top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

విశ్వనాథుని త్రిశూలం

Pramod Tatvawadi

డా. తత్త్వాది ప్రమోద కుమార్

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వచనకవిత్వం మినహా తెలుగు సాహితీ ప్రక్రియలన్నింటిలో రచనలు చేశారు. వాటిలో తనదైన ప్రత్యేకమైన శైలి ముద్రను వేశారు. వారు రచనల్లో సనాతన సంప్రదాయానికి  పెద్దపీట వేస్తారని విమర్శకుల పరిశోధకుల ఏకాభిప్రాయం. అది నిజమే కానీ ఆ సంప్రదాయ భావాలను ఉద్దేశపూర్వకంగా రుద్దరు. ఉపన్యాస ధోరణి ప్రదర్శించరు. కథా నిర్మాణంలో, పాత్రచిత్రణలో, సంభాషణల్లో, సంవాదనల్లో అనుస్యూతంగా ప్రదర్శిస్తారు. అందువల్ల వారి రచన నిర్మాణంలో బిగువు, తూగు మొదలైనవన్నీ సమపాళ్లలో మేళవించుకుంటాయి. అంతిమంగా ఏమి చెప్పదలచుకున్నా రో దానిని ఆద్యంతం రసవత్తర సూత్రంతో కొనసాగిస్తారు. ఆ రసవత్తర సూత్రమే శిల్పం. ప్రాచ్య, పాశ్చాత్య శిల్ప నిర్మాణ రీతులను ఆపోసన పట్టిన విశ్వనాథ వారు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా త్రిశూలం నాటకాన్ని రచించారు.     

విశ్వనాథ వారు మొత్తం 17 నాటకాలు రచించారు. అందులో మూడు సంస్కృత నాటకాలు. పదునాల్గు తెలుగు నాటకాలు. తెలుగు నాటకాల్లో నాలుగు విషాదాంత నాటకాలు. పాశ్చాత్య నాటక సాహిత్యం, నాటక ప్రయోగాల పరిచయంతో తెలుగు నేలలోనూ విషాదాంత నాటక రచనలు మొదలయ్యాయి. ఈ ప్రభావంతో విశ్వనాథవారు నర్తనశాల, వేనరాజు, అనార్కలి, త్రిశూలం నాటకాలను రచించారు నర్తనశాల, వేనరాజు పౌరాణికాలు. అనార్కలి, త్రిశూలం చారిత్రకాలు. త్రిశూలం నాటక కథా కాలం క్రీ.శ. 12వ శతాబ్దం. కథా వస్తువు బసవేశ్వరుని కి సంబంధించింది. బసవేశ్వరుడు వీరశైవ మత బోధకుడు. బసవడు నందీశ్వరుని అపరావతారమని శివ భక్తుల విశ్వాసం. బసవడు స్థాపించిందీ, ప్రచారం చేసింది వీరశైవం. వీరశైవం కర్మకాండలను వ్యతిరేకించింది. కేవలం భక్తి మార్గానికి ప్రాధాన్యమిచ్చింది. వర్ణ వ్యవస్థను నిర్వహించింది. మరి నాటక రచయిత సంప్రదాయవాది. కర్మ మార్గావలంబి. కథా వస్తువు చారిత్రకం. కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులే కాని పెద్ద మార్పులు చేయడానికి వీలు లేదు. పైగా ఒక సంప్రదాయ మార్గానికి ప్రతినిధి అయిన చారిత్రక పురుషుడు. కావున చారిత్రక సత్యాలు మరుగుపరచరాదు. అలాగని వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపకుండా ఉండలేదు. అందుకని  విశ్వనాథ వారు త్రిశూలం నాటక కథా నిర్మాణంలో, పాత్రల మనస్తత్వ చిత్రణలో, సంభాషణల్లో తూగు (Balance) ను సమన్వయ పరిచారు. పాఠకులకు ఆద్యంతం ఉత్కంఠ కలిగించారు.

