top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

జులై - సెప్టెంబర్ 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

“దీప్తి” ముచ్చట్లు

ఉండాల్సినవారే!

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

 "ఆలోచించకు! ఒక్కసారిగా దూకేయ్!"

 

ఉలిక్కిపడ్డాను. పరిగెడుతున్న రైలులో తలుపు దగ్గర నిలుచుని బయటకి చూస్తూ ఏదో ఆలోచనల్లో ఉండి, నా పక్కనే నిలబడి ఉన్న మనిషిని గమనించలేదు. తెల్లని కుర్తా, నెరిసిన గడ్డం, తీక్షణంగా చూస్తున్న కళ్ళు, చేతిలో పుస్తకం. తెలివిడి, తేజస్సు పుష్కళంగా ఉంది ఆ మొహంలో. 

 

ప్రశ్నార్థకంగా చూసాను అతని వైపు.

 

 అతను మళ్ళీ అదే అన్నాడు. "దూకాలనుకుంటే దూకేయ్!"  

 

"దూకాలని ఏమీ అనుకోవట్లేదు? "  నా సమాధానం విని, నన్ను తేరిపారా పరిశీలించి చూసి వెళ్ళిపోయాడు.

 

గట్టిగా హ్యాండిల్ పట్టుకుని, సర్దుకుని నిల్చుని, మళ్ళీ బయటివైపుకి దృష్టి సారించాను.   

 

బూడిద రంగు వీడి నీలి రంగులోకి మారుతున్న మేఘాలు. వేసంగి తరువాత కురిసిన చిరుజల్లులతో వాతావరణంలో ఎంత మార్పు? ఇపుడిపుడే వీస్తున్న చల్లని గాలి. గాలిలో చేరిన ఆ కాసింత చెమ్మతోనే నలుపుని కడుక్కుంటూ ఆకుపచ్చని చివుర్లు తొడుక్కుంటున్న చెట్లు, ఉత్సాహం తొణికిసలాడుతున్న పరిసరాలు! స్తబ్ధతని కరిగించేందుకు కావల్సిందల్లా కాసింత చెమ్మ. కాస్తంత నీరు.

 

 "మొయిలు దోనెలలోనఁ బయనం బొనర్చి, మిన్నెల్ల విహరించి మెఱుపునై మెఱసి, పాడుచుఁ జిన్కునై పడిపోదు నిలకు" మళ్ళీ సన్నగా తుంపర మొదలవుతుంటే కృష్ణశాస్త్రి పదాలు మెదిలాయి. ప్రకృతి ఆసాంతం ఇంతగా సంబరపడుతుందంటే చినుకుగా మారటమెంత ఆనందమో కదా? ఎంత అదృష్టమదీ?  

 

ఎంత సేపు అలా బయటకి చూస్తూ గడిపానో! వర్షం మళ్ళీ పెద్దదవబోతుంటే వచ్చి నా సీట్లో కూర్చున్నాను. పాత ఇంటి స్థలాన్ని అమ్ముదామనుకుంటున్నామంటూ అమ్మ రమ్మంటే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లో ఊరికి బయల్దేరాను.  ఆఫీసు పనులతో పాటు నేను స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఆశ్రమంలో కూడా బోల్డన్ని పనులున్నాయి. ఈ నెలలోనే ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉంది. వాటికి సంబంధించిన పనులవీ సాగుతున్నాయి. అన్నీ వదిలేసి ఉన్నపాటుగా ఊరికి వెళ్ళటం ఇబ్బందే. అమ్మకాలంటే అంతా వాళ్ళే చూసుకునే పని. ఎటొచ్చీ, "అమ్మేముందు సరదాగా మన స్థలంలో రెండురోజులు గడుపుదామని పిలిస్తే బాబాయిలందరూ వీలు చేసుకుని వస్తున్నారు. మీరిద్దరూ వస్తే అందరినీ కలవొచ్చు!" అన్న ఒక్క మాటతో గెలిచేసింది అమ్మ. అయినా, ఎక్కడున్నా ఫోన్లతో సగం బయట పనులు కానిచ్చేయటం మప్పి వెళ్ళింది కదా కరోనా? ఫోన్ల మీదే ఆశ్రమం పనులూ చేయొచ్చనే ధైర్యంతోనే ఇలా బయల్దేరాను. సిద్ధార్థ రేపటివరకూ వస్తానన్నాడు.

