top of page

'సినీ' మధురాలు

సినీ గేయ రచయిత- ‘విశ్వ' తో ముఖాముఖి

కథానాయకుల పరిచయ గీతాలని పదునైన పదాలతో పరుగెత్తించే సంచలనం-  ఆ కలం!

'పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడు ' అంటూ కథానాయకుడిని వర్ణించేప్పుడు…

తుఫాను వేగంతో వడివడిగా కదులుతుంది ఆ కలం. నిప్పుకణికల్లాంటి వేడి వేడి వాడి పదాలతో...!

'పాదరస ఉరవడి నరనరమే' అంటూ కథానాయకుడి 'దూకుడు' వర్ణించేప్పుడు…

ఆ కలములో సిరా పాదరసమే అవుతుంది. పదబంధాల ఒరవడి ఉరవడిలా జాలువారుతూంటే....!

150 పైచిలుకు సినీ గీతాలు రచించిన ఆ కలం మాత్రమే కాదు, ఎందరో ఉద్ధండులకి గాత్రదానం చేసిన గంభీర గళమూ - ప్రఖ్యాత సినీ గీత రచయిత విశ్వ గారి సొంతం. సినీ గీత రచయితగానే కాకుండా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలురకాల ప్రతిభతో తెలుగు సినీరంగంలో పేరొందిన విశ్వ గారితో ముఖాముఖి...  దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షల సహితంగా మధురవాణి అంతర్జాల పత్రిక పాఠకులకి ప్రత్యేకం!

 

సంతోషం చిత్రంతో ఆరంభించిన మీ సినీ గేయరచనా ప్రస్థానం భలే సంతోషంగా సాగుతున్నందుకు అభినందనలు!

ఈ ప్రస్థానంలో... సినీ గీత రచయితగానే కాకుండా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా... మీ ప్రతిభలతో సినీ సంగీత ప్రపంచంలో మీదయిన గుర్తింపు సాధించారు! అందుకు… మధురవాణి తరఫున మరిన్ని అభినందనలు!

ధన్యవాదాలండీ. మొదటగా... మధురవాణి.కాం పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు!

 

విజయవంతంగా సాగుతున్న మీ సినీ పాటల ప్రయాణం ఎలా మొదలయ్యింది!?

సంగీతం మీద, సాహిత్యం మీద చిన్నప్పటినుంచీ ఆసక్తి ఎక్కువే.  నేను ‘మస్తీ’ అనే ఆల్బం తయారు చేస్తున్న రోజుల్లో మణిశర్మ గారితో పరిచయం జరిగింది. అది నా కెరీర్లో పెద్ద మలుపుకు కారణమయిన పరిచయం! ఆల్బం విడుదల తర్వాత ఆర్.పి. పట్నాయక్ గారు... “సంతోషం” చిత్రంలో పాట రాయవలిసిందిగా కోరారు. అలా నా తొలిపాట ప్రభుదేవా గారు డ్యాన్స్ చేసిన..."మెహబూబా, మెహబూబా" పాట. అది మంచి విజయం సాధించటంతో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి.

మొదటినుంచీ మణిశర్మగారు ప్రతిభని గుర్తించి ప్రోత్సహిస్తూ వచ్చారు! వారి సంగీత దర్శకత్వంలోని… అతడు, పోకిరి, చిరుత, ఏక్ నిరంజన్, తీన్ మార్... వగైరా... 16 సినిమాలకి రాయటంతో వారితో సాన్నిహిత్యం ఎక్కువ.

 

ఆగడు, దూకుడు, టెంపర్ వంటి చిత్రాలకి టైటిల్ సాంగ్స్ రాసి, కథానాయకుల పరిచయ గీతాలకి చిరునామా గా మారారు! పదునైన పదాలలో ఒక కథానాయకుడిని వర్ణించే మీకు అభిమాన కథానాయకుడు ఎవరు?!

నాకు పాత బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో నటించిన అందరు కథానాయకులూ చాలా ఇష్టం. ఈ తరం వాళ్ళ లో... మహేష్ బాబు, ఎన్.టీ.ఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లతో ఉన్న ప్రత్యేక సాన్నిహిత్యంతో కాస్త ఎక్కువ అభిమానిస్తాను.

 

ఇంతవరకూ మీరు రాసిన పాటలన్నిటిలో... ఏ పాటకైనా సాహిత్యం కూర్చటం కష్టమనిపించిన సందర్భం ఉందా?!

లేదండీ! అన్ని పాటలూ ఎంతగానో ఇష్టపడి వాటికోసం కష్టపడాలనిపించే రాశాను! అందుకేనేమో. ఎప్పుడూ ఏదీ కష్టంగా తోచలేదు.  ఒక పాటకి సంబంధించిన సన్నివేశం, సందర్భం అన్నివిధాల నచ్చాకే సాహిత్యం రాయటానికి ఒప్పుకుంటాను. సంగీత సాహిత్యాలపై అత్యంత అభిమానంతో... ఈ వృత్తిని ఎన్నుకున్నాను కనుక... మొదట్నించీ రాశి కంటే  వాసికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాను.

