top of page
Anchor 1

సంపుటి 2  సంచిక 2

కథా మధురాలు

ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది......???

Satyavathi Dinavahi

శ్రీమతి పి.వి.శేషారత్నం

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ

Bio

వంటింట్లోంచి వసంత 'సూరజ్‌ రడీయేనా? త్వరగా తెములు. ఇవాళ మీటింగుంది.'అని కేకేసేసరికి 'బాప్‌రే టైమయిపోయింది...' అనుకుంటూ సూరజ్‌ వాష్‌రూంకి పరిగెత్తాడు. తర్వాత వాళ్లిద్దరూ హడావుడిగా తయారయి టిఫినయినా తినకుండా వెళ్లబోతూ అత్తగారిముఖం చూసి వసంత 'బాధపడకండత్తయ్యా ... బస్‌లో తింటాంలెండి.' అని టిఫిను డబ్బాలు చేత్తోనే పట్టుకుని సూరజ్‌ వెనకే కారెక్కింది.

 

'వసంత మంచి పిల్ల...పగలూరాత్రీ ఆఫీసుపని చేస్తూనే ఉన్నా మళ్లీ వంటింట్లో ఉన్న కాసేపట్లోనే సరదాగా కబుర్లు చెబుతూ 'ఇంకా 'సూరజ్‌కి ఇష్టమైన వంటకాలన్నీ నాకు నేర్పించండత్తయ్యా! నేనేం చేసినా 'మా అమ్మ చేసినట్టు లేదు' అంటూ మిమ్మల్ని రోజూ తలుస్తూనే ఉంటాడు.'అంటూ చకచకా చెప్పినవి చెప్పినట్టు చురుగ్గా చేసేస్తుంది.

 

సూరజ్‌ది చిన్నపిల్లాడి తంతు.తనక్కావలసింది వెంటనే కనిపించకపోతే ఆగమాగం చేసేస్తాడు. మళ్లీ అంతలోనే చప్పున చల్లారిపోతాడు.శని ఆదివారాలు  అంతా తామిద్దరికోసమే కేటాయించేసి హడావుడి చేసేస్తారు కొడుకు కోడలూను.' అనుకుంది మనోరమ.

 

'నాన్నా! మీరు న్యూయార్క్‌లో చూడాల్సినవి ఇంకా ఎన్నిఉన్నాయో...ఇవాళ మాత్రం అమ్మకిష్టమని రాచెస్టర్‌ రాజరాజేశ్వరీ టెంపుల్‌కి వెళ్తున్నాం మనం.'సూరజ్‌ మాటలకి ముసిముసిగా నవ్వుకుంది మనోరమ ఓరకంట భర్త నారాయణమూర్తిని చూస్తూ.

 

'అత్తయ్యా! దార్లో తినడానికి చెయ్యాలని అవస్థపడద్దు. టెంపుల్లోనే భోంచేసేద్దాం. ఇవాళ వంటింటికి సెలవు.' సరదాగా కబుర్లు చెబుతూ రాత్రిదాకా  తిప్పి తీసుకొచ్చారు.

 

+++

 

కిటికీ దగ్గర స్థబ్దుగా నిలబడి బయట తెల్లని మంచులో నల్లగా మోడువారిన చెట్లను చూస్తున్న  నారాయణమూర్తిని చూసి కడుపు తరుక్కుపోయింది మనోరమకి. ఆమెకి ఉదయం జరిగిన సంఘటన కళ్లముందుకొచ్చింది.కొడుకు సూరజ్‌ తనకి కావలసిన వస్తువేదో కనిపించలేదని 'ఎక్కడి వస్తువులక్కడ ఉంచరుకదా!' తెగ విసుక్కున్నాడు.'చిన్నప్పటినుంచీ వాడి ధోరణే అంత...అది తెలిసీ తననేదో అన్నట్టుగా ఈయనగారు ఎందుకంత బాధపడిపోవడమో!'అనుకుంది మనోరమ. 

 

వసంత, సూరజ్‌  డబ్బాలు పట్టుకుని పొద్దున్నే ఆఫీసులకి వెళ్లిపోతారు.cఈమధ్యన పగలంతా ఆఫీసులో పనిచేసి ఇంటికి వచ్చాక కూడా నామకహా నాలుగు మెతుకులు కతికేసి ఏదో అర్జంటు పనులున్నట్టుగా మళ్లీ కంప్యూటర్లు ముందేసుకుని అందులోకి బుర్రలు దూర్చేస్తారు.అప్పటిదాకా కొడుకూకోడలిcరాకకోసం కిటికీదగ్గర నిలబడే కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన నారాయణమూర్తి వాళ్లు తమని ఒకసారి పలకరించేసి అలా పనిలోకి మళ్లిపోవడం చూసి ఈమధ్య విసుగెత్తిపోతున్నాడు.

 

పగలు భోంచేసాక దంపతులిద్దరూ ఓ రెండుగంటలపాటు కునుకు తీసేస్తారేమో రాత్రిళ్లు ఓ పట్టాన త్వరగా నిద్రపట్టదు. కొడుకు కోడళ్లతో భోజనాల దగ్గర ఓ నాలుగు మాటలు మాట్లాడితేనయినా ఆయనకి కాస్త ఒంటరిభావం పోయి కాలక్షేపం ఉండేదేమోగాని వాళ్లు చాలాసేపు  కంప్యూటర్లతో కుస్తీలు పట్టి అర్ధరాత్రి దాటాకా లైటు తియ్యడం కూడా దంపతులకు తెలుస్తూనే వుంది.

