top of page

సంపుటి 2  సంచిక 2

Anchor 1

కవితా  మధురాలు

నిర్వహణ: చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు

kavita@madhuravani.com 

పెళ్ళి కూతురి పాట

~సుమన  నూతలపాటి

నీ అడుగులలో నా నడకలు కలిపి

నీ చిటికిన ఏలెంట నా సూపులు నిలిపి

నీ మాట, నా మాట ఒక మాట అంటి

నీ నీడ నా తోడు నా కోసమంటి

 

ఏ నాడు అమ్మని వొదిలి వుండలేదు

ఏ రోజు అయ్య మాటెదురు సెప్పా లేదు

తోబుట్టువులనొదిలి తన వూరి నొదిలి

ఏడు సంద్రాల్దాటి ఏకాకినై వొస్తి

 

నలిపితే నలుసునై నలిగి పోతాను

కసిరితే తుళ్ళూతూ అదిరి పోతాను

మెల్లగా తాకితే మొక్కనై మొలుస్తా

సల్లగా సూస్తే సెట్టునై పెరుగుతా

 

కొమ్మల్లు అల్లి నీ నీడ నిలుస్తా

నట్టింట్లొ నవ్వుల్లు నాట్యమాడిస్తా

కాయల్లు కాసి నీ కడుపు కాస్తా

వట వృక్షమై నిన్ను వొడిలోన లాలిస్తా

 

నీ పేరు నీ తీరు నాకు జోడిస్తా

పరదేశ పొకడులు పట్టుబట్టేస్తా

ఏటెరుగను నేను, ఏమి చేస్తావో

ఎట్లాగ సూస్తావొ నా బతుకు నీదింక.

వలస విహంగం

~నాగ అంబటిపూడి

అనంతమైన ఆత్మవిశ్వాసపు శ్వాసనాడిస్తూ

అద్భుతమైన ఆశయాల రెక్కలు రెపరెపలాడిస్తూ 

సుడిగాలి సమస్యలు సమర్ధవంతంగా స్వీకరిస్తూ

తేకువవేకువ కళ్ళ కారుమబ్బులు కనిపెట్టి కరిగిస్తూ

గుర్తెరిగినట్టు గగనతలమంతా గబగబ గస్తీ తిరిగేస్తూ

కోటి కలల తీర్చు కొలువునెలవుకు పట్టుకొమ్మలనెతికేస్తూ

పూచిక పుల్లలు పిడికెడు గింజలు పోగేసి పుక్కిట పట్టేస్తూ 

పొట్టపోసుకునే పరమహంస పాలపిట్ట పావురాళ్ళని 

స్వయంశక్తి శాంతి స్వేచ్ఛాపూరిత విహార విహంగాల

పగపట్టి, పొగపెట్టి, పట్టుబట్టి వలసవాలాయని వెక్కిరిస్తూ

గేలిచేస్తూ, గుంపులుకట్టి,  గోడలుగట్టి, గొడవలుపెట్టి, గగ్గోలు పెట్టిస్తూ

తుపాకీ గుళ్ళతో పిట్టల ప్రాణాలు తీసేంత కృూరరాక్షస కసి కల్మషమా ?

జీవజంతుకోటి మధ్య జాతీయతా జగడాలా ? పౌరసత్వపు పోరా?

ప్రకృతిలో వికృత వైరి వైషమ్యమా? జాత్యహంకార జ్వాలలనెగదోసి

అవసరాలను తీర్చి ఆదుకునే అడవినంటించుకుంటూ పోతే

దుర్మార్గపు దావానలాన కరుణ కరువైన కాఠిన్యపు కారుచిచ్చుకు

మలమల మాడిపోయేది, మరోమారు ఓడిపోయేది మానవత్వమే 

మంచితనం మనుగడకై మనిషి మేలుకో మమతను కాపాడుకో !!!

