top of page
Anchor 1

సంపుటి 2  సంచిక 2

వ్యాస​ మధురాలు

మేదిని చేరెను మేని పసలు…

Satyavathi Dinavahi

డాక్టర్ పీ.వీ. రమణ

1954-55 లో నేను ఆరో ఫారం పాసై, అంటే SSC అన్న మాట, ఇంటర్మీడియేటు లో రామకృష్ణ మిషను వారి వివేకానంద కాలేజీ లో చేరాను. SSC బోర్డు పరీక్షలలో నాకు 70% వచ్చినట్లు జ్ఞాపకం. ఒక  పుస్తకమే చేసి ఇచ్చేవారు. అందులో తక్కిన ఐదు ఫారాల మార్కులూ స్కూలు వాళ్ళు రికార్డు చేస్తే, ఆరో ఫారం మాత్రం బోర్డు వాళ్ళు 'ఇండియన్ ఇంకు' లో రాసి ఇచ్చేవాళ్ళు. వయసు, పుట్టిన తేది అన్నీ ఉండేవి. ప్రభుత్వం వారి డాక్యుమెంటు కాబట్టి సర్వత్రా అది చలామణీ అయ్యేది. జీవితాంతం శిధిలపడకుండా దాచుకునేందుకు వీలుగా ఖాకీ గుడ్డ అంటించిన దళసరి కాగితం బైండింగు, లోపల ఆకుపచ్చ దస్తావేజు కాగితాలతో చేసిన పేజీలూ, ఓహ్ అది తెచ్చుకున్న రోజు నాకేదో పెన్నిధి దొరికినట్లూ, నాకే ఒక అస్తిత్వం ఏర్పడినట్లూ, ఒక అనూహ్యమైన అతి సంతోషజనకమైన భావన! ఒక యువకుని జీవితంలో ఒక మనిషిగా గుర్తింపు! నా డిగ్రీ పట్టా కూడా అంత  పకడ్బందీగ లేదు!

 

ఆ రోజులు అతి వేగంగా ఈ జీవితమనే రంగులరాట్నంలో దొర్లుకుపోయాయి. అప్పుడప్పుడనిపిస్తుంది అలాగే ఉండిపోతే ఎంత బాగుండునని! అది సాధ్యమా, కాలం ఎవరి కోసమూ ఆగదు.

 

నేనూ, సత్యం బాల్ బాడ్మింటను తెగ ఆడేవాళ్ళం. పెద్ద టెన్నిస్ కోర్టు సైజు గల కోర్టు, ఊలు తో చేసిన బాలు, ఈ రోజు షటిలు ఆడుకునే బాట్ల వంటివే, బరువూ తయారీ అలాగే ఉండి, ముఖం మాత్రం కొంచెం చిన్నదిగా ఉండే బాట్లు ఉపయోగించే వాళ్ళం. ఈ ఆట షటిలు, బాడ్మింటను వచ్చిన తరువాత కనిపించటం మానేసింది! 

 

నా మేనబావ, అంటే నాన్న గారి ఒక అక్కయ్య కొడుకు, జలసూత్రం రుక్మిణీ నాథ శాస్త్రి అక్కడ దగ్గిర్లోనే ఒక అద్దె ఇంటిలో ఉండేవాడు. ఆలిండియా రేడియోలో ఉద్యోగం. కానీ ఆయన జీతం , ఆయనకున్న కొన్ని ఇష్టాలకి, అన్నిటినీ మించి పుస్తకాలకీ సరిపడేది కాదు. తిండి మానేసేవాడు కానీ, ఇవి మాత్రం తగ్గడానికి వీల్లేదు. ఎప్పుడైనా నాన్న లేకుండా చూసి మధ్యాన్నప్పూట ఇంటికి వచ్చేవాడు. దోసకాయ పప్పూ, ఆవకాయ, గడ్డ పెరుగుతో అమ్మ అడిగడిగి మరీ వడ్డించేది. ఆ సమయంలో ఆయన ప్రశాంతంగా ఉండి  ఎక్కడెక్కడివో శ్లోకాలూ, పద్యాలూ, ఆశువుగా గేయాలూ చెప్పేవాడు, ఓపిగ్గా వినేవారిమి నేనూ, మా అమ్మా!