 

రాత్రి ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఆరింటికల్లా గంట కొట్టినట్టు మెలకువ వచ్చేస్తుంది మనోరమకీ నారాయణమూర్తికీ. లేచి కొడుకూకోడలికీ నిద్రాభంగం కలగకూడదని వంటింట్లో గిన్నెలు చప్పుడవకుండా కాఫీ పెట్టుకుని ఊదుకుంటూ వేడివేడి కాఫీ తాగుతూ అద్దాలమీంచే బయట చెట్లమీద రోడ్లమీద పరచుకున్న ఆ తెల్లని మంచును వీక్షిస్తుంటారు. సూర్యోదయమయినా ఈ చలికాలంలో ఆ కిరణాలలో వేడి లేకపోయినా మంచుమీద అవి ప్రతిఫలించిన తీరుకు మనోరమకి మనసు ఎంత  మురిసిపోతుందో?

 

వసంత, సూరజ్‌ ఏడింటికి నిద్రలేచేసరికి  ఇంట్లో హడావుడి మొదలవుతుంది.సూరజ్‌ కాఫీ తాగుతూ మళ్లీ కంప్యూటరులోకి తలదూర్చినా వసంత అత్తగారి దగ్గర కబుర్లు చెబుతూ ఆపనీ ఈపనీ చేస్తూ వంట పూర్తి చేసేసి గబగబా లంచ్‌ డబ్బాలు సర్దేసి చిన్న చిన్న ప్లేట్లలో టిఫిను పెట్టి వసంత, సూరజ్‌ని టైమయిందంటూ హెచ్చరిస్తుంది. తర్వాత ఇద్దరూ టిఫిను తినేసి హడావుడిగా బయలుదేరిపోతారు.

 

మొదట్లో వాళ్లతో కలిపి టిఫినయినా చేయాలని వృద్ధ దంపతులు కూడా హడావుడి పడుతుంటే వసంత మృదువుగా చెప్పేసింది.'అత్తయ్యా మాకెలాగూ తప్పదు. మీరెందుకు ఆదరాబాదరాగా తినడం. హాయిగా ఇప్పుడు టిఫిను తిని మీ టైము ప్రకారమే మధ్యాహ్నం భోజనాలు చెయ్యండి. వేళగాని వేళల్లో హడావుడి తిండితో ఆరోగ్యం పాడయితే ఈ వయసులో మీకెంతో కష్టం.'

 

టిఫిను తిన్నాక  కొంతసేపు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ ఇల్లంతా తిరిగాడు నారాయణమూర్తి. తర్వాత మళ్లీ పేపరు. ఆ తర్వాత టివి...తర్వాత కాసేపు సెల్‌లో భక్తిపాటలు విన్నాడు. ఆ తర్వాత భోజనం...కాసేపు నిద్ర...ఇంత కాలక్షేపం చేసినా  రోజు గడిచేనా? ఈ కాలంలో దేశంకాని దేశం వచ్చిన పెద్దలదే కాదు ఇండియాలో కూడా  ప్రతి ఇంటిలోని పెద్దల పరిస్థితీ అంతేనేమో...అనుకున్నాడాయన.

 

ఇండియాలో అయినా పట్నంలోని అపార్టుమెంట్లలోని జీవితాల్లో అంతకంటె విశేషం ఏముంటుంది?తమ ఊళ్లో అయితే పొద్దుట లేవగానే ఏటి ఒడ్డు వరకు నడక...తిరిగి వచ్చి రేడియో విని పేపరు చదివి ఇంటి లైబ్రరీలోంచి భారతమో భాగవతమో తిరగేసి ఏ స్నేహితుడో బంధువో వస్తే వాళ్లతో కాసేపు అలా బయటికి వెళ్లిరావడం...వచ్చాక ఏకంగా భోంచేసి నడుం వాల్చడం...నిద్ర లేచాక కాస్త తేలిగ్గా టీ తాగి సాయంకాలాలు గుడికో గోపురానికో పార్కుకో వెళ్లి తెలిసిన ముఖాలతో పిచ్చాపాటీ మాట్లాడి వచ్చేసరికి చీకటయిపోయేది.తనకీ మనోరమకీ కూడా చుట్టుపక్కలవాళ్ల పలకరింపులతో రోజు ఇట్టే గడిచిపోయేది. ఇక్కడ ఒక్కరూ బయటికి వెళ్లాలంటే ఐదారుకేజీల బరువున్న స్వెట్టర్లు వేసుకోవాల్సిందే...పైగా ఊరు తెలియదు. ఇంగ్లీషు వచ్చినా మాట్లాడేవాళ్లేరీ? పొరబాటున మంచులో కాలుజారి పడితే దిక్కుండదు.ఇక్కడే నాలుగడుగులు నడుద్దామన్నా ఇంట్లో స్థలమేదీ...అందుకే మరీ పులిని గుహలోనే బంధించేసినట్టుంది ఆయనకి.భార్యతో ఎంతకని కబుర్లు చెబుతాడు? అక్కడకీ మనోరమ ఏవో పాత కబుర్లు ఎత్తి కాలక్షేపం చేస్తూనే ఉంటుంది.

 

ఇంట్లోని మూడుబెడ్‌రూంలు, హాల్లోనే ఇద్దరూ అటూఇటూ తిరుగుతుంటారు. వాకింగ్‌కోసం జిమ్‌కి వెళ్తానంటే డబ్బు కడతానన్నాడు కొడుకు. కానీ ఒకసారి చూసొచ్చాక అంతగా నచ్చలేదు ఆయనకి.

 

అసలు సూరజ్‌కి అమెరికా వచ్చి నాలుగేళ్లయినా తమ దగ్గరకి వచ్చేందుకు సెలవ లేదు.

