top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

    చిచ్చు

 

   నవులూరి వెంకటేశ్వర రావు

Venkateshwarrao.jpg

                                                                                                                                                                                                                                                                                    ఇంటి గుమ్మం ఎడమ పక్కన ఉన్న అరుగు మీద సుదిన్న కూర్చున్నాడు. బుద్ధుడిలా కూర్చుని ఉన్నా, మనసు మాత్రం అదుపు లేని ఆలోచనలతో అల్లకల్లోలంగా ఉంది.

 

ఉన్నట్టుండి పక్కకు తిరిగి ఇంటిలోపలకు చూశాడు. పెరటి గుమ్మానికి నాలుగైదు అడుగుల దూరాన, పడుతున్న చీకటిలో, నక్షత్రంలా మెరుస్తూ సాయంసంధ్య అలంకరణలో మునిగి వెనుదిరిగి ఉన్నది భార్య. సగం జుట్టును వీపు మీద ఒదిలి మిగతా సగాన్ని ముందుంచుకుని దువ్వుకుంటోంది. అవిరామంగా, ఆ పాలరాతి విగ్రహం నాట్య విలాసాలు చేస్తూనే ఉంది శరీరం నుంచి ఎడమ చేసిన చేతుల కదలిక ద్వారా. సుఖానుభవానికి వేసిన మెట్లలా ఉన్నాయి ఆమె జుట్టు నొక్కులు.

 

అతని చూపులు ఆమె శరీరాన్ని తాపంతో నిమిరినట్టు, ఉన్నట్లుండి ఎడమ భుజం మీది నుంచి వెనుకకు చూసింది. అతను తనను తదేకంగా చూడటం గమనించి ఆమె కళ్ళు మిలమిలలాడాయి, బెదిరాయి. బెదురు కనబడకుండా చేసే ప్రయత్నంలో మధురంగా నవ్వింది. అతను తల తిప్పేసుకున్నాడు. అతనిది శృంగారదృష్టి కాదని ఆమె గ్రహించింది. ఆ చూపులో ఈ మధ్య గంభీరమైన నైరాశ్య భావన కనిపిస్తోంది ఆమెకు. అంతకు ముందు ఆమె అతని కళ్ళలో లాలసను మాత్రమే చూస్తుండేది.

 

కొంత కాలంగా -  ముసలితనం, రోగం, చావు, దుఃఖం గురించీ ప్రస్తావిస్తున్నాడు, నిట్టూరుస్తున్నాడు. ఆమెకు అతని మాటల్లో నైరాశ్యం జొరపడినట్లు అనిపిస్తోంది. అతనిలో ఆమె చూస్తున్న వింత వైఖరి స్వీయ భ్రమగా ఆమె భావించదలచుకుంది. కానీ ఒక రోజున తనను పక్కన కూర్చోపెట్టుకుని అత్త గారు హెచ్చరిక ధ్వనించే స్వరంతో, ఎదో కీడునో పీడనో శంకిస్తున్నట్లు గానూ, కించిత్ మందలింపుగానూ అనింది. "వాడికి మరింత దగ్గిరగా ఉండు!" దానికి తాను ఏమి చెయ్యాలో మాత్రం చెప్పలేదు. పలుగుతాడు తెంచుకు పోగల శక్తి ఉండి ఒక ధృడమైన నిశ్చయానికి వచ్చిన పశువును ఏ తాడుతో, ఎంతకాలం కట్టడం?

 

"జన్మంటూ ఎత్తిన తర్వాత ప్రకృతిసిద్ధమైన, అతి సాధారణమైన మానవుల సుఖాలు, అనుభవాల గురించి అసహజంగా భయపడుతున్నారు," అనింది భార్య ఒక రోజు.

 

"మరో జన్మ లేకుండా చేసుకో గలిగే మార్గం ఉన్నపుడు ఏ అనుభవాల ప్రసక్తీ ఉండదుగదా?" అన్నాడు.

 

ఇల్లు అనేక పాపాల, దుఃఖాల, కోర్కెల పుట్ట. ముందు శాంతి, పిదప సాధన ద్వారా జన్మ రాహిత్యం పొందాలంటే పాములా ఈ పుట్టలో ఉండడం మాని, రెక్కలు తెచ్చుకుని పక్షిలా గృహ రాహిత్యంలోకి ఎగిరి పోవాలి. పునరపి జననం, పునరపి మరణం, మధ్యలో దుఃఖ సాగరంలో ఈత. అతనిలో కలుగుతున్న వైరాగ్యం అతనినే ఆశ్చర్యపరుస్తోంది. ఇది సహజసిద్ధంగా తన మనసులో జరుగుతున్నదా, తాను తెచ్చిపెట్టుకుంటున్నాడా అన్న ప్రశ్న పదే పదే మెసలక పోలేదు. ఈ ఆలోచనా సరళికి కొన్ని రోజుల క్రితం అయిన బుద్ధ దర్శనమే కారణం. ఆ దర్శన ప్రభావం నుంచీ బైట పడటం అతనికి సాధ్యపడటం లేదు. ఈ లోకాన్ని బుద్ధుడి దృక్కోణం నుంచీ చూస్తున్నాడు సుదిన్న. మానవ జీవితం జీవించడానికి అనర్హమైనది అని అనిపించడం ఆరంభమయింది. ఈ జీవితాన్ని రాబోయే జన్మల పరంపరనుంచీ తప్పించుకోడానికి ఉపయోగించుకోవాలన్న యోచనలో ఉన్నాడు.

 

ఆ రోజు రాత్రి యథావిధిగా ఎంతవరకూ ఏకమవడం సాధ్యమో అంతవరకూ అయ్యారు. ఆమె శరీరపు ముడతలు, మడతలు, ఒంపులు, మూలలు, ఆవేశం, శరీరపు వెచ్చదనం, మెత్తదనం, సుగంధం, స్వాస, హాసం, స్వరం, కదలికలు అతన్ని అంతగా అలరించలేదు. కొన్ని కోర్కెలు తీర్చుకోడం ద్వారా తీరవు. కనీసం ఈ ఒక్కటి. రావణ కాష్ఠములా మండుతూనే ఉంటుంది. తీర్చుకోవడం అంటే చిదుగులు దానిలోకి జొనిపినట్లే. శరీరం, మనసు సుఖానికి బానిసలు. వాటిని జయించే ప్రయత్నమే కదా 'మార్గం పండించుకోవడం' అంటే. నేను ఒక ధృడమైన   నిర్ణయానికి వచ్చి, ఇల్లు వదిలిన క్షణం నుంచీ వాటిని అదుపు చేయడం ఆరంభమవుతుంది అనుకున్నాడు వెల్లకిలా పడుకుంటూ.

