top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

తారుమారు

Rajes Yalla

భవానీ ఫణి

కల్పన కారు పార్క్ చేసి, తన దగ్గర ఎప్పుడూ ఉండే ‘కీ’ తో తలుపు తీసుకుని - వేగంగా లోపలికి నడిచింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పిల్లలిద్దరూ సోఫాల్లో, మాధవ్ కుర్చీలో పడుకుని నిద్రపోతున్నారు. 'రాత్రంతా ఎంత కంగారు పడుంటారో, తను రాలేదని!' జాలిగా నిట్టూర్చింది. స్నానం వగైరాలు కానిద్దామని శబ్దం చెయ్యకుండా బెడ్ రూమ్ లోకి దారి తీసింది. 

ఆమె తయారై వచ్చేసరికి కూడా ఎక్కడి వాళ్లక్కడే నిద్ర పోతున్నారు. మెల్లగా వెళ్లి మాధవ్ ని తట్టి లేపింది. అతను ఒక్కసారిగా ఉలికిపడి లేచి కూర్చున్నాడు. 
"కల్పనా! యూ ఆర్ సేఫ్!" వణుకుతున్న కంఠంతో మెల్లగా అంటూ ఆమెను దగ్గరకి తీసుకున్నాడు. ఆ అలికిడికి స్రవంతి కూడా నిద్ర లేచింది. 'అమ్మా' అంటూ వచ్చి కౌగలించుకుంది. ముగ్గురూ అలా ఒకర్నొకరు పట్టుకుని ఉండగానే వెనకనించి సన్నని ఏడుపు వినిపించింది. ఎప్పుడు లేచాడో సాత్విక్ వెక్కుతూ ఏడుస్తున్నాడు. 
ఒక్క  ఉదుటున లేచి వాడి దగ్గరికి చేరింది కల్పన. "వచ్చేసాను కదా నాన్నా, ఇంకేం భయం లేదు అంది" వాణ్ణి ఒళ్లోకి లాక్కుంటూ.  

ఆ రోజు ఎవరూ ఆఫీసులకీ, స్కూళ్లకీ వెళ్లలేదు. ఇంట్లోనే గడిపాలని నిర్ణయించుకున్నారు. కొంతసేపటికి టిఫిన్లు చేసి మళ్ళీ  పిల్లలు మత్తులోకి జారిపోయారు. అప్పుడడిగాడు మాధవ్, " కారు చెడిపోయిందన్నావు, అలా అంతసేపు ఎక్కడున్నావు? ప్రమాదమేమీ ఎదురవలేదు కదా?"