 

'మీరక్కడ ఆ వూళ్లో ఒంటరిగా ఉండే బదులు ఏడాదికి ఒకసారయినా మాదగ్గరకి వచ్చి ఓ నెల్లాళ్లు ఉండి వెళ్లొచ్చుకదా' అన్నారు సూరజ్‌ వసంత. రాకపోతే పిల్లలకి కోపం వస్తుందని  వస్తే  ఏమీ తోచడంలేదు.అదేం చిత్రమో మనోరమకి మాత్రం కొడుకును చూసుకునేసరికి ఒళ్లు తెలియడం లేదు.

 

'ఇక్కడ మీకేం తక్కువయిందని??? సెలవునాడు అమెరికాలో చూడాల్సిన వింతలు విడ్డూరాలు విశేషాలు చూపిస్తున్నారా లేదా పిల్లలు? మీరే చెప్పండి క్రితం వారం న్యూయార్కు వెళ్లాం. ఎన్నడో పదేళ్ల క్రితమే అమెరికా వచ్చి సెటిలయిపోయిన మీ చెల్లెలి కొడుకు వంశీని కళ్లారా చూసుకున్నారా లేదా? న్యూయార్క్‌ న్యూజెర్సీల మధ్యన ఆ నది పేరు ఏంటి చెప్మా...ఆ...హడ్సన్‌...చలి ముదరని రోజుల్లో రోజూ సాయంత్రాలు ఆ నది దగ్గర పార్కుల్లోకెళ్లి కూర్చుంటే నది అవతల ఆ ధగధగలాడే రకరకాల బిల్డింగులను చూస్తూ ఎంత మురిసిపోయాం? గంటలకి గంటలు  వచ్చేపోయే అన్ని దేశాల టూరిస్టులను చూసుకుంటూ అందులో ఇండియా వాళ్లను వెతుక్కుంటూ మీరు ఎంత సంబరపడిపోయేవారు. ఇండియాలో అయితే 'అబ్బ గుంటూరు వాళ్లకి కోపాలెక్కువ బాబూ...ఆ కొరివి కారాలూ గోంగూర పచ్చళ్లు తిని మనుషులమీద కలియబడిపోతారు' అనేవారా? మరి దేశం కాని దేశంలో ఇక్కడ గుంటూరువాడు కనిపించేసరికి మీరూ వాళ్లూ కూడా ఏదో స్వర్గలోకంలో ఉన్నట్టే గంటసేపు ఆనందంగా గడిపేసారా లేదా?'

 

'అబ్బా ఇప్పుడు నేనేమన్నానని విరుచుకు పడుతున్నావోయ్‌?'

 

'నేను విరుచుకు పడడం కాదు...ఆ ముందువారం పిల్లలు వాషింగ్టన్‌  తీసికెళ్లారు. జీవితంలో అమెరికా అధ్యక్షుడి భవనం చూడ్డానికి ఎంతమందికి అవకాశం కలుగుతుంది చెప్పండి. అది చూసి ఎంత అద్భుతానికి లోనయ్యాం? ఈ దేశంలో పదవిలో ఉన్నవాళ్లు కూడా ఏ భేషజమూ లేకుండా ఎంత నిరాడంబరంగా ఉంటారోనని మురిసిపోయారా లేదా? అదే మన దేశంలో రాష్ట్రపతిని కలవాలంటే ఎంత తతంగం ఉంటుంది?'

 

నారాయణమూర్తికి ఉక్రోషమొచ్చింది.'నువ్వు అమెరికా సొమ్ము తినడం మరిగావు మనోరమా? అందుకే తెగ పొగుడుతున్నావు.'

 

'అమెరికా సొమ్ము అయినా ఇండియా సొమ్ము అయినా నా పిల్లల కష్టార్జితమే తింటున్నాను గానీ ఊరికే ఎవరూ ఇవ్వడం లేదు లెండి. వాళ్లు ఇండియాలో ఎంతో రెక్కలు ముక్కలు చేసుకుంటేనే యాభైవేలు వచ్చేవి. ఇక్కడ జీతాలు బావుంటాయి. దానికి తగ్గట్టు జీవన సౌకర్యాలు బాగుంటున్నాయి. అందుకే ఇక్కడకు వచ్చిన పిల్లలు అక్కడకు రావడానికి ఇష్టపడడం లేదంటే అది వాళ్ల తప్పా?'

 

'అయితే దేశభక్తి అక్కర్లేదంటావా?' నారాయణమూర్తికి కోపమొచ్చింది.

 

'అలా అని అన్నానా? దేశాన్ని ఆదుకోవాలంటే దేశంలోనే ఉండక్కరలేదు.  మన దేశంలోని సంస్థలకి  ఇక్కడి మనవాళ్లు ఎంతమంది సాయం చెయ్యడం లేదు చెప్పండి. సూరజ్‌ చెప్పలేదూ...ఇక్కడి ఆయనే మన దేశంలో కాకినాడలో తను చదువుకున్న కాలేజికి లైబ్రరీ బిల్డింగ్‌ కట్టించి పెట్టాడట. ఇక్కడ ఉద్యోగానికొచ్చిన మన దేశం అమ్మాయే అక్కడి మన పల్లెటూళ్లల్లో టాయ్‌లెట్లు కట్టిస్తోందని వసంత చెప్పింది వినలేదా? అక్కడి ధర్మసంప్థలకి వాళ్లు చదువుకున్న స్కూళ్లకి,  పుట్టి పెరిగిన ఊరు బాగోగులకి తమ కష్టార్జితం ఖర్చు బెట్టడం లేదా? అక్కడ మన నాయకులు జనాన్ని దోచుకున్న సొమ్మును  ఇక్కడి విదేశీ బ్యాంకుల్లో దాచుకోవడం గురించి పేపరు చదివి మీరేగా నాకు చెబుతుంటారు. నేను ఎప్పుడూ ఖచ్చితంగానే ఉంటాను. మీలా గడియగడియకీ మాట మార్చను బాబూ!'