  **

 

మరుసటి రోజు తండ్రి బలవంతం మీద మిత్రులతో కలిసి కళంద గ్రామం నుంచి వ్యాపార నిమిత్తం వైశాలి వెళ్ళాడు. పనైపోయిన తర్వాత మిత్రులను గ్రామం వెళ్లిపొమ్మని, అతను బుద్ధుడు విడివిడిదిచేసున్న  కూటాగారశాలకు వెళ్ళాడు. బుద్ధ ప్రవచనం మొదలయింది. ఆయన దగ్గిరగా వెళ్లి కుడివైపు కూర్చున్నాడు. బుద్ధుడు అందంగా హుందాగా ఉన్నాడు.  చక్కటి శరీర ఛాయ. ఆయనను చూస్తుంటే ఆనందం కలుగుతోంది. ఆయన ప్రవచనం మీద విశ్వాసం కలుగుతోంది. స్వరం మృదు మధురంగా ఉంది. చెప్పే విషయంలో స్పష్టత ఉంది. ప్రబోధకులకే ప్రబోధకుడిలా ఉన్నాడు. భిక్షులతో కొలువు తీరి ఉన్నాడు. భిక్షువులలో భిక్షువుగా ఉన్నాడు. చెప్పినది శ్రద్ధగా విన్నాడు సుదిన్న. ప్రవచనం పూర్తయిన తర్వాత ఆయనకు చేరువగా వెళ్ళాడు. సుదిన్నతనతో ఎదో మాట్లాడే ఉద్దేశంతో ఉన్నట్టు గ్రహించి, మాట్లాడమన్నట్టు తల ఊపాడు. బుద్ధుడితో ఇలా ముఖా ముఖీ జరుగుతుందని కలలో కూడా గ్రహించలేదు. ఒళ్ళు పులకరించింది. ముందు నోరు పెగలలేదు. ధైర్యం కూడగట్టుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు. తన సంక్షిప్తంగా మాట్లాడాలి.

 

"భంతే, మీరు చెప్పినదానిని నేను అర్థం చేసుకున్నంతవరకూ, అనురాగమూ కోర్కెలతో బంధించే గృహ జీవితాన్ని కొనసాగిస్తూ - జీవన్ముక్తి అవసరమైన పవిత్ర జీవనాన్ని కలిగి ఉండడం అసాధ్యం. గృహ జీవితాన్ని వర్జించి, ముందుకు అడుగిడి మిమ్మల్ని ధర్మాన్ని, సంఘాన్ని శరణుకోరడానికి అనుమతిని ఇవ్వండి."

 

"మంచిది. దానికి నీ తల్లిదండ్రుల అనుమతి ఉందా?"

 

"ఇంకా తీసుకోలేదు, శాస్తా."

 

"రాహులుడిని సంఘ జీవితంలోకి తీసుకున్న సమయాన శుద్ధోదన రాజు గారికి ఒక మాట ఇచ్చాను తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే సంఘంలోకి ఎవరినన్నా చేర్చుకుంటానని."

 

"ఇప్పుడే తీసుకుని వస్తా."

 

బుద్ధుడు నవ్వాడు, అది అంత తేలిక అన్నట్టు భావించినట్టున్న సుదన్నను చూసి. ఇంకా రాత్రవకుండానే తన మీద వెన్నెల పడినట్లు అనిపించింది సుదన్నకు. నమస్కరించి, లేచి తన కుడివైపుకు ఆయన వైపునుంచి నడుస్తూ వెలుపలకు వచ్చాడు.

 

ఆఘమేఘాల మీద ఇల్లు చేరాలనిపించింది దివ్యానందంతో మనసంతా నిండి. తాను ఆలస్యంచేస్తే సదావకాశం చేజారిపోతుందేమో అన్న శంక కలిగింది. తమాయించుకున్నాడు. తాను భాగమైన ప్రస్తుతపు జీవిత చిత్రాన్ని మనసుకు పట్టించుకుంటూ నెమ్మదిగా నడవాలనిపించింది. ఇది తనకు వద్దనుకుని చేజార్చుకోబోతున్నది. తాను వేరే లోకంలోకి అడుగిడుతూ దీనికి వీడ్కోలు పలకడం తన కనీస ధర్మం కదూ! ఇంత వరకూ తనను దానితో కట్టి ఉంచిన బంధాలను నిర్దాక్షిణ్యంగా తెంపుకుపోతేనే స్వేచ్ఛ గలిగేది, తాను ఎంచుకున్న పథంలో నడవడానికి వీలయ్యేది. ఈ మానవ జీవితం అద్భుతమైనది అని కాకుండా, ఇకపై దీని చెంతకు రాకూడనిదానిగా, దుఃఖమయమైనదానిగా చూడగలగాలి.

 

వెలుతురూ చీకటీ - ఒకదాన్ని తరుముతూ మరొకటి.  కూస్తున్న గాడిద, మేస్తున్న గుర్రం.  తను కనబడకుండా ఉండడానికి గుమ్మం చాటున నిలబడి, తను మాత్రం వాకిటి ముందు ప్రవహిస్తున్న జీవితాన్ని చూస్తున్న చారడేసి కళ్ళ అందగత్తె.  నడుమును అంతకు మించి వంచడం సాధ్యపడినంత గూనితో తలను భూమికి సమాంతరంగా ఉంచి నడుస్తున్న స్త్రీ.  కలిసి సుఖిస్తున్న రెండు కుక్కలు, ఆ సుఖం తనకు దక్కనందుకు చూసి విచారిస్తున్న మరో కుక్కా.  నిన్న మరణాన్ని చూసి రోదించిన ఇల్లు.  నేడు పుట్టుకతో ఆనందభరితంగా ఉన్న ఎదురిల్లు.  రహదారి పక్కన ఆరోగ్యం, యవ్వనాలతో విర్రవీగుతున్న యువకులు.  వీధి పక్కన కూర్చుని దగ్గి  ఉమ్ముతున్న ముదుసలి ...

 

ఇంట్లోకి అడుగిడగానే ఎదురొచ్చింది భార్య అలంకృతై. ఆమె మొహంలోకి చూశాడు. ఇహం గురించే గాని పరం గురించే గానీ వెంపర్లాడని మనసును అది ప్రతిబింబిస్తోంది. ఆమె అలంకరణ చేసుకోవాలంటే ఇక అది ఆమె గురించే చేసుకోవాలి.

 

"అమ్మానాన్నా ఏరి?"

 

"ఆరామంలో ఉన్నారు."

 

అది ఇంటి వెనుకుంది. వెళ్ళాడు ధ్వంసం చేయబోతున్న సుడిగాలిలా. అలవోకగా వీస్తున్న గాలికి చెట్లు ఊగుతున్నాయి మెచ్చుకుంటున్నట్లు, ప్రోత్సహిస్తున్నట్టు. పూలతో ఫలాలతో తులతూగుతున్నాయి. వెండి రేకుల నగిషీలతో ఉన్న బల్ల ఉయ్యాల చెట్టుకు వేలాడుతోంది ఊపడం అనే ధర్మానికి కట్టుబడి ఉన్నట్టు. చీకూ చింతా లేకుండా ముచ్చటించుకుంటూ నెమ్మదిగా ఊయలూగుతున్నారు తల్లిదండ్రులు, ఈ జన్మకు ఇలా సాగిపోతే ఇంకేమి కావాలనేమో. పోట్లాటలోనూ వినోదం ఉన్నట్లు ధ్వనులు చేస్తూ అక్కడికక్కడే చెట్ల మీద ఎగురుతున్నాయి రంగురంగుల పక్షులు. తోటకు అటు దిగువున పారే సెలయేటి రవళి ఇక్కడికి వినిపిస్తోంది, మారాంచేసే ప్రియురాలి స్వరంలా. ఇదంతా ఒక లోకం - ఎవరు సృష్టించిందో.  దానంతట అదే ఏర్పడినదో. నిజంగా మోసపూరితమైనదా? కొన్ని క్షణాలు అచేతనంగా నిలబడిపోయాడు ఆ చిత్రాన్నిచూస్తూ. తాను దీన్ని ఒదిలి వెళ్ళిపోతున్నందుకేమో అంతా  కొత్తగా, మొదటి సారి చూస్తున్నట్లూ గమనిస్తున్నట్లూ ఉంది. తల్లిదండ్రులను ఈ తోటలోని ప్రతి అంశాన్ని దాని చైతన్యాన్నీ ఒదిలి వెళ్ళిపోబోతున్నాడు -  తన గమ్యం వీటన్నిటికన్నా విలువైనది అని తాను అనుకోబట్టి. కొత్త మార్గం ముళ్ళ మయమైనా అతనిని బాధించదు. అది అసలు అతను ఆశించిన ఫలాన్ని ఇవ్వగలదా అన్నశంక అతనిలో కలగడం లేదు. జ్ఞాపకాలుగా కూడా వీటిలో వేటికీ మనసులో స్థానం ఇవ్వకూడని జీవితం ఆరంభం కాబోతోంది.

