top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

తెలుగు పరిశోధనలో నాటక ప్రక్రియలు

dasari_edited.jpg

ఎస్. ఎమ్. ఎస్. రావు దాసరి 

సాహిత్య సృష్టి కి ఆఖరి మెట్టు నాటక రచన అని అన్నారు పండితులు.

 

కాలాన్ని కదిలించేది కూడా నాటకమే! " నాటకాంతం హి సాహిత్యమ్', 'కావ్యేషు నాటకం రమ్యమ్' అన్న అభియుక్తోక్తులు భారతీయుల సాహిత్యాధ్యయన ప్రణాళికలో రూపక ప్రక్రియఆ సంతరించుకున్న ప్రాముఖ్యాన్ని వివరిస్తున్నాయి.

 

ప్రాచీనాలంకారికులు రూపక మర్యాదలను గూర్చి రసానుభూతిని గూర్చి చేసిన విశ్లేషణ ఎంత తర్కబద్ధంగా ఎంత తాత్వికంగా సాగిందో విజ్ఞులెరుగనిది కాదు. భారతీయ సాహిత్య శాస్త్రానికి పునాది భరతుని నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రం రూపకాలకు సంబంధించిన వివిధాంశాలను సూత్రబద్ధంగా అందించిన ఆద్య గ్రంథం. ఆ గ్రంథం చూపిన వెలుగులోనే ఆ గ్రంథం చదివిన సంస్కారంతోనే సాహిత్యశాస్త్రం రూపురేఖలు దిద్దుకున్నది. అనంద వర్ధనుడు అభినవ గుప్తుడు మున్నగువారు చేసిన పర్యాలోచనం రూపక సాహితీ సందర్శనానికి చక్కని మార్గాలను నిర్దేశించగలిగింది. సాహిత్యపరమైన అంశాలకు నాట్యశాస్త్ర సిద్ధాంతాలను అనువర్తింపజేసి, సమన్వయించి, సాహిత్య శాస్త్రాన్ని స్వతంత్రంగానూ సప్రమాణంగానూ పరిపుష్టం చేసినవారు ఎందరో లాక్షణికులు.

 

భరతుడు ప్రతిపాదించిన రససిద్ధాంత ప్రసక్తి లేనిదే ఆయన తరువాత వచ్చిన ఏ అలంకారశాస్త్ర గ్రంథం కూడా పూర్తి కాలేదు. విద్యానాథుడనే అలంకారికుడు ప్రతాపరుదీయమనే సాహిత్య శాస్త్ర గ్రంథంలో రూపక లక్షణాలను పేర్కొని అందుకు లక్ష్యంగా ఐదంకాల నాటకాన్నే వ్రాసినాడు. 

  భారతీయ సాహిత్యాధ్యయన సంప్రదాయంలో రూపక ప్రక్రియ ఒక విలక్షణాంశంగా ఉంటూ వచ్చినా తెలుగులో ఆదికావ్యం పుట్టక ముందే యావద్భారతంలో రూపక కళా విన్యాసం మహోన్నత శిఖరాల నందుకున్నా తెలుగులో పందొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధం వరకూ రూపకాలు లేకపోవడం అతి విచిత్రమైన విషయం. అయితే మార్గ పద్ధతిలో గాక దేశి పద్ధతిలో జానపదులూ పల్లీయులూ సృజించుకుని పెంపొందించుకున్న యక్షగానాది రూపక ప్రక్రియలు లేకపోలేదు. కానీ, దేశిరూపక ప్రక్రియలను గూర్చిన ప్రస్తావన ఈసందర్భంలో అప్రస్తుతం. నన్నయ తిక్కనాది ప్రాచీనాంధ్ర కవులకు సంస్కృత రూపకాలలో పరిచయమున్న మాట వాస్తవమే. కాని, సంస్కృతంలోని అన్ని ప్రక్రియలను తెనిగించిన నాటి కవులు రూపకాలను మాత్రం వదిలి పెట్టినారు. సంస్కృత నాటకాలలో వలె తెలుగులో పాత్రానుగుణ భాషాప్రయోగం సాధ్యం కాకపోవడం వల్లనైతేనేమి, వర్ణనా ప్రియులైన ప్రబంధకవుల ఉపేక్షవల్లనైతేనేమి, కవిపండిత పోషకులైన ప్రభువుల అనాసక్తి వల్లనైతేనేమి, నాటక లక్షణాలను తెల్పే గ్రంథాలు తెలుగులో లేనందువల్లనైతేనేమి, నాటక ప్రదర్శనకు కావలసిన రంగ పరికరాదులు లేనందువల్లనై తేనేమి, నటులకు సంఘంలో గౌరవాదరాలు లేనందువల్లనైతేమి తెలుగులో పందొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధం వరకూ రూపకాలు వెలువడలేదు.

1880లో శ్రీకోరాడ రామచంద్రశాస్త్రిగారు 'మంజరీ మధుకరీయము'ను రచించి ప్రథమాంధ్ర నాటక కర్తలైనారు. 'నరకాసుర విజయవ్యాయోగము'ను రచించి సంస్కృత నాటకానువాదానికి నాంది పలికినారు శ్రీ కొక్కొండ వెంకట రత్నం పంతులుగారు. శ్రీమాన్ పరవస్తు వెంకట రంగాచార్యులు గారు కాళిదాసుని అభిజ్ఞశాకుంతలము నాంధ్రీకరించారు. ఆ వావిలాల వాసుదేవశాస్త్రి గారు సంస్కృత నాటక ఆంధ్రీకరణంతో పాటు ఆంగ్ల రూపకాలకులు అనువాదాలు వెలయించినారు. వీరి సీజరు చరిత్రము ‘ప్రపథమాంగ్ల నాటకానువాదము. 'నందకరాజ్యము' అనే తొలి తెలుగు సాంఘిక నాటకాన్ని కూడా రచించినారు వారు. తరువాత కందుకూరి వీరేశలింగం పంతులు , గురుజాడ శ్రీరామమూర్తి, వడ్డాది సుబ్బారాయుడు, నాదెళ్ళ పురుషోత్తమ కవి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, చిలకమర్తి లక్ష్మి నరసింహం, వేదం వేంకటరాయశాం, గురజాడ అప్పారావు, కోలాచలం శ్రీనివాసరావు, పానుగంటి లక్ష్మీనరసింహారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, తిరుపతి వేంకటకవులు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, కాళ్ళకూరి నారాయణరావు వంటి ప్రతిభావంతులెందరో ఈ నాటక ప్రక్రియను పరిపుష్టం చేసినారు. తరువాత శతాధిక నాటక కర్తలు సహస్రాధికంగా నాటకాలు రచించి రూపక ప్రక్రియకు పరిణతిని సమకూర్చి పెట్టినారు. ఈ నాటి వరకూ సహస్రాధికంగా తెలుగులో అనువాద నాటకాలూ స్వతంత్ర నాటకాలూ వస్తూనే ఉన్నాయి. అన్య భాషా సాహిత్య సంస్కృతుల ప్రభావం వల్ల నాటక రచనా ప్రయోగాలలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కొత్త ప్రక్రియలు బయలుదేరినాయి. ఎన్నో మార్పులు వస్తున్నాయి. కొత్త ప్రక్రియలు బయలుదేరినాయి.తెలుగులో రూపక రచనకు పూనుకున్న వాళ్ళల్లో పలువురు బహుభాషా వేత్తలు, అనేక సాహితీ ప్రక్రియా నిర్మాతలు. కొందరు స్వయంగా నటులు ప్రయోక్తలు. వీరు ఎన్నెన్నో పౌరాణిక సాంఘిక చరిత్ర కేతివృత్తాలను రూపకాలుగా అవతరింపజేసినారు.

 ఇలా తెలుగులో అనంతంగా అవిఛ్ఛిన్నంగా వైవిధ్యంతో ముందుకు సాగుతున్న నా రూపక ప్రక్రియను గూర్చి అనేక విశ్వ విద్యాలయాలలో పరిశోధన జరిగింది. ఇంకనూ జరుగుచున్నది. అనేక సాహిత్య ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని భిన్న భిన్న దృక్పథాలలో విద్వాంసులు రూపక పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసాలను రచించి ఆయా విశ్వవిద్యాలయాలకు సమర్పించినారు. వానిలో కొన్ని వ్యాసాలు గ్రంథాలుగా వెలువడినాయి. పరిశోధకులు రూపకాలను ప్రక్రియాపరంగానూ వ్యక్తి సమిష్టి పరంగానూ ప్రత్యేక నాటక పరంగానూ సమీక్షించి గ్రంథాలను వెలువరించినారు. కొన్ని ప్రసిద్ధ సాహిత్య సంస్థలు ప్రకటించిన బహుమతులను అందుకోవడం కోసం కొందరు విద్వాంసులు పరిశోధన చేసి రూపక ప్రక్రియను గూర్చి సమీక్షా గ్రంథాలు రచించినారు. అప్పట్లో కొంతమందికి  దొరికినంతవరకు ఆయా పరిశోధనా వ్యాస గ్రంథాలను గూర్చి దిజ్మాత్రంగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను.

