top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

తొలకరి చినుకు

 

పాండ్రంకి సుబ్రమణి

Madhuravani_Social

మధుసూదనరావు గ్రాడ్వేషన్ పూర్తి చేసి ట్రైనీ పత్రికా విలేఖరిగా జర్నలిజమ్ శిక్షణ కళాశాల లోకి చేరాడు. అది అతడికి  యిష్టమైన వ్యాపకం. థ్రిల్ నిచ్చే ఉత్తేజకర కార్యరంగం.

 

మరైతే, అతడు జర్నలిజమ్ శిక్షణా తరగతిలో చేరక ముందే ఇంటి పెద్దల ప్రమేయం వల్ల ఇంటివాడయాడు. ఒక కూతురికి తండ్రి అయాడు. అంతటితో ఆగాడా-లేదు.  జర్నలిజమ్ కాలేజీలో చేరిన తరవాత మరొక వికట్ కొట్టాడు—కొడుక్కి కూడా తండ్రి అయాడు. కొందరనుకుంటారు గాని, పద్ధతి ప్రకారమే, ప్రణాళిక ప్రకారమే సాగాలని, నిజానికి అవన్నీ అనుకున్నప్రకారం ఆగేవి కాదు. పిడికిట్లో బిగించ తగ్గదీ కాదు. ఇక పోతే, మధుసూదనరావుకి ఉన్న ప్లస్ పాయింట్ అతడి జీవన సహచరి మేనక. సంసార పక్ష స్త్రీ.  ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ఆనుపానులు గ్రహించి మెట్టింటికి వచ్చిన గృహిణి. గుణాత్మకంగా శాంత స్వభావురాలు.  ఉన్న దాంట్లో భర్త తెచ్చిన దాంట్లో గుట్టుగా కుటుంబ భారాన్ని సజావుగా సాగించగల నేర్పరి. వయసు మళ్ళిన అత్తామామలను ఆదరణతో ఆదుకునే తెలుగు ఆడపడుచు. ఆ రీతిన చూస్తే అతడు అదృష్టవంతుడే. అప్పుడెప్పుడో అనలేదూ ఒక సినీ కవి పుంగవుడు? అనుకూలవతి అయిన భార్య లభించడమన్నది పూర్వ జన్మ సుకృతమని. “యుగ పురుషుడు“ దిన పత్రికలో రెగ్యులర్ జాబ్ సంపాదించి-రెగ్యులర్ పే-ఫిక్షేషన్ తీసుకున్న రోజున ఇంటిల్లపాదీ పిల్లా పిచుకులతో ఎంతనిండుగా సంబరాలు చేసుకున్నారని, ఎన్ని వేడుకలు చేసుకున్నారని? ఉద్యోగ నియామకంతో ఛాతీని అంతెత్తున చాచి అందర్నీ మూన్ లైట్ రెస్టారెంటుకి తీసుకెళ్తానని ముచ్చటపడితే, అందరూ చూసేలా పర్సులోని కొత్తనోట్లను రెపరెపలాడిస్తూ నట్టింట నిల్చున్న భర్తను అలవోకగా ఆపి, ఖర్చుని యెంత లాఘవంగా తగ్గించి మేనక ఎన్నెన్ని పిండివంటలు చేసిందని? అత్తగారి పర్యవేక్షణలో వీధి పొడవునా ఎంతమంది ముత్తయిదువులకు తాంబూలాలు వాయినాలు పంచి పెట్టిందని.  సునాదం వంటి ఈ సుదినాన్ని తెలుగు ఆడపడుచులు ఈ జన్మలోనే కాదు-మరుసటి జన్మలో సహితం మరచిపోగలుగుతారా!

