top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

ఒక్క దీపం …   

Janaki Sarma

ప్రసూన రవీంద్రన్

“హలో రూపా “ స్నేహితురాలి ఫోన్ నవ్వుతూ తీసిన కవిత, ఆమె చెప్పిన విషయం వినగానే అదిరిపడుతున్న గుండెలతో నిస్సత్తువగా గోడకి ఆనుకుపోయింది.

“నేను వెంటనే వస్తున్నాను. నువ్వు ధైర్యంగా ఉండవే. “ మాటలు కూడదీసుకుంటూ చెప్పి పరుగు పరుగున బయటికి వచ్చింది.

ఇటువంటి సమస్యలు ఎక్కడున్నా వెంటనే స్పందించి ఆ వ్యక్తులకి సహాయపడటమే తన పని అయినా, ఇవాళ ఆ పరిస్థితిలో తన ప్రాణ స్నేహితురాలు రూప కొడుకు విరాజ్ ఉండటం మరింత ఆందోళనకి గురిచేస్తోంది కవితని.

ఆటో ముందుకు పోతుంటే ఆమె మనసు మరోసారి గతంలోకి జారుకుంది.

                                          **

“కవితా … “ కిరణ్ గొంతు విని అదిరిపడింది కవిత.

ఎంత కోపంగా ఉన్నాడో అతని ఉఛ్వాశ నిశ్వాసల శబ్దాన్ని బట్టే తెలుస్తోంది.

అతని చూపులే ప్రశ్నలై తనని కాల్చేస్తున్నట్టుగా ఉలిక్కిపడింది కవిత. అతను మాట్లాడడు. ప్రస్తుతం తనంటే, స్నేహం స్థానే అసహ్యమే ఉందతనికి.

“అలా చూడకు, కిరణ్. ఒకరి జీవితపు లోతులు మరొకరికి తెలీవు. జీవితాన్ని అన్ని సందర్భాల్లోనూ సరిచేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. నా శక్తికి మించి నేనూ ప్రయత్నించాను, తను ఎలాంటివాడైనా కలిసుండాలని. నా వల్ల కాలేదు. తను నా నీడని కూడా భరించలేకపోతున్నాడు. ఇక నేను ఈ శరీరంతో ఉండటం వల్ల అందరికీ నష్టమే తప్ప ఎవరికీ ఏ లాభమూ లేదని అర్థమయ్యాకే ఈ పని చేశాను. “

తలదించుకుని గబగబా చెబుతున్న కవితని చాచిపెట్టి లెంపకాయ కొట్టాలనిపించేంత ఆవేశాన్ని బలవంతాన పళ్ళ బిగువునే నియంత్రించుకున్నాడు కిరణ్.

విసురుగా ఆమె చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళాడు. బైక్ స్టార్ట్ చేసి కవిత వైపు ఎక్కమన్నట్టు చూశాడు. మౌనంగా కిరణ్ బైక్ ఎక్కి కూర్చుందామె.

హాల్లో ఉన్న కవిత తల్లి భవాని, తండ్రి ప్రసాద్ బయటికి వెళుతున్న కూతురి వైపూ, చిన్ననాటినుండీ కూతురికి స్నేహితుడూ, ఇంట్లో మనిషిలాంటివాడైన కిరణ్ వైపూ అభావంగా చూస్తూ ఉండిపోయారు.

కవితని మళ్ళీ మనుషుల్లో కలపగలవాడు కిరణ్ మత్రమే అనిపించింది వాళ్ళకి.

పావుగంట తరువాత వంటశాలలా కనిపిస్తున్న పెద్ద కట్టడాన్ని అయోమయంగా చూస్తూ బైక్ దిగింది కవిత.

లోపల ఆధునికమయిన వంట పాత్రల్లో, ఆధునికమైన విద్యుత్ వంట విధానంలో ఒకేసారి కొన్ని వందల మందికి అన్నం, సాంబారు, చారు వగైరాలు తయారవుతున్నాయి. తలకి కేప్, చేతులకి గ్లౌసులు వేసుకుని కొంతమంది ఆ వంటల్ని సమీక్షిస్తున్నారు.

