top of page

కథా​ మధురాలు

లక్ష్మి అంతటా ఉంది

 

తమిళ మూలం : ఆర్ చూడామణి
తెలుగు అనువాదం : రంగన్ సుందరేశన్.

Rangan Sudareshan.jpg

ఆర్ చూడామణి (1931 -2010) రాసిన ఈ కథ 45 యేళ్ళ క్రితమే 1978 లో కళైమగల్ పత్రికలో ప్రచురించబడింది. ఈ కథలో ఎపుడూ తమే లోకంగా బతికే తమ తల్లి తనకంటూ ప్రపంచాన్ని ఏర్పరుచుకుంటూంటే ఆ మార్పు కన్నపిల్లలు సైతం త్వరగా జీర్ణించుకోలేకపోవటాన్ని రచయిత్రి ఎంత సహజంగా చూపించారో గమనించండి.

**


అబ్బబ్బా, ఊరి గాలి పడితే చాలు, ఎంత సుఖంగా ఉంది? దానితోబాటు అమ్మ వంటని కలుపుకుంటే స్వర్గమే అనాలి! బొంబాయి జనసమ్మర్ధం నుంచి తప్పించుకొని ఇలాగ సొత ఊరుకి పక్కనేవున్న పరిసరాలకి రావడమే తనకొక మంచి శెలవుకాలమని నిత్యకి అనిపించింది. సురేష్ తనతో వచ్చినా తనకేం బాధ లేదు. అమ్మ వాడిని చూసుకుంటుంది. నాన్నగారు వాడితో ఆడుకుంటారు.  తనకేం బాధ్యత లేదు. పుట్టిల్లులో ఉండే ఒక నెలంతా తనూ ఒక పాపలాగ మారిపోవాలి! తల్లిదండ్రుల ప్రేమాభిమానంలో మునిగి, తేలి, సోమరిగా రోజులు గడపాలనే ఉద్దేశంతోనే నిత్య వచ్చింది. భర్తతో కూడా “నేను ఊరు చేరిన వెంటనే మీకు ఒక ఉత్తరం రాస్తాను. తిరిగి వచ్చేఏపుడు తేదీ తెలియజేయడానికి ఒక ఉత్తరం రాస్తాను. అంతే, మధ్యలో మరేం రాయను. నాకు శెలవంటే ఒక పాపలాగ నా తల్లిదండ్రుల అతిథి సత్కారం అనుభవించడం అన్నమాట!” అని చెప్పి వచ్చింది.'

తండ్రి చొక్కలింగం ఆమెకి స్వాగతం చెప్పడానికి చెన్నై సెంట్రల్ స్టేషన్ కే వచ్చేసారు. “రారా, బాబూ సురేష్, నీకు నేను జ్ఞాపకం ఉన్నానా? నీ తాతనురా, ఇదిగో!” అని వాడికి ఒక మిఠాయి డబ్బా అందించి, మళ్ళీ మళ్ళీ తప్పించుకుపోతున్న్  పిల్లవాడిని ముద్దాడారు. “ప్రయాణం ఎలా ఉందమ్మా? మీ ఆయన కూడా నీతో ఒక పదిరోజులకి రాకూడదా?” అని అతను నిత్యని అభిమానంతో అడిగారు.

“అతనికి శెలవు దొరకలేదు నాన్నగారూ. అసలు అతనికి పల్లెటూరిలో ఎలా ఉంటుంది, చెప్పండి. బోర్ కొట్టుతుంది. నాకు మాత్రం అమ్మా, నాన్న లాలనతో ఒక నెల ఒక నిమిషంగా గడిచిపోతుంది." అంది నిత్య. “మీకూ ఈ పల్లెటూరులో రోజులు గడపడం సులభం కాదే? పదవి విరమణ తరువాత మీరెందుకు పట్టణంలో స్థిరపడకూడదు?” అని అడిగింది.
 
“నాకేం బాధా లేదమ్మా,  నాకు చదవడానికి బోలెడు పుస్తకాలున్నాయి. ఒరేయ్ బాబులూ, నీకు తాతగారి గడ్డం చూస్తే భయంగా ఉందా? ఊరికి వెళ్ళగానే తీసేస్తానులే, భయం వద్దు!” అన్నారు అతను.

“మనం Egmore లో రైలెక్కి కాంచీపురం వెళ్ళాలికదూ? ఆ తరువాత మన గ్రామం వెళ్ళడానికి రైలు, బస్సు ఉన్నాయా? లేకపోతే మనం ఎద్దుల బండిలోనే  సవారి చెయ్యాలా?” అని నిత్య అడిగింది.

చొక్కలింగం నవ్వారు- “భయం వద్దమ్మా, బస్సు ఉంది. ఇక్కడనుంచి మనం తిన్నగా మన ఊరు వెళ్ళడానికి నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను.”

“అలాగైతే మంచిదే. నాన్నగారూ, నన్ను చూడటానికి అమ్మ ఎందుకు రాలేదు?”

“అమ్మకి కొంచెం పని ఉందమ్మా.”

“ఏం పని?”

చొక్కలింగం మరేం అనకుండా కూతురుని ముందు కాఫీ దుకాణంకి పిలుచుకొని వెళ్ళారు.

ఇంటిముందు యెద్దులబండి నుంచి దిగిన వెంటనే నిత్యకి హఠాత్తుగా తనపై స్వేచ్చాగాలులు వీచినట్టు అనిపించింది. పిల్లవాడు సురేష్ కొత్త పరిసరాలు చూసి మురిసిపోయినప్పుడు నిత్యకి నవ్వు వచ్చింది. ఇల్లు చిన్నదే. పెంకుటిల్లయినా ఇరుగుపొరుగులలో ఉన్న తక్కిన పూరిగుడిసెలకి  విరుద్ధంగా కనిపించని సరళత దానికి ఉంది. ఇరుకుగా ఉన్న రావి చెట్లు, చింతచెట్ల మధ్య  ఒక ఆశ్రమంలాంటి స్వరూపం. ఇంటి పక్కనే వెదురు ముళ్ళతో కట్టిన దడి వెనుక కూరగాయల పందిరిలో మొక్కలు, మొలకలు కనిపించాయి. ‘ఇదేంటి, అమ్మ ఇంటిలోనే కూరగాయలు పండించుతోందా? సరేలే, ఇంటి కూరగాయలు, అమ్మ వంట, మరేం కావాలి - భోజనం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది!'

“అమ్మా!” అని పిలుస్తూ నిత్య ముందడుగు వేసే ముందే తల్లి లక్ష్మి ఇంటినుంచి బయటికి వచ్చేసింది.

