top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

 పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

vihari-chevraalu.jpg
toophaan.jpg

చేవ్రాలు:

 

విహారి గారు వ్రాసిన వ్యక్తిత్వ వికాసంపై రాసిన దీర్ఘ కవిత.  దాన్నే ‘వ్యక్తి’-‘త్వం’-‘వికసనం’ అన్నారు.  ఇది విహారి గారు వ్రాసిన రెండో దీర్ఘ కవిత. 

ఒకే వస్తువుపైన వ్రాసిన కవిత కనుక అది ఒక దీర్ఘకవిత అయింది, ఇంకా కొన్ని ఇతర లక్షణాలున్నా.  తెలుగులో దీర్ఘ కవితలు రాసినవారు తక్కువమందే.  నగ్నముని రచించిన ‘కొయ్యగుర్రం’, సి నారాయణ రెడ్డి రచించిన ‘విశ్వంభర’,  గుంటూరు శేషేంద్ర శర్మ ‘గొరిల్లా’,  పెన్నా శివరామశాస్త్రి గారు రచించిన ‘జీవనది’ మొదలగు రచనలు ఉదాహరణలుగా పేర్కొనవచ్చునంటారు.  పైన పేర్కొన్న కవితలన్నిటినోనూ ప్రబోధాత్మకమయిన వస్తువునెంచుకోవడం విశేషం.  విహారి గారి ఈ ‘చేవ్రాలు’ కూడా ఇదే కోవకు చెందింది. 

ముందుమాట ‘విహారి చేవ్రాలు’ లో డా.ఎన్.గోపి గారు “ఉద్దేశ్యం ఆధునికం, నిర్వహణం సమకాలికం, స్పష్టంగా చెప్పాలంటే సమకాలీకం” అంటారు.  చివరలో, గోపి గారు “నాకీ కావ్యం నా చిన్నతనంలో లభించి వుంటే నేనింతకన్నా బాగా ఎదిగేవాడినేమో” అంటారు.  అలా అనిపించినా, ఎప్పుడు, జీవితంలో ఏ వయసులోనైనా మంచిమాటలు దొరికినా అవలంబించచ్చు కదా? అందుకే విహారి గారు ఒక మనిషి జీవితకాలంలోని అన్ని దశలనూ ఉద్దేశించి వ్రాసిన కవిత ఇది.   

‘జీవనపత్త్రంపై చెరగని సంతకం’ అంటూ సుధామ గారు, ‘నీవు నీవుగా నిలవటం ఎంతెంతగా అవసరమో-నీ శక్తి యుక్తుల ప్రకటనం అంతంతగా అత్యంత ఆవశ్యకం అంటూ ప్రబోధిస్తున్న ఈ దీర్ఘ కవిత ఆత్మౌన్న్తత్యాన్నీ, ‘వ్యక్తి’-‘త్వం’-‘వికసనం’ను సంతరించే జీవన గీత’ అంటారు. 

ఈ పుస్తకం గురించి పాఠకులకు తన ధ్యేయం ఏమిటో రచయిత చెబుతూ “తాత్కాలిక, భౌతిక, మానసిక ఆరాటాల అవసరాలకు మించి కావలసినదేమిటో, వ్యక్తి పొందగల శాంతియుత, సుఖమయ జీవిత సాధన, ఫలప్రాప్తి ఏమిటో చూపే చిన్న దర్పణం ఇది” అంటారు. 

ఈ దీర్ఘ కవితను అయిదు ఆశ్వాసాలుగా విభజించారు.  ప్రవేశిక, ప్రారంభిక, లోనారసి, ఋజురేఖలు, వికసనం. 

