Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

ఆట – పోరు

 

తాడికొండ కె. శివకుమార శర్మ

sivakumar_edited.jpg

కొందరికి జీవితం నిచ్చెనలమయం. వరుసకి పది గళ్లుండి పదివరుసలలో మొత్తం వంద గళ్లున్న వున్న పటం ఆటలో ఒకడుగు వెయ్యగానే ఆ నిచ్చెనలే వాళ్లని పైకి లాక్కుపోతుంటాయి. పైగా, వందగళ్ల పరిమితి వాళ్లకి వర్తిస్తున్నట్లు కూడా కనిపించదు.

పరమపదసోపాన పటం కొందరి జీవితాలు. జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి. అందినప్పుడు నిచ్చెన లెక్కాలి. పాము కాట్లకి గురయితే నీరసపడకుండా లేచి నిలబడి పయనాన్ని కొనసాగించాలి. గమ్యాన్ని చేరినవాళ్లు కొందరుంటారు.

పూర్తిగా పాము పడగ నీడలో గడిపే జీవితాలు కొందరివి. నిచ్చెనలు అందుబాటులో లేకపోవడమే కాక అవి ఉంటాయని ఎవరయినా చెప్పినప్పుడు వాళ్లకి ఆశ్చర్యమేస్తుంది. ఒక గడిలోంచి ఇంకొకదానిలోకి వెళ్లాలన్న ధ్యాస కలిగినప్పుడు విప్పిన పాము పడగ నీడ భయాన్ని ఎక్కువచేస్తుంది. ఒకటో గడిలో ఉన్న పాముతోక ఝళిపింపులకి గురిచేస్తుంది.

ఆమె మీది పడగ నీడ పక్కింటి అతనిది. చిన్నతనం నించీ అది ఆమెకి ఎరికే. తను ఎదుగుతున్నకొద్దీ దాని పరిమాణం ఎక్కువవుతున్నట్లు ఆమెకి అనిపించింది.

ఆమె ఇంటి మిగతా మూడు పక్కలవాళ్లూ ఆ పడగ నీడ తమ మీద ఎక్కడ పడుతుందోనన్నట్లుగానే మసలుతుండేవాళ్లు.

అతను ప్రేమించానన్నాడు. ఆమె తిరస్కరించింది.

యాసిడ్ పోస్తానని భయపెట్టాడు. ‘మేమున్నాంగా!’ అన్నారు చుట్టుపక్కలవాళ్లు తమ వంతుగా ఏదో చెప్పాలన్నట్లుగా. తమ కండబలాన్ని నమ్మి, దాన్ని ‘ధైర్య మిస్తున్నట్లుగా,’ అని ఆమె అనుకోవాలని వాళ్ల ఆశ. ఆ మార్పిడి ఎలా జరుగుతుందన్న ప్రశ్నకి వాళ్ల మదిలో చోటుండదు. ఆమె గుడ్డి దయుంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో గానీ కనిపిస్తున్న దేహబలాన్ని కాకపోయినా మందిబలాన్ని అయినా నమ్మనీకుండా ఉండడానికి గల కారణాలు ఆ ఇంటిచాయలకి రాలేదు. కనీసం అలాంటిది ఒకటయినా వచ్చుంటే, వాళ్లున్నామన్నది యాసిడ్ పొయ్యనీకుండా ఆపేటందుకా, పోస్తున్నప్పుడు చూడడానికా, లేక పోసిన తరువాత ‘అంతా అయిపోయింది, ఇంకేం చేస్తాం?’ అనేటందుకా అన్న ప్రశ్న ఆమె మదిలో ఉదయించడానికి ఆస్కారం ఉండేది.