 

ఆయన మాటల్లో వింత ధ్వనులూ, రాగ తాళ యుక్తంగా అమర్చిన పదవిన్యాసమూ మెరుస్తూ ఉండేవి. 'అత్తయ్యా, నువ్వు పెట్టే ఆవకాయలో ఏ అమృతం కలుపుతావో గాని, ఈ మాటలు నేను ఏదన్నా రాద్దామని కూర్చున్నప్పుడు రావేమిటమ్మా? ఇదేమి చిత్రమో, అన్నరసానికీ, ఆవ ఘాటుకీ, భావోత్పత్తికీ ఏదన్నా సంబంధం ఉందేమో మరి' అని  తృప్తి గా తినేవాడు. 'ఆశుకవులకు ఆకలెక్కువరా' అంటూ నాకేసి చూసేవాడు. అలాంటప్పుడు ఆయన ముఖంలో ఏదో వింత కళ కనిపించేది. అలా ఆయన చెప్పినవి గుర్తుండేవి, గుర్తున్నవి ఆయనకు మళ్ళా గుర్తు చేసే పని మాత్రం నాకు ఒప్పగించేవాడు, ఆయన జ'ఋక్కు'లు, ఊహాగానాలూ  రాసేటప్పుడు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారంటే ఆయనకు పిచ్చి అభిమానం. 'కొన్ని తారాజువ్వలు సూర్యచంద్రుల తేజాన్ని మించినవైనా, మన అనుభవానికి రావురా, అటువంటివాడురా ఆయన; శ్రీపాద వారి రచనలు నేనూ చేయగలను గాని రాసే ధైర్యం లేదురా' అనే వాడు. నేనంటే ఎంతో ప్రేమగా ఉండే వాడు. అప్పట్లో ఆయన విమర్శలూ, ఛెణుకులూ, పేజీకి తక్కువ ఉండే వ్యాసాలూ తప్ప పద్య గ్రంధాలూ, కథానికలూ రాసినట్టు నాకు జ్ఞప్తిలో లేదు. ఎప్పుడైనా నాన్న ఊళ్ళో లేకుండా చూసి ఆయన రూముకు వెళ్ళేవాణ్ని. అప్పుడప్పుడు ఆయన స్నేహ బృందం అంతా  అక్కడే ఉండేది, కొడవటిగంటి వారు, ఆరుద్ర, శ్రీ శ్రీ, వీరే ముఖ్యులు. అక్కడ జరిగే పద విన్యాసం, వ్యుత్పత్తి మీద చర్చలు, ప్రహేళికలు, ఆశు కవితలు, ఒకళ్ళు మొదలెడితే ఇంకొకళ్ళు  చరణం సహంలోనే అందుకుని అదే భావాన్ని వింతగా మార్చి పూరించడం. "మేమీ యుగంలో చెడపుట్టామోయ్, కళ్ళు మూసుకొని ఒక నాలుగు శతాబ్దాలు వెనక్కి మళ్లి, నిన్నే రాయల వార్ని చేస్తే, మేము కవి సార్వభౌములం కామటోయ్, రాజ భోగమంటే ఇలానే ఉంటుంది!" అని వారి వారి అదృష్టం కలిసి రాలేదని ఒక పాలు, గుర్తించితే శతాబ్దాలు నిలిచే కవిత్వం చేయ గల సామర్థ్యం ఉండి  కూడా వృధా పోయినట్లు గుండెలో దిగులు మరొక పాలు మేళవించి వాపోయేవాడు, నా బావ! వినటమే కాని స్పందించే సాహసం నాకు లేదు, మౌనమే ఉచితం.

 

నాన్నగారు ఇంట్లో లేని సమయాల్లో, బాబాయి DL నారాయణ గారింటికి వెళ్ళే వాణ్ని. పది నిమిషాల నడక. వాణీ మహలు ఉన్న సందులో, పెద్ద బంగళా. రెండు మూడు కారులూ, సీమ కుక్కలూ ఉండేవి వాకిట్లో. మొదట భయమేసినా, రాను, రాను అవి నన్ను పసి గట్టి, ఏమీ అనేవి కావు. తోకలాడించుకుంటూ దగ్గరకు వచ్చేవి. గేటు దగ్గర గూర్ఖా దర్వాను ఉండేవాడు. ఇది వేరే సెట్టింగు! అంతా వైభోగమే, సెంటు వాసనలు, రూము కూలింగు, ఫ్యానులు, నౌకర్లను పిలిచేందుకు కరంటు బెల్లులు, పెళ్ళిళ్ళలో వధూవరులకు వేసే సోఫా కుర్చీలు, కూర్చోగానే చల్లని మంచి నీళ్ళు పట్టుకొచ్చి, 'టిఫినేమైనా తీసుకు రానా అబ్బాయి గారూ' అంటూ పలకరించే వంటకత్తే, మీరో తేల్చుకోండి, ఎందుకు వెళ్ళేవాడినో! ఆయన ఉన్నా లేక పోయినా ఎవరో ఒహరు అక్కడ ప్రతి నిత్యమూ ఉండే వారు. పక్క రూములో ఒక చిన్న ప్రొజెక్టరు ఉండేది, ఆయన తీస్తున్న చిత్రానికి 'షెడ్యూలు'  షూటింగు అయిన తరువాత 'రఫ్ఫులు' చూసుకొని, మరునాటికి ఏంచెయ్యాలో నిర్ణయించుకునేందుకు అది ఉపయోగిస్తారుట. ఆ పనికి కూర్చోవాలంటే నారాయణగారు, దర్శకుడు పుల్లయ్యగారు, ఎడిటరు సత్యంగారు ఉండాలిట. మామూలుగా అయితే అర్థ రాత్రి దాటిన తరువాతే సాధారణంగా ఈ పని చేసుకునే వారుట!

