top of page

కథా​ మధురాలు

మళ్ళీ కథ మొదలు

 

అనన్య

Ananya.jpg

కుక్కరు ఏడు కూతలు కూసింది. హాల్లో పేపరు చదువుకుంటున్న విశ్వనాథం వంటింటి వైపు, బెడ్ రూమ్ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. సాధారణంగా కుక్కరు పక్కనే నుంచొని నాలుగు కూతలు రాగానే కట్టే భార్య ఈరోజు మూడు అదనపు కూతలకు అవకాశం ఇచ్చిందే అని విస్తుపోయి, తానే వెళ్లి కుక్కరు కట్టి, బెడ్ రూమ్ వైపుకి నడిచాడు. అన్నపూర్ణ మాంచి హడావిడిగా ఉంది. మంచం నిండా ఏడెనిమిది పట్టుచీరలు పెట్టి ఉన్నాయి. వాటిని చూస్తూ తనలో తానే ఏదో మాట్లాడుకుంటోంది. విశ్వనాథం వచ్చిన అలికిడికి తలెత్తి, "అమ్మయ్య, వచ్చారా? మిమ్మల్నే పిలుద్దాం అనుకుంటున్నాను. మీరే చెప్పండి సుమతి తాంబూలాలకి వీటిలో ఏది బాగుంటుందో" అంది.

 

"సుమతికి తాంబూలాలు ఏమిటేవ్? పెళ్లి కుదిరిందేమిటి? అదింకా కాలేజీలో లేదూ?" అన్నాడు విశ్వనాథం. "ఉంటే ఉందిలెద్దురూ. దానికి సంబంధం కుదిరింది, వాళ్ళు చేస్తున్నారు. మధ్య మనకెందుకు అభ్యంతరం? ముందు మీరు చీర గురించి చెబుదురు" అంది అన్నపూర్ణ.

 

"నాకేం తెలుసు? పోనీ ఈ చిలుకపచ్చచీర కట్టుకో" అన్నాడు.

 

"అది పార్థుగాడి కొడుకు పుట్టినరోజుకి కట్టేశాను కదండీ?" అంది అన్నపూర్ణ.

 

"కడితే?"

 

"మీరు భలేవారే. వాళ్ళింట్లోనే ఇంకో పేరంటానికి అదే కడితే అన్నపూర్ణ మొగుడు పాపం దానికి చీరలే కొంటున్నట్టు లేడు" అనుకోరూ? "

 

"అనుకుంటే అనుకుంటారు. అయినా వద్దనుకునే చీరని ఇలా అన్నిటికీ పైన పెట్టి చూపిస్తే వద్దనుకున్నదని నాకెలా తెలుస్తుందే?"

 

"పెట్టకముందు గుర్తులేదు. తర్వాత గుర్తొచ్చింది. ఫోన్లో వెతికి ఆ పార్టీ ఫోటోల్లో చూసి రూఢీ చేసుకున్నాను".

 

"సరే ఈ ఎర్ర చీర కట్టుకో".

 

"ఏదో మీ అక్కయ్యగారు పెట్టారని ఉంచుకోవాలి తప్ప, అసలు ఆ చీరకి ఆ బోర్డరు ఏమైనా నప్పిందిటండీ?" అంది తిప్పుకుంటూ.

 

విశ్వనాధం నోరువిప్పి అనేలోపే అన్నపూర్ణ అందుకుంది. "మరి చూడమని పైన ఎందుకు పెట్టావూ అంటారు. అంతేగా? ఉన్న చీర ఎప్పుడో ఒకప్పుడు కట్టాలిగా? తాంబూలాలు అయిపోయాక భోజన సమయంలో కట్టుకుంటాను. ఇది పక్కన ఉంచుదాం. అసలు కార్యక్రమానికి చీర ఏమి కట్టాలో చెప్పండి."

 

"ఈ వంకాయ రంగు?"

 

"దానికి ఇంకా జాకెట్ కుట్టించలేదు. ఎల్లుండే తాంబూలాలు."

 

"పోనీ ఆ నీలం రంగు?"

 

"మా వరలక్ష్మి వదిన కూడా అదే కడతానంది. ఇద్దరం బ్యాండు మేళంలా ఒకటే రంగు ఎందుకు?"