కల్పన ఒక్క నిమిషం అలోచించి, లేచి వెళ్లి హ్యాండ్ బాగ్ లోనుండి ఆ మెరుస్తున్న రాయిని తీసుకొచ్చింది. "రాత్రి చాలా వింత విషయాలు జరిగాయి మాధవ్" అంటూ చెప్పడం మొదలుపెట్టింది. "రాత్రి నేను ఆఫీస్ నుండి బయలుదేరేటప్పటికే లేటయింది కదా, కారేమో దార్లో ఆగిపోయింది. నీకు కాల్ చేసి చెప్పగానే మొబైల్ చార్జ్ అయిపోయి ఆఫ్ అయిపోయింది. మెల్లగా నడుచుకుంటూ వెళ్లి, దగ్గరలో చిన్న బస్ షెల్టర్ ఉంటే, అక్కడ నిలబడ్డాను. బస్సులు కానీ, ఆటోలు కానీ వస్తాయేమో అని ఎదురుచూడసాగాను. కానీ అంతలో ఇద్దరు రౌడీలు ఓ పాపని కార్లో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లడం చూసాను. మొత్తానికి ఎలానో వాళ్ల బారినించి పాపను కాపాడాను. కానీ ఆ పాప నాకో కథ చెప్పింది. తను ఎక్కడో వేరే గ్రహం నించి వచ్చిందిట. మనుషుల్లో మిగిలి ఉన్న మానవత్వానికి ఇది పరీక్షట. నాకైతే అర్థమయిపోయింది. అదేదో ప్రాక్టికల్ జోక్ గానీ, రియాలిటీ షో గానీ అని. అందుకే ఇక పెద్దగా ఆలోచించలేదు. పాప మాత్రం నాతో రానంది. ఇదిగో ఈ రాయిని  నాకు గిఫ్ట్ గా ఇచ్చింది." అంటూ ఆ రాయిని మాధవ్ చేతికి అందించింది కల్పన. 
తెల్లబోయి చూస్తూ అంతా వింటున్న మాధవ్, అనాలోచితంగా ఆ రాయిని అందుకున్నాడు. 
"ఏంటి మాధవ్, నువ్వు  పాప చెప్పిందంతా నిజమని నమ్ముతున్నావా ఏంటి కొంపతీసి?" నవ్వుతూ ఆటపట్టిస్తున్నట్టుగా అంది కల్పన. 
మాధవ్ ఏమీ మాట్లాడకుండా రాయిని పరీక్షగా చూడటం మొదలు పెట్టాడు. "ఇటువంటి రాయిని ఎప్పుడూ చూసినట్టు లేదు ఎక్కడా" అన్నాడు సంశయంగా. 
" చాల్లే, నువ్వు  మరీనూ, వాళ్ళేదో సరదాకి చేస్తే, నువ్వు  కూడా ఏంటి?" అంటూ దాన్ని తీసుకుని టేబుల్ మీద పెట్టేసింది. 
" అయినా ఎంత ప్రమాదం తప్పింది! వాళ్ళు  నిజంగా చెడ్డవాళ్లే అయి ఉంటే ఏమయిపోయేదానివి!" అన్నాడు దిగులుగా. 
"ఏమీ కాలేదుగా, నేను సేఫ్ గానే ఉన్నాను కదా. ఇంక ఆ సంగతి మరిచిపో. పిల్లలకి కూడా ఇదంతా ఏమీ చెప్పద్దు" అందామె అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. 

ఇదంతా జరిగి రెండు నెలలు గడిచిపోయింది. కల్పన అంతా మరిచిపోతున్న సమయంలో మళ్లీ ఆ సంఘటన ఆమెని కలవరపెట్టింది. ఆ రోజు స్రవంతిని పిలుద్దామని రూమ్ లోకి వెళ్లేసరికి తను ఎవరితోనో గుసగుసగా మాట్లాడుతోంది. సాత్విక్ అప్పటికే హాల్లో ఉన్నాడు. మరి ఎవరితో మాట్లాడుతోంది! అర్థం కాలేదు కల్పనకి. అంతలో తల్లిని గమనించిన స్రవంతి, కంగారుగా తన చేతిలో ఉన్న వస్తువేదో టేబుల్ సొరుగులో పెట్టేసింది. 
"అది... మమ్మీ.... స్కూల్లో స్పీచ్ ఇవ్వాలి; ప్రాక్టీస్ చేస్తున్నా." అంది తడబడుతూ, ఏమీ అడక్కముందే. 
కల్పన ఇక రెట్టించలేదు. "సరే, రా, స్కూల్ కి టైం అవుతోంది. టిఫిన్ చెయ్యవా?" అంటూ వెనుతిరిగి హాల్లోకి వచ్చేసింది. 

పిల్లల్ని స్కూల్ కి పంపాక. స్రవంతి గదిలోకి వెళ్లి టేబుల్ సొరుగు తీసి చూసింది. అందులో ఆ మెరుపు రాయి తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఆ రాయి కోసం మొదట్లో పిల్లలిద్దరూ తెగ పోట్లాడుకున్నారు. కొన్ని రోజులు ఒకరూ, మరి కొన్ని రోజులు వేరొకరూ - వాళ్ల దగ్గర ఆ రాయిని ఉంచుకునేలా పంచుకున్నారు.  కానీ ఎందుకో కొన్నిరోజులకే సాత్విక్ ఆ రాయిని తీసుకోవడం మానేసాడు. అది స్రవంతి దగ్గరే ఉండిపోయింది. స్రవంతి రాయిని ఇష్టంగా దాచుకుందని తెలుసు గానీ, రాయితో మాట్లాడటం ఏమిటి? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అనుకుంది కల్పన. తిరిగి రాయిని దాని స్థానంలోనే పెట్టేసింది. ఇక స్రవంతిపై ఒక కన్నేసి ఉంచాలి అనుకుంటూ. 

