top of page

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

వ్యాస​ మధురాలు

అప్పిచ్చి'వాడు -వైద్యుడు- 8
 

ఐ సీ! ఓ సీ డీ!!- 2 

ఎంతసేపు కడుగుతావురా నీ చేతులూ...? 

girja sankar.JPG

 చింతపల్లి గిరిజా శంకర్

జాన్ ఒక లాయర్.  న్యూయార్క్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అపార్ట్మెంట్ లో ఉండలేక, సెంట్రల్ పార్క్ లో ఒక బెంచ్ మీద పడుకున్నాడు.

 

"ఏమి చేస్తున్నావిక్కడ"? అన్న ప్రశ్న వినగానే, తలెత్తి చూశాడు.  ఎదురుగా పోలీస్ మన్. 

 

“నిద్రపోతున్నాను, ఆఫీసర్!" అని జాన్ సమాధానం ఇచ్చాడు. 

 

"ఇల్లూ వాకిలీ లేదూ? ఇక్కడ పడుకోకూడదు" 


"నేను ఇక్కడే మెయిన్ స్ట్రీట్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాను. నీళ్ళెక్కువ వాడుతున్నానని మా అపార్ట్మెంట్ మానేజర్ నన్ను వెళ్ళగొట్టాడు. వేరే ఇల్లు తీసుకోవాలి. రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను" అని జాన్ ప్రాధేయపూర్వకంగా చూశాడు కాప్ వైపు.


తన ధర్మం నెరవేర్చానన్న తృప్తితో ఆ పోలీస్ వాడు పక్క పొద పరిశీలనకి వెళ్ళిపోయాడు. 


జాన్ వాచ్ చూసుకున్నాడు. రాత్రి 3 గంటలయింది. మసకగా పట్టిన నిద్ర, ఉదయాన్నే చెయ్యాల్సిన తక్షణ కర్తవ్యాలు గుర్తుకొచ్చి హడావిడిగా లేచాడు. ఆ పక్కనేవున్న రెస్ట్ రూంస్ లో మొహం కడుక్కున్నాడు. అలాగే బయలుదేరాడు, ఇంటి హంటింగ్ కి.  నడుస్తూ ఆలోచించి బేరీజువేసుకుంటున్నాడు తను గత పది సంవత్సరాలుగా OCD తో పడ్డ పాట్లు. చేతులు కడుక్కోవడం, స్నానం అనంతంగా చెయ్యడం, బట్టలు వేసుకునేటప్పుడు సరిగ్గా మాచింగ్ లేకపోతే చిరాకు వేయటం, మెదడులో ఏదో ఒక పాట అహర్నిశలూ గుర్తుకిరావడం, దాన్ని మెదడులోంచి వదిలించుకోవలేకపోవటం, క్లాసెట్ [Closet] లో బట్టలూ అన్నీ రంగులవారీగా, జనెర్ వారీగా హాంగర్లకి తగిలించడం, మళ్ళీ హాంగర్ కి హాంగర్కి మధ్య సమంగా ఉండాలి దూరం. మానుదామంటే, పానిక్ అటాక్ రావటం. మందులూ, కౌన్సిలింగ్, తన పట్టుదలా, తన ఉద్యోగం చదువూ ఇంకా స్నేహితులు, తల్లిదండ్రుల సహాయంతో తన కాళ్ళమీద తను నిలబడగలుగుతున్నాడు. కానీ ప్రతీ క్షణం ఆ సింటంస్ ని అణిగి ఉంచడానికి అతను ఖర్చు చేసే సైకిక్ ఎనర్జీ [Psychic Energy]  అతణ్ణి నీరసపరుస్తూంది.   అలాగే ప్రయత్నిస్తూ, కొత్తమందులు వచ్చి ఇంకా పూర్తి సుగుణం కలుగుతుందని ఆశతో జీవితం వెళ్ళబుచ్చుతున్నాడు. డ్రగ్ వాడుక, మిగిలిన దురలవాట్లు లేనందువల్లా, తప్పకుండా ఈ జబ్బుని అణగదొక్కాలనే తపన అతణ్ణి హతాశుడు కాకుండా ఆశారేఖతో జీవించే అవకాశం కల్పించింది.   