 

ఐతే-మేనకకు భర్త విచిత్ర వైఖరి వల్ల పెద్ద చిక్కే వచ్చిపడింది. ఆమె దృష్టిలో అదొక బాధ్యతారహితమైన వైఖరే. చిన్నదీ పెద్దదీ అని చూడకుండా అవసరమైనదీ లేనిదీ చూడకుండా సర్రు సర్రున పర్సు బైటకి తీసేస్తుంటాడు. రూపాయి నోట్లను గాలి లోకి ఎగరేస్తుంటాడు. ఈ వైఖరి పట్ల మేనకకు బలమైన వ్యతిరేకత ఉంది. సంసారానికి ఏమాత్రమూ సరిపోని వ్యాపకమని. అప్పు డప్పుడు కాసులు గలగలమన్నంత మాత్రాను తమది మధ్య తరగతి కుటుంబమన్నది మరచిపోతే ఎలా!

మొన్నటికి మొన్న జరిగిన ఉదంతం మేనక కళ్ళముందు మెదిలింది.

 

ఎప్పుడూ ముక్కూ ముఖం కూడా ఎరగని ఎవరో ఒక స్త్రీని తన దూరపు బంధువంటూ ఇంటిక తీసుకు వచ్చాడు. ఆమె తో బాటు ఆమె కూతుర్ని కూడాను. ఇంతకీ అసలు విషయం యేమంటే, తన అత్తగారూ మామగారూ కూడా ఆమెను సరిగ్గా గుర్తించలేకపోయారు. కళ్లు పదే పదే చికిలించి చూస్తూ. చివరకేమైంది? రాత్రి భోజనాలు ఐన తరవాత మేను వాల్చిన తరవాత మరునాటి ప్రొద్దుట చూస్తే తల్లీ కూతుళ్లు అయిపు లేరు. వాళ్లు పడుకున్న చాపలు బోడుగా కనిపించాయి.  వెళ్తూ వెళ్తూ గార్ధబం విసురుగా వెనక్కి తన్నినట్టు కొత్తగా కొనుంచిన వెంకటగిరి పెట్టుడు చీరను చంకన వేసుకుని వెళ్లిపోయింది. ఇంకానయం! మరేదీ ఎత్తుకు పోలేదు. ఐనా తడిమి, ఎత్తుకు పోవడానికి వాళ్ళింట్లో యేముంది గనుక. కానీ, మేటర్ అది కాదు.

 

మగాడన్నవాడికి అంతటి మెతకతనం ఉంటే ఎలా! కొంపకూలదూ! అడిగితేనేమో, “బల్లపై మడచి ఉంచిన రెండు పెట్టుడు చీరల్లో ఒకటే కదా తీసుకు వెళ్ళింది? దానిని బట్టి తెలియడం లేదూ ఆవిడ చోర నేపథ్యానికి చెందినది కాదని.” అని ముక్తాయించాడు.  అప్పుడు తను ఊరుకోలేదు. కస్సున అడిగేసింది అదే సమయమని-“అసలు ఆవిణ్ణి దూరపు బంధువని అత్తగారే పోల్చుకోలేనప్పుడు మీరెందుకు అంతటి అక్కర తీసుకుని ఇంటికి తీసుకు వచ్చారు? అత్తగారు ముందు పుట్టారా లేక మీరు ముందు పుట్టారా?"

 

ఆ ప్రశ్నకు మధుసూదన రావు తడుముకోలేదు.  చిరుహాసంతో బదులిచ్చాడు-“ఇక్కడే నువ్వూ మీ అత్తగారూ పప్పులో-కాదు-తప్పులో కాలేసారు ఉక్కుమ్మడిగా. గొంతు పెగల్చుకుని చెప్పినా మీరు నా గోడు వినిపించుకోవడం లేదు”

"ఏమిటండీ అది?"

"ఒకసారి మీ అత్తగారి ముఖాన్ని-అంటే మాఅమ్మ ముఖాన్ని గుర్తుకు తెచ్చుకో. బాగా గుర్తుకి తెచ్చుకో! అప్పుడు తెలుస్తుంది"

"తెచ్చుకున్నాను.  ఇప్పుడు చెప్పండి"

మనింటికి వచ్చిన ఆవిడ ముఖాన మీ అత్తగారి పోలికలు ప్రస్ఫుటంగా కనిపించాయి. గమనించావా!"

