top of page

కథా​ మధురాలు

అంటు మొక్క

 

నిర్మలాదిత్య

bhaskar.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

పామ్ బీచ్ లో కోటలా కట్టిన కమ్యూనిటీ అది. కోటలాగానే ప్రాకారం చుట్టూ పెద్ద గోడలు , గోడల బయటో కందకం ఉన్నాయి.  ఫ్లోరిడా కాబట్టి ఆ కందకం లో ఏడాది పొడవునా, పుష్కలంగా నీళ్లు, అందులో ఈదు తున్న బలిసిన ముసళ్లు ఉన్నాయి.  ఒడ్డు మీద కొబ్బరి, తాటి చెట్ల మట్టలు గాలికి ఊగుతూ చేస్తున్న చప్పుళ్లతో వినసొంపుగా,  కళ్ళకింపుగా ఉంది. దాదాపు ఓ రెండు వందల ఇళ్ళు ఉన్న ఆ కమ్యూనిటీ లోకి ప్రవేశించడానికి తూర్పున, దక్షిణాన మటుకు ఆ కందకం పైన నాలుగు కార్లు నడపగల అందమైన వంతెనలు వేసారు. లోనికి పోవడానికి రెండు దార్లు, బయటకి రావడానికి రెండు.

విశ్వం లోపలికి పోవడానికి ఉన్న రెండు దార్లులలో ఎడమ వైపు ఉన్న దారి ఎన్నుకున్నాడు. అది విజిటర్స్ కని కేటాయించిన దారి. కుడి వైపున్న దారిలో పోతున్న కార్ల కున్న పాస్ లను గుర్తించి, అడ్డంగా రెక్క మానులు లాగా ఉన్న గేట్లు అవంతటికి అవే లేచి కార్లకు దారి విడిచి, కార్లు దాటగానే, మళ్లీ అడ్డంగా వాలుతున్నాయి. ఆ దారి ఆ కమ్యూనిటీ లో నివాసులకు పరిమితమైనది. విశ్వం ముందు ఓ రెండు కార్లు ఉన్నాయి. సెక్యూరిటీ గార్డ్ ప్రతీ కారు లో ఉన్నవారిని ప్రశ్నించి, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని, స్కాన్ చేసిన తరువాత లోపలికి వదులుతున్నాడు. విశ్వం వంతు వచ్చినప్పుడు "ఎవరి ఇంటికి వెళ్లుతున్నారు? డ్రైవింగ్ లైసెన్సు ప్లీజ్", అని అడిగాడు.

 

విశ్వం తాము వెళ్ల దలచుకున్న శ్రీని ఇంటి అడ్రస్ చెప్పి, డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చాడు. శ్రీని తాము వస్తున్నట్లు, ముందే సెక్యూరిటీ వాళ్లకు చెప్పి ఉండి ఉంటాడు. శ్రీనికి ఫోన్ చేయకుండానే లోపలికి పోవడానికి గేట్ తెరిచాడు సెక్యూరిటీలో ఉన్నతను.

 

గేటు దాటి ఓ ఐదు నిమిషాలు డ్రైవ్ చేసిన తరువాత శ్రీని ఇంటికి చేరారు. శ్రీని ఇంటికి దారుల పక్కనే ఉన్న లాన్స్, పూల మొక్కలు, ఫౌంటైన్లు ఉన్న సరస్సులు వాటి చుట్టు కట్టిన భవంతులు,  అది బాగా డబ్బు చేసుకున్న వారూ తమకని కట్టుకున్న మరో లోకం అని చెప్పకనే చెప్పుతున్నాయి.

 

విశ్వం అక్కడ పార్క్ చేసిన, లక్జరీ కార్లు దాటుకుని కొంచెం దూరంలోనే పార్క్ చేసాడు. పక్కన కూర్చున్న సీత కూడా సీట్ బెల్ట్ తీసి, విశ్వంతో పాటు కారు దిగింది.

