top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

ఆధునికాంధ్ర సాహిత్యం - గమనం – గమ్యం

Tekumala Vekatappiah

టేకుమళ్ళ వెంకటప్పయ్య

మధ్య యుగాల్లో ప్రబలిన భక్తి ఉద్యమాలు, వేమన వంటి కవుల సంఘ సంస్కరణాభిలాషల కారణంగా   తెలుగులో నవ్య కవిత్వానికి పునాదులు పడ్డాయి. ఇరవైయొవ శతాబ్దిలో గిడుగు భాషా సంస్కరణ, కందుకూరి సంఘసంస్కరణ, గురజాడ సాహిత్యసంస్కరణలు  త్రివేణీ సంగమంలా, అనంత ప్రవాహంలా సాగి..సాగి.. తెలుగు నేలలో వరదలెత్తి.. పరవళ్ళు తొక్కి.. ఆధునికాంధ్ర కవిత్వానికి నాంది పలికాయి. 1905వ సంవత్సరంలో కృష్ణా పత్రికలో అజ్ఞాతకవి చే రాయబడ్డ  "ది క్రై ఆఫ్ మదర్ ఇండియా" అనే ప్రబోధ గీతమే తెలుగులో “తొలి నవ్య కవిత”  అనే వాదన ఉంది కానీ,  అది సత్యం కాదు. అంతకు మునుపే చిలకమర్తి లక్ష్మీ నరసింహంపంతులు గారు 1895 లో రాసి గోదావరి మండల సభల్లో చదివిన 14 పద్యాలు తొలి దేశభక్తికి సంబంధించిన తొలి నవ్య రచన అని పరిశీలకులు నిగ్గు తేల్చారు.

 

తెలుగులో జాతీయోద్యమ కవిత్వం, దేశభక్తి కవిత్వం, సంఘ సంస్కరణ కవిత్వాల  తర్వాత భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం,  విప్లవ కవిత్వం  అలాగే  స్త్రీవాద, ముస్లిం, దళిత, బీ.సీ వాద కవిత్వాలు ముందుకొచ్చాయి. అయితే ఈ ధోరణులు ఒకదానికొకటి కొనసాగింపు కాదు. ఆయా సందర్భానుగుణంగా, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా దూసుకొచ్చినవి.  ఈ ధోరణులలో కొన్ని ప్రస్తుతంకూడా  కొనసాగుతున్నవే!  సమాంతరంగా ప్రవహిస్తున్నవే! ఒక ఉద్యమం/ధోరణి అగ్రస్థాయిలో ఉంటే కొన్ని అనుషంగికంగానూ ప్రఛ్చన్నంగానూ కొనసాగడం మనం గమనిచాల్సి ఉంది. ఈ సాహిత్యోద్యమాలు లేక ధోరణులు మునుపున్న ఉద్యమాల వైఫల్యాలనుండి ఉద్భవించినవీ కాదు.   చారిత్రక, సామాజిక అవసరాల కారణంగా ప్రభవించినవన్న సత్యం గ్రహిచాల్సి ఉంది.  మనం ఉదాహరణగా భావ కవిత్వాన్ని తీసుకుంటే  ఒకనాడు అది అపురూప ఓజస్స్వంతంగా దర్శనమిచ్చింది. రెండు మూడు దశాబ్దాల కాలం గడిచే సరికి మరింత పటిష్టమైన కాలానుగుణ కవిత్వం అవసరం అన్న మన:స్థితికి ప్రజలు చేరుకోవడం చారిత్రక సత్యం.  సువిశాల భారతావనిలో ఆయా సమాజాల ఆశయాలు, అవసరాలు, ఆకాంక్షలకనుగుణంగా అనేక సాహిత్య ధోరణులు సాగడం గమనార్హం. సంఘ సంస్కరణ కవిత్వం విషయానికొస్తే  జాతీయోద్యమకాలం నుండీ ఎదుగుతూ వచ్చి, విప్లవ సాహిత్యంలోనూ, స్త్రీవాద సాహిత్యంలో కూడా చోటు చేసుకోవడం గమనార్హం. అందుకే చాలా కవిత్వ ధోరణులు సమాంతరయానాలనడం సముచితం.

