top of page

సంపుటి 2  సంచిక 2

'సినీ' మధురాలు

మధురవాణి ప్రత్యేకం

వి.ఎన్. ఆదిత్య

చలన చిత్ర దర్శకులు

V N Aditya

ఆదిత్య సినీ మధురాలు

చాలామంది సినిమాలు తీయాలనుకునే వాళ్ళకి, నిజానికి సినిమా తీయడమంటే ఏంటో తెలీదు. ఏ వ్యాపారానికైనా ఓ అర్హత లేదా అనుభవం కావాలి. ఏ ఉద్యోగానికైనా ఓ కనీస చదువో, అనుభవమో కావాలి. కానీ, సినిమాలకి  మాత్రం ఏమీ అక్కర్లేదు అనుకుంటారు జనాలు ఎందుకనో...?

నాలుగు షూటింగులు చూస్తే ఎవడూ డైరెక్టర్ కాలేడు. గుర్రం స్వారీ, కరాటే ఫైట్లు, జిమ్‌లో గంటలు గంటలు కండలు అరగదీయడం, డాన్సులు చేయడం నేర్చుకోగానే అద్భుతమైన నటన మొహంలో పలికెయ్యదు.

సొంతగా డబ్బులున్న ప్రతివాడూ నిర్మాత కాలేడు. పాతిక పరభాషా చిత్రాలు చూసి అర్ధం చేసుకున్న వాడెవ్వడూ మంచి కథకుడు కాలేడు.

దర్శకుడికి సాహిత్యం మీదా, సమాజం పోకడల మీద,  నాటకరంగం మీద అవగాహన ఉండాలి. పదిమందిని కూడగట్టుకొని, కలుపుకుపోగలిగే నాన్ ఇగోయిస్టిక్ మనస్తత్వం ఉండాలి. పెళ్ళిలో పౌరోహిత్యం చేయగలిగిన అజమాయిషీ, కమాండ్ ఉండాలి. నాయకత్వ లక్షణాలు కొన్నయినా ఉండాలి. విద్య, వినయం, విజ్ఞత, విచక్షణ, సంస్కారం, సమయస్పూర్తి  స్వయంగా అన్నీ చేసుకోగలిగి ఉండాలి.

సందర్భోచితంగా సాటి సాంకేతిక నిపుణులు, నటీనటుల దగ్గర రాబట్టుకునే తెలివితేటలూ ఉండాలి. తనపై తనకి పూర్తి నియంత్రణ ఉండాలి. ప్రోడక్ట్ మీద ప్రేముండాలి కానీ పొజెసివ్ నెస్ ఉండకూడదు. ఇవన్నీ అలవడాలంటే  కనీసం పది సినిమాలకి దర్శకత్వ శాఖలో పని చెయ్యాలి. రకరకాల రచయితలు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చెయ్యడం తెలుస్తుంది. అప్పుడే తన మీద ఎవరైనా  కోట్లు కుమ్మరిస్తే వాటిని రక్షించగలిగిన బాధ్యత, తెలివితేటలు అలవడతాయి.

2005 తరవాత గట్టిగా రెండు, మూడు సినిమాలకి సహాయ దర్శకుడిగా పని చేసిన అనుభవం కూడా లేని వాళ్ళే ఎక్కువమంది దర్శకులయ్యారు కాబట్టి తెలుగులో ఓ పాతిక ముప్పై ఏళ్ళు దర్శకుడిగా హవా కొనసాగించగలిగే సత్తా ఉన్న దర్శకులు ఇప్పుడు మార్కెట్ లో లేరు.

నాటకం వేయడానికి ఇష్టపడని లేదా భయపడే నటీనటులే అధికం ఈ రోజుల్లో. తమ తాలూకా వాళ్ళతో డబ్బు పెట్టించి హీరోలయ్యే వాళ్ళే ఎక్కువ.