 

"అమ్మా... !"

 

ఉయ్యాల దిగింది.

 

"లోపలికి వస్తారా ఇద్దరూ?"

 

అతని ముఖంలోని, స్వరంలోని భావరాహిత్యం ఇరువురి కాళ్ళూ తడబడేట్లు చేసింది. పడబోతోంది అనుకున్న పిడుగు పడబోతోందా?  ఆయాసపడుతూ ఇంట్లోకి వచ్చారు. శ్రమవలననో ఆందోళన వలననో ఇద్దరికీ ముచ్చెమటలు పోశాయి, ఉపోద్ఘాతానికి అతను పూనుకో దలచుకో లేదు. కఠినమైన నిర్ణయాన్ని కఠినంగానే చెప్పాలి.

 

"బుద్ధుడిని కలిసి వచ్చాను. సంఘంలో చేరబోతున్నాను. మీ అనుమతి తీసుకుని రమ్మన్నారు."

 

"ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి.  గొంతులో దుఃఖం సుడి తిరుగుతోంది బైటకు వచ్చే మార్గం తెలియనట్లో తోవ మూసేసినట్లో.

 

"నీకేమైనా పిచ్చిపట్టిందా?" అనగలిగింది తల్లి.

 

"లేదమ్మా, కప్పిన మాయ తొలగింది."

 

"తల్లిదండ్రులను బలవంతం చేసైనా అనుమతి తెచ్చుకో అని బుద్ధుడు చెప్పాడా? ఎవరి అనుమతితో ఆయన అర్థరాత్రి ఇల్లు వదిలాడు?" తండ్రి వ్యంగ్యంగా అన్నాడు.

 

"దైవ నింద ఒద్దు, నాన్నా."

 

"దేవుడు పెట్టినా చిచ్చు చిచ్ఛేగా?"

 

"నువ్వు చేద్దామనుకున్న పని మానుకో, సుదిన్నా. మా గుండెలు రగులుతున్నాయి. అలాంటి కష్టానికి ఈ వయసులో మమ్మల్ని గురిచేయడం అహింస క్రిందికి వస్తుందా?" తల్లి అనింది.

 

"ఇలాంటి హింస గురించి కాదు తపించి మరీ నిన్ను కనింది.  మమ్మల్ని ఉద్ధరించాలనీ కాదు. మా ఆనందం గురించీ కన్నాము, నిజమే. అంతే కాదు, ఎప్పటి నుంచో వాహినిలా సాగుతున్న మన వంశం మా తదనంతరము, నీ తరువాతకూడ  సాగిపోవాలని. ఇదొక్కటే మా తుది కోరిక - ఏ  తల్లిదండ్రులైనా ఆశించేది. నిన్ను నమ్ముకుని ఈ ఇంట అడుగుపెట్టిన మరో జీవి ఉన్నదన్న విషయమూ నీ దృష్టిలో ఉన్నట్టు లేదు. యవ్వనపు తుది దశలోనే దాని జీవితం చట్టుబండలవ్వాలా? మా జీవితార్ధం నీవు. అర్థరహితమైన జీవితం సాగించాలా మేమూ?" తల్లి అనింది.

 

"మన జీవితంలో దుఃఖం తప్ప ఏముందీ? వంశం కొనసాగటమంటే దుఃఖాన్ని తరతరాలూ కొనసాగించడమేగా?" సుదిన్న అన్నాడు.

 

"మన జీవితంలో ఏ దుఃఖం ఉందీ.  ఏ కొరత ఉందీ? వడ్డించిన విస్తరి నీ జీవితం.  కానీ బిక్షాపాత్రనాశ్రయించ దలచావు. తరాలు గడిచినా కూర్చుని తినేంత ఆస్తి. చాలక వొద్దన్నా వొచ్చిపడుతూనే ఉంటుందది. అటు చూడు నీ భార్యను.  చిదిమి దీపం పెట్టొచ్చు. సుగుణాల ప్రోవు. నీవే ఆరు ప్రాణాలూ దానికి. నీకూ ఆమె నిన్నటి దాకా అంతేగా? భ్రమరంలా ఆమె చుట్టూ తిరుగుతూ గడిపావే. ఈ జీవితమంటే మనసు విరిగింది, మాయ తొలగింది అన్నావు. అది నిజం కాదు. మాయ ఇప్పుడు కమ్మింది," తల్లి అనింది అనునయంగా.

 

"అందాలూ పడుచుదనాలూ అనుభవాలూ ఒకేలా ఉండిపోతాయా? అనారోగ్యం, వార్ధక్యం, చావు వద్దంటే అటునుంచీ అటు వెళ్ళిపోతాయా? అవి లేని మార్గంకై ఈ పయనం."

 

"అవేవీ రేపో మాపో రాబోవడం లేదు కనీసం ఈ జీవితంలో. మరో జన్మ ఉందొ లేదో అసలు తెలియదు. లేనిదాన్ని ఉందనుకుని ఉన్న జీవితానికి చిచ్చు పెట్టుకుంటావా? మేమంతా జన్మ పరంపరలో దుఃఖిస్తూనే ఉండాలి, వ్యథలకు గురవుతుండాలి నీకు మాత్రం వాటి నుంచీ విముక్తి కావాలి.  పచ్చి స్వార్థం కాదా? మమ్మలనూ  నీతో వచ్చెయ్యమంటావేమో! ఎప్పుడో, నిజానికి మరో జన్మలో సంభవించే వాటి గురించీ ఇప్పుడే దిగులుపెట్టుకునో వణుకుతూనే గడపాలా? యావత్తు మానవాళికి లేని దుఃఖాలూ ఇడుములూ మనకు మాత్రమే దాపురించబోవడం లేదు కదా. మరో జన్మ ఎత్తరాదని కమండలాలు పట్టుకుని మానవాళి అడవులకు దారి తీస్తే ఊళ్లు ఖాళీ అయిపోతాయి," తండ్రి అన్నాడు తొంగి చూసే కోపంతో.

 

"పిల్లవాడికి నయగారాన్ని వుపయోగించి చెప్పాలిగాని వేదాంత చర్చ తోనో కసిరో కాదు," భర్తతో అనింది.

