MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
తెరమరుగు
వి. వాణి మోహన్
తెరలో --
ప్రభు వెంట నీడ లాగ ఉండే నేను జోరా. అసలు పేరు జోగారావు. జంటగా మసిలే మేము వేరు, వేరు దారుల వెంట భవిషత్తు వెదుక్కుంటూ వెళ్ళాము. ప్రభు సినిమాలు. నేను యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్. స్నేహలత ని పోషించుకున్నాం. రోజుల తరబడి ప్రభు షూటింగులు అంటూ తిరుగుతున్నా, నేను మాత్రం అమ్మదగ్గరే ఉండి పోయాను. ప్రభు సినిమా భవిషత్తు కోసం అమ్మపడే తాపత్రయం చూస్తే నాకు విస్మయంగా, ఆరాధనగా వుండేది. నా మనసులో మసకబారిన నా అమ్మ చోటు ఈ అమ్మతో నిండిపోయింది, ఎప్పుడు?? నాకు తెలియదు.
నా బాల్యం ప్రభుతో చేరాక పూలతోట అంత అందం, సెలయేరు, అంత జోరుగాసాగింది.
ప్రభు ఉంగరాలు తిరిగిన జుట్టు, పూర్ణ చంద్రునిలాంటి ముఖం, దానికి తగినట్లు గుండ్రని నల్లనికళ్ళు, తెల్లని మేని ఛాయ తో మిసమిస లాడే చిన్నవాడు ’’ప్రభువు ప్రసాదం‘’ ఇది వాడి తండ్రిమాట!! అదే వాడిని స్కూల్లో చేర్చినపుడు అమ్మరాసిన పేరు ప్రభు ప్రసాద్. తండ్రి ఉన్నట్టా, లేనట్టా అనిపించే వాతావరణంలో పెరిగిన ప్రభుని, బంధుజనంతోబాటు ఇరుగు పొరుగు కూడా ముద్దుచేసే వారు… అందరి కబుర్లు వింటూ పెద్దకళ్ళతో హావభావాలు కనపరిచే ప్రభు గొప్ప నటుడు అవుతాడు అనేది అమ్మ. హైస్కూల్ దాటాక, నూనూగు మీసాలు మొలిచాక, మాట తగ్గింది. చిరునవ్వులు చిందిస్తూ, ఎప్పుడు స్నేహితులని పోగేసుకొని సైకిల్ మీద తిరుగుతూ కులాసాగా గడిపేవాడు. అమ్మకి వీడు డిగ్రీ అయినా పూర్తిచేస్తాడా? అని సందేహం వచ్చినప్పుడు ‘’ఏమిట్రా, కాలేజికి అసలు వెళ్లుతున్నావా ‘’ అని నిలదీస్తే-- చిరునవ్వే సమాధానం! ‘’నవ్వుతావేమిరా’’? అంటే ”నీ దగ్గరే నేర్చుకున్నాను’’ అనేవాడు. అన్నిటికి మందహాసం మధురంగా చిందించే ప్రభుతో “ఏదైనా సమర్ధవంతంగాచేసుకోవాలి” అనేది అమ్మ.
అందులోని శ్లేష అర్ధం అయినాక, నోట్లో నుంచి ఒక ముత్యం లాంటి మాట జార్చాడు ‘’నాన్నలాగా తప్పించుకు తిరగను!” అమ్మ తలపంకించడం చూసి,’’సరేనా’’అని నవ్వాడు. ఈసారి ఇది భరోసా మందహాసం!! ప్రభుని తనతో తరుచు అన్నిభాషల సిమాలకి అమ్మ తీసుకువెళ్లేది. హీరోలు ఎలా నటిస్తారో గమనించమనేది. వారి హావ భావ ప్రకటనలు చూసి చర్చించేది ‘’నువ్వు సినిమాలలో నటిస్తే గుర్తింపు వస్తుంది, దానితో డబ్బు వస్తుంది.’’ అనేది. సెలవల్లో ఆదివారాల్లో పండగల్లో ఎల్లప్పుడు నేను కూడా ఉండాల్సిందే, అమ్మ చెప్పేవి అన్ని కళ్ళు విప్పార్చి విని, తల పంకించి ప్రభు చూపించే భావాలకి ముగ్ధురాలై పోయేది… ‘’ ఏమిరా, జోరా, నువ్వు ఆటలు ఆడుతున్నా, పుడకలాగా ఉంటావ్, చదువుకో చాలు‘’ అనేది అమ్మ నాతో. కాలం గడిచినకొద్దీ సినిమాలోకంలో ప్రవేశానికి నటనే కాక ఫోటోగ్రఫి, ఎడిటింగ్, డైరెక్షన్ అన్ని కూడా నేర్చుకోవాలి. ఈ ఆలోచనతో ప్రభు సినిమా రంగంలో వివిధ శాఖల్లోని వ్యక్తుల పరిచయం పెంచు కొని 4 సం ల్లో బాగా లోతు పాతులు గ్రహిOచగలిగాడు. తరుచు ప్రముఖులతో తిరిగే ఈ అందగాడిని అందరు ఇష్టపడేవారు.
