top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

కడుపే కైలాసం

 

లక్ష్మీశర్మ త్రిగుళ్ళ

lakshmi-trigulla.jpg

     
కార్తీకమాసం దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పూజారులంతా అర్చనలు అభిషేకాలు చెయ్యటంలో హడావుడిలో మునిగిపోయారు.  అన్ని దేవాలయాల సంగతేమోగానీ, ఈ శివాలయం మాత్రం చాలా  విశిష్టమైనది. 

ఎందుకంటే భక్తులకు కొంగుబంగారంలాగా కోరిన కోరికలు ఈడేరుతాయి. గుడిలో ఆదాయం అంతంత మాత్రమే. పూజారులకు వచ్చేది నామ మాత్రమే.
ఒక్క శివరాత్రికి  ఊరిజనాలందరూ వస్తారు.  ఆ రోజు బ్రహ్మాండంగా జాతరసాగుతుంది. అంతే ఈ ఊరి ప్రజానీకం జన్మకో శివరాత్రి అన్నట్టు, రోజూ ఇలానే ఉంటారేమో అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ఇందులో  పావుమంది కూడా  మళ్ళీ శివరాత్రి వరకు శివాలయానికి వెళ్ళిన పాపానపోరు. ఇక కార్తీకమాసంలో అమ్మలక్కల హంగామా అంతాఇంతా కాదు.  

 

కోడికూతకంటే ముందేలేచి గబగబా పరుగెత్తి  శివుడికి ఇన్ని నీళ్ళుపోసి దీపంవెలిగించాలి. పూజారికంటే ముందుగానే వీళ్ళందరు కలిసి అభిషేకాలు అయిందనిపిస్తారు. ఎందుకంటే మళ్ళీ పూజారివస్తే టికెట్ తీసుకోవాలి. ఇదంతా ఎందుకు పూజారి వచ్చి అభిషేకంచేసే  వరకు  వేచి ఉండాలంటే ఇంటిదగ్గర  పనులన్నీ ఆగిపోతాయి. అందులో నేను ముందంటే నేను ముందన్నట్టు, నాకే  చాలా భక్తి ఉందని  నిరూపించడం కోసం. ఇవన్నీ బాగానే  ఉన్నాయి కానీ!


జనాలు వచ్చేది ఈ కార్తికమాసం కాబట్టి, పూజారికి కొంచెం సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే కదా! నాలుగుడబ్బులు కంటినిండా కనిపిస్తాయి. పాపం అందుకే  చలికి తట్టుకుని అయినా నాలుగు గంటలకేలేచి  భక్తులకు అభిషేకాలు అర్చనలు చేస్తుంటాడు. ఇప్పుడు ఇంత శ్రద్ధగా వచ్చే భక్తులు ఈ మాసం అయిపోయిందంటే  అందరు రానేరారు. ఏ కొద్దిమంది మాత్రమే వస్తారు. వాళ్ళుకూడా ఆఫీసులకు  వెళ్ళే మగవాళ్లు  వెళుతూ  వెళుతూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కొంతమంది ఏదో హడావుడి ఉందన్నట్టు స్నానంచేసి  పైన ఒక కండువా కిందొక కండువా కట్టుకుని వచ్చి వెళ్ళిపోతారు. ఇక  ఆడవాళ్ళు  ఇంట్లో పనంతా చేసుకుని తీరికగా వస్తారు. అప్పటికి దేవాలయం మూసే సమయం అవుతుంది  కానీ, వాళ్ళకోసమని గుడిని   అలానే తెరిచిపెట్టుకుని ఉండాలి. ఇన్నీ చేస్తే హారతి పళ్ళెంలో  ఏమైనా డబ్బులు పడతాయంటే  పదిరూపాయలకు మించిరానేరావు. పోనీ గుడిలో
ఆదాయం తక్కువగా ఉంది  గుడి కమిటీ అయినా పెద్ద జీతం ఇస్తారంటే, వాళ్ళిచ్చే జీతం అయిదువందలు/ అందులోనే  భార్యపిల్లలను చూసుకోవాలి.  ఇల్లు గడుపుకోవాలి  పిల్లలను చదివించుకోవాలి. ఇదండి మామూలు దేవాలయాల పరిస్థితి . ఆగండాగండి  ఇదంతా  మాకెందుకు చెబుతున్నారు అనుకోకండి.

