
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
కథా మధురాలు
నో రిటైర్మెంట్ ప్లీజ్...
జయంతి ప్రకాశ శర్మ
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ
"చదువుకున్నావుగా..ఎదైనా ఉద్యోగం చేస్తే మంచిది తల్లీ! అంటూ మా నాన్న ఎప్పుడూ అనేవారు.” ఉదయాన్నే వంటింట్లోంచి మాటలు గట్టిగా వినబడుతుంటే, రాఘవయ్య పేపర్లో బుర్ర పెట్టి, చెవులు ఆ మాటలమీదకు వదిలేసాడు.
“మా అమ్మమాత్రం ఊరుకునేది కాదు. ‘మీరు అలా దాని వెనకపడతారనే.. ఆ ఎలిమెంటరీ చదువు చాలని మొత్తుకున్నాను. ఆ చదువైన తరవాత ఉద్యోగం అంటారు. తనకంటే పెద్ద ఉద్యోగం చేస్తున్న మొగుడు కావాలంటారు! తర్వాత ఇద్దరు సంపాదనలో పడిపోతారు. ఇక జీవితం పులిస్వారి అయిపోతుంది! అసలు కష్టాలు అప్పుడే మొదలవుతాయి!! పిల్లలు పుట్టిన తర్వాత ఆలన, పాలనా సమస్య అయిపోతుంది. పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య ఉండవలసిన బంధం దూరమవుతుంది. మీకు అర్ధం అయే భాషలో చెప్పలంటే, మొగుడు పెళ్ళాలిద్దరు ఉద్యోగాలంటూ ఊర్లేగితే, కొంప కోల్లేరవుతుంది!' అంటూ అడ్డుపడేది. అయితే అప్పుడు అంతలా అలోచించే వయసు నాకు లేదు. అలోచించే వయసొచ్చేసరికి పెళ్ళైయిపోయింది." ఆ రోజు భార్య జానకమ్మ స్వగతాలు రాఘవయ్యకి కొత్తగా వినిపించాయి.
రాఘవయ్య రిటైరై నేలరోజులయింది. ఆ ఊర్లోనే కోనేరుగట్టు మీద తాతలనాటి ఇంట్లోనే స్ధిరపడిపోయాడు. పెంకుటిల్లు డాబా ఇల్లుగా రూపంతరం చెందింది. ఉదయం ఆరు గంటల్నుంచి కోనేరు చుట్టూ ఓ గంట నడక, ఆ తర్వాత ఇంటికొచ్చి, కాఫీ తాగుతూ రెండు దినపత్రికలను తిరగవేయటం, ఆ తర్వాత కాలకృత్యాలు ముగించుకుని, ఇంట్లోకి కావల్సిన కూర నార తీసుకురావటం వరకు ఉన్న దినచర్యలో మార్పులేదు. వచ్చిన చిక్కల్లా ఉదయం పది గంటల్నుంచి సాయంత్రం వరకు సమయం గడవటం ఇబ్బందిగా ఉంది.
అంతకీ టివిలో వంటలు, వార్పులు, కన్నీళ్ళు తెప్పించుకోగలిగే సీరియల్లు.. మొదలైనవాటికి అలవాటు పడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మళ్ళీ ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు, ఉత్సాహం లేదు. ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు పేరంటాలు అయిపోయాయి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వేరే ఊర్లల్లో ఉంటున్నారు. తనకి గాని వాళ్ళకి గాని ఆర్దిక ఇబ్బందులు లేవు. అంచేత రిటైర్మెంటు జీవితాన్ని పూర్తిగా చీకు, చింత, తాపత్రయం లేకుండా గడపాలనే రాఘవయ్య నిశ్చయించుకున్నాడు.