ఒక రోజు ఒక డైరెక్టర్ గారు ప్రభు ఫోటో ఆల్బం చూసారు-’’ఊరికే మాతో కలసి తిరగడమేనా? కలిసి పని చెయ్యవచ్చు కదా? హీరో వేషం వేస్తావా’’అన్నారు. ప్రభు కొంచెం ఆశ్చర్యం ప్రకటించి చిరునవ్వు నవ్వాడు, ఆయన ముగ్ధుడై ‘’నువ్వు ఈ రంగుల లోకం లో ఒంటరివి కావు. నేను ఉంటాను. ముందు నీ అభిరుచి ఫోటోగ్రఫి కనుక ఆ సెక్షన్ చూసే ఖాన్ దగ్గర పని నేర్చుకో. అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళు కెమెరాతో ఎలా అద్భుతాలు చేస్తారో చూడు. స్క్రిప్ట్ చదివి గొంతులో కూడా భావ ప్రకటన రావాలి. నవ్వులు చాలవు, ప్రయత్నించు!” అని భుజం తట్టారు. ఈ కబురుకి అమ్మ చాల సంతోషించింది.
ప్రభుకి ఓపెనింగ్ వస్తోందని నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక తర్వాత నా పరీక్షలు. పై చదువులకి అమెరికా వెళ్ళాలి. స్కాలర్ షిప్ రావాలి.
ప్రభు చాలా త్వరగా అన్నిశాఖల్లో మెళుకువలు తెలుసుకొన్నాడు. అందరితో స్నేహంగా అందరి మనసులకి దగ్గరైనాడు. జూనియర్ ఆర్టిస్టులు జంకు భయం లేకుండా కబుర్లు చెపుతూ చుట్టూ చేరేవారు. అందీ అందని ఈ అందగాడ్ని అందరిలాగే స్నేహంగా ఉంటూ ఇష్టం పెంచుకుంది--భూమ, రకరకాల ’’బర్ఫిలు’ చేసి తెచ్చేది. ముందుగా’’ ప్రభు మీకు’’ అంటూ ప్రత్యేక శ్రద్ధ చూపేది. అప్పుడప్పుడు డబ్బింగ్ చెప్పేది. స్టూడియోల చుట్టూ తిరిగేది. డాన్సర్ కూడ! ఇద్దరి మధ్య పరిచయం పెరిగి పెనవేసుకోవడానికి, ఎక్కువ కాలం పట్టలేదు. రెండు సార్లు ఇంటికి తీసుకు వచ్చినా ఏమి అడగని అమ్మని ప్రశంసాపూర్వకంగా చూసి నవ్వాడు ‘’ఆమె ఆమోద ప్రకటన అంతేరా.” అన్నాడు తేలికగా. ’చిన్నవేషాలే వస్తున్నాయని సినిమాల్లో రాణించలేదని బాధగా వుందా?’ అంటే ’’నో’’ అన్నాడు.
‘’జోరా, ప్రభు పనిచేస్తాడు చూడు… అదే… హిం. ము. క్రి. ఆఫీస్ కి నన్ను తీసుకువెళ్ళు. ఇదిగో కారు తాళాలు’’ అంది. ఎందుకు? ఏమిటి? అనే అడిగే అలవాటులేనివాడిని, సందేహంగా ‘’ఎవరిని కలవాలి? ఫోన్ చేస్తాను” అన్నాను, ’’చేసానురా, ప్రొడ్యూసర్ గారినే కలవాలి’’ అంది. ప్రసాద్ విజిటింగ్ కార్డు మీద” అమ్మ” అని రాసి లోపలి పంపింది. వెంటనే రమ్మని పిలిచారు. ఆయన లేచి నిలబడి నమస్కారం చెప్పి కూర్చోమన్నారు. విషయం ఏమి నాన్చకుండా చెప్పింది… ’’మీమధ్య తిరిగే ప్రభు అమ్మని నేను. సినిమాల్లో ప్రవేశానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. వాడికి ఫోటోగ్రఫి ఇష్టం. మంచి ప్రవేశం సంపాదించుకొన్నాడు. ఎడిటింగ్, రికార్డింగ్ లాంటి పనులుకూడా నేర్చుకొంటున్నాడు. కానీ మీరు అవకాశం కల్పిస్తే హీరో అవగలడు, ఈ ఆల్బం చూడండి!” అని లేచింది అమ్మ. ‘’అయ్యో, కూర్చోండి... కాఫీ తాగండి. ఈలోగా ఆల్బం చూస్తాను. 10నిమిషాల పాటు చూసి ”చాల బాగున్నాయి షాట్స్, ఊటీ, కోడై, సూర్యాస్తమయాలు ఉదయాలు, అడవిలో కుందేళ్లు, జింకలు, పూలతోటలో సీతాకోక చిలుకలు, టపటపా రెక్కలు జోరుగా కొట్టుకొనే పొడుగు ముక్కు చిన్న పిట్టలు, అవే హమ్మింగ్ బర్డ్స్ కదా… ఇంకా రైల్వేస్టేషన్లో జనం, సామాన్లు, ఆఖరికి తులసికోట, అమ్మ, బాగుంది. ప్రతి కోణం అద్భుతం. ఇవన్నీ అతని ప్రతిభకి నిదర్శనాలు. జాగ్రత్తచేయ్యండి’’ అన్నారు. ‘’’మీ సమర్ధత లో నాకొడుకు భవిషత్తు చూడాలని ఉంది… హిం. ము. క్రి. అంటే ఏమిటా అనుకున్నాను… ఆ గోడ మీద ఫోటోలు చూసాను… గొప్ప ఆలోచన మీది... హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలబోత మీ సంస్థ… మత సామరస్యం పాటిస్తారన్నమాట, మన దేశమంత విశాలం మీ మనసు‘’ అంది. ఆయన నవ్వి ఊరుకొన్నారు.