“రామ్మా నిత్య, బాగున్నావా? ఒరేయ్, బాబులూ!" లక్ష్మి పిల్లవాడిని ఎత్తుకుంది. “అబ్బా, వీడు ఎంత పెద్దవాడైపోయాడు! జీన్స్, చొక్కాయితో ఎంత చోద్యంగా కనిపిస్తున్నాడు! చూసి రెండు సంవత్సరాలయిందిగా, బాగా పెరిగిపోయాడు. ఏమిట్రా అలా చూస్తావ్? నేను నీ అమ్మమ్మరా?  చూడడానికి జాడలో అసలు  అల్లుడుగారే.”   


“అవును, పూర్తిగా వాడికి నాన్నగారి పోలికే!”  అన్నారు చొక్కలింగం.  


“రామ్మా నిత్యా, లోపలికి వెళ్దాం!"  


నిత్య తల్లి వెనుక ఇంటిలోకి నడిచింది. ఎప్పటిలాగే అమ్మ ముఖంలో ప్రేమ, అభిమానం చోటుచేసుకున్నాయి, కాని ఏదో ఒక విధమైన మార్పు కనిపించలేదూ? ఇంతకుముందు అమ్మ చీర, కేశం సవరించుకోకుండా ఇంటిలో అన్ని పనులూ చేసేది. జిడ్డుపడిన మొహంలో చెమట కారుతుంటే, నవ్వుతూ, ‘రా, నీకు దువ్వుతాను.’ అనో లేకపోతే ‘నీకని ఇవాళ అట్లు చేస్తాను’ అని ఏదో చెప్తూ ఉంటుంది. అమ్మని చూస్తే అలాగే కౌగిలించుకోవాలని నిత్యకి ఆతురతగా ఉంటుంది. ఇవాళ అమ్మ ఒక సామాన్య నూలు చీరతో ఉంది. జుత్తుని తేలికగా దువ్వుకుంది. అన్నిటికీ మించి ఆమె ధోరణిలో ఒక పునర్యౌవ్వనం కనిపిస్తోంది. వయస్సు కూడా తగ్గినట్టు భ్రమ. “నేను నీ అమ్మమ్మరా!” అని అన్న స్త్రీ అమ్మమ్మలాగ కనిపించదే? 


“ఇదిగో ముందు కాఫీ, తాగు” అని తల్లి మాటలు విన్న తరువాతనే నిత్య మనసులోని ఆలోచనలు ఆగాయి. కాఫీని అలాగ చేతికి అందించిన అమ్మ ఆ పాత అమ్మే.
 
నిత్య ఒక గుక్కెడు తాగి. “అమ్మా, నీ కాఫీ అద్భుతంగా ఉంది! బొంబాయిలో ఇలాంటి కాఫీ ఎక్కడ దొరుకుతుంది? అవును, కాఫీతో ఎప్పుడూ టిఫిన్ ఉంటుందే? ఇవాళ మరేం టిఫిన్ లేదా?” అని అడిగింది.

 
“ఎందుకు లేదు? ఇవాళ ఇడ్లీలు ఫలాహారం. నేను భోంచేసేసాను. పిండి తయారుగా తీసిపెట్టాను. నాన్నగారు నీకు వంటగదిలో అన్నీ చూపిస్తారు.  నువ్వు అతనికోసం ఇడ్లీలు చేసి, నువ్వూ తిను. పిల్లవాడికి ఇష్టమంటే వాడికీ ఇవ్వు. నూనె, ఇడ్లీపొడి అల్మారాలో ఉన్నాయి. నీకు చట్నీ కావాలా? కొబ్బరికాయ, రుబ్బురోలు పక్కనే ఉన్నాయి. నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళిరావాలి.”

అది విని నిత్య కలవరపడింది. ఏమీ తోచక “అమ్మా, నువ్వు బయటికి వెళ్ళాలా?” అని అడిగింది.

“అవును. ఇవాళ సమాజంలో నేను కుట్టుపని బోధించాలి. నాకు టైమైయింది. నేను తిరిగివచ్చినతరువాత నీకన్నీ వివరంగా చెప్తాను. సరేనా, నువ్వన్నీ చూసుకుంటావా? నేను వస్తాను.” అని చెప్పులు తొడుక్కొని లక్ష్మి గబగబమని బయటికి నడిచింది.

“నాన్నగారూ, ఇదేంటి?” అని నిత్య దిగ్భ్రమతో అడిగింది.
 
“మరేం లేదమ్మా, నీ అమ్మ ఇప్పుడు అందరికీ లక్ష్మిగా ఐపోయింది, అంతే!” అన్నారు అతను, సావధానంగా.

“అంటే?”

“ఇంతకు ముందు మీకందరికి మాత్రం అమ్మ, అవునా? ఇప్పుడు ఆమెకని ఒక కొత్త హోదా లభించింది.”


“ఏదో సమాజంకి వెళ్తున్నట్టు చెప్పింది."


“ఇక్కడ ఊరికి సమీపంలో ఒక మహిళా సమాజం ఉంది.”


“పట్ణంలో ఉన్న Ladies Club లాగ అని అంటున్నారా? మనం చెన్నైలో ఉన్నప్పుడు కూడా అమ్మ ఇంట్లోనే ఉండేది, ఏ Ladies Club కి వెళ్ళనే లేదే? ఇక్కడ ఏమైందని? ఈ కొత్త అలవాటు ఎలా వచ్చింది?”

నాన్నగారు ఆమెని వింతగా చూసారు, ఏమీ అనలేదు.

“ఈ సమాజంలో అమ్మకి ఏం పని?”

“మొదట వలంటీరుగా గా తనకి తెలిసిన పనులు చేసింది. గ్రామంలోని యువతుల ఆరోగ్యంకి నవీన పద్దతులు బోధించేది. శిశువులకని ఆహారం వండేది. చదువురాని వాళ్ళకి ఆదాయం, ఖర్చులు రాసుకోవడానికి సాయం చేసేది, నిర్బంధంలో ఎవరైనా హాస్పిటల్ కి వెళ్ళాలంటే తోడు వెళ్ళడం - ఇలాగ  ఏవేవో చేసేది. కాని ఒక రోజు రెండు అమ్మాయిలు కుట్టుపని క్లాసులో ఏదో చిక్కులో పడినప్పుడు బట్టల కత్తిరింపులో అమ్మ వాళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చింది.” 
“అమ్మకి కుట్టుపని అంత బాగా తెలుసన్నమాట!”