 

శ్రీని, శ్రీదేవి సత్యనారాయణ పూజకని పిలిస్తే వచ్చారు, విశ్వం సీతలు.  అప్పటికే వచ్చేసిన అతిధులు ఇంటి వెనుకనున్న లానాయిలో టీ,  కాఫీ కప్పులతో, కొందరు సోడా కేన్లు, నీటి బాటిల్స్ తో తిరుగుతూ మాట్లాడుతున్నారు.  శ్రీని వచ్చిన వారిని పలుకరిస్తూనే పూజకు కావలసిన పనులు చేస్తున్నాడు. అలా, శ్రీనిని, శ్రీదేవిని, ఇంకా వ్రతానికి కావలసిన సరంజామా సర్దమని పని మీద,  పురమాయిస్తున్నది వరదరాజాచార్యులు.  శ్రీదేవిని వెదుకుతూ వెళ్లిన సీత శ్రీదేవిని చూసి హగ్ చేసి అక్కడే ఉన్న వరదాచార్యులను చూడగానే చెప్పలేని ఆనందం కలిగింది.

"స్వామీ ఎలా ఉన్నారు. లక్ష్మి ఎలా ఉంది?", ఆతృతగా అడిగింది.

"స్వామి దయ. బాగానే ఉన్నానమ్మ. లక్ష్మిని పోయిన సంవత్సరమే పంపించేసాను", అన్నాడు వరదాచార్యులు.

వరదాచార్యుల జవాబుతో సీత, విశ్వం ముఖాలలో రంగులు మారాయి. ఇద్దరు స్వగతం లోకి వెళ్లిపోయారు.

***

శ్రీదేవి వాళ్ళాయన శ్రీని ఎదో పని మీద, ఇండియాకి పోతే, ఓ వీకెండ్ వనిత, "సీత నీవు రావాల్సిందే" అని నాకు ఫోన్ చేసి,  వాళ్ళింటికి పిలిచింది.  అదో బ్రేక్ , గాళ్స్  డే అవుట్ ,  బాగుంటుంది, తొందరగా వచ్చేయి అని ఊపిరి కూడా సలపనంతగా బలవంతం చేసింది. చెప్తే కానీ టైం కు భోజనం కూడా చేయడు విశ్వం, మరో సారి విశ్వం తో కలిసి వస్తాను లే , ఈ సారి వదిలేయి అంటే శ్రీ దేవి వినలేదు.  విశ్వం కూడా అంతగా అడుగుతున్నది కదా, పోయి రమ్మనడంతో, కారు తీసి పామ్ బీచ్  రోడ్డున్న పడ్డా.  పెద్ద దూరం లేదు. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే, లంచ్ టైం కు శ్రీ దేవి ఇంటికి చేరుకోవచ్చు. అప్పటికే వనిత శ్రీ దేవి ఇంటికి వచ్చేసింది. శ్రీ దేవి ఆర్డర్ చేసిన  పిజ్జా తిన్న తరువాత,  తెలిసిన ఒకామె దగ్గరకి పోవాలని తన కారు బయటకి తీసింది శ్రీదేవి. 

 

రోడ్లకు ఇరువైపులా ఉన్న నిమ్మ తోటలు, మామిడి తోపులు. మన చిత్తూర్ రహదార్లను గుర్తుకు తెప్పించాయి.  ఊరు బయట ఓ గంట ప్రయాణం తరువాత ఓ తోటకు చేరాము.

అప్పుడు ఎదురు పడింది, మొదటి సారి, లక్ష్మి. తామర పువ్వు రెక్కల లాంటి పెద్ద పెద్ద కళ్ళతో, కాటుక పెట్టకున్నా, నల్లగా కంటి చుట్టూ ఉన్న రేఖలతో, ముదురు మట్టి పసుపు రంగులో అందంగా ఉంది. మాటలు అస్సలు లేవు కానీ, ఇక ఆరోజు మేము తోట తిరిగినంత సేపు మాతోనే తిరగడంతో , బాగా గుర్తుండి  పోయింది.

 తోటలో నిమ్మ, కమలా పండ్ల చెట్ల తో బాటు మామిడి చెట్లు కూడా చాలా ఉన్నాయి .  లోపలికి పోతే మనూర్లో దొరికే సపోటా, సీతాఫలం, పనస, కొబ్బరి, అరటి చెట్లు కూడా కనిపించాయి. మనూరికే పోయినట్లనిపించింది. అప్పుడే శ్రీదేవి ఈ తోటలు వరదాచార్యులవని చెప్పింది.  పూజారి ఇంత  పెద్ద తోటలు వేసి, మనూర్లో లాగా పండించడం, ముచ్చట వేసింది. శ్రీదేవి తోట మధ్యలో ఉన్న గుడిసెలకు దారి తీసింది. అక్కడున్న ఓ గుడిసెలో, ఓ మూడు గ్యాస్ స్టవ్  ల మీద కడాయిలలో నూనె సల సలా కాగుతున్నది.  నూనెలో కరివేపాకు ఆకులు,  మందారం పూల రెక్కలు, మరువము, ధవనము లాంటివి వేసి మరిగిస్తున్నారు.