“అయ్యో రామ! రాతకేడుద్దునా లేక రాగి మీసాల మొగుడి కోసం ఏడుద్దునా అందట మునుపెవరో—అలాగుంది నా పరిస్థితి.  ఒకరి ముఖంలోని ఛాయలు మరొకరి ముఖాన ఏవో కొన్ని కోణాల వల్ల ఒక్కలాగే ఉన్నట్టు కనిపిస్తాయండి. మీరంతటి గొప్ప జర్నలిజమ్ కోర్స్ తీసుకున్నారు. ఈపాటి సైకలాజీ తెలవద్దా!ఇప్పటికి ఆవిడ పుణ్యం కట్టుకుని పెట్టుడు చీరతో చాలించింది.  మరొకసారి మరొకరైతే—నిద్రలో మనందరి గొంతులు కోసి, అందినకాడకి దోచుకుని పలాయనం చిత్తగించును”

“ఛ! అవేం మాటలు మేనకా? అక్కడికేదో మనింట్లో మూటలు మూటలు పేరుకుపోయినట్టు?"

దానితో ఆమెకు మాట పెగల్లేదు. కుడి చేతితో నెత్తి కొట్టుకుంటూ అక్కణ్ణించి కదలి వెళ్ళిపోయింది. ఇటువంటి మగాడి వల్ల ఏదో ఒక రోజున తన కొంపా పిల్లల కొంపా నిజంగా కొల్లేరే!

**

ప్రపంచీకరణ మహత్తో మరేకారణమో గాని, చాలా మందిలాగే మధుసూదనరావుకి కూడా ఉద్యోగ రీత్యా గడ్డు పరిస్థితి ఎదురైంది.

 

ఆ మాటకు వస్తే అతడికే కాదు. అతని  బ్యాచ్ మేట్సుకి  అదే గడ్డు పరిస్థితి. ఆ పరిస్థితి యొక్క ప్రతిబింబంగా భర్త ముఖ నరాలలో గోచరిస్తూన్న ఉద్విగ్నతను మేనక గమనిస్తూనే ఉంది. ఆనవాయితీగా వారాంతపు సెలవు రోజు ముందు తను నిండుపూల జడ వేసుకుని దగ్గరకు వెళితే ముఖం అటు చాటేసుకుంటున్నాడు. ఇస్తూన్న పాల కప్పుని ముట్టు కోకుండానే అటు ఒత్తిగిలి నిద్రలోకి జారుకుంటున్నాడు. పిల్లలిద్దరూ”నాన్నా!“అంటూ దగ్గరకు వెళితే యెటో చూపు నిలిపి  లేచి వెళ్లిపోతున్నాడు. మొత్తానికి సిట్వేషన్ సీరియస్. అప్పుడు ఓర్పూ నేర్పూ సమృధ్ధిగా పుణికిపుచ్చుకున్న మేనక టెన్షన్ పడలేదు.  వేగిరపాటుకి లోను కాలేదు. తను కూడా అలా వేగిరపాటుకి లోనయి పోతే, మరి తనకూ తన భర్తకూ మధ్య ఏం వ్యత్యాసముంటుంది? రేపటికి తనింకెన్ని ఉదంతాలు చూడాలో? ఎన్నెన్ని ఢక్కా మొక్కీలు తినాలో!