 

ఏదీ తోచక బ్యాగులో కనబడుతున్న పుస్తకాల్లోంచి ఓ పుస్తకం తీసాను. ఆల్బర్ట్ కమూ రాసిన "The Fall"  పుస్తకం. సిద్ధార్థ సర్దిపెట్టాడు నా బ్యాగుని. అతని కలెక్షన్ లోని పుస్తకమే ఇది. లేదంటే, ఈ ఫిలాసఫీ పుస్తకాలు నాకేమంతగా ఎక్కవు. తత్వాలన్నీ ఏ వేత్తలో చెప్పాలా? ఎవరికి వారు ఓ సారి మనసులోకి తొంగి చూసుకుంటే చాలదూ? తరచి చూసుకుంటే తగలని తత్వమేదనీ? ఓ సారి అదే మాటంటే సిద్ధార్థ అన్నాడు."ఆ తరచి చూసుకునే పరిణతి ఊరికే రాదోయ్. చదవాలి లోకాన్ని. పుస్తకాలలోనో, జీవితాలలోనో!" 

 

ఆ మాటలు గుర్తొచ్చి నవ్వుకుంటూ పుస్తకం తెరవబోతూ ఆ పుస్తకం కవర్ పేజీ మరోసారి చూసాను. చిత్రంగా ఇదే పుస్తకం కదూ ఇందాక ఆ తెల్ల కుర్తా మనిషి పట్టుకుని ఉందీ? ఒక ఆసక్తి ఏదో కలిగి, చటుక్కున లేచి ఇందాకటి తలుపు వద్దకి వెళ్ళిచూసాను. ఆ వ్యక్తి కనబడలేదు. ఓ సారి కంపార్టుమెంట్ అంతా యధాలాపంగా తిరిగి చూసాను. అతనేమయినా కనబడతాడేమోనని. ఎక్కడా కనబడకపోవటంతో నిరుత్సాహంగా నా సీటు వద్దకి వచ్చేసాను. సీటు వద్దకు వస్తూనే ఫోను. అమ్మ నించి. 'ఎక్కడివరకూ వచ్చావం'టూ? "ఇప్పుడే నడికుడి దాటింది. మరో రెండున్నర గంటల్లో ఇంట్లో ఉంటానమ్మా!" ఫోన్ పెట్టేస్తూ గమనించాను. నా బ్యాగ్ లో ఫోన్ వారగా పడి ఉన్న ఒక కవరు. తెరిచిచూస్తే అందులో చాక్లెట్లు. నేను వెళ్ళగానే ఇంట్లో పిల్లలుంటారన్న విషయమూ గుర్తులేనంత హడావిడిగా గడిపాను ఈ రోజు. సిద్ధార్థకి మాత్రం ఎంత పనున్నా నాకు సంబంధించిన ప్రతీదీ గుర్తుంటుంది. వాటిని అలాగే  బ్యాగులోనే దాచేసి బలవంతంగా పుస్తకం తెరిచేందుకు ప్రయత్నించాను.

 

దృష్టి పుస్తకం పైనే కానీ, ధ్యాస మాత్రం ఎదురుగా ఉన్న ఒక జంట మొహంలో వేదనపైనే ఉంది. వదనాలపై వేదన తాలూకు నీడలు కనబడితే అది ఎవరైనా సరే, కారణం తెలుసుకోవాలనుంటుంది. కొంతైనా ఆ మొహాలపై దిగులుని తొలగించాలని ఉంటుంది. సంభాషణల్లోకి అనుమతి లేకుండా దూరటం సంస్కారం కాదు కదా? కానీ, సంస్కారమొకటే అందరి బాధలూ తీర్చదుగా? అప్రమేయంగా నా చెవినబడ్డ వాళ్ళ మాటల్లో అర్థమైన విషయం ఆ అమ్మాయి వైద్యానికి సరిపడా డబ్బులు లేవని. ఎంతయితే సరిపోతుందో అర్థమవకున్నా ఆ జీవితాలని నిలిపేందుకు ఓ ఉపాధి సరిపోతుందనిపించింది.