 

శ్రీదేవి ఆ కుంపట్ల పక్కనున్నావిడను చూపించి "వనితా, నీకు ఇది వరకు చెప్పాను కదా? పద్మావతి. వరదరాజ స్వామి గారి భార్య. తనే ఈ నూనె తయారు చేసి అమ్మేది" అంది

 

"నమస్తే పద్మావతి గారు, శ్రీదేవి చెప్పింది. ఈ మధ్యనే మీరు ఇక్కడ సెటిల్ అయ్యి ఈ ఫార్మ్ నడుపుతున్నారని.  మీరు ఈ ఫార్మ్ లో పెంచిన మొక్కల ఆకులు, పూలతో కలిపి చేసిన నూనె రాస్తే తల వెంట్రుకలు వత్తుగా, పొడవుగా పెరుగుతాయి అని. శ్రీదేవి జుట్టులో మార్పు కనిపిస్తూనే ఉంది. నాకు ఓ మూడు బాటిల్స్ కావాలి", అంది వనిత.

అప్పటికి కానీ నాకు అర్ధంకాలేదు.  ఈ నూనె కొనడానికే ఇంత దూరం వచ్చారని.

పద్మావతి "శ్రీదేవి స్నేహితులన్నారు. శ్రీ దేవి స్నేహితులంటే, మీరు నా స్నేహితులు కూడా.  మీకు కావలసిన నూనె బాటిల్స్ ఇక్కడున్నాయి. 30 డాలర్లు ఒకటి, జుట్టు ఒత్తుగా, పొడవుగా బాగా పెరుగుతుంది.  మీకు జుట్టు నల్లగా కూడా ఉండాలంటే ఈ బాటిల్ తీసుకోండి. 40 డాలర్లు" అంది.

పద్మావతి వ్యాపారం బాగానే చేస్తున్నదే అనుకున్నా. శ్రీదేవి, వనితల లాగా నేను మెడ దాకా జుట్టు కత్తిరించుకోలేదు.  నాకు జుట్టు పొడుగే. బారెడు ఉంటుంది. కానీ ఈ మధ్య పలచ  పడుతూ  ఉంది. నేనూ ఓ సీసా  కొన్నా. మా వెంబడి వచ్చిన లక్ష్మి పద్మావతి దగ్గరికి పోవడం, పద్మావతి లక్ష్మి ని ఆప్యాయంగా తల మీద చేతులు వేసి దువ్వడం నా కళ్ళకి అందంగా కనిపించింది. వారికున్న బంధం చెప్పకనే అర్ధం అయ్యింది.

తరువాత తోట లో తెగ తిరిగాము. చిన్నప్పుడు తిరిగిన మామిడి తోపులు గుర్తుకు వచ్చాయి. మా తోపులో ఎక్కువ మామిడి చెట్లే.  ముందు బెంగళూర్, నీలం చెట్లు.  మొదటగా కాసేది బెంగుళూరు మామిడి కాయలు. దోర కాయలు కోసి,  ఉప్పు కారం కలిపి తింటే దాని రుచే వేరు. మామిడి కాలం చివర  కోసేది నీలం కాయలే. లోపల పీతర్, కేసరి మామిడి కాయలు ఎరుపు, పసుపు, పచ్చ రంగులతో వాటి బొమ్మలు పెయింట్ చేద్దామా అన్నంత బాగుండేవి. . రెండు మల్గోబా చెట్లు కూడా ఉండేవి. మల్గోబా పండ్లు ఏమి వాసన, రుచి. ఇప్పటికి గుర్తుకు వస్తున్నాయి.  ఆ మాట పద్మావతి తో చెప్తే , మల్గోబా చెట్లు భారత దేశం నుంచే ఫ్లోరిడాకు  పంతొమ్మిదో శతాబ్దంలోనే తీసుకొచ్చి నాటారు అని చెప్పింది. 

