Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కవితా  మధురాలు

గాలి నాసరరెడ్డి 

 

వేసవిలో రెండు గీతాలు 

1

 

చెట్టు హృదయమంతా 

నీడలోకి ప్రవహిస్తుంది 

అసలు 

నీడ అనే చెట్టుకి మనమే 

పూలూ పండ్లూ అవుతాం 

 

నీళ్లకు కొత్తగా 

యవ్వనం వస్తుంది 

తమకంలో భార్యను సమీపించినట్టు 

మనమిప్పుడు నీళ్ళని సమీపిస్తాం 

 

కలల్లోకి వంగుతాయి 

నీడల నీళ్ళూ 

నీళ్ళ నీడలూ 

 

2

 

పిల్లలు కాగితప్పడవల్ని 

నీళ్లలో వొదులుతున్నట్టు 

పక్షులు చిన్న చిన్న పాటల్ని 

గాలిలో వొదులుతుంటాయి 

 

పూలూ పండ్లతో చెట్టు 

ఒక గొప్ప స్త్రీలా, ఒక గొప్ప దేశంలా 

కనిపిస్తుంది 

 

నేను చెట్టు కింద పడుకుంటాను 

ఆకాశం నా కింద పడుకుంటుంది. 

 

(19 కవితలు కవితా సంపుటి నుండి)

Gali-Nasara-Reddy_edited.jpg

నిర్వహణ 

విన్నకోట రవి శంకర్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

  నాగరాజు రామస్వామి

కృష్ణ విభావరి 

 

నా రాత్రి మేఘాలు కార్చిన 

కాటుక ధారలో రేయి కరుగుతున్నది,

నేను నిశ్శబ్ద నిశిని మీటుకుంటూ

ఉభయ సంధ్యలను ముడి వేస్తున్న 

నిశీథినీ స్వర లహరిలో తేలుతున్నాను.

 

ఈ పాటపాటంతా చీకటే చీకటి! 

 

నలనల్లని చీజీకటి దిగ్రేఖ మీద నిలిచి 

నిన్నటి పగళ్ళను కడుగుతున్న చీకటిలో చీకటినై 

రేతిరి పాటలను పాడుకుంటున్నాను;

ఎన్ని చీకట్లు చీలితే ఒక శుభ్ర శుభోదయం! 

 

ఈ రాత్రిరాత్రంతా పాటలే పాటలు! 

 

పాటమరపుల మసక దిగంతాలలో మాటమరచి

స్తబ్ధ స్వనాలను అల్లుతున్న రాత్రిలో రాత్రినై 

మౌన గీతాలను వల్లిస్తున్నాను;

ఎన్ని నీరవశబ్దాలు కరిగితే ఒక ఉదయరాగం! 

 

ఈ చీకటి పాటల నిండా నిశ్శబ్దమే నిశ్శబ్దం! 

 

పెదవి విప్పని నేల, కాలు కదుపని నింగి 

కలిసి నర్తిస్తున్న దృశ్యాదృశ్య విభావరిలో 

పరవశ పదజతుల వివశ చరణాన్నై 

ఆడుతున్నాను;

ఎన్ని తడబడు అడుగుల ప్రక్షాళన ఒక నృత్యకేళి! 

 

ఈ కృష్ణ విభావరీ నిశ్శబ్ద సంగీతి నిండా 

పాటకాని పాటనై, ఆటకాని ఆటనై

పాడుతున్నది నేనే, ఆడుతున్నది నేనే! 

పుడమి పాటలు పారుతున్న చీకటి రాత్రినై 

పరచుకున్నదీ నేనే! 

nagaraju.jpg

పాలపర్తి ఇంద్రాణి

తాప ఝరి

సగం సగం

చీకటికే

నీ మాటల 

మాటులకే

పికిలిపిట్ట 

చూపులకే

 

బులబులాగ్గ

మోహాలా

ఒక గుక్కెడు

దాహాలా

 

ఏమైతే

నేమిటిలే

 

నిను తాకని

మునివేళ్ళని

శీతగాలి

కోత పెట్టు

నిను చేరని

నా గుండెని

చలి చీమలు

బాధ పెట్టు

 

తెల్లవారు

తరుణాన

కలల్లోన

తెర్లి తెర్లి

నీ స్మరణే

తెట్టు

కట్టు

 

సూరీడి

బేడీలకి

కనుదోయి

చిక్కువడితే

నీ రూపే

అచ్చు కట్టు

 

నీ ధ్యాసే

అగరు చుక్క

వగరు వక్క

పైడి సిక్క

 

హత్తెరీ!