నాటకం వేస్తే, ప్రేక్షకుల స్పందన అక్కడికక్కడే  తెలిసిపోతుంది నటీనటులకి, దర్శక, రచయితలకి. ఆ అనుభవమే కదా ప్రేక్షకుడి 'నాడి ' పట్టుకోవడానికి ఉపయోగపడేది. అలాగని టెలివిజన్ లోనో ,యూట్యూబ్ లోనో ట్రై చేద్దామనుకుంటే అది అతితెలివి. ఆ రెండు మాధ్యమాలూ ప్రేక్షకుడి ఇంట్లోకి, ఆఫీస్ లోకి దూరేవి. వాటి వల్ల అప్పటికప్పుడు అతని రియాక్షన్లు మేకర్సుకి , డూయర్స్ కి తెలీవు. ఇంటి నుంచి ప్రేక్షకుడిని 'థియేటర్ ' కి రప్పించేవి రెండే రెండు...  ఒకటి నాటకం, రెండోది సినిమా. కాబట్టి సినిమాకి పునాది పాఠం నాటకం మాత్రమే. షార్ట్ ఫిల్ము, టీవీ సీరియల్ కావు. అవి వేరే ఉపాధి మార్గాలు.

ఇక రచయితకి తను నివసించే సమాజం గురించి అవగాహన కావాలి. కొరియన్ సమాజం, అమెరికన్ సమాజం, చైనా సమాజం గురించి  ఎక్కువ నాలేడ్జే ఉంటే, ఆ భాషల్లో చిత్రాలకి రచన చేసి నిరూపించుకోవాలి. మన సాహిత్యం మీద ముందు తరాల మాణిక్యాల గురించి తెలీకుండా, రోజూ న్యూస్ పేపర్లు, కథలు, కథనాలు చదవకుండా తెలుగు సినిమాలకి కథలు రాయలేరెవ్వరూ.

చివరిగా నిర్మాతలు, సొంతంగా  డబ్బున్న ప్రతీ ధనవంతుడూ నిర్మాత కాడు, కాలేడు. నిర్మాతకి నిర్మాణ రంగంలో అవగాహన కావాలంటే సినిమాలు చూస్తేనో, రివ్యూలు చదివితేనో కలెక్షన్ల స్టాటిస్టిక్స్ బట్టీయం పడితేనో సరిపోదు. దీనికెంత ఖర్చు అవుతుందో , ఎందుకు అంత అవుతుందో తెలియాలి. 27 వృత్తుల మీద అవగాహనతో పాటు ఆ పని చేసే వ్యక్తుల మీద గౌరవం కూడా ఉండాలి. డబ్బిచ్చాను కదా అని భూస్వామిలా ప్రవర్తిస్తే సృజనాత్మకత క్షీణించి మెకానికల్ గా తయారౌతుంది అతని మెటీరియలే.

నిర్ధిష్టమైన బడ్జెట్ అనుకున్నాక అది పెరిగితే, నిర్మాత తప్పే.  తన మనుషుల మీద తనకి నియంత్రణ, తన డబ్బు మీద తనకి నిబద్ధత లేనట్టే. ప్రొడక్టే తయారయ్యాక మార్కెటింగ్ ప్లాన్ కానీ, పబ్లిసిటీ ప్లాన్ కానీ లేని ఏ నిర్మాతా సక్సెస్ కాలేదు, కాలేడు కూడా.

కోటి రూపాయిల్లో ఒక సినిమా తీస్తే దర్శకుడికి అయిదు పర్సెంట్, రచయితలందరికీ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కలిపి పది పర్సెంటు, కెమెరా, మ్యూజిక్, పాటలు, గాయనీ గాయకులు, వాయిద్య సహకారం, ఆర్ట్, కాస్ట్యూంస్   తదితరాలన్నిటికీ ఇరవై పర్సెంటు, షూటింగులకి యాభై పర్సెంటు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకి పదిహేను పర్సెంటుగా విభజించుకుని  ఫస్ట్ కాపీ తెచ్చుకోగలగాలి. ఈ శాతాల్లో అవసరాన్ని బట్టి సమయ సందర్భాన్ని బట్టి అంతర్గత హెచ్చుతగ్గులుంటాయి.