నిర్విరామ శోధనతో, సాధనతో  వృత్తిని పూర్తిగా ఇష్టపడి , అందులో సంపూర్ణంగా  నిమగ్నమయ్యి చేశామంటే... ఏ పనీ కష్టంగా ఉండదని నమ్ముతాను.

 

మీ పాటల్లో మీకు ఆంగ్లం పైనే కాకుండా...తెలుగులో కూడా అద్భుతమయిన పట్టు ఉందని ఋజువు చేసిన పాటలెన్నో ఉన్నాయి!  మరి మన తెలుగు సినిమాల్లో ఇంతగా ఆంగ్లం జొప్పించటమెందుకండీ?

వాస్తవమే. తెలుగువారికి పరాయిచోట్ల నుంచి దిగుమతి అయిన భాషన్నా, హీరోయిన్లు, గాయకులు, విలన్లు అన్నా... మక్కువ ఎక్కువే.  ఒక్కోసారి వ్యాపారాత్మక ధోరణిలో పడి సినీజీవులు పరాయి భాషని మాత్రమే తెలుగువారు ఆదరిస్తారన్న భావనతోనో, అపోహతోనో ...దేన్నయినా కోరవచ్చు. మేము అందించవచ్చు. అలా... క్రమంగా ఇతర భాషల్లో రాసిన ఎక్స్ పెరిమెంటల్ పాటలు అనూహ్య విజయం సాధించటంతో... ప్రేక్షకులు వాటినే ఎక్కువగా ఆదరిస్తున్నారన్న భావంతో కానీ... అపోహతోనో కానివ్వండి... అదొక ట్రెండ్ గా మారిపోతుంది. అలాంటప్పుడు  అవసరానికి మించి ఆంగ్లపదాలున్న పాటలని సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఆదరించకుండా ఉండటమూ పరిస్థితిలో మార్పుని తేవచ్చు.

 

ఇలా … నాణానికి రెండువైపులా  మీ గీత రచయితలకి అవగాహన ఉంటుంది కనుక... తెలుగుకి అగ్రపీఠం వేయటానికి  మీ పరిధిలో ఏదయినా పరిష్కారం ఉందంటారా ?!

సినీ రచయితలకి ఒక్కోసారి సినీ పాటల విషయంలో ఛాయిస్ ఉండదండీ! స్వతహాగా నాకు తెలుగుపై ఉన్న అభిమానంతో... నా సొంత ఆల్బంలో పూర్తి స్థాయి తెలుగునే వినిపించబోతున్నాను.

 

మీరు ఒక గీత రచయితగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సాధించుకున్నారు. ఇకపై వెలుగులోకి రావల్సిన ఆసక్తులు, అభిరుచులు ఉన్నాయా?...

(నవ్వుతూ) ఇంతవరకూ నా టాలెంట్స్ అన్నీ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి బయటకి వచ్చాయి. మంచి పేరు తెచ్చి పెట్టాయి. అసలు మొట్టమొదట అంటే... నా ఆరవ యేటనే  నేను "ఉత్తమ బాలనటుడు ' అవార్డుని భద్రాచలం లో ప్రముఖ దర్శకులు-జంధ్యాల గారి చేతుల మీదుగా అందుకున్నాను.

 

అంటే... మొదటి గుర్తింపు వచ్చింది నటన కే అన్నమాట! ఎలా జరిగిందీ?!

అది చిత్రంగా మొదలయ్యిందండీ. నాకు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. నవరాత్రి ఉత్సవాల్లో నన్ను చూసిన యుద్ధనపూడి సులోచనగారి సోదరుడు- పేరొందిన థియేటర్ ఆర్టిస్ట్- రాధాకృష్ణమూర్తి  గారు...రాళ్ళపల్లి గారు రచించిన "ముగింపు లేని కథ" అనే నాటకంలో బాలనటుడిగా తీసుకున్నారు. ఆంధ్ర కళా పరిషత్ లో ఆ ప్రదర్శనకి "ఉత్తమ బాల నటుడు" అవార్డు అందున్నాను. రాధాకృష్ణ మూర్తి గారి నాటక ట్రూపు "శ్రీ కళా నిలయం" ద్వారా దేశవ్యాప్తంగా ప్రదర్శించిన 36 ప్రదర్శనలలో నటుడిగా పాల్గొన్నాను! ప్రశంసలు అందుకున్నాను. దాదాపుగా టెంత్ క్లాస్ వరకూ నాటకాల్లో నటించిన తర్వాత... పూర్తిగా చదువు మీదికి దృష్టిని మళ్ళించాను.