“చూసావా, అది నీకే తెలీదు!  మీ అందరి సంరక్షణ చూడటంలో మునిగిపోయి, అమ్మకి తనకున్న ప్రవీణత గురించి ఏ ప్రజ్ఞా లేకపోయింది కాబోలు!”

నాన్నగారు తన్నూ, తన తోబుట్టువులనీ ఏదో విధంగా తప్పు మోపుతూ, వెటకారం చేస్తున్నారనే భావనతో  నిత్య మొహం ఎర్రబడింది.

“సరే, బట్టల కత్తిరింపులో అమ్మ సాయం చేసింది. ఆ తరువాత?”
 
“అమ్మకి కుట్టుపనిలో ప్రతిభ ఉందని ఆ గ్రామసేవికులు  గుర్తించారు కాబోలు! పంచాయతీ యూవియన్ లో కుట్టుపని నేర్పే ఒక టీచరు అస్వస్థతలో రాజీనామా చేసినప్పుడు మీ అమ్మ గురించి యూనియన్ కమీషనర్ తో వాళ్లు మాటాడారు. ఇప్పుడు ఐదు మాసాలుగా అమ్మ శాశ్వతంగా కుట్టుపని టీచర్ గా పనిచేస్తోంది!”

నిత్య మరేం అనక ఊరుకుంది. తను రాగానే గడపదగ్గరకి వచ్చి స్వాగతం చెప్పిన అమ్మ ఆతురత గురించి ఆలోచించింది. బయటికి తొందరగా ఒక  టీచరుగా వెళ్ళినప్పుడు ఆమెలో అదే ఆతురత, ఉత్సాహం కనిపించలేదూ?


నిత్య మనసులో ఏమని వివరించలేని ఒక నిరాశ చోటుచేసుకుంది. తను బొంబాయినుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది. అమ్మ తనని రమ్మని పిలిచి వెంటనే బయటకి వెళ్ళిపోయిందే? తను పడకలో ఆనుకుంటూ హాయిగా  ముచ్చట మాటలు చెప్పుకుంటూంటే అమ్మ ఇడ్లీలు వడ్డించడానికి బదులు అమ్మ బయటకి వెళ్ళిన తరువాత తనే ఇడ్లీలు చేసుకోవాలట!

“ఏమిటి నిత్య అలా ఆలోచిస్తున్నావ్? నాకు ఆకలేస్తుందినువ్వు . వచ్చి ఇడ్లీలు చేస్తావా? లేకపోతే నేనే చేసి నీకు వడ్డించనా?” అని నాన్నగారు అడిగారు.

నిత్య ఆలోచనల్లోంచి బయటకి వచ్చింది. “వద్దు, నాన్నగారూ,నేను వస్తున్నాను.” అని లేచింది.

మధ్యాహ్నం రెండు గంటలకి లక్ష్మి ఒక స్త్రీతో  ఇంటికి తిరిగి వచ్చింది. 


“ఇది నా కూతురు నిత్య, బొంబాయిలో కాపురం చేస్తోంది. నిత్య, పిల్లవాడు ఎక్కడ? నిద్రపోతున్నాడా? మీ ఇద్దరినీ ఈవిడకి పరిచయం చెయ్యాలని నాతో రమ్మన్నాను. పేరు దేవమణి వేలాయుధం, మా మహిళా సమాజంలో సేవకురాలుగా పనిచేస్తున్నారు. నేను మన ఇంటిలో ఒక తోట వెయ్యాలని ఆలోచించాను.

 

అందుకు ఈవిడ మంచి సలహాలు ఇవ్వగలరని వినగానే నేనే వెళ్ళి కలుసుకున్నాను. మా పరిచయం అలాగే జరిగింది” అని లక్ష్మి ఉత్సాహంతో వివరించింది.

కొత్త స్త్రీకి వయస్సు యాభై, యాభైరెండు ఉండవచ్చు. అమ్మలాంటి వయస్సే, శాంతమైన మొహం. కాని ఆవిడని నమస్కరించిన తరువాతకూడా నిత్య తన తల్లినే చూస్తూవుంది. నిజం చెప్పాలంటే కొత్తగా కనిపించేది తన తల్లే!


“మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం. ఏమండీ లక్ష్మీగారూ, మీకు ఒకే ఒక అమ్మాయా?"

"మాకు ఐదుగురు పిల్లలు - ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు కూతుర్లు. నిత్య ఆఖరిది. మీరు కూర్చోండి.మీకు కొంచెం మజ్జిగ ఇస్తాను. నిత్య, నువ్వూ, నాన్నగారూ భోంచేసారా?”

“అయింది. నువ్వు రావడానికి ఆలస్యం అవుతుందని నాన్నగారు అన్నారు.” 


తల్లి వడ్డించి తను భోజనం చేసే విశేషాధికారాన్ని వచ్చిన రోజే పోగొట్టుకున్నందుకు చిరచిరలాడుతూనే, తన కోపం బయటకి తెలియజేయక, నిత్య మాటాడింది.

లక్ష్మి లోపలికి వెళ్ళింది. దేవమణి లక్ష్మి గురించి నిత్యతో ఉత్సాహంతో మాట్లాడింది: “మీ అమ్మగారుగరించి నీకు గర్వంగా ఉంటుంది కదూ? ఆవిడ ఎంత శ్రద్ధతో సమాజంలో కృషి చేస్తున్నారు! ఆవిడ వచ్చిన తరువాత సమాజంలో కుట్టుపని శిక్షణ తరం బాగా పెరిగిపోయింది. అంతేకాదు, వయోజనవిద్యలోనూ ఆవిడ కలుసుకొని సాయం చేస్తున్నారు. నేనూ, ఆవిడా మంచి స్నేహితులైపోయాం!”


నిత్య పాతరోజులు గుర్తుచేసుకుంది: అమ్మ ఇంట్లో ఉండేది. నిత్య బయటనుంచి తన స్నేహితులతో వచ్చి తల్లికి పరిచయం చేసేది వాళ్ళలో ఒకామె “మిసెస్. చొక్కలింగం, మీ అమ్మాయి రాసిన వ్యాసం చాలా బాగుందండి. ఇవాళ మా క్లాసులో టీచరు దాన్ని బహిరంగంగా చదివారు” అని పొగడేది. కాని, ఇప్పుడో? అంతా తలకిందులుగా కనిపిస్తోంది. 

“ఇదిగో, తాగండి”

లక్ష్మి ఇచ్చిన మజ్జిగని తాగిన తరువాత సేవకురాలు నిత్యతో బొంబాయి గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మి భోజనం చేసి వచ్చిన తరువాత ఆవిడ ఇద్దరిదగ్గర శెలవు తీసుకొని వెళ్లిపోయారు.

