top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

  రుద్రాక్ష

 

  భాస్కర్ సోమంచి

Bhaskar-Somanchi.jpg

                                               

 

అమెరికా వచ్చాక చాలా విషయాలు తారు మారు అవుతాయి. వేసవికాలంలో పిల్లలు అమ్మమ్మ గారింటికో, నానమ్మ గారింటికో పోవడం బదులు, పెద్ద వాళ్లే పిల్లలను చూడడానికి రావడం సులువు, రివాజు అయిపోయింది.  అలానే ఓ వేసవి, మా అత్తగారు, మావగారు పిల్లలతో గడపడానికి ఇండియా నుంచి వచ్చారు. శ్రీమతి, పిల్లలు కలసి న్యూ యార్క్ రోడ్ ట్రిప్ కి వెళ్లాలని తీర్మానించారు. మొత్తం రెండు వారాలు. షార్లెట్, రిచ్మండ్ నగరాలలో లో ఓ రెండు రోజుల మజిలీలు అక్కడి నుంచి  మహా నగరానికి పోవాలని పథకం.

 

ఇంకో రెండు రోజులలో ప్రయాణం. గురువారం యధావిధిగా సాయిబాబా సత్సంగానికి వెళ్ళాను. ఎందుకో ఏదో అసంతృప్తి. జీవితం వెలితి గా అనిపించింది. ఇంటికి వస్తూ కొన్నేళ్లక్రితం మా నాన్న గారికి శివరాత్రి ముందర ఓ సాధువుతో సంభాషణ, ఆయన ఒక ఖాళీ కాగితాన్ని ఒక పొట్లంలా కట్టటం, చేత్తో తడితే రెండు శివ లింగాలు - ఒకటి నలుపు, మరొకటి స్ఫటికం- విభూతి సహితంగా ఆ కాగితం పొట్లం లోకి రావడం గుర్తొచ్చింది.  ఇప్పటికీ మా ఇంట్లో అవి భద్రంగా ఉన్నాయి. చాలా రోజులు ఆ శివ లింగాలకి ఫోటో తీస్తే రాలేదు కూడ. నాకేదైనా ఓ మిరకిల్ జరిగితే ఎలా ఉంటుంది అనుకుంటూ ఇల్లు చేరాను. ఆ రాత్రి అంతా నేను విన్న అద్భుతాల గురించి ఆలోచిస్తూ నిద్ర పోయాను.

 

 ప్రొదున్నే ఏడు గంటలకి ప్రయాణం. అందరూ రెడీ అయ్యారు. మనకి చెప్పబడిన ఆచార వ్యవహారాలన్నిటికి భగవదారాధన ప్రధానం. ప్రొదున్నేలేవగానే భూదేవికి నమస్కరించామన్నా, స్నానం చేస్తున్నప్పుడు గంగా స్నానం అనుకోమన్నా, భోజనం ముందు ఆహరం బ్రహ్మమని నమస్కరించామన్నా, వంట చేస్తున్నప్పుడు స్తోత్రాలు చదవమన్నా, ఆ వంటే నైవేద్యమన్నా అన్నిటిలోను భగవదారాధనే ప్రధానంగా నడుస్తోంది. నేను మా పిల్లలకి ఈ స్మరణ గురించే చెప్తూ వుంటాను. సరే, అందరు రెడీగా వ్యాన్ దగ్గర ఉన్నారు. నేను ఇంకా నా రోజూవారీ  ప్రార్థనకు కూర్చున్నాను. నా నిశ్శబ్ద మంత్ర స్మరణ తర్వాత బాబా పాదుకల దగ్గర ఒక రుద్రాక్ష విభూతితో నిండి కనిపించింది. ఇది నాకు ఇంతకు ముందెప్పుడూ తెలీదు. ఒక్కసారి గుండె లయ తప్పింది. ఏక ముఖి రుద్రాక్షలా ఉంది. ఒక్కసారి నమస్కరించి జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాను. అక్కడ అందరు నా కోసం వెయిట్ చేస్తున్నారు. తొందరగా షూస్ వేసుకుని, ఇల్లు లాక్ చేసి వచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాను.

 

పిల్లల 'జలే రక్షతు ...." శ్లోకం తో, నా శ్రీమతి డెస్టినేషన్ ని జి.పి.ఎస్. లో లోడ్ చేయండం తో టకా టకా ముందుకు కదిలాను. రకరకాల సినిమా పాటలు ప్లే చేస్తూ, కబుర్లతో సాయంత్రానికి షార్లెట్ చేరాము. అక్కడ ఫ్రెండ్స్ ఇంట్లో చక్కటి ఆతిధ్యం అందుకుని మరుసటి రోజు వర్జీనియా చేరుకున్నాము.