 

'ఇప్పుడు నేనేమన్నానని నువ్వు వాదిస్తున్నావే?' 

 

మనోరమ ఊరుకోలేదు.'నాకు పక్షపాతం లేదు. ఎక్కడైనా మంచి ఉంటే మెచ్చుకుంటాను.నాకు ఇక్కడి ప్రతి పౌరుడూ స్వచ్ఛందంగా శుభ్రత పాటించడం  ఎంత నచ్చిందో? రోడ్డుమీద ఎక్కడన్నా ఉమ్ములు వెయ్యడం చూసారా? మనం  పార్కు కెళ్లినపుడు చిన్నచిన్నపిల్లలు కూడా తిన్న  కాగితాలు ఎక్కడ వేస్తున్నారో చూడలేదూ?మన దేశంలో నడిరోడ్డుమీద పశువులు పక్షులు వీరవిహారం చేసినట్టు ఇక్కడ చేస్తున్నాయా? అక్కడఇండియాలో హైదరాబాదులో మీ సుబ్బారావుగారు  తెల్లారి వాకింగ్‌కెళ్దామని బయల్దేరితే వీధి కుక్కల బారిన పడి బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవలసి వచ్చిందా లేదా? ఇక్కడ చూసారుగా బయటికి పెంపుడు కుక్కలను తీసుకొచ్చినా ఎవరినీ కరవకుండా వాటి గొలుసు వదలకుండా ఎంత భద్రంగా పట్టుకుంటున్నారు?'

 

'ఆఆ. అవి రోడ్డు పాడు చెయ్యకుండా ప్లాస్టిక్‌ సంచీలు కూడా తెచ్చుకుంటున్నారులే...'వెటకారంగా నవ్వాడు నారాయణమూర్తి.

 

'అది ఎంత మంచి అలవాటు చెప్పండి. మన దేశంలో అలాంటిది రావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అసలు రూల్‌ ఉన్నా పాటించేవాడెవ్వడు? ఇక్కడ అన్నేసి వందల మైళ్లు కారులోనే తిరిగాం రోడ్డుమీద ఓ మనిషిగాని పశువుగాని  చిరువాహనాలు గాని అడ్డదిడ్డంగా తిరగడం చూసామా చెప్పండి.'

 

'నువ్వు బొత్తిగా ఇలా అమెరికా తరఫున వకాల్తా పుచ్చుకోవడం చూస్తుంటే మీనాన్న నిన్ను 'లా' చదివించే ఉంటాడు.'

 

'పోనీ అలాగే అనుకోండి. మీకు నేనేం పోటీకి రావడం లేదుగా...పక్షపాతంగా మాట్లాడొద్దంటాను అంతే...'

 

'ఇపుడు నేనేమన్నానని ?'

 

ఇంకా ఏమనాలి అబ్బాయితో నాకిక్కడేం బాగులేదు...వచ్చేవారం వెళ్లిపోతాం టిక్కెట్టు తియ్యమన్నారా లేదా?'

 

'అన్నాను.అందులో తప్పేముంది?'

 

'మీకు తప్పులేకపోవచ్చు కానీ వాళ్ల మనసులు ఎంత గాయపడతాయో ఆలోచించొద్దూ!'

 

'ఏమిటో మనూ! ఇక్కడ సౌకర్యాలు లేవనను. కానీ అక్కడ ఉన్నదేదో ఇక్కడ లేనట్టుందే.' 

 

'అదేమిటో చెప్పండి. పాపం పిల్లలు మొహాలు ఎంత చిన్నబోయాయో! వాళ్లిద్దరూ 'మనమేమన్నా  తప్పు చేసామా' అనుకుంటూంటే నాకు బాధగా ఉంది సుమండీ...'

 

+++

 

'పాపం వాళ్ల ఉద్యోగాలు,ఒత్తిళ్లూ వాళ్లవి.' అనుకుంటూ మంచినీళ్లు తాగేందుకు వంటింటివైపు వెళ్తూంటే కోడలి గొంతు వినిపించింది మనోరమకి. 'సూరజ్‌! ఈమధ్య నీ వరస నాకేం నచ్చడం లేదు.నీకు చిరాకు ఎక్కువయిపోతోంది.'

 

'ఏంచెయ్యను టార్గెట్లు దగ్గర పడుతున్నాయి.'

 

'అయితే మాత్రం? మావయ్యగారిని  అలా విసుక్కుంటే ఎంత బాధపడతారో ఒక్కసారయినా ఆలోచించావా?'

 

'అయితే నువ్వు  వినేసావన్నమాట.'

 

'నేను విన్నానని తెలిస్తే ఆయన మరీ చిన్నబుచ్చుకుంటారని టైమయిపోతున్నా వంటింట్లోనే ఉండిపోయాను. చూడు  మనం వయసులో ఉన్నవాళ్లం ఎన్ని టార్గెట్లు ఉన్నా ఎంత టెన్షన్‌నయినా తట్టుకోగలం. కాని పాపం మనమీద అభిమానంతో వాళ్లకిక్కడ తోచదని తెలిసీ భాషరాని ఊళ్లో వాళ్లెంత సహనంతో మనమధ్య ఉంటున్నారు? ఇంటికొచ్చేసరికి మనకోసం ఆత్రంగా తలుపు దగ్గరే ఎదురుచూసి రాగానే గ్లాసుడు మంచినీళ్లిచ్చే వాళ్లని చూస్తుంటే మనకెంత రిలీఫ్‌గా ఉంటోంది. అవన్నీ మరిచిపోయి చిన్నపిల్లాడినన్నట్లు ఆయనను అలా కసురుకోవడం నాకు నచ్చలేదు.'