ఎందుకంటే  పాపం అందులో పూజారులు పడుతున్న అవస్థను గమనించాను. వాళ్ళకు ఆశలు ఉంటాయి కదా!  ఆ ఆశలే విశ్వనాథం శర్మను  తట్టిలేపాయి. కాలుకాలిన పిల్లిలా అటుఇటు తిరుగుతున్నాడు తనతోపాటుగా పూజచేస్తున్న విష్ణుశర్మ  కోసం. ఇద్దరు ఈ గుడిలో పూజారులే.  చాలీచాలని  బ్రతుకులు ఎన్నాళ్ళు అనే ఆలోచనలో ఉన్నారు.  కార్తికసోమవారం భక్తులతో రద్దీగా ఉంది గుడి. విష్ణు ఎప్పుడెప్పుడు   బయటకు వస్తాడా!    అని  ఎదురుచూస్తూన్నాడు  విశ్వనాధంశర్మ.

“అబ్బబ్బా, రావయ్యా  విష్ణు , ఎంతసేపటినుండి ఎదిరిచూస్తున్నాను నీకోసం,” అన్నాడు విసుగ్గా.

“ఏమిటి  శర్మ అంత కంగారుగా ఉన్నావు? నీకు  తెలుసుకదా! సోమవారం తొందరగా బయటకురాలేనని విషయం ఏమిటో చెప్పనేలేదు,” అడిగాడు.

“ఇక్కడకాదు  మహానుభావా. అలా రా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాము, గోడలకు చెవులంటాయంటారు  పదపద” అంటూ తొందరచేసాడు.

“ఏమిటోయ్  శర్మ… నీ హడావుడి చూస్తుంటే  నాకేం అర్ధంకావడంలేదు, చెప్పవయ్యా కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి, తొందరగా ఇంటికి వెళ్ళి భోజనంచెయ్యాలి.” నీరసంగా చెప్పాడు విష్ణు.

“ఇదిగో విష్ణు … మనకు  మంచిరోజులు రాబోతున్నాయి,  మా అమ్మకు వేలువిడిచిన మేనమామ మనవడట, అతను  మలేషియాలో ఉంటాడట నిన్న మా ఇంటికి వచ్చాడు,  నన్ను చూసి పాపం ఏమనుకున్నాడో ఏమో! ఎన్నాళ్ళు  ఇలా  ఎదుగుబొదుగులేని  జీవితం  నడిపిస్తావు, హాయిగా నాతోపాటు  మలేసియా వచ్చావంటే  పట్టినంత  డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పాడు. తనకు తెలిసిన రెండు దేవాలయాల్లో పూజారులు కావాలని అడిగారట, నన్ను రమ్మని చెప్పాడు నాకు  నోటమాట రాలేదంటే  నమ్ముతావా విష్ణు” అంటూ చెప్పడం ఆపి  విష్ణు  ముఖంవైపు చూసాడు  ఆనందంతో.

“సరే  శర్మ మంచివిషయమే చెప్పావుగాని … వెళ్ళిరా మరి  సంతోషమే కదా!” ముఖం చిన్నబుచ్చుకుని అన్నాడు  విష్ణు.

“అదేమిటి విష్ణు …  ముఖం అలా  చిన్నబుచ్చుకున్నావు నేను  చెప్పేది మొత్తంవినకుండానే? నేనొక్కడినే  కాదు నాతోపాటుగా  నువ్వు కూడా  వస్తున్నావు, కాకపోతే డబ్బుతో వచ్చింది  సమస్యా. అంత డబ్బు మాదగ్గర లేదు,  మానాన్నను  అడుగుదామంటే  వాళ్ళకే ఏ పూటకాపూట అన్నట్టుగా  ఉంటుంది, పోనీ ఎవరిదగ్గరనైనా  అప్పుచేద్దామంటే  ఏదైనా తాకట్టు పెడితే తప్పా ఇవ్వరు, అంతవిలువైన వస్తువలే మాకులేవాయే, నిన్నటినుండి  లబద్దలుకొట్టుకుంటున్నా కూడా  పైసా పుట్టే మార్గం కనిపించలేదు, సరే నువ్వన్నా వెళతావు కదా అనిపించింది  ఏమంటావు,” అడిగాడు దిగాలుగా శర్మ.

