top of page

సంపుటి 2  సంచిక 2

'అలనాటి' మధురాలు

జాతీయ శబ్ద రత్నాకరం

సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com 

స్వర్గీయ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

పిఠాపురంలో వేంకట రామకృష్ణ కవుల దగ్గిర చదువుకుంటున్నానేనప్పుడు. 1910వ సంవత్సరం అది. దినమ్మూ మధ్యాహ్నం కోటకు వెళ్ళి గురువులు, మహారాజులుంగారికి ఆముక్తమాల్యద పాఠం చెబుతున్న రోజులవి. రాత్రి భోజనానంతరం రామకృష్ణశాస్త్రిగారు నాకున్నూ పాఠం చెబుతున్నారు.

ఒకనాటి సాయంకాలం చాలా ఉత్సాహంగా వచ్చారు గురువులింటికి. నడుస్తూనే మాట్లాడుకోవడం, మధ్య మధ్య ఆగి యేందో కూడబలుక్కోవడం, పక్కవాటంగా కిందుగా చూస్తూ ఏదో ఆలోచించి, నిశ్చయాత్మకంగా తల యెగరవేసుకోవడం, తరవాత కొంతవరకూ గబగబా నడవడం.. ఇలా చాలా వ్యగ్రంగా వుంది వారి ఉత్సాహం.

వారి రాక  యెదురు చూస్తూ వీధి అరుగు మీద కూర్చుని వున్నాన్నేను. రావడం తడవుగా వారున్నూ అరుగుమీదే కూచున్నారు. దుస్తులు మార్చుకోలేదు. మంచి తీర్థం అయినా పుచ్చుకోలేదు లోపలికి వెళ్ళి.

రామకృష్ణ శాస్త్రిగారు నన్ను సంబోధించా రన్యవధానంగా..

"మన తెనుగు గ్రంథాల్లోను అంతకంటే యెక్కువగా వాడుకలోనూ యెన్నో పలుకుబళ్ళున్నాయి. సామెతలున్నూ వున్నాయి వేనవేలూ, లక్షోపలక్షలున్ను. అవన్నీ ఒకచోట కూర్చడం ఆగత్యం అని తోచింది నాకు. మా బావ (వెంకటరామ శాస్త్రిగారు) కూడా యిందుకంగీకరించారు. పలుకుబళ్లూ, సామెతలూ కూర్చినంత మాత్రాన చాలదు. వాటికి వివరణలున్నూ యివ్వాలి సాధ్యమైనంతవరకున్ను.  ఇదే మొదట కాదుగాని సాధ్యమైనంత త్వరగా పూర్తి చెయ్యాలి. ఇది ఒక గ్రంథంగా ప్రకటించాలి. ఆ గ్రంథానికి "జాతీయ శబ్ద రత్నాకరం" అని పేరు కూడా నిర్ధారణ చేశాన్నేను. నేనాముక్తమాల్యద పుచ్చుకుంటాను. మా బావ పాండురంగ మాహత్మ్యం పుచ్చుకుంటానంటున్నాడు. ఈ సందర్భంలొ మీ సహకారం కూడా కావాలి నాకు. మరి మీరేమి పుచ్చుకుంటా?"రని అడిగారు కూడా వారు నన్ను.

అప్పటికి నేను విజయవిలాసం చదువుతున్నాను. పరిశీలనగా, స్వబుద్ధితో సమీక్ష కూడా రాస్తున్నాను దానిమీద. వారికిద్దరికీ తెలుసు ఈ సంగతి. "అదిగో ఆ విజయవిలాసం పుచ్చుకో" మన్నారు వెంకటరామశాస్త్రిగారు నన్ను.

పని ప్రారంభించాం.

విని వున్నవీ, వింటున్నవీ పలుకుబళ్ళూ, సామెతలూ కాగితాల మీద యెక్కించసాగాం ముందు. ఎవరితో మాట్లాడేటప్పుడైనా దొరుకుతాయని, కాస్త గమనించడం పెట్టుకుంటే, పాతబడ్డవీ, వెనుకబడ్డవీ కాక, జనవ్యవహారంలో సజీవంగా వున్నవీ సంకలనం చెయ్యడం జరుగుతుందిలా చెయ్యడం వల్ల , గ్రంథస్థాయి మెల్లిగా చెయ్యవచ్చుననుకున్నాం.

