top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

భోలా షేర్

Govinda Chintada

నండూరి సుందరీ నాగమణి

“ఏమిటి లతా, వర్క్ అయిపోయినా ఇంకా కూర్చున్నావు?” సాయంత్రం ఆరుగంటలకు ఆదరా బాదరా బాగ్ సర్దుకుంటూ అడిగింది ఇందూ.

“క్యాబ్ బుక్ చేశా ఇందూ... అది వచ్చేవరకూ వెయిట్ చేయాలి...” చెప్పింది లత.

“ఏమిటీ క్యాబా? చాలా అయిపోతుంది కదా ఫేర్ కి?” ఆశ్చర్యంగా చూసింది ఇందూ.

“లేదు ఇందూ... ఇప్పుడు క్యాబ్స్ లో షేర్ అనే ఆప్షన్ వచ్చింది. దాని వలన ఒకే క్యాబ్ ని నలుగురు వేరువేరు ప్రయాణీకులు పంచుకునే అవకాశం ఉంది. ఫేర్ మన ఆటో ఫేర్ కన్నా తక్కువే అవుతుంది...”

“అవునా? ఎలా?? చెప్పు చెప్పు!” లత ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుంది ఇందూ.

“ఇదిగో, ఈ స్మార్ట్ ఫోన్ లో భోలా యాప్ అనే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇందులో నాలుగైదు ఆప్షన్ లు ఉంటాయి. భోలా ఆటో అనీ, షేర్ అనీ, టైనీ అనీ, లగ్జరీ అనీ రకరకాలు. రకాన్ని బట్టి ఫేర్ ఉంటుంది. ఇద్దరు, లేదా ముగ్గురు ఉన్న ఫ్యామిలీ వెళ్ళాలి అంటే టైనీ బుక్ చేసుకోవచ్చు. మనలాంటి వాళ్లకి షేర్ ఆప్షన్ బెస్ట్... ఇదిగో ఇక్కడ షేర్ అన్న దగ్గర నొక్కగానే దగ్గరలో భోలావాళ్ళవి ఎన్ని కార్లు ఉన్నాయో, బుక్ చేస్తే ఎన్ని నిమిషాల వ్యవధిలో వస్తుందో  కనబడిపోతుంది. మన పికప్ పాయింట్, ఇంకా వెళ్ళాల్సిన పాయింట్ ఇక్కడ టైప్ చేయాలి. వెంటనే కాబ్ బుక్ అవుతుంది. కాబ్ నంబరు, డ్రైవర్ ఫోన్ నంబర్ వస్తాయి. మనం ఉన్నచోటికే క్యాబ్ వచ్చి మనల్ని ఎక్కించుకుంటుంది. ఇట్స్ సో సింపుల్... అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి...అమ్మో నా క్యాబ్ వచ్చేసింది. వస్తాను, బై...” అంటూ లేచి వెళ్ళిపోయింది లత.

‘ఇదేదో బాగానే ఉంది, ఇంటికెళ్ళి ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి!’ అనుకుంటూ ఆటో కోసం బయటకు వచ్చి నిలుచుంది, ఇందూ.

**

అరవై ఆరో సారి అసహనంగా అరచేతిలోని మొబైల్ లో టైం చూసుకుంది ఇందూ. అప్పటికి ఇంచుమించు గంట నుంచీ ఆ షేర్ క్యాబ్ లోనే కూర్చుని ఉందామె. సికింద్రాబాద్  సింధీ కాలనీ లోని ఒక ఫంక్షన్ హాల్లో జరగబోయే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి హాజరు కావలసి ఉన్నదామె. ఫంక్షన్ అసలు ఏడున్నరకే... కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే అసలు అక్కడికి చేరుకోగలనా అని భయంగా అనిపించసాగిందామెకు. సమయం రాత్రి ఎనిమిదిన్నర కాబోతుందేమో, కడుపులో బడిగంట మ్రోగినట్టు అన్నం గంట మ్రోగుతోంది. నగరమంతా నేల ఈనినట్టు ఒకటే కార్లు ఒకటే కార్లు! పోనీ దిగిపోయి ఆటోలో వెళదామా అంటే అలా  వెళ్ళే వీలు లేదు... శనివారం సాయంత్రం నగరం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడంతో  ప్రస్తుతం తానున్న ఏరియాలో అన్ని బళ్ళూ నిండుగానే ఉన్నాయి...