ప్రవేశికలో వ్యక్తిత్వ వికసనం ఎందుకు అవసరమో సమాజానికీ, వ్యక్తికీ గల సంబంధమేమిటో, సమాజం నుంచి వ్యక్తి రాడు, ప్రతీ వ్యక్తీ కలిస్తేనే సమాజం అన్న ప్రాతిపదిక విహారి గారిది.  అందుకే వ్యక్తిత్వ వికసనం ఎంతో ముఖ్యం సమాజానికి.  అయితే ప్రతి వ్యక్తీ తనకు తానుగా నమ్మాల్సిన ముఖ్య ప్రాతిపదిక,

 

ఎవరి బతుకు వారికి వాస్తవం

ఎవరి బతుకు వారికి అమృతఫలం!

ఎవరి బతుకు  - అది –

వారికే చెందిన అద్భుత చరితం!

 

‘ప్రారంభిక’ లో మనిషి జీవితం మొదలు పెట్టినప్పుడు కలిగే బాల్య కౌమార దశాలున్నాయి

‘ఒక ‘మాయ’ను ఛేదించుకొన్న

కష్ట పరంపర...

విచిత్రంగా –

మరొక ‘మాయ’లోకి ఉచిత ప్రవేశం! ‘

అంతే కదా మరి? మనిషి ఎదుగుదలలో బాల్య కౌమార దశలలో బుద్ధిని ఆవిష్కరించే శక్తులేమిటి?

 

‘తల్లి గర్భంనుంచీ

తప్పనిసరిగా ‘జన్యు’ కణాలు

అనివార్యపు అనువంశికం’

అంటారు రచయిత.  ‘ఆదరణం, వాతావరణం, మనసుల్ని భ్రమింపజేసే శతకోటి కాలుష్యాలు లాంటివి ఎదుగుదలకు ప్రతిబంధకాలు’ అంటారు.  ఏమి

 

తెలిసినా, తెలియకపోయినా,

‘వాడు చెఱువు గట్టుపై లేస్తున్న సూరీడు

రావియాకుల్లో చిక్కుకున్న చందమామ’

మరి ఇవ్వబడే చదువెలా వుండాలి?

‘విద్య నిర్వచనాన్ని

వివేకంలో, విజ్ఞతలో, విజ్ఞానంలో వల్లే వేస్తేనే

మెదడులో నిలుపుకుంటేనే సమగ్రత,

అసలు సిసలు జ్ఞానైకత్వం-

సంపూర్ణ ప్రయోజనం! ‘వికసనం’!!

ఇలా సాగుతుంది జీవితంలోని వివిధ దశలలో నడిచే మన ప్రయాణానికి అద్దం పడుతూ. 

మానవ పరిణితిని ప్రభావితం చేసే, ఉత్తేజ పరిచే, అలాగే పరిమితం చేసే ఎన్నో అంశాలు, ఆ పరిమితులను అధిగమించగలిగే బుద్ధిని పెంపొందించుకునే ప్రయత్నంలో చేపట్టవలసిన మార్గాలు ఈ దీర్ఘ కవితలో కనబడతాయి.  మానవ మనస్తత్వ అవగాహనలో ఎంతో ప్రావీణ్యత కనబరుస్తూ, తన జీవిత అనుభవాలను అందరితో పంచుకోవాలనే తపన కనబడుతుంది.  విహారి గారు స్పృశించని అంశం లేదు.  వ్యక్తి, ప్రపంచం ఏమైపోతుందనే నిరాశ లేదు.  వ్యక్తికీ సమాజానికి సంబంధం గురించి చెబుతూ, ‘వ్యక్తి వికసనం సమాజ వికసనాన్ని ప్రోదిచేస్తుందనే సూత్రాన్ని విశ్వసించేవారిలో నేనూ ఒకడిని.   అంటే గాని, వ్యవస్ఠ ప్రభావంతో ‘వ్యక్తి’ విధ్వంసం కావటాన్ని ఆమోదించను’ అంటారు. 

వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో పుస్తకాలొచ్చాయి.  మరి ఈ పుస్తకం ప్రత్యేకటేమిటి?  విహారి గారు వ్యక్తి చుట్టూ 360 డిగ్రీలలో మనల్ని మనం అంతర్గతంగా చూసుకునే అద్దాన్ని మనకందించారు. 

సతీష్ గ్రాఫిక్స్ వారే ప్రచురించిన ఈ పుస్తకం కూడా రచయితనుంచి పొందవచ్చు (vihaari912@gmail.com).

 

 

 

తూఫాన్ మెయిల్ :

 

రంగనాథ రామచంద్రరావు గారిచేత తెలుగు అనువాదం చేయబడిన కన్నడ రచయిత జయంత్ కాయ్కిణి (Jayant Kaikini) గారు రాసిన అవార్డు పొండబడిన పదకొండు కథల సంకలనం.  ఇది 2021లో అనల్ప వారిచే ప్రచురించ బడింది. 

‘పుస్తక పరిచయాలు’ శీర్షికలోనే ఇదివరలో రంగనాథ రామచంద్రరావు గారు చేసిన తెలుగు అనువాద కథలు ‘అమ్మంటే నాకిష్టం’ పరిచయం చెయ్యడం జరిగింది.  ఆయన స్వతహాగా మంచి అనువాద కర్త.  ముఖ్యంగా కన్నడ సాహిత్యం నుంచి ఆయన ఎన్నుకున్న కథలు ఎంతో సాహిత్య విలువ కలిగినవి.  ఈ సంపుటిలోని కథలూ అంతే.  అనువాదం చేసిన తరువాత పాఠకుడికి, మూల రచయితకూ మధ్య అనువాదకుడు ఉండకూడదు.  రామచంద్రరావు గారి అనువాదాలన్నింటిలోనూ ఆయన కనబడరు.  అదే ఆయన సంతకం.  ఓల్గా గారు చెప్పినట్లు అనువాదం సాఫీగా నడవడమేకాకుండా మూల కథల సౌందర్యాన్ని మోసుకొచ్చింది. 

మూల రచయిత గురించి చెప్పాలంటే కన్నడ సాహిత్యంలో ఆయన్ని తెలియని వారుండరు.  తన పంతొమ్మిదవ యేటనే మొదటిసారి కర్ణాటక సాహిత్య అకాడమీ గుర్తింపు పొందిన జయంత్ కాయ్కిణి ఒక కవి, కథా రచయిత, ప్లే రైట్, కాలమిస్ట్, ఇంకా సినీ గేయ రచయిత.  ప్రతి రంగం లోనూ ఆయనకు గుర్తింపు తెచ్చినవి ఆయన రచనలే.  ఆయన వ్రాసిన ఆరు కథా సంపుటాలు ప్రచురించబడ్డాయి.  జీవితాన్ని కొత్త కోణంలోంచి  చూస్తూ కథలు అల్లడం జయంత్ గారి ప్రత్యేకత. 

కథలను గురించి రాస్తూ, ఓల్గా గారు ‘.. కథా సంకలనంలోని ప్రతి కథా ఒక మాణిక్యం.  మట్ట్లో దొరికిన మాణిక్యాలీ కథలు.  మాసిబారిన, పొగచూరిన బాటుకులలోని చీకటి తెరలను మెల్లిగా పక్కకు తప్పించి వెలుతురు కిరణాలను ప్రసరించి ఆ జీవిత మానవీయ కాంతులతో మన కళ్ళను, మనసులనూ వెలిగించే కథలివి’ అంటారు.  ఈ మాటలు అక్షరసత్యాలు. 