‘’బాబు గారు, ఇతను జోగారావ్, జోరా అంటాము. నాకు రెండవకొడుకే అనుకోండి, యూనివర్సిటీ లో చదువుతున్నాడు, రాంక్ హోల్డర్! అన్నట్టు… నేను మిమ్మల్ని కలిసినట్లు ప్రభు కి తెలియనివ్వకండి. నొచ్చుకొంటాడు’’
‘’ఓ! షూర్ ! తప్పక మీకోరిక తీర్చే ప్రయత్నం చేస్తాము, సంతోషంగా వెళ్ళండి ‘’ అన్నారు.
దారిలో అమ్మ చెప్పింది ’’జోరా, ప్రభుకి పెళ్లి చేస్తున్నాను. ఈ ఫోటో చూడు… జడలో పూలు, పెద్ద జరీ చీర, నగలు, సంప్రదాయకంగా వుంది … ఆనందంగా కనబడుతున్న అమ్మాయి- ఆనంది!!”
’’బాగుంది అమ్మ!’’ అన్నాను.
ఎక్కడో అసంతృప్తి నాకు.
అమ్మే అంది మళ్లీ… ”ఈ కాలం పిల్లలలాగా చేతుల్లేని రవికెలు, బిగుతు ప్యాంట్లు, బొడ్డు కనపడే చొక్కాలు వేసుకోదు. పిల్లని మనింటికి తీసుకు వచ్చారు. తెల్లగావుంది. బుద్ధిమంతురాలు. పనిమంతురాలు. ప్రభు షూటింగ్స్ కి వెళ్ళిపోతాడు. ఎన్నాళ్లని నేను ఒంటరిగా ఉండాలి చెప్పు, వాడికో సంసారం కావాలి కదా. నీకిష్టమైతే నాకు సమ్మతమే అన్నాడురా ‘’ గొంతు బొంగురు పోయింది, మాటరాక కళ్ళుతుడుచుకొంటూ ఉండిపోయింది. ఎప్పటిలా నాది మౌనమే.
ఇంత జరిగినా నాకు తెలియలేదు, అమ్మ జాగ్రత్తపడిందా? నిజంగా వాడికి అమ్మచూసిన అమ్మాయే సరేమో. నోములు వ్రతాలూ చేసుకొంటూ పిల్లల్ని కంటూ, అత్తగారి కనుసన్నల్లో మెలుగుతూ, ఎప్పుడో అప్పుడు కనబడే చందమామలాంటి భర్తని తల్చుకొంటూ ఎదురు చూపులు చూసే తెలుగింటి ఆడపడుచు! బాగుంది. ఒక్కమాట చెప్పని ప్రభుని ఏమని అడగాలి? మనసు చివుక్కుమంది. ఆమె పోస్టుగ్రాడ్యుయేట్? పోనీలే చదువుకొన్నదే.
‘’పెళ్ళిట కదా. చెప్పలేదు’’ అంటే… ‘’అమ్మచెప్పింది, ఫోటో కూడా చూపించాను అంది’’ అన్నాడు. ‘’అమ్మకి నచ్చింది’’. ’’ఆహా, అమ్మసెలెక్షన్ కి నీ ఆమోదముద్రా?’’ అంటే ‘’ఇంట్లో శాంతి. ఈ మలుపు జీవితంలో ఒక రాజీ అనుకో’’ అన్నాడు, ‘’సరే, సరే‘’ అని ప్రేమగా కౌగిలించాను. ప్రభు కలల రాకుమార్తెలు, మోడల్స్ కి తీసిన ఫోటోలు చూసి, ఎoత అల్ట్రా మోడెర్న్ భార్యని తెచ్చుకొంటాడో అనుకునేవాడిని, నిరుత్సాహంగా అనిపించి, ఏమనాలో తెలియక ’’మాట్లాడావా’’ అన్నాను.
“మాట్లాడాను... ‘నా పని సినిమాలలో, తెలుసా’ అంటే ‘తెలుసు’ అంది… అన్నాడు… అమ్మకోసమా. తన కోసమా ఈ పెళ్లి. సంతోషం గా అనిపించలేదు. రాజీ పడాలేమో!
ప్రభు పెళ్లికి ఆఫీస్ జనంతో భూమ కూడా వచ్చింది. ’’పెళ్లికూతురు బాగుంది కదా జోరా గారు‘’ అంటూ మాట కలిపింది, ”దేశంలో సగం పెళ్లిళ్లు ఇలాగే అవుతాయి. మనకి సర్దుకు పోవాలని చిన్నప్పట్నుంచి నూరిపోసి తలకి ఎక్కిస్తారు. సినిమా వాసన అంటని పువ్వు. ప్రభుకి అడ్డంరాదు’’ అని ఒక కొంటెనవ్వు విసిరింది.
“హుష్, దూరం! దూరంగా జరగాలి’’ అన్నాను హెచ్చరికగా!! భూమా విసిరిన ఆ నవ్వు ఛాలెంజ్ అనిపించింది.