ఆమె అతన్ని ఎదుర్కోకుండా ఊర్కొనలేదు. పళ్లేలనే కాక పలుగులని కూడా విసిరేసింది. వాటిని అతను పూచికపుల్లల్లా పక్కకు తోసేశాడు. ‘ఇద్దరిదీ వయసు చేసే చిలిపిదనం! అల్లరి ఇప్పుడు కాక చేసే దెప్పుట్టా?’ అన్నారు ముచ్చటపడ్డ ప్రేక్షకులు.

ఒకనాడు అతనామెను ఆక్రమించుకున్నాడు.

‘రాక్షస వివాహం కూడా వివాహమేగా!’ అన్నారు ఇరుగుపొరుగులు చేతులు వెనక్కు కట్టుకుని. అవి ముందు కనిపిస్తే వాటిల్లో ఆయుధాలెందుకు లేవని ఆమె ప్రశ్నిస్తుందని వాళ్ల భయం. ‘అయిందేదో అయింది. పక్కన ఉండడం ఒక్కటే కాదుగా కారణం? నువ్వా అందంలో ఏమీ తీసిపోవు. అతనా బలశాలి. ఎలాగయినా నీకు కూడా ఒక తోడు కావలసిందే! అతనికి నిన్ను దాటి ఇంకొకళ్లమీద కన్నేసే అవకాశం కూడా లేదు,’ అన్నారు వాళ్లు. అది పచ్చి అబద్దమని ఆమెకి తెలుసు. దానికి కారణం, అక్కడికి కనుచూపు మేరలోనే కాక ఎంతో దూరాన ఉన్నవాళ్లతో కూడా అతనికి లావాదేవీలుండడం. ‘అయినా, ఎవడో ఒకడు మొగుడు కావాలిగా?’ అని వాళ్లు వెనకాల ఉన్న చేతులని అట్లాగే దులిపి, వెనక్కు తిరిగేటప్పుడు మాత్రం చేతులని ముందుకు మార్చుకుని వెళ్లిపోయారు.

మొదటిసారి ఆమె గొంతులో వినపడ్డ పెద్ద అరుపులు వాళ్లకి ఆమె బాగోగుల గూర్చిన ఆదుర్దాని కలగజేశాయి గానీ, అది కొన్ని క్షణాలు మాత్రమే. అంతకన్నా పెద్దగా వినిపించిన అతని కంఠం వాళ్లని ఆలోచించడం మానెయ్యమంటూ జోలపాడిన ట్లనిపించి శాంతించారు. ‘ప్రాణహాని లేదు కదా!’ అనుకుని తమ పనుల్లో నిమగ్నమయారు.

మరునాడు ఆమె చూపులు వాళ్ల పిరికిదనాన్ని నిలదీస్తే, ‘మొగుడూ పెళ్లాలు అరుచుకోకుండా ఉండడం ఎక్కడయినా, ఎవరయినా చూశారా?’ అని ఒకరు తనవాళ్లవైపు తిరిగి ప్రశ్నించారు. చూడలేదన్నట్టు వాళ్లు తలాడించారు.

‘మరి కొడితేనో? అది కూడా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నది అని అంటారా?’ ఆమె నిలేసింది.

‘నువ్వు ఊరికే భయపడుతున్నావు! తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త!!’ అని వాళ్లు అక్కడినించీ జారుకున్నారు.

‘అమ్మో, కొడుతున్నాడు!’ అని ఆమె గొంతులో వినిపించినప్పుడు అంతకుముందు ఆమె అరుపులతో అతనికి జవాబివ్వడం గుర్తుకొచ్చి ఇప్పుడు కూడా అతని మీద తిరగబడుతుందని తమలో తాము నమ్మబలుక్కున్నారు. కానీ, అతని గొంతులో ఆమె చేత దెబ్బలుతిన్న ఫలితాలేమీ వెలువడకపోయేసరికి, ‘ఎన్ని దెబ్బలకయినా ఓర్చుకోగల సామర్థ్యం ఉన్నవాడు!’ అని లోలోపలే మెచ్చుకున్నారు. ఏ దెబ్బలయినా తమ మీద పడనందుకు సంతోషించారు.