పన్నెండేళ్ల స్రవంతి తెలివైన పిల్ల. చదువులో, ఆటపాటల్లో చురుగ్గా ఉంటుంది. అబద్ధాలు చెప్పే అలవాటు గానీ, విషయాలు దాచే అలవాటు గానీ లేవు తనకి. ఈ మధ్య  మాత్రం ఎక్కువ టైం తన రూమ్ లోనే గడుపుతోంది. పరధ్యానంగా ఉంటోంది. ఆ రోజు నుండీ కల్పన, స్రవంతిని కొంచెం శ్రద్ధగా గమనించడం మొదలుపెట్టింది. ఏమీ ఎరగనట్టుగా సాత్విక్ ని కూడా అడిగింది. 'రాయి కోసం అక్కతో ఎందుకు పోట్లాడటంలేదురా' అని. వాడు విసుక్కున్నాడు. "ఆ రాయికి అక్కంటేనే ఇష్టం. అక్కతోనే మాట్లాడుతుంది. నాతో మాట్లాడదు" అన్నాడు వాడు కోపంగా.


"రాయి మాట్లాడటం ఏమిట్రా!" అంది ఆశ్చర్యంగా కల్పన. 


"అదేలేమ్మా, కలర్స్  మారుతూ ఉంటుంది. అక్క  మాట్లాడుతుంటే అది కలర్స్  మారుతుంది. ఒక్కో  కలర్ కీ ఒక్కో మీనింగ్ ట. ఆ సిగ్నల్సేవో అక్కే  నేర్చుకుంది. నాకు నేర్పట్లేదు. అయినా నేను మాట్లాడినప్పుడు అది కలర్స్  మారదు.  అందుకే వదిలేసాను" అన్నాడు.   
కల్పనకి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలో అక్కర్లేదో అర్థం కాలేదు. తాత్కాలికంగా ఈ ఆలోచనని పక్కన పెట్టడమే మంచిదని అనుకుంది.

కానీ మరో నెల గడిచేసరికి స్రవంతి ప్రవర్తనలో మార్పు కొట్టొచ్చినట్టుగా కనిపించసాగింది. ఒక్కోసారి 'అసలు తను మునుపటి స్రవంతేనా' అనిపించేలా ప్రవర్తిస్తోంది. గడగడా వాగేదల్లా చాలా మౌనంగా ఉంటోంది. ఏమైనా అంటే ఎదురు సమాధానాలు చెబుతోంది. మాధవ్ తో చెబితే, "టీనేజ్లోకి వస్తోందిగా, ఈ మార్పులు సహజమేలే" అని కొట్టి పడేసాడు. 

ఇక ఇలా లాభం లేదని ఒక రోజు కల్పన ఆఫీస్ కి సెలవు పెట్టింది. పిల్లల్ని స్కూలుకీ , మాధవ్ ని ఆఫీస్ కీ పంపేసాకా  స్రవంతి గదిలోకి వెళ్ళింది. మెల్లగా టేబుల్ డ్రాయర్ లాగి చూసింది. స్రవంతి ఆ రాయిని మునుపటి కంటే ఎక్కువ భద్రంగా దాచిపెట్టింది ఈసారి. మెత్తని టవల్ వేసి దాని మీద జాగ్రత్తగా పెట్టుకుంది. కల్పన, ఆ రాయిని అరచేతిలోకి తీసుకుంది. అది చాలా వెచ్చగా, ప్రాణంతో ఉన్నట్టుగా అనిపించింది కల్పనకు. ఇంతకుముందు అలా లేదే! ఆశ్చర్యంతో పాటుగా భయం కూడా కలిగిందామెకు. ఇంతలో అది వేగంగా రంగులు మారడం మొదలుపెట్టింది. గుండె వేగం పెరిగినప్పుడు కలిగే అనుభూతి వంటిదేదో ఆ రాయి అనుభవిస్తున్నట్టుగా అనిపించింది కల్పనకు. దీన్నేనేమో, సాత్విక్ మాట్లాడటం అంటున్నాడు! మాట్లాడితే దీనికి అర్థమవుతుందా? మాట్లాడి చూద్దామా అన్న ఆలోచన కలిగింది కల్పనకు. 