 

"అన్నీ నీకే తెలుసు. నన్నెందుకు అడుగుతావు? ఏదో ఒకటి కానివ్వు."

 

"అంతేలెండి, మీ చెల్లెలికి, వాళ్ళ కూతుళ్ళకి అయితే అడగకుండానే రబ్బరు బ్యాండ్లు కూడా మ్యాచింగులు చెప్తారు. నా దగ్గరికి వచ్చేసరికి ఓపిక ఉండదు."

 

"ఓపిక లేక కాదు. నీకు ఏం నచ్చుతుందో అర్థం కాక."

 

"కర్మ, కర్మ, పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏం నచ్చుతుందో, ఏం నప్పుతుందో తెలియదు పాపం. సరే, ఈ నెమలి కంఠం రంగు చీర వేసుకోనా?"

 

"అది చీకట్లో అయితే బాగోదు. పగలే ఆనుతుంది. ముహూర్తం పగలా, రాత్రా? బయటా, లోపలా?"

 

"ఏమోనండోయ్, అవేమీ ఇంకా నాకు తెలియవు."

 

"అదేమిటి?"

 

"మా సుబ్బారావు బావ ఇంకా పిలిస్తేగా? పిలిచినప్పుడు అడుగుతాను."

 

"ఎల్లుండే తాంబూలాలు అంటున్నావు?"

 

"ఊళ్ళో ఉండే చుట్టాలమే కదా? రేపనగా పిలిచినా చాలుగా?"

 

"మనకి చాలు కానీ, అసలు పిలుస్తారంటావా అని."

 

"పిలవక ఏం చేస్తాడులే కానీ, ఈ గులాబీ రంగు చీర కట్టేసుకుంటాను. మొన్నటి శ్రావణ మాసంలో కొనుక్కున్నదే. ఇంకా ఏ ఫంక్షన్ కీ కట్టలేదు."

 

ఇంత త్వరగా సెలక్షన్ అయిపోయినందుకు అమ్మయ్య అనుకొని ఊపిరి గట్టిగా పీల్చుకొని, "అవును, ఇదైతే పగలైనా, రాత్రయినా బానే ఉంటుంది" అన్నాడు.

 

"బోర్డరు కూడా బానే ఉంది. వరలక్ష్మి వదిన ఈ రంగు వేయదు. జాకెట్ కూడా ఉంది. ఈమధ్య కుట్టించినదే కనుక కుట్లు విప్పుకొనే పని కూడా ఉండదు" అంటూ ఆ చీరని శభాష్ అన్నట్టు చరిచి మిగిలిన చీరలన్నీ బీరువాలో సర్దుకోవటం మొదలుపెట్టింది అన్నపూర్ణ.

 

"ఎవరు పెట్టారేమిటి ఈ చీర?" కుతూహలం ఆపుకోలేక అడిగాడు విశ్వనాథం. "డబ్బు ఇచ్చింది మీరే. పండక్కి కొనుక్కోమని. సెలక్షన్ కి మాత్రం మా అన్నయ్యని తీసుకువెళ్ళాను" అంది. "అదే అనుకున్నానులే" అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.

 

ఆ సాయంత్రం అన్నపూర్ణ ఫోన్ మోగింది. "ఏం వదినా? పిలుపు వచ్చిందా?" అని అటునుంచి వరలక్ష్మి అడిగింది. "లేదు వదినా, నీకు అందిందేమిటి?" అంది కుతూహలాంగా అన్నపూర్ణ. "లేదు వదినా. అసలు పిలుస్తాడంటావా సుబ్బారావన్నయ్య? నేను మా ఆయన్ని సెలవు పెట్టి తాంబూలాలకి తీసుకువెళ్ళాల్సిందే అని గొడవ చేసి మరీ ఒప్పించాను. మధ్యాహ్నమే భాస్కరం గాడితో వెళ్ళి, కొత్తగా చేయించుకున్న రవ్వల గాజులు, దుద్దులు బ్యాంకు లాకర్ లోంచి తెచ్చుకున్నాను. మొన్న సంక్రాంతికి కొనుక్కున్న గులాబీ రంగు చీరకి రాత్రిలోపు జాకెట్ కుట్టమని టైలర్ కి ఇచ్చి వస్తున్నాను" అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పింది వరలక్ష్మి.