 

ఇవి గవర్నమెంటు జి. ఓ . లు కావు. నా అభిప్రాయాలు మాత్రమే. ఇలా ఒక కోటికి పైన బడ్జెట్ ఉంటే ఈ డినామినేషన్ అంత పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక కోటి లో ఈ ప్రాడక్ట్ తయారైతే, కోటి లో ముప్పై శాతం అంటే కనీసం ముఫై లక్షలు విడిగా ప్రమోషన్ కోసం, ప్రెస్ మీట్ల కోసం, రిలీజ్ కోసం ప్రిపేర్ అయ్యి ఉంటేనే ఆ కోటీ ఇన్వెస్ట్ చెయాలి. ఈ ముప్పై లేకుండా ఆ కోటి ఖర్చు పెట్టినా ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. కోటి రూపాయిల ప్రోడక్టు మార్కెట్లో ఉందని తెలుస్తుంది ఆ ముఫై లక్షలతో. అప్పుడెవరేనా వచ్చి కొనుక్కుంటే సరి. కొనుక్కోకపోతే  స్వంతగా రిలీజు, థియేటర్ల హైరు, ఇవన్నీ ఇంకో కసరత్తు. దానికి పంపిణీరంగంలో ఎవరితోనన్న పొత్తో, స్నేహమో ఉండాలి. ఇవేమీ లేకుండా ఊరికే ఊళ్లో నలుగురి దగ్గరా డప్పాలు కొట్టుకోడానికి షూటింగులు చూసేయ్యడం, తరవాత చతికిలపడి ఆ ప్రోడక్ట్ బైటకి తేవడానికి  రూపాయి తియ్యకపోవడం, హీరోయిన్లకి పర్సనల్ షాపింగులు కూడా చేసి,  డైరెక్టర్లకి, రచయితలకి, లైట్ మెన్లకి,  డ్రైవర్లకి డబ్బులు కనీస వేతనాలు కూడా ఎగొట్టడం, హీరోలనైతే ఏకంగా ఎదురు డబ్బులు అడగటం, ఎదుటి వాడి కష్టాలు, అప్పుల మీద, బలహీనతల మీదా మనం సినిమా ఇచ్చి వాడిని ఉద్దరిస్తున్నట్టు ఫోజులు కొట్టడం, ఎదుటి వాళ్ళ జీవితాల మీద గాసిప్పుల మీదా మనం స్క్రిప్ట్ రాసుకొని నిర్మాతలైపోదాం అనుకోవడం - ఇవన్నీ జరగని పనులు. రచయిత కథో, సన్నివేశమో ఆమోదయోగ్యంగా చెప్పడమే క్వాలిఫికేషన్. దర్శకుడికి పది సినిమాల షూటింగులో పని చేసిన అనుభవమే క్వాలిఫికేషను. నటీ, నటులకి, ప్రేక్షకులని నవ్వించగలిగిన, లేదా ఏడ్పించగలిగిన హావభావప్రకటనలే  క్వాలిఫికేషను. అలాగే నిర్మాతలకి తన డబ్బో, తను తెచ్చిన డబ్బో సక్రమంగా సద్వినియోగ పడేలా ఖర్చు పెట్టి , తన టీమ్  అందరి  ప్రతిభ జనంలోకి ఎఫెక్టివ్ గా తేవడమే క్వాలిఫికేషను. ఈ నిర్మాత, దర్శకుడు, రచయిత, నటీనటులు అనే నాలుగు ప్రధాన స్థంభాల మీదే వెండి తెర ఇంత అందంగా సువర్ణ శోభాయమాన భవనంగా విరాజిల్లుతోంది వందేళ్ళుగా. ప్రేక్షక జనరంజకమై భాసిల్లుతోంది. అందుకే ఓ హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, చిత్తూరు నాగయ్య, ఎస్వీఆర్, ఎన్.టీ.ఆర్, ఏ.ఎన్.ఆర్,  సావిత్రి, జమున, షావుకారు జానకి, భానుమతి, అంజలి, కృష్ణకుమారి, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, ఆదుర్తి, కమలాకర్ కామేశ్వర రావు, దాసరి, రాఘవేంద్ర రావు, కె. విశ్వనాథ్, సింగీతం, బాపు, జంధ్యాల, కోదండరామి రెడ్డి, రేలంగి, రవిరాజ, బి. గోపాల్, రామ్ గోపాల్ వర్మ, పూరి, శ్రీను వైట్ల, రాజమౌళి, త్రివిక్రమ్, నాగి రెడ్డి, చక్రపాణి, రామానాయుడు, అశ్వినీ దత్, దేవీ వరప్రసాద్, శివ ప్రసాద్ రెడ్డి, కె. ఎస్. రామా రావు, ఎమ్మెస్ రాజు, దిల్ రాజుల వరకూ ఎవరి కెరియర్ చూసినా సక్సెసే!  ఫెయిల్యూర్స్ ఉన్నా  కూడా పని చెయ్యడం, పనితనం ఆగవు. స్థిరమైన కెరీర్ అంటే సక్సస్ లో ఉండటం కాదు. ఫెయిల్యూర్ లో  కూడా నిరూపించుకోవడానికి ఇంకో అవకాశం రావడం. వారసత్వంగా మార్కెట్ ఏర్పడడం అనేది అదృష్టం. దాన్ని కొలమానంగా తీసుకోలేము. కానీ దాన్ని నిలబెట్టుకోడానికి వారసులు ఎవ్వరికంటే కూడా ఎక్కువగానే కష్టపడుతున్నారు తెలుగు పరిశ్రమలో. ఇది చాలా అభినందనీయం. వారసులు కానీ నాలాంటి అనేక మంది సినిమా వెర్రి ఉన్న నిర్మాతలు, దర్శకులు, రచయితలు, నటీనటుల కోసమే ఉద్దేశించి రాస్తున్న వ్యాసం ఇది. ఎవ్వరినీ ప్రత్యేకంగా దెప్పిపొడిచే అవకాశంగా దీన్ని రాయట్లేదు. అందర్నీ ఒకేసారి తూట్లు పొడిచే సదవకాశంగా భావించి ఇది రాస్తున్నాను. 