విశ్వనాథ వారు 1922 సంవత్సరంలో బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ప్రఖ్యాత చిత్రకారుడు జాతీయవాది ప్రమోద కుమార్ ఛటర్జీ కూడా అదే కళాశాలలో అధ్యాపకులు. ఆయన తన చిత్రాలను ప్రదర్శించారు. అందులో త్రిశూలం చిత్రాన్ని చూసిన విశ్వనాథవారు ఆకర్షితులయ్యారు. "నాకే కనుక రాజ్యం ఉన్నట్లయితే- ఈ చిత్రానికి రాజ్యాన్ని ఇచ్చేవాడిని" అంటూ విశ్వనాథ వారు ఛటర్జీని  ప్రశంసించారు. ఆ తర్వాత సంవత్సరం ఛటర్జీ బెంగాల్ వెళ్లిపోయారు. ఆ సమయంలో "మీరు రాజ్యాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు." అంటూ ఛటర్జీ విశ్వనాథ వారికి త్రిశూలం చిత్రాన్ని  కానుకగా అందించారు అప్పుడే వారి మదిలో అనే పేరుతో రచన చేయాలనే భావన మొదలై ఉంటుంది*1*. 1926 వ సంవత్సరం లో వేటూరి ప్రభాకరశాస్త్రి గారి పీఠికతో బసవపురాణం ముద్రితమైంది. పీఠికతో పాటు బసవపురాణాన్ని పరిశీలించిన విశ్వనాథ వారికి కావలసిన ఇతివృత్తం దొరికినట్లయింది. బసవేశ్వరుని చరిత్రను ఆధారంగా చేసుకొని ఈ నాటకాన్ని రచించారు*2*.  అధ్యాపక మిత్రుడు ఛటర్జీ కానుకగా అందించిన త్రిశూలం చిత్రమే నాటకం ముద్రణ పుస్తకానికి ముఖ చిత్రంగా రూపుదిద్దుకుంది.

శివుని త్రిశూలం లో మూడు మొనలు ఉన్నట్లే ఈ నాటకంలో మూడు ప్రధాన పాత్రలు. వారు బసవేశ్వరుడు, బిజ్జల దేవుడు, జగదేవుడు. త్రిశూలం లోని మూడు మొనలు సత్త్వ, రజస్తమో గుణాలకు సంకేతాలు. ఈ త్రిగుణాలకు నాటకంలోని బసవేశ్వరుడు, బిజ్జలుడు, జగదేవుడు ప్రతినిధులని పరిశోధకులు భావించారు*3*. బసవేశ్వరుడు సత్త్వ గుణానికి, బిజ్జలుడు రజోగుణానికి, జగదేవుడు తమోగుణానికి ప్రతినిధులని పరిశోధకులు తెలిపారు. తన ఇంట్లో విందు భోజనం చేయాలని జగదేవుడు బసవేశ్వరున్ని ఆహ్వానిస్తాడు. బసవడు షరతులు విధిస్తాడు. సమయం వచ్చినప్పుడు రాజు, కొడుకు, గురువు తో పాటు ఎవరినైనా  సంహరించాలనేది షరతు. ఈ షరతును జగదేవుడు  అనాలోచితంగా ఒప్పుకొని, రాజు బిజ్జలున్ని చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. స్వల్ప ప్రయోజనాల కోసం రాజద్రోహానికి సిద్ధమైన జగదేవుడు తమోగుణ యుతుడు. రాజు బిజ్జలునికి రాజ్య విస్తరణా కాంక్ష విపరీతం. మతాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని రాజు ఆలోచన. కావున రాజు రజోగుణ రతుడు. బసవేశ్వరుడు సత్త్వ గుణానికి ప్రతినిధిగా భావించుట పాక్షిక సత్యమే. బసవడు మంత్రి పదవిని పొంది మత వ్యాప్తికి సిద్ధమవుతాడు. శైవుల ఆగడాలను అదుపుచేయడు. రాజు శైవుల ఆగడాలను ప్రస్తావించిన సందర్భాల్లో బసవేశ్వరుడు సమర్థిస్తాడు. రాజుకు ఏవో సమాధానాలు చెబుతుంటాడు. ఇవన్నీ బసవేశ్వరుని సత్త్వ గుణానికి లోపాలుగా ఉన్నాయి.      