ఆధునికాంధ్ర సాహిత్యాచార్యులు డా. దివాకర్ల వేంకటావధానిగారు 1937లో ఆంధ్ర విశ్వ విద్యాలయం వారి ఎం. ఏ. ఆనర్సు పట్టం కోసం 'ఆంధ్ర నాటక పితామహుడు’ అనే సిద్ధాంత వ్యాసాన్ని రచించినారు. తరువాత ఇది గ్రంథ రూపం దాల్చింది. ఆంధ్ర నాటక పితామహుడుగా ప్రఖ్యాతి గాంచిన ధర్మవరం రామాకృష్ణమాచార్యులు గారు ముప్పైకి పైగా నాటకాలను రచించినారు. వానిలో ముద్రితాలైన చిత్రనళీయము, విషాద సారంగధర, పాదుకా పట్టాభి షేకము మున్నగు పద్నాలుగు నాటకాలను శ్రీ వేంకటావధానిగారు. ఈ గ్రంథంలో విపులంగా సమీక్షించినారు. పదమూడు భాగాలుగా సాగిన ఈ గ్రంథంలో మొదటి భాగం ఆంధ్ర నాటకాల ఆరంభ దశను వివరిస్తుంది. ధర్మవరం వారి నాటక వస్తువులకు ఇతిహాస పురాణ ప్రబంధాలు మూలాలని రెండవ భాగం నిరూపిస్తుంది. మూడవ భాగంలో పాశ్చాత్య విషాదాంత నాటక లక్షణాలనూ భేదాలనూ వివరించి అభిజ్ఞాన మణిమంతము పాదుకా పట్టాభిషేకము విషాద సారంగధర నాటకాలను ఆ దృక్పథంతో విమర్శించినారు ఆచార్య అవధానిగారు . ధర్మవరం వారి నాటకాలలోని వస్తు నిర్మాణ సంవిధానాన్ని మూల భిన్న కల్పనలనూ, వాని ప్రయోజనాలనూ పరిశీలించారు . నాలుగు భాగంలో ప్రాచ్య పాశ్చాత్య నియమాలను గ్రహించడంలో ధర్మవరం వారు చూపిన స్వతంత్రతను వ్యక్తం చేసినారు ఐదవ భాగంలో, పూర్వరంగాదుల విషయంలో ధర్మవరం వారు అనుసరించిన ప్రాచ్య పాశ్చాత్య పద్ధతుల సమీక్ష ఆరవ రాగం. నాటక సమయములు ఏడవది. పాత్ర పోషణను గూర్చిన రచనా విశేషాలను గూర్చిన పరిశీలనం ఎనిమిదవ తొమ్మిదవ భాగాలు. మానవజీవితం పట్ల ధర్మవరం వారికున్న అవగాహననూ, వారు నాటకాలలో వ్యక్తీకరించిన నీతిని ప్రకటించేవి పదోవ పదకొండోవ భాగాలు, ధర్మవరం వారి నాటకాలలో హాస్యాన్ని చమత్కారాన్ని సమీక్షించే భాగం పన్నెండవది. ఆంధ్ర నాటక పితామహుని వ్యక్తిత్వాన్ని సందర్శించుటతో ఈ గ్రంథం ముగుస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య నాటక లక్షణాలను ఈ గ్రంథంలోని ప్రతి ప్రకరణం మొదట వివరించి, వాటిని ధర్మవరం వారి నాటకాలకు సమన్వయించి చూపడంలో శ్రీ అవధానిగారు ప్రదర్శించిన వైదుష్యం సహృదయ పరిశోధకుల ప్రశంసలు అందుకుంటుంది.

ఆంధ్రనాటకాల ఆరంభదశను సూలంగానూ ధర్మవరం వారి నాటకాలను ప్రత్యేకంగానూ పరిశీలించే పరిశోధనా గ్రంథాలలో మొదట కనిపించే గ్రంథం ఈ 'ఆంధ్ర నాటక పితామహుడు.' శ్రీ "ధర్మవరం కృష్ణమాచార్యుల నాటక సమీక' అనే అంశాన్ని గ్రహించి శ్రీ వీరాస్వామి నాయుడుగారు పరిశోధనచేసి 1973 లో ఒక సిద్ధాంత వ్యాసాన్ని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సమర్పించినారు. కాని దీనిని చూసే అవకాశం శ్రీనివాసాచార్యకు చిక్కలేదు. 

  బహుభాషావేత్తలూ విద్వద్విమర్శకులూ సహృదయులూ అయిన ఆచార్య డా॥ కొత్తపల్లి వీరభద్రరావుగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి 1956లో 'తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము' అనే సిద్ధాంత వ్యాసాన్ని రచించినారు. ఇది 1960 లో ముద్రింపబడింది. ఈ పరిశోధనా గ్రంథంలోని వీరేశలింగ యుగము' అనే అధ్యాయంలో పందొమ్మిదన శతాబ్దంలోని ఆంధ్ర నాటక రచనా ప్రయోగ పరిణామాలను సుదీర్ఘంగా సమీక్షించారు వీరభద్రరావుగారు. తెలుగులోని వివిధ శాఖల పైవలెనే నాటకాలపై కూడా ప్రసరించిన పాశ్చాత్య ప్రభావాన్ని వీరు విపులంగా చర్చించినారు. మొదట వావిలాల వాసుదేవ శాస్త్రి గారి 'సీజరు చరిత్రము'ను, గురజాడ శ్రీరామమూర్తిగారి 'వెనీసు వణిజనాటకము ('సుహృత్ సుభాషితము') ను గ్రహించి వాని ఆంధ్రీ కరణ విధానాన్ని మూలాంగ్ల నాటకాలతో పోల్చి.వానిలోని ఔచిత్యానౌచిత్యాలను ఎత్తి చూపినారు.

కందుకూరి వారి ప్రహసనాలపై ఆంగ్ల సాహిత్య ప్రభావాన్ని నిరూపించినారు. అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనం, విచిత్ర వివాహ ప్రహసనం మహాబధిర ప్రహసనము, పునర్మరణ ప్రహసనము మొదలగు పది ప్రహసనాలకు ఆంగ్ల మాతృకలను చూపినారు. కందుకూరి ఆంగ్ల నాటకానువాదాలైన 'చమత్కార  రత్నావళి' నీ  వెనీసు వర్తక చరిత్రము'ను 'కళ్యాణ కల్పవల్లి' ని ‘రాగమంజరి’ నీ మూలంతో పోల్చి దానిలోని మార్పులను చేర్పులను విపులంగా విశ్లేషించి చూపినారు. కందుకూరి వారికి సమకాలికులైన నాటక కర్తలపై వారి నాటకాలపై ప్రత్యక్షం గానూ పరోక్షంగానూ పాశ్చాత్య ప్రభావం ఎలా ప్రసరించిందో సుదీర్ఘంగా విషయ గభీరంగా సోపపత్తికంగా నిరూపించినారు. కోరాడ రామచంద్రశాస్త్రి, పరవస్తు వేంకట రంగాచార్యులు, కొక్కొండా వేంకటరత్నం పంతులు, వేదం వేంకట రాయ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, వడ్డాది సుబ్బారాయకవి, కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమ కవి, పానుగంటి లక్ష్మీనరసింహారావు, కూచి నరసింహం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, చిలకమర్తి లక్ష్మినరసింహం, తిరుపతి కవులు, కొబ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు, పనప్పాకము శ్రీనివాసాచార్యులు, బి. శ్రీనివాసరావు, రెంటాల వెంకట సుబ్బారావు, శ్రీరామ్ వీరబ్రహ్మం గార్ల నాటకాలపై గల ఇంగ్లీషు ప్రభావాన్ని సోదాహరణంగా నిరూపించినారు భద్రరావుగారు. నాకు తెలిసినంతవరకు పందొమ్మిదొవ శతాబ్దం ఆంధ్ర నాటకాలపై ఆంగ్ల సాహిత్య ప్రభావాన్ని నిరూపించే ప్రథమ పరిశోధనా గ్రంథం ఇదే. పరిశోధకులకూ విద్వద్విమర్శకులకూ పరమ ప్రమాణం ఈ సిద్ధాంత గ్రంథం. 

రూపక  పుట్టు పూర్వోత్తరాలనూ నాటక స్వరూప స్వభావాలనూ తెలుగు నాటకోత్పత్తి వికాస విశేషాలను సమగ్రంగా సమీక్షించే పరిశోధనా గ్రంథం డా॥పోణంగి శ్రీరామ అప్పారావుగారి 'తెలుగు నాటక వికాసము.' ఇది ఉస్మానియా విశ్వ విద్యాలయం వారికి 1961లో సమర్పింపబడిన సిద్ధాంత వ్యాసం. ఇది 1967లో గ్రంథంగా వెలువడింది. ఈ గ్రంథం తెలుగు నాటక కళా పరిశోధకుల పాలిటి కల్పతరువు, ఆధునిక నాటక రచనా ప్రయోగ విశేష జిజ్ఞాసువులకు గురువు. 1860 నుంచి 1960 వరకు నూరేళ్ల తెలుగు నాటక వికాసాన్ని సమగ్రంగా  సమీక్షించే ప్రథమ పరిశోధన గ్రంథం ఇది. 1961 తరువాత జరిగిన అనేక రూపక పరిశోధనలకు ఇది ఆదర్శ గ్రంథం. "భావి పరిశోధనలకు ఈ నా పరిశోధన పునాది కాగలదనియు విశ్వసించుచున్నాను" అన్నవారి మాటలు అక్షరాలా సత్యమని నిరూపితమైనది. ఈ పరిశోధనా గ్రంథంలో ఐదు భాగాలున్నాయి. ప్రథమ భాగం ఆంధ్రనాటక చరిత్ర పూర్వ రంగంగా ఉంది. నాలుగు అధ్యాయాలుగా విభక్తమైన ప్రథమభాగంలో నాట్యకళా విశిష్ట స్వరూపాన్ని వివరించే ప్రథమాధ్యాయం. ద్వితీయాధ్యాయం ప్రాచ్య పాశ్చాత్య రూపక స్వరూప స్వభావ సందర్శనం, ప్రాచీనాంధ్ర దేశంలో సంగీత నృత్య నాట్య వికాస విశేష వివరణం తృతీయాధ్యాయం. ఇక చతుర్థాధ్యాయం బొమ్మలాటలు, యక్షగానాలు, కొరవంజి, పగటివేషాలు మున్నగు దేశి దృశ్యకళా రూపలక్షణ సమాలోచనం.

 ఆధునికాంధ్ర నాటకాల ఆరంభ వికాసాలను గూర్చి వివరించే ద్వితీయభాగం ఈ పరిశోధనా గ్రంథమూర్తికి హృదయం. ఆరు అధ్యాయాలుగా విస్తరించిన ఈ భాగంలో మొదటి అధ్యాయం 1860 నుంచి 1886 వరకు గల ఆంధ్ర నాటక రచనా ప్రదర్శనల ప్రారంభదశలను పరిశీలిస్తుంది. కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకటరంగాచార్యులు, వావిూల వాసుదేవశాస్త్రి, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ శ్రీరామమూర్తి, కొండుభట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, వడ్డాది సుబ్బారాయుడు, నాగెళ్ల పురుషోత్తమకవి రచించిన నాటకాలను ఇందులో విషయవిపులంగా సమీక్షించినారు. శ్రీ అప్పారావుగారు.