 

"సరే, లాలించి ఒప్పించు."

 

"అమ్మా నాన్నా, మీరు కోపగించినా నేనేమీ బాధపడను. కోపగించినా లాలించినా నా నిర్ణయం మారదు. ఎక్కడో విన్నట్టు కాటేస్తేగాని కృష్ణ సర్ప విషం ఎక్కదు. ఈ విషయ  ప్రపంచాన్ని చూస్తే చాలు మరణ సదృశమైన అనుభవాలకు. "

 

ఆ రాత్రి ఎవరూ ఎంగిలిపడలేదు. కంటికి కునుకూ రాలేదు. ఆ ఇంటిలోని నలుగురికి గానూ, ముగ్గురి మనసులనిండా దుఃఖం. ఈ దుఃఖం వింతైన కష్టానిదిగా అనిపించింది సుదిన్న భార్యకు. ఈ దుఃఖం ఈ రాత్రికి పరిమితమైనది కాదనిపించి మరి కొంత శోకం ఆమెను విచలితను చేసింది. కాళ రాత్రంటే ఇలాంటిదేనేమో.

 

విషయం తెలిసిన మరుసటి రోజు సుదిన్న మిత్రులు నచ్చజెప్ప విఫల యత్నం చేశారు. సుదిన్నా వారం పాటు భోజనం మానేసాడు. స్నేహితులొచ్చి ఈ సారి అతని తల్లిదండ్రులకు నచ్చ చెప్పే  ప్రయత్నం చేశారు.

 

"మీరు ఒప్పుకోకపోతే  ఇక్కడే ప్రాయోపవేశం చేసి మరణించేట్టున్నాడు. పరివ్యాజకుడిగానైనా ఎక్కడో చోట బ్రతికుంటాడు మీరొప్పుకుంటే. కొంత భిక్షు జీవనం సాగించి దాన్ని భరించలేకో మొహమ్మొత్తో తిరిగి రావచ్చు కాషాయాన్ని అక్కడే ఒదిలి. సంసార జీవితాన్ని మరిగిన వాడు దానికి ఎంత దూరంగా జరగాలని చూసినా, మనసూ శరీరం ఉండనియ్యవు. జ్ఞాపకాలు వేధిస్తాయి. అలా వెనక్కు వచ్చిన అనేక మందిని చూడడం లేదా మనము?"

 

తల్లిదండ్రులు చేసేది లేక ఒప్పుకున్నారు. ఆ రోజు సాయంత్రమే బుద్ధ దర్శనం  చేసుకున్నాడు సుదిన్న. ఆరోజే మోక్షం సిద్ధించినట్లు, జ్ఞానోదయం కలిగినట్టు అనిపించిందతనికి.

 

"స్వామీ, నా తలిదండ్రుల అనుమతి లభించింది. నన్నుముందు అడుగు వేయనిచ్చి ధర్మోపదేశం చేయండి."

 

"స్వాగతం, భిక్షువు! పవిత్ర జీవనాన్ని సాధన చెయ్యి. నేను బాగుగా బోధించిన ధర్మం దుఃఖాన్ని నిర్మూలిస్తుంది."

 

 శిరోముండనం చేయించుకుని, మూడు పీలికలతో కుట్టిన కాషాయపు అంగీ తొడుక్కున్నాడు. ఇప్పుడు భిక్షాపాత్రే అతని ఏకైక ఆస్తి.

 

**

 

 

ఇంటినుంచి నిష్క్రమిస్తున్నపుడు భార్య ఒక సంచీ ఇచ్చింది,

 

"ఇది మామూలుగా చేసే ఊరి ప్రయాణం కాదు," అన్నాడు.

 

వేడుకోలుగా చూసింది సజల నయనాలతో. ఈ విషయంలో లొంగి పోయాడు. ఆమె ఏడిచింది ఆమె ఆఖరి కోర్కెను మన్నించినందుకు. దుఃఖానికి ఎన్ని కారణాలు!

 

ఆ రాత్రి అది తెరిచి చూశాడు. ఒక జత బట్టలు, ఒక చిన్న భరిణ కనిపించాయి. ముందుగా భరిణను  తీశాడు. రెండు బంగారు నాణాలున్నాయి. బట్టలు పైకి తీశాడు. తెల్లటి పంచెను ఆశ్రయించి ఒక నొక్కుల వెంట్రుక ఉంది. పంచెను లోపలి తోసి, చూపుడు, బొటన వ్రేళ్ళతో  వెంట్రుకను పంచె నించి వేరు చేసి బైటికి లాగి కళ్ళముందు నిలువుగా ఉంచుకుని చూశాడు. వయ్యారంగా, స్నిగ్దత్వంతో ముడుచుకుపోతోంది.  గాలికి రెపరెపలాడుతోంది. ఒదిలేద్దామనుకుని, మనసు మార్చుకున్నాడు. విషయ ప్రపంచాన్ని ఒదిలి వేయాలన్న అతని నిర్ణయాన్ని వెంట్రుక కట్టి పడేసింది. భరిణెలోని నాణేలను చీకటిలో దూరానికి కసిగా విసిరేశాడు. ఖాళీ భరిణెలోకి వెంట్రుకను ఓపికగా సర్దాడు.

 

"ఈ సంచీల్లోని వస్తువులు, నేను తిరిగి రాకపోతానా అన్న ఆమె ఆశను తెలియజేస్తున్నాయి."

 

అతను దాచుకున్న భార్యకేశం ఒక పశువుకు కట్టిన తాడులా అతన్ని ఇంటితో కట్టిపడేసినట్టు అనిపించింది. అతని మనసును చిలికి అనేక భావాలను చిందింపజేసింది. కేశమా, బంధమా, వదులుకోవడం అసాధ్యమైన జ్ఞాపకమా? రెండు వ్రేళ్ళనూ ఎడం చేస్తే చాలు గాలి దాని పనిని అది చేసుకుపొయ్యుండేది. ముందు ముందు ఎన్నో కోర్కెలను, బలహీనతలను, జ్ఞాపకాలను వదిలించుకోవాలి, విదిలించుకోవాలి అని చెబుతున్న పాఠంలా కూడా వుంది భార్య పలితకేశం. ఒక వెంట్రుకను ఒదిలిపెట్టడానికి కూడా సంకల్పం అవసరం. ఈ విషయ ప్రపంచంలో నిజానికి ఆ వస్తువు ప్రాధాన్యత, పరిమాణం ఎంత? ముందు ముందు తానెంపిక చేసుకున్న ధర్మ మార్గంలో తన పురోగతిని కొలుచుకోవడానికి ఆ వెంట్రుక ఒక కొలబద్ద. ఎలాంటి భావోద్రేకానికీ లోనుకాకుండా దాన్ని గాలికి ఎప్పుడు ఒదిలెయ్యగలుగుతాడో అప్పుడు తన మనసు కొంత దూరం తాను ఎంచుకున్న ధర్మ మార్గంలో పయనించినట్లు భావించవచ్చు. ఆతను వెళ్ళ వలసిన ఎత్తుకు వెళుతున్నప్పుడు అతని ప్రయత్నంలో 'నీవు మొదటి సోపానం పైనే ఉన్నావు' అని అతనికి అది గుర్తుచేస్తున్నట్లు అనిపిస్తోంది.