పోనీ తన రిటైర్మెంట్ తర్వాత, జానకమ్మ దినచర్యలో మార్పు వచ్చిందా.. అంటే అదీ లేదు. ఉదయం పూజ, పునస్కారాలు అయిన తర్వాత వంట చేస్తుంది. మద్యాహ్నం భోజనాల తర్వాత కాస్సేపు నడుం వాల్చి ఓ అరగంట కునుకు తీస్తుంది. నిద్ర లేచిన తర్వాత సాయంత్రం పనులకు సన్నాహాలు చేయటంలో మునిగిపొతుంది.
పెళ్ళైనప్పట్నుంచి జానకమ్మకి ఇంటి పనులు చేస్తూ, భర్త ఇంట్లో ఉంటే, అతనితో ఏదో విషయాలు మాట్లాడటం అలవాటు. రాఘవయ్య కూడా ఇంట్లో ఉండే సమయంలో జానకమ్మ స్వగతాలు పాక్షికంగా వినడం అలవాటు చేసుకున్నాడు. లోకాభిరామాయణం మొదలు, రాజకీయాలు, టివి సీరియల్స్ వరకు జానకమ్మ చెప్పుకుపోతుంది. ఆ స్వగతాలపై ఓ చెవి పడేసినా, చాలా విషయాలని రాఘవయ్య పట్టించుకోడు. ఓహో, ఆహా అంటూ వింటున్నట్లు నటిస్తాడు. కోంచెం ముఖ్యమైన విషయం అయితే మాత్రం, కొద్దిగా ఆలోచిస్తాడు. విషయం బట్టి జానకమ్మ మాటల బాణాలు తగలకుండా ముందే జాగ్రత్త పడతాడు. అలాంటిది ఈ రోజు జానకమ్మ ఉపోద్ఘాతం వినేసరికి, ఆ విషయం తీరాన్ని ఎక్కడ దాటుతుందో, ఎంత బీభత్సం సృష్టిస్తుందో అన్న భయంతో కొంచెం ముందు జాగ్రత్తగా ఆలోచనలో పడ్డాడు.
" అదేమిటి! ఈ విషయం ఏప్పడూ చెప్పలేదే?" చదువుతున్న పేపరు పక్కకు పెట్టి అన్నాడు.
"పెళ్ళైన తర్వాత ఆడదానికి కోరికలు ఙ్ఞాపకం ఉంటాయా, ఉంటే అవి నెరవేరుతాయా? అయినా అప్పుడు కౌరవుల కొంపలా, మన ఇంటినిండా జనం, వారికి వండి వడ్డించేసరికి నడ్డి జారిపోయేది. ఇంకేం చేస్తానూ.. నోరు మూసుకుని పడున్నాను! ఆ జనాభాకి పెళ్ళిళ్ళు, పేరంటాలు అయేసరికి, మన పిల్లలు తయారైపోయారు! ఇక వాళ్ళ ఆలన పాలనతో జీవితం సగం పైగా అయిపోయింది. ఇంక ఆ కోరిక ఎక్కడేడుస్తుంది.. నామొహం!" జానకమ్మ టిఫిన్ ప్లేటు అందిస్తూ అంది.
అసలు విషయం రాకుండా గాల్లో కత్తిసాము చేయటం జానకమ్మకి అలవాటు. రాఘవయ్య ఆవిషయం తెలుసు కాబట్టే, ఆ మాటలని గాజుసామానులా చూసుకుంటూ, విషయాలను రాబట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు.
"భలేదానివే! శమంతకమణిని అడిగేదానివా, బంగారులేడిని వేటాడమనేదానివా!! కష్టం అయినా సరే అవికూడా ఆఖరికి ఆ భర్తగాళ్ళు తెచ్చి ఇచ్చారు. నేను ఆ కోవకి చెందిన భర్తగాడ్నేకదా!" రాఘవయ్య నవ్వుతూ అన్నాడు.
"కాని, నేను ఆ కోవకి చెందిన భార్యమణిని కాదులెండి. కోరికలంటూ, ఆ ఇద్దరు కొరివితో తల గోకున్నారుగా. బుద్దుండి మళ్ళీ అలాంటి కోరికలు ఎవరైనా కోరుకుంటారా? అయినా ఇప్పటి ఆడవాళ్ళు విషయాలని కడుపులో దాచుకోలేరుగాని, కోరికల్ని జీవితాంతం దాచుకుంటారు."