1886 నుంచి 1900వరకు తెలుగు నాటక రచన బహుముఖాలుగా వికసించిందో వివరించేది. ద్వితీయాధ్యాయం. ధర్మవరం, చిలకమర్తి, వేదం, గురజాడ, కోలాచలం, పానుగంటి వంటి ప్రముఖ నాటకకర్తల నాటకాలు ఇందులో పరిశీలింపబడ్డాయి. తృతీయాధ్యాయం (1900-1920) లో శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, తిరుపతి వేంకట కవులు, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, కాళ్లకూరి నారాయణరావు ప్రభృతులు నాటక రచనా ప్రయోగ విస్తృతికై చేసిన కృషిని వివరించినారు డా అప్పారావుగారు. దేశభక్తి, సంఘ సంస్కరణం వంటి దృక్పధాలతో 1920-44 మధ్య నాటక రచనలో పచ్చిన నవీన ప్రయోగాల వివరణం నాలవ ఆధ్యాయం. నాటికల ఏకాంకికల వికాసాన్నీ ప్రసిద్ధ నాటికా కర్తల కృషిని పరిశీలించేది పంచమాధ్యాయం. ఆరవ అధ్యాయంలో 1944 తరువాతి నాటక చరిత్రనూ కొన్ని ప్రక్రియలనూ రేఖామాత్రంగా నిరూపించడం జరిగింది. ఈ గ్రంథంలోనే తృతీయభాగం ఆంధ్ర నాటక చరిత్ర సింహావలోకనం. ఇందలి మూడు అధ్యాయాలలో ఇతివృత్త రచనా స్వరూపానుగుణంగా నాటక రచనను సమీక్షించడం, ఆధునిక నాటక ప్రయోగదశలను పరిశీలించటం, తెలుగు నాటక విమర్శ చరిత్రను అవలోకించటం, సమస్యలను సమీక్షించడం జరిగింది. సంస్కృత రూపకానువాదాలు, ఆంగ్ల రూపకానువాదాలు, స్వతంత్ర రూపలు,విషాద రూపకాలు, ప్రహసనాలు, ఏకాంకికలు, పద్య నాటికలు, గేయ నాటికలు, రేడియో నాటికలు పరిశీలింపబడినాయి. 

 చతుర్ధ పంచమభాగాలు అనుబంధాలకు సంబంధించినవి. మొదటి అనుబంధం- రచనలు (నాటికా -నాటకాలు) విమర్శలు. రెండవ దానిలో రచయితల జాబితా, మూడవదానిలో ప్రసిద్ధ నటుల- ప్రసిద్ధ నాటక సమాజాల పేర్లు, నాల్గవదానిలో ఉపయుక్త గ్రంథాలూ, ఐదవదానిలో ముఖ్య పదాను క్రమణికా సూచింపబడ్డాయి. కొందరు ప్రసిద్ధ రచయితల -విమర్శకుల - పోషకుల - నటీనటుల చిత్రాలు చోటు చేసుకున్నాయి పంచమ భాగంలో. ఈ అనుబంధాలు పరిశోధకులకెంతో ఉపయోగపడతాయి.

డా॥ అప్పారావుగారి వైదుష్యానికి పరిశోధనా పటిమకూ విజ్ఞానానురక్తి విమర్శనా నైశిత్యానికి రచనా సారళ్యానికి ఈ గ్రంథం పతాక సదృశం. వారి పరిశోధనకు విరాడ్రూపం ఈ పుస్తకం. అలంకార శాస్త్రానికి భరతుని నాట్య శాస్త్రంలా,  ఆంధ్ర నాటక పరిశోధనకు ఈ 'తెలుగు నాటక వికాసము ' ఆదర్శం అంటే అతిశయోక్తి కాదు.

నవ్యాంధ్ర సాహిత్య నిర్మాతలలో ఒకరైన శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు ఆంధ్ర షేక్స్పియరుగా ప్రఖ్యాతి వహించినారు. వారి రూపక వాజ్మయ సర్వస్వాన్ని డా. ముదిగొండ వీరభద్రశాస్త్రి గారు, తమ పరిశోధనా వ్యాసం 'పానుగంటివారి సాహిత్యసృష్టి- సవిమర్శ పరిశీలనము'లో సూక్ష్మక్షికతో పరిశీలించినారు. 1963 లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పిత మైన ఈ సిద్ధాంతవ్యాసం 1968లో ముద్రితమైనది. అయిదు అధ్యాయాలుగా పరుచుకున్న ఈ గ్రంథంలోని రెండవ అధ్యాయం పానుగంటివారి రూపక వాజ్మయ పరిశీలనం. ఇందులో పానుగంటి వారి ముప్పై నాటకాల రచనా కార్యక్రమాన్ని నిర్ణయించి ఒక్కొక్క దానిని గూర్చి సవిమర్శంగా పరిశీలించినారు శ్రీ వీరభద్ర శాస్త్రిగారు. నర్మదాపురుకుత్సీయము, సారంగధర, ప్రచండ చాణక్యము, రాధాకృష్ణ, పట్టభంగ రాఘవము, విప్రనారాయణ చరిత్రము, కంఠాభరణము ఇలా క్రమంగా నాటకాలన్నింటిలోని కథా పాత్ర చిత్రణ రసపోషణాది వివిధాంశాలను గూర్చి సమగ్రంగా వివరించినారు. ఆయా నాటకవస్తువులకు గల మాతృకలను ఎత్తిచూపి, పానుగంటి వారిపై మహానీయుల ప్రభావాన్ని నిరూపించినారు. పాత్రల సంభాషణలో నాటక పద్య రచనలో పాత్ర చిత్రణలో సన్నివేశకల్పనలో ప్రాచ్య పాశ్చాత్య లక్షణ సమన్వయంలో పానుగంటివారు ప్రదర్శించిన ప్రతిభను సహృదయ హృదయ గమ్యంగా అనుశీలించినారు డా. వీరభద్రశాస్త్రిగారు. పానుగంటివారి నాటకాల ప్రదర్శనా యోగ్యతను గూర్చి చక్కగా పరిశీలించినారు. నాలుగవ అధ్యాయంలో నాటకాలలోని హాస్యాన్ని హాస్యాలంబన పాత్రలను సోదాహరణంగా సమీక్షించినారు. పానుగంటి వారి కవితా ప్రతిభనూ, ఆలంకారిక రచనా సంవిధానాన్ని భాషా శైలి విశేషాలను తార్కిక ప్రజ్ఞనూ లోకజ్ఞతనూ ఐదవ అధ్యాయంలో వివరించినారు. తమ బహుముఖీనమైన ప్రతిభతో వైదుష్యంతో శ్రీ వీరభద్రశాస్త్రి గారు పానుగంటివారి రూపక విరాణ్మూర్తిని సహృదయులకు దర్శింపజేసినారు. 

 ఈ పరిశోధనా గ్రంథంలో తరువాతి కాలంలో పానుగంటి కృతులను గూర్చి జరిగిన విశేష పరిశోధనలకు ఈ గ్రంథం ఆదర్శమై, మార్గదర్శకమై భాసించింది. భారతీయ సంస్కృతిని పరిరక్షించిన మహా పురుషుడూ, సంఘ సంస్కర్తా, కావ్యగూరుడూ అయిన శ్రీ వీరేశలింగం పంతులుగారి సమగ్ర వ్యక్తిత్వాన్ని సాహిత్య కృషిని గూర్చి పరిశోధనచేసి 1965 లో ఒక సిద్ధాంత వ్యాసాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించినారు. డా|| అక్కిరాజు రమాపతి రావు ('మంజుశ్రీ') గారు. 1972 లో ఈ వ్యాసమే * వీరేశలింగం పంతులు - సమగ్ర పరిశీలన' అనే గ్రంథంగా రూపుదిద్దుకొని సహృదయుల నలరించింది. పదిహేను భాగాలుగా పరివ్యాప్తమైన ఈ గ్రంథంలోని ఐదవ భాగంలో వీరేశలింగం పంతులు గారి నాటకాలను గూర్చి పరిశీలనం జరిగింది. పంతులు గారి ప్రహసనాలనూ సంస్కృతాంగ్ల నాటకానువాదాలనూ స్వతంత్ర పౌరాణిక సాంఘిక నాటకాలనూ సమగ్రంగా సమీక్షించినారు 'మంజుశ్రీ'గారు. తెలుగులో ప్రహసనాలను రచించడంలో ఆద్యులు పంతులుగారే అని వారు నిరూపించినారు. హాస్య సంజీవని ప్రథమ ద్వితీయ తృతీయ భాగాలలోని ప్రహసనాలను క్రమంగా పరిశీలించి వాటి రచనోద్దేశాలను ఎంతో చక్కగా వివరించినారు. ప్రహసనాలను ప్రకటించిన పత్రికలనూ తేదీలను ఎత్తి చూపినారు. ఆంగ్లేయ ప్రహసనాలను అనుసరించి పంతులుగారు రచించిన అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము, విచిత్ర వివాహ ప్రహసనము, మహాబధిర ప్రహసనము మున్నగు వాటిని గూర్చి పరిశీలిస్తూ వాటి మాతృకలను ఎత్తిచూపి దేశ కాల పాత్రానుగుణంగా పంతులుగారు చేసిన మార్పులను చూపినారు. ప్రహసనాలలోని వ్యంగ్య మర్యాదలనూ హాస్యధోరణలనూ తెలిపినారు. పంతులుగారి ది కామెడి ఆఫ్ ఎర్రర్స్, అభిజ్ఞాన శాకుంతలను, బ్రాహ్మవివాహము, వ్యవహార ధర్మబోధిని,  స్త్రీ పునర్వివాహ సభా నాటకము, చమత్కార రత్నావళి, రత్నావు, మాళవికాగ్ని మిత్రము, ప్రబోధచంద్రోయము, రాగమంజరి, సత్యహరిశ్చంద్ర, కళ్యాణ కల్పవల్లి మున్నగు పందొమ్మిది నాటకాల రచనాక్రమాన్ని పేర్కొని, వస్తువును బట్టి వాటిని వర్గీకరించి ఒక్కొక్క నాటకాన్ని విపులంగా సమీక్షించినారు. అనువాద నాటకాలను మూలంతో పోల్చి పరిశీలించినారు. పంతులుగారి కావ్యదృష్టిని గూర్చి భాషా శైలినిగూర్చి లోకజ్ఞతాతార్కిక ప్రతిభలను గూర్చి ఈ గ్రంథంలోని వేర్వేరు భాగాలలోని వర్ణించారు.

