top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  4

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వంగూరి పి.పా. -2

 

సెప్టెంబర్ నెలా, మజాకాయా?

 

Vanguri Chitten Raju

వంగూరి చిట్టెన్ రాజు

గత నెల అంటే సెప్టెంబర్, 2021 లో ఒక తమాషా జరిగింది.  

 

సెప్టెంబర్ అంటే కేలెండర్ లో 9వ నెల అమెరికాలో ఫాల్ సీజన్ ప్రారంభం అవుతుంది. అంటే వేసవి కాలం లో ఉన్న అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
పట్టడం మొదలు పెడతాయి. మన లెక్క ప్రకారం దీన్ని శరద్ ఋతువు అంటారు కదా అని ఎందుకైనా మంచిది అని అనుమానం వచ్చి గూగుల్ వారిని అడిగాను. నమ్మండి, నమ్మక పొండి. ఫాల్ సీజన్ అంటే గూగుల్ వారు ఇచ్చిన సమాధానం “పతనం” సీజన్. అది చూడగానే కాస్త భయం వేసింది. నా ఒళ్ళు గగుర్పొడిచింది. దానికి అనేక సామాజిక, రాజకీయ సంఘటనలే కాక సాంప్రదాయకంగానూ, వ్యక్తిగతంగానూ కూడా కొన్ని సెప్టెంబర్ జ్ఞాపకాలు కలగలిపి ఈ నాటి పి.పాకి ఒక ప్రాతిపదికని కల్పించాయి.

 

ఆ మాటకొస్తే ప్రతీ వ్యక్తికీ, ఏదో ఒక నెల ఇలా ప్రత్యేకంగా నిలబడడానికి వారి, వారి కారణాలు ఉంటాయి. వాటిల్లో సాధారణంగా వాళ్ళు పుట్టిన నెల చాలా ప్రత్యేకమైనదే.

 

సరిగ్గా తను పుట్టిన రోజునే ఫలానా గొప్ప వాళ్ళు కూడా పుట్టారు అనీ, అలా పుట్టిన గొప్ప వాళ్ళు దివిటీ వేసి వెతికినా గూగుల్ లో కనపడక పోతే, పరిధి పెంచి, ఆ నెలలో పుట్టిన గొప్పవాళ్ళు ఏ దేశం వాళ్ళైనా సరే ఇబ్బంది లేదు. అలా ఒక బేచ్ ని తయారు చేసి ఆ నెల ప్రత్యేకత గురించి చెప్పినట్టుగా తమ గొప్పతనం గురించి చెప్పేసుకోడం నాకూ అలవాటే.

 

కానీ ఈ సెప్టెంబర్ నెల అలా కాదు. నేను పుట్టినది ఈ నెల కాదు.

మొదటి ప్రపంచ యుద్ధం (జులై 28, 1914-1914-నవంబర్ 11, 1918),

రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945),

కొరియా యుద్ధం (Jun 25, 1950 – Jul 27, 1953),

వియత్నాం యుద్ధం (Nov 1, 1955 – Apr 30, 1975),

గల్ఫ్ యుద్ధం -కువైట్ (జనవరి=ఫిబ్రవరి 1991),  

ఇరాక్ యుద్ధం (March 2003 - December 2011),

ఆప్ఘనిస్తాన్ యుద్ధం  (Oct 7, 2001 – Aug 30, 2021)…..

 

ఇలా అమెరికా పాల్గొన్న అనేక యుధ్ధాలు ఎవరు ప్రారంభించినా అన్నీ అవి విధంసాన్ని సృష్టించాయా, శాంతిని ప్రతిష్ఠించాయా? అనేవి చరిత్ర ఉన్నంత కాలం మేధావులు చర్చిస్తూనే ఉంటారు. నిన్నగాక మొన్న అమెరికా తన ఓటమిని నిర్ద్వంద్వంగా అంగీకరించినా, కరించక పోయినా,  టాలిబాన్ లు నెగ్గారు అని అంగీకరించి, ఆప్ఘనిస్తాన్ దేశం లో తమ ఉనికికి సహేతుకమైన కారణాలు లేవు అని ప్రకటించి ఇరవై ఏళ్ళ ఆప్ఘన్ యుధ్దానికి స్వస్తి చెప్పినది కేలెండర్ తేదీ ఆగస్ట్ 31, 2021 కానీ అమలు లోకి వచ్చినది సెప్టెంబర్ లోనే.

ఈ ఆప్ఘన్ యుధ్హానికీ, అంతకు ముందు జరిగిన ఇరాక్ యుధ్ధానికీ ప్రధాన కారణం సరిగ్గా 20 ఏళ్ళ క్రితం ఒసమా బిన్ లాడెన్ సారధ్యం లో అమెరికా మీద జరిగిన విమాన దాడులే. అది జరిగినది  సెప్టెంబర్ లోనే. సెప్టెంబర్ 11, 2001.