 

 

అలాగే ఏది ఉద్యమం?  ఏది ధోరణి అనే విషయం పై అనేక తర్జన భర్జనలున్నాయి. ప్రతిదీ ఉద్యమం అవదు. ఒక వాదం లేక ధోరణి ఉద్యమంగా రూపుదిద్దుకోవలన్నా పిలవబడాలన్నా ఒక నిర్ధిష్ట తాత్త్విక దృక్పధం, భౌతిక సామాజిక పరిస్థితులు, నిబద్ధత గల నాయకత్వం, సంస్థాగత నిర్మాణ స్వరూప స్వభావాలు ఉండి తీరాలని సాహితీ వేత్తలు నొక్కి వక్కాణిస్తున్నారు. మీదు మిక్కిలి జనం ఈ ధోరణులను స్వాగతించ గలిగే స్థితి ఉండాలి.  దిగంబర కవిత్వం, దళిత సాహిత్యం, స్తీవాద సాహిత్యం, ముస్లిం వాద సాహిత్యం కేవలం ధోరణులు, ప్రక్రియలుగా నిలబడిపోయిన కారణం అదే! వీటన్నిటిలో నిర్దుష్టమైన తాత్త్విక దృక్పధం, సంపూర్ణ సమస్యా ప్రదర్శనా సాక్షాత్కారం లేకపోవడమే!  ఆ వర్గం/సమస్య యొక్క అభివ్యక్తిని సమగ్రంగా అక్షర రూపంలో వ్యక్తపరచలేకపోవడమే అని సాహితీ వేత్తలు చెప్పే మాటల్లో సత్యం ఎంతో ఉంది.

 

తెలుగు కవితా రంగంలో ఈ స్వఛ్చంద కవితా రూపం ఏర్పడి శతాబ్ద పైచిలుకు కాలం  గడిచింది. వచన కవితా రూపమే ఆధునిక కవిత్వమనే సాంప్రదాయాన్ని సుస్థిరం చేసుకొంది. వర్తమాన ప్రపంచంలో భాషా కవిత్వాలమీద అనేక దేశాల్లో చర్చలు జరుగుతున్నా అవన్నీ కవితాంతస్సారం గురించే జరుగుతున్నాయి. దానికి భిన్నంగా మన దేశంలో అందునా తెలుగు గడ్డపై కవిత్వ బాహ్య స్వరూప విశేషాలమీద చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆంతరిక ఫ్యూడల్ బంధాలను తెంచుకుని చాలామంది సువిమర్శనంలో కాలుపెట్టడం ఆహ్వానిచదగ్గ పరిణామం.

 

టీ.యెస్.ఇలియట్  "The development of poetry is itself a symptom of social change” అంటాడు.  ఇది ఆధునిక కవిత్వం సాధించిన విజయం అని చెప్పవచ్చు. మధ్య యుగాలలో కూడా కవిత్వం అనేక పరిమితులకు లోనై జీవించింది. ఆధునిక యుగంలో మాత్రమే రెక్కలు విప్పి స్వేచ్ఛా గమనం సాగిస్తున్నది.  కవిత్వేతర సాహిత్యమూ భాషపై ఆధరపడినదే గానీ కవిత్వంలో ఉన్న లయ, ఊపు, ఊగు, తూగు మనం ఆ ప్రక్రియల్లో దర్శించలేము. ఆధునిక జీవన రసావేశమే ఆధునిక కవిత్వానికి వెన్నుదన్ను. ఆధునిక శబ్దం కాలవాచికాదు కేవలం గుణ వాచిమాత్రమేనని సాహితీ వేత్తలూ ప్రముఖ పాశ్చాత్య వేత్తలు తెలియజెప్తున్నారు. ఆధునిక కవిత్వం ఆత్మాశ్రయతకీ, వస్త్రాశ్రయతకీ నడుమనున్న అడ్డుగోడలు తొలగించి, స్వీకృత వస్తువు  ఆధునిక సమాజమనీ, కవికి వస్తువుతో సంపూర్ణ మమేకత్వమే సరయినదనీ ఋజూవు పరిచింది.  ఆధునిక కవిత్వానికి ఆధునిక సమాజంలోని ఆవేదనలు, బాధలు, క్లేశాలు, సంఘర్షణలే వస్తువులు గా మారాయి. ప్రజల అనంత అవేదనల నిశ్శబ్దాక్రోశాలను బహిర్గతం చేయడానికి ఆధునిక కవి ద్రష్టగా నిలబడ్డాడు. ఆధునిక కవిత్వానికి ప్రధాన ధాతువు ప్రత్యక్ష సామాజిక జీవన అంతర్వేదనలే! సృజన, అవతరణ, పరిపోషణ అనే మూడు జీవక్రియలు రచనకు శక్తినిస్తాయని విమర్శకులు అంటారు. అవే కవిత్వాన్ని ఆయుష్మంతం చేస్తాయి. కవిత్వం భ్రమాస్పదమే కానీ మాయాపరికల్పితం కాదు కదా!