“శర్మా… నువ్వుచెబుతున్నది  నిజమా!అంటే  నాకు కూడా ఆ అవకాశం ఉందా? మరింకెందుకు ఆలస్యం  ఏదో  విధంగా డబ్బులు సమకూర్చుకుందాం, అక్కడికి  వెళ్ళాక  అప్పులన్నా తీరుద్దాము, మా స్నేహితులు  చాలా మందివెళ్ళారు తెలుసా? ఇప్పుడు వాళ్ళందరు  ఎంతపెద్ద శ్రీమంతులు అయ్యారు, ధైర్యం చెయ్యకపోతే  ఎక్కడవేసిన గొంగళి  అక్కడనే అన్నట్టుగా ఉంటుంది,   ఇలాంటి అవకాశాలు రావడమే  గొప్ప.  అందులోనూ  మీ చుట్టాలంటున్నావు  కనుక  ఇక  భయపడవలసిన అవసరం లేనేలేదు” అన్నాడు  ఆనందంపట్టలేక.

“అదేకదా నా బాధ. ఇంతమంచి అవకాశం  మనకు  మళ్ళీ మళ్ళీ రాదు, మనతోపాటే  మన భార్యపిల్లలకు వీసా  ఇప్పిస్తాననీ అన్నాడు, అక్కడికి వచ్చి  ఉద్యోగంలో చేరేంతవరకు  తనదే  బాధ్యత అన్నాడు, గుడివాళ్ళే  డబుల్ బెడ్రూం  ఇల్లు  మంచి జీతం ఇస్తారట, కానీ!  అంతడబ్బు ఎక్కడినుండి తేవాలో అర్థంకావడం లేదు విష్ణు,”  చెప్పాడు శర్మ బాధతో.

“అవునోయ్  శర్మ అన్ని విషయాలు చెబుతున్నావుగానీ  ఇంతకు డబ్బు ఎంతకట్టాలో చెప్పలేదు?” అని అడిగాడు.

“ ఒక్కక్కరికి  మూడు లక్షలైనా అవుతుందట,  తనకొచ్చేది ఏమిలేదట ఏదో  నా పరిస్థితి చూసి బాధనిపించిందట, ఎలాగైనా  నన్ను తీసుకవెళదామనుకుని వాళ్ళను  అడిగితే, మీ చుట్టాలంటున్నావు కదా! అని తగ్గించారట  లేకపోతే  ఐదులక్షలకు తక్కువతీసుకోరట, నాకేమో ఆ మూడులక్షలే కరువైనాయి  ఏం  చెయ్యను చెప్పు, అవునూ  నేనొకమాట అడుగుతాను ఏమీ అనుకోవు కదా?” అన్నాడు  శర్మ బిడియపడుతూ.

“ ఏమిటో చెప్పు నాదగ్గర దాపరికమెందుకు? నాకోసం నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు  నిస్సకోచంగా అడుగు  విష్ణు,” అన్నాడు.

“ అదీ … అది  మీనాన్న నాకోసం ఎక్కడైనా  మూడులక్షలు అప్పుగా ఇప్పిస్తాడేమోనని, ఆహ ఊరికే అవకాశమేమయినా ఉందేమోనని అడుగుతున్నాను ఏమనుకోకు” అంటూ తడబడ్డాడు.

“ చూడు  శర్మ, మనం చాలీచాలని జీతాలతో బ్రతుకును వెళ్ళదీస్తున్నాము అవునా? ఎన్నాళ్ళు కష్టపడినా  మనం ఇంతకంటే  ఎక్కువ సంపాదించలేము, రేపు మన పిల్లలు మనలానే  కష్టపడతారే  తప్పా  మంచి ఉద్యోగాలు చేసి  మనకంటే  మిన్నగా  బ్రతుకుతారని నేను అనుకోలేదు, ఎందుకంటే మనం 
ఇదే  పరిస్థితిలో ఉంటే  మాత్రం  ఇదే జరుగుతుందని  ఖచ్చితంగా చెప్పగలను, మన పిల్లలను పెద్ద చదువులు  చదివించే  స్తోమతలు  మనకులేవు, అందుకని  కలిసివచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోకుండా  ముందడుగు వెయ్యడమే మంచిది, అప్పుచేసైనా  సరే  మనం వెళ్ళావలసిందే,
డబ్బులగురించి నువ్వేమి దిగులుపడకు, నేను మా నాన్నకు చెప్పి ఏదో విధంగా  సమకూర్చమంటాను,” అంటూ   గబగబా వెళ్ళిపోయాడు  విష్ణు.

