top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

మధురవాణి ప్రత్యేకం

అధ్యాత్మికం

దోబూచులాట

ఎర్రాప్రగడ రామకృష్ణ

ఒక్కోసారి ఎవరినో చూడగానే, బాగా పరిచయం గల మొహంలా అనిపిస్తుంది. ఎంత ఆలోచించినా  ఎక్కడ, ఎలా తెలుసో వెంటనే గుర్తు రాదు. మనసు ఎంతోసేపు గింజుకుంటుంది.

అది ఎలాంటిదంటే - రేడియోలో మీట తిప్పుతుంటే, ఎక్కడో చక్కని పాట వినవస్తుంది. 'ఇది పాటల వివిధభారతి' అనుకొంటాం. మళ్ళీ ఎప్పుడో కావాలనిపించి, ఎంత వెతికినా ఆ స్టేషన్ తగలదు. మనసు ఉసూరుమంటుంది.

ఇలా ఏదో ఒకానొక సదభిప్రాయంతో సహా, ఓ తీపి జ్ఞాపక శకలం పూర్తిగా రూపుకట్టుకోకుండా కలవరపెడుతుంది. వ్యక్తుల పట్ల ఏర్పడే ఆ సహృదయ మైత్రీ భావాన్నే 'జననాంతర సౌహృదం' అంటాడు కవి కాళిదాసు.

ఒక మంచి మనిషి గురించి ప్రసంగించబోయే ముందు రాత్రి, అతణ్ని మానవ ఇతిహాసాల మహా సౌందర్యానికి చెందిన మనోజ్ఞ ప్రతినిధిగా నిరూపించే మహత్తర వాక్యం ఏదో చప్పున స్ఫురిస్తుంది. అందువల్ల అనేకమందికి నిద్ర తేలిపోయి, ఆ వాక్యాన్ని తక్షణం ఎక్కడో ఒకచోట రాసిపెట్టుకునేదాకా మనసు కుదురుగా ఉండదు. రాశాక విశ్రమిస్తే, ఆ తరవాత తృప్తిగా నిద్రలోకి జారుకోవడం సంభవిస్తుంది.

తీరా ప్రసంగ సమయానికి ఆ వాక్యం ఎంతకీ జ్ఞాపకం రాదు. మరపు తటస్థిస్తుంది. ఉపన్యాసం ముగించి వేదిక దిగిపోగానే, ఏదో తరిమినట్లుగా తిరిగి అదే వాక్యం గుర్తుకొస్తుంది. మనసు ఏదో అసంతృప్తికి లోనవుతుంది.

కలల విషయంలోనూ అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. పీడకలలు వచ్చినప్పుడు తప్ప, తీపి కలలొచ్చినపుడు మనిషికి నిద్ర నుంచి మెలకువ రాదు. ఒకవేళ వస్తే, అది కలే అనే సంగతి తెలిసొచ్చి మనసుకు కష్టంగా తోస్తుంది. 'అదేదో మరి కాసేపు మెలకువ రాకున్నా బాగుండేది' అనుకుంటాడు మనిషి!

ఇదంతా మనిషికి, మనసుకు; లేదా బుద్ధికి, మనసుకు మధ్య నడిచే ఓ దోబూచులాట. మాయ మనసు ఇలా మనిషిని, బుద్ధిని ఒక ఆట ఆడిస్తుంది. అది మనిషికన్నా వేరుగా ప్రవర్తిస్తుంది. ఒక్కోసారి ఆత్మ విషయంలోనూ జోక్యం చేసుకొని, చొరవగా చొరబడుతుంది.

స్వప్నంలోనో, ధ్యానంలోనో అరుదుగా ఆత్మకు, పరమాత్మకు అనుసంధానం కుదురుతుంటుంది. అటువంటి మహత్వపూర్ణ క్షణాలు కొన్ని, ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి. ఆ మధుర క్షణాల్లో ఆత్మ ఒకానొక బ్రహ్మకమలపు దివ్య సౌరభాల ఆస్వాదనలో మునిగి తేలుతుంటుంది. పరమాత్మ పరిష్వంగంలో రమిస్తూ ఉంటుంది.

అదే సమయంలో సీతారాముల మధ్యలోకి చుప్పనాతిలా మనసు చొరబడి, సమాధి స్థితిని భగ్నపరుస్తుంది. ఆనందాన్ని పటాపంచలు చేస్తుంది. భావనామయ పావన జగత్తు నుంచి లౌకిక ప్రపంచంలోకి క్షణంలో లాక్కొని వచ్చేస్తుంది. ఆత్రంగా తియ్యని చనుబాలు తాగుతున్న పసివాణ్ని అమ్మ నుంచి వేరు చేసినట్లుగా, ఆత్మ తిరిగి పరమాత్మతో అనుసంధానం కోసం తహతహలాడుతుంది. అంతలోనే మాయలో పడిపోతుంది. ఆ వెంటనే మరిచిపోతుంది. మనసు ఆటల్ని కట్టడి చేయాలంటే, జ్ఞానం ఒక్కటే ఆయుధం. రేడియో విషయంలో యాంటెన్నా ఎలాంటిదో, మనసు పట్ల జ్ఞానం అలాంటిది. యాంటెన్నాను సరైన దిశలో స్థిరంగా అమర్చుకోగలిగితే, నిరంతరం మధుర గీతాల్ని ఆలకించే భాగ్యం దక్కుతుంది.

 

మనసు సైతం అంతే! జ్ఞానాన్ని అనుసరిస్తే.

*****


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page