top of page
bhuvanollasam.PNG

సంపుటి  6   సంచిక  4

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

“దీప్తి” ముచ్చట్లు

నీలి తరగల పైన ~~~

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

"నిజంగా ఎంత గొప్పది కదా, పిన్నీ!" నీలిమ తన నీలి, నీలి అరమోడ్పు కళ్ళని నీలాల సముద్రంవైపే సారించి చూస్తూ, చూస్తూ ఆ మాట అనటం ఇది నూటపదకొండవసారి!

"ఎవరూ? సముద్రమా?" అప్పుడే అక్కడికి వచ్చి కూర్చున్న విరించి అడిగాడు.  నేను నీలిమ వైపు చూసాను. అడగటమే తడవుగా ఆ ముచ్చట్లు ఇష్టంగా చెప్పటం ఇంకా మొదలుపెట్టలేదేమని.

కానీ, నీలిమ ఈ లోకంలో ఉన్నట్టే లేదు. నావేపు చూసి కళ్ళెగరేసాడు విరించి. నీలిమకేమయిందని?  భుజాలు ఎగరేసాను. తెలీదనీ కాదు, చెప్పొద్దనీ కాదు. ప్రశ్న నీలిమ మెదడు దాకా అందాక ఆ కథెలాగూ మరోసారి చర్వితచరణమయ్యేదే కదాని. ఊహించినట్టే నీలిమ మళ్ళీ మొదలుపెట్టింది. "టమైరా తెలుసు కదా, ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, బాబాయ్?"

విరించి తెలుసన్నట్టు తలూపాడు.  "మన కేటీ నుంచి వెళ్ళి రెజ్లింగ్ లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెచ్చుకుందీ? ఆ అమ్మాయే కదా? టాక్ ఆఫ్ ద టౌన్! తెలీనివారెవరూ?" 

నీలిమ నిరాశగా చూసింది, "అబ్బే, ఆ అమ్మాయి కాదు. నా స్నేహితురాలు టమైరా! నా పుట్టినరోజు నాడు మన ఇంట్లో కలిసావు కదా, బాబాయ్? ఆ అమ్మాయి!"

విరించి ఆ అమ్మాయిని గుర్తు తెచ్చుకోవటానికి పెద్దగా కష్టపడలేదు. అరనిమిషంలోనే "ఓ, ఆ అమ్మాయా! గుర్తొచ్చింది" అంటూ ఆసక్తిగా నీలిమవైపు చూసాడు. అంత సులభంగా మరిచిపోగలిగే అమ్మాయి కాదు మరి. అందంగా ఉండటమూ, అల్లరిగా ఉండటమూ ఇవేవీ కారణం కాదు. ఆ అమ్మాయి ఆరిందాలా చెప్పే కబుర్లు బహుశా అలా అబ్బురపరుస్తాయేమో. ఎక్కడున్నా చుట్టూ పదిమందైనా వింటూంటారు ఆ రింగులజుట్టమ్మాయి చెప్పే ముచ్చట్లు. ఆ అమ్మాయి భలే అందంగా ఉంటుంది. బయటా. లోపలా. ఆకర్షణ ఎక్కడుందనేదీ తేల్చుకొమ్మంటే మాత్రం చాలా కష్టం. ఆ పెద్ద కళ్ళల్లోనో, మాట్లాడుతూంటే ఉన్నచోట ఉండక ముఖమ్మీద పడుతూండే ముద్దొచ్చే ముంగురులో, ఆ అమ్మాయి వాటిని పక్కకి తోస్తుంటే కదలాడే చేతివేళ్ళదో చెప్పటం కష్టం. అవన్నిటి కన్నా కూడా ఆ మాటల్లో ఆకర్షణ అమాంతంగా లాగేస్తుంది. ఆ మాటల్లో ఉండే వికీవిశ్వం ఒకటే కాదు నన్ను ఆకట్టుకుంది. సరదాగా లల్లాయి మాటలు మాట్లాడుతూంటే కూడా అంతేలా అతుక్కుపోయి వినేలా చేసే మరేదో మాయ ఉంటుంది. నీలిమ పదహారో పుట్టినరోజు పండుగకి మేము ఏవేవో ప్లాన్ చేస్తూంటే, నీలిమ మాత్రం “టమైరాని పిలిస్తే చాలు, తనే చూసుకుంటుందీ" అంది. అంతే అయింది. ఆ అమ్మాయి ఒక్కతీ వచ్చి, నీలిమనీ, నీలిమ స్నేహితురాళ్ళందరినీ మూడు గంటల సేపు నిర్విరామంగా సందడిలో ముంచి తేల్చింది. మాటలు, ఆటలూ ఆ అల్లరి ముచ్చటగానే అనిపించాయి కానీ అతిగా ఎప్పుడూ తోచలేదు. ఐతే అవేవీ కావిపుడు నీలిమని మైమరిపింపజేస్తున్న విషయాలు!

 

విరించికి నీలిమ తరువాతి కథ చెప్పేంతలోనే విరించికి ఏదో ఫోన్ రావటంతో -"ఒక్క నిమిషం" అని సైగ చేసి వెళ్ళాడు విరించి.