కారు ఆ ట్రాఫిక్ లో నత్త మేనత్తలా మెల్లగా కదులుతుంటే డ్రైవర్ బాబు డివైస్ లో ఎవరికో రైడ్ బుక్ అయినట్టు టోన్ వచ్చింది. అది చూసి తాపీగా ముందుకు కదిలి ఎడమ వైపు ఒక సందులోనికి తిప్పాడు. ఒక పది సెకన్ల పాటు కారంతా ఉస్సులూ, బుస్సులతో నిండిపోయింది. అప్పటికే కారులో ఇందూతో సహా  ఉన్న ముగ్గురు మనుషుల తాలూకు నిస్పృహా భరితమైన నిట్టూర్పుల శబ్దం అది...

‘ఇంకో బుకింగా తమ్మీ?’ ఇందూ పక్కనున్న ఆంటీ ఆక్రోశించింది. డ్రైవర్ పక్కనున్న ఆంటీ భర్తగారు, “ఒద్దొద్దు అనవడుతుంటే ఈ కేబు బుక్ చేసి తగలవెట్టిండు మన వియ్యంకుడు. మనమెప్పటికి బోవాల బోయినపల్లి దాకా?” అని విసుక్కున్నాడు. ఇవేవీ తనకు పట్టనట్టుగా నిర్వికారంగా కారును గల్లీలో మెల్లగా పోనిస్తూ, బుక్ చేసుకున్న క్లయింట్ కు ఫోన్ చేయసాగాడు డ్రైవర్ బాబు.

**

ఆ దారి చాలా సన్నగా ఇరుగ్గా ఉంది. ఇరువైపులా రకరకాల దుకాణాలు. కిక్కిరిసిపోయిన వాహనాలు. ఎవ్వరూ ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదు. ఎదురుగా వస్తున్న ఒక వ్యాన్ కి దారివ్వటానికి రోడ్డు అంచుకు జరిగాడు క్యాబ్ డ్రైవర్. ఇంచుమించుగా భోలా క్యాబ్ ను రాసుకుంటూ పోయిందా వ్యాన్. కారుకి ముందు ఒక ఆటో ఆగిపోయింది.

“ఇగో, నీ పేరేంటి తమ్మీ?” ఆంటీ అడగ్గానే, “బాబు...” అని చెప్పాడు సిన్సియర్ గా రింగ్ చేస్తూనే... ఈ అబ్బాయి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, అవతలి వాళ్ళు ఎత్తడం లేదు...

ఆ దారి చాలా సన్నగా ఇరుగ్గా ఉంది. ఇరువైపులా రకరకాల మిఠాయి దుకాణాలు, హోటళ్ళు, కిరాణా కొట్లూ. ఫ్యాన్సీ సామాన్లు అమ్మే అంగళ్ళూ... నగరంలో కనపడే నాగరికత అక్కడసలు లేదు... జనం చాలా మొరటుగా కనబడుతున్నారు. కిక్కిరిసిపోయిన వాహనాలు. ఎవ్వరూ ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదు. ఎదురుగా వస్తున్న ఒక వ్యాన్ కి దారివ్వటానికి రోడ్డు అంచుకు జరిగాడు క్యాబ్ డ్రైవర్ బాబు. ఇంచుమించుగా భోలా క్యాబ్ ను రాసుకుంటూ పోయిందా వ్యాన్. కారుకి ముందు ఒక ఆటో ఆగిపోయింది. బాబు హార్న్ కొడుతూనే ఉన్నాడు... అతను జరగటం లేదు... చివరికి ఏదో అద్భుతం జరిగినట్టు ఆ ఆటో కదలడం, ఈ కారు దాన్ని అనుసరించటం జరిగాయి. ఆ ఇరుకిరుకు సందులోంచి ఒక మూడు రోడ్ల కూడలికి వచ్చింది కారు. ‘హమ్మయ్య... ఎంత విశాలంగా ఉన్నదో ఇక్కడ!’ అనుకుంటూ హాయిగా ఊపిరి పీల్చుకుంది ఇందూ.

బాబు తానున్న చోటు తాలూకు ల్యాండ్ మార్కులు చెబుతూ వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఓపికగా. “వాళ్ళు ఎత్తడం లేదుగా, మనం వెళ్ళిపోదాం...” అది కుదరని పని అని  తెలిసినా ఆశగా అన్నది ఇందూ.