Anchor 2
Anchor 3

నిరాశకూ, నిరీక్షణకూ  మధ్య రోజు మొదటి  ప్రారంభమైంది 

గగనంలో నిస్తేజంతో మథనపడే  సంస్కృతి 

జనశ్రేణి నిందలననుసరించి ప్రభ రంగం నిష్క్రమిస్తోంది 

భయాల దారుల్లో సంచరించే తలలు స్వర్గద్వారాలు చిత్రిస్తున్నాయి 

 

కాలం విసుగెత్తి తిరగబడి గొంతులపై నిలుచుంది 

నుదిటిపై గాయం నెత్తుటితో నిలుచుని గండాన్ని తప్పించింది 

అర్థం లేదనుకున్న నిర్ణయం ఎదురుగా వచ్చి మనసారా హత్తుకుంది 

ఆలోచనల పూరి విడివడి అనుభవాలు విరియబూసింది 

 

శిశువు అడుగు వేయడం తొలి విజయం 

ఉగాది లక్ష్మి ఎదురు రావడం చిరాయువుతనం 

సుఖంలో రెండు పుష్పాలు .. దు:ఖంలో రెండు బాష్పాలు

జీవిత గమనంలో తప్పనివే కానీ ప్రేమతో పలకరించే ఉషస్సులు 

 

ఉగాది వత్సర కాలపు ఊయలను దిగి 

స్వేచ్ఛా వాయువుగా మారాలని చేసే ప్రయత్నంలో 

వెనక నుండి మావి చిగుళ్లు గుప్తంగా దాగున్నాయి 

మంచు కమ్మిన మొగ్గలు వేప కాంతులు పూలపడవలై తేలుతున్నాయి 

 

మనిషిని ఆనుకున్న అనలాభిషేకం ఎరుపెక్కినట్లున్నా 

ఆకలి ఎరుగని ఆశాబింబంతో అదృష్టం అలంకృతమవుతుంది 

చింతల రాతి కొండలపై అక్కడక్కడా చెట్లు మొలిస్తే చాలదు కదా 

అణువణువునా చేతనతో అక్కడక్కడా హరిత హృదయాల్ని ఉంచితే సరిపోదు 

 

గాలినీ, వెలుగుని, ఆప్యాయంగా ఆహ్వానించే పచ్చదనానికి 

ఏ పాపము తెలియకుండా, ఏ ప్రమేయం లేకుండా 

ఒక మనిషిని వేళ్ళాడతీయచ్చు కానీ పండుగ ఆనందాన్ని కాదు 

నిన్నటి మనిషికి బదులు మానవత్వాన్ని అమర్చాలి తప్పదు 

 

స్వేచ్చకు అర్థం రెండు రెక్కలు విరిచి ఆకాశంలో ఎగరటం కాదు 

భూమికి వచ్చే తొలి ముత్తయిదువ ఉగాదితో సమాధానం కాలేదు 

మనస్సులో మొదటి విక్రమార్క సింహాసనం శ్రమ సాధనమైతే 

ఈ శతాబ్ది ఉదయాలన్నీ బయటకు నవ్వుతు కదులుతాయి 

 

వృద్ధుని ముందు పసిబాలునిలా కొమ్మకు చివుళ్ళుంటాయి 

నిశ్శబ్దం అంచుల్లో భవిష్యత్తు ఫాలాతలంపై ప్రతిఫలిస్తాయి 

హేవిళంబి రానీ, రాకపోనీ పగటి వేషాలు మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాయి 

భవిష్యత్ ఆలోచనలు మాత్రం కొత్త సంకల్పానికి తోడవుతాయి 

 

సంకల్ప నవోదయంతో నూతన ధారతో వర్తమాన దర్పణం 

వదిలి వెళ్లని మహా సంస్కృతి, అణువణువులోని ఆనందం  

ఉగాది సిద్ధమైంది, మరొక మధురమైన సన్నివేశం మిగిలుంది 

సంకల్పం కావాలి.. సంఘటితమై కదలాలి ..మనిషిగా మిగలాలి అంతే..!