కిరణ్ చాలా మామూలుగా తనకవన్నీ వివరిస్తుంటే అప్పటిదాకా చీకట్లో మగ్గిపోయిన కవితకి చిరు వెలుగులాంటి ఉత్సాహం కొత్తగా పరిచయం అయినట్టు అనిపించింది. కొత్త విషయమేదో తను తెలుసుకుంటున్నందుకు కాదు. ఇంటికి వచ్చి తనను ద్వేషించడమో, దూషించడమో చేస్తాడనుకున్న కిరణ్, తను ఊహించని విధంగా ఆ విషయం గురించి ఏమీ మాట్లాడకుండా తనతో ఎప్పటిలా మామూలుగా మాట్లాడటం వల్ల వచ్చిన ఉపశమనం అది.

తయారయిన ఆ వంటలన్నీ కొందరు చక్కగా పేక్ చేసి ఒక చిన్న వేన్లో ఎక్కించారు. కిరణ్, తనను తిరిగి బైక్ మీద ఎక్కించుకుని ఆ వేన్ వెనుకే అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాల ముందు ఆపాడు.

ఎండలో బైక్ మీద అంతదూర ప్రయాణం అలవాటు లేదు తనకి. ఆ విషయం కిరణ్ కీ తెలుసు. బైక్ దిగగానే ఆమెకి అలసటగా అనిపించింది. కిరణ్ అదేమీ పట్టించుకోనట్టు చూస్తూ, కవిత చేతికి నీళ్ళ సీసా అందించాడు.

“కొద్దిగా నీరు తాగిరా. ఈ పాకెట్లన్నీ ఇక్కడ పిల్లలకి పంచాలి. “

తనకి ఇప్పుడాపని చేసే ఓపిక ఉందో లేదో పట్టించుకోకుండానే వేన్ వెనుకవైపు వెళ్ళిపోతున్న కిరణ్ వంక కొత్తగా చూసింది కవిత.

ఒక అరగంటలో అక్కడ పిల్లలకి అన్నం పొట్లాలు అందించేశాక, మిగిలిన వాటిని తిరిగి వేన్లో పెట్టుకుని అక్కడికి మరో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాలకి బయలుదేరారు. అప్పటికే మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. నిరాశానిస్పృహల్లో పడి ఉదయం తల్లి చేతికందించిన ఫలహారం కూడా తినలేదేమో, కవితకి ఆకలీ, నీరసం కమ్ముకొచ్చాయి. అదేమీ గమనించనివాడిలా అక్కడున్న పిల్లలకి కూడా ఆహారపొట్లాలు అందించే పని చెప్పాడు కిరణ్.

అక్కడ మరో అరగంట గడిచాక దగ్గరలోనే ఉన్న మరో పాఠశాల ముందు వాన్ ఆగింది. లోపలినుంచి ఆహారపొట్లాల కవరు దించేలోపు ఇక నిలబడలేనట్టు అక్కడే ఉన్న మర్రిచెట్టు చప్టా పైన కూర్చుండిపోయింది కవిత.

“ఏంటీ, ఆకలా?? “

ఇంతసేపు ఆకలితో తను చెప్పినవన్నీ మౌనంగా చేసినా, కిరణ్ గొంతులో కాస్తయినా సానుభూతిలేకపోవడం కోపం తెప్పించింది కవితకి. అది రోషంగా మారి, సమాధానం చెప్పకుండా పొట్లాలు పంచడానికి లేచింది.

కిరణ్ ఆమెని వారిస్తూ, ఓ కవరు విప్పి ఇంకా వేడిగానే ఉన్న సాంబారన్నం పొట్లాన్ని ఆమె చేతిలో ఉంచాడు.

ఆ మాత్రం అర్ధం చేసుకున్నదే చాలన్నట్టుగా మెత్తబడింది కవిత. మౌనంగా ఆ పొట్లాన్నందుకుని ఆ చప్టామీదే కూర్చుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతూ కిరణ్ వంక చూసినదల్లా అక్కడి దృశ్యాన్ని చూసి బొమ్మలా ఉండిపోయింది.

ఆ పాఠశాల వికలాంగులైన పిల్లలది. చేత్తో అన్నం కూడా తినలేని స్థితిలో ఉన్న పిల్లలకి మాత్రం, అక్కడి ఆయాలు, ఉపాధ్యాయులూ, కిరణ్, ఇప్పటి దాకా వాన్ నడిపిన డ్రైవరు అందరూ అన్నం తినిపిస్తున్నారు. వాళ్ళందరి మొహాల్లోనూ ఏదో తెలీని ప్రశాంతత కనపడింది కవితకి. తన మనస్తత్వానికి సిగ్గుపడి మొదటి ముద్ద కూడా తినకుండానే ఆ పొట్లాన్ని పట్టుకుని కిరణ్ ఉన్న వైపు వెళ్ళింది.