  

వీరేశలింగం పంతులు గారిది బహుముఖీనమైన సాహిత్య సృష్టి. అందులో ఒక ముఖం నాటక సాహితీ సృష్టి. ఆసృష్టి విశేష విన్యాసాలను ఈ గ్రంథంలో సమగ్రంగా పరిశీలించటంలో కృతకృత్యులైనారు 'మంజుశ్రీ'గారు. వీరేశలింగం పంతులుగారి సర్వతోముఖ ప్రతిభకు దర్పణం ఈ గ్రంథం. “సంఘ సంస్కరణ – వీరేశలింగం గారి సాహిత్యం" అనే విషయాన్ని గూర్చి వి. కోటేశ్వరమ్మగారు పరిశోధన చేసి 1981లో ఒక సిద్ధాంత వ్యాసాన్ని నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించి నారు. పంతులుగారి రూపక సాహితీ విశేషాలు ఈ వ్యాసంలో చోటు చేసికొని ఉంటాయి. కాని, తిరుమల శ్రీనివాసాచార్యలకు ఆ పరిశోధనా వ్యాసాన్ని చూసే భాగ్యం దక్కలేదు . ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడుగా, నాటక ప్రయోక్తగా ఉత్తమ విమర్శకుడిగా, ఆంధ్ర నాటక చరిత్రలో కోటి కెక్కిన కోలాచలం శ్రీనివాసరావుగారి నాటక సాహిత్యాన్ని గూర్చి పరిశోధన చేసి ఒక సిద్ధాంత వ్యాసాన్ని 1972లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సమర్పించినారు, డా|| ఎస్.గంగప్ప గారు. ఈ వ్యాసం 1977లో 'కోలాచం శ్రీనివాసరావు నాటక సాహిత్య సమాలోచనము' అనే గ్రంథంగా రూపుదిద్దుకున్నది. 

కందుకూరి, ధర్మవరం, చిలకమర్తి, వేదం, గురజాడ, పానుగంటి వంటి వారికి సమకాలికుడై ఇరవై ఎనిమిది నాటకాలనూ నాలుగు ప్రహసనాలనూ (ఇందులో ఒకటి కన్నదం) రచించి, తమ వైలక్షణ్యాన్ని వ్యక్తిత్వాన్ని భద్రంగా నిలుపుకున్నవారు కోలాచలం శ్రీనివాసరావుగారు. కోలాచలంగారి నాటకాలన్నింటిని ఇతివృత్తాన్ని బట్టి వర్గీకరించి ఒక్కొక్క నాటకాన్ని గూర్చి సమగ్ర పరిశీలనం చేసినారు. డా॥ గంగప్పగారు ఈ గ్రంథంలో. వర్గీకరణంలో సుఖమంజరీ పరిణయము, సుల్తానా చాందుబీ, రామరాజు చరిత్రమువంటి చారిత్రక నాటకాలూ, శ్రీరామ జననము, సీతా కల్యాణము. పాదుకా పట్టాభిషేకము వంటి పౌరాణిక నాటకాలూ, ద్రౌపదీ వస్త్రాపహరణము, కీచకవధ వంటి భారతకథామూలకాలైన నాటకాలూ , మదాలస, రుక్మాంగద, గిరిజా కల్యాణము వంటి ఇతర పౌరాణిక నాటకాలు, రాక్షసీమహాత్వాకాంక్ష వంటి ఆంద్రీకృత నాటకాలూ, సునందనీ పరిణయము అనే కల్పిత నాటకమూ, యువతీ వివాహము అనే సాంఘిక నాటకమూ ఉన్నాయి. ఇవికాక నాచిపార్టి వంటి ప్రహసనాలూ ఉన్నాయి. పదకొండు భాగాలున్న ఈ గ్రంథంలోని ఐదవ, ఆరవ, ఏడవ, ఎనిమిదవ భాగాలలో కోలాచలం వారి ఇతివృత్త నిర్మాణ దక్షతనూ వాత్రపోషణ చాతుర్యాన్ని రచనా శిల్పాన్నీ రచనా ప్రయోజనాన్ని వివరించినారు. డా॥ గంగప్పగారు. చారిత్రక విషాదాంత నాటక హాస్యరస నిర్వహణలో ఔచితీపోషణలో కోలాచలం వారి కొన్ని విశిష్ట లక్షణాలను వివరించినారు తొమ్మిదవ భాగంలో, కోలాచలంవారి నాటకేతర రచనలనూ, ఆంధ్ర నాటక వాజ్మయంలో అతని కున్న స్థానాన్ని పరిశీలించినారు. చివరి రెండు భాగాలలో, కోలాచలంవారి రూపక వాజ్మయ పరిశోధనా సర్వస్వం ఈ గ్రంథం. డా.గంగప్పగారి పరిశోధనా పటిమకూ వైరుష్యానికి ప్రతిబింబం ఇది.

 

'తెలుగులో విషాదరూపకాలు' అనే అంశాన్నిగూర్చి పరిశోధన చేసి శ్రీమతి కస్తూరి ఉదయభాస్కరలక్ష్మిగారు ఒక సిద్ధాంత వ్యాసాన్ని 1977లోఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించినారు. ఈ వ్యాసం సహజంగా ఎవరికీ లభ్యం కాలేదు. ప్రక్రియాపరంగా జరిగిన పరిశోధన తెలుగులో ప్రహసనాలు.' శ్రీ జి. శేషారెడ్డిగారు. ఈ పరిశోధనా వ్యాసాన్ని 1978లో రచించి మద్రాసు విశ్వవిద్యాలయానికి సమర్పించినారు. ఈ వ్యాసాన్ని కూడా దర్శించే అవకాశం చాలా మందికి లభించలేదు. ప్రక్రియా దృష్టితో జరిగిన మరో పరిశోధన 'తెలుగులో గేయ నాటికలు', ఈ విషయాన్ని గూర్చి నేను పరిశోధన చేసి ఒక సిద్ధాంతవ్యాసాన్ని 1978లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించినారు శ్రీనివాసాచార్యులు. తెలుగులో విద్వత్కవులైన శ్రీ శివశంకర స్వామి, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, శ్రీనోరి నరసింహశాస్త్రి, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, డా|| దాశరథి, డా॥ సి. నారాయణరెడ్డి, డా॥ వానమామలై వరదాచార్యులు, దా॥ బోయి భీమన్న, శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు, డా॥ యస్వీజోగారావు, డా॥ కె.వి. ఆర్. నరసింహం, డా॥ నండూరి రామకృష్ణమాచార్య, అజె.బాపురెడ్డి మున్నగు వారందరో గేయనాటికా ప్రక్రియలతకు రంగురంగుల పూలు పూయించి రకరకాల పరిమళాలను గుబాళింప జేసినారు. 1930లో ప్రారంభమైన ఈ గేయనాటికా ప్రక్రియలో 1977 దాకా వచ్చిన శతాధిక నాటికలను భిన్నభిన్న దృక్కోణాలతో పరిశీలించినారు ఈ సిద్ధాంత వ్యాసంలో. అరవైకి మించిన గేయనాటికా కర్తల నాటికలను ఈ సిద్ధాంత వ్యాసంలో సమీక్షించినారు.

పద్నాలుగు భాగాలుగా పరుచుకున్న ఈ సిద్ధాంత వ్యాసంలో నాటికా స్వరూప స్వభావాలనూ, సాహిత్యంలో గేయానికున్న ప్రమేయాన్నీ, సంగీత ప్రాశస్త్యాన్ని మొదటి రెండవ మూడవ భాగాలలో వివరించినారు. గేయ నాటికలలోని ప్రధానాంశాలైన గీతనృత్యాలు భరతుని కాలం నుంచి ఉన్న రూపకాలలో చోటు చేసికొన్న తీరుతెన్నులనూ, కైశికి వృత్తికీ ధ్రువగానాదులకూ రూపకాలలో గల ప్రాధాన్యాన్ని వివరించారు. నాల్గవ భాగంలో, తోటకం, సట్టకం, నాట్యరాసకం, ఉల్లాప్యం, ప్రేంఖణం, సంలాపకం, శిల్పకం, హల్లీసం, భాణిక , డోంబిక, మల్లిక వంటి అనేక సంస్కృతోప రూపకాల లక్షణాలను ఎత్తి చూపి, సమకాలిక మైన అభిరుచుల కనుగుణంగా కొన్ని మార్పులతో చేర్పులతో అవి ఈనాటి గేయనాటికలలో ఎలా భాసిస్తున్నవో వివేచించి చూపినారు. ఐదవ భాగంలో, దేశిదృశ్యకళా రూపాలైన కొరవంజి యక్షగానాదుల స్వరూప స్వభావాలను వివరించి, గేయనాటికలకూ వానికి గల సాదృశ్యాన్ని పరిశీలించి, గేయనాటికలపై వానికి గల ప్రభావాన్ని చర్చించినారు ఆరవభాగంలో. ఏడవ భాగం వివిధ భాషలలోని గేయనాటికా వికాస పరిశీలనం. ఎనిమిదవ భాగం తెలుగులో గేయనాటికావతరణం. శ్రీ తల్లావజ్జల శివశంకరస్వామి వారి 'పలిత కేశం' (1930) తెలుగులో మొట్ట మొదటి గేయనాటిక అని నిరూపింపబడింది. ఇందులో. తొమ్మిదవ భాగం గేయనాటికా వైవిధ్య పరిశీలనం. ఛందో దృష్టితోనూ వస్తు దృష్టితోనూ గేయ నాటికలను పౌరాణికాలుగా, చరిత్రాత్మకాలుగా, సాంఘికాలుగా, సాంస్కృతికాలుగా, అనుసరణాత్మకాలుగా, ప్రకృతి సంబంధాలు (ప్రతీకాత్మకాలు)గా, ప్రబోధాత్మకాలుగా వర్గీకరించి వాటిలోని విశేషాలను వివరించారు. ఈ భాగం చివరలో బాలల గేయనాటికలనూ సినిమా గేయ నాటికలను కూడా పరిశీలించినారు పదవ భాగం గేయనాటికా స్వరూప స్వభావ నిరూపణం. గేయనాటికా ప్రయోగ పరిశీలనం పదకొండవది. గేయనాటికలలోని కావ్యత్వాన్ని వివరించేది పన్నెండవ భాగం.

 గేయ నాటిక లలోని పద్య-గేయ - వచన  కవితా ప్రయోగ విశేషాలను వైవిధ్యానికి అక్షర సంయోజనానికి రసపోషణకూ ఉన్న సంబంధాన్ని, గ్రాంథిక, వ్యావహారిక - అన్యదేశీయ భాషా పర ప్రయోగ విశేషాలనూ పదమూడవ భాగంలో పరిశీలించినాను. గేయనాటికల భవితవ్య సమాలోచనం చివరి భాగం. అను బంధాలలో గేయనాటికా ప్రక్రియకు ఆద్యులైన శివశంకర స్వామివారితో నేను జరిపిన గోష్టి విశేషాలనూ, ఉత్తర ప్రత్యుత్తరాలనూ ఉట్టంకించినారు. గేయ నాటికలనూ రచయితలను పేర్కొన్నారు. శ్రీమతి సి. రాజేశ్వరి గారు 'ఆంధ్రమున ప్రబంద రూపము నొందిన సంస్కృత నాటకములు'అనే విషయంపై పరిశోధన చేసి 1978 లో ఒక సిద్ధాంత వ్యాసాన్ని బెంగుళూరు విశ్వవిద్యాలయానికి సమర్పించినారు. ఈ వ్యాసం 1981 లో గ్రంథ రూపం దాల్చింది. ఈ సిద్ధాంత గ్రంథంలో ప్రధానంగా రెండుభాగాలున్నాయి. మొదటి భాగం పరిశోధనాంశానికి ఉపోద్ఘాత ప్రాయం.