విశ్వనాధ వారు జన్మించినదీ సెప్టెంబర్ లోనే - సెప్టెంబర్ 10, 1895

లతా మంగేష్కర్ పుట్టినదీ సెప్టెంబర్ లోనే - సెప్టెంబర్ 28, 1929

గానగంధర్వుడు పరమపదించినది సెప్టెంబర్ నెలలోనే - సెప్టెంబర్ 25, 2020

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టిన రోజు అని ఉపాధ్యాయుల దినం పేరిట పవిత్ర భారత దేశం లో ఉత్సవాల పేరిట  ఆ వృత్తికి తిలోదకాలు ఇచ్చేదీ సెప్టెంబర్ లోనే. ఆయన పుట్టినది సెప్టెంబర్ 5, 1888. అలాంటిదే సెప్టెంబర్ 8 న యునెస్కో వారి అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం.

ఇక “ప్రపంచ ఆత్మహత్యల నివారణోత్సవం”, హిందీ భాషోత్సవం, ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం, ప్రపంచ హృదయ దినోత్సవం (ఇదేమీ ప్రేమికుల టిక్-టాక్ యవ్వారం కాదు. గుండె జబ్బులున్న వాళ్ళకోసం), పర్యాటక దినోత్సవం, అంతర్జాతీయ అనువాద దినోత్సవం, నదుల దినోత్సవం, ప్రపంచ వినికిడి దినోత్సవం (దీన్నే చెవిటి దినోత్సవం అన్నారుట కానీ నాకు వినపడ లేదు), ప్రపంచ చిత్త వైకల్య దినోత్సవం (ఇది తెలుగులో అదోలా ఉన్నా నిజానికి ఇది ఆల్జీమర్స్ వ్యాధి లక్షణానికి సంబంధించినది) మరికొన్ని ఆసక్తికరమైన “తద్దినాలు” సెప్టెంబర్ లోనే జరుగుతాయిట. ఇవన్నీ ఎవరు, ఎక్కడ. ఎలా జరుపుతారో వారికే ఎరుక. చాలా మటుకు తూతూ మంత్రాలే అని నా అనుమానం.

ఈ సెప్టెంబర్ “మాసికాలలో” నాకు భలేగా అనిపించినవి “అంతర్జాతీయ (అ) శాంతి దినోత్సవం (సెప్టెంబర్ 21) ప్రపంచ ఓజోన్ పొర దినోత్సవం (సెప్టెంబర్ 16), అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం (సెప్టెంబర్ 15), అంతర్జాతీయ శారీరక చికిత్స దినోత్సవం (సెప్టెంబర్ 8).

అక్కినేని నాగేశ్వర రావు 98వ జయంతి పేరు చెప్పి 98 గంటలో 98 మంది వక్తల తోటి ఆయన సినిమా కబుర్లు, ఆయన గొప్ప వ్యక్తిత్వం, ఆయన తో నా అనుబంధం అంటూ ఫోటోల తో అంతర్జాలాన్ని అతలాకుతలం చేసినదీ సెప్టెంబర్ లోనే. ఆయన జయంతి. సెప్టెంబర్  20, 1923.

అన్నట్టు. మొన్ననే మా అర్ధాంగి కొబ్బరి కాయ పచ్చడి అద్భుతంగా చేసింది.”ఏమిటి విశేషం?” ఇవాళ వినాయక చవితా?” అని అడగ్గానే “నీకు తెలియదా?ఇవాళ ప్రపంచ కొబ్బరి దినోత్సవం. నిన్ననే వికీ పీడియాలో చూశాను” అంది. సెప్టెంబర్ 2 వ తారీకు ప్రపంచ కొబ్బరి దినోత్సవం ట... మీకు తెలుసా? వీరమాచినేని రామకృష్ణకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. లేకపొతే కొబ్బరి పేరు చెప్పి డాక్టరేట్ ఎలా సంపాయించగలడు. ఇలాంటి అఘాయిత్యాలు జరిగేది ఓన్లీ ఇన్ ఇండియా!

అన్నట్టు మొన్నటి సెప్టెంబర్ 10 నే కదా వినాయక చవితి.

ఇక మా ఇంజనీర్ల దినోత్సవం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం అయిన సెప్టెంబర్ 15 (1861) ని భారత దేశంలో కొందరు అయినా జరుపుకోవడం నాకు కొంచెం ఆశ్చర్యం వేసిన విషయమే. ఎందుకంటే ఆయన గ్లామర్ ఆర్టిస్ట్ కానే కాదు.