శర్మకు  నమ్మకం కుదరడంలేదు  విష్ణు మాటలమీద . వాళ్ళ నాన్న తనకంటే డబ్బులు ఇస్తాడుగాని నాకెందుకు  ఇస్తాడు. ఏదో  మాటతుడుపు మాటన్నాడేమో  నేను ఏమైనా అనుకుంటానేమోనని.తనలో తను  బాధపడుతూ  ఇంటికి వెళ్ళాడు.

విష్ణుశర్మకు   మనసులో  ఆనందం పట్టలేకపోతున్నాడు. ఎప్పుడెప్పడు  తండ్రితో  ఈ విషయం చెప్పాలా  అని  ఎదురుచూస్తున్నాడు.  రాత్రి భోజనాలు  అయ్యాక  తండ్రి  నులకమంచం మీద పడుకుని ఉన్నాడు.  మెల్లగా  వెళ్ళాడు తండ్రి  దగ్గరకు  ఎలా  మొదలుపెట్టాలా  అనుకుంటుండగానే .

“ఏమిట్రా? ఏదో  చెప్పడానికి వచ్చినట్టున్నావు? ఏంటి  సంగతి  డబ్బులేమైనా  కావాలా?” అడిగాడు.

“ నాన్నా! నాకు  ఒకమంచి  అవకాశం  వచ్చింది  మీతో  చెప్పడానికి  వచ్చాను,” అంటూ విశ్వనాధంశర్మ  చెప్పిన  విషయాలన్నీ చెప్పాడు.

“ ఓహో, బాగానేవుంది కానీ!  అతడేం  మోసంచెయ్యడు కదా! అంతడబ్బు  తీసుకుని  పని గ్యారంటీగా చేస్తాడు అంటే  ఆలోచిద్దాము, సరేగానీ  ఇంతకు  నీకు  వెళ్ళాలనుందా? నువ్వొక్కడివేనా  నీతోపాటు ఆ శర్మ వస్తున్నాడా? అతను డబ్బులు సమకూర్చుకున్నాడటనా?” ప్రశ్నలమీద ప్రశ్నలు వేసాడు రామనాథశర్మ తండ్రి ప్రభాకరశర్మ.

“అవును  నాన్నా… నాకు  వెళ్ళాలనే  ఉంది, ఎంతకాలం కష్టపడినా  నాలుగుడబ్బులు వేనకేసుకోలేకపోతున్నాము, కొన్నాళ్ళైనా  అక్కడికివెళితే  మన కష్టాలన్నీ గట్టెక్కుతాయని అనుకుంటున్నాను,  నాతోపాటు  విశ్వనాథం కూడా వస్తున్నాడు,  ఇందులో మోసం చెయ్యడానికి ఏమిలేదట, ఎందుకంటే  అతను  వీళ్ళకు  బాగా కావలసిన  వాడట, వీళ్ళ పరిస్థితి చూసి ఆయనకు బాధనిపించి చెప్పాడట, అవకాశం ఉందికదాని  నాపేరు చెప్పాడట” అంటూ చెప్పడం ముగించాడు.

"సరే  మరయితే  రేపొకసారి ఆయనతో  నేను  మాట్లాడుతాను.  డబ్బులగురించి నువ్వేమి దిగులుపడకు, నేనెలాగో  సర్ధుతానులే” అంటూ భరోసా  ఇచ్చాడు కొడుకుకు.

“చాలా  సంతోషం నాన్నా… నాన్నా ఇంకొక విషయం  అడగాలి మిమ్మల్ని” 

“మళ్ళీ ఏమొచ్చిందిరా అనుమానం,” నవ్వుతూ కొడుకువైపు చూస్తూ అన్నాడు.