పద్మావతి అక్కడేసిన రకరకాల మామిడి, సపోటా, దానిమ్మ, సీతాఫలం, పనస చెట్లు చూపెట్టింది. మా తోటలో పండించే పండ్లు పెద్దగా, మంచి వన్నెతో బహు రుచి గా ఉంటాయి. దానికి రహస్యం మేము పెంచే అంటు మొక్కలే. ఫ్లోరిడాకు మొదట తెచ్చిన మల్గోబా చెట్లు అంటు  మొక్కల  వల్లే పెరిగాయి. అలా చెప్తూ, ఎలా అప్పటికే  ఓ పదేళ్లు పెరిగిన ఫ్లోరిడా  పండ్ల చెట్లకు, కొమ్మలు కట్ చేసి, బయట నుండి తెప్పించిన కొన్ని నెలల వేరే జాతి పండ్ల మొక్కల కొమ్మలు అతికించి అంటు  మొక్కలు పెంచుతారో చూపెట్టింది. అప్పటికే పెరుగుతున్న ఫ్లోరిడా నేటివ్ చెట్లు మీద అంటు  కట్టడం తో, ఆ కొత్త మొక్కలు ఏపుగా , చాలా ధృడంగా పెరుగుతాయి. రోగాలు పెద్దగా రావు.  అంటు  కట్టిన పండ్ల మొక్కలు కొద్దీ నెలల వయస్సే ఉన్నా, వెంటనే పెరిగి పూత వేయడము, కాయలు కాయడము జరుగుతుంది. పంట కోతకు  రావడానికి అట్టే సమయం తీసుకోవు. అంతే  కాక అంటూ మొక్క పళ్ళు మామూలుగా పెంచే పండ్లకన్నా, పెద్దగా, రుచిగా పెరిగి ,  బాగుంటాయి.

 

తోటలోనే ఓ రెండు షెడ్లు కట్టారు.  ఆ షెడ్లలో కొందరు మెక్సికన్ వాళ్ళు , అక్కడ పండిన వాటిని, బయట ఊళ్లకు పంపడానికి ప్యాక్ చేస్తూ కనిపించారు.  ఈ తోట వ్యాపారం స్వామికి, పద్మావతికి బాగానే కలిసి వచ్చింది అనుకున్నా.

తిరిగి వెళ్ళడానికి శ్రీ దేవి కారు వైపు పోతుంటే, లక్ష్మి  కూడా మమ్మల్ని పద్మావతి తో బాటు అనుసరించింది.  తెల్లావులు, నల్లావులు చూచాను కానీ, లక్ష్మి లాంటి చామన ఛాయలో ఉన్న పుల్లావులంటే నాకు చిన్నపటి నుంచి భలే ఇష్టం. మేము తోటలో  తిరిగినంత సేపు, ‘ నేనూ మీ వెంట ఉన్నాను’ అని వినిపిస్తున్న లక్ష్మి  మెడ గంటల శ్రావ్య నాదాలు గుర్తుకు వచ్చాయి.  లక్ష్మి అమాయకపు చూపులు గుర్తుకు వచ్చాయి. ఆ ముఖంలో ఉన్న ఆప్యాయత గుర్తుకు వచ్చింది. అందుకే వరదాచార్యులు కనపడిన వెంటనే, లక్ష్మి ని గురించి అడిగాను.

 

**

 

కొందరు -  ఆప్త మిత్రులు, బంధువులు కాక పోయినా, జీవితంలో, అప్పుడప్పుడు తటస్థ పడుతూనే ఉంటారు. నా జీవితంలో వరదాచార్యులు  అటువంటి వాడే. తిరుపతి బాలాజీ కాలనీలో ఉంటూ బడిలో చదువుతున్నప్పుడు మొదటి పరిచయం. అక్కడ మైదానంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు, మా గుంపుతో కలిసి, తానూ ఆడేవాడు. అప్పుడు నన్ను 'విస్సు అన్నా' అని పిలిచే వాడు. వరదా చదివేది ఆ దగ్గర్లోనే ఉన్న వేద పాఠశాలలో.  ఎక్కువగా, ఆది వారాలలో మాతో కలిసి ఆడేవాడు.  నేను అటు తరువాత పై చదువులు, ఉద్యోగం అంటూ అమెరికా వలస వచ్చేసాక వరదా తో టచ్ పోయింది.

ఓ ఇరవై ఏళ్ళ క్రితం మిడ్ వెస్ట్ లో పని చేస్తున్నప్పుడు, బాలాజీ కాలనీలోని మా ఇంటికి ఫోన్ చేస్తే, 'అదిగో వరదా నీ స్నేహితుడంటా మాట్లాడాల అంటున్నాడు' అంటూ మా నాన్న వరదా కి ఫోన్ ఇచ్చారు.