ఉగాది సిద్ధమైంది

~శైలజ మిత్ర

అదేమిటో

జీవితమంటే వేసవేనంటూ

అన్ని కాలాలూ ఒక్కటై ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే

అలసట ఆవిరి మేఘాలై కమ్ముకుంటాయి

నవ్వులెక్కడంటూ నడకలెక్కడంటూ

 

బతుకుచిత్రం దిగులు ఛత్రంతో

పొగలరంగుల్తో మసకేస్తుంటుంది

ఒక్కో కలా  కరిగి కరిగి

ఆవేదన వడగాడ్పుల్లో వేగిపోతూ

ఆలోచన ప్రవాహాల్లో మునిగిపోతూ

అమాయకత్వాన్ని నింపుకుంటుంది

 

నిజమే కానీ

ఇక అప్పుడేం చేస్తూంటావు నువ్వు?

నీవనుకున్న బంధాలన్నీ

కాదన్న ప్రతిసారి

రగిలి రగిలి మిగిలిపోతావు

వ్యామోహాల డొక్కలు ఎగరేసుకుంటూ

గాయాల లెక్కలెంచుకుంటూ

 

అయినా

సుడులు తిరుగుతున్న దిగులు సెగలు

తిప్పి తిప్పి తీరాన విసిరేస్తే

రేపనే పిల్ల తెమ్మెర తట్టి లేపుతుంటుంది

పాతవాసనేస్తున్న నిద్ర నుండీ

కొత్త గుభాళింపుల మెళుకువలోకి

ఒక్కో అడుగు వేయమంటూ

ఒక్కో తలపూ పేర్చుకోమంటూ

 

అవును కానీ

నీదైన వెతుకులాట

నీకోసమే అంటావుగానీ

నీలోపలితో నువ్వు ఎప్పుడైనా మాట్లాడవా

పసిదనపు పచ్చదనం పాముకున్నావా

నీలాకాశపు సౌందర్యం నింపుకున్నావా

రంగురంగుల సీతాకోకలు నిమురుకున్నావా

సప్తవర్ణపు ఇంద్రధనస్సుని అద్దుకున్నావా

 

అందుకేనోయ్

మనసు పువ్వుని వాడిపోనివ్వకూ

ఆ నవ్వుల వెన్నెల్లో తడిసిపో

వడివడిగా తడితడిగా

జీవితమంటే జీవితమంత ప్రేమ పుట్టేలా

లో లోపలి లోకం

~లాస్య ప్రియ 

Shivanna Chandu

ఉగాది,  మరో ఆది

~రాధిక నోరి

Shivanna Chandu

చైత్ర మాసపు చైతన్యం

తెచ్చింది శుభోదయం

తపోదయం మహోదయం

ప్రమోదయం నవోదయం

 

హేమంతుడి  చలిచలి పోక

వసంతుడి కలకల రాక

చెరకు వింటి దొర రథముపై

సాగెనులే వలపుల ఏరువాక

 

కొత్త చిగుళ్లు  కొత్త ఆకులు

కొత్త పిందెలు కొత్త కాయలు

కొత్త ఆశలు కొత్త కాంక్షలు

కొత్తగా మెరిసెలే వలపు వాకలు

 

మామిడి కిసలయలలో మెరిసి   

కోకిల కిలకిలల లో మురిసి

వెతలను మరచి దెసలను ఎగసి

సాగిపోదాం నవ్య లోకాలలోకి  

కళాకారుడి ప్రేయసి

~ఇంద్రాణి పాలపర్తి

Shivanna Chandu

ఇతడు కళాకారుడు

అలివిమాలిన ప్రేమతో

అల్లుకుపోబోతాను

 

ఇతడు నవ్వించి

ఏడిపించి

క్షణ క్షణానికీ

రంగులు మార్చీ

ఏమారీ ఏమార్చీ

ఎండాకాలం

పెళుసు గాలిలా

పారిపోతాడు.