 

"అదేమిటి, నువ్వు నీలం రంగు అన్నావుగా? అలా అన్నావనే నేను గులాబీ రంగు చీర కట్టుకుంటున్నాను వదినా" అంది అన్నపూర్ణ ఆదుర్దాగా. "ఏది? ఆ శ్రావణమాసం నాటిదేనా?" అని అడిగి సమాధానం కోసం ఆగకుండా కొనసాగించింది వరలక్ష్మి. "ఆ గులాబీ లేత గులాబీ. నాది ముదురు గులాబీ. ఏం పర్వాలేదు. కట్టేద్దాం" అని ధైర్యం చెప్పింది. ఇక వరలక్ష్మి వదిన మాటకి ఎదురు చెప్పలేక, వేరే జాకెట్లను సరిదిద్దుకునే ఓపిక లేక ఒక నిట్టూర్పు విడిచి గులాబీ చీరని ఒకసారి అనురాగంతో నిమిరింది అన్నపూర్ణ.

 

తెల్లారి ఆరింటికి వరలక్ష్మి ఫోనే మేల్కొలిపింది అన్నపూర్ణని. "వదినా, పిలుపు వచ్చిందా?"

 

"ఇంకా లేదు వదినా. రాత్రేగా మాట్లాడుకున్నాం? ఈలోగా అర్థరాత్రి వస్తుందా పిలుపు?" అని ఒకింత విసుక్కుంది అన్నపూర్ణ.

 

"ఏమో వదినా. మా ఆయన నా పోరు పడలేక సెలవు పెట్టేశారు. తీరా సుబ్బారావన్నయ్య పిలవకపోతే నా పుట్టింట్లో అటూ ఇటూ ఏడేసి తరాలవారిని ఎండగడతారు. నీకు తెలియనిది ఏముంది చెప్పు? రవ్వల దుద్దులు, గాజులు వేసుకోకుండానే లాకర్ లో దాచాలంటే ప్రాణం ఒప్పట్లేదు. అన్నిటికీ మించి కుసుమకుమారి నన్ను ఒక్క తన్ను తంతుంది తాంబూలాలకి వెళ్ళకపోతే".

 

"ఆవిడెవరు వదినా?"

 

"నా టైలరు. ఇంకేముంది, అర్జంటుగా కుట్టమని కాళ్ళకింద నిప్పులు పోసి కుట్టించుకున్నాను".

 

"నువ్వు మరీను. టైలరు అలుగుతుందని పిలవని పేరంటానికి వెళ్తామా ఏమిటి?"

 

"అంటే అన్నయ్య పిలవడంటావా?"

 

"పిలిస్తే వెళ్తాము, లేకపోతే లేదు. పోనీ దుద్దులు, గాజులు ఇప్పుడే వేసేసుకో."

 

"చాల్లే, చూసేవాళ్ళు నవ్విపోతారు. సరే, పిలుపు అందితే ఒక మెసేజ్ పెట్టు వదినా. మరచిపోకు."

 

"సరే వదినా. నువ్వు కూడా."

 

ఈ ఫోన్ కాల్ అయ్యాక అన్నపూర్ణకి, వరలక్ష్మికి ఒక పూట ఒక పుష్కరంలా గడిచింది. గులాబీ చీరని ఇస్త్రీ చేసుకొని, చిన్న బ్యాగులో ఆడపడుచు పెట్టిన చీరని కూడా సర్దుకుంది అన్నపూర్ణ.

 

రాత్రి పదకొండింటికి మోగింది ఫోను. సుబ్బారావు బావ మొత్తానికి చేశాడు. సంబంధం కుదిరిన వారానికే తాంబూలాల ముహూర్తం అవ్వటం వల్ల కంగారు అయ్యిందని, ఊరు కాని ఊళ్ళో తాంబూలాలు అందుకుంటున్నందువల్ల హడావిడి అయ్యిందని, ఏమిటేమిటో హడావిడిగా చెప్పి, మొత్తానికి "రేపే తాంబూలాలు, రమ్మ"ని చెప్పాడు బావ. ఆ ఫోను పెట్టిందో లేదో వరలక్ష్మి ఫోను.