“నిత్య, ఇలాగ వచ్చి కూర్చో. పొద్దున్నుంచీ నీతో మాటాడడానికి నాకు సమయం దొరకలేదు!” అంది లక్ష్మి.

“మాటాడడం అలా ఉండనీ. నన్ను చూడడానికే నీకు టైము లేదే?”


లక్ష్మి నవ్వుతూ కూతురు దగ్గర వచ్చి కూర్చుంది. “కొంటె పిల్ల! నేను ఇంటిలో ఉన్నప్పుడు నిన్ను చూడలేదంటున్నావా?”

“ఇంట్లో ఉన్నా ఏం లాభం? నీకు నేనంటే ఇష్టం లేదు. నువ్వూ నాన్నగారితో చెన్నైకి వచ్చి ఎందుకు నాకు స్వాగతం చెప్పలేదు?”

“అది నాకూ ఇష్టమే. కాని ఈ సమాజంలో చేరిన తరువాత నాకు తీరిక లేకుండా పోయింది, నిత్య! ఒక పని చెయ్యాలని పూనుకుంటే దాన్ని సరిగ్గా చెయ్యాలికదా? కాని సభ్యులందరికీ నా శిక్షణపై ఎంత ఆసక్తి చూపిస్తారో తెలుసా? నేను పడుతున్న శ్రమకి అదే నాకు చాలా తృప్తిగా ఉంది. విను, మంగమ్మ అనే ఒక అమ్మాయి - నీ వయస్సే ఉంటుంది - ఎంత త్వరగా ఎంబ్రాయిడరీ నేర్చుకుందో తెలుసా?”

“చాలు, ఇంటికి వచ్చిన తరువాత కూడా అదే పాట! నేను ఎంత దూరం నుంచి వచ్చాను.”

“అందుకే ఇప్పుడు విశ్రాంతిగా నీతో మాటాడతున్నాను! చెప్పు, నిత్య, నువ్వెలాగున్నావ్? అల్లుడుగారు ఎలా ఉన్నారు? పిల్లవాడు సురేష్ చాలా చురుకుగా ఉన్నాడు! వాడు స్కూలుకి వెళ్తున్నాడా?”

నిత్య మనసులో మెల్లమెల్లగా ఆహ్లాదం చోటుచేసుకుంది. అమ్మ తన గురించి, తన కుటుంబం గురించి మాటాడం విని ఆమెకి తృప్తి కలిగింది. సురేష్ నిద్రలేవగానే లక్ష్మి వాడిని ఎత్తుకొని ముద్దాడింది. అమ్మమ్మ, తాతయ్య ఇద్దరూ మనవడి ప్రేమకోసం పోరాడారు. సాయంకాలం నిత్య కొప్పు విప్పుకొని వచ్చి కూర్చున్నప్పుడు లక్ష్మి ఆమెకి తల దువ్వి, జడ అల్లింది. నిత్యకి చాలా తృప్తి కలిగింది. అన్నీ పాతరోజులులాగే ఇంపుగా కనిపిస్తున్నాయే! ‘ఇదే నా అమ్మ!’ అని మనసులో తలపోసుకుంటూ, నిత్య తల్లి ఒడిలో తలబెట్టుకొని కొంచెం సేపు ముద్దాడింది. అమ్మ సురేష్ కి పాలు కాచి ఇచ్చినప్పుడూ, తనకీ, నాన్నగారికి రాత్రి భోజనం వడ్డించినప్పుడూ, నిత్య తృప్తితో తలూపింది.


“ఇంకా కొంచెం వెయ్యనా? నీకెందుకే మొహమాటం?” అని లక్ష్మి మళ్ళీ మళ్లీ కూతుర్ని వడ్డింపులో బుజ్జగించింది. “నువ్వు ఊరుకి తిరిగి వెళ్ళగానే నిన్ను చూసి మీ ఆయన  ‘ఇదెవరు, గుర్తుపట్టలేకున్నాను, బాగా బలిసిపోయిందే!’ అని అనాలి!” ఆ మాటలు విని నిత్య తను ఎదురుచూసిన స్వర్గం తనకి దొరికిందని మురిసిపోయింది.

భోజనం అయినతరువాత ముగ్గురూ ముచ్చటగా ఏవో కబుర్లు చెప్పుకున్నారు. నిత్య తనకి అలసటగా ఉందని నిద్రపోవాలనుకుంది. కాని వెంటనే నిద్ర రాలేదు. వసారాలో తల్లిదండ్రుల సంభాషణ మందంగా వినిపించింది. కొంచెం సేపు వాళ్లు ఆమె గురించి మాటాడుకున్నారు. నిత్యకి అది విని సంతోషం కలిగింది. ఆ తరువాత నాన్నగారు అమ్మని ఆ రోజు మహిళా సమాజంలోని కార్యక్రమాలు, ఘటనలు గురించి అడిగారు. అమ్మ ఇటీవల అతను చెన్నైనుంచి తీసుకొని వచ్చిన పుస్తకాలు, ప్రస్తుతం అతను చదువుతున్న కొత్త పద్యంలో సూక్ష్మభేదాలు గురించి అడిగింది. నిత్యకి ఈ పరివర్తన విని ఒళ్లు మండింది. ఆఖరికి అమ్మ ఆమెని లేపి పాలు అందించిన తరువాత నిత్య ఒకలాగ శాంతించి మళ్ళీ నిద్రపోయింది.


మరుదినం ఉదయం లక్ష్మి అందరికి ఫలహారం ఇచ్చి వంటగదిలో మళ్ళీ పనిచేస్తున్నప్పుడు వీధిలో “లక్ష్మీగారూ!”  అనే పిలుపు వినిపించింది.  
లక్ష్మి రావడానికి ముందే నిత్య తొంగిచూసింది: ఒక ఎనిమిదేళ్ళ  అమ్మాయి చెయిలో ఒక పుస్తకంతో కనిపించింది. “ఏమిటమ్మా, వాసుకీ, ఏమిటి కావాలి?” అని అడుగుతూ లక్ష్మి బయటకి వచ్చింది.