జానకమ్మ ఏ విషయం అంత సులువుగా ఎవరి దగ్గర బయటపెట్టదు. కొన్ని ఎదుటివాళ్ళు గ్రహించి, తదనుగుణంగా ప్రవర్తిస్తారు. కొన్ని అలా గర్భంలో ఉండి, కాలగర్బంలో కలసిపోతాయి. రాఘవయ్యకి అలాంటి విషయాలు బయటకు ఎలా రప్పించాలో బాగా తెలుసు. అంతకీ ఆ మాట ఈ మాట మాట్లాడి ప్రయత్నం చేసాడు అయినా సరే ఫలితం దక్కలేదు. ఇంక ముసుగులో గుద్దులాట ఎందుకని సూటిగా అడిగిసాడు.
"సర్లే! ఇప్పుడా కోరిక ఉండకపోవచ్చుగాని, అసలు అదేమిటో నాకైనా చెప్పి ఉండవలసింది. నేను తీర్చేవాడినికదా!"
ఏ మూడ్ లో ఉందో జానకమ్మ అసలు విషయం సూటిగా చెప్పిసింది.
"ఉద్యోగం చేయాలని ఉండేది. నేను చదివిన పియుసి చదువుకి ఆ రోజుల్లో మంచి ఉద్యోగమే వచ్చేదికూడా! "
"ఓస్! అంతేనా!! ఇంకా వడ్డాణం వడ్డిస్తావేమోనని హడలి చచ్చాను" రాఘవయ్య అన్నాడు.
జానకమ్మ ఏం మాట్లాడకపోయేసరికి, తిరిగి తానే అన్నాడు. " అయినా ఇప్పుడు నువ్వు చేసే ఇల్లాలి ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం ఏం ఉంటుంది చెప్పు! "
ఆ మాటలకి జానకమ్మ గుర్రుగా చూసింది.
"మీ మగాళ్ళకి వంటిల్లు అంటే వెటకారంగానే ఉంటుంది. ఓ పూట వంట చేస్తే తెలుస్తుంది. ఈ ఉద్యోగం రెండు జడలు వేసుకునే వయసు నుంచి ప్రారంభిస్తారు. తిరిగి తలకి కొరివి పెట్టే ముందు రోజు వరకు ఈ ఉద్యోగం తప్పదు." అంటూ జానకమ్మ రాఘవయ్య చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ అందుకుంది.
"ఆడవాళ్కు ఏ ఉద్యోగం చేసినసరే, వంటింటి ఉద్యోగానికి మాత్రం రిటైర్మెంటు ఉండదులెండి." జానకమ్మ వంటింటి వైపు దారి తీస్తూ స్వగతంలో గట్టిగానే అంది.
రాఘవయ్యకి అసలు విషయం అప్పుడు అర్ధం అయింది. మెల్లగా మళ్లీ పేపర్లో తల దూర్చాడు. అక్షరాలు కనబడుతున్నాయి గాని, విషయం తలలోకి వెళ్ళటంలేదు. జానకమ్మ మాటలే మెదడులో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ మాటలు నిజమే అనిపించాయి! ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి అఫీసు పని, ఇంటిపని రెండు తప్పవు. ఉద్యోగానికి రిటైర్మెంటు ఉంటుంది. కాని ఇంటిపనికి రిటైర్మెంటు ఉండదు. అలా ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వంటవాడిని, పనివాళ్ళని పెట్టుకుందామా అంటే, "టాఠ్ వీల్లేదు . వాళ్ళని పెట్టుకుని వాళ్ళవెంట తిరగాలి! అన్ని అందించాలి! అమ్మా, బాబు అంటూ మంచిగా మాట్లాడాలి! వాళ్ళ అడుగులకు మడుగులొత్తాలి! ఈ అరవచాకిరి బదులు మన పని మనం చేసుకుంటే హాయిగా ఉంటుంది!" అంటూ ఠపిమని భార్యలవైపు నుండి జవాబు వచ్చేస్తుంది.
