top of page
Anchor 1

సంపుటి 2  సంచిక 2

వ్యాస​ మధురాలు

బుజ్జిదూడ- వాళ్ళమ్మ

Satyavathi Dinavahi

డా. వై. కామేశ్వరి

Bio
Comments

నా చిన్నతనంలో ఒక సంక్రాంతికి కాబోలు మా తాతగారి ఇంటికి వెళ్లాం. ఊహ తెలిశాక మొదటిసారి పల్లెటూరు చూడటం. అన్నీ వింతలే! కోడిపందేలు చూశాం!  సంక్రాంతి ముగ్గులు చూశాం. గొబ్బిళ్ళ పేరంటాలు చూశాం!  చెట్లెక్కాం.  గోడలు దూకాం!

 అన్నింటికంటే విచిత్రం మా తాతగారి దొడ్లో గేదె తెల్లవారే సరికి చిన్నదూడని ఈనింది. మా పిల్లల ఆనందానికి హద్దేలేదు. దానిచుట్టూ తిరిగిన వాళ్ళం తిరిగినట్లున్నాం. దాని కళ్లు, కాళ్ళు, తోక అన్నీ ఆకర్షణే మాకు. ముందుకాళ్ళలో వెనకకాళ్లు దూరిపోయి, పడిలేచి, పడిలేచి చివరికి కాళ్ళను విడదీసుకొని అది లేచి నుంచునే సరికి సంతోషం పట్టలేకపోయాం. పెద్దవాళ్లు కోప్పడే వరకూ పశువుల పాకను వదల లేకపోయాం.

అరిసెలు,  గోర్మీటీలు, జంతికలు ఇవన్నీ పొట్టు పొయ్యి దగ్గర కూచుని మా అమ్మమ్మ, అమ్మ చేస్తూ ఉంటే  వాళ్ళచుట్టూ తిరిగి  వాయ వాయకి రుచి చూశాం.. నగరంలో మాకు దొరకవని మా తాతగారు ఎవరికో పురమాయించి పూతరేకులు తెప్పించారు. మధ్యాహ్నం ఇంట్లో అందరూ కూర్చుని వాటిని నేతిని చిలకరిస్తూ, బెల్లం, పంచదార పొడి చల్లుతూ, పొట్లాలుగా చుడుతుంటే చోద్యం చూశాం. నేతిగిన్నె తన్నేసి చివాట్లు తిన్నాం. ఆడాం పాడాం గంతులేశాం. మా ఊళ్లో మా ఇంటి క్రమశిక్షణ వాతావరణం నుంచి ఆటవిడుపు అది మాకు. ఏ సమయంలోనైనా ఎవరింటికైనా పిల్లమూక అంతా కలిసి దాడి చేయవచ్చు. అక్కడ పెద్దవారు ‘ఎవరి పిల్లలు?’ అంటూ ఒక్కొక్కరినీ  ఆరాతీసి, బుగ్గలు సాగదీసి, సంతోషించేవారు. చేతుల్లో ఇంత కారప్పూసో, బూందీయో పోసి సాగనంపేవారు.

ఇలా నాలుగురోజులు గడిచాయో లేదో మా అమ్మమ్మగారి పుట్టింట్లో ఏదో అక్కర. ఆడపడచుగా ఆవిడ అక్కడ ఉండటం అవసరం.   ఎద్దుబండిలో ప్రయాణం.  కూతుళ్లూ, మనవలు మనవరాళ్లూ అందరినీ తీసుకొని మా అమ్మమ్మ ప్రయాణమైంది..

బండి ప్రయాణమూ కొత్తేమాకు. ఎద్దుమెళ్లో గంటలుమోగుతుంటే బండిమొత్తం ఊగిపోతూ మట్టిరోడ్డుమీద కుదుపులతో ప్రయాణం. బండిలో సమతూకంకోసం ఒకరు అటూ ఒకరు ఇటూ కూర్చోవటం, ఎదురూ బొదురూగా కూర్చున్నాక కొక్కిరాయి వేషాలు వెయ్యటం, పెద్దవాళ్ళ మొట్టికాయలు తిని బుద్ధితెచ్చుకోవటం ఇలా సాగిపోతూ ఉంటే , హఠాత్తుగా నాదృష్టి మా బండి వెనకే పరిగెత్తి వస్తున్న గేదె మీద పడింది.  అది అలా పరిగెత్తి పరిగెత్తి మా గమ్యమైన ఊరు చేరే దాకా బండి వెనకే వచ్చింది. అది అలా ఎందుకు వస్తోందో నాకు అర్థం కాలేదు.  ”అమ్మమ్మా! చూడు!  మన బండి వెనకే గేదె వస్తోంది.  దూడని ఈనాక చాలా అలసిపోయిందని చెప్పావుకదా! గుంజకు కట్టివెయ్యటం మర్చిపోయావా?  అది ఇంతదూరం ఎలా పరిగెత్తగలదు” అంటూ అడిగాను.

“పిచ్చిమొహమా! రాక ఏం చేస్తుందే! దూడ మన  బండిలో ఉంటే! పిల్లని వదిలి తల్లి ఏంచేస్తుందే!“ అంది మా అమ్మమ్మ. నాకు ఆశ్చర్యం వేసింది. బండిలో దూడ ఎక్కడ ఉందో నాకు కనిపించలేదు. అయినా దూడను ఎందుకు మనం తీసుకెళ్లాలో అసలే అర్థం కాలేదు. ఆ సంగతే అడిగాను. అమ్మమ్మ ఇలా చెప్పింది. “ఇంటిల్లపాదీ ఇల్లుతాళం పెట్టి వస్తున్నామా!  మనకు ఇంట్లో గేదెను చూసుకునే వారు ఎవరూ లేరుకదా! అందుకనే మనతో పాటే దాన్నీ తీసుకెళుతున్నాం.”

“మరి దూడ ఏదీ?’

“వంగి చూడు కనిపిస్తుంది”

వంగి బండి క్రింద చూద్దును కదా కొబ్బరి నారతో అల్లిన చిక్కని జాలీ ఒకటి బండి క్రింద వేలాడుతోంది. అందులో  మా మురిపాల దూడ పడుకొని, చక్కగా కళ్లు విప్పార్చుకొని దారి విశేషాలను చూస్తోంది.

అప్పుడు దూడను చూసిన సంతోషం పట్టలేనిదే!  కానీ, ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకు వస్తే, ఈ సంఘటన నా కళ్ళను తడి చేస్తూ ఉంటుంది. ఈనిన ఒకటి రెండు రోజులకే, ఎంత పశువైనా దాని శరీరం ఎంత నవిసిపోయి ఉంటుంది. పిల్లకోసం అమ్మగా అది పడిన ఆరాటం అలా ఒక ఊరినుండి మరొక ఊరుకు పరిగెత్తించింది. ఆరాటంతో అది బండివెనక పరిగెత్తి రావటం ఇప్పుడే జరిగినట్లు అనిపిస్తుంది.  మెటర్నిటీ లీవు అయిపోయాక ఆఫీసుకు వెళ్ళిన మొదటిరోజు గుర్తుకువస్తుంది.

***

bottom of page