top of page

కథా​ మధురాలు

నవరాత్రి- 4

 

గిరిజా హరి కరణం

girija hari.PNG

 

నవరాత్రి పూజలలో చతుర్దశి. “కూష్మాండ” రూపంగా దేవినర్చించి కలెక్టరు దంపతులవద్ద సెలవు తీసుకుని బయలుదేరారు శాస్త్రిగారు. ఆరోజు కూడా యథాప్రకారం రాత్రి అరుగు మీద సమావేశమయ్యారు శాస్త్రిగారి కుటుంబంతో బాటు అందరూ.

ఈ రోజు మీకు ఒక పురాతన సంస్కృతి కలిగిన అరుదైన మనుషుల గురించి, మన సంఘంలో పాతుకుపోయిన కుళ్ళు గురించీ నాకు తెలిసిన కొన్నిసంఘటనలను వివరిస్తాను వినండి. అంటూమొదలెట్టారు.

 

కొడుకును వెంటబెట్టుకుని గుడికొచ్చింది సరస్వతి. తీర్ధ ప్రసాదాలయ్యాక,”నీ భర్తజాడేమైనా తెలిసిందామ్మా” అని అడిగాను. “అయ్యగారూ, రోజూ ఆఫీసరుగారింటికి తిరుగుతూనే వున్నాను, ఆయన విసుక్కుంటూ- 'నీవిలా రోజూ మావెంటబడితే ఎలా, ఏదో ఆఫీసు పని మీద పంపినాము. అతనెటువెళ్ళాడో ఏమో, పొలీస్ కంప్లైంట్ యిచ్చాము యింకేమి చెయ్యగలం?  యిదిగో శివస్వామి ఏదో చెప్తున్నాడు విను” అన్నారు.

 

శివస్వామి గారు –‘పూజచేసి అంజనం వేస్తాను, యెక్కడున్నా కనిపిస్తాడు. వచ్చేస్తాడు, వెయ్యి రూపాయలవుతుంది తీసుకుని మాయింటికి రా"’అన్నారు.

 

తాళిబొట్టు అమ్మితే మూడువందలిస్తానన్నాడు లింగంసెట్టి, మిగతాది ఎక్కడినుండి తేగలను. మీయింటికెళ్ళానయ్యా అమ్మగారు అయిదువందలుంది యిస్తాను అన్నారు"అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. 

"తల్లీ! నీవేమీ దిగులుపడకు యీ అంజనాలూ క్షుద్ర పూజలూనమ్మకమ్మా, ఆ తల్లిని నమ్ముకో సరస్వతమ్మా, నరనరంలోనూ ప్రతీ రక్తపు బొట్టులోనూ అమ్మను నిలుపుకో! ఆత్మసమర్పణ చేసుకో! పూర్తి శరణాగతితో ధ్యానించు. బిడ్డను జాగ్రత్తగా చూసుకో. నీ భర్త తప్పక తిరిగి వస్తాడు, ఈ భ్రమరాంబికా దేవిని కళ్ళారా చూసి మనసులో నిలుపుకో"

అని చెప్పి తల్లి పాదాల వద్దనుండి యింత కుంకుమ తెచ్చియిచ్చాను.

 

"అంజనం వద్దంటారా అయ్యా" అడిగిందామె . "శివస్వామి నీకోసం వేసే అంజనాలకంటే నీ ప్రార్ధనే  తల్లికి ముందు చేరుతుందమ్మా. పిచ్చి నమ్మకాలు పెట్టుకోకు" అని ధైర్యం చెప్పి పంపాను.

సరస్వతమ్మ వాళ్ళు మా వీధిలోనే వుంటారు, మంచివాళ్ళు. మా పిల్లలందరూ పెళ్ళిళ్ళయి వెళ్ళాక నా భార్య రాజేశ్వరికి చేదోడు వాదోడుగా వుంటుంది. భర్త కనబడకపోయి, బాధలోవుందని బిడ్డలాగే చూసుకుంటున్నది నాభార్య.

 

కోటి దేవస్థానం ఆఫీసులో అటెండరు, అతనికి ఆఫీసులో కంటే ఆఫీసరింట్లోనే పనెక్కువ,తెల్లవారక ముందే వెళ్ళి రాత్రి వరకూ వాళ్ళింట్లోనే వుంటాడు.

 

ఆఫీసరు భార్య చేత శివశాస్త్రి ఏదో పూజ చేయిస్తున్నాడు యిరవై వొక్క రోజులు, అందుకని రోజూ రాత్రిళ్ళు మూడుగంటలకు లేచి అడవికివెళ్ళి యేవేవో ఆకులూ పువ్వులూ వేర్లూ, తెమ్మనేవారు కోటిని.

 

తెల్లవారకముందే పూజ మొదలుపెట్టాలి. ఒకనాడు అడవికి వెళ్ళిన కోటి తిరిగి రాలేదు. రెండునెలలు అయింది.

 

సరస్వతి భర్త కోసం వెదకని చోటు లేదు, చేయని ప్రయత్నం లేదు.

నేను వద్దని చెప్పినాక అంజనం గురించి మానేసింది. అది తెలిసి శివశాస్త్రి భయపెడుతూ ఆమెకేవేవో చెప్పాడట. ఓ అర్ధరాత్రి సరస్వతి యింటికి వచ్చి తలుపుకొట్టి, నిన్నుఆఫీసరు రమ్మంటున్నాడు. నీ భర్త గురించి ఏదో తెలిసిందట అని పిలిచాడట శివశాస్త్రి. "నేను  తరవాతవస్తాను మీరు వెళ్ళండి" అని చెప్పి అతన్ని పంపేసి, ఆమె మా యింటి కి పరిగెత్తుకొచ్చి చెప్పింది, నేను మా నాయనను తోడుగా పంపగా ఆఫీసులో శివశాస్త్రితో బాటున్న ఆఫీసరు మా నాయనను 'లోపలికి రావద్దు ఆమెను లోనికి పంపు' అన్నాడట.

