MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
కథా మధురాలు
జ్యోత్స్న
సత్యవతి దినవహి
రాజీవ్ రమణిలది ప్రేమ వివాహం. ఇరువురి జీవితంలో చాలాకాలం తరువాత వెలుగులు వెదజల్లుతూ కూతురు జ్యోత్స్న, మరో మూడు సంవత్సరాల తరువాత ఒక కొడుకు వరుణ్ . రాజీవ్ దంపతులకు పిల్లలే పంచ ప్రాణాలు. రాజీవ్ ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజరు. రమణి గణిత శాస్త్రంలో ఉపాధ్యాయిని. పిల్లలతో ఇంటా బయటా నిర్వహించుకోవడం కష్టంగా అనిపించి ఈ మధ్యనే ఉద్యోగవిరమణ చేసింది. ప్రస్తుతం పూర్తి సమయం గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది .
హాలులో జ్యోత్స్న వరుణ్ ని ఆడిస్తుంటే చూసి ఆనందిస్తున్న రమణి పిల్లలిద్దరికీ పాలు కలిపి తెద్దామని వంటగదిలోకి వెళ్లింది. కొంతసేపటికే జ్యోత్స్న పరిగెట్టుకుంటూ వచ్చి “అమ్మా! తమ్ముడు పడిపోయాడు, ఏడుస్తున్నాడు.” అంది చేస్తున్న పని వదిలేసి గబగబా వెళ్ళి చూసిన రమణికి వరుణ్ మోచేయి గీరుకుపోయి కొంచంగా రక్తం కారుతుండటం గమనించి వెంటనే గాయం శుభ్రం చేసి మందు రాసింది .
“బాబూ, ఇటు నావైపు చూడు” అన్న పిలుపుకి వరుణ్ సరిగ్గా స్పందించకపోవడం మొదటిసారిగా గమనించింది రమణి.
ఆ రోజు రాత్రి ఆఫీసునించి ఇంటికి వచ్చాక భోజనాల అనంతరం రాజీవ్ తో ఉదయం జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ “వరుణ్ మునుపటిలా చురుకుగా ఉండటంలేదు గమనించారా?” అని అడిగింది.
అంతకు మునుపే ఈ విషయమై సందేహం కలిగినా తను పొరపాటు పడుతున్నానేమో అనుకున్నాడు రాజీవ్ కానీ ఈ రోజు భార్య కూడా అదే అనటంతో వరుణ్ ఎదుగుదల గురించి ఇరువురికీ అనుమానం పొడచూపింది. ఇంక ఆలస్యం చేయటం మంచిది కాదనుకుని బాబుని తీసుకుని చిన్న పిల్లల వైద్యులు డాక్టర్. పుష్పాంజలిని సంప్రదించారు.
ఆవిడ వరుణ్ ని పరీక్ష చేసి “బాబుని ఒకసారి డాక్టర్. రావుగారుకి చూపించండి” అని సలహా ఇచ్చారు. డాక్టర్ రావు పేరు మోసిన న్యూరాలజిష్టు. ఆయన క్లినిక్ లో ముందుగానే మాట్లాడుకుని స్థిరపరుచుకున్న సమయానికి పిల్లలను తీసుకుని వెళ్ళారు రాజీవ్ , రమణి.
తండ్రి ఒడిలో కూర్చుని తననే గమనిస్తున్న పాపను చూసి డాక్టర్ రావుగారు “మీ అమ్మాయా?” అని “నీ పేరేమిటమ్మా?” అని అడిగారు .
‘జోత్తన’ అంటూ పాప చెప్పిన సమాధానం విని ఆయన అర్థం కానట్లు రాజీవ్ కేసి చూడగా అతను “పాప పేరు జ్యోత్స్న డాక్టర్” అన్నాడు. ఆ వయసులో తన పేరుని ఉచ్ఛరించటానికి సరిగ్గా నోరు తిరగక పాప ముద్దుగా పలికిన తీరు చూసి ఆయన ఎంతో మురిసిపోయారు. అనంతరం వరుణ్ గురించి వివరాలు కనుక్కుని బాబుని పరీక్షచేయసాగారు. డాక్టర్ పరీక్ష చేస్తున్నప్పుడు భయంతో వరుణ్ ఏడుస్తుంటే జ్యోత్స్న తండ్రిని గట్టిగా కౌగలించుకుని బిక్కముఖం వేసుకుంది. భయపడకు అన్నట్లుగా జ్యోత్స్నని పొదివి పట్టుకుని ‘ఎప్పుడూ ఇంతే, తమ్ముడికి ఇసుమంత బాధ కలిగినా బిక్కముఖం వేసుకుంటుంది’ అనుకున్నాడు రాజీవ్.