 

సుదిన్న పునర్జన్మ ఎత్తాడు. ఇప్పుడు సాధారణ ప్రాపంచక సుఖాలు లేవు. గడిపిన జీవితం మాత్రం జ్ఞాపకాలై వెన్నంటుతుంటుంది పిచ్చికుక్కలా. దాన్ని తోలి తోలి దానికి కొంచం కొంచం దూరమవుతున్నాడు సుదిన్న. రెండు స్థాయిలు అతని ముందున్నాయి. మొదటి దాంట్లో సుఖాలు అనుభవించే ఇంద్రియాలకు అది దక్కకుండా చూసుకోవడం. రెండవది మనసుతో సహా ఇంద్రియాలను సుఖాలను అడగని స్థాయికి తేవడం. అతను రెండుగా చీలి లోకం మీద అతని రెండవ సగం మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఆ రెండవ సగాన్ని ఎప్పటికి ఓడించగలడన్నది ప్రశ్నార్థకం.

 

పొద్దున్నే లేవడం, స్నానాదులు ముగించుకోవడం, ధ్యానంలో మునగడం, ప్రవచనాలు వినడం, సందేహాలు తీర్చుకోవడం, చర్చలలో తన స్థాయి వారితో తాను పాల్గొంటూ ఉండడం, భిక్షాటన చేయడం, రాత్రిళ్ళు ఒళ్ళు మరచి నిద్రపోవడం. ఆ చివరిదొక్కటే అతను పొందుతున్న - దూరం చేసుకోలేని - సుఖం.  అది లౌకికమైనదో అలౌకికమైనదో. సత్యాన్ని దీపంగా భావించమన్నాడు, సత్యాన్నే ఆశ్రయించమన్నాడు, పెరవారి సాయం అక్కర్లేదు - అన్నాడు బుద్ధుడు. కోర్కె చెడ్డది కాదు.  స్వార్థ పూరిత కోరిక చెడ్డది అన్నాడు. ధర్మం అనే ద్వీపం మీద నివసించమన్నాడు.

 

పది సంవత్సరాల కాలం గడిచిపోయింది. అది నడిచిందో, పరిగెత్తిందో అతని గమనికకు రాలేదు. దేశమంతా తిరుగుతున్నాడు. కరువు కాటకాలు వచ్చాయి. భిక్ష దొరకడం గగనమయ్యింది. సొంత ఊరు వెళ్ళడానికి బుద్ధుడి అనుమతి తీసుకున్నాడు. తనతోబాటు చాలా మంది భిక్షువులను తీసుకు పోదలచాడు. ఇప్పుడు [తనది కాని] ఇంటి దగ్గర భిక్ష దొరుకుతుంది కొన్ని రోజులు.

**

 

ఇల్లు చేరి ఇంటిముందు నిలబడ్డాడు భిక్ష అడగడానికి. అతన్ని పెంచిన సేవకురాలు ఇంటి మొగిలి నుంచి వచ్చి పాత్రలోని నిన్నటి బార్లీ జావను పారబోయపోతే దాన్ని తన భిక్షాపాత్రలోకి  పోయించుకుని తాగాడు. రుచి అన్నమాటను ఏనాడో మరిచాడు. ఆ ముసలిది భిక్షువును తదేకంగా చూసింది. దాని గుండె ఆగినట్టు, నిలబడిపోయింది అచేతనంగా. క్షీణించిన శరీరంతోటి, వాడిన శరీర ఛాయతోటీ ఉన్న సుదిన్నను గుర్తు పట్టింది. లోపలికి పరిగెత్తి వెళ్లి యజమానురాలికి విషయం తెలియజేసింది. వెర్రితనం నిండిన కళ్ళను పెద్దవి చేసుకుని వినిందామె. సుదిన్న భార్య దుఃఖం ఆపుకోలేక నేలమీద చతికిల పడింది గోడకు అనుకుని. తడబడుతూ సుదిన్న తండ్రి వరండాలోకి వచ్చాడు. అతని వెంటనే అతని భార్య వచ్చింది.

 

"రా నాయనా, వచ్చి భోంచెయ్," అన్నాడు తండ్రి.

 

"నా భోజనం ఈ రోజుకు ముగిసింది."

 

"ఇంట్లోకి ఒకసారి రావచ్చుగా, శత్రువులు లేరిక్కడ," తల్లి పలికింది.

 

కీలుబొమ్మలా, హృదయాన్ని ఎక్కడో, ఎప్పుడో కోల్పోయినవాడిలా ఇంట్లోకి నడిచాడు. ఒక గదిలో భిక్షువులు భోంచేస్తున్నారు. దాంట్లోనుంచి ఒక లోపలి గదిలోకి తండ్రి కొడుకు చేతిని పట్టుకుని - నడక నేర్పుతున్నట్టు నడిపించాడు. సుదిన్న భార్య అక్కడుంది. ఆమె ఉందన్న విషయం గమనించనట్టు చూపులు  ఆ వైపుకు తిప్పలేదు. సుదిన్న భార్య అతని వైపు చూసే ధైర్యం చేయలేదు.

 

"ఇక వస్తా!"

 

"అప్పుడేనా?" తండ్రి అన్నాడు.

 

"పోనీ రేపైనా భోజనానికి వస్తావా?" అని ఆశగా అడిగింది తల్లి.

 

వస్తానని తల ఊపాడు.

 

కొడుకును మరో గదిలోకి లాక్కుపోయాడు. అక్కడ నిలబడిన మనిషి కనబడనంత ఎత్తున రాసులుగా పోసి వెండి, బంగారు నాణాలున్నాయి - ఒక్కొకటి మూడు పోగులు.

 

"ఇది మీ అమ్మ కట్నంగా తెచ్చినది. ఇది మీ నాన్న సంపాయించినది. మూడవది మీ తాత, అంటే మా నాన్న, మనకు ఒదిలి పోయినది. వీటన్నింటికీ నీవు వారసుడివి. నీవు కాదనుకుంటే నీకు సంతానం కూడా లేకపోవడం వలన నీ దాయాదులు కొల్లకొట్టుకు పోతారు."

 

"నీ భార్యను ఒక్క సారి చూడు," కోడలిని అతని వైపు తోసి అనింది.

 

"ఒక పని చెయ్యండి. పెద్ద గోనె సంచులు కుట్టించండి. వాటిని వీటన్నిటితో నింపండి. బండి  మీద తీసుకెళ్లండి. గంగా నదిలో వీటిని ముంచండి. ఎందుకు చెబుతున్నాను? వీటి కారణంగా మీరు దొంగల భయంతో జీవించాలిసి వస్తోంది. స్వామి  ఈ  విధంగా  సెలవిచ్చారు  - 'విషయ బంధాలకు కారణం, విషయాలు  కలిగించే  దుఃఖం మీదకన్నా అవిచ్చే సుఖానందం పైనే దృష్టి పెట్టటం.  పిల్లలు కలవారు పిల్లలవల్లే దుఃఖిస్తారు.  పశు మందకలవారికి పశువులే దుఃఖ కారణం అవుతాయి.' సుఖం మెరుపు లాంటింది. అది మెరిసి ఊరుకున్నా తరువాత విచారం, బాధా మిగులుతుంది. మెరుపు మెరిసిన క్షణం కన్నా ఆ రెండే మనలను ఎంతో కాలం పీడిస్తుంటాయి. జీవహింస, దొంగతనం చెయ్యకపోవడం, లైంగికసుఖాన్ని వదులుకోవడం, నిజం మాత్రమే మాట్లాడటం, తాగుడును దరికి రానీయక పోవడం - ఈ పంచ సూత్రాల సుఖాన్నీ మరిగాను. త్రిరత్నాలయిన బుద్ధుడు, సంఘం, ధర్మాలను ఆశ్రయించాను. మీరు చెబుతున్న క్షణిక సుఖాల ఊబిలోకి ఎలా దిగమంటారూ? మీరు పాత పాట పాడకండి."