వాతావరణం చల్లబడుతుంది. అలలపోటు పెరుగుతుంది. అలల తాలూకు అల్లరి దూకుడు మనసుని అలరిస్తుంటే, కాస్త దూరంగా కనబడే సంద్రంలో మంద్రంగా కదులుతున్న నీలాల కెరటాలు వింత అందంతో మెరిసిపోతూ చూపులని లాగేస్తున్నాయి. కెరటాలు లేని సంద్రం ఎలా ఉంటుంది? ఊహించబోయాను. ఊహకందలేదు.

సన్నగా చలి వేస్తుంటే బ్యాగులోంచి  కార్డిగన్ తీసి వేసుకున్నాను. చిన్న కారమెల్ పాప్ కార్న్ ప్యాకెట్ తీసి నీలిమ చేతికిచ్చాను. మెల్లిగా అడిగాను. "ఆ అమ్మాయి వచ్చే సూచనలేమీ లేవు. ఇంటికెళదామా? పోనీ, రేప్పొద్దునే కలుస్తారా?"

"మరికొన్ని నిమిషాలు చూద్దాము. వస్తానని చెప్పి రాకుండా ఉండదు టమైరా" పాప్ కార్న్ ప్యాకెట్ తీసుకుంటూ మరో సారి కళ్ళని వెలిగించింది. "ఓ, ఈ కారమెల్ పాప్కార్న్ అంటే టమైరాకి చాలా ఇష్టం పిన్నీ. నీకెలా తెలుసు ఆ అమ్మాయికిష్టమని?"

చిన్నగా నవ్వి నీలిమ తల నిమిరాను. మెత్తగా తగిలింది పొడుగాటి జుత్తు. నల్లగా నిగనిగలాడుతూ, మధ్య మధ్యలో లేయర్లుగా వేసిన కాఫీరంగు షేడ్స్ లో మృదువుగా తగిలే ఆ జుట్టుని పట్టి ఉంచిన క్లిప్పుని చూసాను. అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు కానీ సహజంగానే చక్కనిదేమో, ఏ చిన్న అలంకరణైనా అదనపు అందాన్ని తెచ్చిపెడుతుంది. నా వైపు చూసింది నీలిమ. నా కళ్ళలో ఏదో వెదకాలనుకుందేమో. నన్ను గట్టిగా హత్తుకుని "థ్యాంక్స్ పిన్నీ" అంది. నిజానికి కేరమెల్ పాప్ కార్న్ నీలిమకి ఇష్టం కదాని తెచ్చాను. కానీ, ఈ మధ్య నీలిమకి నచ్చేవన్నీ, టమైరాకి నచ్చినవే అయుంటున్నాయని నేను గమనించకపోలేదు. ఆ అమ్మాయి ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. ఎటొచ్చీ అది మంచి ప్రభావమే కనుక నాకు ఏ బెంగా లేదు. 

 

నీలిమ విరించికి అన్న కూతురు. నీలిమ మా పెళ్ళినాటికి రెండునెలల పసిపిల్ల. అన్నదమ్ములు డాలస్ లో ఒకే ఇంట్లో ఉండేవారపుడు. దానితో, నీలిమకి మా దగ్గర గారాబమూ, చేరికా ఎక్కువే. నీలిమ ఐదేళ్ళపిల్లపుడు వాళ్ళకి కవలపిల్లలు పుట్టారు. అప్పటికింకా పిల్లలు లేని మేము అప్పటికే ఎంతో మాలిమి అయిన నీలిమని పెంచుకుంటామని కాస్త తటపటాయిస్తూనే అడిగాము. ఇష్టంగా కాకున్నా, మాపై ఇష్టంతో ఇచ్చేసారు. ఉద్యోగాలపై మేము ఎన్ని ఊర్లు మారినా, ఎక్కడికక్కడ ఇట్టే స్నేహాలేర్పరుచుకుంటూ ఉండేది నీలిమ. చదువులో, ఆటపాటల్లో అన్నిటా చురుకుగా ఉండే నీలిమని చూస్తుంటే మాకు ఎంత గర్వంగా ఉంటుందో! నీలిమే మా ఇద్దరికీ లోకం. నీలిమ లోకమే చాలా పెద్దది. స్నేహితులు, సేవాసంఘాలు, ఆసుపత్రుల్లో రోగులూ, అనాథాశ్రమాల్లో పిల్లలూ, రిటైర్మెంట్ హోంస్ లో పెద్దలూ, జగమంతా తన కుటుంబమే నీలిమకి. సమూహజీవితమే తనది, తన మిత్రులదీ. నీలిమ మిత్రసమూహం పెద్దదే. అందులోకి రెండేళ్ళ క్రితం యూరోప్ నుంచి వచ్చిన టమైరా వీళ్ళ గుంపులో ఇట్టే కలిసిపోయింది. ఆ అమ్మాయి రాకతో మరింత చలాకీగా మారారు ఈ మిత్రబృందం. సేవలనీ, సాయాలనీ, సరదాలనీ, క్యాంపింగులనీ, ఒకచోట నిలవకుండా అయ్యారు మరీ.