తన పక్కనే ఉన్న మరో పిల్లాడికి తినిపించబోతున్న కవితని ఆశ్చర్యంగా చూశాడు కిరణ్.  

“కవితా! “ ఎడం చేత్తో తనని అడ్డుకుంటున్న కిరణ్ వైపు విస్తుబోతూ చూసింది కవిత.

“నీ అవసరాలు మరో వ్యక్తి గుర్తించి తీర్చాలి అనే మనస్తత్వాన్ని వెంటనే ఒదులుకో. నీకేంకావాలో అది నువ్వే చూసుకోవాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా. “

అర్థంకానట్టు అయోమయంగా చూసిందామె.

“ఆకలి, నీరసం ఉంది. ఎదురుగా ఇన్ని అన్నం పొట్లాలున్నాయి. నన్ను అనుమతి అడగాల్సిన అవసరం నీకు లేదు. అది నీకూ తెలుసు. ఇంత నీరసం రాకముందే ఇందాక పాఠశాలలో పంచడం అయిపోగానే నువ్వు అక్కడే అన్నం తినేసి ఉండొచ్చు. ఎందుకలా చెయ్యలేదు. ఎప్పుడు చెయ్యాలనుకున్నావు? దేని కోసం ఎదురుచూశావు? ఈ రెండు ప్రశ్నలకీ సమాధానం అలోచించుకో. జీవితంలో ఇంతకాలం ఏ విషయంలో అయినా నువ్వు చేస్తున్న తప్పేవిటో నీకు తెలుస్తుంది. “

సూటిగా చెప్పి తన పనిలో నిమగ్నమైపోయాడు.

కవితకి ఆ ప్రశ్న గట్టిగానే తగిలింది. నిజమే. ఆ రెండు ప్రశ్నలకీ సమాధానాలు ఆలోచిస్తే, జీవితంలో ఆమె కోల్పోయాననుకున్నవాటిలో చాలా విషయాలామెకి అర్థంలేనివిగా తోచాయి. తన సమస్యలకు ఒకరి నుంచి సానుభూతి ఎదురుచూడటమే ఇన్నాళ్ళూ తను చేసిన పెద్ద తప్పు.

కృతజ్ఞతగా చూసింది కిరణ్ వైపు.

మధ్యాహ్నం మూడు గంటల నుంచీ ఎవరెవరికో ఫోన్లు చేస్తూ ఏవేవో వివరాలు వ్రాసుకున్నాడు కిరణ్. ఆ తరువాత కవితని కూడా తీసుకునే చాలా చోట్లకి వెళ్ళాడు. మందులు కొని కావాల్సిన చోట ఇవ్వడం, అనాధలుగా ఆసుపత్రిలో పడున్నవారికి అవసరమైన పనులు చెయ్యడం, అన్నిటికీ తనను కూడా తీసుకెళ్ళి తన సహాయాన్ని తీసుకుంటూనే ఉన్నాడు. సాయత్రం ఆరు గంటలకి అడగకుండానే ఇంటి దగ్గర దింపాడు. లోపలికి రమ్మన్నా, రాకుండా వెళిపోయాడు.

అలా రెండు నెలల్లో ఏ రోజూ కిరణ్ కవితని ఇంట్లో ఉండనివ్వలేదు. రోజూ రకరకాల సేవా కార్యక్రమాలకి తీసుకువెళ్ళేవాడు. ఒక్కోసారి కాన్సర్ ఆసుపత్రులకి, ఒక్కోరోజు ఎక్కడైనా ప్రమాదాలు జరిగి మనుషుల చేయూత అవసరం అయిన చోట్లకి ఇలా చాలా సమస్యలు. కొన్ని చోట్ల భరించలేని యాతన పడుతున్న మనుషులకి చేయూత. ఎన్నో ప్రదేశాలు. ఎన్నో రకాల సమస్యలు. ఇంకా ఎన్నెన్నో తీరాల్సిన, తీర్చాల్సిన అవసరాలు.

సహాయం చేసే చేతులు ఎన్ని కలిసినా చాలనన్ని సమస్యలు.