అతని బలప్రదర్శనమూ, ఆమె ప్రతిఘటనా – అదీ వాళ్ల ‘సంసారం’! ‘మనలో మన మాటగా అడుగుతున్నాను, అంత ప్రతిఘటించేవాళ్ల అవసరం నీకున్నదంటావా?’ ఒకటీ అరా గొంతుకలు అప్పుడప్పుడు అతన్ని రహస్యంగా చెవిలో అడిగి వాటి శరీరాలని అతని చేతి విసురుకు గురిచేశాయి. ఆ తాకిళ్లు, ‘ఇంకా ప్రతిఘటన అవసరమా?’ అంటూ ఆమె దగ్గరకు వెళ్లనీకుండా వాళ్లని ఆపాయి.

అంతా శాంతియుతంగా ఉన్నదనుకున్నప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగే సంఘటన ఒకటి జరిగింది. అది, ఆమె తల పైకెత్తుకుని అతనికి దూరంగా జరిగి నిలబడడం. కల కాదన్నట్టుగా వాళ్లిద్దరి మధ్యా అందరికీ కనబడేలా గోడ కూడా వెలిసింది. వచ్చి ఆమెను పరామర్శ చెయ్యడానికి ముందుగా జంకి, కొన్నాళ్లకి అతను కనుచూపుమేరలో లేడని నిర్ధారణ అయిన తరువాత ఒక్కొక్కరుగా అప్పుడప్పుడు విచ్చేశారు. తరువాత, అలా రావడాన్ని అతను ఓరచూపులో చూసినా కూడా పట్టించుకోకపోవడం, ఆ రాక అతని కనుసన్నల్లో జరిగినా కోపగించుకోకపోవడం వాళ్లకి కొంచెం ధైర్యాన్నిచ్చాయి. కూపీ తియ్యగా, లావాదేవీల్లో వచ్చిన కష్టనష్టాలు అతని మనసుని పూర్తిగా ఆక్రమించుకున్నాయని తెలిసింది. అత్యధిక శాతం ఊపిరి పీల్చుకున్నారు.

‘బలహీనుడి కష్టాలు వాడివీ, బలవంతుడి కష్టాలు అందరివీ,’ అని భయపడ్డవాళ్లు లేకపోలేదు.

‘నీకు మంచిరోజులు వచ్చాయమ్మా,’ అన్నారు వాళ్లు ఆమెతో. ‘నిజంగానా? కిటికీలోంచి లోపలికి దూరాయా, లేక చిమ్నీలోంచి కిందకి దూకాయా? మూసివున్న తలుపులని తట్టడం మాట అటుంచి, తీసివున్న తలుపుల లోంచి అయినా వచ్చే ధైర్యం వాటి కెక్కడ ఉన్నదీ?’ ఆమె జవాబిచ్చింది.

వాళ్లనది సర్రుమని కాల్చింది. చుట్ట కాలుస్తున్న అతని ముందుకెళ్లి దూరంగా తలలు వంచి మోకాళ్ల మీద నిల్చుని, ‘మీరు ఆమె వైపు వెళ్లద్దని వేడుకుంటున్నాము,’ అన్నారు. అతను చుట్టని నోట్లోంచి తీసి దాన్ని చిటికెనవేలితో మీటి నుసిని రాల్చాడు. దానితోబాటే వెలువడ్డ ఒకట్రెండు నిప్పురవ్వలు వాళ్లని అక్కడినించీ తరిమాయి.

భవిష్యత్తు గూర్చి ఆమె భ్రమలో లేదని కాలం నిరూపించింది. ఒకనాడు అతను వాళ్లిద్దరి మధ్య గోడని పగులగొట్టాడు. పలుగులతో, సుత్తులతో కాదు. నోటితో ‘ఉఫ్’ మని ఊది. కింద పడుతున్న రాళ్లు గాలిలో కలుగజేసిన ‘అల’జడి అందరినీ తాకింది.