“ఇవాళ మా ఇంట్లో అందరం పెళ్ళికని పొరుగూరుకి వెళ్తున్నాం. అందుకని మీరు ఇప్పుడే నాకు పాఠం నేర్పిస్తారా?” అని ఆ బాల సిగ్గుతో అడిగింది. 
“నేనిప్పుడు పనిలో ఉన్నానే.” అని లక్ష్మి ఒక క్షణం వెనకాడింది. అంతలో చొక్కలింగం “చూడు లక్ష్మీ, పాప ఇంత దూరం పాఠంకోసం వచ్చింది,  వట్టి చేతులతో తిరిగి పంపించవద్దు, దానికి పాఠం నేర్పు. ” అన్నారు. లక్ష్మి చేతులు కడుక్కొని, శృతిపెట్టెతో ముందు వసారాకి వచ్చింది.


“రామ్మా, వాసుకీ. వచ్చి కూర్చో. హంసధ్వని వర్ణం ఇవాళ పూర్తి చేసేద్దాం. ఏదీ, నేను పాఠం నేర్పించినంతవరకూ నువ్వు పాడతావ్ కదూ?”


“ఓ, తప్పకుండా! ”


ఏదీ, పాడు. విందాం!” 


లక్ష్మి శృతిపెట్టె మీటుతుంటే బాలిక తాళం వేసుకొని పాట ఆరంభించింది. రెండు మూడు చోట్ల తల్లి ఆమెను సరిదిద్దింది.


“ఇదేంటి నాన్నగారూ, అమ్మకి సంగీతంలో త్యూషన్ కూడానా?”


“ఉత్తికే ఆశకని పిల్లలు పదిమంది వారంకి మూడుసార్లు వస్తున్నారమ్మా. ఉచితంగానే.” అని భార్య సగంలో ఆపేసిన వంటని కొనసాగిస్తూ అతను మాట్లాడారు.  నిత్య కొంచెం సేపు అతన్ని రెప్పవాల్చకుండా చూసింది. ఉన్నట్టుంది  “అమ్మ ఇలాగ మారడం నాకు నచ్చలేదు!” అని కటువుగా మాట్లాడింది.


“ఎలా మారిపోయింది?”


“భర్తని వంటగదిలో వదిలేసి అమ్మ ఎవరికో సంగీతం నేర్పాలా? ఎందుకీ పనికిరాని పోరులు? మిమ్మల్ని, ఇంటినీ, చూసుకుంటే చాలదా?”

“’కన్న పిల్లల్ని కూడా చూసుకోవాలి’ అని చెప్పు” అని అతని మాటలు విని నిత్య మొహం ఎర్రబారింది. కాని తల్లిలో కనిపించిన ఈ కొత్త మార్పు తనకి నచ్చిందని నిత్య చెప్పలేకపోయింది.

“మీ అమ్మ మీకందరికీ తన బాధ్యతలలో ఏ కొరతా లేకుండా అన్ని పనులూ  చేస్తోంది. అంతకుమించి తన కుటుంబానికి అవతల ఇతరులతో, సమాజంతో, ప్రత్యేకంగా ఆమెకి ఆత్మీయత కావాలంటే అదేం తప్పా?”

“ఏది ఏమైనా అమ్మ తనకని ఇలాంటి బంధం కావాలని మిమ్మల్ని ఇంటి పనులు చెయ్యమని అనడం బాగుందా? నాన్నగారూ, చెప్పండి, మీకిది నచ్చిందా?”

చొక్కలింగం పొయ్యినుంచి కాగుతున్న కంచు కలశంని దించి, దాని ముఖంలో ఒక గుడ్డని కట్టి నీరు ధారగా ప్రవహించే ద్వారం దగ్గర దాన్ని వాల్చి, తలెత్తి, నిత్యని చూసారు. ఒక క్షణం ఆమెను చూసి ఇంగ్లీషులో అన్నారు.


“నాకు ఆత్మగౌరవం ఉందమ్మా. నన్ను నా బానిస, నా నీడ గౌరవించడం కంటే ఒక పరిపూర్ణమైన, స్వశక్తితో రాణించే ఒక వ్యక్తి స్నేహమే నాకు గర్వకారణం.”

నిత్య అతనికి ఏం జవాబు చెప్పాలో తెలియక అలాగే నిలబడిపోయింది.
 
హఠాత్తుగా నాన్నగారు నవ్వసాగారు.

“ఎందుకు నవ్వుతున్నారు?”  అని నిత్య చిరచిరలాడింది.

“మన వృత్తులు, విధులూ ఎలా మారిపోయాయో చూసావా? అందుకే నవ్వాను. నా భార్య నిత్యమూ నాకు మాత్రం చాకిరీ చేసే యంత్రంగా ఉండాలని నేను అనాలి. ‘స్త్రీ ఆడదిగా పుట్టినందుకు ఆమెకి హక్కులంటూ ఏవీ లేవా?’ అని  నువ్వు అడగాలి. కాని ఇక్కడ జరిగేది అంతా తారుమారు! స్త్రీలకి విరోధులు స్త్రీలే!’ అనే లోకోక్తి నిజమే అనిపిస్తోంది. ఏమంటావ్?”


“అవునులెండి, మీకంతా తమాషానే!” అని కసురుకుంటూ నిత్య వసారాకి నడిచింది. అమ్మ వర్ణం ఆఖరి చరణాన్ని అమ్మాయి పుస్తకంలో రాసి, దాన్ని వాసుకికి బోధించుతోంది. అమ్మ కంఠం ఎంత ఇంపుగా ఉంది! అమ్మ పాడుతుందని కూడా ఎవరికీ తెలీదే? కుట్టుపని, సంగీతం, ఇంకా ఎన్నో అమ్మకి తెలుసన్నమాట!

శిక్షణ జరుగుతున్నప్పుడు పిల్లవాడు సురేష్ అక్కడే కూర్చొనివున్నాడు. ఈ అల్లరిపిల్లాడ్కి ఎలాగో అమ్మమ్మతో బాగా చనువు వచ్చేసిందే! ఉదయం నుంచి అమ్మమ్మతో తనకి తెలిసిన తమిళంలో ముచ్చటలు చెప్పుకుంటున్నాడు.

శిక్షణ పూర్తి అవగానే లక్ష్మి శృతిపెట్టెని మూసేసి ఒక మూల భద్రపరచింది. తరువాత సురేష్ ని ఎత్తుకొని తన ఒడిలో ఉంచుకుంది.

“సురేష్, నీకు పాట నచ్చిందా?”

“ఓ! ” అని పిల్లనాడు జోరుగా తలూపాడు.

లక్ష్మి నవ్వుతూ పిల్లవాడిని ఎత్తుకొని తన మొహానికి ఆనించుకుంది. తరువాత ఎదుటవున్న వాసుకిని చూస్తూ “ఇదెవరో తెలుసా? నా మనవడు, బొంబాయినుంచి వచ్చాడు” అని అంది.