 

నేనే

ఆ పరిష్వంగాన్ని

వదిలించుకుని

పిట్టలా పారిపోతే

చిటారు కొమ్మల్లోకి

దూరిపోతే

ఇతడు

కన్నీటితో

నా బొమ్మలు వేస్తాడు

గొంతు బొంగురుపోయేలా

విరహ గీతాలు

ఆలపిస్తాడు

విషాదపు నిషా

నిండిన కవితలు రాసి

చచ్చిపోయాక కూడా

తన పేరు మారుమోగేలా

సమాధినించే

చప్పట్లు కొట్టించుకుంటాడు.

శిశిరం తర్వాత సురభి , కొత్త ఆకులు,  కోటి ఆశలు

 అతి మనోహరం కావా  వసంత మాసపు అందాలు

ఆకుల నడిమి  ఉదయభానుని కిరణాలు , కోయిలల కొత్తరాగాలు

తోటల కడిమి లేత మామిడి పిందెల పచ్చటి సోయగాలు  

పల్లెసీమ అడిమి  పచ్చటి  పొలాలు,  చెరువులలో అరవిందాలు

ముంగిళ్ళలో ముత్యాల ముగ్గులు, గుమ్మాలపై మామిడాకుల తోరణాలు  

ఉగాదికి  వసంతలక్ష్మి పలికే ఎదురుకోలు   

హేవళంబితో ఆమని ఆడెను తాన తందనాలు    

 

 వేప చేదు, మామిడి వగరు, బెల్లపు తీయదనం,

చింత పులుపు, ఉప్పు, కారం మిశ్రణం 

ఆరు సమ్మేళనం ఎంతో కమ్మదనం

ఉగాది పచ్చడి అది మన ప్రత్యేకం

జీవితాన అటుపోట్లకి ఇది సంకేతం  

 

ఆలయాన గుడిగంటల జోరు

అయ్యగారి పంచాంగశ్రవణ హోరు

ఆశలు నింపేను, శ్రోతల మది మదినా హుషారు

ఆనక పూచును కవితా కుసుమాలు,  చప్పట్లు మ్రోగేను పలుమారు

అలరారు ఆనందాల  ఏరు, సాగేను సంబరాల తేరు

ఉగాది వేడుకలు జరిగేను ప్రతి ఇంట

మనసారా హేవిళంబిని ఆహ్వానించేనంట

నిండాలి  ఏడాది అంతటా ఆయురారోగ్య, ఐశ్వర్యాల పంట 

హేవళంబి హేమాంశ సంభూతిని సుఖ, సౌఖ్య  ప్రదాయిని 

హేవళంబి ఆగమనం - ఉగాది వేడుకల  సంరంభం

~పన్నాల చంద్రశేఖర్

Shivanna Chandu

సుమన  నూతలపాటి

వృత్తి పరంగా నేను ఐటి లొ పని చేస్తున్నాను. మా వారు ఇంజనీరు. ఒక సొంత బేకరీ కఫే వ్యాపారం కూడా వుంది మాకు. ఇద్దరు అమ్మాయిలు మాకు. హ్యూస్టన్ నగరంలో 20 యేళ్ళగా వుంటున్నాము. 

నాకు మొక్కలు, నాట్యం, కేక్ డెకొరేషన్ తీరిక వేళ నేస్తాలు.