 

అక్కడ ఓ రెండు రోజుల పర్యటన తర్వాత పిట్స్బర్గ్ బయలుదేరాము. అక్కడ స్వామి దర్శనం తర్వాత మధ్యాహ్నం నాలుగు గంటల సమయం వెస్ట్ వర్జీనియా లో ఉన్న ఇస్కాన్ గుడికి బయలుదేరాము. అది కొండలలో ఉంది. ఏడు గంటలకల్లా అక్కడికి చేరుకొని రాత్రి అక్కడే ఉందామని అనుకున్నాం. జి.పి.స్ ఆలా తీసుకుని వెళ్తూ పని చేయడం ఆగిపోయింది. ఎక్కడా ఓ సరైన దారి దొరక లేదు. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేనే లేవు. జి.పి.స్ కూడా పదే పదే లాస్ట్ సిగ్నల్ అంటోంది. ఎనిమిది కావస్తోంది.  రోడ్ పక్కన రైలింగ్ లేదు. దారంతా చిమ్మ చీకటి. పక్కన మా ఆవిడ కట్రాటలా కూర్చుంది. పిల్లలకి ఇంకా విషయం అర్ధం కావడం లేదు. మా మావగారు, అత్తగారు ధైర్యంగానే ఉన్నారు.

 

చివర ఓ చోట రోడ్ డెడ్ ఎండ్ లా కనిపించింది.

 

ఎదురుగా ఓ నీటి గుంట, కుడి పక్కన పొదల్లా ఉన్నాయి. జి.పి. ఎస్. ముందుకు వెళ్ళమంటోంది.   ఇక లాభం లేదని మా ఆవిడతో మనం వెనక్కి వెళ్ళిపోదాం అన్నాను. అక్కడ యూ టర్న్ చేసి ముందుకు కదిలాను. ఆ చీకట్లో ఎటు వెళ్తున్నామో తెలీదు. ఒక చోట పక్కన ఖాళీ స్థలంలా ఉంది. ఒక వ్యక్తి ఓ గులాబీ పట్టుకుని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. నేను వాన్ ఆపి అతన్ని దారి అడగడానికి ప్రయత్నించాను. కానీ అతను నా మాట విననట్టే అతని పనిలో ఉన్నాడు. ఇంతకీ అది ఒక స్మశానం. గట్టిగా ఆ విషయం చెబితే మా ఆవిడ గుండె అగుతుందని ముందుకు వెళ్లి కనుక్కుందాం అంటూ వాన్ ముందుకు పోనిచ్చాను.

 

అప్పుడు గుర్తొచ్చింది నాకు రుద్రాక్ష. చేత్తో గట్టిగా  పట్టుకున్నాను.  వెంటనే దూరంగా ఒక లైట్ కనపడింది. అక్కడొక గేట్ దానికి ఒక సెక్యూరిటీ గార్డ్ కనిపించారు. అక్కడ ఆపి దారి కనుక్కున్నాను. కొంచం ముందుకు ఈ రాళ్ల రోడ్ మీద వెళ్ళమని, తర్వాత కుడి వైపుకి ఓ దారి వస్తుందని, అక్కణ్ణించి లోకల్ హై వే వస్తుందని చేప్పాడు. అతనికి  థాంక్స్ చెప్పి ముందుకు కదిలాను. ఇంకో గంట తర్వాత లోకల్ హైవే దొరికింది. దారంతా చీకటి, మధ్యలో ఓ చెట్టు పడిపోయి ఉంది. జాగ్రత్తగా పక్కనించి దారి చూసుకుని ముందుకు వెళ్తూ వ్యాన్ ఘాట్ రోడ్ పక్కకి జారటం, మా వాళ్ళ హాహా కారాలు, నేను ఎప్పుడు రుద్రాక్ష పట్టుకున్నానో, మళ్ళీ వ్యాన్ రోడ్ మీదకి గట్టిగ శబ్దం చేస్తూ ఎలా వచ్చిందో కలలా జరిగి పోయింది. గుండె అదిరి పడేలా కొట్టుకోవడం చాలాసేపటి వరకు తగ్గలేదు. 