 

పుస్తకం మూసేసి, ఆ అమ్మాయిని కదిలించాను. నాకు కావాల్సిన వివరాలు అందాక, నమ్మకం కుదిరాక, నా కార్డు తీసి అందిస్తూ చెప్పాను. "మాకు తెలిసిన వాళ్ళకి డ్రైవర్ అవసరం. జీతం పాతికవేలు. మీకు ఎవరైనా తెలిస్తే ఫోన్ చేయమనండి!" అని. వాళ్ళిద్దరి మొహాల్లో ఆశ్చర్యం. ఊహించినట్టే ఆ యువకుడు అందుకున్నాడు. "నేనూ ఉద్యోగానికై ఎదురుచూస్తున్నాను. కారు డ్రైవర్ గా అనుభవమూ ఉంది. ఒక మాట చెప్పి నాకిప్పించగలరా?" అతని కళ్ళలో అర్థింపు. "తప్పకుండా!" నా మాటతో ఆ అమ్మాయి కళ్లలో చెమ్మ! ఇద్దరి మొహాల్లో తళుక్కున మెరిసిన ఓ వెలుగు రేఖ. 

 

తిరిగి పుస్తకంపై దృష్టి నిలుపగలతాననే అనుకున్నాను. కానీ, మళ్ళీ ఆ తెల్లా కుర్తా మనిషి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. "నువ్వు దూకొద్దు. ఉండాల్సినదానివే." గొణుగుతున్నట్టు అన్నా స్పష్టంగా వినబడింది. నాకు ఈ సారి పెద్దగా ఆశ్చర్యమవలేదు. మాటలు మునుపటంత మార్మికంగానూ తోచలేదు. ఎవరైతేనేమి? ఇతనూ ఓ మనిషి, అంతే కదా. కాకపోతే అతని వెనుక కథ ఏమయుంటుందా అన్న ఆసక్తి కలిగింది. అతను కుదురుగా రెండు నిమిషాలయినా కూర్చోలేదు. మళ్ళీ తలుపు దగ్గరున్న మరో మనిషి వద్దకి వెళ్ళి "దూకాలనుకుంటే దూకేయ్!" అనటంతో నాకు ఆసక్తి పెరిగింది. మనిషే కానీ, మామూలు మనిషి కాదు. ప్రత్యేకంగా ఉన్నాడు. ఇతను సాధారణ జీవితం గడిపేందుకు ఎప్పటికయినా ఏమయినా చేయగలమో?

**

 

సమయం, రైలు పోటాపోటీగా పరిగెత్తాయేమో, నేను దిగాల్సిన స్టేషన్ రావటంతో అప్పటికి ఆలోచనలనీ బ్యాగుతో పాటే సర్దేసి రైలు దిగి స్టేషన్ బయట ఓ ఆటో పట్టుకున్నాను.

 

ఇంటి దగ్గర   ఆటో దిగుతున్న నన్ను పక్కింటి జయత్తయ్య తన శైలిలో పలకరించింది. "ఏంటి పావనీ, కారులో రాలేకపోయావా? రైలుబండిలో పాట్లు పడుతూ ఎందుకూ?" 

 

నన్ను చూడగానే విప్పారిన మొహంతో ముంగిట్లోకి వచ్చి బ్యాగందుకుంటూన్న అమ్మ మెత్తగా మందలించింది జయత్తయ్యని.

"మూణ్ణెళ్ళవలేదూ అది ఊరికి రాక? వచ్చినదాన్నిఎలా వున్నావని అడగొద్దూ? ఎలా వచ్చిందో ఆరాలు తీస్తూ విసిగించకుంటే?"