**

జాన్ కి దాదాపు 28 యేళ్ళుంటాయి. న్యూయార్క్ స్టేట్ లోనే ఒక చిన్న టౌన్ లో పెరిగాడు. 5-6 యేళ్ళు వచ్చాక, స్కూల్ మొదలెట్టాక, ప్రారంభమయ్యాయి. కొన్ని బాధలు.  మొహం కడుక్కునేటప్పుడు, తను తొందరగా తెమలలేకపోయేవాడు. ఒకసారి కడుక్కున్న తరవాత, చేతులకి ఇంకా మట్టి ఉందని మళ్ళీ కడుక్కునేవాడు. ఒక అరగంట అయ్యాక, తలుపు నాబ్ ఓపెన్ చేసి, బయటికి వచ్చేలోగా, మళ్ళీ చేతికి క్రిములేవో అంటుకున్నాయని మళ్ళీ 15 నిమిషాలు కడిగేవాడు. అలా అలా అతను చేతుల అశుభ్రతని క్లీన్ చెయ్యడానికి చాలా టైం తీసుకోవడం మొదలెట్టాడు. ఎంత కడిగినా సంతృప్తి లేక మళ్ళీ మళ్ళీ కడగడం. ఇది మెల్ల మెల్లగా అతని దినచర్యని పాడు చెయ్యడం మొదలు పెట్టింది. ఇలా యీ అలవాట్లు దినదినాభివృద్ధి చెందుతూ 14 -15 సంవత్సరాలొచ్చే టప్పటికి, అతని దినచర్యలో చాలా మార్పులొచ్చాయి.  చేతులు  ఎన్నిసార్లు కడుక్కున్నా తృప్తి లేక చేతులు కడగడమాగక, స్కూలుకు లేటవ్వడమూ, అమ్మా నాన్నలు డాక్టర్లదగ్గరికి తీసుకొనిపోవడమూ జరిగింది. చివరికి వాళ్ళు రోగనిర్థారణ పూర్తిచేసి "OCD" అని చెప్పారు.

 

అదే టైములో అక్కడి పక్క హాస్పిటల్లో  ఇటువంటి జబ్బులకి కొత్తరకం మందు ఒకటి వచ్చిందనీ, ఎవరికయినా  ఇటువంటి జబ్బు ఉన్నవారు  ఈ కింద నంబర్ సంప్రదించమంటూ ఉన్న ఫ్లయర్ చూసి, జాన్ ఆ స్టడీ  గ్రూప్ లో చేరాడు.


6 వారాల ట్రీట్మెంట్ అయ్యాక, ఆ మందులు కంటిన్యూ చెయ్యమని  చెప్పారు.  కొంత నయమయ్యిందని ఫామిలీ అంచనా. దానా దీనా కాస్త గుణం కనబడ్డా జాన్ కి ఆ సమయంలో చేతులు  అతిగా కడుక్కోవడం, తలుపు తీసుకున్నాక మళ్ళీ కడుక్కోవాలనుకోవడం,  ఆ పని చేయకపోతే చాలా ఆందోళన మెదడులో నంబర్స్ లెక్కపెట్టడం, సోషల్ ఫోభియా [సభాపిరికితనం],  లైబ్రరీకి వెళ్ళితే మళ్ళీ పానిక్. ఇలా చాలా బాధలు పడ్డాడు జాన్. మందులువేసుకుంటూ, కౌన్సిలింగ్ తీసుకుంటూ నెమ్మదిగా పరీక్షలు అన్నీ పాస్ అయ్యి, లాయర్ అయ్యాడు. 