“అదీ... విశ్వనాథంకు  మీరేమైనా  డబ్బులు సర్ధుతారేమోనని   అడగమన్నాడు, పాపం వాళ్ళు చాలా  చోట్ల ప్రయత్నం చేసారటగాని, ఎక్కడ అంతడబ్బు దొరకడంలేదట  చాలా బాధపడుతున్నాడు. మీరా డబ్బులు గనుక సర్ధారంటే  ఇద్దరం కలిసివెళతాం  ఒకరికొకరం  తోడుగా ఉంటామని అనుకున్నాము,”  అని  చెప్పాడు తండ్రితో.

“సరే రా  … నా ప్రయత్నం నేను  చేస్తాను  మీరేం కంగారుపడకండి,” చెప్పాడు చాలా తాపీగా.


తన ఆనందాన్నంతా  రాత్రి  భార్యతో పంచుకున్నాడు.  మనసు  ఆకాశంలో  ఎగురుతుంది  సంతోషంతో రాత్రంతా  కంటిమీద కునుకులేదు  విష్ణుకు.

 

డబ్బులు సమకూరుతాయో లేదో  నాకు  వెళ్ళే అదృష్టం ఉందోలేదోనని  రాత్రంతా  బాధతో  నిద్రపోదామన్నా కునుకురాలేదు  విశ్వనాధంకు.

అనుకున్నట్టుగానే  మధ్యవర్తి  అయిన సుధాకర్ తో మాట్లాడి  డబ్బులు తయారుచేసాడు ప్రభాకరశర్మ.


విష్ణుశర్మకు, విశ్వనాధంశర్మకు  పట్టపగ్గలులేవు వాళ్ళ ఆనందానికి.  విశ్వనాధం కుటుంబానికి, విష్ణు కుటుంబానికి   పాస్ పోర్టులు అన్నీ తయారుచేయించాడు  సుధకర్. వాళ్ళకు మనం కొంతడబ్బు ఇవ్వాలట. వీసాలు వచ్చాక మిగతావి ఇవ్వమన్నాడు అని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్లాడు సుధాకర్. 

“ చూడు  విశ్వం … మొదటగా  మీరిద్దరు  వెళతారు,  ఎందుకంటే  మీరు  వెళ్ళి ఇల్లు అది చూసుకుని, దేవాలయంలో  ఒకనెల రోజులపాటు  మీరు పూజలు అవీ చేసారనుకో, అప్పుడు మీకు  అన్ని అలవాటైపోతాయి, ఈ లోపల మీ వాళ్ళను  తయారుగా ఉండమని చెప్పండి,  వీసాలు పంపిద్దాము వాళ్ళకు. తొలిసారిగా  విదేశీ  ప్రయాణం  కదా! అందరూ  ఒకేసారంటే  ఇబ్బంది అవుతుంది. నేను  మీకు వీసాలురాగానే వెళ్ళిపోతాను. అక్కడికి  మీరు  ఎయిర్ పోర్టులో  దిగేసరికి  నేను  మిమ్మల్ని కలుసుకుంటాను. తరువాత  మీ వాళ్ళను కూడా  పిలిపించే  బాధ్యతతీసుకుంటాను  ఏమంటారు?” అడిగాడు సుధాకర్.

“అలాగేనండి  మీరేమంటే  అదే, ఎందుకంటే  మా పిల్లలకు అవన్నీ తెలియవు కదా!  వాళ్ళందరిని తీసుకువెళ్ళే బాధ్యత మీదే, అంతేకాదు  వీళ్ళకు ఇంగ్లీషు చదువులుకూడా రావు. దగ్గరుండి అన్ని మీరే చూసుకోవాలి,” చెప్పాడు  విష్ణు వాళ్ళ నాన్న ప్రభాకర్ శర్మ.

“అయ్యో పెద్దవారు మీరంతగా చెప్పాలా, వాళ్ళను నా తమ్ముళ్ళ లాగా చూసుకుంటాను మీరేం దిగులుపడకండి,” అన్నాడు ఎంతో  ధైర్యం చెబుతూ.