 

జయత్తయ్య నేను కట్టుకున్న సాదా చీర మీది నుంచి కష్టంగా చూపు తిప్పుకుంటూ బలవంతంగా నవ్వింది. "బాగుండాలనేగా నేనూ కోరుకునేది" అంటూ నన్ను చూసి అభిమానంగా నవ్వింది. నిజమే, జయత్తయ్యకి నేనంటే ప్రేమ. ఆ ప్రేమతో నేను బాగుండాలనే అనుకుంటుంది. ఎటొచ్చీ ఆమె దృష్టిలో బాగుండటం అంటే డబ్బులో ఉండటం. డాబుగా ఉండటం. పాపం, లోకంలో తొంభయి తొమ్మిదిశాతం మనుషులకి మల్లేనే కాగితపు కరెన్సీని మించి వేరే ఐశ్వర్యం తెలీని అమాయకురాలు. అది తెలుసు కనుకేమో మరి, నాకు జాలే తప్ప ఏ చిరాకూ కలగదు. చిరునవ్వునవ్వి,'ఎలా ఉన్నావ'త్తయ్యా అంటూ అభిమానంగా పలకరించి, ఇంటి అరుగుకి ఆనుకుని ఉన్న గాబులోంచి నీళ్ళు తీసుకుని, కాళ్ళు, చేతులు కడుక్కున్నాను లోపలికి వెళ్ళేందుకు. గాబులో వర్షపునీళ్ళు కలిసినట్టున్నాయి. చల్లగా తగిలాయి నీళ్ళు. సేదతీర్చేలా.  

 

నడవాలో అంతా కోలాహలంగా ఉంది. ముగ్గురు బాబాయిలూ, పిన్నులూ, పిల్లలూ కూర్చుని సందడిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను లోపలికి అడుగుపెడుతూనే ప్రేమగా నా చుట్టూ చేరి సంతోషంగా పలకరించారు. నా బ్యాగులో చాక్లెట్లు పిల్లలకి అందించాను. హేమపిన్ని మెత్తని తడి చీర చుట్టిన మట్టి కుండలోనించి ఓ చెంబు నిండా చల్లని మంచినీళ్ళు తెస్తూ - "ప్రయాణంలో అలిసిపోయుంటుంది. మరీ మంచినీళ్ళయినా తాగనీయకుండా అక్క మీద పడతారేంటే" అని పిల్లలని మురిపెంగా విసుక్కుంటూ మంచినీళ్ళు అందించింది. చల్లగా గొంతులోకి నీళ్ళు వొంపుకున్నాను. చెంబుడు తీయటి నీళ్ళు తాగాక గానీ తెలీలేదు, దాహంతో గొంతు ఎండిపోయి ఉందని.

 

అందరూ కనబడ్డా నాన్న కనబడకపోవటంతో అమ్మ వేపు చూసాను. "ఆ పాత ఇంటి స్థలం అమ్మే ముందు, రేపు ఉదయం కాసేపు అక్కడే గడుపుదామంటున్నారు. వర్షాలు పడి చల్లగా ఉంది కదా? రేపు రిజిస్ట్రేషన్ ముందుగా సరదాగా అక్కడే భోజనాలు చేద్దామంటూ అక్కడ ఏర్పాట్లు చేయిస్తున్నారు" అని చెప్పింది. 

 

"చీకటి పడింది. పురుగో, పుట్రో ఉంటుంది, ఇంటికి వచ్చేయమని చెబుదామమ్మా. నేనొచ్చానని చెబితే వచ్చేస్తారు, నేనే ఫోన్ చేస్తాను" అంటూ నాన్నకి ఫోన్ చేసాను. నేనన్నట్టే మరి కొన్ని నిమిషాలలో ఇంట్లో ఉన్నారు నాన్న. నాన్నలంతేగా. ఏ పని కన్నా కూతురి మాటే ఎక్కువ మరి!