పొరుగూరు కావడం వల్ల వేరే తాపత్రయాల్లేవు కనక, నాకదే పనయిపోయింది. గురువులతో చెప్పి నా వూహ కందిన వివరణలున్నూ రాసుకోసాగాను నేనెప్పటికప్పుడు.

గురువులకు మాత్రం అలా సాగలేదు. అటు కళకి సంబంధించిన విమర్శలూ, రచనలున్ను, ఇటు ఇష్టాపూర్తిగా స్వబుద్ధి ప్రేరణతో ప్రారంభించిన రచన్లు. ఇవి తప్పనిసరి వారికి. దినమ్మూ మద్యాహ్నం కోటకు వెళ్లి మహారాజులుంగారికి పాఠం చెప్పడం, తరచు తమ దగ్గరికి వచ్చే సాహిత్య రసికులతో గోష్టి. సంసారాలు సవరించుకోవడం, పులి మీద పుట్రలాగ నాకూ, మరి కొందరు శిష్యులకు పాఠాలు చెప్పడం, క్రమం తప్పకుండా తరచు దివాను మొక్కపాటి సుబ్బారాయుడుగారి యింట సాహిత్య చర్చలు సాగించడం, ఇదిగో యిన్ని .. ఇంకో మరికొన్ని వ్యావృత్తుల్లో మునిగిపోడం.. ఇలాంటి కారణాలవల్ల ఉత్సాహం యెంత వ్యగ్రంగా వున్నా గురువులీపని చురుగ్గా సాగించలేకపోయారు.

నా పని (విజయవిలాసం చదవడమూ, అందులో వున్న పలుకుబళ్లూ, సామెతలూ గుదిగుచ్చుకోడమూ కూడా)పూర్తి అయిపోయింది. చదువు చాలించుకుని యింటికిన్నీ వెళ్లిపోవలసి వచ్చింది కొన్నాళ్ళకు నేను.

నా సేకరణ అంతా విడి కాగితాల మీద జరిగింది. కాని వాటిలో కొన్ని గుదిగుచ్చడం  పడలేదు. ఎన్నో పలుకుబళ్లూ, ఎన్నో సామెతలూ అప్పటికప్పుడుగా వాటికి తోచిన వివరణలూ కాగితం పీలికలమీద రాసుకోవడం సంభవించేది. దీనివల్ల వాటిలో కొన్ని అప్పుడప్పుడు జారిపోతూ వచ్చాయి.

దీనికి సాయం, ఇటీవల రాజమహేంద్రవరం గోదావరి వరద పాలుకావడం అందరికీ తెలుసు. అప్పుడు వెయ్యి రూపాయల వెలగల నా ప్రచురణలూ, నా సొంత గ్రంథాలయం తాలూకు గ్రంథాలు కొన్ని - అయిదారు వందలవీ, నా గంధర్వ ఫార్మసీ తాలూకూ, నా కలాభివర్థనీ పరిషత్తు తాలూకూ పాత రికార్డూ వాటితోపాటు ఈ బాపతు విడికాగితాలు కొన్ని గంగపాలయిపోయాయి.

ఆయనా, నేను సేకరణ చేస్తూనే వున్ననిప్పటికీ. జ్ఞాపకం వున్నంతవరకూ పోయినవన్నీ మళ్లీ రాసుకుంటూనే వున్నాను.

ఒకనాడు ప్రసంగవశాన నాకు బాగా జ్ఞాపకం వున్న సామెతలు కొన్ని మిత్రులు సంపత్తుగారి కిచ్చాను. వారవి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ప్రకటించిన తమ తెనుగుసామెతల గ్రంథంలో చేర్చుకుని వున్నారు.