నేను అమెరికా వెళ్లే ప్రయత్నంలో యూనివర్సిటీ హాస్టల్లో ఉండిపోతుండటంతో ప్రభు ని కలిసే సమయం కుదరలేదు. రెండుసార్లు వెళ్లినా అమ్మ తప్ప ఆనంది కనపడలేదు. ఆషాడం పుట్టింటికి వెళ్ళిందిట. ప్రభు ఫోన్ లో సారీ చెప్పాడు. మరోసారి వెళ్లినపుడు అమ్మ చెప్పింది “ఆనంది-ఒంటరిగా తోచటం లేదు అనేది. నా ముసలి స్నేహం నచ్చలేదు. వాళ్ల అక్క దగ్గరకి కేరళ వెళ్ళింది, అక్కడే ‘’ఏదన్నా కోర్స్, చేస్తాను’’ అందిరా’’ అంది. ‘’అదేమిటి? ఇక్కడే బోలెడు కోర్సులు చేయవచ్చు. నాతో చెప్పలేదేమమ్మ?’’ అన్నాను. మనసు ఆగక ‘’ఎప్పుడు వస్తుంది? దగ్గరపెట్టుకొని నీ వెనుక తిప్పుకొంటావనుకొన్నాను, నీకు తోడుగా’’.
నా మాట పూర్తి కాకుండానే అమ్మ అంది ‘’ఎన్నో అనుకుంటాం, అవుతాయా? మంచిపిల్ల, అణుకువగా ఉంటుంది అనుకొన్నాను. ఏం చేస్తాం. ఆగి చూద్దాం. అది సరే, నేను యాత్రలకి వెడుతున్నాను 2 నెలలు. నేను వచ్చేదాకా ఉంటావా, అమెరికా ఎగిరిపోతావా? వెళ్లకపోతే. నా దగ్గరకు వచ్చి ఉండు. ’’ అని లేచింది… అంటే ‘ఇంకా మాటలు వద్దు’ అని చెప్పడమా?
4
ప్రభుని అడిగెయ్యాలి- పెళ్లిచేసుకొన్నాడు. ఇంట్లో ఇల్లాలు వాడికోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అన్నస్పృహ లేదా. ఏమి తేడా వచ్చింది? చదువుతానని వెళ్లిపోవడం నమ్మేట్లు లేదు. అంత తేలిక విషయమా. మనసు ఆగక ఆఫీసుకి ఫోనుచేస్తే వచ్చాడు తాపీగా.
‘’’కాపురానికంటూ వచ్చింది. నచ్చలేదు. వెళ్ళిపోయింది’’ అన్నాడు, “బాగులేదురా, చిన్నవిషయం కాదు. నీ భార్యగా వచ్చింది. నీ షెడ్యూల్ మార్చుకో. నీ పని, దాని ప్రాముఖ్యత అర్ధం అయ్యే లాగా చెప్పు. నీతో పనిచేసే రెండు మూడు కుటుంబాలని పరిచయం చెయ్యి, సినిమా లోకం అర్ధం అవాలి కద అన్నాను’’, చటుక్కున వాచీ చూసి ’’మళ్ళీ కలుస్తాను’’ అని ఆగి అన్నాడు.
‘’అమ్మ తన వెంట తీసుకువెళ్ళేది. నువ్వు స్క్రిప్ట్ రాయడం లాంటివి నేర్చుకోమ్మా, ఏదైనా నీకు నచ్చింది నేర్చుకో, ఈ సినిమాలోకంలో ఇమడాలి మరి, అన్నారుట అందరు, మరి ఏమనుకొందో. వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి అటువంటి ఆలోచన లేదంది అమ్మ.”
“అమ్మగీసిన ఛట్రంలో ఉన్న సోదరా. చట్రంలో ఇంకో జీవి చేరిందిరా. సఖ్యత కావాలిరా. ఇది నీ జీవితం రా” అనే లోపు మరోసారి వాచీ చూసి “మళ్ళీ కలుస్తాను’’ అని వెళ్ళిపోయాడు. మనసంతా ఖాళీ. నేను ప్రేక్షకుడిగానే మిగిలిపోయానా???
గతంలోకి ----
నామనసు గతంలోకి పరుగులు తీసింది. జ్ఞాపకాల గతుకులు, రాళ్లు నీటిచెలమలు,
ఎప్పుడు కనపడేవే! ’’తండ్రి లేని వాడు’’ అని నన్ను ఇక్కడ హాస్టల్లో చేర్చింది నాతల్లి!! హాస్టల్లో పాస్టర్ గారు చాల దయగా చూసేవారు. ఆరోగ్యం, చదువు, ఆటలు అన్నిటా రాణించాలి, అంటూ ప్రోత్సహించేవారు. ’’నాకు ఎవరు లేరు, అమ్మ ఎందుకు రాదు?’’ అనిపించినపుడు దుఖం వచ్చేది. పాస్టర్ చెప్పారు ‘’నీకు లాగా తండ్రి లేనివాళ్ళు ఉన్నారు. నీ ఫ్రెండ్ ప్రభుకి కూడా తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు. అమ్మే అన్నిసంగతులు చూస్తుంది.
‘మా అమ్మ నా కోసం రాదు. మా నాన్నని చూసిన గుర్తు లేదు సార్’’ కళ్ళమ్మట బొటబొటా నీళ్లు కారిపోయాయి నాకు.