ఆరు భాగాలుగా విభక్తమైన ఈ ప్రథమ భాగంలో ప్రబంధాలకు నాటకాలకూ గల సామ్య లేదాలనూ నాట్యోత్పత్తిని సంస్కృత నాటక వాజ్మయాన్ని సంగ్రహంగా సమీక్షించినారు డా॥ రాజేశ్వరిగారు. కావ్యాలలో నాటకాలకు గల వైశిష్ట్యాన్ని, ఆంధ్ర వాజ్మయంలోని అనువాద విధానాలను వివరించినారు. తెలుగులో నాటకాలు ఆలస్యంగా రావడానికి గల కారణాలను పరిశీలించి, ఆధునికాంధ్ర నాటక వికాసాన్ని రేఖామాత్రంగా సమీక్షించినారు. శ్రవ్యకావ్యాలలో నాటకీయత చోటుచేసుకున్న తీరుతెన్నులను ఎత్తిచూపినారు. 

ఆంధ్రమున ప్రబంద రూపాన్ని పొందిన ఆరు సంస్కృత నాటకాల పరిశీలకమే ద్వితీయభాగం. సిద్ధాంత గ్రంధములోని ప్రధాన విషయమిదే. సంస్కృత నాటకాన్ని అనుసరించి ప్రబంధాన్ని రచించిన ప్రధమాంధ్ర కవి మంచన. అతని కేయూరబాహు చరిత్రము రాజశేఖరుని ‘ విద్ధసాలభంజిక కు అనుసరణం. వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామమునకు మూలం రావిపాటి త్రిపురాంతకుని ప్రేమాభిరామము పిల్లలమఱి పినవీరభద్రుని శృంగార శాకుంతలమునకు మూలం కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలము'. జంటకవులైన నందిమల్లయ, ఘంటసింగనల ప్రబోధచంద్రోదయ ప్రబంధం కృష్ణ మిశ్రుని ' ప్రబోధ చంద్రోదయము నకు ఆంద్రీకరణం.

బొడ్డుచర్లచిన తిమ్మయ్య రచించిన ప్రసన్నరాఘవ నాట్య ప్రబంధానికి మూలం జయదేవుని ప్రసన్న రాఘవ నాటకము బిజ్జుల తిమ్మభూపాలుని 'అనర్ఘ రాఘవము. మురారి 'అనర్ఘరాఘవమునకు - అనుకరణం. మూల నాటక కర్తల-ఆంద్రీ కర్తల జీవితకాలాదులనూ వారి నాటక కథా విశేషాలనూ ఆంద్రీకరణ విధానాలనూ నామౌచిత్య కథా రసపాత్రపోషణాలను భాషాశైలీ విశేషాలను వివరించే సందర్భంలో డా.రాజేశ్వరిగారు. ప్రదర్శించిన ఉభయభాషా వైశారద్యమూ పరిశోధనా గరిమా సమగ్ర విషయ ప్రదర్శనా కౌశలమూ విద్వత్సం స్తనీయం. పింగళి సూరన ప్రభావం ప్రద్యుమ్నమునూ రవివర్మభూపాలుని ప్రద్యుమ్నాభ్యుదయ నాటకాన్ని గ్రహించి తులనాత్మకంగా పరిశీలించి  విషయ సమగ్రతకు కృషి చేసినారు డా.రాజేశ్వరి గారు. గ్రంథంలో ఏడవ భాగం ఇది. ఆధునిక యుగంలో శ్రీష్టా రామకృష్ణశాత్రిగారు భాసుని ప్రతిజ్ఞాయౌగంధరాయణము స్వప్న వాసవదత్తము. నాటకాలను మూలంగా గ్రహించి శ్రీ వాసవదత్తా వత్సరాజము' అనే ప్రబంధాన్ని రచించినారు . ఉదయకావ్య విశేషాలను కూడా డా. రాజేశ్వరి గారు స్పృశించి పరిశోధనా సమగ్రతను సాధించినారు.

         ఆధునిక జీవితరంగంలో కనిపించే సంఘర్షణకు మూలం భిన్నభిన్న సమస్యలు. ఇట్టి సమస్యలను ప్రధాన వస్తువుగా గ్రహించి అనేక సాంఘిక రూపకాలు అవతరిస్తున్నాయి. ఆధునిక యుగంలో రూపక సాహిత్యానికి ప్రతినిధిగా సాంఘిక నాటకం భాసిస్తున్నది. వస్తువైవిధ్యంతో ప్రయోగం అవతరించినాయి, ఆధునిక యుగంలో రూపక సాహిత్యానికి ప్రతినిధిగా సాంఘిక నాటకం భాసిస్తున్నది. వస్తు వైవిధ్యం తో ప్రయోగ బాహుళ్యంతో అనేకంగా అల్లుకుపోతున్నది సాంఘిక నాటకం. 'తెలుగు సాంఘిక నాటకం' అనే అంశాన్ని గ్రహించి పరిశోధన చేసి 1979 లో ఒక సిద్ధాంత వ్యాసాన్ని రచించి ఉస్వానియా విశ్వవిద్యాలయానికి సమర్పించినారు శ్రీ పి. వెంకటరమణగారు . డా. వెంకటరమణగారు నాటకకర్తలు కూడా, వారి సృజనాత్మక చైతన్యమూ విమర్శనాత్మకమైన ప్రవృత్తి ఈ పరిశోధనా వ్యాసరచనకు సమగ్రతను సంతరించి పెట్టినాయి "కన్యాశుల్కం సాంఘిక నాటక గంగా ప్రవాహానికి గంగోత్రివంటిది, " ఆచార్య ఆత్రేయగారి 'ఎన్జీవో' ఒక మైలురాయి. ఒక కొత్త దనానికి ఉషోదయం" అన్నారు. వెంకటరమణగారు, తమ ముందుమాట'లో, తెలుగులో సాంఘిక నాటకాలు రెండువేలను దాటినాయి. ఒక్కొక్క నాటకాన్ని గూర్చి సమగ్రంగా సమీక్షించటం సాధ్యం కానిపని. అందుకే డా. వెంకటరమణగారు సమస్యనాధారంగా చేసుకొని, సాంఘిక నాటక రచనా ప్రయోగాలను పరిశీలించినారు. ఎనిమిది అధ్యాయాలుగా సాగిన ఈసిద్ధాంతవ్యాసంలో మొదట సాంఘిక రూపక స్వరూప స్వభావాలను వివరించినారు. ఈ సందర్భంలో పాశ్చాత్య విమర్శ నా దృక్పథాన్ని గ్రహించి, దానిని తెలుగులోని ప్రయోగాలకు సమన్వయించిన వైఖరి ప్రశంసనీయం.

రెండవ అధ్యాయంలో చారిత్రకంగా ప్రక్రియాపరంగా తెలుగు సాంఘిక నాటకం వికసించిన వైనాన్ని నిరూపించినారు. ప్రాచీన భారతీయ దశ రూపకాలలో సాంఘిక వస్తువును సమీక్షించినారు. మూడవ అధ్యాయంలో. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగు సాంఘిక నాటకం ఆవిర్భవించిన కారణంచేత పాశ్చాత్య సాహిత్యాల్లో తెలుగు సాంఘిక నాటక వికాస పరిణామాలను పరిశీలించినారు. నాల్గవ అధ్యాయంలో. ప్రయోగంలో ప్రధాన పాత్రను నిర్వహించిన పాశ్చాత్య నాటకకర్తృ పరిచయం పంచమాధ్యాయం. తెలుగు సాంఘిక నాటకంపై పాశ్చాత్య ప్రభావ పరిశీలనం ఆరో అధ్యాయం. తెలుగు సాంఘిక నాటకరచనలోని తీరుతెన్నులను వివరించేది ఏడవది. రచనలకు వివిధ సమస్యల కింద వర్గీకరించి ఒక్కొక్క సమస్యను చిత్రించిన నాటకాల పరిణామాన్ని ప్రకటించటంలో శ్రీ వెంకట రమణగారు చూపిన పరిశోధనాశక్తి హృద్యం. పాత్రచిత్రణం, సన్నివేశ కల్పనం, నవీన ప్రయోగానురక్తి వంటి అంశాలు సాంఘిక రూపక పరిణామదశలో కనబరచిన ప్రాధాన్యాన్ని ఈ అధ్యాయంలో విషయ విపులంగా పరిశీలించినారు పరిశోధకులు. వ్యాపార దృష్టినిమాని నాటక కర్తలు శిల్పదృష్టితో కృషి చేసి సముజ్జ్వల ప్రగతిపథంలో సాంఘిక నాటకాన్ని నడిపించాలని తమ సదాశయాన్ని వ్యక్తీకరించినారు. ఈ గ్రంథం చివరి అధ్యాయం 'ముగింపుమాట'లో. ఈ సిద్ధాంత వ్యాసరచనలో డా. వెంకటరమణగారి రూపక సాహితీ పరిజ్ఞానం బహుముఖంగా భాసిస్తున్నది. తెలుగు సాంఘిక నాటక జగత్తును సమగ్రంగా సందర్శింప జేసే సిద్ధాంతవ్యాసమిది.

'చలం నవలలు-సామాజిక చైతన్యం' అన్న అంశం మీద 1979 లో కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన శ్రీ వెన్నవరం ఈ దారెడ్డిగారు తను సిద్ధాంత గ్రంథంలో చలంగారి నాటికల, నాటికా సంపుటాల, నాటకాల పేర్లనూ రచనా కాలాలనూ మాత్రమే పేర్కొన్నారు. - చలం నవలల పరిశీలనమే పరిశోధనాంగం కాబట్టి చలం రూపక సాహిత్య విశేష పరిశీలనం ఇందులో లేకపోవడం సహజం. డా|| పి.ఎస్.ఆర్. అప్పారావుగారు తమ 'తెలుగు నాటక వికాసము'లో చలంగారి చిత్రాంగి, శశాంక, జయదేవ, విడాకులు, పురూరవ వంటి నాటకాలనూ, సత్యం శివం సుందరం, పద్మారాణి, కొండడు వంటి నాటికలనూ పరిశీలించినారు.శ్రీ ఎన్. రామచంద్రన్ గారు’చలం – సాహిత్యం సామాజిక దృక్పథం' అనే విషయాన్ని గూర్చి పి.జి. కేంద్రం అనంతపురంలో పరిశోధన చేసి 1981లో సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించినారు. ఈ పరిశోధనా వ్యాసంలో చలంగారి రూపక సాహిత్య విశేష పరిశీలనం జరిగియుండడం సహజం. ఈ వ్యాసాన్ని నేను చూడలేకపోయారని తిరుమలాచార్యులు బాధపడ్డారు.