గది నిండిన

తాప ఝరి

కాంతి ఛురి

 

కాల్చును

నా

కంటి చుక్క!

Indrani_edited.jpg

 

చెట్ల రాజ్యంలో

 

చెట్ల రాజ్యంలో అడుగు పెట్టాను

నిటారుగా సహజ నిగనిగలతో నిల్చుని 

పచ్చని స్వాగతమిస్తున్న చెట్లు 

అభయ గీతం ఆలపించే

దృఢచిత్తపు దయామయ సైనికులు

 

అరవై ఒకట్లో కాదు ఇపుడే జన్మెత్తినట్లు

ఎత్తీ ఎత్తగానే పుడమి మీద నడకను 

అధాటున అనాయాసంగా ఆరంభించినట్లు

దర్శించడమనే  మనోనేత్రవిద్య నాలో

ఈ నిరుపమాన హరిత వాటికలోనే మొదలైనట్లు

నాలో ఒక దట్టమైన పులకరింత  

 

ఏ ప్రాచీన యుగం నుంచో విలసిల్లుతున్న ఈ రాజ్యం

నా కోసమే హృదయ శాఖల్ని చాచి వేచి వున్నట్లు

తన ఆత్మ ఛాయను ప్రియకానుకగా ఇవ్వదలచినట్లు

నన్ను తనతో అల్లుతూ అలంకరించదలచినట్లు 

నాలో ఒక రంగుల వూహ

 

నా మీది దళసరి  బెరడు రాలిపోయి

మెత్తని పొరేదో నన్ను చుట్టుకున్నట్లు

ఏ ధూళి కణమూ అంటని పచ్చని పవనం

నాలోకి మెల్లగా మెత్తగా వీస్తున్నట్లు 

లోకానికి తొలిపరిచయమవుతున్న చిగురు లాగా 

కాలం నా ముందు విప్పారుతున్నట్లు

నాలో ఒక మృదులాలోచన ! 

 

ఇచ్చే మహత్వ తత్వమే ఆత్మ అయిన

ఈ పరమోదార  విశాలాశ్రమాన్ని  చేరడానికే

ఎన్నిన్ని జన్మల్నో దాటి వచ్చినట్లు 

మనసు మోస్తున్న సంక్లిష్ట చింతనా భాండాన్ని

నిస్సంకోచంగా దించుకొని ఊరడిల్లమని 

ఈ వనస్థలి పత్రాల్ని వీవెనల్లా వూపుతూ చెబుతున్నట్లు

నాలో ఒక జ్ఞానోదయ వీచిక!

 

నిమ్మళ పడుతున్నాను 

ఈ సంకీర్ణ  మాంత్రిక మనోజ్ఞ లోకంలో

భిక్షువులా తిరుగుతూ -

ఇష్ట కీర్తనలను ఈ నీడల్లో  ఇట్లాగే పాడుకుంటూ  

కొంతకాలం నేనిక్కడే తప్పిపోతే 

ఎంత బాగుండు! 

దర్భశయనం శ్రీనివాసాచార్య

darbasayanam_edited.jpg

  నాగరాజు రామస్వామి

బ్లడ్ మూన్

 

ఇటు 

ఇంకీ ఇంకని సూర్యుడు

అటు ఇంకా నేలకు దిగని చంద్రుడు

ఇది రక్త కుంకుమల సమరసంధ్య.

 

ఇది వెన్నెలా కాదు, 

ఈ పున్నమి పున్నమీ కాదు. 

 

నేల నీడలు కోసిన

గ్రహణ చంద్రుడు రెడ్ మూన్;

రక్తఛాయల గ్రహగోళం. 

 

నీడలు అన్ని వేళలా నీడలు కావు, 

ఒక్కోసారి నీడలు నిశిత ధారలు;

కత్తి అంచు మీద రక్తబిందువులు.

 

కొన్ని నక్షత్రాలు 

మెదడులో మొలచీ మొలవగానే 

భగ్గుమంటవి;  

కొన్ని పున్నమలు బ్లడ్ మూన్స్.

 

అడ్డులేని ఆకాశం,

హద్దు దాటిన శతఘ్ని,

కుప్పకూలిన భవనం కింద 

కొడగడుతున్న ప్రాణ దీపం.

 

ఇది 

నెత్తురోడుతున్న కత్తి కోతల కాలం!

రక్తంలో మునుగుతున్న రాకాశశాంకుడు!

 

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం!

 

ఇదేం కొత్త కాదు;

హిట్లర్లు పుడుతుంటారు, చస్తుంటారు;

శారదాకాశం మీద 

రుధిర చంద్రులను రువ్వుతూనే వుంటారు.

nagaraju.jpg