 

దశాబ్దం తరువాత కలిసి వాళ్ళతో అంత కఠినంగా మాట్లాడుతున్నందుకు ఒక పక్క మనసు నొచ్చుకుంటోంది. కరుణ ఊపిరిగా జీవనాన్ని తాను ఎంచుకున్నాడు. దుఃఖాన్ని ధర్మంతో నిర్మూలించ తలపెట్టి వాళ్ళ దుఃఖానికి తాను కారణమయినాడు.

 

"నీ మనసు మార్చడం సాధ్యమయ్యే పని కాదు. నీ దారిన నీ ప్రయాణం కొనసాగించుకో. కానీ, మా ఒక్క కోర్కెను మాత్రం మన్నించు," అతని తల్లి అడిగింది.

 

"నీ కోర్కెను మన్నించగలిగిన శక్తి నాకుండాలికదా?"

 

"ఆ శక్తి నీకు లేదని మాకు అనిపించి ఉంటే కోరే ప్రసక్తే ఉండదు," తండ్రి అన్నాడు.

 

మౌనంగా తల్లి మొహంలోకి చూశాడు సుదిన్న, చెప్పమని కాకుండా, చెప్పవద్దని కాకుండా.

 

"వంశం అనేది ప్రవాహం తరతరాలుగా. నీతో మన వంశం అంతరించబోతోంది. నీ సంతానాన్నన్నా ఒదిలి నీ దారిన నీవు పో. నీ భార్య ఋతుస్నాత. రాత్రికి రా. ఆమెను అలంకరించి ఉంచుతా."

 

అతను దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు.

 

పక్క గది నుంచీ భార్య అంతా వింటోంది.  ఊపిరి బిగబట్టి, తన దుఃఖానికి ఆనకట్ట వేసి.

 

అతను రెండు క్షణాల్లో తేరుకున్నాడు. తన దుఃఖం తల్లి దండ్రులకు ఆశనిచ్చి ఉంటుంది అనుకున్నాడు. నిర్దయగా దాని త్రుంచివేయక తప్పదు. కోర్కె ఎప్పుడూ దుఃఖానికి దారి తీస్తుంది. తాను కాదనగానే  క్షణకాలం వెలిగిన వాళ్ళ కోరికను నిరాశ కృంగదీయబోతోంది.

 

"మీరు ఎంత అసాధ్యమైన విషయాన్ని ప్రస్తావించారో నిజంగా మీకు తెలియదా?"

 

అతను వీధిలోకి నడిచాడు ఎవరో అతని వైపు బాణం ఎక్కుపెట్టినట్టు. అతని తల్లి ఆఖరి  ప్రయత్నంగా ఆశలుడిగి అనింది.

 

"మరో సారి ఆలోచించు. రాత్రికి నీ భార్య నీ రాకకై ఎదురు చూస్తుంటుంది."

 

అతను ఆ మాటలు వినిపించుకున్నట్టు ఆమెకు అనిపించలేదు. భిక్షకన్నా రేపు వస్తాడా? అక్కడే నిలబడి బోరున ఏడిచింది. భర్త ఆమె భుజం చుట్టూ చేయి వేసి లోపలి నడిపించాడు. ఆమెకు దుఃఖం వచ్చింది.  అతనికి రాలేదు - బాధ మాత్రం ఒకటే. కోడలున్న గదిలోకి వెళ్ళింది ఓదార్చడానికి. ఆమె మౌనంగా దుఃఖిస్తోంది. తనకే లేని నమ్మకాన్ని కోడలికి కలిపించే ప్రయత్నం చేసింది.

 

"వాడి మనసు నాకు తెలుసు. మనసు మార్చుకుని రాత్రికి వస్తాడు."

 

సంధ్య తొలిగిపోతున్న క్షణాల్లో అలంకరణ మొదలుపెట్టింది కోడలికి. వాలుజడ వేసింది.  దానిని మల్లెదండతో అలంకరించింది. సుగంధద్రవ్యాలు పూసింది. మూడు జీవాలు సుదిన్నకై ఎదురుచూస్తున్నాయి ఆందోళనకు, హింసకు గురవుతూ.

 

సుదిన్న భార్య ఏనాడో ప్రయత్నపూర్వకంగా ఒదిలించుకున్న భావాలను ఇప్పుడు హృదయపు కవాటాలు తెరిచి ఆహ్వానించి, శరీరాన్ని శ్రుతి చేసి ఉంచాలా మానాలా?  కాలం సర్పంలా పాకుతోంది దాని దారిలో అది - ఎవరి చావును వాళ్ళను చావనీ  నాకెలా అనుకుంటున్నట్లు. "ఊరే వొదిలేసి పోయారేమో," అనుకుంది సుదిన్న భార్య.

 

**

 

పొద్దున్న సుదిన్న ఒకనాటి తన ఇంటి నుంచీ నిద్రలో నడుస్తున్నట్లు నడిచి వెళ్ళాడు. ఆరామంలో ఒక చోట చెట్టు క్రింద కూలబడ్డాడు. ధ్యానం చేయ దలచినట్లు కళ్ళు మూసుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చి ఈ చిక్కులో పడ్డాడేమిటి? చితి పేర్చి, 'రా, సుదిన్నా, దీంట్లోకి దూకు,' అంటే ఇంత మానసిక సంఘర్షణకు లోనయ్యేవాడు కాదేమో. దాంట్లో ఏ ధర్మ సంకటమూ ఉండదు.  కేవలం తెగింపు చాలు. నిజానికి ఒదిలి వచ్చిన వాళ్లతో తనకే తెలియని - ఒకవేళ తెలిసినా అది ఉన్నట్లు నిరాకరించే మనసుతో - అనుబంధం మిగిలివుంది. తనను తాను మోసంచేసుకుంటూ తిరిగి వచ్చాడా? రాహులుడు పుట్టాడు అన్న వార్త వినంగానే  బుద్ధుడు ఇలా అన్నాడట: "ఇది నేను తెంపుకోవలసిన కొత్త, బలమైన అనుబంధం." తల్లిదండ్రులు అతన్ని కొత్తవి, బలమైనవి అయిన అనుబంధాన్ని సృష్టించుకుని వెళ్ళమంటున్నారు, అనుకున్నాడు సుదిన్న. కోర్కెను పూర్తిగా నిర్మూలించడమనే ఉన్నత స్థాయికి చేరే ప్రయత్నంలోనే ఉన్నాడు సుదిన్న. తానే తనకు అంతు పట్టడు. మనసుతో మనసును లొంగ దీసుకుని బానిసగా చేసుకోవడం చిత్రమైన యత్నం. తాబేలు దానిలోకి అది ఒదిగిపోగలిగినట్లు, ఇంద్రియాలను లోక ప్రభావంనుంచీ ఉపసంహరించుకోవడం ఎప్పటికి సాధ్యమో.  ముఖ్యంగా ఓపిక కావాలి. అది అలవరుచుకున్నతరువాత సాధన చెయ్యాలి. సాధనలో భాగం పంచేంద్రియాలకూ పగ్గాలువేసి బలవంతాన ఆపు చేసి ఉంచడం. కోర్కెల గొంతులపై ఉక్కుపాదం ఉంచడం. బుద్ధుడి సవితి తమ్ముడు నందుడు బుద్ధుడి దగ్గిరకు వెళ్లి అంటాడు, "ప్రభూ, గృహ జీవితాన్ని నేను పరిత్యజించిన వేళ - శాక్యసుందరి, జనపదకల్యాణి, తన జుట్టును పాక్షికంగా వెనక్కు తోసుకుని, నన్ను తమకంతో చూస్తూ, 'త్వరగా తిరిగిరా, రాకుమారా,' అనింది. అది గుర్తుకు వచ్చినపుడల్లా ఈ పవిత్ర జీవనం అసంతృప్తిని కలిగిస్తోంది."  ఆ తరువాత ఏమి జరిగిందీ అప్రస్తుతం. భిక్షువులు కోర్కెలను తేలికగా జయించగలరని బుద్ధుడు భావించి ఉంటే భిక్షువుల, భిక్షిణుల కలయికలకు అన్ని నిబంధనలు పెట్టుండేవాడు కాదు.