పెళ్ళయ్యాక తన ముఖంలో మాయమైన వెలుగేదో మళ్ళీ తన ముఖంలో కనిపించడం మొదలుపెట్టాక ఒకరోజు దగ్గరికి పిలిచాడు.

“కవితా, ఇన్ని నెలలు ఒక్క రోజు కూడా విశ్రాంతి ఇవ్వకుండా, కనీసం ఇంత శ్రమ నీవల్ల అవుతుందా అని కూడా అడక్కుండా నిన్ను ఈ కార్యక్రమాలన్నిటికీ తిప్పానని నీకు కోపం ఉండొచ్చు. కారణం లేకుండా ఏ పనీచెయ్యడు ఈ కిరణ్. ఒక్కసారి రాత్రంతా ఇన్ని నెలల్లో నువ్వు గడిపిన జీవితాన్ని గురించి ఆలోచించు. ఏం తెలుసుకున్నావో డైరీలో వ్రాసుకో. ఇక ఎలా బ్రతకాలనుకుంటున్నావో నిర్ణయించుకో.  “

ముడుచుకున్న భృకృటి మెల్లగా విడివడింది కవితకి.

వారి మాటలు వింటూ గుమ్మంలో నిలబడ్డ భవాని తృప్తిగా చూసింది కిరణ్ వైపు.

తను ఆత్మహత్యాయత్నం చేసినప్పటినుంచీ తల్లీ,తండ్రీ తన కోసం మరింత ఎక్కువగా దేవుడిని వేడుకుంటున్నారు. తను మరెప్పుడూ అటువంటి పొరపాటు చెయ్యకూడదని కోరుకుంటున్నారు. ఆ దైవమే కిరణ్ రూపంలో తనకు దగ్గరగా ఉండి బుధ్ధి చెప్పినట్తుగా అనిపించింది కవితకి.

రెండు రోజులు ఆలోచించిన మీదట, కాలేజీలో లెక్చరర్ గా చేరింది. మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యల వైపు మగ్గుతున్న వారికి చేయూతనిచ్చి జీవితం పైన వారికి అవగాహన కల్పించడం కోసం తన వంతు కృషిచెయ్యడం మొదలుపెట్టింది.

ఎగరడానికి తన రెక్కలుంటే చాలని, తన ఆనందానికి తనే కర్త అనీ కవిత తెలుసుకోవడం తృప్తిగా అనిపించింది ఆమె తల్లితండ్రులకి.

                                 

 

 **

“మేడం ఆసుపత్రికి వచ్చేశాం. “

గతంలోంచి ఉలిక్కిపడిండి కవిత.

లోపల కోలుకుంటున్న ఇరవయ్యేళ్ళ విరాజ్ కవిత వంక చూసి సిగ్గుగా తలదించుకున్నాడు.

“విరాజ్. నువ్వు పారేసుకోబోయిన నీ జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకుంటున్నాను. ఇకనుంచీ అది నాది. నువ్వెంత విలువైనదాన్ని పోగొట్టుబోయావో చూపిస్తాను. “ అంటూ స్నేహితురాలివైపు తిరిగి

“విరాజ్ డిస్చార్జ్ అవగానే ముందు నా దగ్గరికి పంపించు రూపా. “ అంది. కవిత గొంతులో గాంభీర్యం ఆజ్ఞగా ధ్వనించి తడికళ్ళతో చిత్రంగా స్నేహితురాలివైపు చూసింది రూప.

మరో రెండు రోజుల తరువాత విరాజ్ ని ఒకచోటికి తీసుకువెళ్ళింది కవిత.

“విరాజ్, ఇక్కడ సేంద్రీయ ఎరువులు తయారుచేస్తారు. నీకు తెలుసు కదా. ప్రస్థుతం సమాజంలో వృధా పదార్థాలు ఎలా పేరుకుపోతున్నాయో. మన ఇళ్ళలో రోజూ వచ్చే కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కల వంటి వ్యర్థ పదార్థాలతో మొక్కలకీ, పంటలకీ ఎంతగానో ఉపయోగపడే సేంద్రీయ ఎరువులు ఇక్కడ తయారు చేస్తారు. దీని వల్ల సమాజానికి కూడా ఎన్నో లాభాలు. ఊర్లో నానాటికీ వ్యర్థపదార్థాలు పేరుకుపోవడం అనూహ్యంగా తగ్గుతుంది. సేంద్రీయ ఎరువుల కొరత తీరుతుంది. చాలా చవగ్గా, కొన్ని చోట్ల ఉచితంగా ఈ ఎరువుల్ని రైతులకు అందిస్తున్నాం. మరింత మెరగైన ఎరువులకోసం, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రకరకాల ప్రయోగాలు కూడా జరుగుతున్నాయ్. ఎటువంటి లాభాపేక్షా లేకుండా ఎంతో మంది ఇక్కడ స్వఛ్చందంగా పని చేస్తున్నారు. “