అనుకున్న సమయానికి  వీసాలు వచ్చాయి. వాళ్ళకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వమన్నాడు. 


అవి వాళ్ళకు ఇచ్చేసి  నేను వెళ్ళిపోతాను. మీరు అక్కడకు వచ్చాక కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

విష్ణు శర్మ అమ్మానాన్నలకు బెంగగా ఉంది. ఉన్న ఒక్క కొడుకు దూరంగా వెళ్ళిపోతున్నాడు.

రేపు ఏమైనా ఇబ్బంది ఏర్పడితే చూసేవాళ్ళెవరు అని  మనసు పీడిస్తుంది. పోనీలే  మనమేలాగు పెద్దలు సంపాదించిన  ఆస్తులు  ఇవ్వలేకపోయాము. కనీసం వాడి బాగు వాడు చూసుకుంటున్నందుకు సంతోషపడదామనుకుని  మనసు గట్టిచేసుకున్నారు.

“ఓరేయ్  విష్ణు…  నీకో విషయం చెప్పాలి,  నేను  దాచుకున్న డబ్బులన్ని నీకు  నీ స్నేహితుని కోసం ఇచ్చాను,  నువ్వు  అక్కడికి  వెళ్ళాక  మళ్ళీ ఇటు వస్తావోలేదో తెలియదు,  వృద్ధాప్యంలో  మాకు డబ్బులు  కావలసివస్తే  ఎవరిని  అడుగలేము కదా!  అందుకని  నువ్వు వెళ్ళాక  ఒక అరునెలలతరువాత  మెల్ల మెల్లగా మా డబ్బులు మాకు పంపించావంటే,  ముసలితనంలో మాకు ఆసరగా  ఉంటుంది, పైసా కూడబెట్టింది  అందుకోసమేరా  నిన్ను ఇబ్బందిపెట్టకూడదనుకుని అనుకున్నాను, ఆ డబ్బులు నీకు  ఉపయోగపడుతున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ! 
రేపు మా భవిష్యత్ ఏంటి అని  అర్ధంకాక అడిగాను,” అన్నాడు బాధపడుతూ .

“ నాన్నా… మిమ్మల్ని అన్యాయం చేస్తానా?  అక్కడ కొన్నాళ్ళుండి  కొంతడబ్బు సంపాదించుకుని మీ దగ్గరకే  వస్తాను  నాన్న, మిమ్మల్ని ఒంటరిగా వదిలి పోతున్నందుకు నాకు బాధగానే ఉంది, కానీ, తప్పనిసరి పరిస్థితులలో వెళ్ళవలసి  వస్తుంది, మీరన్నట్టుగా  మేము వెళ్ళగానే  ముందు డబ్బులు పంపే ప్రయత్నమే చేస్తాము,” అంటూ తల్లికి తండ్రికి  కాళ్ళకు నమస్కారంచేసి. భార్యపిల్లలను అక్కున చేర్చుకొని, “తొందరలో  మిమ్మల్ని తీసుకవెళతాను  బాధపడకండి, అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకో,” అంటూ  అందరినీ సమాధానపరిచి  బయలుదేరారు విష్ణు శర్మ, విశ్వనాధం శర్మ.

ఏదో కొత్త ప్రపంచానికి  వెళుతున్నట్టుగా  ఏయిర్ పోర్టులోకి వస్తుంటే అనిపించింది ఇద్దరికి.


లైన్ లో నిలబడి అందిరితోపాటుగా  చేతిలో పాస్ పోర్టులు పట్టుకుని నిలబడ్డారు.


ఒక్కొక్కరు  వెళుతున్నారు  వీళ్ళవంతు  వచ్చింది. పోలీస్ వీళ్ళ  పాస్ పోర్ట్ తీసుకుని అర్ధంకానట్టుగా ముఖం ఆశ్చర్యంగా పెట్టి  వీళ్ళిద్దరివైపు  ప్రశ్నార్థకంగా చూసాడు. చూస్తే  స్వచ్చమైన బ్రాహ్మణోత్తములలా ఉన్నారు. పైగా అమాయకులా వీళ్ళు  లేకా  మోసం తలపెట్టినవాళ్ళా అర్ధంకాక , పక్కకు నిలబెట్టాడు ఇద్దరిని. ఎవరికో ఫోన్ చేసాడు  బిలబిలమంటూ పదిమంది పోలీసులువచ్చారు. ఏమి అర్ధంకాక భయపడుతూ  నిలుచున్నారు విష్ణు శర్మ, విశ్వనాధంశర్మ.

