MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
కథా మధురాలు
నిర్వహణ: దీప్తి పెండ్యాల
తొలకరి చినుకు
పాండ్రంకి సుబ్రమణి
“ఒకసారి మీ అత్తగారి ముఖాన్ని- అంటే మాఅమ్మ ముఖాన్ని గుర్తుకు తెచ్చుకో. బాగా గుర్తుకి తెచ్చుకో! అప్పుడు తెలుస్తుంది"
“తెచ్చుకున్నాను. ఇప్పుడు చెప్పండి“
“మనింటికి వచ్చిన ఆవిడ ముఖాన మీ అత్తగారి పోలికలు ప్రస్ఫుటంగా కనిపించాయి. గమనించావా!"
“అయ్యో రామ! రాతకేడుద్దునా లేక రాగి మీసాల మొగుడి కోసం ఏడుద్దునా అందట మునుపెవరో—అలాగుంది నా పరిస్థితి. ఒకరి ముఖంలోని ఛాయలు మరొకరి ముఖాన ఏవో కొన్ని కోణాల వల్ల ఒక్కలాగే ఉన్నట్టు కనిపిస్తాయండి. మీరంతటి గొప్ప జర్నలిజమ్ కోర్స్ తీసుకున్నారు. ఈపాటి సైకలాజీ తెలవద్దా?"
చిచ్చు
నవులూరి వెంకటేశ్వర రావు
ఆమెకు అతని మాటల్లో నైరాశ్యం జొరపడినట్లు అనిపిస్తోంది. అతనిలో ఆమె చూస్తున్న వింత వైఖరి స్వీయ భ్రమగా ఆమె భావించదలచుకుంది.
కానీ ఒక రోజున తనను పక్కన కూర్చోపెట్టుకుని అత్త గారు హెచ్చరిక ధ్వనించే స్వరంతో, ఏదో కీడునో పీడనో శంకిస్తున్నట్లు గానూ, కించిత్ మందలింపుగానూ అనింది. "వాడికి మరింత దగ్గిరగా ఉండు!" దానికి తాను ఏమి చెయ్యాలో మాత్రం చెప్పలేదు. పలుగుతాడు తెంచుకు పోగల శక్తి ఉండి ఒక ధృడమైన నిశ్చయానికి వచ్చిన పశువును ఏ తాడుతో, ఎంతకాలం కట్టడం?
"జన్మంటూ ఎత్తిన తర్వాత ప్రకృతిసిద్ధమైన, అతి సాధారణమైన మానవుల సుఖాలు, అనుభవాల గురించి అసహజంగా భయపడుతున్నారు," అనింది భార్య ఒక రోజు.
"మరో జన్మ లేకుండా చేసుకో గలిగే మార్గం ఉన్నపుడు ఏ అనుభవాల ప్రసక్తీ ఉండదుగదా?" అన్నాడు.
రుద్రాక్ష
భాస్కర్ సోమంచి
అమెరికా వచ్చాక చాలా విషయాలు తారు మారు అవుతాయి.
వేసవికాలంలో పిల్లలు అమ్మమ్మ గారింటికో, నానమ్మ గారింటికో పోవడం బదులు, పెద్ద వాళ్లే పిల్లలను చూడడానికి రావడం సులువు, రివాజు అయిపోయింది. అలానే ఓ వేసవి, మా అత్తగారు, మావగారు పిల్లలతో గడపడానికి ఇండియా నుంచి వచ్చారు. శ్రీమతి, పిల్లలు కలసి న్యూయార్క్ రోడ్ ట్రిప్ కి వెళ్లాలని తీర్మానించారు. మొత్తం రెండు వారాలు. షార్లెట్, రిచ్మండ్ నగరాలలో లో ఓ రెండు రోజుల మజిలీలు, అక్కడి నుంచి మహానగరానికి పోవాలని పథకం. ఇంకో రెండు రోజులలో ప్రయాణం.
గురువారం యధావిధిగా సాయిబాబా సత్సంగానికి వెళ్ళాను. ఎందుకో ఏదో అసంతృప్తి. జీవితం వెలితి గా అనిపించింది. ఇంటికి వస్తూ కొన్నేళ్లక్రితం మా నాన్న గారికి శివరాత్రి ముందర ఓ సాధువుతో సంభాషణ, ఆయన ఒక ఖాళీ కాగితాన్ని ఒక పొట్లంలా కట్టటం, చేత్తో తడితే రెండు శివ లింగాలు - ఒకటి నలుపు, మరొకటి స్ఫటికం- విభూతి సహితంగా ఆ కాగితం పొట్లం లోకి రావడం గుర్తొచ్చింది.
కడుపే కైలాసం
లక్ష్మీ త్రిగుళ్ళ
“ అబ్బబ్బా… రావయ్యా విష్ణు , ఎంతసేపటినుండి ఎదురుచూస్తున్నాను నీకోసం?” అన్నాడు విసుగ్గా.
“ఏమిటి శర్మ? అంత కంగారుగా ఉన్నావు? నీకు తెలుసుకదా! సోమవారం తొందరగా బయటకురాలేనని. విషయం ఏమిటో చెప్పనేలేదు,” అడిగాడు.
“ఇక్కడకాదు మహానుభావా… అలా రా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాము, గోడలకు చెవులంటాయంటారు పదపద,” అంటూ తొందరచేసాడు.
“ ఏమిటోయ్ ? నీ హడావుడి చూస్తుంటే నాకేం అర్ధంకావడంలేదు, చెప్పవయ్యా! కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి, తొందరగా ఇంటికి వెళ్ళి భోజనంచెయ్యాలి” నీరసంగా చెప్పాడు విష్ణు.
కొత్త యుగంలోకి... ( తమిళ మూలం: జయకా ంతన్ )
అనువాదం: రంగన్ సుందరేశన్
గుండ్రమైన అవ్వ మొహంలో పసిపాపలాంటి ఒక శోభ ఉంది. ఈ వయస్సులోనూ ఆవిడ నవ్వినప్పుడు పళ్ళు వరుసగా కనిపించడం ఎంత ఆశ్చర్యం!
ఆవిడ చుబుకంకి కుడిపక్కన ఒక మిరియం కంటే కొంచెం పెద్దదిగా ఒక అందమైన మచ్చ, దానిపై మాత్రం దట్టంగా వెండ్రుకలున్నాయి. ఇవన్నీ కలిపి చూసినవారికి యౌవనంలో ఆవిడ ఎలా ఉండేదని ఆలోచించక తప్పదు.
అవ్వ ధరించిన చీర ఆవిడ సువర్ణవర్ణంలోని దేహానికి పోటీగా గాలిలో రెపరెపలాడింది. కారుతున్న చెమట వలన నెత్తిమీదున్న విభూది మాసిపోయింది. అవ్వ కొన్ని నిమిషాలలో తన మొహం, చేతులు, చీర మడతలు సరిదిద్దుకుంది.
నీడని వదిలి అవ్వ మళ్ళీ మట్టి నేలని నొక్కుకుంటూ ఒక వంతెన చేరుకుంది. దాని గచ్చు నేలలో మెల్లగా పాదాలు పెట్టి నడిచింది.