***

Mani vadlamani
suma
naga

నాగ అంబటిపూడి

దశాబ్దం పైగా హ్యూస్టన్‌లో నివాసం

స్థానిక చమురు ఉత్పత్తి కంపెనీలో సలహాదారుగా వృత్తి

తెలుగుమాటన్నా, తెలుగులో మాట్లాడాలన్నా మహాప్రీతి

Mani vadlamani
Shailaja

శైలజ మిత్ర

వీరు చిత్తూరు  వాస్తవ్యులు. వీరు దాదాపు 20 సంవత్సరాలుగా రచనా వ్యాసంగం లో ఉన్నారు. ఆంగ్లంలోను, తెలుగులోనూ ఎం ఏ పట్టభద్రులు. రచన విశ్వవిద్యాలయం లో పి జి డి సి జె ( పి డి డిప్లొమా ఇన్ జర్నలిజం ) చదివారు. ఇప్పటి వరకు 8 కవిత సంపుటాలు, రెండు కదా సంపుటిలు, నాలుగు నవలలు, 356 పుస్తక సమీక్షలు , 10 ఆంగ్ల అనువాదాలు, 46 ఆధ్యాత్మిక గ్రంధాలు రచించారు. 'సాహిత్య శ్రీ ' బిరుదు (అఖిల్ భారత్ భాషా సాహిత్య సమ్మేళన్, భోపాల్), ఆరుద్ర పురస్కారం, దేవులపల్లి కృష్ణ శాస్త్రి పురస్కారం , శ్రీ శ్రీ పురస్కారం, జ్వాలాముఖి పురస్కారం పొందారు

Mani vadlamani
Mani vadlamani

రాధిక నోరి

రాధిక నోరి వృత్తి కంప్యూటర్ సాఫ్ట్ వేర్ విభాగం. కాని ప్రవృత్తి రచన మరియు గానం. ఇప్పటికి ఎన్నో కధలు రాసారు. ప్రైజులు, అవార్డులు వచ్చిన కధలు కూడా చాలా రాసారు. అమెరికాలో వున్న చాలా పత్రికలలో ఇవి వచ్చాయి. ఇక గానం సంగతికొస్తే అది అన్నిటికంటే ఇష్టమైన విషయం. చిన్నప్పటి నుండి పాడుతూనే వున్నారు. మంచి గాయనిగా ఇంటా బయటా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి దాకా ఎన్ని స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారో లెక్క లేదు. ఎన్నోprestigious పాటల పోటీలని judge చేసారు, చేస్తున్నారు. ఇండియాలో హైదరాబాదులో ఆల్ ఇండియా రేడియో లో పని చేసేవారు. ఈ దేశానికి వచ్చిన తర్వాత కూడా జీవనోపాధి కోసం ఉద్యోగం చేస్తున్నాగానం, రచనలు మాత్రం మానలేదు. ఫ్లారిడాలోని A&M University and Florida State University లో adjunct professor గా పని చేశారు.  మానవ సేవే మాధవ సేవ అన్న సూత్రాన్ని బాగా నమ్ముతారు. ప్రస్తుతం ఫ్లారిడా రాజధాని అయిన టల్లహాసిలో రవాణా శాఖకు చెందిన డిపార్టుమెంటులో కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నారు.

Mani vadlamani
Radhika

పన్నాల చంద్రశేఖర్

భారతీయ రైల్వేస్ నందు 40 వత్సరములు  ఇంజనీర్ గా   పని చేసి 2007 లో పదవి విరమణ చేసారు. నివాసం హైద్రాబాద్ , అభిరుచులు ,  గేయ రచన , పుస్తక పఠనం , యాత్రలు , దూరదర్శన్ వీక్షణ .

Mani vadlamani
pannala
Indrani

పాలపర్తి ఇంద్రాణి

పాలపర్తి ఇంద్రాణి : ఈ మధ్యే హ్యూస్టన్ వాస్తవ్యులయిన ఇంద్రాణి గారివి రెండు కవితా సంకలనాలు "వానకి తడిసిన పువ్వొకటి", 2005 లోనూ "అడవి దారిలో గాలిపాట 2012 లోనూ వెలువడ్డాయి.

“వానకి తడిసిన పువ్వొకటి” రచనకి గానూ 2005 లో ఇస్మాయిల అవార్డు, 2016 లో వంగూరి ఫౌండేషన్ ఉగాది పోటీలో బహుమతిని అందుకున్నారు.

Mani vadlamani
comments
bottom of page