“ఏయ్  ఎవరుమీరు? ఎక్కడినుండి వస్తున్నారు? మీ చేతిలో ఉన్నవి నకిలీ  పాస్ పోర్ట్ లు, నకిలీ వీసాలని  మీకు తెలియదా? కావాలనే  ఎవరుచూస్తారు లెమ్మని నకిలీ వీసాలతో  పారిపోదామని చూస్తున్నారా? లేకపోతే  ఎవరైనా  మిమ్మల్ని చేసారా? మీరు నిజం చెప్పలేదనుకొండి మిమ్మల్ని జైల్లో పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టిపిస్తాము, చెప్పండి మీరెవరు  స్మగ్లింగ్ చేసేవాళ్ళా,” చెంపమీద చేడేళ్మని ఒక్కటిచ్చారు ఇద్దరికి. కాళ్ళు చేతులు గజగజవణుకుతున్నాయి నోటమాటరావడంలేదు. కంటినుండి కన్నీళ్లు  గోదావరిలా ఉప్పొంగుతున్నాయి. 

“చెపుతారా లేదా,” అంటూ బెల్ట్ తీసాడు పోలీసు.

రెండుచేతులు జోడించి. “సర్ మాకేం తెలియదు, మాకు  తెలిసినతను  మలేషియాలో  పూజారి కావాలి రమ్మనమని చెప్పి, మా దగ్గరనుండి ఆరు లక్షల రూపాయలు తీసుకుని మమ్మల్ని మోసంచేసాడు, మాకే పాపం తెలియదు, డబ్బుకాశపడి  అతనిమాటలు నమ్మాము, మమ్మల్ని వదిలేయండి మీకు పుణ్యముంటుంది, మాకే  విదేశాలు వద్దు  మాకు వచ్చినదానిలోనే  తృప్తిగా బ్రతుకుతాము సార్,” అంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యారు  ఇద్దరూ.

“ఏమయ్యా … ఎవరిని  పడితే వాళ్ళను నమ్మడమేనా? మీకు  తెలియకపోతే  తెలిసినవాళ్ళను  ఎవరినైనా  అడగాలికదా! ఈ వీసాలు పాస్ పోర్టులు  ఇవన్ని నిజమైనవేనా అని  ఎవరికైనా చూపాలి అని  తెలియదా? ఇంత అమాయకులు  విదేశాలకు పోయి  ఎట్లా బ్రతుకుతారయ్యా? సరే  అయిందేదో
అయిందిగానీ,  ఇంతకు  మిమ్మల్ని  మోసం చేసినతని  పోటోకానీ,  ఫోన్ నెంబరు ఏమైన ఉన్నాయా? వాడు కనుక  మాకు దొరకాలే చిత్రవధ చేస్తాము, మీలాంటి అమాయకులతో ఆడుకుంటాడా,” అంటూ మండిపడ్డాడు పోలీసు.

“మాకు అతని ఫోన్  నెంబరు  ఇచ్చాడు కానీ  అది ఇక్కడే పని చేస్తుందట, అతను  వారం క్రితమే అక్కడికి వెళ్ళిపోయాడు”  తమ దగ్గరున్న ఫోన్ నెంబరు 
తీసి చూపారు.

“ఎక్కడి పిచ్చివాళ్ళయ్యా  మీరు,” అంటూ పకపకనవ్వి. “ఇది  టెలిఫోన్ బూత్ నెంబరు.  వాడెవడో కానీ  మిమ్మల్ని బాగా  మోసంచేసాడు, సరే మీరు  మీ ఇంటికి వెళ్ళండి  మీకేమైనా  అతను గానీ మళ్ళీ ఫోన్ చేస్తే మాకు చెప్పండి. చెయ్యడు కానీ,  ఒకవేళ ఇంకా ఏమైనా డబ్బులు లాగటానికి  ఇంకో ఉపాయం ఏదన్నా చేస్తాడేమో ఎందుకైనా మంచిది, ఇకనుండైనా  ఎవరిని నమ్మకండి,” అన్నాడు పోలీసు.