 

త్రిశూల దర్శనం భక్తులకు అభయాన్ని ఇవ్వాలి. దుష్టులకు భయాన్ని కలిగించాలి. కానీ ఈ నాటకంలో త్రిశూల దర్శనం అయిన వారికి ఆపదలు చుట్టుముట్టాయి. భయాందోళనలు ఆవరించాయి. మొదటిసారి చాళుక్య తైలప దేవునకు త్రిశూల దర్శనం అయింది. బిజ్జలునితో జరిగిన యుద్ధంలో తైలప దేవుడు మరణించాడు. ఒకసారి జగ దేవునికి త్రిశూల దర్శనం అయింది. కాకతీయుల తో జరిగిన యుద్ధంలో దండం నాయకుడు జగదేవుడు ఓటమి చెందాడు. రెండవసారి బిజ్జలునికి దర్శనమైంది. తెలియని భయాందోళనలు మొదలయ్యాయి. ఆ భయాలు నిజమయ్యాయి. బసవేశ్వరుడు రాజు బిజ్జలుని వధకు పథకం వేసాడు. జగదేవున్ని ప్రేరేపించాడు. రాజ వేదికపై జగదేవున్ని  నియమించాడు. జగదేవుడు రాజు బిజ్జలున్ని సంహరించాడు. జగదేవుడూ మరణించాడు. బసవేశ్వరుడు లింగైక్యం చెందాడు. కళ్యాణ కటకం నశించింది.    

 

రాజు  శివ ద్రోహం చేసిన కారణంగా శైవులు కళ్యాణకటకాన్ని  వదిలి వెళ్లారని, బసవేశ్వరుని శాప ఫలితంగా రాజధాని కళ్యాణకటకం నశించిందని వీరశైవ పురాణాలు పేర్కొన్నాయి. కానీ బిజ్జలుడు బసవేశ్వరుడు  ఇద్దరూ ద్రోహులే అని త్రిశూలం నాటకం ద్వారా తెలుస్తున్నది. "శివ ద్రోహమునకు కళ్యాణ కటకము నశించుచున్నది. రాజ ద్రోహమునకు వీరశైవ మతము నశించుచున్నది." అని నాటకం చివరలో జగదేవునితో విశ్వనాథవారు తీర్పు చెప్పించారు. దోషాలు ద్రోహాలు బిజ్జలుని లోనే కావు బసవేశ్వరునిలో కూడా ఉన్నట్లు విశ్వనాథవారు నాటక కథను మలిచారు. అందువల్ల ద్రోహబుద్ధి, దోషాలు కలిగిన బసవేశ్వరుడు సత్త్వ గుణం సంపన్నుడు అని చెప్పడం సత్య దూరమే  అవుతుంది.


నాటకంలోని కథావస్తువు ప్రధానంగా బసవపురాణం, బసవేశ్వర చరిత్ర ఆధారంగా కొనసాగింది. ఇందులోని వస్తువు పాత్రలు దాదాపు అన్నీ చారిత్రిక సంబంధమైనవే. కొన్ని సన్నివేశాలు మాత్రం కల్పితం. ముఖ్యంగా కాకతి ప్రోలరాజు తో యుద్ధ వృత్తాంతం. 

        