 

అతి దయనీయంగా తోచిన తల్లిదండ్రుల ముఖాలు మనోఫలకం మీద ముద్రితమై బాధిస్తున్నాయి. ఒక విన్నపంలా, వేడుకోలులా వెళ్లబుచ్చిన వాళ్ళ కోరిక అతని గుండెకు గాలంలా గుచ్చుకుని విడి రానంటోంది. పదేళ్లలో ఇరవై సంవత్సరాల శారీరక మార్పు వచ్చింది వాళ్లకు. ఈ పదేళ్లలో కొడుకు తిరిగి వస్తాడన్న ఆశ, ఇక రాడు అన్న నిరాశ చిత్రవధ చేసుంటాయి. ఇంకా చావు రాదేమీ అని నిస్పృహ తొలిచి వేసుంటుంది.  ఈ దశాబ్ద కాల భార్య జీవితం అనూహ్యం. కనురెప్పలు ఎత్తి ఆమెను చూడలేదు - కళ్ళలో వెయ్యి ఒత్తులు వేసుకుని తాను రాకపోతాడా అని ఎదురు చూసిన స్త్రీ మూర్తిని. మానవ జీవితం ఇంతటి దుర్భరమయినది అనే కదా నిష్క్రియకు పూనుకుని జన్మరాహిత్యం గురించి పాకులాడడము. సత్య మార్గాన్ని పండించడం అంటే అలా కాఠిన్యాన్ని అలవాటు చేసుకోవడమా అని ఆమె అనుకుని ఉండొచ్చు.

 

అతను ఆచరిస్తున్న ధర్మానికి ఊపిరి కరుణ.  దానిని అతను చూపదలచుకుంటే అది ఒకసారి మాత్రమే చూపవలసి ఉంటుంది తన కుటుంబానికి సంబంధించినంత వరకూ. అది బంధంగా మారి తిరిగి అతనిని ఇంటికి కట్టేయకుండా చూసుకోగల స్థైర్యం అతనిలో ఉంది. అయితే అతను తేల్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఒకటుంది. ఒక వేళ తల్లిదండ్రుల కోర్కె తీర్చదలచుకుంటే అందులో  లైంగిక సుఖాపేక్ష ఇసుమంతయూ లేదు అన్న విషయం నిజాయతీగా నిర్ధారణగా అతనికి తేలాలి. అతని ఆలోచనా స్రవంతి తుది దశలో ఉంది.

 

సుదిన్న ఇంటిని సమీపిస్తుంటే వసారాలో వెలుగుతున్న మూడు జ్యోతులూ, నిలబడి ఎదురుచూస్తున్న తల్లిదండ్రులూ కనిపించారు.

 

"వాళ్లకు నా దయాద్రత మీద నమ్మకమా, నా బలహీనత మీద నమ్మకమా లేక గుడ్డి ఆశా?"

 

యావన్మానవ జీవితం అతనిలో విచార వీచికను లేపింది. ఎన్ని రకాల హింసలూ!

 

"రా, నాయనా!" తల్లి స్వరంలో ప్రకంపన.  ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంతోషం.  కొడుకేదో మహోపకారం చేయబోతున్నట్టు కృతజ్ఞతా భావం.

 

తండ్రి మొహంలోకి చూశాడు. జీవితార్ధం నెరవేరింది అన్న భావనను కనబడనీయని ప్రయత్నం ఆ మొహంలో చూస్తున్నట్లనిపించింది సుదిన్నకు.

 

లోపలిగది దారి అతను మరిచిపోయాడేమో అన్నట్లు గుమ్మం దాకా అతన్ని తీసుకెళ్లి, "వెళ్ళు లోపలికి," అని వెళ్ళిపోయింది.

 

ఆ గదిలో  దీపం వెలుగు, కొంచం చీకటి నిశీధికవలల్లా కలిసి ఉన్నాయి మౌనంగా ఊపిరి బిగబట్టి చూస్తూ. ఇద్దరు వ్యక్తులు పది సంవత్సరాల క్రితం దాకా కలిసి గడుపుతూ అనురాగం మేళవించిన కోర్కెల నిట్టూరుపులతో, తమకం తీరని మనసుతో గడిపిన గది అది. పాప పుణ్యాలను వేరు చెయ్యడం అసాధ్యం అన్న జ్ఞానంలా వెలుగుతోంది జ్యోతి. దాన్ని చూస్తూనూ గదినిండిన సుగంధాలను పీలుస్తూనూ కొంత సేపు నిలబడ్డాడు సుదిన్న. భార్య వైపు చూద్దామను కుంటే - నేను పూర్తిగా చావడానికి పదేళ్ల కాలం చాలదన్నట్లు స్వల్పంగా భావోద్రేకం అడ్డొచ్చింది. జరగబొయ్యేది పాపపుణ్యాలా  మంచీచెడులా అన్న మీమాంస మనసును కల్లోలపరచనట్టు నిశ్చలంగా ఉంది దీపం. ఆమె తల దించుకుని ఉన్నా గోడమీది అతని నీడ ఆమెకు కనిపిస్తోంది. 

 

ఆమె వైపు దృష్టిని మళ్లించగలిగాడు. విచారం మూర్తీభవించినట్లుందే, ఆనందపు ఛాయ లేదా? చూపు ఆమెవైపు నుంచీ మరలించాడు. పూల శయ్య ఈమె కృషా తల్లిదా? తల్లిదండ్రుల కోర్కెను భార్య ఒక సాధనంగా తీర్చబోతున్నాడు. ఆమె నేలమీద కూర్చుని ఒక చేతిని శయ్య మీద ఉంచింది. శయ్య ఆమె ఆత్మీయురాలిలా. అది ఒక కలలా కరిగిపోతుందని భయమూ ఉందేమో. భరతముని చెప్పిన అష్ట నాయకలలో ఈమె ఏ కొవదీ? ఆయన తొమ్మిదవదానిని  సృష్టించి ఉండాలిసింది.