‘గోడ ఉండి ఆపిందేదీ లేకపోతే ఆగేదేదీ? హద్దు అనేదే ప్రశ్నార్థకమయినప్పుడు!’ అనుకున్నారు వాళ్లు తాత్త్వికంగా. గోడ ముక్కల గూర్చి తమకు తెలియనట్లే తప్పించుకుని తిరగడానికి ప్రయత్నించారు. అయినా వాళ్లని బరిలోకి లాగకుండా అతను ఊర్కోలేదు.

ఆమె దగ్గర ఉన్న ఆయుధాలంటే తనకి భయమన్నాడు. అవి తనని నిద్రపోనివ్వడం లేదన్నాడు. వాటిని ఇప్పిస్తే తను ప్రశాంతగా ఉండగలనన్నాడు. వాళ్లా వార్తని ఆమెకి చేరవేశారు.

‘నా దగ్గర ఆయుధాలేమున్నాయ్?’ అన్నదామె ఆశ్చర్యపోయి.

‘దబ్బనమూ, సూదీ!’ అతను వివరించాడు.

‘ఆమె బాగోగులని మనలో ఎవరు చూడగలరు? ఆమె వైపు చేయిచాచి పడగ నీడలోకి కావాలని ఎవరు చేరగలరు?’ వాళ్లు గుసగుస లాడుకున్నారు.

‘ఇచ్చేయ్! అతను భయపడడానికి నీ దగ్గర ఇంక కారణాలేవీ ఉండవు,’ అని నచ్చచెప్పారు ఇరుగుపొరుగులు. ఏ సహాయం కావలసి వచ్చినా తను వాళ్లనే అర్థించాలి కాబట్టి ఆ సలహాని ఆమె అసమ్మతి తెలుపుతూనే పాటించింది.

కొన్నాళ్లకి ఆమెను తనలో కలుపుకోవడానికి అతను మళ్లీ చేతులు చాచాడు. ఆ బలం దిక్కులు పిక్కటిల్లేలా గర్జించింది. జూలు విదిల్చుకుంటూ గాండ్రించింది. తెల్లభల్లూకమై రొమ్ములు చరిచింది.

శాంతి విఛ్ఛిన్నమవుతున్నదని చోద్యగాళ్లు అనుకున్నారు గానీ, ఆమె అనుభవం మేరకు దానికి ఎప్పుడో కాలం చెల్లింది.

‘గాలి వీస్తోంది కదా? వెలుతురొస్తున్నది కదా? తిండికేం లోటులేదు కదా? ఫలితం తెలిసినదే కదా?’ అంటూ వాళ్లు ఆమెని రాజీకి రమ్మన్నారు.

స్థిరత్వం కోసం కాళ్లు ఎడంగా పెట్టి, రెండు చేతులూ నడుం మీద నిలిపి నిల్చుని, తలని పైకెత్తి తీక్షణంగా చూసి ఆమె తన భంగిమతో వాళ్లకి జవాబు చెప్పింది.

పరమపదసోపానంలో కొందరు పాము నోట్లో పడి మొదటి గడిలోకి జారినా, వాళ్లు అక్కడి నించీ మళ్లీ జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టవచ్చు.  

మొదటి గడిలోంచే తోకతో తొయ్యబడి, కొండచరియమీంచి పడిపోతున్నప్పటిలాగా అంచుని మునివేళ్లకి చేజిక్కించుకుని వేలాడుతూ అగాధంలోకి చేరకుండా తమని కాపాడుకుని, పైకి వద్దామని చేసే యుద్ధమే కొందరి జీవితం. వాళ్లకి సోపాన పటం ఆట అంటే పటం లోనిమొదటి గడిని మళ్లీ మళ్లీ చేరడానికి పోరాడ్డం.

 

*****