 

'నాకూ నచ్చలేదు వసంతా! నీకో రహస్యం చెప్పనా!అలా గట్టిగా మాట్లాడ్డం వల్ల నా టెన్షనంతా తగ్గిపోయింది తెలుసా...అమ్మకి ఈ విషయం బాగా తెలుసులే. నాన్నా అంతే...నా చిన్నప్పుడు ఆయన ఆఫీసులో టెన్షన్‌ తగ్గడానికి మా తాత  మీదా అమ్మ మీదా అలాగే అరిచేవారు.పాపం నాన్న ఇదంతా మరిచిపోయి రేప్పొద్దున్న నాతో ఎలా మాట్లాడతారో చూడు.'

 

'అయితే ఇదంతా వంశపారంపర్యమన్నమాట.ఒక్క  ఏడునెలలాగు. నాకొడుక్కి  నీమీద విసుక్కునే ట్రెయినింగ్‌ ఇవ్వకపోతే అప్పుడడుగు...'

 

'ఏమిటి...ఏమన్నావు...మళ్లీ చెప్పు...'వసంత కిలకిలారావాలు వినిపిస్తూంటే సంబరంతో మనోరమ గుండె పొంగిపోయింది. తనలో తనే నవ్వుకుంటూ మంచి నీళ్లు తాగి పడుకుంది.

 

+++

 

'నాన్నా!ఇవాళ మీ పుట్టినరోజుకదా!ఇది మీకోసం...'తండ్రికి ఓ చిన్న బాక్స్‌ ఇచ్చి వంగాడు సూరజ్‌.ఇద్దరూ కాళ్లకు దణ్ణం పెడుతుంటే మురిసిపోయాడు నారాయణమూర్తి.

 

'ఏమిట్రా ఇది.అరే...పలక...ఇది... నాకెందుకురా...'

 

'పలక కాదు ఐప్యాడ్‌ నాన్నా!ఇది మీకోసమే...అందులో మీకిష్టమైన భక్తి సినిమాలు, స్తోత్రాలు, సుప్రభాతాలు అన్నీ లోడ్‌ చేసాను.' 

 

'మావయ్యగారూ! ఇదిగో ఇక్కడ టచ్‌ చేస్తే మీకిష్టమైన వార్తాపత్రికలు...ఇక్కడ ముట్టుకుంటే భగవద్దీతా ప్రవచనాలు...అన్నీ కనిపిస్తాయి వినిపిస్తాయి.ఇక్కడ నొక్కితే ఫొటో తీసుకోవచ్చు. మీరు వెళ్లేలోగా అవన్నీ నేర్చుకుందురుగాని.' వసంత చనువుగా వివరించింది.

 

'అయితే ఇది నేను మా నాన్నకిచ్చిన టేప్‌రికార్డరు కంటె అపురూపమైన బహుమతిరా సూరజ్‌! 'ఆయనకి ఆరోజు ఉదయమే మనోరమ గుర్తు చేసిన సంఘటన గుర్తొచ్చి కళ్లు తడిసాయి.తనూ ఏమన్నా కనిపించకపోతే తండ్రిమీద తెగ విసుక్కునేవాడు.ఆయన పుట్టినరోజుకి టేప్‌ రికార్డరు కొనిస్తే ఎంత పొంగిపోయాడో...

 

'అంతకంటె కూడా అపురూపమైన బహుమతి కోడలు ఇస్తోంది తెలుసా?మనం అక్కడ  మన ఊళ్లో ఉన్నప్పుడు కూడా రోజూ పుట్టబోయే ముందు వాడి గురించిన కబుర్లు, పుట్టాక మీ చంటి మనవడి ఊసులు వినడానికి వాడితో కబుర్లు చెప్పడానికి ఇదిగో ఈ కరెంటు పలకమీద ఇక్కడ ముట్టుకోవాలని కోడలు నాకప్పుడే నేర్పించేసింది లెండి. ఇంకెంత ఏడునెలలాగండి చాలు.'అంటూ తీపి కబురు చెప్పి ఐప్యాడ్‌మీది గుర్తులను చూపిస్తూ  ముసిముసిగా నవ్వుతున్న భార్యను చూసి ఆనందంతో పొంగిపోయాడు నారాయణమూర్తి.

 

+++

 

ఇండియా వచ్చిన నెల్లాళ్లకి మనోరమ అక్క కూతురు పెళ్లికి వెళ్లగానే బంధువులంతా దంపతులని చుట్టుముట్టేసి కబుర్లతో ఊదరగొట్టేసారు.

 

'పెదనాన్నా అబ్బ అమెరికా వెళ్లి మమ్మల్ని మర్చిపోయావులే నిన్ను చూసి ఎన్నాళ్లయిందో?'

 

'అత్తయ్యా సూరజ్‌ బావ బావున్నాడా మమ్మల్నిందరినీ మర్చి పోయాడా? నువ్వు దేశంలో లేకపోతే దేశం గొడ్డుపోయినట్టుంది తెలుసా?'

 

'చాల్లేవే కబుర్లు నేర్చావు. ఇక్కడ ఉంటే ఒక్కనాడయినా ఫోన్‌ చేసి అత్తయ్యా బావున్నావా అని అడిగావా?' మనోరమ మేనగోడల్ని బుగ్గలో పొడిచింది నవ్వుతూ...