ఇక ఈ సెప్టెంబర్ నెలలో జరిగే రకరకాల దినోత్సవాలు అన్నీ ఒక ఎత్తు అయితే నేను కలలో కూడా ఊహించని “ సెప్టెంబర్ మాసికాలు” నమ్మండి, నమ్మక పొండి. సెప్టెంబర్ 25 మన పవిత్ర భారత దేశంలో “నేషనల్ డాటర్స్ డే” ట. అంటే కన్న కూతుళ్ళకి తల్లిదండ్రులు పెట్టే “దినం”. అవును మరి. ఆడపిల్ల పుడితే అనర్ధం అనుకునే దౌర్భాగ్యులు ఇంకా ఉన్న దేశం కదా! 

అంతే కాదు. సెప్టెంబర్ 28 న అమెరికా కొడుకుల దినోత్సవం ట..దాం దుంప తెగా, నాకు ఒక కొడుకు గాడు పుట్టి ముఫై ఏళ్ళు అయినా వాడి పుట్టిన రోజు పండగ తప్ప ఇలా కొడుకు దినోత్సవం అంటూ ఒకటి ఉంది అనీ తెలియదు, ఉన్నా ఆ రోజు ఏం చేసి చావాలో అదీ తెలియదు. నిజానికి కూతురు, కొడుకు దినోత్సవాలన్నీ అందరూ ఇదే అవకాశం కదా అని ఆరు నెలల పసి పిల్లల నుంచి అరవై ఏళ్ల తెల్ల జుట్టు వచ్చిన సంతానందాకా  తమ తమ  కుమార్తెల ఫోటోలు, కొడుకుల వెకిలి వేషాలు, కేకు కట్టింగులు, కావలింతలు ఒకటేమిటి రక రకాల ఫోటోలు పెట్టేసి ఎన్ని లైకులు వస్తాయా అని ఎదురు చూసే జాతి కేవలం మనదే. ఇక ముందు ముందు కోడళ్ళ దినం, అల్లుళ్ళ దినం, మూడో అల్లుడి దినం, రెండో కోడలి దినం, మా మొదటి కోడలి రెండో మొగుడి ఒకటో కూతురి దినం, మా తెల్ల అల్లుడు దినం, చైనా కోడలి దినం ఇలా ఎన్ని “దినాలు” మనం పెట్టాలో ఎవరికీ తెలుసు? ఇక కుక్కల దినం, పిల్లుల దినం ఉండే ఉంటాయి. 

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కానీ మొన్న సెప్టెంబర్ 25-26, 2021 తేదీలలో “ఆకాశ వీధి” లో జరిగిన “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు-12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” గురించి మాత్రమే నేను అసలు చెప్పదల్చుకున్నది. నాకు తెలిసీ చరిత్రలో మొదటి సారిగా, ప్రపంచం లో అతి పెద్ద దేశాలయిన కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివశిస్తున్న సుమారు 100 మంది తెలుగు కవులు, రచయితలు, సాహితీవేత్తలు తమదే అయిన ఒక సాహిత్య వేదిక మీద కలుసుకుని రెండు రోజులలో 20 గంటల సేపు సాహిత్యానందాన్ని పంచుకుంటూ, విజ్ఞానాన్ని పంచి పెడుతూ మాతృభాష మీద తమ మమకారాన్ని చాటుకున్నారు.

ఈ సదస్సు గురించి ఈటీవీ వారి ప్రసారాలని ఈ క్రింది లంకెలలో చూడవచ్చును.

ETV: 1 వ రోజు  https://www.youtube.com/watch?v=yC7Z802qvFs

ETV- 2వ రోజు https://www.youtube.com/watch?v=lL6eWswPX-8&feature=youtu.be

రెండవ రోజు ప్రసారం లో ఈటీవీ వారు ఈ మధురవాణి పత్రిక ప్రధాన సంపాదకురాలైన దీప్తి పెండ్యాల ప్రసంగానికి పెద్ద పీట వెయ్యడం మాకు ఎంతో గర్వకారణం.

ఈ సదస్సు లో అన్ని ప్రసంగాలనీ వంగూరి ఫౌండేషన్ యూట్యూబ్ చానెల్ లో ఈ క్రింది లింక్ లో చూడవచ్చును.

 https://www.youtube.com/channel/UCX9tl92zikUSpHp0MuNTiLQ

 

ఈ సదస్సు సెప్టెంబర్ లో దిగ్విజయంగా జరిగింది కాబట్టే అంటాను సెప్టెంబరా, మజాకాయా అని... సరదాగా!!

bottom of page