 

సరస్వతికి ఆఫీసరు ఉద్దేశ్యం అర్థమై వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే ‘రేపు నీవొక్కదానివే రా, అన్నాడట.

ఆమె యిక వాళ్ళ మాటలునమ్మడం మానేసింది. ఎక్కువగా మా యింట్లోనే వుంటున్నది.  యింకో నెల గడిచింది, ఆ రోజు పొద్దుటే కోటినీ పిల్లవాణ్ణీ వెంట బెట్టుకుని గుడి కొచ్చింది సరస్వతి.

 

రాగానే అమ్మవారిముందు సాష్టాంగ పడినారు ముగ్గురూ, హారతీ తీర్ధప్రసాదాలూ యిచ్చి ఆ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను, "మీరు చెప్పినట్లే వచ్చేసాడయ్యా" అంది ఆనందంగా.

 

సాయంత్రం యింటివద్ద కలుద్దాము. చల్లగా వుండండి అంటూ ఆశీర్వదించి పంపాను.

 

రాత్రి భోజనాలయ్యాక బయట వసారాలో తాంబూలం వేసుకుంటూ కూర్చున్నాం. నాయనా నేనూ! సరస్వతీ కోటీ  వచ్చారు. వాళ్ళు

కూర్చోవటానికి ఓ చాప వేసి పిల్లవాడి చేతిలో తినడానికేదో పెట్టింది అన్నపూర్ణ. నాయన పాదాలకు నమస్కారం చేసి కూర్చున్నారిద్దరూ.

ఆశీర్వదించి, "చెప్పు కోటీ  యేమి జరిగింది?" అన్నారు మా నాయన. కోటి చెప్పడం మొదలు పెట్టాడు.

            

ఆరోజు మా ఆఫీసరు భార్య, పూజకు తెల్ల జిల్లేడు ఆకులూ ఆ చెట్టు వేరూ అడవి కెళ్ళి తీసుకురమ్మన్నారు. బాగా ముదిరిన తెల్ల జిల్లేడు చెట్టు వేరు మొదట్లో వినాయకుడు ఆకారంలో వుంటుంది, ఎలాగైనా సరే అలాటి వేరు ఆకారం చెడకుండా తవ్వి తీసుకు రావాలి. స్నానం చేసి వుపవాసంతో వెళ్ళు. తెల్లవారకముందే నీవు వేరు తీసుకొస్తే పూజమొదలెట్టాలి. అనిచెప్పారు. ఆమె చెప్పినట్లే మూడు గంటలకే లేచి అడవికెళ్ళాను. తెల్లజిల్లేడు చెట్లున్నాయి  గానీ తవ్వినాక వినాయకుడి ఆకారం కనబడలేదు, మధ్యాహ్నం దాకా వెదికితే ఒక పెద్ద చెట్టు దొరికింది. తవ్వడం మొదలు పెట్టాను. ఎండ మిక్కుటంగా వుంది, పూజవేళ మించిపోయింది. వేరు తీసుకెళ్ళకుంటే సారు బతకనియ్యడీరోజు. తవ్వుతుండగా శోష వచ్చినట్టైంది. యింకేమీ తెలియలేదు. మెలకువొచ్చేసరికి మసకగా వుంది, చలిగా వుంది, ఎవరో నా ముఖం లోకి వంగి చూస్తున్నారు. మెల్లిగా లేచి కూర్చున్నాను. ఒక ముసలతను, మొలకొక గుడ్డ మెడనిండా పూసల దండలు. తల చిర్రగా వుంది. “సోయి వొచ్చినాదా బిడ్డా” అంటూ చెయ్యి పట్టి చూసి, "కాక తగ్గింది యిప్పుడే వొస్తానుండు లెయ్యొద్దు" అంటూ గుడిశలో నుంచి బయటికెళ్ళాడు. కాసేపటికి తిరిగొచ్చాడు.

 

అతని వెనకే వొకామె మట్టికుండలో ఏదో తెచ్చి చిన్నముంతలోకి వొంచి "తాగు బిడ్డా సత్తవొస్తాది" అంటూ యిచ్చింది. గంజి తాగి లేవబోయాను, నిలబడలేక కూలబడిపోయాను. డాక్టరు చెప్పింది నిజమైంది, దాదాపు రెండేళ్ళుగా విపరీతమైన కాళ్ళనొప్పులు. డాక్టరు ఆపరేషను చేయాలి. లేకపోతే కొంతకాలానికి కాళ్ళు చచ్చు పడిపోతాయని చెప్పాడు. నేనీ విషయం సరస్వతికి చెప్పలేదు మా నాన్న మంచంలో వున్నాడు, చెల్లి తమ్ముడు చిన్నవాళ్ళు.

యిద్దరక్కలకూ పెళ్ళిళ్ళై వెళ్ళినారు. ప్రతీనెలా అమ్మకు డబ్బు పంపుతాము. నా భార్య నేనూ కష్టపడితే కూడా గడవటంలేదు.ఆపరేషనంటే మాటలా.

 

      శాస్త్రిగారు చెప్పడం ఆపి "అలసటగా ఉందిరా రామయ్యా, మిగిలింది రేపు చెప్తా" అంటూ లేచారు మల్లప్ప శాస్త్రి.

       

*****

bottom of page