రాఘవయ్య అలోచనల్లో పడ్డాడు. వంటింటి ఉద్యోగాలకు రిటైర్మెంటు ఉండటం లేదు. తరతరాలుగా ఈ విషయంలో ఎప్పుడు మార్పు రావటం లేదు! అసలు ఎవరు ఎప్పుడు ఆలోచించించినట్టు లేదు. కనీసం ఇప్పుడైనా మార్పు వస్తే బావుంటుంది. వాళ్ళ ఇంటిచాకిరి ఉద్యోగానికి రిటైర్మెంటు ఉండాలి. తను స్త్రీ జాతినంతటిని ఉద్దరించలేడుగాని, కనీసం ఈ విషయంలో ఏదైనా చెయ్యాలి. అందులో జానకికి అనుమానం రాకుండా ఇంటి పనులలో సహయం చెయ్యాలి. తానొప్పక, నొప్పించక, తప్పించుకోకుండా ... అడుగు ముందుకు వెయ్యాలి.
ఆ విషయం మీదే రాఘవయ్య వారం రోజులు అలోచించాడు. వచ్చిన అలోచనలన్ని మెల్ల మెల్లగా అమలు చేయడానికి నిశ్చయించుకున్నాడు.
మర్నాడు నుంచే రాఘవయ్య తన దినచర్య మార్చుకున్నాడు. తెల్లవారు ఝామున భార్య కంటే ఓ పావుగంట ముందులేచి, కాఫీ కలిపి రడీ చెసాడు.
'అదేవిటి మీరు కలిపారు?" అంటూ జానకమ్మ ఆశ్చర్యపోయింది.
"ఇవాళ్నుంచి కాఫీ తాగి వాకింగ్ వెళ్దామని అనుకున్నాను. ఈపాటి కాఫీ కలపడానికి నిన్ను ఎందుకు నిద్రలేపడమని, నేనే కలిపాను. రుచిచూసి బావుందో, లేదో చెప్పు.ఇదేం బ్రహ్మవిద్యా కాదుకదా!" రాఘవయ్య నవ్వుతూ అన్నాడు.
మరో వారం పోయిన తర్వాత రాఘవయ్య చేపకింద నీరులా మెల్లగా వంటింట్లోకి అడుగుపెట్టాడు.
"నాకు ఏం తోచటం లేదోయ్! ఏది.. ఆ వంకాయలు ఇలా పడయ్.. తరుగుతాను" అంటూ మొదలైనా రాఘవయ్య ప్రస్ధానం రెండు నేలలు తిరిగేసరికి వంటింటి పనులలో అనుభవం వచ్చేసింది. మెల్లమెల్లగా జానకమ్మ ఇంటిపనుల్లో సాయం చేయటమే కాకుండా స్వతంత్రంగా చేయగలిగే స్ధాయికి ఎదిగాడు.
"రేపట్నుంచి నీకు నాలుగు రోజులు శెలవులోయ్! హాయిగా కాలుమీద కాలు వేసుకుని కూర్చో!" అంటూ రాఘవయ్య ఓ రోజు ఉదయన్నే ప్రకటించాడు.
జానకమ్మ ఏదోలా చూసింది.
"నిజమేనోయ్! ఈ మధ్య ఇంటిపనుల్లో నీ దగ్గర తర్ఫీదు పోందానుకదా. ఇప్పుడు నేను నిష్ణాతుడ్ని అయ్యాను. అంచేత అప్పుడప్పుడు నీకు శెలవులిచ్చి, ఇంటిపనులు నేను చెస్తాను! నేను ఇంటిపనులు పూర్తిగా చేయగలననే నమ్మకం వచ్చినప్పుడు నీకు రిటైర్మెంటు ఇచ్చేస్తాను " అంటూ రాఘవయ్య తన ప్రణాళికని ప్రకటించాడు.