 

'అంతా ఇక్కడే ఉన్నారా అక్కడ పెళ్లికూతురికి పూల జడ ఎవరు వేస్తారు ఇదిగో అమెరికా చెల్లెమ్మా! నువ్విక్కడనుంచి కదిలితే ఈ జనం అంతా పెళ్లికూతురి గదిలోకి వరదలా వచ్చేస్తారు నువ్వు లే ముందు.'అక్కయ్య తన రెక్క పట్టుకుని లేవదస్తోంటే కళ్లు చెమర్చాయి మనోరమకు. 'ఇక్కడ ఉన్నది అక్కడ లేనిది ఇదే..ఈ పెళ్లిళ్లు, ఈ సరదాలు, పలకరింపులు...నెల క్రితం అసలు ఎయిర్‌పోర్టులో విమానం దిగి  టాక్సీ గేటులోకి అడుగుపెట్టగానే  పక్కింటి సుందరంగారు 'ఏమండోయ్‌ చాలారోజులే బిచాణా వేసారే కొడుకు దగ్గర మమ్మల్ని మరిచిపోయారు కదూ! అబ్బ మీరు లేకపోతే   పార్కులో మనం కూర్చునే చెట్టుకి కళే పోయింది సుమండీ...'అంటూంటే ఆయన ఎంత సంబరపడిపోయారో?వారంరోజులు ఇల్లు పట్టకుండా తిరిగారు.తన మిత్రులందరికీ అమెరికా కబుర్లే. అక్కడ తనతో అమెరికాని వంకబెట్టి మాట్లాడినవన్నీ ఇక్కడ గొప్పలుగా ...అక్కడ తన దగ్గర దోషాలుగా వాదించివన్నీ ఇక్కడ సుగుణాలుగా అక్కడి నీట్‌నెస్‌ గురించి క్రమశిక్షణ గురించీ విచిత్రంగా వింటున్న తన స్నేహితులతో చెబుతోంటే తనకి ఎంత నవ్వొచ్చింది. ఇదిగో ఈ పెళ్లిలో బంధువులంతా కలిసారు మళ్లీ ఈయన్ని పట్టడం మరీ కష్టమే....' అనుకుంది మనోరమ.

 

'మావయ్యా అబ్బ నువ్వు అడుగుపెట్టేసరికి ఇంటికి ఎంత పెళ్లికళ వచ్చేసిందో చూడు. ఎంతయినా అమెరికా రిటర్నువి కదా...'

 

'పోరా? పెద్ద కబుర్లు నువ్వూను.నువ్వూ వచ్చే నెల్లో ఫారిన్‌ వెళ్తున్నావటగా మీ నాన్న చెప్పాడులే.' 

 

'అవును మావయ్యా సింగపూర్‌ కంపెనీలో ఉద్యోగమొచ్చింది.'

 

'మన కుటుంబం పేరు నిలబెట్టాలిరోయ్‌...' మేనల్లుడి భుజం గర్వంగా తట్టారు నారాయణమూర్తి.

 

పెళ్లి పేరుతో వారం రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి.ఇంటికొచ్చి రొటీన్‌లో పడేసరికి మళ్లీ మామూలే.

 

'ఇదిగో మనూ! ఎంతయినా మనవాళ్లకి అసూయలెక్కువోయ్‌...ఆ సుందరం అమెరికాని ఎలా తిట్టిపోస్తున్నాడో తెలుసా ఒళ్లు మండిపోతోందనుకో.' సోఫాలో కూలబడుతూ అన్నాడు నారాయణమూర్తి.

 

'అదేమిటి మీరు సంతోషపడాలిగా...' దెప్పింది మనోరమ.

 

' తమ పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేసే అవకాశం లేనివాళ్లు అవాకులు చవాకులు పేలుతుంటే విని ఊరుకోమంటావా?'

 

'అయినా అమెరికాని ఏదో అంటే మనకెందుకు అదేమీ మనదేశం కాదుగా. ఇక్కడ మన పార్కుల్లో పశువులు పేడలు, రోడ్డుమీద కుక్కలు ఇవన్నీ మన ఇండియావేకదా...'

 

'అబ్బా నన్ను ఆట పట్టించడం నీకు సరదాకదా...'

 

'పోనిద్దురూ! ఆదేశం గురించి ఎవరేమంటే మనకెందుకులెండి. అక్కడ మనమేమన్నా ఉండబోతున్నామా ఏమిటి? ఏదో పిల్లలు రమ్మన్నారు వెళ్లి వచ్చాం. వాళ్లకీ సరదా తీరింది. మనకీ ముచ్చట తీరింది.'

 

'అబ్బా నీతో వాదించి నేనెపుడు గెలిచాను కనుక...అవునూ...పెళ్లిలో ఆగోల ఏమిటి? మీ అక్కయ్య నీ చెవి తెగ కొరికేస్తోంది.'

 

 'అవన్నీ మామూలేలెండి. కోడలికీ ఆవిడకీ ఎపుడు పడింది కనుక. వినే దానిని దొరికాను కనుక తెగ వాయించేసింది.అందుకే అసలు ఈ పెళ్లిళ్లకి వెళ్లాలంటేనే నాకు తలనెప్పి అనుకోండి.'

 

'అదేం మాట మనూ! పెద్దవాళ్లం మనం వెళ్లకపోతే ఏం బావుంటుందీ...'

 

'అందుకనేగా వెళ్లాం కానీ అబ్బబ్బ అక్కడకి వెళ్లిన పిల్లలకి తల్లిదండ్రులమీద ప్రేమే ఉండదుట. బేబీ సిట్టింగులకి డబ్బులవుతాయని ఊడిగం చేయించుకునేందుకు తల్లిదండ్రుల్ని రప్పించుకుంటారుట.అమెరికా మీద పగపట్టినట్టు ఆవిడెవరో తెగ లెక్చర్లు ఇచ్చేసింది.

 

'అంత మాట అనేస్తే మరి నువ్వేమన్నావ్‌?'