పాస్టరు గారు దగ్గరగా వచ్చి చెయ్యిపట్టుకొని వరండాలోకి తీసుకొని వెళ్లారు. ‘’చూడు, ఈ పిల్లలు, ఆటలు. స్కూలు… సంతోషంగ లేదూ… నువ్వు వీళ్ళలో కలిసిపోవాలి. నీకు ఈ అవకాశం మీ అమ్మే కల్పించింది. ఆవిడా బతకాలి కదా, మరొకరితో జీవిస్తోంది, నువ్వు పెద్దవాడివైనాక మానవ సంబంధాలు, విలువలు తెలుసుకొంటావు మై చైల్డ్. అదిగో ప్రభు వాళ్ల అమ్మ. నిన్నుచూపిస్తాను. వాళ్ళ ఇంటికి సెలవల్లో వెళ్ళవచ్చు. నిన్ను చూసి వాడు చదువుకోవాలి. నీ చదువు మాత్రం చెదరకూడదు. రీసెర్చ్ స్కాలర్ గ పేరు తెచ్చుకోవాలి, అమెరికా లో చదువుకోవాలి. గుర్తుపెట్టుకో’’ అన్నారు.
మంచి జరీచీర కట్టుకొని ఎంతో దర్జాగా ఉన్నమధ్యవయస్కురాలు ప్రభు అమ్మ!! ముగ్ధుడిని అయిపోయాను. “ప్రభు తీసుకు వస్తాడు. నువ్వు ఆదివారం ఇంటికి రా. నీ గురించి పాస్టర్ గారు చెప్పారు మొన్న. ప్రభు, నువ్వు కలిసి బాగా చదువుకోవాలి సరేనా ‘’. నవ్వుతూ వెళ్ళిపోయింది. ఒక నెల రోజుల్లో నా తెలివితేటలు, అనవసర ప్రసంగం చెయ్యకపోవడం, విషయాలు కూపీ లాగటం లాంటి చిరాకు పనులు చెయ్యని నన్ను అమ్మ ఆమోదించింది. ఎన్నడూ పుట్టినరోజు కార్డు కూడా ఎరగని నాకు అమ్మ సైకిల్ కొని ఇచ్చింది. హ్యాపీ బర్త్ డే చెప్పింది. ఆ రోజు పాస్టర్ గారు స్కూల్ ప్రేయర్ హాల్లోని మేరీ మాత విగ్రహం ముందు నిలబెట్టి నాచేత ప్రమాణం చేయించారు. -’’-ఎల్లప్పుడు పరిధులు దాటని ప్రవర్తననే సాగిస్తానని, లేనిదానికి దుఃఖపడక, లభించిన దానిని గొప్ప ఆశీర్వచనం గా స్వీకరిస్తానని’’--
5
అలా సాగిన మా స్నేహం ఎన్నడూ వాడలేదు. వాడు సంపన్నుల బిడ్డ. ఎప్పుడూ మైసూర్ శాండల్ పెద్ద గుండ్రని సబ్బులనే వాడేవాడు. వాడివి, నేను ఎన్నడూ వాడలేదు. కానీ
లావెండర్ పెర్ఫ్యూమ్ నాకు చాల ఇష్టం అని చెప్పాను. అప్పటినుంచి నన్ను ‘లావెండర్ బోయ్’ అని పిలుస్తూ... ఆ పెర్ఫ్యూమ్- నే ఇచ్చేవాడునాకు. వాడిని ’’మైసూర్ శాండల్’’ అని, ఆ సబ్బులాగే గుండ్రని ముఖమని తరుచు ఉడికించే వాణ్ణి! ఇప్పుడు ఏమైంది? అమ్మ యాత్రలకి. ప్రభు సింగపూర్ షూటింగ్స్ కి. ఆనంది- నా వదినా? చెల్లెలా? తేలకుండానే వెళ్ళిపోయింది. నేను అమెరికా వెళ్లే లోగా కలవాలి. ఎలా? ఇలా జరగవలసివుందా, లేక ఏదన్నా పథకమా...
ఆలోచనలతో ఊపిరి సలపక హీo ము. క్రి ఆఫీస్ కి పరుగు పెట్టాను, పెద్దాయన ఇంటి దగ్గరే వుంటున్నారని తెలిసింది. రమ్మంటున్నారని సెక్రటరీ చెప్పింది. పెద్ద తివాచి పరిచినట్లున్న ఆవరణ, ఫౌంటెన్, నీటికొలనులో తామరలు. గుర్ఖాలు, పెద్ద కుక్కలు. అందమైన బంగాళా, అట్టహాసంగా, సినిమా సెట్టింగ్ లాగే ఉంది, వరండాలో కూర్చున్నాను.
‘’జోరా, చాలారోజులకి!! రారా!’’ కొద్దిగా వొంగి చెయ్యి చాపారు. ఆ ఆహ్వానం, చిరునవ్వు,
సాయంత్రపు నీరెండలో మెరిసిన ప్రసన్నత. సినిమా విజయాలు ఆనందంగా అనుభవిస్తున్న వ్యాపారస్తుడు, మనసున్న మంచి వ్యక్తి. ప్రభు గురించి అడగగాలి.