జానకమ్మ ఈసారి చిరాగ్గా చూసింది.
ఆ చూపుల్ని పట్టించుకోకుండా రాఘవయ్య మర్నాడు ఉదయన్నే వంటింట్లో దూరాడు. ఉదయం కాఫీ నుంచి రాత్రి భోజనాల వరకు ఇంటిపనుల్ని చక్కపెట్టిసాడు. తనకి కాలక్షేపమేకాదు, జానకమ్మని సుఖపెడుతున్నాననే ఆనందంలో మునిగిపోయాడు. రెండు రోజులు గడిచిపోయాయి.
ఆరోజు వంటింట్లో గిన్నెల చప్పుడుకి రాఘవయ్యకి తెలివొచ్చి, గబగబా లేచి వెళ్ళేడు.
"మొహం కడుక్కుని రండి. కాఫీ తాగి వాకింగుకు వెళుదురుగాని" అంది జానకమ్మ, అప్పుటికే స్నానం చేసి.. తలకి తువ్వలు కట్టుకుని, కాఫీ కలుపుతూ అంది.
"అదేమిటి? నేనున్నాగా! అయినా నీకింకా రెండు రోజులు శెలవులున్నాయి!" రాఘవయ్య ఆశ్చర్యపోతూ అన్నాడు.
జానకమ్మ పెదవులపై పలుకుతున్న సుప్రభాతం ఒక్కసారి ఆగింది.
"ఏవరి పనులు వాళ్లు చేసుకోవాలంటూ మా అమ్మమ్మ చెపుతూ ఉండేది. గాడిద పని గాడిద, కుక్కపని కుక్క చేసుకోవాలంటూ ఓ కథ కూడా చెప్పేది! చెప్పొద్దూ.. ఈ రెండ్రోజులూ కాళ్లు, చేతులు కట్టిపడేసినట్టుంది. ఏదో అనుకుంటాంగానీ, ఏ పనిలేకుండా కూర్చోడం కూడా చాల కష్టమండి. ఓ మాట చెప్పనా! మా ఆడవాళ్ళకి ఇంటిపనులే ఆక్సిజన్ లా పనిచేస్తాయి.పిల్లలు దూరంగా ఉన్నా అలవాటైపోతున్నాదిగాని, ఇంటిపనులకు దూరంగా ఉండడం మా వల్లకాదండి! ఈ పనే మాకు దైవం!"
భార్య మాటలకు రాఘవయ్యకి నోటంట మాట రాలేదు. జానకమ్మే తిరిగి అంది.
"ఇదిగో మిమ్మల్నే.. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. మాకేం రిటైర్మెంటులు అక్కర్లేదు! అర్ధమయిందా?"
రాఘవయ్య అర్ధమయినట్టు తల ఊపాడు.
***
జయంతి ప్రకాశ శర్మ
(రచయిత మాటల్లో...)ఈ మధ్య షష్టిపూర్తి అవడంవల్ల స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఉద్యోగం విరమణ చేయమన్నారు. పదిహేను సంవత్సరాల క్రిందట మూసేసిన కలం మళ్ళీ తీసి, ఏభై సంవత్సరాల వెనక ఙ్ఞాపకాలను వెలికితీస్తున్నాను. మంచి అనుభావాలను ఇచ్చిన బాల్యం విజయనగరం జీవితాన్నిచ్చింది, ఇప్పుడు జీవనం కొనసాగిస్తున్నది విశాఖపట్నం. మొదటి పేరాను చదవగానే మిగతాది చదవాలనిపించే అన్ని రాతలను చదువుతాను. రెండువేల సంవత్సరం ముందు రాసిన కథల సంపుటి "ఎడారి పరుగు" ఈ మధ్యనే విడుదలయింది. నా రెండవ ఇన్నింగ్స్ కథల ప్రారంభం ఓ విధంగా "గారడీ" కథతోనే.