కాలచురి వంశానికి చెందిన బిజ్జలుడు కళ్యాణకటకానికి ప్రభువు. మొదట పశ్చిమ చాళుక్యరాజు తైలప దేవుని వద్ద సామంతుడు. తర్వాత తైలప దేవుని వధించి స్వతంత్రుడవుతాడు. ఆ తర్వాత భారత దేశాన్ని కనీసం దక్షిణాపథాన్ని అయినా ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలాలని బిజ్జలుని ఆకాంక్ష. యుద్ధ వ్యూహాలకు కర్త మంత్రి బలదేవుడు. బలదేవుని మరణానంతరం బసవేశ్వరుని మంత్రిగా నియమించాడు బిజ్జలుడు. బసవడు వీర శైవ మత స్థాపకుడు. అతడు మహిమలు కలిగిన వాడిగా పేరొందాడు. బసవని మహిమలను ప్రత్యక్షంగా గమనించాడు బిజ్జలుడు. బసవని మహిమలతో కాకతి ప్రోలరాజు ను ఓడించాలని సామ్రాజ్య విస్తరణ చేయాలని బిజ్జలుడు భావించాడు. ఈ విషయంలో బిజ్జలునికి నిరాశ ఎదురయింది. దీనితో బసవడిపై, శైవులపై వ్యతిరేకత ఏర్పడింది. రాజ్యంలో రోజురోజుకు శైవుల దురాగతాలు పెరిగాయి. వారిని అదుపు చేయాలని బిజ్జలుడు భావించాడు. ఆ సందర్భాల్లో బసవడు శైవులను సమర్థించాడు. శైవులకు అనుకూలంగా బసవడు మహిమలను ప్రదర్శించాడు. శివ భక్తులు అల్లయ్య, మధు పయ్యలు రాజద్రోహం చేశారు. రాజు శిక్ష విధించాడు. శివ భక్తులను రాజు శిక్షించుట శివ ద్రోహం గా బసవడు భావించాడు. రాజును వధించడానికి బసవడు పథకం వేసాడు. రాజ వధకు జగదేవున్ని నియమించాడు. బసవడు లింగైక్యం చెందాడు. రాజుతోపాటు జగదేవుడూ మరణించాడు.


నాటక కథానుగుణంగా అనేక పాత్రలు ఉన్నప్పటికీ బిజ్జలుడు, బసవేశ్వరుడు, జగదేవుడు, నీల, త్రిపురాంతక భట్టు ముఖ్యమైన పాత్రలు. ఈ పాత్రలను చిత్రించుటలో విశ్వనాథవారు ప్రత్యేకమైన దృష్టి కనపరిచారు. త్రిశూలం లోని మూడు మొనల వలె బసవడు, బిజ్జలుడు, జగదేవుడు ఈ నాటకంలో అతి ముఖ్యమైన పాత్రలు. శైవ పురాణాల ఆధారంగా  బసవేశ్వరుడే ప్రధానమైనప్పటికి ఈ నాటకంలో మాత్రం బిజ్జలుడే నాయకుడు. విషాద నాయకుడు. విషాద నాయకుని లో ధీరోద్ధత గుణాలు ఉండాలి. బిజ్జలుని లో ధీరోద్ధత గుణాలు అధికం.  

 

నాటకారంభం మొదటి అంకం లోనే విషాద ఛాయలు కనిపిస్తాయి. మంత్రి బల దేవుని అనంతరం రాజు బిజ్జలుడు బసవేశ్వరుడిని మంత్రి గా నియమించాడు. రాజు బిజ్జలుడు కర్మ మార్గావలంబి. రాజ్య విస్తరణా పిపాసి. బసవేశ్వరుడు భక్తి మార్గావలంబి. స్వార్థ లోభి లక్షణాలు ఉండని శివ దీక్షా పరుడు. తనకు ప్రతికూల లక్షణాలు కలిగిన మంత్రిని నియమిచుకొనుట విషాద సూచనయే. మహిమోపేతుడైన బసవడిని రాజ్య విస్తరణా కార్యానికి పావుగా ఉపయోగించుకోవాలని బిజ్జలుని భావన. సామ్రాజ్య విస్తరణా కాంక్ష వెనుక కేవలం స్వార్థం, దురాశయే కాదు విశాల దృక్పథం ఉన్నట్లు విశ్వనాథవారు రేఖామాత్రంగా సూచించారు. బసవడితో బిజ్జలుడు "బసవా! నా మాటల ధోరణి ని బట్టి నీవు నన్ను దురాశా పరుడనుకొనుచున్నావు. నేను దురాశాపరుడను  కాదు. నీవు సర్వ భారతదేశము నొక్క గొడుగు క్రిందికి దెమ్ము. నన్ను జంపి నీ యిష్టము వచ్చిన వానికి పట్టము గట్టుము. కనీసమొక్క దక్షిణాపథమంతయు నొక్క గొడుగు క్రిందికి దెమ్ము. శైవమో, వైష్ణవమో, బ్రాహ్మణ్యమో  యీ గడ్డ మీద బుట్టిన వారి చేత నీ యిల నేలింపుము." అని పలుకుటలో బిజ్జలునిలోని ఉన్నతాశయం  తెలుస్తున్నది‌.‌‍‌ బిజ్జలుని కాలం నాటికే ఉత్తర భారతదేశం ముసల్మానుల అధీనంలోకి వెళ్లింది. దేశంలో వారుండకూడదు. ఈ గడ్డ లో పుట్టిన వారే ఈ దేశాన్ని పాలించాలి అనే జాతీయ భావనా దృక్పథాన్ని ఇక్కడ విశ్వనాథ వారు సూచించారు.        

