనో మాట్లాడేవారూ కనిపించి ఉంటారు. Beautiful Mind సినిమా చూశారు గదా. అందులో అతనికి ఇద్దరు పిల్లలు కనిపిస్తారు. అవి హలూసినేషన్స్ అని తరవాత తెలుస్తుంది. ఆ పిల్లలు [భ్రమలు]ఆయనతో ఏ భాషలో మాట్లాడినట్టు? మన భారత దేశంలో ఒక పేషంట్ ఉన్నాడనుకోండి. అతడికి ఇలాంటి వినబడే హలూసినేషన్స్ ఏ భాషలో వినబడతాయి? రాష్ట్ర భాష హిందీనా, ఇంగ్లీషా, మాతృభాషా? ఇలాంటి సందేహాలకి జవాబులు వచ్చే సంచికలో.
*****