కులాసా కబుర్లు, అమెరికా లో నా రీసెర్చ్ ఎక్కడ చేసేది వివరాలైనాక… ప్రభు అవుట్ డొర్ షూటింగ్స్ ట. కలవలేదు’’ అన్నాను. సింగపూర్, లండన్ టూర్. యూనిట్ అందరు వెళ్లారు. నేను ఒకసారి అడిగాను. నీ భార్యని సింగపూర్ తీసుకువెళ్తావా అని “లేదు’’ అన్నాడు “ఏం” అంటే -‘’అమ్మదగ్గర సంతోషంగా ఉంది’’, “మరి, నీ సంగతి” అంటే నవ్వి ఊరుకున్నాడు. ఏమి చెప్పలేదు. నేను లేనిది ఏదో ఊహిస్తున్నానేమో అనుకున్నాను. అమ్మ కోడలిని తీసుకొని నా భార్యని అప్పుడప్పుడు కలిసేది. ’’సినిమా లోకం. కొత్త కదా అనిపిస్తోంది. కొన్నాళ్లు వాళ్ల అక్క దగ్గరకి కేరళ, త్రివేండ్రము వెళ్లి చిన్న కోర్స్ ఏదైనా చేస్తుందిట. కాలక్షేపం చదువు. వెళ్లిరమ్మన్నాను’’ అందిట. ఆది విన్నాకే సింగపూర్ తీసుకువెళ్ల మన్నాను.’ అన్నారాయన.
ప్రభు తటస్థ వైఖరికి నాకు బాధ అనిపించింది. నేను అమ్మ కొంగు చాటు తెలియని వాడిని. కొంగు తియ్యలేడా? ఎందుకు? భయమా? తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ… అంతేనేమో... ’
నిజజీవితం
12 సం. గడిచాయి, ఎప్పుడు మాట్లాడినా తాను డైరెక్ట్ చేస్తున్న సినిమాలు. డబ్బింగ్ సినిమాలు గురించే చెప్పేవాడు. ఆనంది గురించి మాత్రం మౌనం. నాకు యూనివర్సిటి లో పని పడింది.
సంతోషంతో “నేను పైవారం దేశం వస్తున్నాను, ఎటు పారిపోకు’’ అన్నాను, “నేను సికింద్రాబాద్ లో ఉంటున్నాను ఇప్పుడు. వివరాలు మెయిల్ రాయి. పూలదండలు వేసి తీసుకువస్తాను మిత్రమా’’ అన్నాడు.
‘’కంగారు పెట్టకు. నేను సినిమా వాడ్ని కాదు’’ అన్నాను. అదే ప్రేమ. మార్పు లేదు. మనసు హాయిగా ఉంది.
ఏరో ప్లేన్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో ఆగగానే నెమ్మదిగా హ్యాండ్ లగేజి తోసుకొంటూ సూట్ కేసులు తెచ్చే కన్వేయర్ బెల్ట్ వైపు వెళ్లి, ట్రాలీలో సామాను పెట్టి నెమ్మదిగా బయటకి దారి ఎటా అని చూస్తుంటే... చల్లగాలి, స్వదేశీ పరిమళాలు, తగిలి వొళ్లు గగుర్పొడిచింది.
6
అబ్బా! ఎంత పెద్దది ఎయిర్ పోర్ట్! దేశం నిజంగా బాగు పడింది, తెలుగువాళ్ల రాజధాని కదా.
ఎక్కడా ప్రభు? అసలు గుర్తు పట్టగలనా, నేనేమీ మారలేదు అంటారు తెలిసిన వాళ్లు… ఇంతలో- ‘’హాయ్. లావెండర్ బాయ్, వెల్ కం’’. వినిపించిన వైపు చూస్తే ‘’ప్లా కార్డు’’ కనపడింది
మనిషి ఎవరో ముఖం కనపడలేదు. దగ్గరగా వెళ్లి “ముఖం కనపడనీయవోయ్- ’మైసూర్ శాండల్’’--
అంటే అదే ముసిముసి నవ్వు ముఖం. గట్టిగ కౌగలించుకొని’ ’నువ్వు మారలేదు.” “నువ్వూను!’’ ’అని ఒకరి పొట్ట ఒకరు నొక్కుకుని పకపకా నవ్వుకున్నాం. వీధుల్లో పరుగు పెడుతున్న కారు కంటే జోరుగా జ్ఞాపకాల తెరలు విప్పుకొంటూ ఉంటె, దొర్లుతున్నకబుర్లు, నవ్వులు. ఎప్పుడు చేరామో, పెద్ద మల్టి స్టోరీ బిల్డింగ్ ముందు ఆగాము, లిఫ్ట్ అలా పోయిపోయి టక్కున ఆగింది... ‘’ఓ. పెంట్ హౌస్, డైరెక్టర్ హోదా???కంగ్రాట్స్” అన్నాను. ఇంతలో ఒక చక్కని ఆమె మంచినీళ్లు, కాఫీ కప్పులతో వచ్చింది. “నమస్కారం, రండి... ప్రభు కి ఆప్తులు, బంధువు, స్నేహితులైన మీరు వచ్చినందుకు చాల సంతోషం. మాకు కూడా ఆప్తులే’’ అంది… నాకు తెలుసా?? ఆలోచన తెగకముందే, చటుక్కున ఇద్దరు పాపలు వచ్చి ప్రభుని చుట్టే శారు. “సింధు, బిందు. కవలలు, 5సం లు. తను భూమ” అన్నాడు...’’భూమ! భూమా? అరె, చాలారోజులే అయింది. బర్ఫీ అమ్మాయికదా’’ అందరు నవ్వుకున్నాం. పిల్లల్ని తీసుకొని ప్రభు ఐస్ క్రీం అంటూ వెళ్లాడు.
