MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కవితా మధురాలు
వి.ఆర్.విద్యార్థి
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
ఆమె
('దృశ్యం నుండి దృశ్యానికి' కవితా సంపుటి నుండి)
ఆమె నయాగరా జలపాతమై దూకింది
నా అనంత దాహం తీరింది
ఆమె వెలుగు రేఖయై తాకింది
నా చీకటి వ్యసనాలు పారిపోయాయి
ఆమె భీకర యుద్ధమై చుట్టు ముట్టింది
నాలో శత్రువు నశించాడు
ఆమె అపూర్వ మానవియై ప్రత్యక్షమయింది
నాలోని లేకి కోర్కెలు రాలిపోయాయి
ఆమె తెల్ల హంసయై నాలో వాలింది
నాలోని స్వర్గ నరకాలు వేరుపడ్డాయి
ఆమె 'నందనవన'మై చిగురించింది
నేను విశ్వ పుష్పమై వికసించాను
ఆమె 'ఎఱుక' మారుతమై వీచింది
నాలోని అజ్ఞాన శిఖరాలు కూలిపోయాయి
ఆమె సృష్టి పరిమళమై వ్యాపించింది
నేను 'మరో తనం' లోకి కరిగిపోయాను
సుజాత.పి.వి.ఎల్
ఇంపుగా రాయాలని వుంది..!'
లేఖ రాయాలని వుంది..
మనసు మడతలు విప్పి
చేతులతో మూసిన ముఖాన్ని
అద్దంలా నీ ముందుంచి
ఏవేవో రాయాలనుంది !
ఏ జన్మ బంధమో ఈ జన్మ లో
కలిశామనే సంతోషాన్ని రాశి పోసినట్టుగా
అక్షరాలను నెమలీకతో అద్ది
ఇంపుగా రాయాలని వుంది !
నీ సమక్షంలో గడిపిన క్షణాలన్నీ
ఒక్కొక్క జ్ఞాపకంగా మలచి,
అందంగా అత్తరు పూసి
ముత్యాల సరాలు కూర్చినట్టుగా
రాయాలని వుంది ..!
నీ సాంగత్యంలో కలిగిన అనుభూతలను
వణికే పెదాలను బిగబట్టుకొని
భయాన్నీ బిడియాన్నీ కలబోసి
కనుపాపలలో కలిగిన భావాన్ని
సుగంధ పరిమళాలు వెదజల్లినట్లు
రాయాలని వుంది !
ఎన్నో ఇంకెన్నో రాయాలని వుంది
లేఖ చివర నా పేరుని నీ పేరుతో కలిపి
నువ్వు నా సొంతమని లోకానికి తెలిపేలా
ఓ లేఖ రాయాలని వుంది..!!
******
రామస్వామి నాగరాజు
అన్నీ వదలుకున్నాక
అన్నీ వదలుకున్నాక
నీవు పక్షి ఈక బరువైనా లేని రెక్కవై తేలిపోతుంటావు,
నింగి నిన్ను కౌగిలించుకుంటుంది,
నేల గురుత్వాకర్షణ కోల్పోతుంది,
ఆకాశం అవతలి పెంజీకటి అంచు విచ్చిన
అనంతం నిన్ను పిలుస్తుంటుంది,
అంతుపట్టని ఆణిమ ఏదో
నీలో పాలవెల్లై ప్రవహిస్తుంటుంది.
నీవు కాని నీవు
అలలు అణగిన అంతరిక్ష రేఖ మీద
నక్షత్ర చలన బిందువువై అలవోకగా సంచరిస్తుంటావు,
గగనం నినదిస్తున్న నిశ్శబ్ద గాన గాంధర్వంలో
రాగాతీత అవ్యక్త స్వరధారవై పారుతుంటావు.