"విస్సు అన్నా బాగుండారా? నేను వచ్చే నెల్లో అమెరికా వస్తా ఉండాను. అంతా కొత్త . కొంత సాయం కావాలన్నా", అని అడిగాడు వరదా.

దానిదేముందని చెప్పి, నేనూ, సీత వరదాను చికాగో ఓ హెర్ లో కలిసి, కారులో ఇంటికే తీసుకు వచ్చాము.  వరదాకు మా ఊరికి వంద మైళ్ళు దూరంలో ఉన్న  వూళ్ళో పూజారిగా పని దొరికింది. వాళ్లే వరద వీసా స్పాన్సర్ చేసి తెప్పించారు. గుడి కూడా ఈ మధ్యనే కొత్తగా కట్టారు. రెండు రోజులు వరద మా ఇంట్లో ఉన్న తరువాత గుడి కమిటీ సభ్యులు మా ఇంటికి వచ్చి వరద ను వాళ్ళూరికి తీసుకెళ్లి పోయారు.

వరద మా ఇంట్లో ఉన్న రెండు రోజులలో అతనికి అమెరికా కి రావడానికి అస్సలు ఇష్టం లేదని బాగా అర్థం అయ్యింది. వరద మేనమామ చికాగో గుడికి ఓ పాతికేళ్ల క్రితం మే వచ్చి బాగా స్థిర పడిపోయాడట. అతని ప్రగతి, డబ్బు చూసిన వరదా తల్లి తండ్రులు, బలవంత పెట్టడం తో వరద అమెరికాకి బలవంతంగా వచ్చాడని తెలిసింది. వరదా ఇంట్లోనే ఉండడం వల్ల అతనిని, అతని ప్రవర్తనను దగ్గరలో చూడ వీలు కలిగింది. అతని నమ్మకాలు మరీ చాదస్తంగా అనిపించాయి. ఇక్కడే స్థిర పడాలనుకున్న నాకు, అవకాశం దొరికినప్పుడల్లా, ఇక్కడి జీవన విధానం నిరసిస్తూ, వరద మాట్లాడడం, నచ్చలేదు.

ఆ మరుసటి రోజు వరదా కి ఊరు చూపెడదామని, మాల్ కి తీసుకెళ్ళాను.  వాతావరణం బాగుండడం తో ఆ మాల్ లో నే ఉన్న ఓ చెట్టు కింద వేసిన బెంచి మీద కూర్చుని వరద మాటలు వింటున్నాను.

"ఏమి దేశమండి ఇది. మొత్తం 400 ఏండ్ల చరిత్ర కూడా లేదు. మన దేశంలో అయ్యితే ఎన్ని గుళ్ళు, గోపురాలు? ఎన్ని తరాలుగా వస్తున్నాయి", అదే ధోరణిలో అప్పుడే వదిలి వచ్చిన స్వదేశాన్ని తలచుకొని దుఃఖ పడుతూ, వరద మాట్లాడుతూ "ఎదో కొంచెం డబ్బు సంపాదించి, నేను మన దేశానికి తిరిగి వెళ్లిపోతాను", అన్నాడు.

వరద మాటలు, చేష్టలు అక్కడ కొద్ధి దూరంలో కూర్చున్న ఓ ముసలతని దృష్టిని ఆకర్షించాయని, అతను మాట్లాడితే కాని అర్ధం కాలేదు.  నడుము వరకు వచ్చిన తెల్లని గెడ్డం, వత్తయిన తెల్ల వెంట్రుకులతో ఓ మహర్షి లాగా ఉన్నాడు. మాట్లాడిన తరువాత అతను ఓ అరవై ఏళ్ల క్రితమే వలస వచ్చిన సర్దార్జీ అని తెలిసింది.

వరద కొత్తగా ఈ దేశం రావడం, తను త్వరలోనే డబ్బు సంపాదించి తిరిగి స్వదేశానికి పోవాలను కోవడం గురించి చెప్పాను.

ఆ ముసలతను నవ్వి "ఏ దేశ్ తుం కో చోడేగి నహి. తుమీ బదల్ జావోగే", అన్నాడు.

"నా సంగతి వేరు. నన్నీ దేశం ఆపుకోలేదు. నేను నా అభిప్రాయాలు మారవు. వేద భూమిలో పుట్టి వేదపాఠశాలలో విద్య నభ్యసించిన వాడిని. నా కనీసవసరాలు చాలా తక్కువ. ఇక్కడి డబ్బు, సంపదలు నన్నాపలేవు", అన్నాడు వరద.