 

సౌందర్యలహరిని పదేళ్ల తరువాత అతని నేత్రాలు ఆస్వాదిస్తున్నాయి. బుద్ధుడి సౌందర్యానికి, ప్రకృతి సౌందర్యానికి మాత్రమే పరిమితమైనాయి ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ. లోకమంతా పరవళ్ళుతొక్కుతూ ఉండే సౌందర్యానికి ఎన్నిరూపాలో.  ఎన్ని రంగులో.  ఎన్ని మాధుర్యాలో! దానిలో మునిగి ఉండడమే గాని తేలడం ఉండదు. సౌందర్యలహరి తోబుట్టువుల్లా ఆనందలహరి, శోకలహరీ కూడా వున్నాయి. ఇవి రంగులీనుతుంటాయి. అన్నింటి అలలనుంచి పారిపోవడమేగా సుదిన్న చేస్తున్నది.

 

అతను శయ్య మీద కూర్చున్నాడు. "రా!" అన్నాడు శయ్యను ఒక చేత్తో తడుతూ చూపిస్తూ. ఆ ఒక్కక్షరం ఆమె మదినిండా గదినిండా మాధుర్యంతో నింపింది. శరీరాన్ని ప్రకంపింప చేసింది. లేచి తలుపు మూసి వచ్చింది. మువ్వలు శబ్దం చేశాయి, పదేళ్ల తరువాత పోయిన వాటి స్వరం తిరిగి వచ్చినట్టు. ఇంతకాలం తరువాత వాటి స్థానాన్ని అవి పొందాయి. మళ్ళీ స్థానభ్రంశం తప్పదు. అతని చేరువగా నిలబడింది. మంచం మీద కూర్చునే ధైర్యం చాలకో ఆతను పరపురుషుడన్న శంక వేధిస్తున్నట్టో. "కూర్చో!" అన్నాడు మార్దవంగా. కాలు నేల మీద ఆనించి ఉంచి పృష్ఠ భాగాన్ని మంచం అంచుకు చేర్చి ముఖం అతని వైపుండేలా కూర్చుంది. అతనిని తిరిగి కలవలేనన్న నిస్పృహాతోనూ కలవక పోతానా అన్న ఆశతోనూ ఇంతకాలం గడిచిపోయింది. ఇద్దరు వయసు మళ్ళిన వాళ్ల, అపరిమితమైన ధనరాశుల మధ్య గడిచింది జీవితం. ఎంత భయంకరమైనది ఒంటరితనం! అతని జ్ఞాపకమే నిజమైన తోడుగా. అతని రాకతో ఒడలు పులకరించాయి, శరీరం చెమర్చింది - అతడు తిరిగి వెళ్ళిపోతాడన్న సత్యం గొంతు నొక్కి. ఈ తాత్కాలిక సమాగమం కొత్త ఊపిరి పోస్తోంది.

 

ఒక కొత్త జీవితానికి కొత్త బీజం నాటబోతున్నాడు. అరేబియా గుర్రం లాంటి వాంఛ అతను వేసి ఉంచిన  కళ్ళాన్ని తెంచుకుని చిక్కకుండా పరిగెత్తడానికి పెనుగులాడుతోంది. కామం పాత్ర లేకుండా తల్లిదండ్రుల అభీష్టాన్ని ఎలా సిద్ధింపచేయాలో అర్థం కాలేదు. ఆమె భుజం మీద, అతని మాట వినదలచుకోనట్టు అతని చెయ్యి పడింది.

 

కోర్కెను వెనక్కు తోసి ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది.  అతను మౌనంగా ఉండిపోయాడు. దుఃఖాన్ని దుఃఖించనీయాలి, అది కరిగిపోవాలంటే. దుఃఖం ఊరటనిస్తుంది. కాలం గడుస్తోంది - నత్త నడకతోను, గుర్రం పరుగుతోను.

 

అతన్ని అప్పుడప్పుడు బాధించే అపరాధభావం ఈ సందర్భంలో జ్ఞప్తికి వచ్చింది. అహింసో పరమధర్మః. పదేళ్ళపాటు భార్య, తల్లిదండ్రులు [పూర్వాశ్రయంలోని సంబంధీకులు] పైన తన కుటుంబ సభ్యుల క్షోభకు, హింసకూ తాను కారణం కాదా?

 

"తమాయించుకో!"

 

ఆమెనలా చూస్తుంటే కరుణ పాలలా పొంగింది. అతను తమాయించుకున్నాడు.  అచేతనంగా ఉన్నాడు. కొండ మీది నుంచి పాతాళంలోకి దూకబోతున్నప్పటి తటపటాయింపుతో.  తన నిగ్రహాన్ని తాను గమనిస్తున్నట్టు కూడా.

 

అతను తన నుంచీ ముందు కదలికను ఆశిస్తున్నట్టనిపించింది ఆమెకు.

 

'నాకు భేషజమెందుకు? అని ఆమె అనుకుంటుండగా అతను ఆమెకు ఒక భరిణ ఇచ్చాడు.

 

"ఏమిటిది? ఉపయోగించకుండా ఇచ్చేశారా?"

 

"అవి పారేసాను. నీవు పారేసుకున్నదాన్ని జాగ్రత్తగా తెచ్చాను. నీ గుర్తుగా భద్రంగా ఉంచుకున్నది."

 

"దానినందుకుని మంచం కింద ఉంచింది. ఆమె అతని పై ఒరిగింది. చేత్తో ఆపి అంగీని చిలక్కొయ్యకు తగిలించి వచ్చాడు.

 

మూడు రోజులు ఆమెను కలిశాడు. నాలుగో రోజు తెల్లవారు ఝామునే వెళ్ళిపోతూ ఆమె పొత్తి కడుపుపై తన కుడిచేతిని ఉంచాడు ఎవరినో పలకరిస్తున్నట్టు, వీడ్కోలు పలుకుతున్నట్లు.

 

"కరుణా.  వెళుతున్నా," నిర్వికారంగా అని వెళ్ళిపోయాడు.  ఆమె ఏమంటున్నది వినిపించుకోకుండా.

 

కొంతకాలం తరువాత బుద్ధుడికి ఈ విషయం తెలిసి తీవ్రంగా మందలించాడు "తెలివితక్కువవాడా, నీ జననాంగాన్ని స్త్రీ శరీరంలో కన్నా భయంకరమైన, విషపూరితమైన కృష్ణ సర్పం నోటిలోకి ప్రవేశ పెట్టుంటే మేలు. లేదా, కణకణ మండుతున్న బొగ్గుల పొయ్యిలోకి జొనిపి ఉండడం ఉత్తమమైన పనై ఉండేది. ఎందుకనీ? ఆ రెండు పనుల వలన మరణిస్తావు, లేదు, మరణ సదృశమైన వేదనకు గురవుతావు. ఆ రెండు కృత్యాలవలన తప్పుడు గమ్యానికి మాత్రం చేరవు." [వినయ పిటకం లోని పలుకులు]

 

[వినయపిటకంలోని ఒక వృత్తాంతము ఆధారంగా ]

bottom of page