 

అంచేత భోజనాల సమయంలో నిదానంగా వడ్డిస్తూనే ప్రసన్నంగా చూపులు సారిస్తూనే విషయం ఏమిటని అడిగింది.  అప్పుడు మధుసూదనరావు విడమర్చి చెప్పాడు. తను పని చేస్తూన్న దినపత్రికలో పత్రికా విలేఖరుల కోసమే కేటాయించిన కొన్ని హయ్యర్ గ్రేడ్ పోస్టుల కోసం పైలు కదులుతూంది. అలా కదులుతూన్న ఫైలులో మేనేజ్మెంటు ప్రతిపాదించిన షరతు. ఎవరైతే సంచలనాత్మకమైన మేజర్ ఇష్యూని గాని, సామాజిక స్థాయిగల నగర ప్రముఖ వ్యక్తి గురించి గాని గాని పత్రికలో కథాంశం గా తీసుకు రాగలిగారో వాళ్లకే ప్రమోషన్ లిస్టులో అగ్రస్థానం. అలా గానీ చేయలేకపోతే ఇప్పటి  గ్రేడ్ తగ్గించి రూరల్ ప్రాంతానికో మరెక్కడికో పంపించేస్తారు. చాలా క్లిష్టమైన అంశమే. విడదీయలేని  చిక్కుముడే. నిజానికి తన భర్తకి అంత ప్రాముఖ్యత గల వ్యవహారాన్ని పత్రికలోకి యెక్కించగల చొరవలేదేమో! పరపతితో పలుకుబడితో కూడిన స్థాయి అంతకంటే లేదేమో! అలా చేయగలగాలంటే విజ్ఞానపూర్వక  విషయ పరిజ్ఞానం ఉండాలి. అది తన భర్తకు ఉందా? మేనక తతిమ్మా పనులు మానుకుని బుర్రకు పదును పెట్ట సాగింది.

 

కటకటా! ఈ లోపల మరొక బాంబు పేల్చాడు మధుసూదనరావు. శుక్రవారం కొరకుపడని కొయ్యలా ఎవరో ఒక కాషాయ వస్త్రధారిని తిన్నగా ఇంటికి తీసుకువచ్చాడు. అదీను ఎప్పుడని? రాత్రి తొమ్మిది దాటిన తరవాత. హేబిట్స్ డై హార్డ్- అంటారే ఆ రీతినన్న మాట. మొత్తానికి వచ్చినాయన ఇల్లు వాకిలీ లేని సర్వసంగ పరిత్యాగిలా ఉన్నాడు.  లోపల నిద్రపోతూన్న అత్తామామలకు ఇబ్బంది కలగకూడదనుకుంటూ చాలా సేపు తేరిపార చూస్తూండిపోయి-పిమ్మట వచ్చిన వ్యక్తిని అరుగు పైన కూర్చుండమని చెప్పి, భర్తను నడవాలోకి తీసుకు వెళ్లి నిలదీసింది మేనక- “ఏమిటండీ ఇది? సమయం సందర్భం లేకుండా ఈ సహానుభూతి చూపించడం ఎందుకండీ! కష్టంలో ఉన్నాడని కడుపు ఖాళీ గా ఉన్నాడని తోస్తే చేతిలో పదో పరకో పెట్టి సాగనంపాలి గాని రాత్రి పూట ఏకంగా ఇంటి నడవకు తీసుకురావడమే. ”భార్యలోని కొట్టుమిట్టాడుతూన్న అలజడిని గమనించి క్షణం పాటు నిదానంగా ఉండిపోయి బదులిచ్చాడు మధుసూదనరావు. “ఆయనది డబ్బులతో పోయే సమస్య కాదు. ముందది తెలుసుకో! ఆయన తీర్థ యాత్రలు చేస్తూ ఇక్కడకు వచ్చేటప్పటికి రెండవ ప్రపంచ యుధ్ధకాలం నాటి  వాహనం వంటి అతడొచ్చిన బస్సు-కుదేలు మంది. ఈయనేమో చాలా సేపు రిపైర్ అవుతుందని ఎదురు చూస్తూ దాహం వేసి అక్కడి కల్వర్టు మలుపు వద్ద టీ నీళ్లు నోట్లో పోసుకోవడానిక వెళ్లి వచ్చేటప్పటకి బస్సు వెళ్లిపోయింది, కండక్టర్ అలసత్వం వల్ల. నేనిటు వచ్చేటప్పటికి ఈయనేమో బండరాయి పైన నెత్తిపైన చేతులుంచుకుని కూర్చున్నాడు. ఆయన వేసుకున్న కాషాయ వస్త్రాలు చూసి గౌరవభావంతో తీసుకువచ్చాను.  రేపో ఎల్లుండో వెళ్ళి పోతారులే!”

