top of page

మా వాణి ...

మీ "మధురవాణి" త్రై-మాస పత్రిక ప్రథమ వార్షికోత్సవ సంచికను మీ ముంగిట నిలుపుతున్నందుకు ఆనందంతో నిండిన గర్వం ఉప్పొంగుతోంది! గత ఏడాది ఇదే తేదీన (జనవరి 23, 2016) ప్రప్రథమంగా ఈ పత్రికను విడుదల చెయ్యడం నిన్నో మొన్నో జరిగినట్టనిపిస్తున్నది. ఈ సంవత్సర కాలంలో పాఠకులందరి నుండీ అద్భుతమైన స్పందన, ప్రోత్సాహం వచ్చినాయి - అందుకు మీకందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు! అదే స్ఫూర్తి రాబోయే కాలంలో కూడా అవిచ్ఛిన్నంగా సాగుతుందని ఆశిస్తున్నాము! 

***

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ పండుగ సందర్భంగా అమెరికాలో స్థిరపడ్డ మా బోటి వారి సంక్రాంతి మనోభావాలకు ఈ "నాస్టాల్జియా" పద్యం అద్దం పడుతుంది.

 

సీ. గొబ్బెమ్మలను సేయ గోమయార్థంబేగు

         మంచు కోరంగ నా యనుగు చెల్లి  

     హిమవంత ఋతువునందెముకలు కొరికెడు

        చలికి వడకుచు గోశాల కరుగు

     టాదారిఁ గుడి వద్ద హరిదాసు గానమ్ము,

         రథము ముగ్గులఁ దీర్చు రమణిమణులు,

      భోగిమంటల తీర్లు, భూరుహాగ్రములందు 

       శుకపిక సంఘముల కలరవము

 

గీ. లెల్ల మిగిలె స్మృతులుగ నాయుల్లమందు

     పూర్వజన్మ వాసనలు కాబోలునేమొ,    

     స్వప్నమాధుర్యమింకను సమయలేదొ,   

    మకరసంక్రాంతి పండుగ మరలివచ్చె!

***

    పోతే, ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "ఇక తెలుగు మాధ్యమంలో పాఠాలు చెప్పడం ఆపేస్తున్నాము" అని ప్రకటించింది. అది మంచిదని కొందరూ, కాదని కొందరూ పలురకాలుగా స్పందిస్తున్నారు.

    ఈ రోజుల్లో అత్యధిక జనాభా ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారు. దానికి కారణం అందరికీ తెలిసినదే, ఉద్యోగావకాశాలు. తెలుగు మాధ్యమంలో చదివితే ఆధునిక యుగంలో పురోగతికి ఎంతో అవసరమైన ఆంగ్లభాషలో పటుత్వం ఉండదన్నది ఒక వాదం.

    ఒకప్పుడు తెలుగు మాధ్యమంలో చదివినవాళ్ళు ఎంతో మంది ఆంగ్లంలో పై చదువులు చదవడమూ, పెద్ద ఉద్యోగాలు చెయ్యడమూ, శాస్త్రవేత్తలూ, వైద్యులూ, విద్యావేత్తలూ,.... ఇలా భారతదేశంలోనే కాదు పాశ్చాత్య దేశాల్లో కూడా ఉన్నత స్థానాలందుకున్నారన్నది ఒక ప్రతివాదం.

 

    మాధ్యమం ఏదయినా, మనిషి వయస్సు పెరుగుతున్న కొద్దీ చేసే కృషిని బట్టి అతని భవితవ్యం నిర్ణయించబడుతుందనేది నిర్వివాదాంశం. ప్రభుత్వపరంగా ఇటువంటి నిర్ణయం తీసుకొవడం మాత్రం సబబు కాదని, ఇది తెలుగు భాషాపతనానికి మొదటి అడుగేననీ మా విశ్వాసం. అన్ని పాఠ్యాంశాలకు అవసరమైన ఆధునిక పదజాలాన్ని సమీకరించి భాషను మరింత సుసంపన్నం చేయవలసినది పోయి, ఈ చర్య తీసుకోవడం మన భాషాగతికి ఖచ్చితంగా తిరోగమనమే. చైనా, రషియా, జపాన్ వంటి దేశాల్లో కూడా చాలావరకు వారి భాషా మాధ్యమంలోనే చదువులు చెబుతున్నారు, అది వారి పురోగతికి అడ్డు కాలేదు.

    ఆ అధోగమనంలోని తదుపరి మెట్టుగా "తెలుగు భాషను పిల్లలు నేర్చుకోవలసిన అవసరం లేదు, మనం ఇంట్లో నేర్చుకున్న తెలుగు చాలదా? పాఠశాలలో ఆ సమయాన్ని మరింత ఆంగ్లమో, లేక జర్మన్, ఫ్రెంచి వంటి ఇతర పాశ్చాత్య భాషలో నేర్చుకోవడానికి వాడితే మున్ముందు పిల్లలకు ఉపయోగపడతాయి" అని వాదించి, కొన్నేళ్ళలోనో, దశాబ్దాలలోనో పాఠశాలలలో మన భాషను నేర్పడం ఆపడం తథ్యం.

    చిన్న వయసులో నేర్చుకోని భాషను పెద్దయినాక నేర్చుకుంటారా? ఇప్పటికే అరుదు, రాబోవు కాలంలో అసంభవం. ఈ తరంలో ఎంతో మంది పిల్లలూ, పెద్దలూ - ముఖ్యంగా పట్టణాలలో - తెలుగు రాయడం మాత్రమే కాదు, చదవడం రానివారు ఎంతో మంది ఉన్నారు. అందుకు ముఖ్య కారణం పాఠశాలలలో తెలుగు బదులు సంస్కృతం, హిందీ, ప్రత్యేకాంగ్లము (Special English), ఫ్రెంచి వంటి ఇతర భాషలు చదువుకునే వెసులుబాటు ఉండడం.

 

    భారత దేశంలో మన ప్రక్క రాష్ట్రాలలో వారి భాషను ఒక అనివార్య పాఠ్యాంశంగా చెయ్యడం వల్ల అక్కడి పిల్లలు ఆ భాషలను చక్కగా పలకడమూ, చదవడమూ, రాయడమూ కూడా మనం గమనిస్తున్నదే.

 

    ఈ ప్రకటనతో పాటు రాష్ట్ర భాష అయిన తెలుగును అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలోనూ నిర్బంధ బోధనాంశంగా ప్రవేశ పెడుతున్నాం" అని కూడా ప్రకటించి ఆచరణలో పెడితే కొంచెం ఉపశమనం కలిగేది.

 

    మరో వందేళ్ళ తరువాత భాష ఉంటుంది కానీ భాషాపరమైన సృజనాత్మకత, సాహిత్యం, అన్ని కళా రూపాలూ క్షీణదశకి చేరుకుంటాయి. ఆ సమాధికి పునాదులు ఇప్పుడు పడ్డాయి.

 

    క్రొత్తగా జీవిత భాగస్వామిని వచ్చిందనో, వృద్ధాప్యం వచ్చిందనో తల్లిని మూల పడేస్తామా? ఎంతో చక్కగా, ప్రేమగా చూసుకుంటూ, అవసరమైనప్పుడు వైద్యం చేయిస్తూ, ఆమె కలకాలం ఉండాలని మనం కోరుకోవడం మన ఉన్నతికి సోపానం కాదా?

OOO

చిలుకూరి సత్యదేవ్

మధురవాణి నిర్వాహక బృందం

చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు | శాయి రాచకొండ | సుదేష్ పిల్లుట్ల | దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల |  వంగూరి చిట్టెన్ రాజు

bottom of page