అప్పుడు
ఆకాశ అసీమలలో నీవొక అవర్ణ మయూఖవు,
సూక్ష్మ బ్రహ్మాండ ఆవృత్త పరమాణు పరిధి మీద
నివృత్తి పొందిన సూక్ష్మాణులేశానివి,
నితాంత ఏకాంత శాంత సంద్రం మీద
తేలాడే ఏకైక వటపత్రానివి.
* * *
అది సరే కాని
అన్నీ వదలుకోవడం అంత సులువేం కాదు;
సర్వం త్యజించడం అంటే
తలకిందుగా తపస్సు చేయడమే.
కోడం పవన్ కుమార్
ఊపిరి
పచ్చని నిశ్శబ్దంలో అంతులేని ప్రయాణం
ఏకాంత తీరంలో ఎదపై నిద్రించిన ఆనందం
సముద్ర నీలాల్లో వినిపిస్తున్న తీయని సంగీతం
మనిషిని మనిషి ప్రేమించడమే కాదు
ప్రకృతిని ప్రేమించినపుడే అలౌకిక విప్లవానందం
ప్రకృతిని గురువుగా మలుచుకుంటే
అర్యణవాటిక నుంచి సత్యకాముడు నడిచివస్తాడు
బ్రహ్మ జ్ఞానిలా భాసించి ఆంతర్యాన్ని పరుస్తాడు
పువ్వులతో నవ్వే చెట్లు
గాలి తెరలతో ఊకొట్టే పంట పొలాలు
సుందర వనాల మీంచి వీచే ఆమని సమీరాలు
సమస్త జీవరాశుల మనస్తత్వాన్ని
గడ్డిపరకపై మెరిసే మంచుబిందువుపై పరుస్తుంది
అరవిరిసిన గులాబి
తలవంచి అభివాదం చేస్తుంది
నిటారుగా నిలబడిన చెట్లు
పుడమికి సలాం చేస్తాయి
చెట్ల ఆకుల సందులలోంచి
ఉషోదయ కిరణాలు దూసుకొచ్చి
తత్వగ్రంథాలు చెప్పలేని దివ్యత్వాన్ని బోధిస్తాయి
పంచేంద్రియాలు సర్వకళామయమవుతాయి
రాళ్లు మంద్రధ్వానాలు వినిపిస్తాయి
నడుస్తున్న నదులలో కవితలు ప్రతిధ్వనిస్తాయి
నరికిన చెట్ల గుజ్జు తెల్లకాగితమవుతుంది
చల్లటి గాలి కవిత్వ పరిమళమవుతుంది
గానం చేసే పక్షుల తీయని గీతాలు
పవనాల్ని పులకరింపజేస్తాయి
స్వప్నమైన ఉదయం
రాత్రి నిద్రపోయి కలగంటుంది
కళ్ళు తెరిచిన మరుక్షణమే
ఉక్కు నగరంలో ఊపిరి తీస్తుంటాము
*****
నాగరాజు రామస్వామి
అద్వైతం
నేను
పాటను పావురాన్ని చేసి
ఆకసంలోకి ఎగిరేసినప్పుడు
నీవు
మేఘరాగానివై రెక్క విప్పావు!
నేను
పాటనై ప్రవహించి నప్పుడు
నీవు
ఎద మైదానమై నన్ను హత్తు కున్నావు!
నేను
నా ఉదాసీన నిర్లిప్త నయన సంధ్యలో
కనులు మూసుకున్నప్పుడు
నీవు
నా నీలీరాగాల నింగి మీద
చల్లని చక్షూరాగ పరాగ పరిమళాన్ని చల్లావు.
నేను
నా విశ్వాంతరాళంలో నల్ల నక్షత్రాన్నై
బద్దలౌతున్నప్పుడు
నీవు
నా దోసిట సిత కౌముదీ
హసిత చందన చంద్రరేఖవై రాలి పడ్డావు.
నేను నీవై
నా లోలోనికి ప్రవేశిస్తున్న వేళ
నీవు నేనై
హృదయ ద్వారాలు తెరచి
నీవు నాలో కలిసి పోయావు.
*****