నేను ఈ వ్యాసంలో రాసిన ప్రతీ విషయం నా ఇరవై నాలుగేళ్ళ సినీ జీవిత అనుభవసారం. ఇందులో అక్షరం ముక్క కూడా తప్పులేదు. ఉందని ఎవరేనా భావిస్తే అది వాళ్ల అజ్ఞానంగా భావించి నవ్వుకుంటాను. గర్వంతో కాకుండా సవినయంగా ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. కష్టపడి సహాయశాఖల్లో పునాదులు పటిష్టంగా కెరీర్ లు ప్రారంభించండి.  సినిమా మరో వందేళ్లు విరాజిల్లుతుంది. కాదని, ఇప్పుడున్న పరీస్థితులే కంటిన్యూ చెయ్యండి. త్వరలో నూరేళ్లు సాగుతుంది. అయినా ఉపాధికి, బ్రతకడానికి ఎవ్వరికీ లోటు ఉండదు. టీవీ, ఇంటర్నెట్లు, స్టేజి షోలు ఉండనే ఉన్నాయి. సినిమా ఉంటుందా, కల్యాణ మండపం కానీ , షాపింగ్ కాంప్లెక్సే గానీ ఉంటుందాన్నదే ప్రశ్నార్ధకం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పరిశ్రమ  "ట్రస్ట్ ' మీదే నడుస్తుంది. ప్రేక్షకుడి నుంచి ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ అందరి మధ్యా  కీలకమైనది ట్రస్ట్ ఫాక్టరే. కాగితాల మీద ఎగ్రిమెంట్లన్నీ సినిమాలని ఆపడానికి తప్ప జరపడానికి ఎప్పుడూ పనికి రావు. ఆ ట్రస్ట్ నిర్మించుకోడానికి ముందు అనుభవం కావాలి. ఆ ట్రస్ట్ ని నిర్మించుకోవడమే కెరీర్ ని నిర్మించుకోవడం అంటే.

 

మళ్లీ సంచికలో మరిన్ని విశేషాలతో కలుద్దాం.... స్వస్తి.

bottom of page