ముసలతను నవ్వి, మరేం మాట్లాడ లేదు. నాకు వరద ఆ మాటలు విన్న తరువాత, ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేడనిపించింది.

వరద వెళ్లి పోయి గుడి పనిలో చేరిన తరువాత, అడపదడపా ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. అతను పని చేస్తున్న గుడి కూడా పెద్ద దూరం లేదు కాబట్టి, రెండు మూడు నెలలకోసారి గుడికి వెళ్లి వరదాను కూడా కలిసే వాడిని.  వరదా అప్పుడు తిరుపతి, వాళ్ళ ఇల్లు, మనుష్యులను బాగా మిస్ అవ్వుతున్నాడనిపించేది. అదీ ఈ దేశంలోకి వచ్చిన వారికి మామూలు గా కలిగే హోమ్ సికనెస్ అని సరి పుచ్చుకున్న.

అలా ఓ రెండు ఏళ్ల తరువాత, వరదా ఫోన్ చేసి గుడిలో పనికి రాజీనామా ఇచ్చేసాను అన్నాడు. ఆ మాట షాక్ లాగా అనిపించి, ఎందుకూ అని అడిగాను.

"నేను గుడికి వచ్చిన తరువాత గుడికి జనాలు విపరీతంగా వస్తున్నారు. గుడిలోను, గుడి బయట కూడా వెళ్లి జనాల ఇండ్లలో పూజలు చేయాలి. నాకు వస్తున్న జీతం కంటే ఎక్కువ పని చేస్తున్నాను. వచ్చే దక్షిణలు కూడా గుడికే ఇచ్చేయాలి. నాకు నచ్చలేదు", అన్నాడు వరద.

ఆ ఊరి వాళ్లు, ఆ గుడి కమిటీ వాళ్ళు నాకు తెలుసు. వరద కి దాదాపు అరవై వేలు ఇస్తున్నారు అని విన్నాను. అంతే కాకుండా అక్కడి వారు వరదాకు, ఇంట్లో ఫర్నిచర్, వంట వస్తువులు చివరికి ఓ సెకండ్ హాండ్ కారు తో సహా ఇచ్చి అతని అవసరాలన్నీ చూసుకున్నారని విన్నాను. వాళ్లు వరద అంచనాల మేరకు జీతం ఎక్కువ చేయలేదంటే, గుడికి అంత ఆదాయం ఉండక పోవచ్చు.

వరద న్యూ యార్క్ లో ఉన్న ఓ గుడిలో ఉద్యోగం దొరికింది అని మరి కొన్ని రోజులలోనే వెళ్ళిపోయాడు.

వరద వెళ్లి పోయిన తరువాత, ఆ వూళ్ళో ఉన్న నా స్నేహితులతో మాట్లాడడం జరిగింది. వరద నాకు తెలుసు కాబట్టి అతని ప్రసక్తి లేవదీసాను.

 

"అబ్బే జీతం మాటే పూజారి గారు ఎత్త లేదు. ఆయనకు మొన్ననే మేము స్పాన్సర్ చేసిన గ్రీన్ కార్డు వచ్చింది. అందుకే మా వూరిని వదిలేసారు అనుకుంటున్నాను. మాకు కూడా ఈ గుడి పనులు మేనేజి చేయటం కొత్తనే. అందరూ వలంటీర్ లే కదా. అందరూ తమ ఉద్యోగాలతో పాటు ఈ గుడి పనులూ చేస్తుంటారు. వరదాచార్యుల వారే మా మొదటి పూజారి. కానీ ఈ అనుభవం వల్ల మరో సారి ఇంత కష్ట పడి ఇండియా నుంచి పూజారిని తెప్పించ దలచుకోలేదు. గ్రీన్ కార్డు కూడా అంత తొందరగా స్పాన్సర్ చేసి ఉండకూడదు. ఇప్పుడు మళ్లీ కొత్త పూజారికోసం వెదకాలి", అంటూ వాపోయాడు, నా మిత్రుడు.

మరో మూడేళ్ళ తరువాత వరద నుండి మళ్లీ ఫోన్.  "జీతం బాగానే ఇస్తున్నారు కదా. మరిప్పుడెందుకు ఈ న్యూ యార్క్ గుడి వదిలి మిచిగన్ గుడికి వెళ్లాలనుకుంటున్నావు?", అడిగాను వరదాను.