మొన్న మొన్ననే ఆ అకాడమీవారి తెలుగుసామెతలూ, పదబంధ పారిజాతాలూ బయటికి వచ్చాయి. అసంపూర్ణంగా అయినా, అవి చూడ్డంతోనే నాకు నా గురువుల సంకల్పమూ, పూనికా బాగా జ్ఞాపకం వచ్చాయి.  పాత కాగితాలు తిరగవేసి చూసినప్పటికీ నాకు, వాటిలో కొన్ని కొన్ని అయినా కొంచెం కొంచెం పత్రికాముఖాన ప్రకటిద్దామని తోచింది.

ఈ జాతీయ శబ్దరత్నాకరం అన్నది నా గురువులు నిర్ధారణ చేసిన పేరు. పలుకుబళ్ళూ, సామెతలూ - వీటికి జాతీయోక్తులని వ్యవహారంలో వుండడం అందరికీ తెలుసు. ఆ జాతీయోక్తుల సంకలనం కనక యిది 'జాతీయ శబ్దరత్నాకరం'.

నా గురువుల చేతిమీదుగా ప్రకటించబడి వుండవలసిన గ్రంథం యిది. అదే జరిగి వుంటే ఇది సర్వాంగ సుందరం అయి వుండేది. బతికి వుండినందుకు ఫలితంగా, వారి సంకల్పం వెల్లడి చెయ్యడమూ, ఈ విధంగా ఆ గ్రంథం పేరు స్థిరపరచడమూ, వెల్లడించడమూ కూడా నాకు విధి కృత్యం అని తోచింది.

నా గురువుల ప్లానూ, నేను పని చేసిన పద్ధతి యిక్కడ చూపిస్తాను. ఇందుకిదే మార్గం అనను. ఎందరికో యెన్నో మార్గాలు తోచవచ్చు. నా ప్రయత్నం, అందుకైనా ప్రోద్బలకం అయితే చాలు, నేను కృతకృత్యుణ్ణే.

ఎందరు పూనుకున్నా యిది సమగ్రం కాదు. వాడుకలో వుండినవైనా, ఎన్నో కొన్ని మిగిలిపోతూనే వుంటాయెప్పటికీ.

 

*****

 

1. అంగిట బెల్లమూ, ఆత్మ విషమున్ను.

పైకి ఎంతో తియ్యగా ఎంతో ఆపేక్ష వున్నట్టున్నూ మాట్లాడతారు కొందరు కొన్ని సందర్భాల్లో, కొందరితో. వారి మనస్సులొ మాత్రం చాలా కుళ్లు పేరుకుని వుంటుంది. ఎన్నో దురూహలూ, దుశ్చింతలూ, దుస్సంకల్పాలూ కూడా వుంటాయి వారి మనస్సుల్లో. అదిగో ఆ బాపతు వారిని చెప్పవలసి వచ్చినప్పుడు వాడే సామెత యిది.

 

2. ఏ గాలి కా చాప.

పడవ, తెరచాప యెత్తుకుని ప్రయాణం ప్రారంభిస్తే, మెరకలు తగులుతాయి. సుడిగుండా లడ్డుకుంటాయి. గాలి విసురులున్నూ విషమా లవుతూ వుంటా యప్పుడప్పుడు. అయినా ప్రయాణం తప్పదు. ఆగిపోవడానికి వీలు కాదు. కనక, నిరాఘటంగా ముందు వెళ్లాలంటే ఒక్కొక్కప్పు డెడమకూ, ఒక్కొక్కప్పుడు కుడికీ తెరచాప మార్చుకుంటూ వుండాలి.

ఏదయినా పని ప్రారంభించేవారికి ఏవేవో అడ్డంకు లేర్పడతాయి మధ్య మధ్య. ఆ పని మానడానికి మాత్రం వీలుండదు. మానడమూ మంచిది కాదు. కనక, ఎప్పటి కప్పుడు తగిన ప్రతిక్రియలు చేసుకుంటూ, ఓపిగ్గా పని సొంతం చేసుకోవాలి కర్త. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే సామెత యిది. "ఏ యెండ కా గొడుగు" అన్నదిన్నీ యీ జాతికి చెందినదే సామెత.

 

3. చెవినిల్లు కట్టుకుని పోరడం.