పిల్లవాడిని అసూయతో చూసిన ఆ బాలిక “కాని, మీరు నాకు మాత్రం టీచరు, వాడికి కాదు, అవునా?” అని అడిగింది.

శిష్యురాలు పాట విని, తృప్తితో ఆమె బుగ్గని ఒక తట్టు తట్టి బయటికి పంపించిన తరువాత లక్ష్మి లోవలికి రాగానే నిత్య “అమ్మా, నీకు ఈ ఊరులో ఎంత మంచి పేరూ, ప్రఖ్యాతి! నీలో ఇంకా మరెన్ని ప్రతిభలు ఉన్నాయో?” అని పొగడింది.

“ఊరుకోవే, నీకేం పిచ్చా? నాకేం ప్రతిభా లేదు. ఏదో మనకి తెలిసినది నలుగురికి చెప్తే అదేం గొప్పగా చెప్పుకోవాలా?”

“అమ్మా, ఈ పాటలన్నీ నువ్వు నియమం ప్రకారం నేర్చుకున్నావా?”

“ఎప్పుడో నేర్చుకున్న పాటలే! కాని ఇప్పుడు వీళ్ళెవరినీ నేను ఏ పరీక్షలకి పంపించడం లేదే? వాళ్ళకి పాడాలని ఆశగా ఉంది, అందుకు నేను సాయం చెయ్యగలగితే, అది నాకు చాలు! నేను ఇటీవల మద్రాసునుంచి పాట పుస్తకాలు కొని నాకు తెలిసినది కొంచెం మెరుగు పరుచుకున్నాను. త్యాగయ్య, శివన్ కృతులు స్వరపద్ధతితో కొన్నాను. దీక్షితార్ కృతులు మాత్రం దొరకలేదు. భారతియార్, కవిమణి, గోపాలకృష్ణ భారతి - అవన్నీ నా దగ్గర ఉన్నాయి.”

“ఎందుకమ్మా నీకీ శ్రమ?”

“నాకేం శ్రమ? పిల్లలు ఇష్టంగా నేర్చుకుంటూంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ వాసుకిని చూడు. చాలా చురుకైన పిల్ల . పాటలో ఉన్న ఆసక్తి వలన ఇవాళ పొద్దున్నే వచ్చి నేర్చుకుంది. దీనికి ఒక అక్క ఉంది, దాని పేరు కామాక్షి. మద్రాసులో నర్సింగ్ చదువుతోంది, శెలవులకి ఇక్కడ వచ్చినప్పుడల్లా ఆమె కూడా వచ్చి నేర్చుకుంటుంది.”

“సరేలే, అవన్నీ అలాగే ఉండనీ. నాన్నగారు వంట ముగించేసారు. నువ్వు నాకు భోజనం వడ్డిస్తావా?”

“నిత్య, నేను ముందు కుట్టుపని క్లాసుకి వెళ్ళాలే?”

“నేనిక్కడ ఉన్నంతవరకూ నువ్వు శెలవు తీసుకో!”

“బాగుంది! నువ్వేం చంటి పిల్ల కాదు - నేను నిత్యమూ నీతో ఉండడానికి! నా పనులు నేను చూసుకుంటాను, నీతోనూ మాటాడతాను!”

“పోమ్మా, నీకు నేనంటే ప్రేమ లేదు.” 

నాన్నగారితో లక్ష్మి “మీరే వంట పూర్తిగా చేసేసారా? చాలా థ్యాంక్స్” అని చెప్పి, తొందర తొందరగా, కుట్టుపని క్లాసుకి బయలుదేరింది. తరువాత, ఇంటికి తిరిగిరాగానే  కొంచెం సేపు కుటుంబ వ్యవహారాలు నిర్వహించింది. అందరూ కలిసి వ్యాహ్యాళికి పచ్చని పొలాలు చూడడానికి వెళ్ళారు. సాయంకాలం ఏడెనిమిదిగురు పిల్లలు సంగీత శిక్షణకి ఇంటికి వచ్చేసారు. శిక్షణ ముగించి లక్ష్మి లేచివచ్చినప్పుడు రాత్రి ఏడుగంటలైపోయింది.


“అమ్మా, రేపు నీకీ పాట ట్యూషన్ లేదు, అవునా?” అని నిత్య కటువుగా అడిగింది.

“లేదు.”

“మంచి వేళ.”

మరుదినం మధ్యాహ్నం నిత్య తల్లితో “అమ్మా, నాకు ఇవాళ రాత్రి దోసెలు తినాలని ఉంది. నువ్వు బియ్యం, మినప్పప్పు నానపెట్టాలి.” అని అంది.

“ఓ, తప్పకుండా. నీకు దోసెలంటే చాలా ఇష్టంకదూ?

“తిని చాలా రోజులైంది.”

లక్ష్మి దోసెలు చెయ్యడానికి పూనుకుంది. తల్లి తిరగలిని శుభ్రం చెయ్యడం నిత్య తృప్తితో చూసింది. ఆ తరువాత తల్లి “నిత్య, ఇక నువ్వు దోసెలకి పిండి చేసేయ్. నేను బయటికి వెళ్ళాలి. నాకు కొంచెం పని ఉంది” అని చెప్పింది.

“ఇదేంటి, అమ్మా? ‘ట్యూషన్ లేదు’ అని అనగానే నువ్వు ఇవాళ ఫ్రీగా ఉంటావనుకున్నాను. అందుకే దోసెలు కావాలన్నాను.”

“నిత్య, ‘వయోజనవిద్యకి తోడ్పడతాను’ అని నేను మాట ఇచ్చాను. వారంలో రెండు రోజులు - సాయంకాల వేళలో - వెళ్ళాలి. ఇవాళ వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. నేను వెళ్ళనా?”

తల్లి, సొగసుగా ముడి వేసుకొని, ఉతికిన బట్టలలో సామాన్య దుస్తులు ఎంచుకొని, ధరించి, చెయిలో కొన్ని పుస్తకాలతో బయటికి వెళ్ళినప్పుడు నిత్య సహించలేకపోయింది. తిరగలితో పని చేసినప్పుడు ఏడ్పు కూడా వచ్చేసింది. 


పుట్టిల్లులో సుఖానుభవం కోసం తను రావడం, అమ్మ ఉండుండి బయటికి వెళ్ళడం, తను తిరగలితో పెనుగులాడడం - దేవుడా, ఇదేం గొడవ?