అయితే, ఎంత హడావిడిగా ఉన్నా నీలిమ మాతో గడిపే సమయాలని మాత్రం మాకై ఉంచేస్తుంది.

ఇది బహుశా మొదటిసారేమో, ఇలా మా మాటల్లోకీ, మాకే సొంతమైన సమయాల్లోకీ టమైరా దూరిపోవటం. అసూయేమీ కలుగలేదు. కొన్ని సమక్షాల్లో నిష్కల్మషంగా తప్ప మరోలా ఉండలేని క్షణాలుంటాయి. అవి అనుభూతించలేకపోతే అంతకన్నా అర్థంలేని జీవితముండదు. 

ఫోన్ కాల్ ముగిసినట్టుంది. విరించి వచ్చాడు. మళ్ళీ అడిగాడు నీలిమని. "ఇందాకేదో చెబుతున్నావు?" అని. 

 

నీలిమ చెప్పింది. "టమైరా ఒక గొప్ప ఆలోచన చేసింది బాబాయ్. మాకూ నచ్చింది. టమైరా ఇపుడొస్తుంది. నేనూ, టమైరా కలిసి ఈ వారాంతం చిన్మయి వాళ్ళింటికి వెళదామనుకుంటున్నాము. ఓకే కదా?"

విరించికి ఏమీ అర్థం కాలేదు. ఇందులో గొప్ప ఆలోచనేముందీ? ఎపుడూ కలుస్తూనే ఉంటారుగా? అన్నట్టుగా నన్ను చూసాడు.

ఈ పిల్ల ఏదీ ఒకేసారిగా చెప్పదే? మెల్లిగా అలల్లా పేరుస్తూ విషయానికొస్తుంది. నాకు అలవాటే. 

నేనే చెప్పాను విరించికి. "చిన్మయికి కీమో అయింది. జుత్తు మొత్తం తీసేసుకున్నాక వీళ్ళతో కలవటం తగ్గించిందట. వీళ్ళే కలిసేందుకు వెళుతున్నారు. చిన్మయికి జుట్టు లేకుండా తానొక్కతే వేరేలా ఉన్న భావం కలగకుండా, వెళ్ళేముందు వీళ్ళు కూడా... "

 

నా మాట పూర్తి కాకుండానే "అవునా. మంచిదే కదా. స్నేహితులన్నాక ఆ మాత్రం సాయంగా ఉండాలి కదా." అని ఆగి దూరంగా వస్తున్న టమైరాని చూశాడు. ఒక్క క్షణం గుర్తుపట్టలేదు. ఆ అమ్మాయి చలాకీగా వచ్చి హాయ్ చెబుతుంటే ఆ అమ్మాయినే అభిమానంగా చూశాడు. నేనూ టమైరాని కన్నార్పకుండా అలాగే చూసాను. ఎప్పటికన్నా కూడా మరింత అందంగా కనిపించింది. చూడగానే మొదటగా ఆకర్షించే ఆ రింగులు తిరిగిన రాగితీగల్లాంటి అందమైన జుట్టులో ఒక్క తీగయినా కనబడకున్నప్పటికీ. ఉంగరాల జుట్టు స్థానే సరికొత్తగా కనబడుతున్న ఆ నున్నటి గుండులో మెరుపు ఎక్కడిదో చటుక్కున పట్టేసాము. ఆ అమ్మాయి స్వచ్ఛమైన నవ్వులోని మెరుపూ అదే. అంతటా ప్రసరించినట్టుంది.

టమైరా నీలిమని గట్టిగా హగ్ చేసుకుని అడిగింది "రెడీనా?" అని. 

నీలిమ అంతే సంతోషంగా "రెడీ" అంటూ మావైపు చూసింది.

విరించి పూర్తిగా విషయం వినకున్నాఅతనికి అంతా అర్థమైంది. గర్వంగా నవ్వుతూ బొటనవేలు చూపించాడు.

బట్టలూ, స్నాక్స్ ఉంచిన బ్యాగ్ అందుకుని పిల్లలిద్దరూ బయల్దేరుతుంటే సముద్రం వైపు చూసాను. అలలన్నీ నెమ్మదించాయి. తటస్థంగా ఉంది సముద్రం.

ఒక గంట తరువాత నీలిమ నుంచి మెసేజ్. "థ్యాంక్స్ అగెయిన్, పిన్నీ" అంటూ ఓ ఫోటో. హెయిర్ సెలూన్ నించి. నేను తొలిసారి చూసిన బోసినవ్వుల పాప నీలూ గుర్తొచ్చింది. నున్నటి గుండుతో, నిష్కపటమైన నవ్వుతో అచ్చు ఇలాగే ఉండేది. విరించికీ చూపించి "ప్రౌడాఫ్ యూ, నీలూ" అని పంపించాము.

 

కళ్ళెదురుగా కెరటాల్లేని సంద్రం. ఊహకందనంత అందంగా ఉంది. తన లోపల అన్ని రత్నాలు దాచుకున్న సముద్రానికి తళుకెలా తగ్గుతుందీ? 

 

*****

bottom of page