“అలా వీలు కాదు మేడం... వాళ్ళు కాన్సిల్ చేస్తే తప్ప మనం వెనక్కి వెళ్ళలేము... ఆ... ఆ... భయ్యా... కేబ్ బుక్ చేసారు కదా... నేను లొకేషన్ కి వచ్చేసాను... ఇదిగిదిగో ఇక్కడ ఒక స్కూలుంది చూడు, వివేకానంద హై స్కూలని, అక్కడున్నాను. మీరు త్వరగా వచ్చేయండి...” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

భోలా షేర్ రూల్స్ ప్రకారం, లొకేషన్ కి చేరుకున్నాక, బుక్ చేసుకున్న కష్టమర్ తో మాట్లాడాక, మూడు నిమిషాలు కనీస సమయం ఎదురుచూడాలి. ఆ తర్వాతే డ్రైవర్ కి అక్కడినుంచి కదిలే వీలు ఉంటుంది. ఎవరు ఎంత అర్జెంట్ పని మీద వెడుతున్నా, బుకింగ్ వచ్చినప్పుడు డ్రైవర్ కారును ఎక్కడికైనా (వెనక్కి అయినా) తీసుకువెళ్ళే హక్కు అతనికి ఉంటుంది. కాకపోతే ఒకసారి కారెక్కాక, దిగి వేరే ట్రాన్స్ పోర్ట్ చూసుకుని వెళ్ళడం కష్టం కాబట్టి, ఎవ్వరూ దిగరు. అసలు షేర్ ఆప్షన్ ఎన్నుకోవడమే తప్పని మనసులో చెంపలు వేసుకుంటూ... అన్నిటికీ అతీతంగా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు.

**

ఇందూ భర్త ఈశ్వర్ స్నేహితుడి కూతురు దీప ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కి కోఠీలోని తన ఆఫీసునుంచి బయలుదేరింది సాయంత్రం ఆరున్నరకు. ఈశ్వర్ ముందుగానే బయలుదేరి అక్కడికి చేరిపోయాడు. తన ‘చురుకు చరవాణి’ (స్మార్ట్ మొబైల్  ఫోన్) లోని భోలా యాప్ తెరిచి చూస్తే వ్యక్తిగతంగా బుక్ చేసుకోవటానికి అనుగుణమైన క్యాబ్స్ లేకపోవటంతో ఇక తప్పనిసరిగా షేర్ ఆప్షన్ ఎన్నుకుందామె. సాధారణంగా ఎక్కువ దూరం వెళ్ళాలి అంటే డైరెక్ట్ క్యాబ్స్ నూ, దగ్గర దగ్గరగా వెళ్ళాలి అంటే షేర్ ఆప్షన్ నూ ఎన్నుకుంటుంది ఇందూ... భోలా అమౌంట్ అనే సౌకర్యం ఉండటంతో అందులోకి తన క్రెడిట్ కార్డు నుంచి డబ్బు వేసుకుంటుంది. రైడ్ కి వెళ్ళిన ప్రతీసారీ దాని ఛార్జీలు ఆ మొత్తంలోంచి భోలా ఖాతాకు జమచేయబడతాయి.

అసలు ఆఫీసు దగ్గరికి క్యాబ్ వచ్చేసరికే పదిహేను నిమిషాలు పట్టింది. లోపలికి వెళ్ళగానే గొడవ. అప్పటికి డ్రైవర్ పక్కనే ఒకమ్మాయి కూర్చుని ఉంది. చూడటానికి కాలేజీ విద్యార్థినిలా అనిపించింది.  వెనుక సీట్ లో నడివయస్కులైన ఇద్దరు స్త్రీలు – బహుశా అక్కచెల్లెళ్ళు కావచ్చు, కలవరపడుతూ కనిపించారు. ఇందూ ఎక్కగానే ఎక్కడికి వెళ్ళాలో కనుకున్నారు వాళ్ళు. ‘సికింద్రాబాద్’ అన్న మాట వినగానే అందులో పెద్దావిడకు శివాలెత్తి పోయింది. “ఏమయ్యా? మేమేమో ఎల్బీ నగర్ వెళ్ళాలి. ఈ అమ్మేమో సికింద్రాబాదంటుంది. నువ్వేమో మమ్మల్ని ఇక్కడ దిగిపొమ్మని అంటావు... ఏంటిదీ?” అన్నది గట్టి గట్టిగా అరుస్తూ...