 

ఒక రోజు పనీ పాటా లేక, అక్కడికి వెళ్లాను! అక్కడ చూద్దును గదా, బాబాయి, పుల్లయ్యగారు, కూడా అసిస్టెంట్‌గా పని చేస్తున్న పేకేటిగారు ఉన్నారు. పుల్లయ్యగారు పేకేటిని అడుగుతున్నారు "కరటక శాస్త్రి శిష్యుడు పాత్ర  చిత్రంలో ఉన్న ముడి విప్పటానికి కీలకం. సరైన వాడు ఉంటే చూడు, ఇంకా 'పూర్ణమ్మ' పాటకు, 'చిలకా గోరింక' పాటకు   ఆడపిల్లలు కావాలి, పెద్దా చిన్నా ఒక ఫది మంది నైనా పోగు చేయాలోయ్, ఇంతకీ పూర్ణమ్మ రిహార్సలు చేసారా? " బాబాయి నాకేసి చూసి అన్నాడు, 'రమణా, సీత డాన్సు నేర్చుకుంటోంది కదా, ఒక రోజు షూటింగుకు తీసుకెల్దామా'? "నాన్న ఊళ్ళో లేరు, అమ్మకు చెబితే ఔనంటుందేమో" అన్నాన్నేను. అనటమేమిటి, పేకేటి నన్ను యింపాలా కారులో మా యింటికి తీసికెళ్ళి అమ్మ ముందర నిల బెట్టాడు.  "మీరు సినిమా టైటిల్సులో దాని పేరు వెయ్యకుండా ఉంటే, అది చేస్తానంటే, నాకభ్యంతరం లే"దంది  అమ్మ. "వీడి నాన్నగారికి  తెలిస్తే బాగోదు" అని ఇంకో మాట తగిలించింది. సరేనని పేకేటి గారు ఆ మర్నాడే దాన్ని స్టూడియోకి తీసుకువెళ్ళే ప్రోగ్రాము పెట్టారు. దానికి తోడుగా నేను! అలా కన్యాశుల్కం చిత్రీకరణం జరుగుతున్నప్పుడు చూసే అవకాశం వచ్చింది. ఆ రోజు రెండు సీనులు చేసారు. సావిత్రి గారి షెడ్యూలు ఇంకో స్టూడియోలో ఆ రోజు జరక్కపోతే, ఆవిడని హుటా  హుటి పట్టుకొచ్చి 'మహేశం' పాత్రధారికి ఆడపిల్ల వేషం వేసి, మధురవాణి తన కంఠాభరణం ఆ పాత్రధారి మెడలో వేసిన సీను.  అదైపోగానే, గురజాడ వారి గేయం 'పుత్తడి బొమ్మా పూర్ణమ్మ' చిత్రీకరణం  మొదలు పెట్టారు. పాట మొత్తం అది వరకే రికార్డు అయి ఉంటుంది. అది వెనకాల వినబడుతూ ఉంటే పాత్రధారులందరూ వారి వారికి నిర్దేశించిన 'యాక్షను' చేస్తారు, అది రీలుకెక్కించి, కట్టింగు, జాయినుంగు అయిన తరువాత ధ్వని జోడించుతారు. ఆఖరి సీను సెట్టులో ఉన్న వాళ్ళందరి కనులలో  కన్నీటి వర్షం  కురిపించింది:

"కన్నుల కాంతులు కలువల జేరెను

మేదిని చేరెను మేని పసలు

పుంతల  చేరెను నడకల బెడగులు

దుర్గను చేరెను పూర్ణమ్మా .... "

 

గురజాడను తలుచుకోని తెలుగు వాడు ఉంటాడా?

Bio

డాక్టర్ పీ.వీ. రమణ

1991 నుండీ ITM పేరున విద్యాసంస్థలు నడుపుతున్నారు. - అంతకు ముందు

ఆదిత్య బిర్లా సంస్థలకు CEO గ పనిచేసారు. వయసు 76 సం. సతీమణి లలిత.

నచ్చిన పనులు -

గేయాలు, కీర్తనలు వ్రాయటం, సంగీతం పై అభిరుచి వలన మనకు తెలిసిన తెలుగు

శాస్త్రీయ సంగీతం అంతా గురు శిష్య సంవాద రూపేణ అంతర్జాలంలో నిక్షేపించటం

(ప్రస్తుతం 450 కృతులు చేసిన వీరు త్వరలో 800 దాటిన తరువాత వెబ్సైటు

ఉద్ఘాటన చేయనున్నారు), కూచిపూడి, భరత నాట్య కళాకారులను ఆదరించటం ఇత్యాది.

***

Satyavathi Dinavahi
Comments
bottom of page