top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

దొడ్డ మనసు

Pajna Vadlamani

జయంతి ప్రకాశ శర్మ

పేరుకే కామేశ్వరమ్మ, కాని దొడ్డమ్మ గారంటేనే ఆ ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది!

గంగా భగీరధీ సమానురాలైన కామేశ్వరమ్మ జానెడు జరి  అంచున్న తెల్ల చీరని అడ్డగచ్చగా కట్టుకుని, చూడ్డానికి చాల హుందాగా ఎప్పుడూ చిరునవ్వు మొహంతోనే ఉండేవారు. ఆవిడకి ముఫ్ఫై సంవత్సరాలకే వైధవ్యం రావడంతో పుట్టింటి పంచన చేరింది. అంతకు ముందే  చనిపోయిన తన చెల్లెలి ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలని పెంచే బాధ్యత వారిమీద పడింది. ఆ పిల్లలు ‘దొడ్డమ్మ’ అని పిలిచేవారు. అదే పిలుపు వీధిలో వాళ్లకి, ఊరులో కూడా అలవాటైపోయింది.

అలా అంతమంది తమ పంచన  చేరినా, ఆ ముసలి దంపతులు  అధైర్య పడిపోలేదు. ' ఏం చేస్తాం! అంతా వాడి లీల!'  అని అనుకుని ముందుకు నడిచారే గాని గుండెలు బాదేసుకోలేదు. వాళ్ళకి ఉన్న ఆస్తంతా ఆ గట్టు మీదున్న రెండు వాసలిల్లే. వెనక వాసలో దేవుడిల్లు, వంటిల్లు, ఓ పెద్ద వరండా, ముందు వాసలో రెండు గదులు ఉన్నాయి.   అయితే ఆ వెనక వాస లోనే ఆ ముసలమ్మ జీవితాన్ని, ఆ జీవితంలో స్వర్గాన్ని చూస్తూ ఉంటుంది. ఆవిడకి ఉదయం నాలుగు గంటలకే తెల్లారేది.

దేవుడింట్లో ఓ గంట పూజచేసి, ఐదు గంటలకు వంటింట్లోకి వెళితే, మళ్ళీ మధ్యాహ్నం పదకొండు గంటల వరకు బయటకు వచ్చిన దాఖల్లేవనే చెప్పాలి!  ముందులో కర్రలపొయ్యి మీద వంట చేసేది. దానితో సాగలేక బొగ్గుల కుంపటికి మారింది. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత కూడా అక్కడే గుమ్మంమీద తల పెట్టుకుని కాస్సేపు నడుం వాల్చిన తర్వాతే ముందు వాస చూసేది. సాయంత్రం ఎప్పుడైనా వీధి అరుగు మీద కూర్చుని, వచ్చేపోయేవాళ్ళని పలకరించి, యోగక్షేమాలని అడిగి వాళ్ళ కష్టం సుఖం తెలుసుకుని,  చేతనైన మాట సాయం చేసేది. ఆ ముసలయానికి అప్పటికే ఎనబై సంవత్సరాల పైబడ్డ వయస్సు. ఉదయం , సాయంత్రం ఆ వీధి చివరవరకు వాహ్యళిగా వెళ్ళి ఓ నలుగురిని పలకరించటమే ఆయన దినచర్య. మిగతా సమయంలో ఇంటిపట్టునే రేడియో పట్టుకు కూర్చునేవారు. ఆయనికి కాస్తా వినికిడి, కంటిచూపు సమస్యలు కూడా ఉండేవి. అందుకే మామ్మగారే ఇంటికి ఎవరైనా వస్తే సమాధానం చెప్పేవారు.

"ఏమిటో  మామ్మగారూ!  ఈ వయసులో మీకెన్ని కష్టాలో/?” అంటూ ఎవరైనా సానుభూతితో మాట్లాడితే, ఆవిడ ఒప్పుకునేది కాదు.

"అదేమిటే! కష్టాలు మనుషులకు కాకుండా, మానులకొస్తాయా?  ఆ పిల్లల అదృష్టం బావుండీ మేం ఇంకా బతికే ఉన్నాం. లేకపోతే ఆ చిన్నపిల్లలు, మా పెద్దపిల్ల పరిస్థితి ఎలా ఉండేదో?  అయినా నారుపోసినవాడు నీరు పోస్తాడులే తల్లీ!" అంటూ కొంగుతో కళ్ళు ఒత్తుకునేది.