“చూడండమ్మా, డ్రాప్ లొకేషన్ ఇక్కడివరకే ఉన్నది వీళ్ళది...వీళ్ళు ఇక్కడే దిగిపోవాలి. కానీ చెప్పినా వినటం లేదు, అర్థం చేసుకోవటం లేదు...” అంటూ ఇందూకు తన డివైజ్ చూపించాడు డ్రైవర్. అసలేం జరిగిందంటే ఆ ఇద్దరిలో చిన్నావిడ కొడుకు వాళ్లకి మెహిదీపట్నం నుంచి యల్బీనగర్ వరకూ రైడ్ బుక్ చేశాట్ట. ఆ చేయడంలో పొరబాటు ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళ గమ్యం  కోఠీ వరకు మాత్రమే వచ్చింది. నియమం ప్రకారం వాళ్ళు అక్కడ దిగిపోవాల్సిందే. అదే వాళ్ళిద్దరికీ వివరంగా చెప్పింది ఇందూ... చేసేది లేక వాళ్ళు వాళ్ళబ్బాయినీ, భోలా సర్వీస్ నూ, భోలా డ్రైవర్ నూ  బాగా తిట్టుకుంటూ కారు దిగిపోయారు.

ఆ తర్వాత డ్రైవర్ క్యాబ్ స్టార్ట్ చేసి పోనిచ్చాడు. నారాయణ గూడాలో ఆ అమ్మాయి దిగిపోయింది. ఈలోగా మరో రైడ్ బుక్ అవటంతో నారాయణగూడా ఫ్లై ఓవర్ పక్కనున్న అమ్మవారి గుడివైపు కారును పోనిచ్చాడు డ్రైవర్. అక్కడ ఇద్దరు వృద్ధ దంపతులు ఎక్కారు. ఇద్దరూ చాలా నీరసంగా ఉన్నారు. బోయిన్ పల్లి వరకూ వెళ్ళాలట. హిమాయత్ నగర్ లోని హాస్పిటల్ కి వెళ్లి వస్తున్నారు. ఆ తాతగారికి మధుమేహ వ్యాధి ఉందట. ఈపాటికే భోజనం చేసి మందులు వేసుకోవాలి. హోటల్ లో ఇడ్లీ తిన్నారట కానీ అది తిని కూడా చాలా సేపు అయిందట... ఇందూ వెంటనే తన బ్యాగ్ లో ఉన్న బిస్కట్ ప్యాకెట్ తీసి ఆయనకిచ్చింది. ఆయన ఆవురావురుమని తినేసి, ఇందూకి  థాంక్స్’ చెప్పాడు. మామ్మగారు ఇందూ తలను ఆప్యాయంగా నిమిరింది.

నిజానికి ఇందూకి కూడా చాలా ఆకలి వేస్తోంది. ఎప్పుడెప్పుడు ఫంక్షన్ కి వెళ్లి విందు భోజనం తినాలా అని ఆరాటంగా కూడా అనిపిస్తోంది. ఈలోగా వచ్చింది ఈ శివాలయం దగ్గరి పికప్ రైడ్... రైడ్ కాన్సిల్ అయి, కారు కదలగానే హమ్మయ్య అనుకుంటూ, ‘జల్ది జల్ది పోనీ అయ్యా’ అన్నది మామ్మగారు. ఇందూ కూడా రిలీఫ్ గా నిట్టూర్చింది. ఆమెకు నెలరోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తు వచ్చింది.

**

ఆ రోజు ఎప్పుడూ లేనిది టిఫిన్ తినేసి, ఆఫీసుకు గంట ముందే రెడీ అయిపోయింది ఇందూ. ‘భోలా యాప్’ ఉంది కదాని సరదాగా షేర్ రైడ్ బుక్ చేసింది. బుక్ చేసిన పది నిమిషాల లోపే వచ్చింది క్యాబ్. ఇందూ ఎక్కేసరికి కారులో ఎవ్వరూ లేరు... “పోనీలే, త్వరగా వెళ్లిపోవచ్చు...” అని సంబరపడుతూ, తన ఓటీపీ చెప్పి వెనుక సీటులో కూర్చుంది. రైడ్ స్టార్ట్ చేస్తూ చెప్పాడు ఆ సారథి, “ఇంకో రెండు బుకింగ్స్ ఉన్నాయమ్మా, వాళ్ళను పిక్ చేసుకోవాలి...” అని.

