top of page

మా వాణి ...

నమస్కారం,

మా నిర్వాహక బృందంలో సభ్యులైన చిలుకూరి సత్యదేవ కవీంద్రులు రచించిన ఈ క్రింది పద్యంతో “మధురవాణి” పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ “దుర్ముఖి’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. 

సీ. తమముఁ బోగొట్టి సత్త్వమ్ముఁ బెంపొందింప

నుదయాద్రినుదయించె నదితిసుతుడు

మాఘఫాల్గుణముల మందనీహారంపు

శిశిరశీతలమింక సెలవు కోరె

క్రొత్త చివురులతో కొమ్మలు నింపు వ

సంత శోభలతోడ చైత్రమరిగె

లయము జేసియు మరల భవమొనర్చెడి

కమలాక్షుఁ లీలయౌ కాలచక్ర

గీ. మందు మన్మథము మిగిల్చెననుభవములు,

స్మృతులు; నంతలో దుర్ముఖి చేరవచ్చె

నాయురారోగ్యముల్, మువురమ్మల కరు

ణా కటాక్ష వీక్షణములున్ మాకుఁ దెచ్చె!

        గత జనవరిలో సంక్రాంతి - 2016 పండుగలో ప్రారంభించబడిన ‘మధురవాణి’ అంతర్జాల సాహిత్య పత్రిక తొలి సంచికని ప్రపంచవ్యాప్తంగా మేము ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా ఎక్కువగా ఆదరించిన పాఠక మహాశయులకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సాంకేతిక పరంగా అత్యున్నత స్థాయిలో  మరే అంతర్జాల పత్రికకూ లేని హంగులూ, రంగులతో తెలుగు సాహిత్యానికి ఎంతో గౌరవాన్నికలిగిస్తూ పత్రిక చాలా ఆకర్షణీయంగా ఉంది అని సర్వత్రా అభిప్రాయం వెలువడింది. మలి సంచికగా వెలువడుతున్న ఈ ఉగాది సంచిక మరింత ఎక్కువగా పాఠకుల ఆదరణ పొందుతుంది అని మా నమ్మకం.

        సాధారణంగా “సంపాదకీయం” అనగానే ఆ సంచికలో ఉన్న అంశాలను ఏకరువు పెట్టడం అంత గొప్ప విశేషం ఏమీ కానే కాదు. ఎందుకంటే పాఠకులు అవి ఎలాగా చదువుతారు కదా! కానీ ఈ ఉగాది సంచికలో నిజంగానే గొప్ప విశేషాలు ఉన్నాయి కాబట్టే నేను వాటి గురించి ప్రస్తావిస్తాను. అటువంటి గొప్ప విశేషాలలో మొదటిది ఉత్తర అమెరికా తెలుగు కథ 52వ వార్షికోత్సవం. ఈ 2016 ఏప్రిల్ నెలకి తెలుగు సాహిత్య చరిత్రలో ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది.  ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్ట మొదటి తెలుగు కథ ఏప్రిల్ 24, 1964 నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది. అందువలన ఆ తొలి కథకీ, తద్వారా ఈ పరాయి గడ్డలో తెలుగు సాహిత్య శుభారంభానికీ ఈ ఏడు 52వ వార్షికోత్సవ సంవత్సరం. ఆ నాటి తొలి కథ “డైస్పోరా తెలుగు కథ” అనే కొత్త పాయకి బీజం వేసి తెలుగు కథానికకీ, ఇతర సాహిత్య ప్రక్రియలకీ సరి కొత్త  మెరుగులు దిద్దింది. గురజాడవారి “దిద్దుబాటు”తో మొదలయిన ఆధునిక తెలుగు కథ వయస్సు 115 అయితే అందులో అమెరికా తెలుగు కథకి రాసిలో తక్కువ అయినా వాసిలో ఎక్కువ గానే యాభై ఏళ్ల పైగా వాటా ఉండడం చెప్పుకోదగ్గ విషయమే కదా! కానీ యథాప్రకారం తెలుగు సాహిత్య ప్రపంచం, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో అనేక సాంస్కృతిక సంస్థలు నామమాత్రంగానే పట్టించుకునే అమెరికా తెలుగు సాహిత్యంలో ఆ నాటి మొట్టమొదటి ఉత్తర అమెరికా తెలుగు కథ “వాహిని” పున: ప్రచురిస్తున్నాం. అంతేకాక ఆ తొలిదశకంలో (1964-74) అమెరికా ఖండంలో తెలుగు సాహిత్య సౌధానికి “రాళ్లెత్తిన కూలీలను” స్మరించుకుంటూ, ఇప్పటికీ తమ కృషిని కొనసాగిస్తున్న వారందరికీ కృతజ్ఞతాభివందనాలతో ఒక వ్యాసమూ, 52 ఏళ్ల అమెరికా తెలుగు కథ మీద సంక్షిప్త సమీక్షా ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.  పాఠకులకు నచ్చుతాయి అనే ఆశిస్తున్నాం.