 

'మరి నువ్వు  కూతురు పురుడు పొయ్యడానికి బెంగుళూరు వెళ్లి చేసొచ్చిన పనేమిటో అనేసరికి అన్న ఆవిడకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలిసింది కాదు.ఆ దెప్పి పొడుపులు గొడవలతో బొత్తిగా మనశ్శాంతి కరువై పోయి ఇంటికి వచ్చాకగానీ ప్రాణం తెరిపిన పడలేదుగదా...''

 

'సరేేలే ఈమాటలకేం గానీ ఏవోయ్‌ కోడలుపిల్లకిి ఎన్నో నెలంటావు? ఎనిమిది రాలేదూ...?'

 

'వచ్చేవుంటుంది లెండి. మనం అక్కడ ఉన్నపుడు మూడోనెల...'

 

'మరయితే పాపం అసలే ఓపలేని పిల్ల...ఒకవైపు ఆఫీసు ఒకవైపు ఇల్లు...పనిచెయ్యడం కష్టంకాదూ!' 

 

'అయితేమాత్రం మనకేం.వాళ్లేదో కష్టపడతారని మనం కట్టుకున్న ఇల్లు వాకిలీ వదిలి వెళ్లాలా ఏమిటి?'

 

'అదేంమాట మనూ! మనకి కోడలైనా కూతురయినా వసంతేగా...అసలే తల్లిలేని పిల్లాయె.'

 

'అయితే ఇప్పుడేమంటారు?' విసుక్కుంది మనోరమ.

 

'మనం కాస్త సాయంగా వెళ్తే బావుండదంటావా?'

 

'మనకెందుకొచ్చిన అమెరికా చెప్పండి. ఏదో ఇద్దరం పెన్షన్‌ డబ్బులతో హాయిగా కలిగినదేదో చక్కగా తెచ్చుకుని వండుకు తింటున్నాం.మళ్లీ అక్కడికెళ్లి ఇంట్లో ఉండి అబ్బబ్బ ఆ బోరు అదీ ఎవరు భరిస్తారు చెప్పండి.'

 

'అదికాదోయ్‌...మనమే అలా అనుకుంటే ఎలా? నీకు మీ అమ్మ కూడా లేదని మన సూరజ్‌ పుట్టినపుడు మావయ్య ఎంత సాయం చేసారో అంటూ నీ మావగారి గురించి గొప్పలు  చెప్పుకుంటావుగా.'

 

'అంటే మీ కోడలు కూడా అలా మీగురించి గొప్పలు చెప్పుకోవాలని ఉందని చెప్పకూడదూ! ఈ డొంకతిరుగుడంతా దేనికీ?'

 

'పోనీ అలాగే అనుకో...'

 

'కానీ మళ్లీ మనల్ని అమెరికా రమ్మని పీడించొద్దని కొడుక్కి ఆర్డరు వేసారుగా తమరు.'

 

'వేసాననుకో. అయినా మనూ...నీకు మాత్రం ఎంత బావుండేది అక్కడ?కొడుకు రోజూ నీ చేతి వంట తింటూంటే ఎంత సంబరపడిపోయేదానివి. పొద్దున్నా సాయంత్రం కొడుకు కోడలు కళ్లముందు కనిపిస్తున్నారు అదే పదివేలు అన్నావా లేదా గుర్తు తెచ్చుకో.'

 

'అన్నానే అనుకోండి కానీ...'

 

'ఇంక కానీ లేదు అర్ధణా లేదు...మనం కోడలి పురిటికి వెళ్లకపోతే ఏం బావుంటుంది?'

 

'ఎందుకూ? ఇక్కడకు వస్తే నేను పురుడు పొయ్యనన్నానా ఏమిటి?'

 

'అబ్బా నీతో వచ్చిన చిక్కే ఇది...అంతా వితండవాదం...వాళ్లకీ అవేవో వీసాలు గ్రీన్‌ కార్డులు...ఇంకా ఉద్యోగాలలో అన్ని రోజుల సెలవులుండవని నీకు తెలియదా ఏమిటి?'

 

'తెలుసే అనుకోండి. అయినా పిలవా పెట్టని పేరంటానికి మనకెందుకు గోల?'

 

'నువ్వు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావ్‌ మనూ! మన కడుపున పుట్టిన బిడ్డ మనల్ని పిలవాలా?ఇదిగో...నీ మావగారూ ఇలాగే అనుకుంటే నీ కొడుకుని అసలు పెంచగలిగేదానావేనా?'అలాక్కాదు మనూ! ఒక్కసారి వాళ్లవైపునుంచి కూడా ఆలోచించు...'

 

'అయినా అక్కడ వాళ్లిద్దరూ ఉద్యోగాలకి పోతే మనకేం తోస్తుంది చెప్పండి. క్రితంసారి వెళ్లినపుడు మీరెంత బాధపడ్డారో నాకు తెలియదా?

 

'నాకు బోరెందుకవుతుంది. మనవడితో చక్కగా ఆడుకుంటాను.'

 

'అబ్బా అలాగా...తప్పకుండా మీరిలాగే అంటారని... మీ సుపుత్రుడే కదూ ముందే పసిగట్టి వచ్చే వారానికి టిక్కెట్లు బుక్‌ చేస్తానని పొద్దున్నే చెప్పాడులెండి.'

 

'తోడుదొంగలు కొడుకు తల్లీ నన్నువెర్రిబాగులవాడిని చేస్తున్నారన్నమాట.'

 

'మీరా వెర్రిబాగులవాడా? ఎవరికయినా చెబితే నవ్విపోతారు.నేనేమీ వచ్చేస్తానని మీకొడుక్కి మాట ఇవ్వలేదులెండి. మిమ్మల్ని కనుక్కుని చెబుతానన్నాను.' 

 

'అలా ఎందుకన్నావోయ్‌...కోడలు చిన్నబుచ్చుకోదూ?'