అలా రాయితో మాట్లాడటమంటే, ఎవరూ చూడకపోయినా కొంచెం బిడియంగానే అనిపించిందామెకి.  ధైర్యం చేసి 'హలో' అంది. రాయి వెంటనే ఒకసారి ఆకుపచ్చగా వెలిగి ఆరింది. అంటే అది కూడా హలో చెప్పిందన్నమాట. 'ఎలా ఉన్నావు?' అందీసారి ఉత్సాహంగా. రాయి మళ్లీ ఆకుపచ్చగా వెలిగింది. ఇంకేం అడగాలా అని కాసేపు ఆలోచించి, "నీకిక్కడ బావుందా?" అంది. అది మళ్లీ ఆకుపచ్చ రంగులో వెలిగి ఆరిపోయింది. ఈ సారి కొంచెం తక్కువ సమయంలో ఆరిపోయిందేమో అనిపించింది కల్పనకి. "నీ పేరేమిటి?" అంది. రాయి వెలగలేదు. అవును, ఇలాంటి ప్రశ్నలకి ఎలా సమాధానం చెబుతుంది! అనుకుని "నీకు స్రవంతి ఫ్రెండా?" అని అడిగింది. రాయి మళ్ళీ  ఆకుపచ్చగా వెలిగింది. "నువ్వు  ఇక ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతావా?" అంది. ఈ సారి రాయి ఎర్రగా వెలిగింది. కల్పనకు ఇంకా చాలా ప్రశ్నలు అడగాలనుంది. కానీ ఎలా అడగాలి? మీదే వూరు అంటే ఎలా సమాధానం చెబుతుంది? అయినా మీదే గ్రహం అని అడగాలేమో!. "మీది మార్స్ నా" అంది. ఎర్రగా వెలిగింది రాయి. 

ఆ రోజు తనకి కనిపించిన పాప చెప్పిందే  నిజమైతే ఎక్కడో దూర గ్రహం నుండి వచ్చానని చెప్పింది కదా. ఆ పాపే ఇందులో ఉందా? లేక ఇది వేరే ప్రాణా? ఇదేమైనా ప్రమాదకరమా అన్న ఆలోచన రాగానే కల్పనకు భయం వేసింది. రాయి ఏవేవో రంగుల్లో వెలగడం మొదలుపెట్టింది. అదేదో చెప్పే ప్రయత్నం చేస్తోందని అర్థమయింది కల్పనకు. కానీ ఆమెకేమీ అర్థం కావడం లేదు. స్రవంతి వచ్చాక అడగాలి అనుకుంటుండగానే వేగంగా లోపలికి దూసుకొచ్చింది స్రవంతి. విసురుగా ఆమె చేతిలోనుండి రాయిని లాక్కుంది. 
కల్పన ఆశ్చర్య పోయింది. "నువ్వెలా లోపలికి వచ్చావు? ఇంకా స్కూల్ వదిలిపెట్టే టైం కాదు కదా. తలుపెవరు తీసారు?" అనడిగింది. 
"అవన్నీ నీకెందుకు? అయినా నువ్వు  నా స్టోన్ ని ఎందుకు ముట్టుకున్నావు?" అంది చాలా కోపంగా, దురుసుగా. 
స్రవంతి ఇంతకుముందు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. రాయికి ఏదో అర్థమయినట్టుగా, ఆరిపోయి ఉండిపోయింది. 

"స్రవంతీ, ఈ రాయి గురించి నాకు పూర్తి డిటైల్స్ చెప్పు. ఇది డేంజరస్ కూడా కావచ్చు. ఇలా చెప్పకుండా దాస్తే ఎలా?" అంది ఆమె కూడా కొంచెం తీక్షణంగానే.
స్రవంతి చాలా కోపంగా ఆమె వైపు చూసింది. రాయి ఎందుకో మళ్లీ విపరీతమైన వేగంగా రంగులు మారడం మొదలుపెట్టింది. "నిన్నెవరితోనూ మాట్లాడొద్దని చెప్పానా?" అంటూ స్రవంతి దాన్ని మళ్లీ టేబుల్ అరలో పెట్టేసి సొరుగు మూసేసింది. 