అనంతరం వరుణ్ కి కొన్ని ప్రత్యేక పరీక్షలు జరిపించమని కాగితంపై వ్రాసి ఇచ్చి రిపోర్టులు తీసుకుని రమ్మని రాజీవ్ తో చెప్పారు డాక్టర్. కొంతసేపటి తరువాత రాజీవ్ తెచ్చిన రిపోర్టులను పరిశీలించగా వరుణ్ మెదడు ఎదుగుదల వాడి వయసుకి అనుగుణంగా లేదని తెలిసింది. అదే విషయం బాబు తల్లిదండ్రులకి తెలియజేశారు ఆయన.
అది విని హతాశులైన రాజీవ్ దంపతులు ఖిన్నవదనులై కొంతసేపు మిన్నకుండిపోయారు. వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నట్లుగా డాక్టర్ గారు కూడా మౌనంగా ఉండిపోయారు. ఇంకో వైపు ఏం జరుగుతోందో అర్థంగాక అయోమయంగా చూడసాగింది జ్యోత్స్న.
రాజీవ్, రమణి కొంతసేపటికి తేరుకుని వరుణ్ కి ఈ స్థితి కలగడానికి కారణమేమిటని డాక్టర్ ని ప్రశ్నించగా ఒక్కొక్క సారి జన్యు లోపం వల్ల కానీ లేదా గర్భవతిగా ఉన్న స్త్రీ డాక్టర్ ని సంప్రదించకుండా ఏమైనా మాత్రలు తీసుకుని ఉంటే అవి వికటించి లోపల ఉన్న బిడ్డ పైన దుష్ప్రభావాన్ని చూపటంవల్ల కానీ ఇలా పిల్లలు ఏదో ఒక వైకల్యంతో పుట్టడంగాని లేదా పుట్టిన కొంతకాలం తరువాత అలాంటి లక్షణాలు బయటపడటం కానీ జరుగుతుంది అన్నారు ఆయన.
మీ విషయంలో సరైన కారణం నిర్థారణ చేయాలంటే మీరిరువురూ కూడా కొన్ని పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. ఆ రిపోర్టులు పరిశీలించిన అనంతరం మరింత స్పష్టంగా తెలియగలదు అంటూ ఒక కాగితంపై చేయించుకోవలసిన పరీక్షల జాబితా వ్రాసి ఇచ్చారు.
“అలాగే జ్యోత్స్నకు కూడా ఈ పరీక్షలు చేయించండి” అన్నారు ఇంకో కాగితం వాళ్ళ చేతికి ఇస్తూ.
జ్యోత్స్నకు ఎందుకు పరీక్షలు చేయించాలో రాజీవ్ దంపతులకు అర్థంకానప్పటికీ అడగడానికి జంకారు. ఏదో కారణం లేనిదే ఆయన అలా చెప్పరని తమని తాము సమాధానపరుచుకున్నారు. ముగ్గురు అన్ని పరీక్షలు చేయించుకుని రెండురోజుల అనంతరం రిపోర్టులు తీసుకుని తిరిగి డా. రావుగారి వద్దకు వెళ్లారు.
వరుసగా అందరి రిపోర్టులు పరిశీలిస్తుండగా జ్యోత్స్న రిపోర్టులు చూసి ఆయన భృకుటి ముడిపడటం మధ్యలో ఒకసారి తలెత్తి తమకేసి, జ్యోత్స్నకేసి చూడటం గమనించిన రాజీవ్ రమణి ముఖాముఖాలు చూసుకున్నారు !!!!!
“మీ బాబుకి ఈ స్థితి కలగడానికి మీ జన్యువులలో లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఫలితంగా బాబుకి శారీరక ఎదుగుదలకి అనుగుణంగా మెదడు వృద్ధిచెందక బుద్ధిమాంద్యత కలిగి ఉండే అవకాశం ఉంది.” అని డాక్టర్ గారు చెప్పిన విషయం విన్నాక దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూ కుప్పకూలిపోయింది రమణి. రాజీవ్ దీ దాదాపు అదే పరిస్థితి.
వరుణ్ విషయంలో ఇకపై తీసుకోవలసిన జాగ్రత్తలు, వాడవలసిన మందులు డాక్టరుగారు చెప్పగా తెలుసుకుని ఇంటికి వచ్చేశారు. ఆ రోజునించీ మునుపటికంటే ఎంతో శ్రద్ధగా వరుణ్ ని కంటికి రెప్పలా కాపాడుకోసాగారు రాజీవ్ , రమణి.