 

'అయితే నాకేమిటిటా...ఇదిగో ముందే చెబుతున్నాను. తీరా అమెరికా వెళ్లాక మీకేం తోచడం లేదని... వాళ్లిద్దరూ ఉద్యోగాలకి పోతున్నారని...అంటే బావుండదు.'

 

'అనను గాక అనను...'

 

'అక్కడ లేనిదేదో ఇక్కడ ఇండియాలో ఉందని స్నేహితులు బంధువుల పలకరింపులకి మొహం వాచిపోతున్నానని తెగ వాపోయారుగా..'

 

'మన కరెంటు పలక అదే ఐప్యాడ్‌ ఉందిగా వాళ్లతో మాట్లాడుకోవడానికి? అయినా మనోరమా ఇక్కడ లేనిది అక్కడ ఉందని ఇప్పుడూ అంటాను తెలుసా?.

 

'ఏమిటో అది...?'

 

'నామనవడోయ్‌...వెళ్లాక అసలు నాకు తోచకపోవడానికి టైమెక్కడుంటుందీ అని...'

 

'అదా బడాయి!సరే అయితే లిస్టు రాయండి అక్కడికి ఏమేం పట్టికెళ్లాలో....కొడుక్కు ఇష్టమని ఆవకాయా కోడలికి ఇష్టమని చింత కాయా...ఇంకా....' 

 

'ఇదిగో నిన్నరాత్రంతా కూర్చుని మన  పలకమీద టైప్‌ చేసిందేమిటనుకున్నావ్‌...'

 

'అయ్యో రామ!  రామకోటి రాసుకుంటున్నారనుకున్నాను లెండి.అయితే మనవడు కోటి రాసారా? 'పకపకా నవ్వింది మనోరమ.

 

ఎందుకంటే ....ఆవిడకి బాగా తెలుసు...

 

'కాలం పాదరసంలాంటిది. పట్టుకునేలోగా జారిపోతుంది. నిన్నమొన్నటి జ్ఞాపకాలు నేడు అనుభవాలవుతూ...నేటి అనుభవాలు భవిష్యత్తరానికి మార్గాలు వేస్తూ...నిరంతరం తరం తరం అలా సాగిపోతూ ఉంటేనే జీవితాలకి అర్ధం పరమార్ధమూను. అంతేనా? ఈ కసురుకోవడాలు, ఓదార్పులు...అర్ధం చేసుకుని అన్నీ మరిచిపోవడాలు...ఇది నిరంతరం తరం తరంగా సాగే ప్రవాహం.ఏ తరంలో అయినా పిల్లల కసుర్లలోని అలసటలు తల్లీతండ్రి అర్ధం చేసుకోవడం...వారి మనసునెరిగి పిల్లలు ప్రవర్తించడం...ఇదే భారతీయ కుటుంబ సంస్కృతిలోని  అపురూప చిత్రం!!!'


+++

శ్రీమతి పారుపూడి వెంకట శేషారత్నం

తూర్పుగోదావరి జిల్లా- రాజమండ్రిలో 'ఆత్కూరి' వారి కుటుంబంలో పుట్టి విశాఖపట్నం 'పారుపూడి' వారి ఇంట మెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో యమ్‌.ఏ. , జర్నలిజంలో పిజి డిప్లొమాలతో ప్రాజ్ఞురాలయ్యారు. ఆకాశవాణి ప్రసారమాధ్యమంలో విశాఖ, హైదరాబాద్‌ కేంద్రాలలో దాదాపు నలభయ్యేళ్లు వాచకురాలిగా గళం వినిపించారు.

 

(అమ్మ కథాంశంతో) 'అమ్మకథలు', వృద్ధులు కథాంశంతో 'చివరిపేజీ', స్త్రీ-కథాంశంతో  'శక్తి' ,'పుటుక్కు జరజర డుబుక్కు ''హాస్యకథలు, ఇంకా 'జడగంటలు' 'పక్షిధర్మం' 'మాయసోకని పల్లె' కథా సంకలనాలు,'హోమం' నవలా సంకలనం వెలువడ్డాయి.

 

ఆకాశవాణి హైదరాబాద్‌ విశాఖపట్నం కేంద్రాలనుండి అమ్మకథలు, మాతృదేవోభవ, ఉపనిషత్‌ కథలు, భారతంలో కథలు, హాస్య కదంబం వంటి పలు ధారావాహికలు ప్రసారమయ్యాయి.

 

 ప్రపంచాన్ని చూసి కలిగే భావోద్వేగాలను కథలు, నాటకాలు, రూపకాలరూపంలో  వివిధ మాధ్యమాలద్వారా సమాజంతో పంచుకుంటున్నపుడు 'జీవని' రేడియో నాటకీకరణకు  ప్రసారభారతి న్యూఢిల్లీ వారిచే ప్రథమ బహమతి, 'పలకాబలపం' నాటికకు యన్‌సిఇఆర్‌టి న్యూఢిల్లీ వారి బహుమతి 'భర్తృహరి' దృశ్యశ్రవ్య నాటకానికి ఆంధ్రప్రదేశ్‌ నంది పురస్కారం, 'అక్షరం ' నవలకు స్వాతి అనిల్‌ అవార్డు, కథలకు వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా,  సిపి.బ్రౌన్‌ అకాడమీ, రంజని, మైత్రేయి కళాసమితి, హంసిని, చైతన్య మానవి, అఖిల, కౌముది, నారీభేరి, భూమిక, వైఖానస, పల్లకీ, రూమ్‌ టు రీడ్‌  ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక, స్వాతి సపరివారపత్రిక, నవ్య వీక్లీ,  ఇలా వివిధ పత్రికల నుండి దాదాపు 35 వరకు బహుమానపురస్కారాలు లభించాయి.

***

Satyavathi Dinavahi
Comments
bottom of page