**

 

భోజనాలయ్యాక అందరమూ డాబా మీదకి చేరాము. చుట్టూ ఉన్న కొబ్బరి చెట్ల నీడలు జాబిల్లి వెలుగుతో దోబూచులాడుతూ పొడి గోడల మీదుగా తడిగచ్చుపై పడి తళుక్కుమంటున్నాయి. వర్షం పడి అంతా తడితడిగా ఉందంటూ సాయంత్రమే డాబా మీద కుర్చీలు వేయించిందట అమ్మ. వర్షానికి రాలిన మల్లెపూలు గాలికి అక్కడక్కడా విసిరేసినట్టు పడున్నాయి. ఎవరైనా తొక్కుతారేమోననిపించి అన్నీ వెళ్ళి ఏరుకొచ్చి లతపిన్ని దోసిట్లో పోసాను. వాటినే ఓ చిట్టి మాలగా అల్లి నా తల్లోనే పెట్టింది. గుప్పెడు పూలే కానీ వాటి పరిమళం మాత్రం మనం అనుభూతించగలిగినంత!

 

మధ్యాహ్నపు ఎండకు వేడిగా ఉన్న గచ్చు పై పడిన వర్షపు నీరు త్వరగానే ఆవిరై, ఆరినట్టనిపించిన చోటల్లా చాపలు, దిండ్లు పరుచుకుని కూర్చున్నాము. నలభయిల్లోనే నడుము నొప్పులతో వేసారుతున్న వసుపిన్నీ, లతపిన్నీ కుర్చీలే హాయనుకున్నారు. మా పక్కగా జరుపుకుని కూర్చున్నారు.  

 

అర్ధరాత్రయినా కిందికి వెళ్ళి పడుకోవాలన్న ధ్యాస రానంతగా ముచ్చట్లు. తేదీ మారుతూంటే కూడా పిల్లలు చెవులప్పగించి ఆసక్తిగా కబుర్లు వింటూ కూర్చుని, నిద్ర ఊసు ఎత్తకపోవటంతో లతపిన్ని మెల్లిగా పిల్లలని లేవదీసి, నిద్రపుచ్చుతానంటూ ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఆ వెనుకే దోమలు కుడుతున్నాయంటూ వసుపిన్ని కూడా. ఆపై నిద్రకి మేము గుర్తొచ్చి, ఆవులింతలతో ఆడుకుంటూంటే తప్పక కిందికి దిగామందరమూ.

 

 నా గదివద్దకి వచ్చేసరికి నాలుగు మిస్సుడ్ కాల్స్ సిద్ధార్థ నుంచి. కనీసం చేరానన్న విషయమూ చెప్పలేదన్న విషయం గుర్తొచ్చి ఇబ్బందిగా అనిపించింది. వెంటనే మెసేజ్ చేసాను సారీ చెబుతూ. సమయానికే చేరానని చెబుతూ. అర్ధరాత్రయినా పడుకోలేదనుకుంటా, ఠక్కున రిప్లయ్ వచ్చింది. ఫర్లేదంటూ, ఓ స్మైలీ ఎమోజీ జతగా.

**

 

