
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
మా వాణి ...
నమస్కారం! మధురవాణి.కాం రచనలపోటీకి విశేషంగా స్పందించి వందలాదిగా రచనలని పంపిన రచయితలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు!
తొలి ఉదయపు వేళల్లో బాల భానుని లేత నులివెచ్చని కిరణాలకు మల్లే ఆహ్లాదాన్ని కలిగించే రచనలని పంపిన వారు కొందరయితే...మెలమెల్లగా తీక్షణతని సంతరించుకుంటూ మధ్యాహ్నవేళకల్లా ఉద్ధృతమయ్యే ప్రచండభానుడి ప్రకాశంలోని తీవ్రతలా ఆలోచనలని రేకెత్తించే రచనలు పంపినవారు మరికొందరు! సాయంత్రానికల్లా కెంజాయరంగులోకి మారిన ఆదిత్యుడు అనంత ఆకాశానికి అద్దిన సాత్విక వర్ణాలన్నీ కలబోసుకున్న అన్ని రకాల రచనలనీ చూసాక... తెలుగు సాహిత్యం అక్షయం అనే సత్యం అనుభవంలోకి వచ్చింది...
అవును! తెలుగు సాహిత్యం- అక్షయం... అమేయం... అజేయం... అంతకన్నా అపురూపం!
అలాంటి అక్షయమైన సాహిత్యానికి వేదికలు ఎన్ని ఉన్నా కొత్తవాటినీ ఆదరించే సాహిత్యాభిలాషులూ పెరుగుతూనే ఉన్నారు... అనులోమంగా సాహిత్యమూ సర్వవ్యాప్తమవుతూనే ఉంది. అసలు... ఈ సాహిత్యం బహురూపిణి- వాట్సప్ గ్రూపుల్లో రచయిత పేరుతో సంబంధం లేకుండా ప్రత్యక్షమయ్యే రాతల్లో చమక్కులతో మొహంపై నవ్వు తళుక్కుమనేలా చేస్తుంది. ఫేస్ బుక్కు పేజీల్లో చిన్నచిన్న రాతల్లో, విరుపు లలో దాగి ఆహ్లాదంగా నవ్వుకునేలా చేస్తుంది. అలతి అలతి మాటల్లోనే ఒదిగిపోయి అనంతమైన విజ్ఞానాన్ని గుర్తుండిపోయేలా అందిస్తుంది. సినిమాల్లో మనల్ని నవ్విస్తూ వినబడే సంచులకొద్దీ పంచులలో వినోదాన్నీయటమే కాక, అనుబంధాల్లోని ఆర్ద్రత, ఆపేక్ష, ఆత్మీయతానుబంధం...లాంటి అన్ని సహజ సాధారణ భావాలనీ భాషలో ఇమిడ్చి అసాధారణంగా వ్యక్తీకరిస్తుంది. అంతే కాదు... మన మధురవాణి.కాం లాంటి వెబ్ పత్రికలు ఎన్ని ఉన్నప్పటికీ... అన్నిటిలోనూ కథల, కవితల వ్యాస రూపాల్లో కొలువై విరాజిల్లుతుంది.
పంచుకునే మాధ్యమాలు, ప్రచురించే వేదికలు విరివిగా పెరుగుతుంటే చక్కని నిలిచిపోయే సాహిత్యాన్ని సృష్టించాలని తపించే రచయితలూ, సృజించాలనుకునే ఔత్సాహికులూ పెరుగుతున్నారనేది కాదనలేని సత్యము. తమ రచనలకి అలాంటి ఒక చక్కని వేదికగా... మధురవాణి.కాం ని భావించి ఆత్మీయంగా ఆదరిస్తున్నందుకు ఎందరో సాహితీ బంధువులకి మరోసారి అభివందనాలు!
పోటీకై మాకు అందిన అన్నిరకాల రచనల్లో, చాలావరకూ... చదివించే చక్కని రచనలు ఉండటం ఆనందదాయకం!
న్యాయనిర్ణేతలు అన్ని రచనలనీ చదివి ఉత్తమ, ప్రశంసా బహుమతుల విజేతలను నిర్ణయించారు. ఆ వివరాలను ఇదే సంచికలో పొందుపరిచాము. రచనలని చదివి, వాటిపై అభిప్రాయాలని తెలుపవలిసిందిగా సాహిత్యాభిలాషులని కోరుతున్నాము.
సమయానికి డైరీలో పేజీలు అందిస్తూ... వారి అనుభవాల్లోనించి ఆసక్తికరమైన విషయాలెన్నో మనకి వివరిస్తూ... తనదైన, తనకే సొంతమైన అద్భుత శైలిలో మనందరినీ అలరిస్తున్న గొల్లపూడి గారికి, సినీ ప్రయాణంలోని మలుపులని చక్కగా, సుతిమెత్తగా సాగే సరదా శైలిలో అందిస్తున్న ఆదిత్యగారికీ కృతజతలు!
వచ్చే సంవత్సరం నూతన సంవత్సర సంచికతో కలుద్దాము...

దీప్తి పెండ్యాల
మధురవాణి నిర్వాహక బృందం
చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు | శాయి రాచకొండ | సుదేష్ పిల్లుట్ల | దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల | వంగూరి చిట్టెన్ రాజు