ఒకడి కొక డేదో చెబుతాడు. అది సలహా కావొచ్చు, నిషేధం కావచ్చు, ఉపదేశమ్మూ కావచ్చు. అవతలి మనిషి తాను చెప్పినట్టు నడుచుకోవాలని ఆ చెప్పేవాడి వుద్ధేశం. అతణ్ణి చెరచడానికి సంకల్పించుకోవచ్చు, ఆ మనిషి బాగుపరచడానికీ పూనుకోవచ్చు. కనక, మళ్లీ చెబుతాడు. కనపడ్డప్పుడల్లా చెప్పడం కాదు. ఇంటికి వెళ్ళీ చెబుతాడు మళ్లీ మళ్ళీ. అంతటితో తృప్తిప డ్డామనిషి, వాడి చెవిలోనే మకాం వేస్తాడందులో యిల్లు కట్టుకుని. చెబుతూనే వుంటాడు కూడా. దూరస్థితి సహించడు. ఈ పలుకుబడిలో, సామీప్యమూ, సాతత్యమూ, దీక్ష, ఏకాగ్రతా, ఆత్రమూ కూడా స్ఫురిస్తా యా మనిషిని.

4. ఏకయివచ్చి మేకయి బిగిసినట్టు.

ఏకంటె దూదికి కల్పించే ఒక రూపం అది. నూలు వడికే సాధనాల్లో ఒకటది. కనక, దూదిలాగ మెత్తగానే వుంటుంది. మేకంటే ఇనుమూ - ఉక్కూ, ఇత్తడి - ఇలాంటి లోహాలతో చేసే ఒక సాధనం. గోడలకూ, దూలాలకూ, వాసాలకూ - ఇలాంటివాటికి దిగకొట్టేటందుకు ఉపయోగిస్తుందది. కనక , చాలా గట్టిగా వుంటుంది. ఒక మాటు దిగకొడితే మాత్రం మళ్లీ వూడతియ్యడం వో పట్టాన సాధ్యపడదు.

ఏకు మృదుత్వానికి, మొగమాటానికి పరమావధి అయితే, మేకు కాఠిన్యానికీ, పట్టుదలకూ పరాకాష్ట.

ఒక డొకడి దగ్గిర చేరుతాడు. ఏమీ పని లేనట్టూ, ఏమీ తోచక అన్నట్టూ కాలక్షేపాని కన్నట్టూ చేరుతాడు. కాలూనుకుంటాడు. మాటలు కలుపుతాడు, వ్యవహారాలు పెల్లగిస్తాడు. వింటున్నట్లు నటిస్తాడు. వింతపడుతూ, సరదాకోసం అన్నట్టు వివరాలడుగుతాడు. సావధానుణ్ణి చేసుకుంటాడు. మాటవరస కన్నట్టు సలహాలు చెబుతాడు. చెప్పమని అడిగించుకుని కూడా చెబుతాడు. వ్యవహారం ముదరబెడతాడు. ఇక దానికి పట్టూ విడుపూ కలగనివ్వడు. చెప్పినట్టు వినకపోతే యెదురు తిరుగుతాడు. ముంచేస్తాడు కూడా చివరికి. ఇదిగో  యిలాంటి సందర్భాల్లో, యిలాంటి మనిషిని గురించి చెప్పడాని కీ పలుకుబడి.

 

5. గాలీ వానా వస్తే కథే పోయిందన్నట్టు.

అనగా అనగా ఒక రాజు. కథలంటే మహ యిష్టం ఆ రాజుకి. తనని బాగా మెప్పించాడా, ఆ కథకునికి ఆ రాజు, వెయ్యిన్నూట పదహార్లిచ్చేవాడు. మడిమాన్యాలిచ్చేవాడు. అగ్రహారాలే యిచ్చేవాడు. భవంతు లిచ్చి తన పట్నంలో ప్రవేశ పెట్టుకునేవాడు కూడా.

ఎక్కడెక్కణ్ణుంచో కథకులు రాసాగారు. రాజుని ఆనంద ముగ్ధుణ్ణి చేసెయ్యసాగారు. ఇందువల్ల ఆ రాజు బొక్కసం తరిగిపోసాగింది.

దివాను కిష్టం లే దిది.