ఒకనాడు తమ్ముడిని ఆడిస్తూ “అమ్మా ! తమ్ముడు ఎందుకమ్మా అలా ఉన్నాడు? నాతో కలిసి ఎందుకు సరిగ్గా ఆడుకోవడంలేదు?” అంటూ అమాయకంగా ప్రశ్నించిన జ్యోత్స్నకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు రమణికి. చెప్పినా అర్థం చేసుకునేంత వయసు ఇంకా రాలేదు కూతురికి అనుకుని అప్పటికి మాత్రం “తమ్ముడికి ఒంట్లో బాగుండటంలేదమ్మా” అని చెప్పి ఊరుకుంది. తల్లి ముఖంలో ఏ భావం చూసిందో ఏమో జ్యోత్స్న కూడా మరి మాట్లాడకుండా తమ్ముడిని ఆడించడంలో మునిగిపోయింది.
పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ముందుగా జ్యోత్స్నని స్కూల్లో వేశారు. కొంతకాలం తరువాత వరుణ్ డాక్టర్ రావుగారి సలహా మేరకు ప్రత్యేకమైన పిల్లల కోసం నడుపుతున్న పాఠశాలలో చేర్పించారు.
వయసుతో పాటు ఊహ కూడా పెరిగిన జ్యోత్స్నకి ఆనాడు తమ్ముడికి ఒంట్లో బాగుండటంలేదని తల్లి చెప్పిన మాటలకి అర్థం తెలియ వచ్చింది. అప్పటినించి తమ్ముడంటే అనురాగం, శ్రద్ద ఇనుమడించాయి . రోజు స్కూలునించి రాగానే తమ్ముడితోనే కాలక్షేపం. క్రమేపీ తమ్ముడి అవసరాలన్నీ జ్యోత్స్నే చూడసాగింది. ఈ విషయం రాజీవ్, రమణిలిద్దరికీ ఎంతో సంతోషాన్ని కలుగచేసింది. అప్పటి వరకూ భవిష్యత్తులో వరుణ్ సంరక్షణ గురించి వాళ్ళ మనసులలో ఉన్న దిగులుకు కొంత ఊరట లభించినట్లయింది. కాలగమనంలో కొన్ని సంవత్సరాలు గడిచాయి.
***
జ్యోత్స్న కంప్యూటర్స్ లో డిగ్రీ పూర్తిచేసింది. దాంతో సమాంతరంగా డెస్క్ టాప్ పబ్లిషింగ్(డి.టి.పి.) కోర్సులో ఆసక్తి ఉండటంతో అందులో కూడా నైపుణ్యతను సంపాదించుకుంది. వరుణ్ కి ఇప్పుడు 20 సంవత్సరాలు. ప్రత్యేక పాఠశాలలో శిక్షణవల్ల అతని పరిస్థితి కొంత మెరుగుపడింది.
ఒకరోజు పిల్లలను ఇంట్లోనే వదిలి అత్యవసర పనిమీద పొరుగూరు వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో రాజీవ్ రమణిలకు గాయాలు తీవ్రంగా తగలడంతో ఆసుపత్రి పాలయ్యారు. వారిద్దరికి రక్తం ఎక్కించవలసిన అగత్యం ఏర్పడింది. కానీ ఆ సమయంలో ఆస్పత్రిలో వారికి సరిపడేంత రక్తం నిల్వలు లేనందున జ్యోత్స్న తన రక్తమివ్వడానికి సంసిద్ధురాలైంది. ఆమె రక్తం పరీక్షచేయగా అది ఆమె తల్లిదండ్రులకి సరిపడదని తేలింది. ఈ విషయం తెలిసి జ్యోత్స్న ఒకింత ఆశ్చర్యానికి గురైనప్పటికీ అప్పటికి తనున్న పరిస్థితులలో ఆ విషయానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు.
మెరుగైన చికిత్స అందినప్పటికీ తలకి బాగా బలమైన గాయాలు తగలడం వలన రమణి తిరిగిరాలేని లోకాలకు వెళ్లిపోయింది. రాజీవ్ కి ప్రాణగండం తప్పింది కాని మతిస్థిమితం కోల్పోయాడు. తల్లిదండ్రులు తిరిగి మామూలు స్థితికి వస్తారని ఎంతగానో ఎదురుచూస్తున్న జ్యోత్స్నకు తల్లి మరణం , తండ్రి స్థితి తట్టుకోలేని దెబ్బ అయింది.