తెల్లారి లేస్తూనే స్నానాలవీ అయ్యాక, అమ్మకి సాయం చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. శ్యామలమ్మగారు ఉన్నారక్కడ. పండుగలకీ, పెళ్ళిళ్ళకీ ఆవిడే పెద్ద సాయం. చుట్టుపక్కల నాలుగూళ్ళలో ఏ పెద్ద కార్యక్రమమైనా శ్యామలమ్మగారి వంటలే. ఆప్యాయంగా పలకరించి, కాఫీ అందించి మా ఆశ్రమం సంగతులడిగారావిడ. వంటింట్లో గట్టుపై కూర్చుని కాసేపు మాట్లాడాను. ఇంటివారు ఎంత హడావిడి పెట్టినా, నిమ్మళంగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళతారు. మొహంలో ఏ మూలా పని పూర్తవుతుందో లేదోనన్న ఆందోళనే ఉండదు. ఎంత పనున్నా, పద్ధతిగా, ఇష్టంగా పనిచేసుకుంటూ వెళ్ళే విధానం చూడటానికే అబ్బురంగా తోస్తుంది.  కార్పోరేట్ ఉద్యోగులకి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్సులు ఈవిడతో ఇప్పించాలి. అదే మాటన్నాను ఆవిడతో. నవ్వి ఊరుకున్నారు. వాళ్ళబ్బాయికి నా వద్ద గారాబం ఎక్కువ. బయట పిల్లలతో ఆడుకుంటున్న వాడల్లా నన్ను చూస్తూనే పరిగెత్తుకొచ్చి నన్ను ప్రేమగా తట్టాడు. శ్యామలమ్మగారికి ఒకడే అబ్బాయి. డిఫరెంట్లీ ఏబుల్డ్. మానసికంగా అందరిలా ఎదగలేదని దిగులు పడకుండా శ్రద్ధగా వాడికి అన్నీ నేర్పుకుంటారు. ఆవిడ సమక్షంలో ఉంటే వాడిలోనే కాదు, మనలోనూ ఎంత ప్రశాంతత వచ్చి చేరుతుందో. వైబ్స్!

 

వంటలవుతూనే అందరూ పాత్రల్లో సర్దేసి పాత ఇంటి స్థలానికి బయల్దేరారు. మా చిన్నప్పటి పాత ఇల్లు అది. ఇల్లు చిన్నదయినా చుట్టూ స్థలం దాదాపు ఎకరం వరకూ ఉంటుంది.  నా పెళ్ళికంటూ అమ్ముదామని అట్టే పెట్టిన స్థలం అది. కానీ, నా ఆలోచనలకి తగ్గట్టుగానే తారసపడ్డ సిద్ధార్థ కూడా మా పెళ్ళి ఆడంబరాలు లేకుండా గుడిలో సంప్రదాయబద్ధంగా, దగ్గరి బంధువుల సమక్షంలో ఆహ్లాదంగా జరిపించాలని కోరటంతో,  కట్నకానుకలన్నిటినీ మృదువుగా తిరస్కరించటంతో ఈ ఇల్లు అమ్మాలన్న ఆలోచన విరమించుకున్నారు. కాకపోతే గత కొన్నేళ్ళుగా ఆ చుట్టుపక్కలన్నీ మంచి రేటు పలుకుతూండటంతో అమ్ముదామంటూ అమ్మ పోరు పెడుతున్నా, నాన్న దాటేస్తూ వస్తున్నారు.

 

పాత ఇల్లు చేరేసరికి అక్కడి పరిసరాలు ఊహించనంత కళని సంతరించుకుని ఉన్నాయి. ఇంటినీ, ఇంటిచుట్టు పరిసరాలనీ శుభ్రం చేయించి రకరకాల మొక్కలు పెంచారు. అందమైన ఫార్మ్ హౌస్ లా కళలీనుతుంది. కంపౌండ్ వాల్ చుట్టూరా చాలా చెట్లు చక్కగా కత్తిరించబడి, కవాతు ముందు కుదురుగా నిలబడ్డ సైనికుల్లా వరుసగా బారుగా కనబడుతూ పచ్చగా తలలూపుతున్నాయి. బహుశా నేను గమనించకపోయుండాలి. ఈ స్థలం అమ్మేందుకు చాలా రోజులనించీ సన్నాహాలు చేసినట్టున్నారు.

 

ఏదేమైనా, ఈ రోజు ఈ హడావిడి మాత్రం కాస్త చిత్రంగా ఉంది.  "వదలలేకపోతున్నారా నాన్నా?" మెల్లిగా అడిగాను. ఆయనెపుడూ ఇలా పాత ఇంటిపై ఇంతలా ఆపేక్ష చూపించిన గుర్తు లేదు మరి. నాన్న నవ్వారు. "అదేమీ లేదురా కన్నా. నిజానికి ఇంటికి కొత్త కళ రాబోతుందని సంతోషమే ఇదంతా. ఇల్లు ఎవరిదయినా అంతే ఇష్టంగా చూసుకుంటారు కదా? ఇల్లయినా, స్థలమైనా మనదే అయుండటం కన్నా కూడా ఎవరయినా సంతోషంగా ఉండటమే ముఖ్యం కదా" అన్నారు. అవునన్నట్టుగా తలూపాను. "ఎందుకో వదలలేకపోతున్నారా అనిపించింది" అని గొణిగాను. "అదేమీ లేదు. ఇష్టంగా వదులుకునే అవకాశం వచ్చింది. ఆ ఆనందమే ఇదంతా!" అన్నారు నవ్వుతూ.