 

బిజ్జలుని లోని దోషాలే అతడిని విషాద నాయకునిగా చేశాయి. ఈ దోషాలు మూడు. అవి రాజ్యకాంక్ష, అవిశ్వాసం, పరాశ్రయం. నాటకారంభం నుండి నాటకాంతం వరకు త్రిశూలం కనిపిస్తూనే ఉంది. త్రిశూల ప్రసంగం తోనే మొదటి అంకం ప్రారంభం. తైలప దేవుడు, బిజ్జలులకు మొదటిసారి త్రిశూల దర్శనం అయింది. తైలపుడు  మరణించాడు. రెండోసారి బిజ్జలునికి త్రిశూల దర్శనం అయింది. కాకతీయుల చేతిలో జగదేవుడు పరాజయం పాలయ్యాడు. ఎనిమిదవ అంకంలో మరోసారి బిజ్జలునికి త్రిశూల దర్శనం అయింది. "ఈసారి నేనో జగ దేవుడో " అని భావి విషాదాన్ని వ్యక్తీకరించాడు. ఒకవైపు వీర శైవుల దురాగతాల పై ఆగ్రహం, మరోవైపు బసవడి మహిమలతో శైవులపై అనుగ్రహం. ఇవి రెండూ బిజ్జలునిలో కనిపించే పరస్పర విరుద్ధ గుణాలు. ఈ పరస్పర విరుద్ధ గుణాలే బిజ్జలుని విషాదానికి కారణమయ్యాయి. బిజ్జలుడు విషాద నాయకుడయ్యాడు.

బసవేశ్వరుడు శైవ మత బోధకుడు. మంత్రి బలదేవుని మేనల్లుడు. బలదేవుడు నిష్కామ ప్రవృత్తితో జీవించాడు. బలదేవుని మరణానంతరం బసవేశ్వరుని మంత్రిగా బిజ్జలుడు నియమించాడు. బసవడు అవతార పురుషుడని శివ భక్తుల విశ్వాసం. రాజాంతఃపురం లో రాజుతో చదరంగం ఆడుతూనే వీధిలో ఉన్న గొల్ల కలియంబను రక్షించుట, మాల అయిన శివనాగుమయ్య చేతులనుండి పాలను స్రవింపచేయుట, కాలకూట విషాన్ని వేలాది భక్తులచే త్రాగించుట మొదలైనవన్నీ బసవేశ్వరుని మహిమలు. ఇన్ని మహిమలు కలిగిన బసవడు బిజ్జలుని కోరికను నెరవేర్చలేదు. శైవులకు శైవ భక్తులకు స్వార్ధం లోభం ఉండకూడదనేది బసవేశ్వరుడి అభిప్రాయం. సద్గుణ వంతుడైన బసవని లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి.  ఆ లోపాలు మూడు అవి పరమతాలపై  అసహనం, రాజ్యాన్ని శైవమతం చేయుట, రాజద్రోహం. నాటకం విషాదమయం కావడానికి ఈ మూడు లోపాలు కారణం.