1979 లో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి సమర్పించిన 'జాషువా కృతుల సమాలోచన' అనే పరిశోధనా వ్యాసంలో డా. బి. భాస్కర చౌదరి గారు జాషువా రచించిన దృశ్యకావ్యాలను గూర్చి చక్కని సమీక్ష చేసినారు. ఈ వ్యాసం 1982 లో ముద్రితమైనది. ఈ గ్రంథంలోని ఐదవ ప్రకరణంలో జాషువా నాటకాల పౌర్వాపర్యాన్నీ అవి ప్రకటితమైన కాలాన్ని నిర్ధారించి చూపినారు. వస్తుభేదాన్ని బట్టి రుక్మిణీ కల్యాణము, చిదానంద ప్రభాతము, ధ్రువవిజయము అనే నాటికలను పౌరాణికాలుగాను, 'వీరాబాయి' నాటికను చారిత్రకంగానూ, 'తెరచాటు'ను సాంఘిక నాటకంగానూ వింగడించి, ఒక్కొక్క నాటకాన్ని గూర్చి క్రమంగా పరిశీలించినారు. నాటక వస్తువునూ, కథామూలాలనూ, నాటకరచనోదేశాలనూ కల్పనలనూ అనుకరణాలనూ ప్రాచ్యవాశ్చాత్యరూపక మర్యాదా సమన్వయాన్నీ పద్యరచనా విశేషాలనూ ఇంకా అనేకమైన అంశాలను గూర్చి చక్కని సమీక్షను నిర్వహించినారు. డా॥ చౌదరిగారు. ఈ ప్రకరణం చివర 'దృశ్యకావ్యాల సమీక్ష'లో జాషువా నాటకాల సామాన్య లక్షణాలను సంగ్రహంగా సూచించినారు. జాషువా దృశ్యకళామూర్తికి డా.చౌదరిగారు. ఈ సిద్ధాంత గ్రంథంలో సముచిత స్థానాన్ని కల్పించి సహృదయులకు సంతృప్తిని కలిగించినారు. 1978 లోనే "జాషువా కృతులు - సంప్రదాయం - నవ్వత" అనే అంశాన్ని మార్చి పరిశోధన చేసి శ్రీ గుదిమెళ్ళ భావ నారాయణాచార్యులుగారు. ఒక సిద్ధాంత వ్యాసాన్ని ఆంధ్ర విశ్వ విద్యాలయానికి సమర్పించినారు. ఈ వ్యాసంలో జాషువా నాటకాలను గూర్చిన పరిశీలన జరిగియుండి ఉంటుంది. కానీ ఆ వ్యాసాన్ని చూసే అవకాశం ఎవరికి కలుగలేదు.

విద్వత్కవులూ బహుశాస్త్ర పారగులూ నవ్యమార్గ ప్రవర్తకులూ అయిన శతావధాని శ్రీ వేలూరి శివ రామశాస్త్రిగారి నాటకాలను గూర్చి చక్కని పరిశీలన చేసినారు దా| జంధ్యాల శంకరయ్య గారు, 1979లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సమర్పించిన "శ్రీ వేలూరి శివరామశాస్త్రి కృతులు - సమీక్ష" అనే సిద్ధాంత వ్యాసంలో. ఈవ్యాసం 1981లో ముద్రితం. ఈ గ్రంథంలోని ఏడవ భాగంలో డా॥ శంకరయ్య గారు శివరామశాస్త్రి గారు రచించిన మాధవవర్మ (ఇదిఆలభ్యమట), ప్రథమ సాంధికుడు, వేతసి, గురుదక్షిణ, ఆరణ్య శేషోన్నయం, సులతానీ అనే ముద్రితాముదిత నాటకాలను పేర్కొని, వాటి ఆనుపూర్విని నిర్ణయించి, ఒక్కొక్క నాటకాన్ని సమీక్షించినారు. రూపకకర్తగా శ్రీశ్రీ గారి అభినవత్వాన్ని, తాత్త్విక హృదయాన్ని, ప్రజ్ఞాపాటవాన్ని చాటినారు శ్రీ శంకరయ్య గారు. శ్రీ అనుమాండ్ల భూమయ్య గారు. 'నాయని సుబ్బారావు కృతులు-పరిశీలన' అనే అంశాన్ని గూర్చి పరిశోధన చేసి ఒక సిద్ధాంత వ్యాసాన్ని 1980 లో కాకతీయ విశ్వవిద్యాలయానికి సమర్పించినారు. ఇది 1981 లో ముద్రితం. ఈ గ్రంథంలోని ఆరవ అధ్యాయం 'పరిశిష్ట రచనలు'లో నాయని సుబ్బారావు గారు ఆకాశవాణి కోసం రచించిన ముప్పైరెండు నాటికల జాబితానూ వాని ప్రసార కాలాన్ని ప్రకటించినారు. వీటిలో పండుగ కట్నం, ఇంద్రధనుస్సు, మహిషాసురమర్ధని, కణ్వాశ్రమం, ప్రజా పరిషత్తు, కుటుంబ గౌరవం (ఇది అసంపూర్ణమట) అనే నాటికలు తమకు శ్రీనాయని వారి వద్ద లభించినట్లు తెలిపి డా॥ భూమయ్య గారు వాటిని సమీక్షించినారు. నాయని వారి నాటికలలోని సంభాషణ చాతురినీ, హాస్యరసపో షణననూ, సామాజికావగాహననూ, సన్నివేశకల్పననూ గూర్చి ఎన్నెన్నో నూత్న విషయాలను ఈ సమీక్షలో వెలువరించి, నాయని వారి నాటిక రచనా ప్రతిభను పరిచయం చేసినారు డా॥భూమయ్య గారు.

                   ఆధునికాంధ్ర సాహిత్య సౌధ నిర్మాతలలో ఒకరైన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారి కృతులను గూర్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి శ్రీమతి ముక్తేవి భారతి గారు 1980 లో 'చిలకమర్తి సాహిత్య సేవ' అనే సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించినారు. ఈ పరిశోధనా వ్యాసంలో డా॥ భారతి గారు చిలకమర్తి వారి రచనలన్నిటిని ప్రక్రియా దృష్టితో వర్గీకరించి పరిశీలించినారు. పది భాగాలుగా సాగిన ఈ వ్యాసంలోని రెండవ భాగంలో చిలకమర్తి వారి నాటకాల సమాలోచనం సమగ్రంగా జరిగింది. గయోపాఖ్యానము, పారిజాతాపహరణము, ప్రసన్నయాదవము, చతుర చంద్రహాసము, కీచకవధ, నల నాటకము, శ్రీరామ జననము వంటి ముద్రితాముద్రిత నాటకాలను స్వతంత్ర నాటకాలుగానూ, స్వప్న వాసవదత్త, ప్రతిమానాటకము, మధ్యమ  వ్యాయోగము దూతవాక్యము వంటి వాటిని అనువాద నాటకాలుగానూ విభజించి, ఒక్కొక్క నాటకాన్ని సమగ్రంగా సమీక్షించి వాని ప్రత్యేకతనూ వైలక్షణ్యాన్ని చాటినారు శ్రీమతి భారతి గారు. గయోపాఖ్యానము నాటకమునకు పంచ సంధులను సమన్వయించి చూపడంలో దా॥ భారతి గారు ప్రదర్శించిన వైదుష్యం ప్రశంసనీయము. నాటక పద్య రచనా శిల్ప విశేషాలన్నింటినో తెలిపినారు ఎనిమిదవ ఆధ్యాయంలో. సంఘ దురాచారాలను ఎత్తిచూపడం కోసం చిలకమర్తి వారు రచించిన బధిర చతుష్టయము ,గయ్యాళి గంగమ్మ, జనాభా నాటకము, అద్భుత కవిత్వము వంటి వాటిని హాస్య ప్రహసనాలుగానూ, వరదక్షిణ, కొందూరి జానకిరామయ్య పెండ్లి, అపూర్వ స్వయంవరము వంటి వాటిని విమర్శనాత్మక ప్రహసనాలుగానూ వింగడించి, ప్రతి ప్రహసనంలోని తత్త్వాన్ని ప్రయోజనాన్ని వివరించినారు. డా॥ భారతిగారు. సంఘ సంస్కరణ కోసం, నీతిబోధ కోసం రచనను సాగించిన చిలకమర్తి వారి రూపక సాహితీ మూర్తిని ఈ సిద్ధాంత వ్యాసంలో సహృదయ హృదయాకర్షకంగా చిత్రించినారు. శ్రీమతి భారతి గారు.