నిత్య తన పాతరోజులు గుర్తుచేసుకుంది. మద్రాసులో ఉన్నప్పుడు ఆమె, అన్నదమ్ముళ్ళూ, అక్క చెల్లెళ్ళు ఊరునుంచి వచ్చినప్పుడు ఏ పనీ చేసేవారు కాదు. అన్ని బాధ్యతలు తల్లే నెరవేర్చేది. బయటికి వెళ్ళనే వెళ్ళదు. పిల్లల్ని ఇంట్లో చూసుకోమని ఆమెకి చెప్పి వాళ్ళందరూ సినిమా, షాపింగ్ అని బయలుదేరి బయటికి వెళ్ళిపోయేవారు. రాత్రి పదిగంటలకి తిరిగిరాగానే అమ్మ వాళ్ళకి వేడివేడిగా అన్నం వడ్డించేది. అంతకుముందే పిల్లలు భోంచేసి నిద్రపోయేవారు. వీళ్ళు రాగానే దుస్తులు మార్చుకొని విసిరే కొత్త చీరలూ, నిజార్లూ తీసి, మడిచి, అమ్మ అల్మారాలో సర్దేది. సినిమా రెండవ ఆట చూసి వచ్చినా కూడా అర్ధరాత్రిలో వాళ్ళకి నవ్వుతూ స్వాగతం చెప్పేది. ఆఖరికి ఇన్ని పనులూ చేసిన తరువాత “మీకందరికీ రేపు ఉదయం ఏం టిఫిన్ కావాలి?” అని అడిగి తెలుసుకొని ఒక్కొక్కరికీ ఏది కావాలో అది చేసి వడ్డించేది. తాగడానికి నీళ్ళయినా, కాఫీ అయినా, చేతికే అందించేది.

అమ్మ అంటే అలాగుండాలి! ఇప్పుడు ఎందుకిలా మారిపోయింది!

రాత్రిపూట మనవడికి లక్ష్మి పాలన్నం ఇచ్చిన తరువాత వాడు నిద్రపోయాడు.


ఆ దృశ్యం చూసి నిత్యకి ఓదార్పు కలిగింది. ఆ తరువాత లక్ష్మి నిత్యని, తండ్రినీ, కూర్చోమని చెప్పి దోసెలు వడ్డించింది. “అబ్బా, దోసెలు ఎంత రుచిగా ఉన్నాయి!” అని నిత్య ఉప్పొంగిపోయింది.

“నాకు ఇంకొకటి కావాలమ్మా!” అని నిత్య ఆతురతతో అమ్మని అడిగింది. లక్ష్మి ఆమెకి ఒక దోసె వడ్డించి, తనకీ ఒకటి చేసి పళ్ళెంతో కూతురు పక్కన వచ్చి కూర్చుంది.

“కడుపులో జాగా లేదనిపించింది. ఒక దోసె చాలనుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి కావాలనిపిస్తోంది. నాకు చాలా అలసటగా ఉంది నిత్య, నాకొక దోసె చేస్తావా?” అని లక్ష్మి అడిగింది.
 
నిత్య కోపంతో తల్లిని రెప్పవాల్చకుండా చూసింది: అమ్మకి తను వడ్డించాలట, అంతకన్న మరేం అన్యాయం ఉందా? నిత్య ఈసడింపుతో లేచి వెళ్ళి, ఒక దోసె చేసి, పళ్ళెంలో అమ్మకి వడ్డించింది. “అవును మరి, ఎందుకు అలసటగా ఉండదు? ఇల్లూ, వాకిలీ అని ఉంటే నువ్వూ దృఢంగా ఉండవచ్చు, కాని నీకు మనసులో ‘ఊరులోని అన్ని పనులూ నా బాధ్యత’ అనే ఆరాటం ఉంది. తక్కిన మహిళలు నీలాగ ఉన్నారా? నీకెందుకీ అగత్యం లేని పనులన్నీ?” అని కోపంతో అడిగింది. 


లక్ష్మి కూతురుని ఒక క్షణం తేరిపాఱి చూసింది. తరువాత భర్తకి చెప్పింది: “నేను రేపు దేవమణితో పొరుగు గ్రామంకి వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ వయోజనులకి పాఠం నేర్పించే పద్ధతులగురించి కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి.”

ఈ పదిరోజుల్లో నిత్యకి తల్లి నియమాలు బాగా అలవాటైపోయాయి. క్రమంగా, ఎలాగో, ఓర్పుతో ఆమె దాన్ని ఆమోదించింది. అమ్మ ఆమెతో మాటాడింది. ముద్దులాడింది. వంటతోపాటు వీలయినప్పుడల్లా వడ్డించింది.  ప్రతీ శుక్రవారం నిత్యకి తైల స్నానం తప్పనిసరి. తీరిక దొరికినప్పుడల్లా లక్ష్మి మనవడిని చూసుకుంది. నిత్య అక్కడున్న రెండు ఆదివారాలూ ఆమె తల్లిదండ్రులు నిత్యతో, మనవడితో, కాంచీపురం, తాంబరం లాంటి చోట్లకి వేడుకలకోసం ప్రయాణం చేసారు. కాని రాత్రివేళ నిత్య తల్లి తన పక్కన పడుకున్నప్పుడు, తను బొంబాయి జీవితం గురించి చురుకుగా ఆమెకి చెప్తూంటే లక్ష్మి, “ నిత్య, నీకు తెలుసా, ఆ మంగమ్మ అల్లిన ఒక  ఎంబ్రాయిడరీ టేబుల్ క్లాథ్ ని ఒకతను  ఇవాళ ఇరవై ఐదు రూపాయలకి  కొన్నారు!” అని ఉత్సాహంతో చెప్పగానే నిత్య తన తల్లి అవగాహనలో ఒక కొత్త పరిణామం చోటుచేసుకుందని గ్రహంచి నివ్వెఱపోయింది. ఒక క్షణం ఒక అన్యుఆలినిని చూస్తున్న భ్రమతో తహతహలాడింది.

నిత్య వచ్చిన కొన్ని రోజుల తరువాత తల్లి చెప్పిన మాటలు విని నిత్య బాధ ఇంకా పెరిగింది.

మంగళూరులో నివసించే నిత్య రెండవ అక్కయ్యనుంచి తల్లికి ఒక ఉత్తరం వచ్చింది. ఇద్దరు చంటి పిల్లల్ని చూసుకోవడం తనకి శ్రమగా ఉందని, తల్లి వచ్చి తనతో ఆరు మాసాలు కాపురముంటే బాగుంటుందని ఆమె తన కోరిక తెలియజేసింది.