కులానికతను కంసాలి. రాజకార్యాలలో చాలా శ్రద్ధ అతనికి. సహజంగా స్వామిభక్తుడతను. ఆగత్యం అయితే తన ప్రాణాలే యిచ్చేస్తాడు రాజు కతను.

కనక, రాజు అభ్యుదయం కోరి రాజ్యం, భద్రత కూడా కోరి, అత నిది మంచిది కాదని హితబోధ చేశాడు రాజుకి. "రాజ్యం అన్నప్పుడు ప్రజలకెన్నో సదుపాయాలు కలిగించాలి. శత్రురాజులు దండెత్తి రావచ్చు. వారితో యుద్ధం చెయ్యవలసిన ఆగత్యం యేర్పడవచ్చు. తప్పనిసరిగా. ఎందుకయినా చాలా డబ్బు కావాలి. అందుకోసం బొక్కసం అంతా బాగా నిండుగా వుండేటట్టు చూసుకోవాలెప్పుడూ. రాజ్యం తరవాతవి కళలు" అని అనేకవిధాల చిలక్కి చెప్పినట్టు చెప్పాడు రాజు కథను.

కాని లాభం లేకపోయింది. రాజు, తన పద్ధతి మార్చుకోలేదు. నిజాని కీ కథల వ్యసనం తప్ప మరో దుర్గుణం లేదు రాజు దగ్గిర.

దివాను ఆలోచించాడు. ఒక పథకం వేసుకున్నాడు. తాను కూడా కథలు వినసాగాడు. ఆబగా, రాజు పక్కన కూచుని.

కథలు తనకి కొత్త. అవి అర్ధం చేసుకోవడమూ, ఆనందించడమూ తన కింకా అలవాటు లేదు. ఇలా చెప్పి అతను ఏమిటేమిటో ప్రశ్న లడగసాగాడు. అమాయకత్వం నటిస్తూ, వికట ప్రశ్నలే వెయ్యసాగాడు వెర్రిమొగం పెట్టుకుని.

ఇది కథకునికి ధార తెంపేసేది. ఉత్సాహం పోగొట్టేది. విసుగు కలిగించేది. ఏమిటేమిటో తికమక పెట్టసాగింది. చివరికి, కసురుకోవడం దాకా వెళ్లింది కథకుని అవస్థ.

ఫలితం కథలు చప్పబడిపోసాగాయి. కథకులు అసమర్ధులనిపించుకోసాగారు. కథలు వినడానికి విసుగు పుట్టసాగింది అతనికి. ఆ విసుగు "తగుదునమ్మా అంటూ వచ్చి కథకులు మంచి కథలు చెప్పలేకపోతే ఆ విధంగా తన కాలం అంతా వ్యర్థంగా గడిపేస్తే, ఆ కథకుల తలలు కొట్టించి కోట కొమ్మలకు వేళాడగట్టిస్తా"నని శపథం తాల్చేశాడు రాజు.

కథకులు రావడమే మానుకున్నారు. తనకి ఆశాభంగం కలిగినట్టూ, నిద్రాహారాలు సయించకుండా వున్నట్టూ, మంచి కథకుల కోసం దేశదేశాలు వర్తమానం చేస్తున్నట్తూ నటించసాగాడు దివాను. కథలు వినపడక మతి పోసాగింది రాజుకి.

ఉండగా ఉండగా ఒక బ్రాహ్మడు దివాను కుట్ర గ్రహించాడు. బయలుదేరి వచ్చాడు. దానికి విరుగుడు కల్పిద్దామని. వద్దన్నాదు దివాను. "లాభం లే"దన్నాడు. రాజు శపథం కూడా చెప్పేశాడు చివరికి. "అస్తమానమూ కథలు వినడమే పెట్టుకోవడం వల్ల రాజు గొప్ప సాహిత్యవేత్త అయిపోయా"డనీ, "అతణ్ణి మెప్పించడం యెవరికీ సాధ్యం కా"దనీ.. ఇలాంటి భావాలు నూరిపోశాడు.