దురుసుగా కల్పన వైపుకి తిరిగింది. "అలా కూర్చో చెబుతాను అంది మంచం చూపిస్తూ ఆజ్ఞాపూర్వకంగా. తను అక్కడే ఉన్న కుర్చీలో  కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. ఏమిటిది? అసలు స్రవంతి ఎందుకిలా ప్రవర్తిస్తోంది! అయోమయంగా మంచం మీద కూర్చుండిపోయింది కల్పన. 


"నీకో నిజం చెప్పాలి. నేను స్రవంతిని కాను" అంది స్రవంతి గంభీరంగా. 


ఉలికిపాటుగా లేచి నిలబడింది కల్పన. " విషయం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కూర్చో" అంది స్రవంతి కటువుగా. కల్పన నిస్సత్తువగా కూలబడింది. 
"నీకు ఆ రోజు రాత్రి రోడ్డు మీద కనిపించిన పాపలానే నేను కూడా 'బ్రైట్ స్టోన్' అనే అర్థం వచ్చే పేరు గల గ్రహానికి చెందిన జీవిని. ఆ రాయితో పాటుగా మీ ఇంట్లోకి వచ్చాను" అంది. 


"అవునా! మరి స్రవంతి ఏదీ? అనాలోచితంగా అడిగేసింది కల్పన, ఈ విషయమంతా తను నమ్ముతోందో లేదో ఆలోచించుకోకుండానే. ఒకవేళ ఇదే నిజమైతే! అన్న భయం ఆమె చేత అలా అడిగించింది. 


"చెబుతాను కదా విను. తొందరపడకు; మొత్తం ఈ హోల్ యూనివర్స్ లో, మా గ్రహం తర్వాత జీవం పుట్టింది మీ ప్లానెట్ లోనే. మేం మిమ్మల్ని ఎప్పటినించో అబ్జర్వ్  చేస్తున్నాం, ఇక రెండు ప్లానెట్స్  వాళ్లూ ఒకళ్లనొకరు అర్థం చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. అందుకే మేమిలా భూమి మీదికి వచ్చాం"


"స్రవంతీ, నువ్వు  నన్ను ఏడిపిస్తున్నావా? నిజం చెప్పమ్మా , నాకు చాలా భయంగా ఉంది" అంది కల్పన, ఇంచుమించుగా కళ్లలో నీరు తిరిగిపోతుంటే. 
 

స్రవంతి నవ్వింది. "ఇదిగో ఇటువంటి ఫీలింగ్స్  గురించే మేము ఎక్పరిమెంట్స్  చేస్తున్నది ముఖ్యంగా"


"అయ్యో, సరే, నువ్వు  స్రవంతివి కాకపోతే, మరి స్రవంతి ఎక్కడుందో చెప్పు" అంది కల్పన ఆందోళనగా.

 
"స్రవంతి సేఫ్ గానే ఉంది. కంగారుపడకు. మీ అమ్మాయి చాలా గొప్ప పనికి హెల్ప్ చేస్తోంది. ఈ ఎక్పరిమెంట్స్  కారణంగా మీ గ్రహానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది."  అంది స్రవంతో కాదో తెలీని ఆ అమ్మాయి. 

"అసలు నాకేం అర్థం కావడం లేదు. మీరిదంతా ఏదో ఆశించి చేస్తున్నారని మాత్రం తెలుస్తోంది" అంటూ తల పట్టుకుంది కల్పన. 


"నువ్వు  చాలా తెలివైన దానివి. నిజమే, మా గ్రహం మరి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక పెద్ద ఆస్టరాయిడ్ ఢీ కొట్టడం వలన నాశనం కాబోతోంది. మాకు ఉండటానికి అనుకూలమైన క్లైమేట్ ఈ భూమి మీద మాత్రమే ఉంది. అందుకే ఈ  పరిశోధన మొదలుపెట్టాం. మా గ్రహవాసులం ఇక్కడ ఉండి, ఇక్కడి వాళ్ళని అక్కడకు పంపి ఎక్పరిమెంట్స్ .చేస్తున్నాం. స్రవంతి ఎక్కడుంది అనడిగావు కదా, అదుగో ఆ రాయి లోపల ఉంది. ఆగాగు, నేనేమీ బలవంతంగా తనని అందులో బంధించలేదు. తన వలన కొన్ని కోట్ల మందికి హెల్ప్ అవుతుందని చెప్తే, తనే ఒప్పుకుంది."