ఒకదాని తరువాత ఒకటిగా కష్టాలు వెన్నంటి వస్తున్నాయి. ఒకవైపు మతిస్థిమితం కోల్పోయిన తండ్రి ఇంకొకవైపు ఏం జరిగిందో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్న తమ్ముడు. ఇప్పుడు తన ప్రథమ కర్తవ్యం తండ్రి , తమ్ముడి సంరక్షణ అనుకున్న జ్యోత్స్న తన బాధని అతి కష్టం మీద దిగమింగుకుని తామందరి జీవితాలని పరిరక్షించుకునే దిశగా దృష్టి సారించింది.
రాజీవ్ చేసిన ఆరోగ్య భీమా అతని వైద్యానికి అయ్యే ఖర్చులకి అక్కరకు వచ్చింది. కానీ ఇల్లు గడవడానికి, రోజు ఆస్పత్రికి వెళ్ళిరావడానికయ్యే పై ఖర్చులకి, వరుణ్ రోజువారీ మందులకి బ్యాంకులో ఉన్నదంతా నెమ్మది నెమ్మదిగా కరిగిపోసాగింది. రాబడి తగ్గింది, ఖర్చులు పెరిగాయి.
ఇంక మేము చేయగలిగిందేమీ లేదు మీరు మీ తండ్రిని ఇంటికి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా వారికి కావలసిన కనీస చికిత్సను ఇంటివద్దనే చేయవచ్చు అని డాక్టర్లు చెప్పడంతో తండ్రిని ఆసుపత్రినించి ఇంటికి తీసుకుని వచ్చింది జ్యోత్స్న.
ఒకనాడు తండ్రి గదిలో ఏవో కాగితాలు చూస్తుండగా బీరువాలో ఒక కవరులో ఆయన వ్రాసి ఉంచిన వీలునామా జ్యోత్స్న కంటబడటం జరిగింది.
అదేమిటి నాన్న అప్పుడే వీలునామా ఎందుకు వ్రాసారు? అంత అవసరం ఏమొచ్చింది? అనుకుంటూ దానిపై వ్రాయబడిన తారీకు చూసి అంటే నేను మేజర్ అవగానే ఈ వీలునామా వ్రాశారన్నమాట నాన్న అనుకుని దానిని చదవసాగింది.
‘ఏ కారణంవల్లనైనా నాకు మరణం సంభవిస్తే నా తదనంతరం నా భార్య రమణి, కొడుకు వరుణ్ ల బాధ్యత జ్యోత్స్నకి అప్పగిస్తూ ఆస్థిపై సర్వహక్కులు జ్యోత్స్నకు చెందేలాగున....’ అంటూ చదువుతుండగా బయటపడిన మరొక విషయం ఆమెని దిగ్భ్రాంతికి గురిచేసింది. అదేమంటే రాజీవ్ రమణిలు ఎంతకాలానికి సంతానం కలుగక పోవడంతో అనాథ అయిన జ్యోత్స్నని దత్తత తీసుకున్నారని, ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు వరుణ్ పుట్టాడని. అప్పుడు హఠాత్తుగా జ్ఞప్తికి వచ్చింది జ్యోత్స్న కు ఆనాడు రక్త పరీక్ష జరిగినప్పుడు తన రక్తం తల్లిదండ్రులకు ఎందుకు సరిపడలేదో!
‘అంటే అమ్మా నాన్నలకు నేను దత్త పుత్రిక నన్నమాట. అనాథనని తెలిస్తే నేనెక్కడ దుఃఖిస్తానో అని ఇన్నాళ్ళు నాకు తెలియనివ్వలేదన్న మాట! ఇరువురూ ఎంతటి ఉత్తములు? నాకు ఒక మంచి జీవితాన్నిచ్చి, నా పైన అపారమైన నమ్మకంతో తల్లి తమ్ముడు బాధ్యత కూడా నాకు ఒప్పగిస్తూ వీలునామా వ్రాసిన తండ్రికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు?’ ఆలోచిస్తున్న జ్యోత్స్నకు మనసంతా తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. కన్నబిడ్డలా తనను పెంచి ప్రేమానురాగాలు కురిపించిన తల్లి తలపుకు రాగానే ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళవెంట కన్నీరు కారసాగింది. చాలాసేపటివరకు వీలునామా చేతులలో పట్టుకుని అలానే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది జ్యోత్స్న.