వివరంగా చెబుతూ లోపల ఇందుకు ఉపయోగించే పరికరాలు, తయారుచేసే పధ్ధతి అంతా వివరంగా చెప్పింది కవిత.

అంతా అయ్యాక విరాజ్ ని ఒక వీశాలమైన గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ రెండు రంగుల్లో ఉన్న పెద్ద పెద్ద ప్లాస్టిక్ బుట్టలు చూపిస్తూ “ఇవేంటో తెలుసా. మన ఇంట్లో తడి చెత్త అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కూరగాయల వ్యర్థాలు, అహార పదార్థాల వంటివి ఒకదాంట్లో, పొడి చెత్త అంటే కాగితాలు, ఇతర గట్టి వస్తువులు మరొకదాంట్లో ఇలా విడి విడిగా వెయ్యడానికి. “

విరాజ్ అర్థమైనట్టు చూశాడు కవిత వైపు.

“విరాజ్. ఎన్నో సంవత్సరాలుగా ఇలా ఇంట్లో వ్యర్ధపదార్ధాలని విడి విడిగా వెయ్యమని మన ప్రభుత్వమే చెబుతున్నా కూడా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. అందరం ఇలా విడి విడిగా వెయ్యడం అలవాటు చేసుకోగలిగితే, వాటితోనే మొక్కలకీ, పంటలకీ అత్యవసరమైన సేంద్రీయ యెరువులు ఎంత పెద్ద మోతాదులో తయారు చేసుకోవచ్చో ఒకసారి ఊహించు. “

“నిజమే ఆంటీ. ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ ఎరువులు తయారుచేస్తున్నారు?“ సంభ్రమంగా కవిత వైపు చూస్తూ అన్నాడు విరాజ్.

“దీన్నే పెద్ద ఎత్తు అన్నావంటే, ఇక ఈ ఊళ్ళో అందరి చెత్తా ఇలా విడిగా వేయించి తీసుకురాగలిగితే ఎంత ఎక్కువగా సేంద్రీయ ఎరువుల్ని తయారుచేయవచ్చో ఊహించు విరాజ్. ఇక నుంచీ నీ పనేవిటో తెలుసా. కాలేజీ లేనప్పుడూ, సెలవు రోజుల్లోనూ, చదవాల్సినవి అయిపోగానే దగ్గర్లో ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్సుల్లో వీటి గురించి పరిచయం చేసి, వాళ్ళంతా చెత్తని ఎప్పటికెప్పుడు ఇలా విడి విడిగా వేసే అలవాటు చేసుకునేలా వాళ్ళని ప్రేరేపించడం. అంతే కాదు, ఎప్పటికప్పుడు ఇవన్నీ సమీక్షించడం. అర్థమయిందా? “

ప్రేమ దక్కలేదన్న బాధలో ఆత్మహత్యకు పాల్పడినందుకు ఎన్ని గంటలు బ్రెయిన్ వాష్ చెయ్యడానికి పిలిచిందో అని భయపడుతూ కవిత దగ్గరికి వచ్చిన విరాజ్ అలోచిస్తూనే చూశాడు కవిత వైపు. సేద్యం, మొక్కల పెంపకం ఇవన్నీ తనకు చిన్నప్పటినుంచీ చాలా ఇష్టమైన విషయాలు. అంతర్జాలంలో రకరకాల విషయాలు నేర్చుకుని తను ఇంట్లోనే పెద్ద పెద్ద కుండిల్లో కూరగాయలు పెంచడం, తల్లికిష్టమైన పూల మొక్కలు పెంచడం ఎంత శ్రధ్ధగా చేసేవాడో కవిత ఆంటీకి బాగా తెలుసు. తనంటే ఏ మాత్రం ప్రేమ లేని అమ్మాయి వెనుక తిరిగి, కొన్ని సంవత్సరాలుగా తన ఇష్టాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు కూడా తను మనోవ్యాకులతతో ఏ విషయం మీదా ఆసక్తి లేకుండా ఉన్నా, ఇప్పుడు కవిత ఆంటీ చెప్పిన పని నిరాకరించలేకపోతున్నాడు.