దాదాపు అన్నికథలూ బొంబాయి (ఇప్పటి ముంబయి) మహానగర జీవితం నేపధ్యంలో నడచినవే.  బొంబాయి నగరం సంపన్నమైనదిగా కనబడచ్చు.  అయితే అక్కడి సగటు మనుషుల సంక్లిష్టత అక్కడుంటేనే అర్థమవుతుంది.  జయంత్ కాయ్కిణి అక్కడ బతికే మనుషులు తామెంత కష్టపడుతూన్నా, పోగొట్టుకోలేని నిజాయితీని సున్నితంగా మన ముందుంచుతారు ఈ కథల రూపంలో.  ఓల్గా గారి మాటల్లో చెప్పాలంటే, “చాలా మంది రచయితలవలే నగరంలోని కర్కశత్వాన్నికాక మానవత్వాన్ని వెతికి, వెతికి చౌపాటీలో, గేట్వేలో, ఘాట్ కోపర్ లో, అన్ధేరీలో, విలేపార్లే ఆసుపత్రుల్లో తిరిగి, తిరిగి కనిపెడతాడు రచయిత”. 

‘నో ప్రెజెంట్స్ ప్లీజ్’ అన్న మొదటి కథ సూటిగా, సున్నితంగా తగిలే బాణంలాంటి ఒక వాక్యంతో మొదలవుతుంది.  ‘నిర్మాణం సగానికే నిలిచిపోయిన ఘాట్ కోపర్ ఫ్లైఓవర్ బాంబుదాడికి ముక్కలైన భగ్నసేతువులా కనిపిస్తోంది’. 

నిజాయిటీకి, ఆత్మాభిమానానికి, దయాగుణానికి, సాహసానికి డబ్బు లేనితనం ఒక అడ్డుకాదు.  ముంబై లాంటి పట్టణంలో ఎవరైనా బతకచ్చు కానీ బతకడం సులభం కాదు.  పెళ్ళి చేసుకుని సాధారణ జీవితం గడుపుదామనుకునే స్త్రీకి తను ఎంచుకున్న మగవాడికి లగ్న పత్రిక అచ్చు వేయించుకుందామనుకునే సమయానికి ఆ అమ్మాయి పేరుతో పోలిస్తే తన పేరులోనే ఏదో తక్కువుందనే భావం కలిగినప్పుడు జీవితమంటే తెలిసిన ఆ అమ్మాయి మనసు ఎలా విరిగిపోయింది అని అతి తక్కువ మాటలలో రచయిత చెప్పాడనేది కథ చదివితేనే తెలిసేది. 

బతకతడమే కష్టమయిన ముంబయిలో పెళ్లి ఒక అందుకోలేని అవసరం.  దాన్ని గురించి పూర్తిగా ఆలోచించడం మానివేశాక ఎవరో ఒకరు వెతుక్కుంటూ వచ్చి తన కూతురుంది, తప్పకుండా పెళ్ళి ఆలోచనతో వచ్చి చూసి పొమ్మన్నప్పుడు అతనికే కాదు పాఠకులకు కూడా ఒక అపనమ్మకం, ఏమవుతుందో అన్న కుతూహలం కలగక మానదు.  కథ ఒక ఎత్తు, రచయిత చెప్పిన విధానం మరో ఎత్తు. 

పాఠకుడికి కథల్లో ఏ పాత్ర అన్నా విరక్తి, ఏవగింపు భావనలు రావు.  అందరినీ మానవత్వపు కోణంలోనే చదివించేలా ఉంటాయి.  జాలి కలుగుతుంది.  డబ్బు లేకపోయినా మనిషి ఆత్మాభిమానానికి, ఉపకార బుద్ధికి, పాత్రతో పాటు పాఠకుడు కూడా మధన పడటం జరుగుతుంది.  అది రచయిత గొప్పదనం. 

నాకు నచ్చని కథ లేదు. అన్నీ మాణిక్యాలే, ఓల్గా గారన్నట్లు.  అనువాదం గురించి చెప్పనక్కరలేదు.  రామచంద్రరావు గారు చేసిన అనువాదం, అదొక అనువాద కథలలాగా  అనిపించవు.  ఒక మంచి తెలుగు కథలు చదివిన తృప్తీ మిగులుతుంది. 

*****

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 4
bottom of page