‘’పెద్దాయన ఈ ఏర్పాటు చేసారు. ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసి 5 సం. లు అయింది. అవుట్ డోర్ షూటింగ్స్ తప్పవుకదా. పిల్లలకి స్కూలు, డాన్స్ లకి వీలుగా, అందరికి కాస్త దూరంగా ఉన్నాం అమ్మ ఈ అపార్టుమెంట్ కొన్నాక వచ్చారు. “విడాకులు తీసుకోలేదు… కష్టం. తెలుసుగా!” మళ్లీ అమ్మే అన్నారు... “ఆమె రాదేమోలే. మీ ఇష్టం. తెలిసుండి దూకారు” అన్నారు. అపార్టుమెంట్ ప్రభుది. పిల్లలకి బంగారం కొనమని లక్ష రూపాయలు ఇచ్చారు.” అని చెప్పింది. కాస్త ఆగి సందేహిస్తూ అంది ----’ఆమె చనిపోయారు. మీకు తెలుసా? జొరాగారు?’ “నో, నో షాకింగ్ వార్త’’ అన్నాను. “ఆమె ఉన్నది” అని నన్ను భయపెట్టాలని--అమ్మ ప్రయత్నించారు. అని కొంటెగా నవ్వింది. ప్రభుకి తెలుసు ఆమె లేరని.”!
ఇంతలో ఐస్ క్రీం డబ్బాతో ప్రభు వచ్చాడు. వాడి సంతోషం, ఇల్లు, పిల్లలు మనసెరిగిన ఇల్లాలు సంతోషంగా అనిపించింది. ’’ఈ మందహాసం. చిరునవ్వు వెన్నెల ఎల్లకాలం నీకు దక్కాలి‘ మనసారా ప్రార్ధిస్తున్నాను అనుకొన్నాను. హీరో కాకపోయినా, డైరెక్టర్ గా రాణిస్తావ్ బ్రదర్. బై’’చెప్పాను.
కాలం కొంత కరిగాక...
సింధు, బిందు అమెరికా డాన్స్ టూర్ వస్తున్నారని ప్రభు మెయిల్ రాసాడు, ఈ తానా, పానా వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ దూరాలు. ప్లేన్ ఖర్చు, హోటల్ ఖర్చు +తానా టికెట్స్. ప్రభు రావటం లేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్!
అయినా గ్రూప్ లో వస్తున్నారు కదా. పోనీ పిల్లలకి పరిచయం చేద్దామంటే మా సగం అమెరికన్ పిల్లలు రారు. వీళ్ళు క్రీడాకారులు. టోర్నమెంట్స్ అంటే పరుగులు పెట్టేస్తారు. ఆమ్మో ‘తకధిమి’ లా? అని గుడ్లు తేలవేస్తారు. బాయ్స్!! మరి లీసా పెంపకం. సింధు బిందులకి బెస్ట్ విషెస్ తో బోకే పంపేసాను.
మరి కొంత కాలం గడిచాక ---
కొత్త పేరుతో ఒక ఉత్తరం వచ్చింది. ఎవరబ్బాఅని ఆశ్చర్యపోతూ తెరిచాను.
7
‘’ లావెండర్ బోయ్. జోరాగారికి. నమస్కారములు. ప్రభు లేరు, వారి భార్యగా బతికిన నేను
వారి ఆప్తులైన మీకు కొన్నినిజాలు చెప్పాలి. 1. నెల కంటే ప్రభు తో సహచర్యం చెయ్యని నేను
అత్త, భర్తల ఆదరణ కరువైన ఆడపిల్లనా? నేను ఎవరింటి కోడలిని, ఎవరికి ఇల్లాలిని?
భర్త స్పర్శ ఎరుగని నేను ఏ కర్మకాండలు అనుసరించాలి? ఏ శాస్త్రం చెప్పగలదు. తటస్థ వైఖరి గల ప్రభు అమ్మ కొంగుచాటు కొడుకు. నా కొంగు తగలకముందే ఇంకో చక్కని కొంగు దొరికింది. అమ్మ తన కొంగు తప్పించింది. “సినిమా లోకంలో ఇమడలేని మాలోకానివి. పోయి చదువుకో’’ అన్నారు... నేను ఇమడలేను అనలేదే. ఎలా నిర్ణయించారు? నా కొంగు రంగులు ఏవో తెలియని ప్రభుకి, నా కొంగు రెపరెపలు కనబడనీయలేదు. అతని చేతికి అందిన చక్కని మెరుపుల కొంగులో ఊపిరి ఆడలేదు. బ్యాంకు అక్కౌంటే లేని ధర్మాత్ముడు! మనుషులు రాసిన గీతలని విధి రాతలు అనవద్దు, భౌతికమైన బంధాలు ఒదులుకొన్నదాన్ని. అందరూ సోదరీ, సోదరులే నాకు. తెరమరుగులోని కొంగు లేని-కోమలిని. ఆనంది.