కాని బ్రాహ్మడు వినిపించుకోలేదు. తాను కథ చెప్పవలసిందే అన్నాడు. "అర్థం చేసుకోగలిగితే , పండితుడైనవాడికి అగ్రహారం యివ్వడం యెంత గౌరవప్రదమో, తల కొట్టెయ్యడమూ అంత గౌరవప్రదమే" అని గట్టిగా వాదించాడు.

కథ ఏర్పాటు చెయ్యడం తప్పనిసరి అయింది దివానుకి. మద్యాహ్నం మూడు గంటలవేల కోటకి రమ్మన్నాడు కథకుణ్ణతను. తల యిచ్చెయ్యడానికిన్నీ సిద్ధపడి ఒక కథకుడు వచ్చాడనేటప్పటికి జనం విరగబడిపోయింది.

"అంతా సిద్ధం అయిన"దని రాజుకి విన్నవించుకున్నాడు దివాను. కత్తులూ, కఠారులూ, తాళ్ళూ తెప్పించి రాజు ఎదట పెట్టించా డతను. అప్పుడయినా కథకుడు భయపడి పారిపోవాలనుకుంటూ" మొదలు పెట్టవచ్చు"నన్నాడు రాజు. "ఆవురావురు"మంటున్నాడు పాపం అతను మరి.

కథకుడు ముందుకి వచ్చాదు. గొంతుకు సవరించుకున్నాడు. "తలారులను సిద్ధం చేసుకోవచ్చు మీరు" అన్నాడు దివానుతో. "ప్రభూ"అన్నాడు రాజు కేసి తిరిగి. "నాకో వ్రతం వుంది. నేను కథ చెప్పాలంటే ముందు నా వ్రతం తీరాలి మరి" అని మనవి చేసుకున్నాడు. చేతులు జోడించుకుని , "తీరుస్తాను . ఏమిటా వ్రతం?" అని అడిగాడు రాజు. "నిస్సంకోచంగా కోరవచ్చు. ప్రభువు అవశ్యమూ తీరుస్తారు మీ కోరిక" అని చెప్పాడు దివాను కూడా.

కొంచెం మొగమాటం నటించాడు కథకుడు మొదట. "నేను కథ చెప్పే చోట కంసాలి వుండగూడదు మహాప్రభూ!" అన్నాడు చివరికి తప్పనిసరి అయినట్టు.

ఇది అసందర్భం అని రాజుకి తెలుసు. కాని కథల కోసం తాను మొగం వాచిపోయి వున్నాడు మరి. కనక "నీ కోరిక అంగీకరించా"నన్నాడు కథకునితో. "మరేమి అనుకోకండి  రాజుగారికి ఉన్నట్టే కథకునిక్కూడా వ్రతాలుండవచ్చు. కనక, వారి విషయం యెవరూ అపార్థం చేసుకోవద్దు" అని చెప్పాడు దివాను కూడా సభకేసి చూస్తూ.

రాజు చెప్పగా, సభలోనున్న కంసాలివారందరూ బిలబిల్లాడుతూ వెళ్ళిపోయారు ధుమధుమలాడుకుంటూ. అటు చూసి  యిటున్నూ చూసి దివాను కూడా బయలుదేరాడు. రాజు చెప్పకముందే. కాని, వెడుతున్నట్టే నటించి, యుక్తి చేసి సింహాసనం కింద నక్కాడు వెనకవైపు నుంచి వెళ్లి.

"ప్రారంభించవచ్చు"నన్నాడు రాజు.

"హరి. ఓ"మ్మన్నాడు కథకుడు.

"అనగా అనగా ఒక మట్టిబెడ్డ. దానికీ ఒక రావి చెట్టుకీ ప్రాణస్నేహం. క్షణం అయినా విడిచి వుండలేవవి. వాటి స్నేహం యెంత ధృడమైనదంటే? గాలి వస్తే, మట్టిబెడ్డ రావి ఆకు మీద కూచుంటుంది వెళ్లి. అది యెగిరిపోకుండా వాన వస్తే రావి ఆకు వెళ్లి మట్టిబెడ్డ మీద కప్పుకుంటుంది. అది తడిసిపోకుండా..