 

మనం ప్రస్తుత కవిత్వ ధోరణులను సమగ్రంగా పరిశీలిస్తే ఇంతకు ముందు దశాబ్దాలకంటే కూడా కవిత్వం  ప్రజలకు ఎక్కువ చేరువైనట్టు తెలుస్తుంది. కవుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రజల అభిప్రాయాలకనుగుణంగా, అన్యాయాక్రమాలపై  కత్తిని ఝుళిపిస్తూ కవి ప్రజలకు మార్గదర్శకంగా ఉంటూ ప్రజలతో నడుస్తున్నాడు. వ్యవస్తలో మార్పులు అనివార్యమయినప్పుడు తప్పనిసరిగా తన గొంతును వినిపిస్తున్నాడు. కవులలో కొంతమంది  సమస్యల మూలాలవేపుకు వెళ్ళి రాయడం గమనార్హం. ఆధునిక జీవనమే కవి ఇతివృత్తంగా మారింది. అందువల్లనే ఆధునిక కవిత్వంలో ఇన్ని వైరుధ్యాలు   చోటు చేసుకుంటున్నాయి.

 

తెలుగులో సాహిత్య విమర్శ  దాదాపు ఎనిమిది వందల ఏళ్ళపాటు మౌఖికవ్యవహారంగానే ప్రవర్తిల్లి      క్రీ.శ.19వ శతాబ్దిలో అక్షరబద్ధంగా అవతరించడం విచారించదగ్గ పరిణామమే! పూర్వం నుండీ భాష్యాలు, వార్తికాలపై ఉన్న శ్రద్ధ విమర్శలపై లేకపోవడంతో,  వ్యాఖ్యాన గ్రంధాలే విమర్శ క్రింద పరిగణింపబడ్డాయి. తెలుగు నేలపై ఛార్లెస్ ఫిలిప్ బ్రౌను అనేక గ్రంధాలను పరిశీలించి సాహిత్య పరిశీలనను పాశ్చాత్య దృక్పధంతో రాసిన, రాయించిన విమర్శనా పీఠికలే తొలి విమర్శలుగా పరిగణిచబడ్డాయి. నేడు ప్రాచుర్యంలో ఉన్న "వచన కవిత"ను గూర్చి ఫ్రీవర్సు ఫ్రంటు వారు ఒక సమీక్ష ప్రచురించారు. దానిలో వచనకవితా ప్రక్రియ అవసరము, వస్తు వైవిధ్యం, శైలి లాంటి ముఖ్య సమస్యలు సమగ్రంగా చర్చించబడ్డాయి.