కల్పనకి నమ్మబుద్ధి కావడం లేదు. కానీ ఆమె మనస్సాక్షి ఇదంతా నిజమని చెబుతోంది. ఇంతకు ముందు రాయి వెచ్చగా ఉండేది కాదు. ఇప్పుడది ఒక మనిషి శరీరంలా వెచ్చగా ఉంది. ఇదంతా నిజమైతే స్రవంతి ఏమైపోతుంది! కన్నీరు మున్నీరవుతూ వేగంగా టేబుల్ సొరుగు తీయబోయింది కల్పన. అంతకంటే వేగంగా లేచి ఆమె చెయ్యి పట్టుకుంది ఎదురుగా ఉన్న అమ్మాయి. ఆ చెయ్యి  చల్లగా ప్రాణం లేనట్టుగా ఉంది. 


"ఆగు, ఇప్పుడు నువ్వేమీ చెయ్యలేవు. స్రవంతికి మా గ్రహంలో మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరెప్పుడూ కలలో కూడా ఊహించలేనంత గొప్ప లైఫ్ ని అనుభవిస్తుంది. మేము మీకంటే అన్నివిధాలుగా ఎంతో ముందంజలో ఉన్నాం. మా గ్రహానికి ఆ ఆస్టరాయిడ్ తో ప్రమాదం లేకపోతే ఈ భూమి వైపుకు కన్నెత్తి కూడా  చూసి ఉండేవాళ్ళం కాదు" అంది ఆమె చెయ్యి వదలకుండానే. 


"నా కూతురికి ఏ గొప్ప ఫ్యూచరూ వద్దు. నా కూతురు నాక్కావాలి. దానికి అమ్మ కావాలి. నాన్న, తమ్ముడు, ఫ్రెండ్స్  అందరూ కావాలి. దాన్ని వదిలిపెట్టు. నీకు దణ్ణం పెడతాను." అంది కల్పన భోరున విలపిస్తూ. 

ఆ అమ్మాయి మెల్లగా సొరుగు తీసి రాయిని చేతిలోకి తీసుకుంది. 


"సరిగ్గా పది నిమిషాలలో మా గ్రహవాసులంతా మా గ్రహానికి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇలా కొందరిని మాత్రం మా ప్లేస్ లో పంపిస్తున్నాం, ఇక్కడ, ఈ భూమ్మీద ఉండిపోయి, మేం కూడా ఎంత పెద్ద త్యాగం చేస్తున్నామో తెలుసా? అయినా మీ అమ్మాయికి ఇష్టమైనప్పుడు నీకెందుకంత బాధ?" అంది మెల్లగా రాయిని నిమురుతూ. రాయి రంగులు మారడం మొదలు పెట్టింది. 


"స్రవంతీ , నీకేం భయం లేదు. నేను నీకన్నీ చెప్పాను కదా. అక్కడ నీకెంత బావుంటుందో, ఎటువంటి పరిస్థితులున్నాయో తెలుసు కదా నీకు. చూపించాను కూడా స్టోన్ లోపల; ఇంకా నువ్వు  ఎంత మంది ప్రాణాలు కాపాడబోతున్నావో గుర్తు చేసుకో! చివరి నిమిషంలో అభిప్రాయం మార్చుకోకు" అందా అమ్మాయి అనునయంగా. 

కల్పనకి ఒక సందేహం కలిగింది. ఆ అమ్మాయి నిజంగా తన కూతుర్ని అందులో బంధిస్తే, అంతగా నచ్చ చెప్పాల్సిన పనేముంది? బహుశా స్రవంతికి ఇష్టం లేకపోతే ఈ అమ్మాయి తనని అందులో ఉంచలేదేమో? ఎలా అయినా స్రవంతి బయటకు వచ్చేలా చెయ్యాలి.