ఆ యెత్తుగడ చూసి శ్రోతలందరూ మంత్రముగ్ధులన్నట్టయిపోయారు. రాజు కూడా బొమ్మ అన్నట్టయిపోయాడు. కాని దివా నూరుకోలేకపోయాడు. యుక్తి కెళ్ళించిందతణ్ణి. "మరి, గాలీ వానా వస్తేనో?" అంటూ అడ్డుప్రశ్న వేసేశాడు వెంటనే అతను, సింహాసనం కిందినుంచే.

శ్రోతలకే కాదు, రాజుకీ తెలిసిపోయింది దివాను సంగతి. అతని కుట్ర కూడా అర్ధం అయిపోయిం దందరికీ. ఇది గుర్తించి "గాలీ వానా వస్తే కథే పోయిం"దనేశాడు కథకుడు. ఒక్కటే మాట.

 

6. వెతికి వెతికి వెయ్యి బళ్ల మీద వంటలక్కని తీసుకువస్తే, తగిలేని, మిగిలేని తోటకూరకు తొడలోతు ఎసరుపెట్టమన్నట్టు.

ఒకరికి వంటలక్క కావలసి వచ్చింది. లోకం అంతా గాలించారు వారు. ఎంతో దూరదేశాన ఒక మహా నిపుణురాలుందని తెలిసింది. కష్టపడి వెళ్లి పట్టుకున్నారు. రమ్మని ప్రార్ధించారు. ఎన్నో విధాల నచ్చజెప్పారు. హిరణ్యాక్ష వరాల కన్నింటికీ తల వూపారు. కష్టపడి వెయ్యి అంచెబళ్ల మీద తీసుకువచ్చారు ఎలాగో.

అతి టెక్కుగా వచ్చి చార్జీ పుచ్చుకుందావిడ. మొదటి పూటే తోటకూర కావలసి వచ్చిందింటివారికి. ఆవిడ వంట చేయిస్తుంది గాని, స్వయంగా చెయ్యదు. మరి, వంట నాయకురాలు కనక. మామూలు వంటమనిషి వచ్చి తోటకూరకు ఎసరెంత పెట్టాలనడిగింది. దాని మీద తన నైపుణ్యం బయట పెట్టిందా వచ్చినావిడ. "తగిలితే తగులుతుం"దంది. "అదంతా తరవాత చూసుకుందాం" అంది. "తొడలోతు ఎసరు పెట్ట"మనేసింది దర్జాగా.

తోటకూర అసలే నీటిబుగ్గ. అది తరిగి గిన్నెలో వేసి చిలకరిస్తారు కాసిన్ని నీళ్ళు. వేడి తగిలిందంటే అక్కడికే అది నీరూరిపోతుంది. ఉడికాక ఆ నీరు పారవేయించేస్తారు తాలింపు పెట్టడానికి ముందు.  అది చాలక వేడి తగ్గాక బాగా పిడి చేస్తారు కూడా.

ఏదో చూసి, యెందుకో పసందు చేస్తారు కొందరు కొందరినెందుకో. ఆ యెవరివో ప్రణాలికలిలా వుంటాయి. ఒక్క పనీ సానుకూలం కాదు.  ససీ పడదు. అదిగో, అలాంటి సందర్భాల్లో వాడే సామెత యిది.

 

7. "దాని కళ్లు గూట్లో పెట్టినట్టున్నాయి"

ఆవిడ కళ్లు గుంటకళ్లు అన్నమాట. కొందరివి గుంట కళ్లు, కొందరివి మిడిగుడ్లూను. రెండూ అందవికారాలే. గుంటకళ్లు చూడ్డానికేమీ అభ్యంతరం కలిగించవు. అవి చురుగ్గానే చూస్తాయి. అవి చూసేవారికే కొంచెం అంద వికారంగా కనపడతాయి. ఇదిగో, యిది స్ఫురిస్తుందీ పలుకుబడివల్ల.

 

8. "తిన్న అన్నం అంతా పెట్టెలో పెట్టినట్టుంది"

తిన్నది తిన్నట్టుంది. ఏ కొంచెమున్నూ అరగలేదు. "పెట్టెలో పెడితే ఎంత భద్రంగా వుంటుందో అంత భద్రంగానూ వుంది నా కడుపులో" అనడానికి వాడే పలుకుబడి యిది. "ఆకలి లేదు" అని దీనికర్ధం.