 “సరే దీనికి బదులివ్వండి. ఇప్పుడున్న కష్టాలు మనకు చాలవా? మీరిప్పుడు ఉద్యోగంలో ఎదుర్కుంటూన్న ఒత్తిడి చాలదా!”

 “చూడు మేనకా! మన దృక్ఫథాలు వేరు. మనస్తత్వాలు వేరు. అందుకే చెప్తున్నాను. కష్టాలు మనకెప్పుడూ ఉంటాయి. ఆ మాటకు వస్తే కష్టాలు లేనివారు ఎవరని? రోడ్డున పడుకునే భిక్షకులకే కాదు. కుబేర పుత్రులైన అంబానీలకు బిల్ గేట్సుకి కూడా ఉంటాయి కష్టాలు. నెత్తిన కష్టాలు ఉన్నాయి కదానని, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని నడిరోడ్డున విడిచి వచ్చేయ మంటావా?"

మేనక ఆ పైన ఏమీ అనలేదు. తనను తను పుంజుకోవడానికి ప్రయత్నిస్తూ బైటకు వెళ్లి కాషాయ వస్త్రధారిని పిలిచింది-“బాబాయిగారూ! లోపలకు రండి. మా వారితో కలసి భోంచేద్దురు గాని!“ అతడు అరుగు పైనుంచి లేస్తూ అన్నాడు.

“లేదమ్మా! నేను ఎటువంటి సమయంలోనైనా స్నానం చేసి పూజ చేయనిదే అన్నం ముట్టను."

“అలాగైతే మూడు నిమిషాలు ఆగండి.  వేడి నీళ్ళు పెడ్తాను."

“నాకు వేడినీళ్లు వద్దమ్మా! చన్నీళ్ళే పోసుకుంటాను” సంచీని అక్కడ వాకిట వద్ద ఉంచి అందులోనుంచి పంచే టవ్వలూ తీసి బావి వేపు నడిచాడు. ఇంతటి చలిలో అందులో రాత్రిపూట చన్నీళ్ల స్నానమా? ఆ వయసులోనా.

 

మరునాడు ప్రొద్దుటే లేచి కాఫీ కాచి, కాషాయ వస్త్రధారి ముత్యాలయ్య పడక గది వేపు వచ్చింది మేనక. కానీ  ముత్యాలయ్య అక్కడ లేడు. అతడి సంచీ మాత్రమే ఉంది. కాఫీ కప్పు చేతనుంచుకుని గడప వద్దకు వచ్చి బైటకి చూపులు సారించిందామె. అంత చలిలోనూ ఎప్పడు స్నానం చేసాడో మరి? నుదుట విభూతి రేఖలు పూసుకుని మధ్య కుంకుమ బొట్టు దిద్దుకుని పాదరక్షలు లేకుండా నడక సాగించి వస్తున్నాడు. అప్పుడు కాఫీ కప్పుతో ఎదురు వెళ్లిన మేనకను ఆగమని సంజ్ఞ చేసాడు. “చూడమ్మా! కాఫీ పుచ్చుకోవడానికి నాకెటువంటి ఆక్షేపణా లేదు. ఐతే ఒక షరతుపైన!”

 

 అప్పుడామె చిరునవ్వుతో తలెత్తి చూసింది-అదేమిటన్నట్టు. “మొదట మీ భార్యా భర్తలిద్దరితోనూ మాట్లాడాలి” ఆమె అదే నవ్వు ముఖంతో తలూపుతూ కాఫీ  కప్పుని వంట గదిలో ఉంచి కాఫీ తాగుతూ పేపరు చూసుకుంటూన్న మధుసూదనరావుని బయల్దేరదీసింది.