వెంటనే కల్పన రాయి దగ్గరకు వెళ్ళింది. "స్రవంతీ, ఇలా మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు! మేమేమయిపోతాం? నువ్వు లేకుండా ఎలా ఉండగలం? తమ్ముడు తట్టుకోగలడా? ప్లీజ్ స్రవంతీ, వద్దు వచ్చెయ్ తల్లీ - నా దగ్గరికి వచ్చెయ్, నువ్వు  లేకపోతే నేను చచ్చిపోతాను బంగారం" గట్టిగా ఏడుస్తూ అరవసాగింది కల్పన. 

రాయి మళ్ళీ  రంగులు మారడం మొదలుపెట్టింది. అయోమయంలో ఉన్నట్టుగా. ఆ అమ్మాయి కంగారు పడింది. "స్రవంతీ, ఆఖరి నిమిషంలో మీ అమ్మ  అంతా పాడు చేసేలా ఉంది. నువ్వు  నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. దయచేసి ఈ మంచి పని చేసి, మంచి అమ్మాయివని నిరూపించుకో. ఇటువంటి మాటలకి లొంగిపోకు" 
కల్పనకు అర్థమయిపోయింది. అంటే స్రవంతి బయటకు వచ్చెయ్యాలనుకుంటే ఈ అమ్మాయి ఆపలేదన్నమాట. 


"లేదు స్రవంతీ, ఈ అమ్మాయి చెబుతున్నది నిజమో కాదో మనకి తెలీదు. నిన్నక్కడ బంధిస్తారు. హింసిస్తారు. రకరకాల ప్రయోగాలు చేస్తారు. ముఖ్యంగా మళ్లీ నువ్వు  మా దగ్గరికి ఎప్పటికీ రాలేవు. ఇప్పుడే వచ్చెయ్ తల్లీ, ఆలస్యం అయిపోకుండా. వచ్చెయ్యమ్మా, అమ్మ మీద జాలి చూపించమ్మా, తర్వాత ఈ అమ్మాయి మమ్మల్ని ఏం చేస్తుందో ఎవరికి తెలుసు? మా అందరినీ చంపేసినా చంపెయ్యచ్చు. అది నువ్వు తట్టుకోగలవా? మమ్మల్నేమిటి, మన భూమి మీద బ్రతికే మొత్తం మనుషులందరినీ చంపినా చంపేస్తారు  వీళ్ళు . ఇప్పుడు నువ్వు  వెళ్ళిపోయి, ఈ అమ్మాయిని ఇక్కడ వదిలేస్తే అటువంటి ఘోరాలకి సహాయపడినదానివి అవుతావు. రా అమ్మా , బయటకి వచ్చెయ్యి" 

ఎదురుగా ఉన్న అమ్మాయి కోపంగా, ఆందోళనగా రాయి వంక చూస్తోంది. రాయి విపరీతమైన వేగంతో రంగులు మారడం మొదలుపెట్టింది. అలా మారి మారి, ఎరుపు రంగు దగ్గర ఆయిపోయింది. అంతే, ఎదురుగా ఉన్న అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. ఆమె చేతిలోని రాయి హఠాత్తుగా మాయమయిపోయింది. కల్పన కంగారుగా

 

రాయి కోసం గది నాలుగువైపులా వెతికింది. కనిపించకపోవడంతో ఆ అమ్మాయిని చేరుకొని, కుదపసాగింది. "స్రవంతీ, నువ్వేనామ్మా , లే అమ్మా, లే"
 

స్రవంతి మెల్లగా కళ్ళు తెరిచింది. బలహీనమైన స్వరంతో అంది " నే వచ్చేసానమ్మా". ఈ సారి తన శరీరం వెచ్చగా తగిలింది. సంతోషంతో స్రవంతిని గట్టిగా కౌగలించుకుంది కల్పన. అంతలోనే సందేహంగా, తనలో తను అనుకున్నట్టుగా అంది, "మరి ఆ రాయీ, అమ్మాయీ ఏమయ్యారో!"