 

దారిలో రెస్ట్ ఏరియా లో ఎలక్ట్రిసిటీ లేదు. ఆ చీకట్లో జాగ్రత్తగా డ్రైవ్ చేసి బయట పడ్డాము. కుడి పక్కన ఒక ఫ్యాక్టరీ ఏరియాలా ఉంది. ఎడమ పక్కన అవతలి వైపు ఓ నదిలా ఉంది. ఇంకో గంట డ్రైవ్ నడిచింది. అప్పటికి రాత్రి పన్నెండు కావస్తోంది. పిల్లలకి భోజనం లేదు, పెద్దవాళ్ళు ఏమి మాట్లాడడం లేదు. ఓ చేత్తో డ్రైవింగ్ వీల్ మేనేజ్ చేస్తూ మళ్ళీ రుద్రాక్షను ఆశ్రయించాను. దూరంగా ఓ సైన్ బోర్డు కనపడింది. కొంచం స్లో చేసి చుస్తే అది హాలిడే ఇన్. అబ్బా ఆ రోజుకు గట్టెక్కాను అనుకున్నాను. ఆ లోకల్ హై వే నుంచి ఎగ్జిట్ తీసుకుని అక్కడ రూమ్ తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడి క్లర్క్ చెప్పాడు అక్కడ ఏరియాలో ముందరి రోజు తూఫాన్ వచ్చిందని, చాల చెట్లు  పడిపోయాయని, చాల ఏరియాలకి పవర్ లేదని, వాళ్ళ హోటల్ మాత్రం బ్యాక్ అప్ జనరేటర్ తో నడుస్తోందని. మేము ఒహయో మరియు వెస్ట్ వర్జీనియా మధ్య ప్రాంతంలో డ్రైవ్ చేస్తూ వచ్చామని కూడా తెలుసుకున్నాము. అక్కడ వాళ్ళ బ్రేక్ ఫాస్ట్ ఏరియా లో కొన్ని చిప్స్ పాకెట్స్, బ్రెడ్ తీసుకుని ఆ రోజుకి డిన్నర్ అయిందనిపించాము.

 

ఆ తర్వాత న్యూ యార్క్, నయాగరా చూసుకుని టాంపా బయలుదేరాము. నయాగరా నుంచి ఓ వంద మైళ్ళ దూరం లో ఓ మోటెల్ లో ఆగాము. మర్నాడు ప్రొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేసాక మా బ్యాక్ ప్యాక్ ఎక్కడో పోయిందని తెలిసింది. అందులో మా మావగారి వాళ్ళ పాస్స్పోర్ట్స్, నా ఆఫీస్ కి సంబంధించిన సెక్యూరిటీ టోకెన్ లు ఉన్నాయి. మళ్ళీ రుద్రాక్ష మహిమే అయి ఉంటుంది. రాత్రి మేము డిన్నర్ చేసిన చోట మర్చిపోయినట్టు తెలుసుకో గలిగాను. అక్కడి రెస్టౌరెంట్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్లి అది తెచ్చుకున్నాము. 

 

ట్రిప్ ముగిసి, మా ఇంటికి ఇంకా ఐదు మైళ్ళ దూరానికి వచ్చాము. మా వ్యాన్ వెనకాల పెద్దగా శబ్దం, లైట్స్ వెలగటం గమనించాను. తీరా చూస్తే అది సిటీ పోలీస్ కార్. జాగ్రత్తగా ఓ పక్కకి ఆపాను. ఆఫీసర్ వచ్చి "రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్ ప్లీజ్," అనడంతో ఆ రెండూ తీసి అందించాను. "మీరు యాభై స్పీడ్ లిమిట్ లో డెబ్బై మీద వెళ్తున్నారు, తెలుసా ? " అడిగాడు ఆఫీసర్. అప్పటికి చాల అలసి ఉన్నాను. తల అవునని, కాదని అన్నట్లుగా ఊపాను.  ఆయన కార్ లోపలకి వెళ్లి నా డాకుమెంట్స్ వెరిఫై చేసుకుని వస్తూ ఉన్నారు. ఈ లోపల రుద్రాక్ష ను మళ్ళీ గట్టిగా పట్టుకున్నాను. ఇన్ని ఉపద్రవాలలో ఆదుకున్న రుద్రాక్ష, ఈ సమస్యను ఇట్టే పరిష్కరిస్తుంది అన్న  గట్టి నమ్మకంతో.  ఆ ఆఫీసర్ కి ఎవరో ఆదేశం ఇచ్చినట్లుగా నా దగ్గరి వచ్చి, "మీకెప్పుడూ స్పీడ్ క్రాసింగ్ టికెట్స్ లేవని ఓ వార్నింగ్ తో వదిలివేయాలని మీకు అనిపిస్తున్నట్లు ఉంది, కానీ రొండు వందల డెబ్బై ఐదు ఫైన్ మరియు రెండు పాయింట్స్ ఇవ్వక తప్పదు," అంటూ టికెట్ నా చేతికి అందించాడు !!

 

*****

bottom of page