జగదేవుడు బిజ్జలని దండనాయకుడు. పైగా రాజు బిజ్జలనికి మిత్రుడు. మొదట వైదిక మతావలంబి. బసవన్న మంత్రి పీఠం వహించిన తర్వాత మత విషయం పై జగదేవునిలో తర్కం మొదలైంది. మనస్సు వైదిక మతాన్ని తర్కించి సిద్ధాంతం చేస్తున్నది. హృదయం బసవని వైపు లాగుతున్నది అని అభిప్రాయపడ్డాడు. కర్మ ,భక్తి మార్గాల నడుమ హృదయ ఘర్షణ ప్రారంభమైంది. బిజ్జలుని ఆజ్ఞతో హనుమకొండ పై దండెత్తాడు. ఓడిపోయి తిరిగి వచ్చాడు. శివ భక్తుల ఆశీస్సులు ఫలించలేదు. శివ భక్తులను బిజ్జలుడు దూషించాడు. ఓడిపోవుట తన దోషమని, అది బసవేశ్వరుని దోషం కాదని జగదేవుడు ప్రకటించాడు. శివ భక్తుల దూషణలను భరించని బసవడు రాజును చంపుటకు కత్తి దూసాడు. రాజుకు అడ్డుగా జగదేవుడు నిలిచాడు. రాజ భక్తిని ప్రదర్శించాడు. బసవని మహిమలు జగ దేవుణ్ణి ఆకర్షించాయి. కూతురు వివాహ విందు కారణంగా బసవడికి మరింత దగ్గరయ్యాడు. బసవేశ్వరుడు సాక్షాత్తు దైవమని విశ్వసించాడు. ఈ కారణంగా శివ ద్రోహులను చంపుటకు వాగ్దానం చేసాడు. రాజు బిజ్జలున్ని చంపుటకు ఉద్యుక్తుడయ్యాడు. తిరిగి వచ్చే వరకు బసవడిని వేచి ఉండమని అభ్యర్థించాడు. జగదేవుడు తిరిగి వచ్చేలోగా బసవడు లింగైక్యం చెందాడు. జగదేవుడు హతాశుడయ్యాడు. బసవడు మోసగించాడని భావించాడు. తుచ్ఛమైన వాగ్దానం కోసం రాజు బిజ్జలున్ని చంపినందుకు పశ్చాత్తాపం చెందాడు. రాజ వధతో కళ్యాణ కటకం మాత్రమే నశించలేదు. రాజద్రోహం కారణంగా శైవమతం నశిస్తున్నదన్నాడు. జగదేవుడు మరణించాడు.        

నాటకంలో మరో ముఖ్యమైన పాత్ర నీల. నీల పాత్ర చిన్నది. కానీ ప్రయోజనం ఎక్కువ. లీల బిజ్జలుడి పెంపుడు సోదరి. చారిత్రకంగా పరిశీలిస్తే నీల బసవడి రెండవభార్య. కానీ ఈ నాటకంలో ఆ విషయం ప్రస్తావించలేదు. ఆమె కన్నడంలో 988 వచనాలు రచించారు*4*. నీల పై బసవడి ప్రభావం అధికం. విశ్వనాథ వారు ఆమె చేత వివిధ గేయాలను పలికించారు. అవన్నీ శివ భక్తితత్వాన్ని, బసవేశ్వరుడి మహిమలను తెలుపుతున్నాయి. నిర్మలమైన మనస్తత్వానికి నిర్మలమైన భక్తి భావానికి నీల ప్రతీక. బసవేశ్వరుడి మహిమలు బిజ్జలునికి బాహిర ప్రేరణగా నిలిచాయి. నీల భక్తి పాటలు అంతః ప్రేరణ కలిగించాయి. బిజ్జలుడిలో బసవడి గూర్చి, బసవడి మహిమలను గూర్చి అంతః సంఘర్షణ జరిగిన సందర్భాలలో నీల పాత్ర ప్రత్యక్షమవుతుంది. గీతాలను ఆలపిస్తుంది. ఆ గీతాలు భావి కాల కథా విషయాలను సూచిస్తాయి.        