         ప్రత్యేక నాటక గ్రంథపరంగా సాగిన పరిశోధనలో మొదట పేర్కొనదగినది శ్రీ ప్రభాకర్ ఫణిరాజా గారి 'కన్యాశుల్కం - ఒక విమర్శ' అనే సిద్ధాంత వ్యాసం. దీనిని వారు 1980లో బెంగుళూరు విశ్వ విద్యాలయానికి సమర్పించినారు. ఈ కోవకు చెందిన మరో సిద్ధాంతవ్యాసం-'విశ్వనాథవారి త్రిశూలం - విమర్శనాత్మక పరిశీలన'. పి. జ్యోతిగారు కాకతీయ విశ్వవిద్యాలయంలో చేసిన పరిశోధనా ఫలితం ఈ వ్యాసం. చారిత్రకమైన 'త్రిశూలం' నాటకంలో వీరశైవ- అర్షమతాల సంఘర్షణం, ప్రతీకాత్మకమైన పాత్ర చిత్రణం నిర్వహింపబడిన తీరును జ్యోతిగారు. ఈ వ్యాస లో చక్కగాపరిశీలన చేశారు మంగళగిరి ప్రమీలాదేవిగారు. “డా॥ జి. వి. కృష్ణారావు నాటికా సాహిత్య సమాలోచన" అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి ఒక సిద్ధాంత వ్యాసాన్ని 1981లో రచించినారు. ప్రత్యేక నాటక పరంగా సాగిన మరో పరిశోధనా వ్యాసం 'విశ్వనాథవారి నర్తనశాల - ఒక పరిశీలన'. ఆర్. కమలగారు హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో కృషిచేసి 1982 లో సమర్పించిన సిద్ధాంతవ్యాస మిది. తిక్కన చేతిలో కావ్యంలా రూపు దిద్దుకున్న కీచక వృత్తాంతం కవి సమ్రాట్ విశ్వనాథ వారి చేతిలో రమ్యనాటకంగా పాశ్చాత్య విషాద రూపక మర్యాదాలంకృతంగా శిల్పకళా ఖండంగా ఎలా శోభలను వెలార్చిందో ఈ సిద్ధాంత వ్యాసంలో ఆర్. కమల గారు సోపపత్తికంగా నిరూపించినారు.ఆరు అధ్యాయాలుగా అల్లుకుపోయిన ఈ పరిశోధనా వ్యాసంలోని ప్రథమాధ్యాయం. విరాటపర్వము - నర్తనశాల ప్రాముఖ్యము'. మహాభారతంలో విరాటపర్వాని కున్న ప్రాశస్త్యాన్ని, ఆ పర్వంలో నర్తనశాలకున్న ప్రాముఖ్యాన్ని పరిశీలించినారు. ఈ అధ్యాయంలో కమలగారు. నర్తనశాల కథా ఘట్టానికి గర్భసంధిని సాంగంగా సమన్వయించి చూపడంలో కమల గారి పరిశోధనా ప్రజ్ఞ నిగ్గులను వెలార్చింది. ' నాటకముల లో నర్తనశాల' అనే ఆధ్యాయంలో ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు మొదలగు నాటక కర్తలు కథా వస్తువును నాటకంగా నిర్మించిన వైనాన్ని చూపుతూ విశ్వనాథవారి 'నర్తనశాల'లోని సంవిధాన శిల్పంపై వానిలో కానరాదనే సత్యాన్ని నిరూపించినారు. 'నర్తనశాల'లోని వస్తు సంవిధానాన్ని సమీక్షించేది తృతీయాధ్యాయం. నాటకానికి విషాద నాటక స్వభావాన్ని సంతరించడంలో విషాద నాటకానుకూలమైన సంఘర్షణంలో వాతావరణ చిత్రణంలో కెథార్సిస్ లో ప్రతియోగకల్పనంలో సన్నివేశ సంవిధానంలో విశ్వనాథ వారు ప్రదర్శించిన ప్రతిభకు దర్పణం పట్టినారు కమలగారు ఈ అధ్యాయంలో, 'నర్తనశాల, పాత్ర పోషణము' చతుర్థాధ్యాయం. నాటక వస్తువునకు విషాదాంత స్వభావాన్ని కల్పించటానికై విశ్వనాథవారు నాటక పాత్రలలో విషాద పాత్ర స్వభావాన్ని చిత్రించి నూత్నతను ఎలా సాధించినారో సప్రమాణంగా నిరూపించి, పాత్రపోషణలో విశ్వనాథ వైలక్షణ్యాన్నిఎత్తి చూపినారు. 'నర్తనశాల'లోని రచనా శిల్పాన్ని ప్రదర్శిస్తుంది పంచమాధ్యాయం. నర్తనశాల నామాచిత్యం, నాందీ ప్రస్తావనలు, ఐక్యత్రయం, విషాదవాతావరణం, పద్యరచన, అలంకారాలు, జాతీయాలూ, లోకోక్తులూ, మన్మథావస్థలూ మున్నగు అంశాలను సోదాహరణంగా పరిశీలించినారు. ఈ అధ్యాయంలో కమలగారు. విశ్వనాథ వారి విషాదాంత నాటకాలై దింటిలో 'నర్తనశాల' నాయకమణిగా ఎలాభాసిస్తున్నదో నిరూపించేది ఆరవ అధ్యాయం. విశ్వనాథ నాటకరచనా ప్రతిభను ఈ పరిశోధనావ్యాసం చక్కగా నిరూపిస్తున్నది. “కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి నాటకాలలో హేతువాద దృక్పథం" అనే విషయాన్నిగూర్చి హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయంలో పరిశోధనచేసి శ్రీ కొండపల్లి సుదర్శన్ రాజు గారు 1983 లో ఒక సిద్ధాంతవ్యాసాన్ని రచించినారు. మతమౌఢ్యాన్ని సాంఘికాసమానత్వాన్ని నిర్మూలించే ఉద్దేశంతో కలంపట్టిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి కురుక్షేత్ర సంగ్రామం, శంబుక వధ, ఖూనీ అనే నాటకాలను గూర్చి శ్రీ సుదర్శన్ రాజుగారు చక్కని సమీక్ష చేసినారు. ఐదు భాగాలున్న ఈ సిద్ధాంత వ్యాసంలోని మొదటి అధ్యాయంలో హేతువాదానికి లోకాయత చార్వాక నాస్తికాది వాదాలకూ గల సంబంధాన్ని గూర్చి చర్చించినారు. కవిరాజుకూ బెర్నార్డ్ షాకూ గల పోలికలనూ, కవిరాజు నాటకాలలోని సుదీర్ఘ పీఠికలనూ పరిశీలించినారు ద్వితీయాధ్యాయంలో, కవిరాజు నాటకాలలోని భావవిప్లవాన్ని పరిశీలించేది మూడవ అధ్యాయం. కవిరాజు నాటక నిర్మాణ నవ్యతనూ చారిత్రక దృష్టిని సంస్కరణ వాదాన్ని తార్కిక వివేచననూ శాస్త్రీయ దృక్పథాన్ని వివరించినారు శ్రీ సుదర్శన్ రాజుగారు. 'పురాణేతివృత్త హేతువాద నాటకాలు- త్రిపురనేని ప్రభావం' నాల్గన అధ్యాయం. ఇందులో త్రిపురనేనిచేత ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రభావితులైనవారి రచనలు పేర్కొన బడినాయి. వీటిలో నార్లగారి జాణాలి, సీతజోస్యం, ముద్దు కృష్ణగారి ఆశోకం, చలంగారి 'సీత అగ్నిప్రవేశం', జి. వి. కృష్ణారావుగారి భిక్షాపాత్ర, బోయి భీమన్నగారి ఆదికవి వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు పరిశీలించబడినాయి. త్రిపురనేని జీవితము-సాహిత్యము' అనే అధ్యాయంతో ఈ పరిశోధనా వ్యాసం పరిసమాప్తం అయినది.

ఆదిభట్ల నారాయణదాసు, దాసు శ్రీరాములు, దువ్వూరి రామిరెడ్డి, వేటూరి ప్రభాకరశాస్త్రి, కాటూరి వేంకటేశ్వరరావు, తాపీ ధర్మారావు, రాయప్రోలు సుబ్బారావు, గోపీచంద్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, డా॥ సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, బాపురెడ్డి మున్నగువారు విద్వత్కవులు. వీరు శ్రవ్యకావ్యాలతో పాటు దృశ్యకావ్యాలను కూడా రచించినారు. వీరి సాహిత్యజీవితాలను భిన్నభిన్న దృక్పథాలతో సమీక్షిస్తూ వారి తాత్త్వికతను సందర్శిస్తూ అనేక పరిశోధకులు 1978-83 మధ్యకాలంలో ఉస్మానియా, హైదరాబాదు కేంద్ర-నాగార్జున, శ్రీ వేంకటేశ్వర, బెంగుళూరు, కాకతీయ, ఆంధ్ర, మద్రాసు విశ్వవిద్యాలయాలలోనూ అనంతపురం పి.జి. కేంద్రంలోనూ పరిశోధనలు చేసి సిద్ధాంత వ్యాసాలను ఇదివరకే రచించినారు. ఈ సిద్ధాంత వ్యాసాలలో పైన పేర్కొన్న కవుల నాటక సాహిత్య విశేషాలను గూర్చి అనివార్యంగా పరిశీలించియుంటారు పరిశోధకులు. ఆ వ్యాసాలన్నింటిని సందర్శించి సమీక్షించినప్పుడే రూపక పక్రియను గూర్చివ్రాసే ఈ పరిశోధన వ్యాసానికి సమగ్రత చేకూరుతుందనడంలో సందేహం లేదు. అన్ని విశ్వవిద్యాలయాలకు వెళ్ళి, విషయ సేకరణ చేయడం బహు ప్రయాసతో కూడుకున్నకార్యం. ప్రస్తుతం నా వంటివానికి అసాధ్యమైన అంశం కూడా. ఇప్పుడు కాకున్నా మరెప్పుడైనా ఆ సత్కార్యం నెరవేరుతుందని ఆశిస్తున్నాను. తెలుగు భాషా సమితి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థలు " అప్పుడప్పుడు అన్య సాహిత్య ప్రక్రియలతోపాటు నాటక కళా సమీక్షకు సంబంధిం'చిన గ్రంథాల పోటీలను నిర్వహించి ఉత్తమ గ్రంథాలకు బహుమతులను ప్రకటించినాయి. ఇలా బహుమతులను  అందుకున్న నాటక సమీక్ష గ్రంథాలు కూడా పరిశోధనా దృక్పథంతో రచింపబడినవే కాబట్టి నాటక పరిశోధనగూర్చి వ్రాసే ఈ వ్యాస సమగ్రతకోసం వాటిలోని విశేషాలను ఇక్కడ పరిశీలిస్తున్నాను. ఉత్తమనటులూ రచయితలూ అయిన శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారి 'ఆంధ్ర నాటకరంగ చరిత్ర' అనే వ్యాసం 1954-55 లో తెలుగు భాషా సమితివారీ బహుమతిని అందుకున్నది. 1969లో ఈవ్యాసం ముద్రణను పొందింది. ఇరవై ఆరు అధ్యాయాలున్నాయి. ఈ గ్రంథంలో. తరతరాల ఆంధ్ర 'నాటక కళను ఈ గ్రంథం సరళంగా సుందరంగా పరిచయం చేస్తుంది. వివిధ జానపద కళారూపాలనూవాని తీరుతెన్నులనూ సమీక్షించటంలో మికిలినేనిగారు ప్రదర్శించిన పరిజ్ఞానం ప్రశంసాపత్రం. జిల్లాల వారిగా. ఆంధ్రప్రదేశ్ నాటకరంగ విశేషాలనూ కళావికాసంలో ప్రజానాట్యమండలి నిర్వహించిన సముజ్జ్వలపాత్రను ఆంధ్రదేశంలోని నాటక కళా పరిషత్తులు చేసిన కళాసేవనూ ప్రవాసాంధ్రనాటకరంగ విశేషాలనూ ఆంధ్రులు ప్రదర్శించిన హిందీ నాటక విశేషాలనూ పరిశీలించినారు శ్రీ రాధాకృష్ణమూర్తిగారు. ప్రసిద్ధ నాటక రచయితలనూ కళాకారుల జీవితాలనూ తెలుగు సినీమా రంగ పరిణామాన్ని పరిచయం చేసినారు. చతుర్విధాభినయ విశేషాలనూ నట దర్శకులకు ఉండవలసిన లక్షణాలనూ,నాటక సమాజాలూ నాటక కళాకారులు మొదలగున వారు  నిర్వహించవలసిన విధులను వివరించినారు. అంతేకాదు, తెలుగు నాటకరంగంపై రష్యా నాటకాల ప్రభావాన్ని వివిధ భారతీయ భాషలలో నాటక రంగ క్రమ పరిణామాన్ని తెలిపినారు.  ఈ గ్రంథంలోని శైలి పాఠకులను తన వైపు ఆకర్షిస్తుంది. ఉత్తమ నటులైన మిక్కిలనేనివారిని ఈ గ్రంథం ఉత్తమ పరిశోధకులని నిరూపిస్తున్నది. “ఆంధ్రనాటకరంగం క్రమపరిణామ పరిమళాలను ఆఘ్రాణించే జిజ్ఞాసుపులకు ఆమ్లానసుమకదంబం ఈ గ్రంథం" అని ఈ గ్రంథాన్ని గూర్చి పలికిన డా॥ సి. నారాయణరెడ్డిగారి మాటలు అక్షరాలా నిజం.