 

9. అశ్వత్థ ప్రదక్షిణాలు చేస్తూ కడుపు తడుముకున్నట్టు.

ఒకామెకి సంతానం లేదు. నూట ఎనిమిది అస్వత్థ ప్రదక్షిణాలు చేస్తే గర్భం నిలుస్తుందని యెవరో చెప్పారామెకి. మంచి ముహూర్తం చూసుకుని ఒకనాడు మొదలు పెట్టిందామె. అయితే, ప్రదక్షిణాలు జరిగినకొద్దీ కడుపెంత యెదిగిందో తెలుసుకోడానికి మాటి మాటికీ తడుముకోసాగింది కడుపామె. ఫలితం కోసం తప్పుదారిలో ప్రయత్నం చేసేవారి సంగతి చెప్పడానికి ఉపయోగపడే సామెత యిది.

10. కూతురికి బు-హో-రం-శ్-నో-రం-కోడలికి దీరికి దీరికి.

ఒక యిల్లాలి కొక కూతురు, ఒక కోడలూను. అయితే, కూతుర్ని చూసినట్టు కోడల్ని చూడదామె. కాని కూతుర్ని కంటే కోడల్ని యెక్కువగా చూస్తున్నట్టు నటిస్తుంది.

మరో యిల్లా లడిగిందామెని "నీ కూతురి కెన్నాళ్లకోమాటు తలంటుతా"వని, "బు-దో-రం-శ్-నో-రం" అంటూ సాగదీస్కుందా యిల్లాలు, కళ్లూ తలా తిప్పుకుంటూ. "చాలా రోజులకో మాటు" అని సాగదీసుకుంటూనూ పలుకుతుంది అప్రయత్నంగా. "మరి నీ కోడలికో?" అనడిగింది ఆ మరో ఆవిడ మళ్లీ. అంటే , "దీరికి దీరికి"అనేసిందా యిల్లాలు "వెంట వెంటనే" అని స్ఫురించాలని ఆమె ప్రయత్నం. అందుకోసం, అక్షరాలూ సబ్దాలూ కూడా కలిసిపోయేటట్టు త్వరత్వరగా పలుకుతుందామె, తల కూడా త్వరగా యెగరవేసుకుంటూ.

అంటే, ఆవిడ కూతురికి వారానికి రెండు మాట్లు, బుధవారమూ, శనివారమూ తలంటుతుంది. కోడలికి మాత్రం సంవత్సరానికోమాటే. మా తూర్పు గోదావరి జిల్లాలో రెండ్లూ, కమ్మవారూ, కాపులూ మరి కొందరూ కూడా స్త్రీలు "దీపావళికి" అనడానికి "దీరికి"అంటారు. అత్తగార్ల గడుసుదనం వెల్లడించే సామెత యిది.

ఆదిలో మా గురువులు సంకల్పించుకున్న కొంత కొంతగా, అప్పుడప్పుడు నేను సమకూర్చిన జాతీయ శబ్దరత్నాకరానికిది మచ్చుముక్క.

గ్రంథాల్లోనూ, జనుల వాడుకలోనూ దొరికే యిలాంటి పలుకుబళ్లూ, సామెతలూ అసంఖ్యాకాలు. వాటికన్నిటికి ఇలాగ కూర్చిపెట్టడమూ, వివరణలివ్వడమూ చాలా ఆగత్యం.

అయితే, యివి పూర్తి చెయ్యడం యెవరికీ సాధ్యం కాదు. వివరణలివ్వడం కూడా అంతే. అయితే, యెంతవరకు యీ పని చెయ్యగలిగితే అంతా భాషకూ, వాజ్మయానికి గూడా పుష్టే. కూర్చడం మంచిదే. కాని అంత మాత్రమే చాలదు. వివరణలిచ్చినప్పుడే ఉపయోగం.

ఆధ్రజాతికీ ప్రయత్నం పెన్నిధి అవుతుంది.

***

bottom of page