“అయ్యో అవునా? సరేలే, ఎక్కడెక్కడ?” అని అడిగింది ఇందూ.

“ఒకటి నల్లకుంట కూరల మార్కెట్ దగ్గరమ్మా, రెండోది బర్కత్ పురా... ముందు నల్లకుంట వెళదాం... “ అంటూ అటు కారును పోనిచ్చాడు. నల్లకుంటలో నాలుగైదు సందులు తిప్పి తిప్పి ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆపాడు. ఇతను ఆ క్లైంట్ కి ఫోన్ చేయటం, అతని ఫోన్ కంటిన్యూ గా ఎంగేజ్ రావటం... ఇందూకి భయం మొదలైంది.

 

అప్పుడే తానింటినుంచి బయలుదేరి ఇరవై నిమిషాలు అయిపోయింది. ఇంకో అరగంటలో ఆఫీసుకు చేరి తీరాలి... ఆటోలో అయితే ఈ పాటికే ఆఫీసు చేరి పెండింగ్ పన్లు చేసుకుంటూ ఉండి ఉండేది తాను. నిస్సహాయంగా నిట్టూర్చింది. పదకొండోసారి ఫోన్ కలిసింది. ఆ బుక్ చేసుకున్న కష్టమర్ ‘వస్తున్నాను’ అని చెప్పి తాపీగా మూడు నిమిషాల తర్వాత మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చి కారెక్కి కూర్చున్నాడు.

కారు బయలుదేరింది బర్కత్ పురా వైపుగా. తిరిగి తిరిగి మరో  పికప్ పాయింట్ అయిన బర్కత్ పురాలోని ఒక హాస్పిటల్ వైపు వెళ్ళేలోగా, అక్కడి నుంచే వచ్చిన ఆ  రైడ్ కాన్సిల్ అయిపోయింది. అక్కడినుంచి కోఠీ  బయలుదేరారు. సరిగ్గా బడీ చౌడీ దగ్గరకు వచ్చే సరికి డ్రైవర్ కి మరో రైడ్ బుక్ అయింది.

“సారీ అమ్మా, వెనక్కి వెళ్ళాలి... అల్లదిగో నారాయణ గూడా పెట్రోల్ బంకు దగ్గర పిక్ చేసుకోవాలి...” నిస్సహాయంగా చెప్పాడు ఇందూతో. ఇందూకి విరక్తి వచ్చేసింది.

“అసలు మీరు సోబర్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి మేడమ్ వాళ్ళ రైడ్స్ బాగుంటాయి. ఇలా వెనక్కి వెళ్ళడాలు ఉండవు...” ఉచితంగా సలహా ఇచ్చాడు ఆమె కో ట్రావెలర్.  

దానికి జవాబు ఇవ్వకుండా, “సరే, నేనిక్కడ దిగి వెళతాను...లెఫ్ట్ లో  ఆపేయ్” అంది ఇందూ.

“అయ్యో, ఇక్కడినుంచి నడుస్తారా? దూరమే కదమ్మా... అదీగాక టైం కూడా అవుతోంది మీకు...” జాలిగా ఆమెను చూస్తూ అన్నాడు డ్రైవర్.

“అవును... వెనక్కి వెళ్లి రావటం కన్నా ఇలా ముందుకు వెళ్ళటమే బెటర్ కదా... ఫర్వాలేదులే, నువ్వు మాత్రం ఏం చేస్తావు?” అంటూ కారు దిగిపోయింది ఇందూ.