       1959-60లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 'ఆంధ్ర సారస్వతమునందలి వీరరసము అనే విషయం గూర్చి పోటీ వ్యాసాలను ఆహ్వానించి నారు. డా. జి. వి. సుబ్రహ్మణ్య గారు పరిశోధన వ్యాసాన్ని రచించి బహుమతి నందుకున్నారు. ఆ వ్యాసమే 1961లో 'వీరరసము (ఆంధ్ర సారస్వతము) అనే గ్రంథంగా రూపుదిద్దుకున్నది. ఆంధ్ర సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో వెలసిన గ్రంథాలలో చోటు చేసుకున్న వీరరసాన్ని సందర్శిస్తూ నాటక ప్రక్రియను కూడా పరామర్శించినారు శ్రీ సుబ్రహ్మణ్యంగారు, ఈ గ్రంథంలోని ఎనిమిదవ అధ్యాయం 'నవ్యసాహిత్య స్రవంతులు.. ఇందలి ఐదవ, ఆరవ భాగాలలో నాటకాలలోని, ఏకాంకికలలోని 'వీరరసోల్లాసము'ను సందర్శించి సహృదయులకు ఉల్లాసం కలిగించారు.

తిరుపతి వేంకటకవుల 'పాండవోద్యోగము'లో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి 'బొబ్బిలి యుద్ధము 'లో సంస్కృతానువాదమైన వేటూరి ప్రభాకర శాస్త్రిగారి 'ప్రతిమానాటకము'లో వేదం వేంకటరాయశాస్త్రి గారి 'ప్రతాపరుద్రీయము'లో కాళ్లకూరి నారాయణరావు గారి" వరవిక్రయము'లో ఆచార్య ఆత్రేయగారి "విశ్వశాంతి"లో వీరరసం ఎలా పోషింపబడిందో సోదాహరణంగా వివరించినారు. పై నాటకాలలో ఇతివృత్తాన్ని సూచిస్తూ, పంచ సంధులను సమన్వయిస్తూ,పాత్రల మనస్తత్వాన్ని చిత్రిస్తూ నామౌచిత్యాన్ని పరిశీలిస్తూ తత్త్వాన్ని ప్రపంచిస్తూ  అంగర పాలను వివరిస్తూ ఇవన్నీ వీరరసస్ఫూర్తికి దోహదం చేసిన తీరును సహృదయ రమ్యంగా వివేచించినారు. డా॥ జి. సుబ్రహ్మణ్యంగారు.తెలుగులోని ఏకాంకికల స్వరూప స్వభావాలను వివరిస్తూ ఈ ప్రక్రియారచనలో ప్రతిముడైన భాసుని ఏకాంకికలను తెలిపినారు. భాసుని సంస్కృతానికి అనువాదమైన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి కర్ణభారము. ఏకాంకికలోని యుద్ధవిరాన్ని సోదాహరణంగా పరిశీలించినారు. ఆచార్య ఆత్రేయగారి 'ఎవరు దొంగ'లోని దయాధర్మవీరాలను పరామర్శిస్తూ అందుకు ఉదాహరణ నెత్తిచూపినారు. తాము స్వయంగా రచించిన మానవత్వం' అనే ఏకాంకికలోని ఇతివృత్తాన్నిపాతల మనస్తత్వాలను పరిచయం చేసి అవి దయా ధర్మ వీరరసోన్ముఖంగా ప్రసరించిన వైఖరిని సోదాహరణంగా వివరించినారు.  సుబ్రహ్మణ్యంగారు కావ్యకళామర్మజ్ఞులు. ఈ పరిశోధనా ప్రతిభ బహుముఖమైనది. అందులోని ఒక అంగం నాటక ప్రక్రియపై ప్రసరించి సహృదయులకు సంతృప్తిని కలిగించింది.

           ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1972-73 లో నిర్వహించిన పోటీలో బహుమతి నందుకున్న మరో పరిశోధనా వ్యాసం మంగళగిరి ప్రమీలాదేవిగారి 'తెలుగులో పద్యగేయ నాటికలు'. ఇది 1974 లో ముద్రితం. పద్య గేయనాటికా ప్రక్రియా సమీక్ష లో వెలువడిన ప్రథమగ్రంథం ఇదే. ఇరవై మూడు భాగాలుగా సాగిన ఈ గ్రంథంలో తెలుగులో వెలిసిన పద్యనాటికలను గేయ నాటికలనూ వచన పద్య నాటికలనూ నేపథ్యగేయ నాటికలనూ దొరికినంతమేరకు సమీక్షించినారు. పద్యగేయనాటికా ప్రక్రియలో విశేష కృషి చేసిన శివశంకర స్వామి, నోరి నరసింహ శాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి. మల్లవరపు విశ్వేశ్వరరావు, వావిలాల సోమయాజులు, డా. సి. నారాయణరెడ్డి, డా. బోయి భీమన్న, డా. కె.వి.ఆర్. నరసింహం, చా. యస్వీ జోగారావు, జె. బాపురెడ్డి , డా” నండూరి రామకృష్ణమాచార్య, సూరంపూడి భాస్కరరావు, వింజమూరి శివరామారావు, దర్భా  భాస్కరమ్మగారల పద్యగేయ నాటికలను సమీక్షించినారు. పద్యగేయనాటికం సముజ్జ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ ఈ గ్రంథాన్ని ముగించినారు. ప్రమీలాదేవిగారు. సంగీతంలో చక్కని పరిచయమున్న వారు ప్రమీలా దేవి గారు. వారి ఈ పరిచయం పద్యగేయ నాటికా పరిశీలనలో ప్రస్ఫుటంగా భాసిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారి బహంమతి పొందిన మరో పరిశోధనా వ్యాసం (1977-78) 'సంస్కృత్యభాణసాహిత్యము'. రచయితలు డా. తిప్పాభట్ల రామకృష్ణమూర్తి, శ్రీ సూరం శ్రీనివాసులు గారలు. పదహారు భాగాలుగా విస్తరించిన ఈ గ్రంథంలో ముద్రితాముద్రితభాణాల తీరుతెన్నులను సమీక్షించినారు. నాటకోత్పత్తిని భాణలక్షణాలను సమగ్రంగా పరిశీలించినారు.

ప్రాచీనార్వాచీన -ఆంధ్రుల ఆంధ్రేతరుల భాణాలనూ వాటి రచనా కాలాలను గూర్చి వానిలోని వస్తు రసపాత్రపోషణాదులను గూర్చి వివరించినారు. భాణాలు మధ్యతరగతి ప్రజాజీవనాన్ని ఎలా ప్రతిఫలింపచేస్తున్నవో విశదీకరించినారు. పదిహేనవ ప్రకరణంలో తెలుగులో రచింపబడిన అనువాద-స్వతంత్ర భాణాలను సమీక్షించి పరిశోధనకు సమగ్రతను సమకూర్చినారు. ఈ గ్రంథం రచయితల ఉభయ భాషా వైదుష్యాలనూ పరిశోధనాభినివేశాన్ని చాటుతున్నది.

 

“ఈ పరిశోధనా గ్రంథము భాణములకు సంబంధించిన విజ్ఞాన సర్వస్వమువలె నున్నదనుటలో నతిశయోక్తిలేదు" అన్న ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారి మాటలు ఈ గ్రంథ ప్రాశస్త్యాన్ని చాటుతున్నవి. ఇలా నాటక కళారంగంలో ప్రక్రియాపరంగానూ నాటక కర్తృ సమష్టి సృష్టిపరంగానూ వ్యక్తి పరంగానూ ప్రత్యేక నాటక పరంగానూ వివిధ విశ్వ విద్యాలయాలలో రచింపబడిన పరిశోధనా వ్యాసాలనూ సాహిత్య సంస్థల బహూకృతులందుకున్న పరిశోధనా గ్రంథాలనూ ఇంతవరకు, నాకు దొరికినంతమేరకు, సమీక్షించినాను. ఈ వ్యాసం సమగ్రం కాదు. ఒక ప్రయత్నం మాత్రమే. నిజానికి నాటక పరిశోధనా గ్రంథాలను గూర్చి ఒక పరిశోధనా గ్రంథమే వ్రాయవచ్చునన్నా అతిశయోక్తి కాదు. అట్టి ప్రయత్నం జరుగుతుందని ఆశిస్తున్నాను.

తెలుగు నాటక సాహిత్య పరిశోధనలో తిరుమల శ్రీనివాసాచార్య కొంతమేరకే పరిశీలించారని మరొక తెలుగు నాటక పరిశోధకులు దాసరి సుబ్రహ్మణ్యేశ్వర రావు  వివరంగా తెలిపారు. నాడు నేడు గమనించినట్లయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక నాటకం రాస్తూనే ఉన్నారు కానీ దానిలో సమాజానికి మంచి సందేశం చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పటి నాటకాలు అవార్డులు కోసమే కానీ సమాజంలో మార్పు తెచ్చే సందేశాత్మక నాటకాలు అయితే లేవు.

*****

bottom of page