 

సస్పెన్స్ సినిమాలో చిక్కుముడి విడినట్టు అన్నపూర్ణ కొంత ఊరట పొందింది. విశ్వనాధాన్ని లేపి మరీ విషయం చెప్పింది. "మొత్తానికి పిలుపు వచ్చిందండీ. నా చీరకి ఇస్త్రీ చేసుకోవటం వృధా అవ్వలేదు, వరలక్ష్మి వదిన రవ్వల దుద్దులు ఉత్తినే లోపలకి పోలేదు, రామబ్రహ్మం అన్నయ్య సెలవు వృధా కాలేదు, అన్నిటికీ మించి కుసుమకుమారి అలగక్కరలేదు".

 

"ఆవిడెవరు?"

 

"అదో పెద్ద కథలెండి. మీకు అర్థం కాదు. సుబ్బారావు బావ వద్దనే అనుకున్నాడట. గోపాలం బావ చొరవ తీసుకొని పిలిపించాడట ఊళ్ళోని చుట్టాలని పిలవకపోతే ఎలాగని".

 

"అయితే వెళ్తావా? ఆఖరి నిముషంలో ఏదో మొహమాటానికి పిలిచారు పాపం. మీ వరలక్ష్మి వదిన ఏమైనా చక్రం తిప్పిందంటావా?"

 

"చాల్లెండి. భలేవారే. చక్రాలు, శంఖాలు ఎవరు తిప్పినా, పిలిచాక వెళ్ళకపోతే నొచ్చుకోరూ? నేను వెళ్ళాల్సిందే. సరే, పడుకోండి. నేనసలే పొద్దున్నే లేచి వెళ్ళాలి" అంటూ లైటార్పి పడుకుంది అన్నపూర్ణ.

 

లేత గులాబీ చీరలో అన్నపూర్ణ, ముదురు గులాబీ చీర, రవ్వల నగలతో వరలక్ష్మి, సుమతి తాంబూలాల కార్యక్రమంలో సందడిగా పాల్గొన్నాక, భోజనాల సమయం అయ్యింది. ఆఖరి బంతిలో ముఖ్య కుటుంబసభ్యులతో కూర్చున్నారు వదినలిద్దరూ.

 

 పప్పన్నం అయ్యిందో లేదో గట్టిగా ఒక పద్యం వినిపించింది. అంతా సద్దుమణిగారు.

 

మగపెళ్ళివారిలో ఎవరో "భోజనకాలే హరినామ స్మరణ" అంటూ అందుకున్నారు అన్నమాట.

 

తర్వాత ఇటు ఆడపెళ్ళివారిలో ఒక పెద్దాయన పద్యానికి పద్యంతోనే సమాధానం ఇచ్చారు. అటు ఈసారి ఇంకా గట్టిగా ఇంకో పద్యం కుదిరినన్ని సమాసాలను సమోసాలుగా చుట్టేసినట్టున్న పద్యం అది. ఇక ఇటువైపునుండి విచిత్ర పదబంధనాలతో చిత్రవిచిత్రంగా అల్లిన మరో పద్యం.

 

ఈ పద్యాల ఎపిసోడ్ వరకూ హాయిగా పద్యాలు వింటూ వంకాయ కారం పెట్టిన కూర తింటోంది అన్నపూర్ణ.

 

అంతలో అటువైపు నుండి గాయనీమాతల్లులు శ్రావ్యంగా ఒక కృష్ణుడి పాట అందుకున్నారు. ఇటువైపు కూడా పాట పడాల్సిందే అన్నట్టు ఈలోగా ఎవరు ఏం పాడాలని ఆలోచించేసుకుంటున్నారు. అన్నపూర్ణ వైపు చూశారు కొందరు.

 

పక్కనుంచి గోపాలం బావ పిల్లలు మోచేత్తో గుచ్చి "పాడు, పాడు" అంటున్నారు. నోటి నిండా బొబ్బట్టు ముక్క. పాడాలంటే వెంటనే మంచినీళ్ళు తాగాలి. ఇటు కూర్చున్న అనంతలక్ష్మి కూతురు చిన్నారి ఇందాకే తన నీళ్ళ గ్లాసు ఖాళీ చేసి, అన్నపూర్ణ గ్లాసులోంచి కూడా తాగేసింది. అవతల పాట చివరికి వచ్చింది. ఆ చివర కూర్చున్న కాముడు పిన్ని కొరకొరా చూస్తోంది. "చిన్నప్పుడు ఏదో సంగీతం వెలగబెట్టావు కదటే? పాడు మరీ" అంటున్నాయి ఆ కళ్ళు.