“నువ్వు రేపటినుంచే మాకు ఈ విషయంలో నీకు వీలైనంత సహాయం చేస్తున్నావు విరాజ్. కాదనడానికి వీల్లేదు. “ నవ్వుతూనే ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది కవిత.

“తప్పకుండా వస్తాను ఆంటీ. ఈ బుట్టలు రెండు పట్టుకువెళతాను. ఇవాళే ముందు మా అపార్ట్మెంటులోనే వీటి గురించి అందరికీ వివరిస్తాను. “ అంటూ వాటిల్లోంచి చెరో రంగు ప్లాస్టిక్ బుట్టనీ తీసుకుని ఆటో వైపు వెళుతున్న విరాజ్ వంక చూసింది కవిత.

ఆ తరువాత కూడా ఆమె విరాజ్ ని అతనికి తెలీకుండా గమనిస్తూనే ఉంది. ఎటువంటి ప్రోద్బలమూ లేకుండానే, విరాజ్ ఈ విషయంలో చాలా ముందడుగు వేస్తున్నాడు. తీరిక సమయాల్లో ఒక్కొక్క అపార్టుమెంటుకీ వెళ్ళి అక్కడివారికి ఇంట్లో వచ్చే వ్యర్థపదార్థాలని ఇలా విడదీసి వెయ్యడం ఎంత ఉపయోగమో వివరిస్తూ అక్కడి వారిలో కూడా కొంత మందిని తనకు సహాయం చేసేలా వాళ్ళని ప్రోత్సహించడం, ఆ అపార్ట్మెంటుల్లో తను చెప్పినట్టు చెత్త విడదీసి వేస్తున్నారా లేదా చూసే బాధ్యతని వారికి అప్పగించడమే కాకుండా, ఎప్పటికప్పుడు ఆ పనులని సమీక్షించడం ఇలా విరాజ్ చేస్తున్న ప్రతి పనీ ఆమె తెలుసుకుంటూనే ఉంది.

అంతే కాదు. సేంద్రీయ ఎరువుల తయారీ గురించి చాలా నేర్చుకున్నాడు విరాజ్. అంతర్జాలంలో కూడా దీనికి సంబంధించిన వివరాలు చూసి, ఎన్నో ప్రయోగాలకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. అలా తయారు చేస్తున్న ఎరువులని గ్రామాల్లోనూ, పల్లెల్లోనూ రైతులకి అందించడం కూడా స్వయంగా చేస్తున్నాడు.

అన్నిటినీ మించి తనలాగే విఫల ప్రేమ వలయంలోంచి బయటికి రాలేకపోతున్న స్నేహితులో, చదువులో వెనుకబడ్డామని నిరాశలో మునిగిపోయిన వాళ్ళో ఉంటే, వారిని వెన్ను తట్టి ప్రోత్సహించి తన వెనుకే ఈ గ్రామాలకి వచ్చి రైతులకి కొత్త కొత్త వ్యవసాయ మెళకువలు నేర్పించే బాధ్యతని అప్పగిస్తున్నాడు. జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి వేలకొద్దీ దారులున్నాయని నిరూపించి చూపిస్తున్నాడు.

ఎదుటి మనిషి మనసు పొరల్లోకి, లోతుల్లోకి చూసి అక్కడున్న విత్తనాన్ని కనిపెట్టడం దాదాపు యాభై సంవత్సరాల కిరణ్  స్నేహంలో బాగానే నేర్చుకుంది కవిత. తను నేర్చుకోవడమే కాక చాలా మందికి నేర్పిస్తోంది.

“గర్భగుడి ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది కవితా. దీపం వెలిగిస్తేనే దైవం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. వివేకమనే దీపాన్ని వెలిగించి మనిషిలోపలే ఉండే ఆ దైవాన్ని గుర్తించగలిగితే, ఆ శక్తి మరిన్ని దీపాల్ని వెలిగించి చీకటిని తరిమేయగలదు.“

రైతులతో మాట్లాడుతున్న విరాజ్ నే చూస్తూ కిరణ్ ఎప్పుడూ చెప్పే మాటల్ని మరోసారి మననం చేసుకుంది కవిత.

OOO

bottom of page