 

"జీతం విషయం కాదు. నా కింద ఓ ఇద్దరు కుర్రకుంకలను పెట్టి నన్ను ఉద్యోగం లోనుంచి తీసి వేయాలని చూస్తున్నారు", అన్న అనుమానం బయట పెట్టాడు. నాకు అక్కడ పరిచయం ఉన్న వారి వల్ల తెలిసిన విషయం, వరదా తరచుగా ఉద్యోగ వేతనాలు పెంచ మని అడిగే వాడట. అలా పెంచుతూ పోయిన తరువాత, ఓ రోజు, ఒక్క వరదా బదులు అదే డబ్బు తో ఇద్దరు పూజారులను ఉద్యోగం లో పెట్టుకుంటే గుడి పనులు కూడా ఇంకా బాగా చేయవచ్చు అన్న బల్బు వెలగడం లో అట్టే ఆలస్యం కలుగ లేదు.

అలానే వరద ఎదో ఓ మిష బెట్టి ఉద్యోగాలు వదిలేదలేసి కొత్త ఉద్యోగాలు, వెదుక్కోవడం, మామూలు అయ్యిపోయింది.

అలా ఉన్న వరద ఓ పదేళ్ల క్రితం ఫోన్ చేసి "విశ్వం ఇక నాకు ఈ గుళ్లలో పని చేసే ఓపిక లేదు. పామ్ బీచ్ దగ్గర ఓ పది ఎకరాల భూమి చూసా. అది కొని, అక్కడే మన వూళ్ళో లాగా పొలం పనులు చేసి, స్థిర పడిపోదామనుకుంటున్నాను", అన్నాడు.

చిత్తూరు యాసతో మొదట పరిచయం అయ్యిన వరదాచార్యులు ఇప్పుడు ఏ మాత్రం యాస లేకుండా, ఇక్కడి అమెరికన్ల లాగానే ఇంగ్లీష్ లో మాట్లాడగలగడం నాకు ఎప్పటికి ఆశ్చర్యం కలిగించే పరిణామమే. ఇంగ్లీష్  మాత్రమే కాదు, గుడిలో ఉండడం వల్ల హిందీ, దక్షిణాది అన్ని భాషలలో కూడా బాగా మాట్లాడు తాడు. ఎక్కడ యాస ప్రసక్తి లేదు.

"సరే చివరకు స్థిర పడతానన్న మాట నీ నోటి నుంచి వినగలిగాను", అన్నాను.

 

"అలా స్థిర పడాలంటే నీ సహాయం కావాలి. నువ్వు బ్యాంక్ లో పని చేస్తున్నావు కదా. కొంచెం స్మాల్ ఫార్మ్ లోన్ ఇప్పించకూడదు?", అని అడిగాడు.

తెలిసిన వాడే కదా అని తన ఫార్మ్ ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపించ మన్నాను. ఎదో పంప మని అడిగాను కానీ, వరదా ఆ ప్రపోసల్ నింపలేడు, పంపలేడు అని నా గట్టి నమ్మకం. దాన్ని వమ్ము చేస్తూ, ఎలాంటి ఆక్షేపణ చెప్పలేని అద్భుతమైన ప్రపోసల్ ఒకటి నా దగ్గరికి పంపాడు.

అతను అమ్మ దలచుకున్న ట్రాపికల్ పండ్లు, కూర గాయలు ,  తమల పాకు ఆకులు, పిడకలు, గో మూత్రం, పచ్చటి కొబ్బరి బొండాలు అమ్ముడు పోతాయంటే, నాకు నమ్మ బుద్ధి కాలేదు. ఆ మాటే వరదా తోను చెప్పాను. వరదా ఒక సారి ఫార్మ్ దగ్గరికి రమ్మని, తాను అప్పటికే మార్కెట్ చేసిన ఇన్ వాయిస్ కాపీలు చూపెట్టారు.

ఆశ్చర్యం గో మూత్రం ఓ టాప్ సెల్లర్. ఈ దేశంలో వరదా పండిస్తున్న పంటలకి మంచి డిమాండ్ ఉందని తెలిసింది. పెళ్ళిళ్ళు అని అరటి చెట్లు, కొబ్బరి బొండాలు, తమలపాకులు లాంటి వస్తువులు తెగ అమ్ముడుపోతున్నాయి. ఐ టీ తో పాటు వచ్చిన జనాల పిల్లలు పెళ్లీడుకు రావడంతో ఈ డిమాండ్ తగ్గేది లేదని విశ్వం , వరదా ప్రపోసల్ ను వెంటనే పైకి పంపించి లోన్ లు ఇప్పించాను.