 

మీరు పద్యాలు కూడా రాగయుక్తంగా పాడుతారని పేరు. నటన నుంచి పాటలు, పద్యాల వైపు అడుగులు ఎప్పుడు, ఎలా పడ్డాయి?!

చిన్నప్పటినుంచీ స్వతహాగా సంగీతం అంటే ఇష్టం. మంచి రిథమిక్ సెన్స్(స్వర జ్ఞానం) ఉందని అనేవారందరూ. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు పాటలు, పద్యాలు పాడుతూ ఉండేవాడిని. అలాగే పాప్ సింగింగ్ పై ప్రత్యేక ఆసక్తి ఆ సమయంలోనే మొదలయ్యింది. ఆ ఆసక్తితో పాప్ పై పట్టుని సాధించాను. నేను రాసిన మొదటి పాట కూడా పాప్ స్టార్ అయిన ప్రభుదేవాకి అవటం కాకతాళీయమైన అదృష్టంగా భావిస్తాను.

 

మీ పాటల్లో హీరో ఇంట్రో పాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే... ధీరోదాత్తులుగా, ఉదాత్తులుగా... అత్యంత ఉన్నతంగా... కథానాయకులంటే ఇలా ఉండాలి అనేట్టుగా బహుబాగా వర్ణిస్తారు. అలాగే కథానాయకి ని కూడా.. ధీర గా, లేదా...  సీతారామశాస్త్రి గారు “నీ స్నేహం” చిత్రంలో... రాసిన "చినుకు తడికి..."లాంటివో  లేదా అమ్మ మీదో, ఆలి మీదో, చక్కగా...ఉన్నతంగా...చూపే పూర్తి స్థాయి పాట...  మీ అసాధారణ శైలిలో రాసిన పాటలేమయినా రాబోతున్నాయంటారా?..!

త్వరలో రానున్న నా సొంత ఆల్బం లో చక్కటి పాటని అందివ్వబోతున్నానండీ... స్త్రీత్వాన్ని ఉదాత్తంగా,  ప్రతీ ఋతువులో మారుతున్న ప్రకృతితో పోలుస్తూ  అద్భుతంగా ఉంటుంది ఆ పాట!

 

మీకు నచ్చిన ఇతర గీత రచయితలు ఎవరు?

పాతకాలంలో మల్లాది గారు, పింగళి గారు, వేటూరి గారు అంటే చాలా ఇష్టం. పింగళి గారు, వేటూరి గారు చక్కటి తెలుగులో చమత్కారంగా... పదాలకు వన్నెలద్దుతూ, చమక్కులద్దుతూ సినిమా పాటకి సార్వజనీన శైలిని ఆపాదించారు,!

ఇక, సమకాలీనుల్లో సీతారామ శాస్త్రి గారి సాహిత్యానికి అభిమానిని. హితుడు, స్నేహితుడు అయిన చంద్రబోస్ గారి పాటల్లోనూ...  "మౌనంగానే ఎదగమని.." లాంటి స్పూర్తిప్రదాయకమైన పాటలు ఇష్టపడతాను.

 

జాకీ ష్రాఫ్, రాహుల్ దేవ్,  పశుపతి, అభిమన్యు సింగ్ ఇలా బాలీవుడ్ నటులకి గాత్ర దానం చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ, ఈ మధ్య డబ్బింగ్ చెప్పటం చాలావరకు తగ్గించినట్టనిపిస్తుంది?

డబ్బింగ్ చెప్పటమూ సరదాగా ఉంటుంది. సన్నిహిత దర్శకుల మాట మన్నించటానికి కొన్ని సార్లు చెప్పాను. నా ఇమేజ్ కి నష్టం కలిగించనంత వరకూ... ప్రతీ అవకాశాన్ని, నాకు ఇస్తున్న గౌరవంగానే భావిస్తాను. కాకపోతే, డబ్బింగ్ వల్ల వాయిస్ ఎక్కువగా స్ట్రెయిన్ అవటం వల్ల ఒక్కోసారి 15, 20 రోజుల వరకు పాడలేని పరిస్థితి వస్తుంది. అలా, గాయకుడిగా మంచి అవకాశాలు కోల్పోవటమూ జరిగింది. సంగీతం అంటే ఉన్న మక్కువతో పాటలు పాడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూంటాను.  కాస్త సమయం ఉందనిపిస్తే డబ్బింగ్ చెప్పటానికి ప్రత్యేక అభ్యంతరమేమీ లేదు.

 

‘చిగురు బోణియా’ అంటూ సరికొత్త పదాలు చాలానే సృష్టి స్తుంటారు మీరు! ఈ కొత్త పదబంధాలు... బాణీ (ట్యూన్)కి అనుగుణంగా సృష్టిస్తారా? లేక సాహిత్యం రాశాక, బాణీ కడతారా...!?