        ఈ సంచికలో మరో చెప్పుకోదగ్గ విశేషం – “కళాప్రపూర్ణ”, డా. అవసరాల అనసూయాదేవి గారు మే నెల 12, 2016 నాడు తెలుగు తిథుల ప్రకారం వంద సంవత్సరాల వయసులో అడుగు పెడుతున్న సందర్భంగా ఆ ‘జానపద సామ్రాజ్ఞి’కి మా శుభాకాంక్షలు అందజేస్తూ కొన్ని ప్రత్యేక అంశాలు మీకు అందజేస్తున్నాం. ఆ మహాగాయని కొన్నేళ్ళ క్రితం ఇచ్చిన ఒక ఆసక్తికరమైన టీవీ ఇంటర్వ్యూ, ఇటీవల ప్రచురించబడిన ఆమె ఆత్మకథ ‘అసమాన అనసూయ- నా గురించి నేనే’ పుస్తక సమీక్ష, ఆమె స్వయంగా రచించిన ఒక చిన్న కథ ప్రత్యేకంగా ప్రచురిస్తున్నాం. అంతే కాక మీకు వీనుల విందుగా 1978లో చెల్లెలు సీత గారితో అనసూయ గారు తొలి సారి అమెరికా వచ్చినప్పుడు హ్యూస్టన్ లో అమెరికాలో మొదటి 78 rpm రికార్డు ఆడియో, ఆ మహా గాయని పాడిన మరి కొన్ని పాటలూ మరొక ఆకర్షణ.

        సుప్రసిద్ద రచయిత, నటులు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ గొల్లపూడి మారుతీ రావు గారు “మధురవాణి” కోసం అందించిన “తన డైరీ లోంచి ఒక పేజీ” ని మీకు అందిస్తున్నాం. ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంచికలో ఉన్న “అలనాటి మధురాలు” శీర్షికలో గొప్ప కథకులు చాసో గారి మొట్ట మొదటి ప్రచురణ (భారతి, 1941 జూన్ సంచిక) అయిన “ధర్మక్షేత్రం” ఆయన స్వదస్తూరీ ప్రతిని మాకు అందించిన చాసో గారి కుమార్తె చాగంటి తులసి గారికి పత్రికాముఖంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము అడిగిన వెంటనే తమ ప్రత్యేక రచనలు అందజేసిన లబ్ధ ప్రతిష్టులు శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి, మంథా భానుమతి, దశిక శ్యామలా దేవి, అక్కిరాజు సుందర రామకృష్ణ కవి, హెచ్చార్కె గారు, అనిల్ రాయల్, ఎంతో ఆసక్తితో తమ రచనలని మాకు అందజేసిన రచయిలందరికీ మా ధన్యవాదాలు. సినీ సంగీత రంగంలో నిష్ణాతులైన మాధవపెద్ది సురేష్ తమ 50 ఏళ్ల సంగీత ప్రస్థానంలో ఎన్నో మధురానుభూతులని మనతో పంచుకోగా, సంగీత సాహిత్య గాన సవ్యసాచి “విశ్వ”తో ‘మధురవాణి’ ప్రత్యేక ముఖాముఖీ ఆద్యంతం ఆసక్తికరమే!

        రచయితలకి, పాఠకులకి మరో శుభవార్త... ఈ ఉగాది సంచికతో ప్రారంభం అయి పత్రికా రంగంలో  “మధురవాణి’ కి ప్రతిష్టాత్మకమైన ISSN (International Standard Serial Number) లభించింది. ఈ విధమైన గుర్తింపు ‘మధురవాణి’లో ఎంపిక అయి, ప్రచురించబడిన రచనలకి, ముఖ్యంగా విశ్వవిద్యాలయాలలో ఉన్న పరిశోధనాచార్యులకీ, విద్యార్థులకీ తమ పరిశోధనా పత్రాలు ప్రచురణకి అధికారకంగా గుర్తింపు లభించి వృత్తిరీత్యా ఉపయోగపడుతుంది. ఉన్నత స్థాయి పరిశోధనా వ్యాసాలని పరిశీలన కోసం ‘మధురవాణి’ కి పంపించి అతి తక్కువ అంతర్జాల పత్రికలకే ఉన్న ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని భాషా, సాహిత్య పరిశోధకులని కోరుతున్నాం.  

        మా మూడో సంచిక మరో మూడు నెలల లో  (జులై, 2016 లో) విడుదల అవుతుంది. అందులో ప్రచురణకి పరిశీలనార్థం రచనలు మాకు చేరవలసిన ఆఖరి తేదీ మే 25, 2016. “రచనలకి ఆహ్వానం” పేజీ లో పూర్తి వివరాలు చూడండి.

 

మరో విషయం...

పాఠకుల కోరిక మేరకు... ఈ ఉగాది సంచిక నుంచీ, మీ  అభిప్రాయాలు ఫేస్ బుక్ ద్వారా మాత్రమే కాకుండా...  మాములుగానూ, మరింత సులభంగానూ... తెలిపే సదుపాయం కల్పించబడింది. గమనించగలరు...

 

అందరికీ మరొక్క సారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ..

వంగూరి చిట్టెన్ రాజు

మధురవాణి నిర్వాహక బృందం

చిలుకూరి సత్యదేవ్ | మధు పెమ్మరాజు | శాయి రాచకొండ | సుదేష్ పిల్లుట్ల | దీప్తి పెండ్యాల | శ్రీనివాస్ పెండ్యాల |  వంగూరి చిట్టెన్ రాజు

bottom of page