ఉత్తరం చదివి తల్లి నవ్వుకుంది. “అమ్మా, ఎందుకు నవ్వుతావ్? పాపం అక్కయ్య, ఎంత దుఃఖంతో రాసిందో చూసావా?నువ్వు సాయానికి వెళ్తావుకదూ?” అని నిత్య అడిగింది.

“ఈ సాయానికి ఒక ఆయా చాలు, నేను వెళ్ళనక్కరలేదు.”

“అదేంటమ్మా? జాలి లేకుండా ఇలా మాటాడుతున్నావ్?”

“నిత్య, ఇదిగో విను. ఈ ఇంటికి నా కూతురూ, కొడుకూ, అల్లుడు, కోడలూ, మనవడు, మనవరాలు - ఎవరైనా రావచ్చు. ఇది వాళ్ళ ఇల్లే, నేను వాళ్ళకి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అందరినీ చూసుకుంటాను, వాళ్ళకి అన్నీ చేస్తాను. ఎవరికైనా పెద్ద అపాయం అని వచ్చిందనుకో,  అంతా వదిలేసి వాళ్ళ దగ్గరకి పరుగెట్టాలా, అదీ చేస్తాను. కాని ‘అల్పమైన శ్రమలకి కూడా అమ్మ తప్పకుండా వచ్చి తీరాలి’ అనే ఊహ కలిగితే అందుకు నేను సమ్మతించను. నాకని ఇల్లు లేదా, బాధ్యతలు లేవా? చప్పట్లు వినగానే చటుక్కున వెళ్లి సేవ చెయ్యడానికి నేనేం పనిమనిషా? ఇప్పుడు నీ అక్కయ్య నన్నొక ఆయా గా రావాలంటోంది. ఏం, కూలికి ఒక ఆయా ని పిలవడానికి దానికి త్రాణ లేదా? అమ్మ ఊరికే ఉందని దాని మనసులో ఉంది కాబోలు.” 

నిత్య నిర్ఘాంతపోయింది. ఆ తరువాత రెండు రోజులూ ఎక్కువగా మాటాడక, తల వంచుకొని ఇంటిలో సంచరించింది. తల్లిని అపార్ధం చేసుకున్నందుకు నిత్య బాధపడుతుందని గ్రహించి లక్ష్మి కూతురుని అభిమానంతో ఓదార్చింది.

“నిత్య, విచారం వద్దమ్మా, నేను నిన్ను తప్పుపెట్టను.” 

నిత్య తలెత్తి ఆతురతతో తల్లిని చూసింది. “అంటే నువ్వు ఉత్తినే అన్నావన్నమాట! అక్కయ్యకి సాయం చెయ్యడానికి నువ్వు మంగళూరుకి వెళ్తావు, అవునా?”

లక్ష్మి ఆశ్చర్యంతో ఆమెని తేరిపాఱ చూసింది. ఆ రాత్రి ఆమె భర్తకి కటువుగా చెప్పింది: “పిల్లల అవగాహనలో తల్లి ప్రత్యేకంగా తమ సేవికురాలుగా, బానిసగా స్థిరపడిపోయిందనిపిస్తోంది!”

“పిల్లలు మాత్రం కాదు, లక్ష్మీ! ఇంకొకరిని తన సంబంధపరిధికి ఆవలగా ఒక అన్య వ్యక్తిగా చూడడం ఎంతమందికి సాధ్యం? అదే మనం ఇప్పుడు చూస్తున్నాం,  నువ్వేం బాధ పడకు, నిద్రపో!”  అని అతను అభిమానంతో భార్యని ఓదార్చారు.

ఒక నెల శెలవుల తరువాత నిత్య గ్రామంనుంచి బొంబాయికి  తిరిగు ప్రయాణం ఆరంభించింది. ఈ సారి పుట్టిల్లు దర్శనం ఆమెకి అసంతృప్తిగా  కనిపించింది. నాన్నగారు ఎప్పటిలాగే ఉన్నారు. అమ్మ మాత్రం పూర్తిగా మారిపోయింది! ముందులాగ అమ్మకి తనంటే అభిమానం  లేదా? అభిమానం గురించి ఎటువంటి సందేహమూ లేదు. ఇప్పుడు కూడా నిత్య ఊరుకి బయలుదేరినప్పుడు లక్ష్మి ఆమెకి ప్రియమైన పిండివంటలు బుట్టలు బుట్టలుగా ఇవ్వలేదూ? “ఊరుకి వెళ్ళే సమయం వచ్చేసిందా?” అని పదే పదే హీనస్వరంలో అడుగుతూ నిత్య తలని ప్రేమతో లాలించలేదూ? కాని ఒక మూల నిత్యని అసంతృప్తి ఆవరించుకుందని చెప్పి తీరాలి.
 
చెన్నైలో నిత్య రైలు ప్రయాణంకి నాన్నగారితో అమ్మకూడా వచ్చింది. బండి బయలుదేరేవరకూ లక్ష్మి మనవడిని ఎత్తుకొని నిలబడింది. వాడికి బిస్కట్లు కొని ఇచ్చింది. “నిత్య, ఊరు చేరగానే నాకు ఉత్తరం రాయ్. నువ్వూ, పిల్లవాడు లేకుండా ఇల్లు శూన్యంగా ఉంటుంది.” అని మళ్ళీ మళ్ళీ వాపోయింది. రైలు బండి కదలగానే మనవడిని నిత్యకి అప్పగించింది. “నిత్య, జాగ్రత్తమ్మా. కిటికీ పక్కన కూర్చోవద్దు. బాత్ రూముకి వెళ్ళినప్పుడు పిల్లవాడుని చూసుకో.” అని ఉపదేశాలు వల్లించింది. రైలు బండి కదలసాగింది.


“అమ్మా, వస్తాను. నాన్నగారూ, వస్తాను. సురేష్, అమ్మమ్మకీ, తాతగారికీ, టాటా చెప్పు.” అన్న నిత్య పరుగెడుతున్న రైలుతోబాటు అమ్మ తన వైపుగా పరుగెత్తుకొని రావడం చూసింది. ఎందుకని అమ్మ తనవెంట పరుగెత్తుకొని వస్తోంది?


“నిత్యా, నిత్యా, నేనొకటి చెప్పడం మరిచిపోయానే?”


“ఏమిటమ్మా?”


“బొంబాయిలో చాలా మహిళా పత్రికలుంటాయిగా,  వాటిలో కొత్తగా ఏమైనా ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉంటే కత్తిరించి పంపు.” అని లక్ష్మి బిగ్గరగా అరిచింది. 


*****

bottom of page