 

వరదా కూడా ఆ లోన్లకు తగిన విధంగా, బిజినెస్ ను అభివృద్ధి పరచడంలో సఫలం అయ్యాడు.

బిజినెస్ లో దిగిన తరువాత, వరదా నుంచి మరే ఫిర్యాదులు వినలేదు.

***

 

లక్ష్మి ఎక్కడ అన్న ప్రశ్నకు, వరదాచార్యులు "పనామా సిటీ ఉండే నా స్నేహితుడు ఓ ఆవు కావాలంటే పంపిచేసాను", అన్నాడు.

"అదెలా పంపించారు స్వామీ. . లక్ష్మి మీరు కొన్న మొదటి ఆవు కదా. ఇప్పుడున్న దూడలు, ఆవులు, లక్ష్మి సంతానమే కదా. పద్మావతి వెంట లక్ష్మి పసి కూన లాగే తిరిగేది", నొచ్చుకుంటూ మళ్లీ ప్రశ్నించింది సీత.

"లక్ష్మి కి వయస్సు అయ్యి పోయిందమ్మ. ఇదివరకు నీవు చూసి చూసినట్లు చురుగ్గా లేదు. అంతే కాక దూడలు పెరగడంతో అన్ని ఆవులను పెట్టుకోవడానికి స్థలం కూడా లేదు. నా మిత్రుడు తన దగ్గర ఉన్న ఓ పెట్టింగ్ జూలో లక్ష్మికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా పెడతానన్నాడు. అక్కడున్న కొందరు గుజరాతి వాళ్ళు ఆవుకు రోజు మధ్యాహ్నం ఎదో ఓక తిండి గోమాత పూజ కార్యక్రంలో ఓ భాగంగా పెడతామన్నారు. లక్ష్మిని పంపించి వేయడమే మంచి నిర్ణయం అనిపించింది", ఇదో తప్పని సరి నిర్ణయం అన్న గొంతుకతో చెప్పాడు వరదాచార్యులు.

హ్యూమేన్ సొసైటీ లో వలంటీర్ గా పని చేస్తున్న సీతకు, వరదాచార్యుల నిర్ణయం నచ్చలేదు. ‘వయస్సు పై బడ్డ తరువాత  వదిలేయడమే? ఇదేమన్నా కార్పొరేట్ కంపెనీనా?’ అంటూ మదన పడింది.

వరదాచార్యుల సమాధానం విన్న, విశ్వం కు ముచ్చట వేసింది. లక్ష్మిని పంపేయడం మంచి బిజినెస్ డిసిషన్. వయస్సు మళ్ళిన లక్ష్మి వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుంది. సెంటిమెంటల్ గా ఉంచుకోవడం బిజినెస్ పరంగా సరి కాదు. క్యాష్ ఫ్లో దెబ్బ తింటుంది. వరద ముఖంలో అమెరికన్ కాపిటలిస్ట్, పారిశ్రామిక వేత్త కనిపించాడు. అవతలి మనిషి స్థానంలో నిలబడి ఆలోచిస్తే కానీ, సమస్యలు అంతు బట్టవు, పరిష్కారము దొరకదన్న విషయం విశ్వం కు గుర్తుకొచ్చింది. వరదాచార్యుల విషయంలో అతను ఇక్కడి అమెరికన్ గానే మారిపోయాడనిపించింది.

 

'వచ్చినప్పటికీ, ఇప్పటికి ఎంత మార్పు, హి విల్ గో ప్లేసెస్' అనుకున్నాడు, విశ్వం.

తాను నమ్మిన సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ దేశంలో ఓ పొలం, ఆవులు పెట్టుకుని పరువుగా బ్రతగ గలుగుతున్నానన్న గర్వం, సంతృప్తి,  వరదాచార్యుల ముఖంలో స్పష్టంగా ప్రతిఫలిస్తున్నది.

 

 ఓ ముప్పై ఏళ్ళు,  వయస్సులోను, అనుభవంలోను ఎక్కువున్న సర్దార్జీ, ఈ ముగ్గురిని పై లోకంలోనుంచి చూసి, తనలో తానే నవ్వుకున్నాడు.

 ***

bottom of page