 

అక్కడే ఉన్న వసుపిన్ని నాన్నగారిని ఆటపట్టించింది. "బావగారు మంచి బేరం వచ్చిందని సంతోషంలో ఉన్నట్టున్నారు. మా అందరికీ పట్టుబట్టలు పెట్టి పంపాలి మరి!" అంటూ. ప్రతిగా మనసారా నవ్వేసారు నాన్న.

 

భోజనాల సమయానికి సిద్ధార్థ కూడా వచ్చారు. సిద్ధార్థతో పాటు విక్రం కూడా. సిద్ధార్థ, విక్రం చిన్ననాటి స్నేహితులు. విక్రం స్థాపించిన ఆశ్రమంలోనే నేను ఖాళీ సమయాలలో వలంటీర్ గా పనిచేస్తున్నది. సిద్ధార్థని కలిసిందీ అక్కడే. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని విక్రం కూడా అమితంగా ఇష్టపడతాడని తెలిసే తీసుకొచ్చి ఉంటాడు సిద్ధార్థ. పలకరింపులయ్యాక, అక్కడే విస్తారంగా పెరిగి ఉన్న అరటి చెట్ల ఆకులు కోసితెచ్చి వాటిని ప్లేట్లపై ఉంచి వడ్డించారు బాబాయిలు. అందరం కలిసి తినటం పూర్తయ్యాక చెప్పాడు విక్రం. ఆ పాత ఇల్లు నాన్న ఆశ్రమానికి బహుమతిగా ఇస్తున్నారని. డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలకి చదువుతో పాటు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు అనువుగా ఈ స్థలంలో నిర్మాణాలు చేయబోతున్నామని. ఆశ్చర్యంగా చూసాను నాన్న వైపు.

 

నాన్న  నన్ను చూసి  పుట్టినరోజు శుభాకాంక్షలని చెబుతూ నవ్వితే నా బుర్ర వెలిగింది. ఏం జరుగుతుందో స్ఫురించగానే కళ్ళల్లోకి నీళ్ళొచ్చేసాయ్. అమ్మ దగ్గరికొచ్చి చెప్పింది. "నీ పుట్టినరోజు కానుకగా నీ చిన్నతనం గడిచిన ఈ ఇల్లు గిఫ్ట్ డీడ్ చేయించాలనుకున్నాము. సిద్ధార్థకి చెబితే నువ్వు కొన్నిరోజులుగా ఆశ్రమం విస్తరణ కోసమని చేస్తున్న ఫండ్ రైజింగ్ కి ఇచ్చేందుకు డబ్బులు కూడబెడుతున్న విషయం చెప్పాడు. ఆ కారణానికే ఈ ఇల్లూ ఉపయోగపడితే ఎక్కువ సంతోషపడతావంటే నిజమే అనిపించీ!" అమ్మ చెబుతూంటే సంతోషంతో గట్టిగా హత్తుకున్నాను.

 

"ఉండాల్సిన వారే!" నవ్వుతూ అన్నాను అమ్మానాన్నని, సిద్దార్థని చూస్తూ.

 

మా పక్కనే జయత్తయ్య వసుపిన్నితో గొణిగింది "వీళ్ళే అనుకున్నాను, దొరికిన అల్లుడూ అలాగే ఉన్నాడు. తేడాగా!"  వసుపిన్ని భళ్ళున నవ్వేసి అంది - "మనుషులు జయమ్మా. ఉండాల్సింది ఇలాగే కదూ?" 

*****

bottom of page