గుడ్డిలో మెల్లలా ఆమధ్య దాయాదుల ఆస్తి పంపకాలలో కామేశ్వరమ్మకి భర్త తరపున,  గురచారివారి వీధిలో ఉన్న ఓ రెండు వాసల ఇల్లు, తన వాటాగా రావటం కొంత ఊరట కలిగింది. దానిమీద కొద్దిపాటి అద్దే, వేడి నీళ్ళకి చన్నీళ్ళులా  కలిసొచ్చింది. తన తండ్రికి పింఛను వస్తుంది. ఇంటి అద్దె, పింఛనులతో ఇంటి ఖర్ఛులు గట్టెక్కుతున్నాయి. ఇక తల్లిదండ్రులు వయస్సు మీరడంతో ఆ సంసార బాధ్యతలని కామేశ్వరమ్మే  తీసుకుంది. తన వంశం అక్కడితో అంతం కాకుడదనే ఉద్దేశంతో తన చెల్లి పిల్లలలో మధ్యవాడ్ని దత్తత చేసుకున్నది. అయినా సరే , అందర్నీ ఒకేలా చూసుకుంటూ తల్లిలేని లోటు వాళ్ళకి కనబడకుండా పెంచి పెద్ద చేసింది.

 

 నాలుగైదు నెలలకోసారి చోడవరంలోఉన్నా తన భర్త తరపు బంధువుల ఇంటికి వెళ్ళి,వస్తూ ఉండేది. అక్కడికి వెళితే, చుట్టం చూపుకు వచ్చిన కామేశ్వరమ్మకి ఏదో విధంగా సహాయం చేసేవారు. ఇక బంధువులైనా బంధాలైనా కోనేరుగట్టే కదా అని ఆనందంగానే సరిపెట్టుకుంది.

**

"దొడ్డమ్మగారు మాఅబ్బాయికి వచ్చే నెలలో ఉపనయనం చేస్తున్నాం. చక్కిలాలు, అరిసెలు ఉండాలిగా. అవి ఎలా చేస్తారో మాకెవ్వరికి తెలియదు! కాస్త ఆ ఉపకారం మీరే చెయ్యాలి!" అంటూ ఎవరడిగినా సరే... "అదేం భాగ్యమేతల్లీ!  ఓ రెండు రోజుల ముందుగానే,  మీ ఇంటికొచ్చి చేసిపెడతానులే! మీరు మిగతా పనులు చూసుకోండి!" అంటూ అభయం ఇచ్చేవారు.

"ఇదిగో అమ్మాయీ! వాడికి ఉపనయనం చేస్తే చేసారుగాని, పెళ్ళి గట్రా అంటూ వాడ్ని సతాయించకండి. వాడి చదువు పూర్తికావాలి, ఉద్యోగం రావాలి, అందులో స్దిరపడాలి, అప్పుడు పెళ్ళి చేయాలి!! అంతేగాని,ఎదో ఓ  పనయిపోతుందని పెళ్ళి చేయటం మంచిదికాదు తల్లీ!" అంటూ హితవు కూడా చెప్పేది.

అలా గట్టు మీదందరికి తలలో నాలుకలా అలవాటైపోయింది. కామేశ్వరమ్మ కాస్తా దొడ్డమ్మగారు అయిపోయింది.

'పోయినవాళ్ళగురించి బెంగపెట్టుకుని కుంగిపోవటంకన్నా అందర్నీఆప్యాయంగా కలుపుకోవడమే జీవితం!' అన్నదే నిజమని  నమ్మింది దొడ్డమ్మగారు.

తన పెంపకంలో  పెరిగిన పెద్దమ్మాయి స్కూల్ ఫైనల్ పరీక్షలు అయిపోయే వరకు ఏమీ అనిపించలేదు గాని "వీళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలికదా" అనే ఆలోచన  వచ్చేసరికి దొడ్డమ్మ ఒక్కసారి ఉలిక్కిపడింది. అందరిలో పెద్దవాడు ప్రసాద్, స్కూలు ఫైనలవటంతోనే కడపలో గవర్నమెంటు ఉద్యోగం వచ్చి అక్కడకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మాయి స్వరూపం ఆ ఎడాది స్కూలుఫైనల్ పరీక్షలు రాసింది.  అంతకంటే పెద్ద చదువులు చదివించడానికి స్తోమత లేదు. ఇప్పటి వరకు ఏదో గట్టెక్కింది గాని ఇప్పుడెలా అన్న ఆలోచనలు దొడ్డమ్మని వేధించ సాగాయి. దానికితోడు ఈమధ్య తండ్రి కూడా మంచం పట్టడంతో దొడ్డమ్మకి కొంచెం భయం పట్టుకుంది. తల్లిదండ్రులు లేని పిల్లలంటే సంబంధాలు అంత తొందరగా దొరుకుతాయా? పెళ్ళికొడుకులకు సవాలక్ష కోరికలు, ఆలోచనలూ ఉంటాయి.