 

"వ్యుత్పత్తి" లోనుండే "ఉత్పత్తి"  జరుగుతుంటారు ప్రముఖ కవి విమర్శకుడు డా.అద్దేపల్లి రామమోహనరావు. విచారించదగ్గ పరిణామం ఏమిటంటే ఈనాడు బాగా నిర్లక్ష్యం చేయబడ్డ రంగం "విమర్శ". ప్రస్తుతం రాసే వారిలో ఎక్కువమంది అనుకూల ప్రతికూల దృక్పధాలతో రాసే వారే అన్న అపప్రధ సర్వత్రా వినిపించడం మంచి పరిణామం కాదు. విమర్శ "వస్తువు" "శిల్పం" అనే వాటిపై జరగాల్సి ఉంది. వస్తువును గూర్చి ముఖ్యకోణాల్లో, ఏమాత్రం సంశయం, సందేహంలేకుండా కొత్తకోణాల్లో ఆవిష్కరించగలిగుతున్నాడా అనేది పరిశీలించాలని సద్విమర్శకులు అంటారు. అలాగే శిల్పం విషయంలో "ప్రౌఢిమ" అంటే భయపడ్డదగ్గది కాదు. పదం యొక్క ఔచిత్య, అనౌచిత్యాలు పరిశీలించి ప్రయోగించాలి. ప్రాస, అనుప్రాసలకోసమో, యతులకోసమో "పొల్లు పదాలు" వాడకపోవడం మంచిది అంటారు పెద్దలు.

 

ఆధునిక కవిత్వంలో ప్రస్తుతం నడిచేది "మానవీయ యుగం".  అది ఏ ఉద్యమమైనా, ధోరణి అయినా, ప్రక్రియ అయినా వస్తువు-విషయ గౌరవం, లక్ష్యము-సాధనా మార్గాల దృష్ట్యా మనం అనుకునే మానవీయ యుగం అనే మాట సమంజసం సమర్ధనీయం కూడా. కవిత్వంలో ఏ భావధార కనిపిస్తుందో, ఏ వస్తువుపై బలమైన ముద్ర వేస్తుందో ఆ యుగంగా పరిగణింపబడడం సహజం. అయితే అవన్నీ కూడా తిరిగి తిరిగి మానవీయత-మనుగడ-సమస్యలు-స్థితిగతులు-పరిష్కారాలపై నిలబడ్డవే!

 

చివరగా మన గమ్యం ఎటువేపు సాగుతోంది? సరయిన మార్గంలో పయనిస్తున్నామా అన్నది పరిశీలించదగ్గ విషయం. ఆధునిక కవులంతా ప్రజా జీవనానికే అంకితమయ్యారని చెప్పుకున్నాం. కవులు ఎప్పటికప్పుడు ప్రజల ఊహపోహలకు ప్రాతినిధ్యం వహించడం శుభ పరిణామం. జూలియస్ సైమన్ అనే ఆంగ్ల కవి విమర్శకుడు "Every poet is an unconscious mass observer"  అన్న మాట నూటికి నూరుపాళ్ళు నిజం. కవి "mouthpiece of the masses" అనడమే వాస్తవం. ఈ తరం కవుల్లో ఒక గొప్ప గాఢమైన ఆశయ శుద్ధి, పీడనలేని ప్రజల శాంతిమయ జీవనం ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. అయితే రచయితలందరూ, ప్రధాన స్రవంతిగా దుష్టభావాల్ని, విధ్వంస సంస్కృతినీ వ్యతిరేకించాలనీ, వాటి మూలాల్లోకి వెళ్ళి అవగాహన చేసుకుని రాయాలని, సాహిత్య ప్రయోజనం తో కూడిన సాహిత్యం రావాలన్న డా.అద్దేపల్లి అవేదనతో ఏకీభవిస్తున్నాను.

 

"భాషా సప్రదాయజ్ఞత ఆధునిక కవికి అవసరం. అభివ్యక్తి నవ్యతకు ప్రతిభను సమాయత్తమొనర్చుకోవడమూ అవసరమే! అదే కవి సంస్కారం. అదే ప్రతిపుటాంతర్గత భాసమానతను సాధిస్తుంది. ప్రతికవీ అనాదిగా తీరని క్షుత్పిపాసలతోనే పురోగమిస్తున్నాడు. అందని ఆశల వియత్తలం కోసమే వెంపర్లాడుతున్నాడు" అన్న డా. ఆంవత్స సోమసుందర్ గారి శుభకామనలతో ముగిస్తున్నాను....

OOO

Bio
bottom of page