 

"పాడాలనే ఉంది పిన్నీ. నీళ్ళు కావాలి" అంటూ అన్నపూర్ణ సైగ.

 

ఈ సైగలు చూస్తున్న శ్రీనుగాడు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు. తాగి పాడటానికి సిద్ధమయ్యింది అన్నపూర్ణ. ఆడపెళ్ళివారి పాట అవ్వగానే పాడదాం అని గొంతు సరిచేసుకుంది. ఆ కాస్త గ్యాప్ లో మళ్ళీ పద్యాల పోటీ మొదలయ్యింది. మరింత వెతికి వెతికి అల్లసానివారి అల్లికలను, కాళిదాసువారి ఉపమానాలను గుర్తుచేస్తూ ఆడుకుంటున్నారు పండితవర్యులు భోజనం చేయటం మాని.

 

ఒకొక్క పద్యం అవ్వగానే పాట మొదలుపెట్టాలని అన్నపూర్ణ ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఎవరో ఒకరు పద్యమో, శ్లోకమో అందుకుంటూ భోజనశాలను ఛందోబద్ధంగా హోరెత్తిస్తున్నారు. పోనీ ఇక మనకి అవకాశం రాదులే తినేద్దాం అనిపించింది అన్నపూర్ణకి.

 

విస్తరిలో ముక్కల పులుసు వడ్డించేశారు. అది విస్తరి దాటి ప్రవహిస్తుంటే అన్నంతో ఆనకట్ట వేసింది. విస్తరి పక్కన కప్పులో కరిగిపోతున్న ఐస్క్రీమ్ వైపు జాలిగా చూసింది. ఎండిపోతున్న చెయ్యి ఒకవైపు, మళ్ళీ గ్లాసు లాక్కోవాలని చూస్తున్న చిన్నారి ఒకవైపు. కొరకొరా చూస్తున్న కాముడు పిన్ని ఒకవైపు. ఈలోగా ఒక శ్లోకం అవ్వగానే, వరలక్ష్మి వదిన కుర్చీ బిగ్గరగా కిర్రుమని చప్పుడు చేస్తూ గబుక్కున లేచి నుంచుంది. పద్యం ఎత్తుకోబోయిన లక్ష్మణరావు మావయ్య ఆగి ఇటు చూశాడు.

 

"వదినగారు పిలవాడి మీద కృష్ణుడి పాట పాడారుగా? ఇప్పుడు మా అన్నపూర్ణ మా పెళ్లికూతురు మీద పాట పాడుతుంది" అని కూర్చుంది. తన అవస్థను అర్థం చేసుకున్న వదినకి కళ్ళతోనే థాంక్స్ చెప్పి హాయిగా ఒక పాట పాడేసి, పులుసన్నం, పెరుగన్నం తినేసి, ఐస్క్రీమ్ లాగించేసింది అన్నపూర్ణ. కాముడు పిన్ని శాంతించింది. చిన్నారి దాహం తీరింది.

 

అందరూ అలసిపోయి, భోజనాలు ముగించారు. వరలక్ష్మి వదిన ఒకోసారి మాట మాట్లాడనివ్వకుండా ముందరి కాళ్ళకి బంధం వేస్తుంది కానీ, ఇలా చొరవ తీసుకోవటం తననుంచే నేర్చుకోవాలి అని మరోసారి అనుకొని నవ్వుకుంది అన్నపూర్ణ.

 

ఇంటికి చేరగానే, రిటర్న్ గిఫ్ట్ టేబుల్ మీద ఉంచి, సుమతి పెళ్ళిలో ఏ చీరలు కడితే బాగుంటుందో వెతుక్కోవటం కోసం బీరువా తెరిచింది అన్నపూర్ణ. ఈలోగా ఫోన్ లో రెండు మెసేజ్ లు వచ్చాయి.

 

"ఈసారి సుమతి పెళ్ళిలో ప్రతి సందర్భానికి మనిద్దరం ఒకటే రంగు చీర కట్టుకుందామే వదినా" - వరలక్ష్మి వదిన.

 

"సుమతి పెళ్ళినాటికి నాలుగు మంగళహారతులు నెమరువేసుకో. ఈరోజులా నీళ్ళు నమలకు" - కాముడు పిన్ని.

 

*****

bottom of page