పవన్ కళ్యాణ్ కోసం రాసిన ఈ పాట మాత్రం మణిశర్మ గారు బాణీ కడుతున్నప్పటి నుంచీ ఉన్నాను కనుక, బాణీకి తగ్గట్టుగా రాసిందే! ఇక బాణీకి తగ్గ సాహిత్యమా... లేక… సాహిత్యానికి తగ్గ బాణీయా అన్న అంశానికి వస్తే … ఇది పాట సందర్భాన్ని బట్టి మారవచ్చు.  పూర్వం సి.నా.రె, శ్రీ.శ్రీ గారి కాలంలో... సాహిత్యానికి బాణీ కట్టే వారు. అది నిజానికి కష్టమైన ప్రక్రియ. ఈ ఫాస్ట్ యుగంలో మాత్రం ఎక్కువగా... బాణీకి తగ్గట్టుగా సాహిత్యం రాయటం జరుగుతుంది.  

 

దేశ విదేశాల్లో సంగీతానికి, ముఖ్యంగా మీలాంటి వర్సటైల్ గాయకులకి ఆదరణ పెరుగుతున్నట్టుంది…?!

పెరుగుతుందనే భావిస్తున్నాను. టి.వి.9 వారు "విశ్వా బీట్స్" అనే కార్యక్రమం చేసి నాకు అరుదయిన గౌరవం కలిగించారు. తానా ఈవెంట్ కి అతిథిగా వచ్చినప్పుడూ, వాషింగ్టన్ తెలుగు సమితి-సియాటెల్ ఇలా కొన్ని ప్రదేశాలకి ప్రదర్శనల నిమిత్తం వచ్చినప్పుడు సంగీత సంబంధిత ప్రదర్శనల పట్ల ఆసక్తి గమనించాను. లాస్ ఏంజెల్స్ లో పాడుతా తీయగా కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించటానికి వచ్చినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో నెలరోజులు ఉన్నాను. ఆ సమయంలో నాకు సంతోషం కలిగించిన విషయమేంటంటే... తెలుగువారిలో సంగీతం నేర్చుకోవటంలోనూ, పిల్లలకి నేర్పటంలోనూ ఆసక్తీ పెరుగుతుంది. ఇది మంచి పరిణామం.

 

కుటుంబం గురించి ...

కూచిపూడి వాస్తవ్యులము. నాన్నగారు బి.హెచ్.ఈ.ఎల్.ఉద్యోగి. నాన్నగారికి సాహిత్యంలోనూ... అమ్మకి సంగీతంలోనూ ప్రావీణ్యత ఉండటం వల్లే నాకూ సంగీత సాహిత్యాలపై ఆసక్తి చిన్ననాటే కలిగింది. ఇక, నా అర్ధాంగి పద్మావతి కూడా క్రియేటివ్ రైటర్. సాహిత్యంపై తనకీ మక్కువ ఎక్కువే!

 

భవిష్యత్ ప్రణాళికలేంటి?!

ప్రస్తుతం వరకూ నా కెరీర్ లో ఉత్థాన దిశలో ప్రయాణం చేస్తున్న తృప్తి ఉంది. ఇక భవిష్యత్ లో కూడా మంచి అవకాశాలు ఒడిసిపడుతూనే, నాకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చే ఆల్బమ్స్ చేయాలని భావిస్తున్నాను. అనుకున్నట్టుగానే, ఈ సంవత్సరం రెండు ఆల్బమ్స్ రిలీజ్ చేయబోతున్నాను. ఒకటి ఫ్యూషన్ ఆల్బం అయితే, మరొకటి రుద్రం అనే డివోషనల్ ఆల్బం చేస్తున్నాను. ఇక కొండాపూర్ లో సొంత స్టూడియో కూడా నిర్మిస్తున్నాను. వీలు దొరికినప్పుడు ఆల్బమ్స్ చేయటానికి. ఇక, సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం సాయి ధరం తేజ్ తో వస్తున్న సినిమా కి, అలాగే పూరీ గారి దర్శకత్వం లో వస్తున్న చిత్రానికి పాటలు రాస్తున్నాను.

 

ఈ నూతన సంవత్సరం... మీరు చేపట్టే మీ ప్రణాళికలన్నీ విజయవంతం కావాలి. గీత రచయితగా మీరింకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలని మధురవాణి.కాం తరఫున మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము.

ధన్యవాదాలు! మధురవాణి.కాం ద్వారా అశేషపాఠకులని ఈ సందర్భంగా కలుసుకోవటం నాకూ చాలా ఆనందంగా ఉంది.

 

*****

comments
bottom of page