"వాళ్ళు  వెళ్లిపోయారమ్మా , ఒక పని మీద వచ్చారు కదా. ఈ టైం వాళ్లకి డెడ్ లైన్. మనుషుల్ని పంపినా, వాళ్లే వెళ్ళిపోయినా ఇప్పుడు వెళ్లిపోవాల్సిందే. మళ్ళీ  వంద సంవత్సరాల తర్వాత వస్తారట" అంది స్రవంతి. 


'ఎంతలో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది! తమకే కాదు, తమ వలన మొత్తం మానవ జాతికే హాని జరిగి ఉండేది అనుకుంటూ మళ్ళీ  స్రవంతిని గుండెలకి హత్తుకుంది కల్పన.

 

ఇంతలో హాల్లోనించి సెల్ మోగుతున్న శబ్దం వినిపించింది. మాధవ్ చేసాడేమో అనుకుంటూ, స్రవంతిని అలానే పొదివి పట్టుకుని నడిపించుకుంటూ హాల్లోకి వచ్చింది కల్పన. నెంబరెవరిదో చూడకుండానే లిఫ్ట్ చేసింది. 

"నేనురా, ఆఫీస్ లో ఉన్నావా?" అవతలినించి కుమారన్నయ్య  గొంతు వినిపించేసరికి, కొంత ఉత్సాహమూ, మరికొంత సందేహమూ కలుగుతుంటే గడియారం వైపు చూసింది. 

"లేదురా. సెలవు పెట్టాను. అయినా నువ్వేంట్రా ఈ టైం లో.... " అంది, వాళ్లకిప్పుడు అర్ధ రాత్రి కదా, ఈ సమయంలో ఎప్పుడూ కాల్ చెయ్యలేదు...  

"ఏం లేదురా, సాయంత్రం అక్షూకి హై ఫీవర్ వచ్చి, ఫిట్స్  వచ్చాయి. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా అవలేదు. వనితా, నేనూ చాలా కంగారు పడ్డాం; ఇప్పుడు బానే ఉందిలే" అన్నాడు. అక్షిత, కుమార్ ఒక్కగానొక్క కూతురు. వాళ్ళు  పదిహేనేళ్లుగా కాలిఫోర్నియాలోనే ఉంటున్నారు. 

"అయ్యో, ఇప్పుడెలా ఉందిరా, ఎక్కడున్నారు?" అంది కంగారుగా. 

"ఇంకా హాస్పటల్ లోనే ఉన్నాం. ఎందుకో ఈ రోజు ఉదయం నుండి ఇటువంటి కేసులు ఐదారు వచ్చాయిట ఈ హాస్పటల్ కి. కంట్రీ మొత్తానికి చాలా కేసులు వస్తున్నాయని ఇంటర్నెట్ లో న్యూస్; ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీదు మరి."

"ఇదెక్కడి సమస్య  వచ్చి పడిందిరా! అక్షితకి ఇప్పుడు బావుందా, ఏమైనా తిందా? ఇప్పుడు లేదు కదా జ్వరం?" కల్పన మనసంతా మళ్ళీ  ఆందోళనతో నిండిపోతుంటే గబగబా అడిగింది.  

"తిందిలే ఏదో కొంచెం; ఇప్పుడు ఫీవరేంలేదు. ఇంకా చెప్పాలంటే బాడీ టెంపరేచర్ ఉండాల్సిన దానికంటే తక్కువగానే ఉందనిపిస్తోంది నాకు; డాక్టర్స్  అయితే ప్రాబ్లెమ్ ఏమీ లేదని చెప్పారులే... ఇంతకీ ఎందుకు కాల్ చేసానంటే, అక్షూ ఇందాకటినించీ స్రవంతితో మాట్లాడతానని ఒకటే గొడవ; అది స్కూల్లో ఉందేమో అంటే వినదు, ఉందా అక్కడ?" 

...................

ఆ మాటలు వినగానే కల్పనకు ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. కాళ్లు తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంటే, పక్కనే ఉన్న సోఫాలో కూలబడింది. ఒక్కటే ఆలోచన... 'తప్పిపోయిందనుకున్న ప్రమాదం - పెనుముప్పుగా మారి ముంచెత్తబోతోందా!'

OOO

bottom of page