బ్రతుకు జీవుడా అంటూ  ఇద్దరు బయటకు వచ్చారు. కానీ ఇంటికి  వెళ్ళాలంటే  ముఖాలు చెల్లడంలేదు.

తండ్రికి వృద్దాప్యంలో ఆసరా అవుతాయని  దాచుకున్న డబ్బులను తనవల్ల  పోయాయి అంటే, ఏ ముఖంపెట్టుకుని నాన్న దగ్గరకు వెళ్ళి  ఎలా చెప్పగలను.   ఆయన తట్టుకోగలడా  నన్ను క్షమించగలడా? అర్ధంకానీ  ప్రశ్నలతో  మనసంతా అతలాకుతలం  అయిపోతుంది విష్ణుశర్మకు.

“విష్ణు  ఇక్కడే కూర్చుండిపోయావు  పద  ఇంటికి  వెళదాము” అడిగాడు  విశ్వనాధంశర్మ.

“ లేదు  శర్మ. నాకు  ఇంటికి రావాలనిలేదు. నాన్నకు నా ముఖంచూపెట్టలేను, ఉన్న ఒక్క కొడుకును వాళ్ళను వదిలేసిపోతున్నా, లోలోపల బాధపడుతూ  తన కోసం దాచుకున్న డబ్బులన్నీ  మనకోసం   త్యాగంచేసాడు  మానాన్న. నేను  వెళ్ళాక  తన డబ్బులు తనకు వస్తాయన్న ఆశతో  ఉన్నాడు.  నేను  ఎన్నాళ్ళు  సంపాదిస్తే  వస్తుంది అంతడబ్బు,   నేను  వాళ్ళకు  నా ముఖం చూపెట్టలేను  నాకు  చావే  శరణ్యం, నువ్వు  వెళ్ళు శర్మ,” అంటూ బోరుబోరుమని విలపించాడు.

“విష్ణు, నీకేమన్నా పిచ్చిపట్టిందా?  నువ్వు చేసేది ఏమన్న బాగుందాచెప్పు?  నీదారి  నువ్వు చూసుకుంటానంటే   పెద్దమనుషులు  వాళ్ళేలా  చూస్తారనుకున్నావు  నీ భార్యపిల్లలను, నువ్వు డబ్బులు  పోడగొట్టిందేకాక  వాళ్ళను  ఇంకా ఇబ్బందిలో పెట్టినవాడవవుతావు  తెలుసా? ఏదైనా మన మంచికే  అనుకో,  మన  తల్లి తండ్రులదగ్గర  మనకుండే  అవకాశం  వచ్చినందుకు సంతోషపడు, డబ్బులదేముంది  నువ్వు  వాళ్ళను సంతోషంగా  చూసుకో  సరిపోతుంది,  ఇంకో  విషయం  నాకోసం పెట్టిన  డబ్బులు  నేను  కష్టపడైనా  మీ నాన్నకు  తిరిగి ఇచ్చేబాధ్యత  నాది, నువ్వు వాటిగురించి బాధపడకు,” అంటూ  ఓదార్చి  ఇంటికి  తీసుకువచ్చి  జరిగిన  విషయమంతా  విష్ణు వాళ్ళ నాన్నకు చెప్పాడు.

 

 ముందు కొంచెం  బాధపడిన  తరువాత  సంతోషపడినారు  విష్ణువాళ్ళ అమ్మా నాన్నలు.

“బాబూ విష్ణు …  డబ్బులు పోతేపోనిగానీ  నువ్వు ఇక్కడే ఉన్నావు  చూడు? అదే  మాకు  కోట్ల కోట్ల  ఆనందంగా  ఉంది,  నువ్వే  మాదగ్గర ఉన్నాక  మాకు  డబ్బులతో పనేంటిరా?” అంటూ  ఆప్యాయంగా  కొడుకును  దగ్గరకు  తీసుకున్నాడు  ప్రభాకరంశర్మ. తృప్తిగా  చిన్నపిల్లాడిలా తండ్రి  గుండెలో ఒదిగిపోయాడు విష్ణు.

 

*****
 

bottom of page