అప్పటికే పదిన్నర దాటింది. ఖాళీ ఆటో ఏదైనా వస్తుందేమో అని చూసింది కానీ ఆఫీసు టైం అవటం వలన అన్ని ఆటోలూ ఎంగేజ్డ్ గానే ఉన్నాయి. చివరికి పదకొండో నంబర్ బస్ ఎక్కి (కాలినడక) బయలుదేరింది నీరసంగా. దగ్గరగానే కనిపిస్తుంది కోఠీ  చౌరస్తా, ఎంతకీ రాదేం? ఇంచు మించు పది నిమిషాలు పట్టింది ఆఫీసు చేరటానికి. తిన్న టిఫిను ఎప్పుడో అరిగిపోయింది. టెన్షన్ కి చెమటలు పట్టేసాయి. జేబురుమాలు తీసి ముఖం తుడుచుకుంటూ ఆఫీసు లోపలికి  అడుగుపెట్టి, తన సీటు వైపు వెళ్ళి కూర్చుంది.

“అమ్మయ్య, వచ్చేసారా? చెప్పకుండా లీవ్ పెట్టారో ఏమిటో అని భయపడుతున్నాం...” పక్కనున్న కొలీగ్ చెప్పాడు, అటెండెన్స్ రిజిష్టర్ అందిస్తూ...“లక్కీగా బాస్ లేరు, మీటింగ్ కి వెళ్ళారు...” అన్నాడు మళ్ళీ అతనే... కృతజ్ఞతగా చూసి సంతకం పెట్టి రిజిష్టర్ అతనికి అందించింది ఇందూ.

అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది... ఎట్టి పరిస్థితి లోనూ ఉదయం పూట ఆఫీసుకు వెళ్ళేటప్పుడు మాత్రం భోలా క్యాబ్  అందునా షేర్ ఆప్షన్ అసలు బుక్ చేయకూడదనీ, చేస్తే తాను బుక్ అయిపోతాననీ...

**

“అమ్మా, సింధీ కాలనీ  వచ్చేసాం. మీ కళ్యాణ మండపం ఎక్కడ?” బాబు అడగడంతో భోలా అనుభవాల డోలల నుంచి ఇహప్రపంచం లోనికి వచ్చింది ఇందూ.

“అదిగదిగో... జూలూరి ఫంక్షన్ హాల్... అదే... అక్కడ పక్కగా ఆపేయ్... థాంక్స్ బాబూ... మామ్మగారూ, తాతగారూ వస్తాను...” అని వాళ్ళకూ చెప్పేసి దిగిపోయింది.

ఆమె కోసమే ఎదురు చూస్తున్న ఈశ్వర్ ఆమెకెదురొచ్చి, “ఇంతసేపా ఇందూ? అందరూ డిన్నర్ చేసి ఇళ్ళకు బయలుదేరుతున్నారు. పదపద... మనమూ తిందాము... పెళ్ళి వారిని తర్వాత కలుద్దాం...” అంటూ సెల్లార్ లో ఉన్న  డైనింగ్ హాల్లోకి తీసుకుపోయాడు. ప్లేట్ లో అన్నీ వడ్డించుకొని, ఏదో కాస్త అటూ ఇటూ కదిపి ఎంగిలి పడింది ఇందూ... తానూ భోజనం ముగించి, ఇద్దరికీ ఐస్ క్రీమ్ తీసుకువచ్చాడు ఈశ్వర్ - “నువ్వేమీ సరిగ్గా తినలేదు...” అంటూ.

ఆ తర్వాత పైకి హాల్లోకి వచ్చి వేదిక పైన ఉన్న కాబోయే వధూవరులను అభినందించి, వధువు తల్లిదండ్రులను కలిసి, అభినందించి, పెళ్ళికి తప్పక వస్తామని మాటిచ్చి, వాళ్ళిచ్చిన తాంబూలం ప్యాకెట్  తీసుకుని ఇంటికి బయలుదేరారు. “ఆటోలో వెళదామా?” అంది ఇందూ.

“ఎందుకు? చక్కగా ఏసీలో వెళ్ళొచ్చుగా, క్యాబ్ బుక్ చేయి...” నోట్లో స్వీట్ పాన్ వేసుకుంటూ అన్నాడు ఈశ్వర్.

ఈ సారి భోలా డైరెక్ట్ క్యాబ్ వెంటనే దొరికింది. మూడు నిమిషాల్లో వచ్చేసాడు. అరగంటంటే అరగంటలో ఇల్లూ చేర్చేసాడు. ‘ఆహా భోలా, ఇందాక నరకాన్ని, ఇప్పుడు స్వర్గాన్ని సమానంగా రుచి చూపించావు కదా!’ స్వగతంగా అనుకుంది ఇందూ.

OOO

bottom of page