"నువ్వా ఆలోచనలతో బెంగ పెట్టుకోకమ్మా! సమస్యలు ఇవాళ మనకేం కొత్తకాదు. మన వంశానికి ఎప్పుడూ సమస్యలు, కష్టాలే తల్లీ!  వాటిని ఎదుర్కొని, మన తాతలు తండ్రులు మనల్ని పెంచి పెద్ద చేసారుగా. మనం కూడా అలాగే వాటిని ఎదుర్కోవాలే గాని, డీలా పడిపోకుడదమ్మా !  మన ప్రయత్నాలు మనం చేద్దాం. ఆపైన భగవంతుడిమీద భారం వెయ్యడమే!" అంటూ తల్లి హీతబోధ చేయటంతో దొడ్డమ్మకి కొంచెం ధైర్యం వచ్చింది . కాని 'ఎలా' అనే ప్రశ్న అలా బుర్రని తొలుస్తూనేఉండేది.

ఇప్పటి వరకు ఆ ఇంటి మీదొచ్చే అద్దె, తండ్రికొచ్చే  ఫించను డబ్బులతో ఇల్లు గడిచిపోయింది. ఇక పెద్దబ్బాయికి ఉద్యోగం రావటం, వాడు జీతాలు అందుకోగానే డబ్బులు పంపుతుండటంతో అర్ధికంగా కూడా కొంచెం స్ధిమతపడ్డంతో దొడ్డమ్మగారికి కాస్త ధైర్యం వచ్చింది. స్కూల్ ఫైనల్ రిజల్స్ రావటం, అందులో స్వరూపం ఫస్టుక్లాసులో పాసుకావటం మరింత  ఊరట కలిగించింది.

"దొడ్డమ్మగారు చూశారా!  ఇక మీకు అన్ని మంచి రోజులే ! ఒకదాని తర్వాత ఒకటి అన్ని మంచి వార్తలే!!  స్వరూపం ఫస్టు క్లాసులో పాసైయిందిగా. అలా పాసైనవాళ్లకి సెంట్రల్ గవర్నమెంటులో నేరుగా ఉద్యోగం ఇచ్చేస్తారుట. ఓ అప్లికేషన్ని పెట్టమనండి!" అంటూ వీధిలో వాళ్ళందరూ వచ్చి ఆనందం వ్యక్తపరచారు. దానితో స్వరూపం ఆ ప్రయత్నాలలో పడింది.

స్వరూపంకి  ఉద్యోగం వచ్చిన  రోజు ,"వేళా విశేషం, మీ నోటి చలవ కాకపోతే ఎమిటీ.. ఆరోజు మీరిచ్చిన సలహా ప్రకారం స్వరూపం ఓ ఆర్జీ పెట్టుకుంది. నెల తిరక్కుండానే టెలిఫోన్ల ఆఫీసులో ఉద్యోగంలో చేరమంటూ ఉత్తరం వచ్చిందర్రా!  అందుకే మీ నోరు తీపి చేద్దామని సున్నుండలు చేసాను. ఇవి తిని ఇలాంటి తియ్యని మాటలు పదికాలలపాటు చెపుతూ ఉండండి!" అంటూ దొడ్డమ్మగారు గట్టంతా సంబరంగా తిరిగాడారు.

**

స్వరూపం ఉద్యోగంలో చేరటం, రెండు జీతాలు అందుకోవటం ఇట్టే గడిచిపోవడంతో  దొడ్డమ్మగారి అలోచనలు మళ్ళీ మొదటికొచ్చాయి. దానికితోడు ఇప్పుడు స్వరూపం సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగస్తురాలు కదా. అంతకంటే ఓ పెద్దద్యోగస్తుడ్ని చూడాలి. ఎలాగో ఏమిటో..  అన్న అందోళన ఆవిడ్ని వెంటాడుతూనే ఉంది. మరో నెల గడిచింది. శ్రావణమాసం అడుగుపెట్టింది. ఎందుకైనా మంచిదని ఆ గట్టుమీదే వున్న నరసింహంగారికింటికెళ్ళి స్వరూపం నక్షత్రం, రాశి చెప్పి "బాబయ్యగారూ మా స్వరూపం జాతకం చూసి దానికి వివాహయోగ్యం ఎప్పుడో కాస్తా చెపుదురు" అంటూ ఆ ప్రయత్నంకూడా చేసింది.

"స్వరూపానికేవమ్మా... జాతకం మహ బేషుగ్గా ఉంది! తొందర్లోనే కళ్యాణ ఘడియలు వస్తాయమ్మా!" అంటూ రెండు నిమిషాలలో తేల్చిపారేసారు.

“తొందరలోనే.. అంటే..” దొడ్డమ్మగారు అనుమానంగా అడిగారు.

“అదేనమ్మా.. ఓ సంవత్సరంలో  అయిపోతుంది! బంగారం లాంటి పిల్ల, దానికి తోడు గవర్నమెంట్  ఉద్యోగం చేసుకుంటున్నాది. ఇంకేం కావాలి!”