 

వాళ్ల వేపు చూపు సారిస్తూ  ముత్యాలయ్య అడిగాడు-“మీరెంతగా గొంతులు నొక్కి మాట్లాడుకుంటున్నా, నాకు మీ మాటలు రాత్రంతా వినిపిస్తూనే ఉన్నాయయ్యా మధుసూదనా! ఆందోళనాపూరితమైన మీ కంఠస్వరాలను బట్టి నాకు తెలిసిన అంశం ఏమంటే - విషయం చాలా సీరియస్ ఐనదేనని. అది మీ బ్రతుకు తెరువుకి సంబంధించినదేనని. వాస్తవమే కదూ!” దంపతులిద్దరూ తలలూపారు.  అలా తలలూపుతూనే మధుసూదనరావు అందుకున్నాడు-“టూకీగా చెప్పాలంటే, ప్రమోటీస్ లిస్టులో నా పేరుంది. నా పేరున్న ఆ లిస్ట్ తదుపరి దశకు చేరాలంటే, రెండింట్లో ఒకటి చేయాలి. నగర ప్రముఖుడితోనో వ్యాపార దిగ్గజం తోనో ఇష్టాగోష్ఠి జరపాలి.  లేదా, సంచలనాత్మకమైన ఒక వార్తను పత్రిక మొదటి  పేజీలో వచ్చేట్టు చూడాలి. సాధించాలి. లేకపోతే అంతే సంగతులండి!"

 

“సరే. వ్యవహారం దాదాపు అర్థం అయినట్టే. సమస్యంతా ఉద్యోగ పరిధికి సంబంధించినదే. ఔనా?”తలూపాడు మధుసూదన రావు.

 

“ఐతే నేనిప్పుడు మరొక ప్రశ్న వేస్తాను. ఆలోచించి చెప్పాలి. అరుణ్ మల్టీనేషనల్ ఎలక్ట్రికల్ కంపెనీ సీ.ఈ.ఓ ని ఇంటర్వ్యూ  చేసే అవకాశం వస్తే పరవాలేదంటావా!"

మధుసూదనరావు ఆశ్చర్యంగా చూసాడు. ఆ తరవాత పక్కున నవ్వేసాడు-“మీరు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు బాబాయి గారూ! అందుకే జోక్ వేస్తున్నట్టున్నారు. అది ఎంత పెద్ద వ్యాపార వ్యవస్థ అంటే- అక్కడి డిప్యూటీ మేనేజర్ తో సహితం ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరకదు. నా బ్యాచ్ మేట్సు కొందరా ప్రయత్నం చేసి వీలుపడక చతికిలబడ్డారు” ముత్యాలయ్య తల అడ్డంగా ఆడించాడు-“వాళ్ల సంగతి అలా ప్రక్కన పెట్టు. మళ్లీ అడుగుతున్నాను-నీకు ఏకంగా ఆ కంపెనీ సి-ఇ-ఓ తో ఇష్టాగోష్టి జరిపే అవకాశం లభిస్తే వదులుకుంటావా!”

 

ఈసారి మధుసూదనరావు ఊరకుండిపోయాడు.  తదేకంగా చూస్తూ అడిగాడు-“నిజంగా మీకు ఆ కంపెనీ సీ.ఈ.ఓ తెలుసా సార్?”

 

ఔనన్నట్టు తలూపాడతను. అప్పుడు నిదానంగా అడిగాడు మధు-“ఎప్పుడు వెళదామండీ!”