స్వామిని ఆనందమయి,
చిన్మయ ఆశ్రమ్, త్రివేండ్రమ్
తొలగిన తెర
ఉత్తరం ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నాక, భూమకి ఫోన్ చేశాను. ప్రభు హార్ట్ ఎటాక్, వాడు అన్నిబంధాలు తెంచుకొని పోవడం జరిగాక, ఇప్పటికి ఎన్నోసార్లు ఫోన్ చేశాను. భూమ ఏమీ చెప్పలేదు. ‘’ఎలా ఉన్నారు?” అని మళ్లీ ఏమైనా చెపుతుందా అనుకొని అడిగాను, ’’అమ్మ ఊరు వెళ్లిపోయారు. ప్రభు కర్మకాండలు పూర్తిచేసాము. మా వాళ్లు నాతో ఉంటారు.” తమాయించుకోలేక అడిగేసాను- ‘’ఆమె తరుపున ఎవరు రాలేదా?’’ కొంత నిశ్శబ్దం. నెమ్మదిగా చెప్పింది ‘’పిల్లలు పుట్టేముందే, ఆవిడ నిజంగా చనిపోయారా? ఏమైపోయింది- అని వెళ్లి తెలుసుకున్నాను. చిన్మయ దీక్ష తీసుకున్నారు… అందుచేత పూర్వాశ్రమ జీవితం వొదిలేసినట్లేకదా, చనిపోయారంటే అదే అర్ధం. మేము తిరుపతిలో పెళ్లిచేసుకున్నాం. అని అమ్మకి చెప్పలేదు. తెలుసుకొన్నారు జోరా గారూ… తరువాత ఆమెతో చెప్పాలనే నేను త్రివేండ్రం వెళ్లాను- ‘మీది నేను లాక్కోలేదు. మీరు తోసివేయబడ్డారు. నేను జరిగి ఆక్రమించుకొన్నాను అంతే’ అని చెప్పాను. ఆమె చిన్నగా నవ్వారు. “ఆధ్యాత్మికంగా చాలా దూరం వెళ్ళిపోయాను, దీక్ష తీసుకొని 10 సంవత్సరాలు అయింది. కేరళ లోనే అటు, ఇటు, ఉపన్యాసాలకోసం మిషన్ తరఫున వెడుతూవుంటాను’ అని చెప్పారు. నామనసులో గిల్టీ నెస్ మాయం చేసుకున్నాను. ఇప్పుడు ప్రభుని హాస్పిటల్లో చేర్చిన రోజు ఆమెకి ప్రభు వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్పాను. వెంటనే వచ్చారు. మీ గురించి అడిగారు. చెప్పాను!’’
నాకు పజిల్ విడిపోయింది…
‘’వింటున్నారా జొరాగారు, మరో స్వామిని కూడా వచ్చారు. కాషాయరంగు చీర, పొట్టిగా చెవులమీదికి కత్తిరించిన జుట్టు, తలమీదనుంచి ముసుగు, కళ్ళజోడు తో ఉన్న వీరిని ఎవరు గుర్తించలేదు. చిన్మయమిషన్ నుంచి వచ్చారని అందరు గౌరవంగా తప్పుకున్నారు’’ అంది. నాకు ఆమె రాసిన ఉత్తరం సంగతి భూమకి చెప్పాలి అనిపించలేదు.
ఆనందికి జవాబు రాసాను. –
స్వామిని ఆనందమయికి—నమస్సులు! ఆధ్యాత్మికంగా ఎదిగి ఆ దారినే ప్రభోదిస్తున్న మీకు సంతోషం, సౌఖ్యము కలగాలని ప్రార్ధిస్తాను. నాకు స్కూల్లో పాస్టర్ గారి వల్ల ప్రార్ధన మీద విశ్వాసం కుదిరింది. అతి సాధారణమైన ఆడపిల్లల్లో ఇంతటి విచక్షణ, తెగువ, మార్గనిర్దేశం చేసుకోగల సమర్ధత అరుదు. మీకు జోహార్లు!!!
జొరా
-మాన్ హాటన్. న్యూయార్క్
*****
వి.వాణిమోహన్(అమృతవాణి)
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పుట్టిన వీరు భర్త కృష్ణమోహన్ ఉద్యోగరీత్యా పలు భాషా ప్రాంతాలలో నివసిస్తున్నపుడు, ఆయా ప్రాంతాలలో చిన్నారులకి తెలుగు భాషని పరిచయం చేయటం, పాటలు పద్యాలు నేర్పడం సరదా వ్యాపకం గా గడిపారు. ప్రపంచ తెలుగు సమాఖ్య, పొట్టి శ్రీరాములు సొసైటీ, ఆంధ్రమహిళా సభలలో సభ్యత్వం ఉత్తేజాన్ని కలిగించాయి.
చెన్నైలో స్థిరపడి ఈ సంస్థలతో అనుబంధం పెంచుకున్నారు. AIR తో అనుబంధం. 15 సంవత్సరాలుకి పైగా కథలు, కవితలు రాయటం, చదవటం జరిగింది. TULIKA సంస్థకి చిన్నపిల్లల పుస్తకాలు అనువదిస్తూ ఉంటారు. ఎండు ఆకులు పూవులతో గ్రీటింగ్స్, కొత్తవి, పాతవి వంటకాలు చేయటం అభిరుచి.