ఆ మాటలతో  దొడ్డమ్మగారికి ఊరటకలిగిందే గాని, ఓ ఏడాదిలో అంటే భయం వేసింది. దానికి తోడు  స్వరూపం ఆఫీసులో అందరు మగాళ్ళే. రోజులు అసలే బాగాలేవు. ఆడదాని జీవితం అసలే అరిటాకు వంటిది,  ఏలాగో , ఏమిటో.. అని రోజు దొడ్డమ్మగారు కొంచెం ఆందోళన గానే ఉండేవారు.

ఉన్నట్టుండీ ఓ రోజు స్వరూపం "దొడ్డా .. రేపు మా ఆఫీసువాళ్ళందరు కలసి సింహచలం వెళ్తున్నారు. ఎల్లుండి ఆఫీసుకి శెలవు. ఆ రాత్రికి  తిరిగి వచ్చేస్తారుట. సింహచలం నేనెప్పుడూ చూడలేదుగా, నేను వెళ్తాను దొడ్డా!" అంటూ ప్రాధేయ పడేసరికి దొడ్డమ్మకి వద్దని చెప్పలానిపించలేదు.

మర్నాడు ఉదయమే స్వరూపం సింహచలం వెళ్ళింది. ఆ రోజు దొడ్డమ్మగారు మాత్రం అన్యమనస్కంగానే ఉన్నారు. ఉన్నట్టుండి  “నేను చోడవరం వెళ్ళి వస్తాను!” అంటూ ప్రయాణం అయింది. అంత అర్జంటుగా దొడ్డమ్మ చోడవరం ప్రయాణం ఎందుకు పెట్టుకుందో, ఇంట్లో వారికీ  అంతు చిక్కలేదు.

రాత్రి ఎనిమిదైయింది. సింహచల దేవస్ధాన కళ్యాణ మండపంలో  పెళ్లి పీట్లమీద కూర్చున్న స్వరూపం, దొడ్డమ్మని చూస్తూనే ఒక్కసారి గతుక్కుమంది. వళ్లంతా చెమటలు పట్టేసాయి. నోటంట మాటకూడా రాలేదు.

అయితే దొడ్డమ్మలో కంగారు కనబడలేదు. చిరునవ్వుతో ఎప్పటిలాగే వుంది.

"పిచ్చిపిల్లా!!  నేనేం కాదంటానా! నేనయితే చదువుకొలేదు  కాని, నువ్వు చదువుకున్నావు! మంచి, చెడ్డా  అన్ని నీకు తెలుస్తాయి! నీ మీద నాకా నమ్మకం ఉందమ్మా!" అంటూ ఒక్కసారి ఊపిరి తీసుకుని తనతో తెచ్చుకున్న మరచెంబులోని నీళ్లు తాగుతూ క్రీగంటా  స్వరూపం పక్కనున్న పెళ్ళికొడుకుని చూసి సంతృప్తిగా మంచినీళ్ళు తాగటం ముగించింది. ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో అక్కడున్న పది, పదిహేనుమందికి తట్టలేదు. దొడ్డమ్మగారు ఎలా  స్పందిస్తారో అని అందర్లో ఒకటే గుండె దడ! అంతటా నిశ్శబ్దం ఆవరించింది. రెండు నిమిషాల తర్వాత దొడ్డమ్మగారే అన్నారు.

"మీ అందరిని పెంచి పెద్దచేయటం, పెళ్ళిళ్ళు చేయటం… ఇవన్నిటిని  బరువు బాధ్యతలుగా ఎప్పుడూ అనుకోలేదమ్మా! నా జన్మకి అవో వరాలుగానే భావించాను! మీ అయిదుగుర్ని పెంచి, పెద్దచేసి,  అక్షింతలు వేసే బాగ్యం, పాపం.. మీ అమ్మనాన్నలకి దక్కలేదు! కానీ విచిత్రంగా, ఆ అదృష్టాన్ని, అన్ని కోల్పోయిన నాకిచ్చాడమ్మా ఆ భగవంతుడు! అందులో బంగారం లాంటి మొదటవకాశాన్ని వదులుకుంటానా తల్లీ!!" అంటూ తన కాళ్ళపై మోకరిల్లిన స్వరూపాన్ని దగ్గరకి తీసుకుంది.

ఉబికొస్తున్న కన్నీటిని తుడుచుకోడానికి ఆవిడ చేతుల్లో చీరకొంగులేదు. అక్కునచేరిన కొత్త దంపతులున్నారు.

దొడ్డమ్మగారి దొడ్డమనసు వాళ్ళకే కాదు... అక్కడికి అరవై మైళ్ళ దూరంలో వున్న కోనేరుగట్టుక్కూడా కొట్టొచ్చినట్టు కనబడింది.

OOO

bottom of page