మరొక ముఖ్యమైన పాత్ర త్రిపురాంతక భట్టు. ఈ పాత్ర అతి స్వల్పమైనది. కేవలం కల్పిత పాత్ర . రాజు యొక్క అంతరంగానికి దర్పణం త్రిపురాంతక భట్టు. వైదిక మత సమర్థనకు, బసవడి మహిమలను ప్రశ్నించుటకు ఈ పాత్ర రూపుదిద్దుకున్నది. ఈ నాటకంలో బసవడి మహిమలను హేతుబద్ధంగా ఆలోచింపజేసే పాత్ర.

 

విశ్వనాథవారు ఈ నాటకంలో వైవిధ్యభరితమైన శైలిని ప్రదర్శించారు. ఈ నాటక వస్తువు వీరశైవ పురాణాలకు సంబంధించినది. కావున బసవేశ్వరుని పాత్ర అభినయ ప్రదర్శన సమయంలో వినిపించిన పద్యాలు ద్విపద ఛందస్సులో ఉన్నాయి. రాజు బిజ్జలుడి వచన సంభాషణలు కూడా ద్విపద ఛందో ఛాయలో కొనసాగుతాయి*5*.  ఇది బసవేశ్వరుని యొక్క ప్రభావాన్ని తెలుపుతుంది. సందర్భానుసారంగా పాల్కురికి సోమన బసవోదాహరణము లోని పద్యాలు  ఉపయోగించారు. నీల పాడిన పాటలు దేశి ఛందస్సులో త్రిశ్ర మిశ్ర ఖండ గతులలో ఉన్నాయి. ఆ పాటలలో శైవ పద సాహిత్య  విశేషాలను విశ్వనాథవారు ప్రస్ఫుటింప చేశారు.

 

విశ్వనాథ వారు ఈనాటకంలో వీర శైవ మతాన్ని నేరుగా ఎక్కడ విమర్శించలేదు కానీ బిజ్జలుడు జగదేవుడు త్రిపురాంతక భట్టు పాత్రల ద్వారా వీరశైవ మతం లోని లోపాలను ఎత్తి చూపాడు బిజ్జలుడు జగదేవుడు వారి అంతః సంఘర్షణలో కలిగిన ఆలోచన ద్వారా ఈ విషయం తెలుస్తున్నది. శైవుల దురాగతాలను గూర్చి ప్రజలు రాజుకు ఫిర్యాదు చేస్తారు. అంటే ఆ రోజుల్లో శైవుల పై సమాజంలో కూడా వ్యతిరేకత ఉన్నది అని విశ్వనాథవారు సూచనా మాత్రంగా తెలిపారు.  త్రిపురాంతక భట్టు బసవడి మహిమలను గూర్చి హేతుబద్ధంగా అనేకమైన ప్రశ్నలు లేవనెత్తాడు. ఇవన్నీ శైవ మతం పట్ల ఉన్న లోపాలను తెలుపుతున్నాయి. అయితే విశ్వనాథ వారు నాటకం లో వాదాలు  నిలబడతాయా? అనేది ప్రస్తుతం కాదు. కానీ పాఠకులను మాత్రం తప్పనిసరిగా ఆలోచింప చేస్తాయి. చారిత్రక సత్యాలు మరుగు పరచకుండా  కర్మ మార్గం పట్ల విముఖత లేకుండా సంతులనం  (Balance) గా విశ్వనాథ వారు త్రిశూలం నాటకం రచించారు. తెలుగు నాటక సాహిత్యం లో త్రిశూలం విశిష్టమైనదిగా ప్రశస్తి పొందింది.

******

 

అధఃసూచికలు
*1* నేను-మా అన్న-- విశ్వనాథ వెంకటేశ్వర్లు -- విశ్వనాథ సాహిత్య దర్శనము

*2* సంపత్కుమార - విశ్వనాథ సాహిత్య దర్శనము

*3* విశ్వనాథ వారి నాటకములు – పరిశీలన – ఆర్. కమల

*4* మైసూర్ విశ్వవిద్యాలయం వికీపీడియా కన్నడ

*5* త్రిశూలం నాటకం మూడవ అంకం 36 వ పుట 

bottom of page