**
రాజీవ్ కి మతిస్థిమితం తప్పడం వలన అతను స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసినట్లుగా పరిగణించి కంపెనీవారు అతని సర్వీసు పూర్తికాలం ధనం చెల్లించారు. అంతేకాకుండా కష్టంలో ఉన్నాడని పెద్ద మనసుతో సహోద్యోగులు ఘనంగా ఆర్థిక సహాయం చేశారు. ఆ విధంగా అందివచ్చిన సొమ్ములో కొంత భాగం తమ్ముడు వరుణ్ పేరున బ్యాంకులో వేసి మిగిలినది తండ్రి వైద్య ఖర్చుల నిమిత్తమై భద్రపరిచి తండ్రి , తమ్ముడి సంరక్షణ కోసమై ఒక మనిషిని ఏర్పాటు చేసింది జ్యోత్స్న. అంతేకాక విశాలమైన ఇంటిలో తమ ముగ్గురికి సౌకర్యంగా ఉండేటంత భాగం అట్టేపెట్టుకుని , మిగిలిన భాగాన్ని అవసరమైనప్పుడు పిలిస్తే పలికేవారుంటారని ఆలోచించి అద్దెకు ఇచ్చింది.
‘ఫరవాలేదు ప్రస్తుతం నెల నెలా ఎంతోకొంత డబ్బు చేతికి అందుతోంది. చిన్న చిన్న అవసరాలు గడిచి పోతున్నాయి కానీ ముందు ముందు ఖర్చులు పెరిగి ఇల్లు గడవాలంటే నేను ఏదో ఒకటి చేయక తప్పదు. అలా అని తండ్రిని , తమ్ముడిని పనిమనిషి పర్యవేక్షణలో వదిలి బయటకు వెళ్ళి ఉద్యోగం చేయటానికి మనస్కరించటంలేదు.’ అనుకున్న జ్యోత్స్న ఇంటివద్దనే ఉండి ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి తండ్రి స్నేహితులతో సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకుంది. ఆ మేరకు బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు పెట్టుకుంది. అందరి సహాయ సహకారాలతో ఆమెకు త్వరగానే బ్యాంకు నుండి రుణం లభించింది. ఆ సొమ్ముతో స్వయంఉపాధి పథకం క్రింద ఇంటి వద్దనే సొంత కంప్యూటర్ బిజినెస్ పెట్టింది. ఒకప్పుడు ఆసక్తి కొలదీ నేర్చుకున్న డి.టి.పి. వర్కు ఇప్పుడు జీవనోపాధికి మార్గం చూపుతూ అక్కరకు వచ్చింది జ్యోత్స్నకి.
మంచి వ్యక్తిని చూసి వివాహం చేసుకుంటే నీకు సుఖదుఃఖాలలో తోడుగా ఉండగలడని సలహా ఇచ్చిన శ్రేయోభిలాషులు స్నేహితులందరికీ ‘అనాథనైన నన్ను అక్కున చేర్చుకుని ఒక మంచి జీవితాన్నిచ్చిన తండ్రికి సేవ చేయటం , అపారమైన నమ్మకంతో ఆయన నా పైన ఉంచిన తమ్ముడి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు’ అని చెప్పి వారి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంది.
ఒకవైపు బిజినెస్ సమర్థవంతంగా నిర్వహించుకుంటూనే ఇంకొకవైపు పసిపాపలలాంటి తండ్రిని , తమ్ముడినీ కన్నతల్లిలా ప్రాణప్రదంగా చూసుకుంటూ వారికి ఆలంబనగా నిలబడి వారి జీవితాలలో వెలుగునింపుతూ చెక్కు చెదరని ధైర్యంతో తన జీవితంలో ముందుకు సాగిపోయింది జ్యోత్స్న.
****
సత్యవతి దినవహి
దినవహి సత్యవతి: బి.టెక్(సివిల్), ఆ తర్వాత ఎం.సి.యే చేసి 12యేళ్ళు ఉపాధ్యాయ వృత్తి అనంతరం గృహిణిగా చెన్నై లో నివసిస్తున్నారు. రచనా వ్యాసంగంలో ఇప్పటివరకు దిన, వార, మాస పత్రికలు మరియు వెబ్ పత్రికల లో 33 వరకు కథలు, కవితలు, వ్యాసములు ప్రచురించబడ్డాయి. ప్రచురించబడినవి అన్నీ వారి బ్లాగు “మనోవేదిక” లోను, చిన్న పిల్లల కోసం ప్రత్యేక బ్లాగు “బాల మనోవేదిక “ లోను పొందుపరిచారు..
***