“మనం వెళ్ళడం దేనికి?వాడే దిగొస్తాడు. ఏదీ? ఫోను అందుకో”

“అదేమిటండీ సీ.ఈ.ఓ గారిని వాడూ వీడూ అంటారు! అసలు అంతటి వారిని ఇక్కడకు రమ్మనడమే పెద్ద అపరాధం”

“అలాగా! మరి కన్నకొడుకుని వాడు అనకుండా అయ్యగారూ  బాబుగారూ అని  పిలవమంటారా! అసలు వాడికి ఆ అరుణ్ కంపెనీ ఆధిపత్యాన్ని ఇచ్చిందెవరనుకుంటున్నారు? పూర్వాశ్రమంలో నేనే-మిస్టర్ అరుణ్ ని. వాడికా రోజు కంపెనీ ఆధిపత్యాన్ని అప్పగించిన తరవాతే నేను వైరాగ్యం పెంచుకుని ఋషి కేశ్ ఆశ్రమానికి వెళ్లిపోయాను. అలా యెందుకు చేసానంటావా! ఐ లవ్ మై వైఫ్. ఆమె చనిపోయిన తరవాత తీవ్రమైన విరక్తి కలిగింది. బ్రతుక్కి అర్థం లేకుండా పోయింది. నేనిక యిక్కడ ఉండదలచుకో లేదు ఉత్తరాది వేపు వెళ్ళిపోయిన తరవాత ఋషి కేశ్ ఆశ్రమంలో కొన్నాళ్లు హిమాలయ గుహల్లో  కొన్నాళ్లూ గడపసాగాను.  ఇటు దక్షిణాది వేపు తీర్థ యాత్రలకు వెళుతూ ఇక్కడ చిక్కుకు పోయాను. ముక్కూ మొహం తెలియక పోయినా నన్నాదరించావు”అంటూ ఫోనులో మాట్లాడి కాఫీ కప్పు కావాలని అడిగాడు ముత్యాలయ్య.

 

అతడలా కాఫీ తాగడం ముగించి లోపలకు వెళ్లి వచ్చేటప్పటికి మధుసూదనరావు ఇంటి ముందు మూడు కార్లు బారుగా వచ్చి ఆగాయి. అరుణ్ కంపెనీ సీ.ఈ.ఓ వినాయక్, అతడి భార్య మనోహరి కారు దిగి పరుగు వంటి నడకతో వచ్చి ముత్యాలయ్య  కాళ్లకు నమస్కరించారు. ఆ తరవాత మధుసూదనరావు వేపు తిరిగి వినాయక్ అన్నాడు- “నాన్నగారు మీ గురించి  అంతా చెప్పారు. మీది చాలా పెద్ద మనసని మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు చెప్పడం నావంతు. మీకు ఎక్కడైనా, ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇస్తాను. ఈ లోపల మీకొక ఆఫర్. మీకు కావాలంటే మా కంపెనీలోనే జాబ్ ఇస్తాం - పబ్లిక్ రిలేషన్ ఆఫీసరుగా. చాయిస్ ఈజ్ యువర్స్" మేనకా మధుసూదనరావూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసారు. వాళ్లిద్దరికీ యెలా స్పందించాలో తెలియటం లేదు. ఇంతకీ ఇది కలా లేక వాస్తవమా?

 పువ్వు చిన్నదా పెద్దదా అన్నది కాదు ప్రస్తావన. ఎక్కడున్నా యెక్కడ నాటినా పరిమళిస్తుంది. మంచితనంలా ఆకాశమంతటా విస్తరిస్తుంది. అంతే కదూ!

 

అప్పుడతనికి ఉన్నపాటున అష్టావక్ర గీత గుర్తుకి వచ్చింది. “తనలో యితరులను, ఇతరుల్లో తనను చూసుకునేవాడే ఆత్మజ్ఞాని“

 

ఇప్పుడు వినాయక్ ఆఫర్ చేసిన వాటిలో దేనిని ఎంచుకోవాలో దేనిని వద్దనాలో తెలియక భార్యాభర్తలిద్దరూ సందిగ్ధావస్థలో పడ్డారు.

*****

bottom of page