అక్కడే పక్కనే అపార్ట్మెంట్ అద్దెకి తీసుకొని ప్తాక్టీస్ చేస్తున్నాడు.  తన ప్రాక్టీస్ కొంచెం కొంచెం పెరుగుతున్నది. తన జబ్బు లక్షణాలు పూర్తిగా నయమయిపోలేదు గానీ, కంట్రోల్ చేసుకునే శాంతం దొరుకుతున్నది. అయినా  ఈ జబ్బువల్ల 30 యేళ్ళ “ఎలిజిబిల్ బాచిలర్” కి ఉండాల్సిన జీవితం రాలేదు. ఈ అపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత కొత్త సమస్య వచ్చిపడింది. స్నానం ఎంతకీ తెగకపోవడం. రోజురోజుకీ స్నానానికి టైం అరగంట నుంచి గంటా లెవెల్ కి పెరిగింది. వర్క్ కి టైం కి వెళ్ళాలంటే, తొందరగా లేవడం, నిద్ర చాలకపోవటం, విసుగూ విరాగం. ఒక నెల తిరిగేసరికి, మానేజర్  వచ్చి "అద్దెగట్టి ఖాళీ చెయ్యమ"ని చెప్పాడు. లబో దిబో మని జాన్ గోలపెడితే, వాటర్ బిల్లు చూపించి, ఇంటి అద్దెకన్న వాటర్ బిల్ల్ ఎక్కువుంది. రూల్ ప్రకారం వాడేం చెయ్యలేడని చెప్పి వాడి దారిన పొయ్యాడు. 


కొన్ని రోజులు హోటేల్లో ఉండి ఇంకొక అపార్ట్ మెంట్ , మళ్ళీ హోటేల్, మళ్ళీ ఇంకో ఇల్లు. ఇలా నెమ్మది నెమ్మదిగా అన్వేషిస్తున్న రోజుల్లో అన్నమాట మన కథా సమయం.  గుడ్డిలోమెల్ల. తనకి హొటేల్లో ఉంటే అక్కడ స్నానం చేయడానికి కష్టం లేదు.

    
అలా చక్కర్లు కొడుతూ కొడుతూ చాలావరకూ కులాసాగా ఉన్నాడు. ఇంకా పెళ్ళికాలేదు. తన ప్రాక్టీసులో కొంత సమయం  సైకియాట్రిక్ హాస్పిటల్లో ఈ జబ్బున్నవాళ్ళకి ఫ్రీ గా న్యాయ సౌకర్యం అందజేస్తున్నాడు. 

ఆ హాస్పిటల్ 7 బెడ్స్ తో ప్రారంభమయి చాలామందికి ఈ జబ్బు గురించి తెలియజెప్పి, భయం పోగొట్టి రోగులు  వైద్యం కోరుకోటానికి సహాయపడింది.  ఈ జబ్బు పేరు OCD.  Obsessions అంటే బుర్రలో పురుగు తినేటట్టు ఆలోచనలు. [రకరకాలు] అలాగే  Compulsions అంటే కర్మేంద్రియ సంక్షోభ. ఏదో టిక్, మానరిజం పదే పదే తొలిచేస్తుంటాయి. అది చెయ్యకపోతే దుర్భరమయిన ఆందోళన. ఇంకొక ప్రాబ్లెం ఏమిటంటే. ఈ జబ్బు ఉన్నవాళ్ళు, తనది ఒకానొక దేహ రుగ్మత అనీ, ఇది చాలామందికి ఉంటుందనీ తెలియక, తమకి "పిచ్చి" అనుకుంటారని, మానసిక బలహీనతకి బాధ పడుతుంటారు.  ఫ్రాయిడ్ టైం లో సైకోఅనాలిసిస్ అనీ ఆ తరవాత కాలం లో behavioral therapy ఇలా చాలా ప్రయోగాలు చేశారు. 1920ల్లో వచ్చిన ఫ్లూ పాండెమిక్  తరవాత , ఆ జబ్బు వచ్చి తగ్గినతరవాత ఇలాంటి OCD కొంత మందిలో కనబడ్డాయి.  వారి మెదడులో కొన్ని మార్పులను కనిపెట్టాక నిపుణులు, బ్రెయిన్ లో Basal Ganglia లో ఒకానొక హార్మోన్ లోపించటం వల్ల అని నిర్థారణ చేసి, ఒక మందుని కనిపెట్టారు. ఆ మందు వాడినవారికి గుణం కనిపించింది పేరు Anafranil.. దానా దీనా టివిలో ప్రొగ్రాములద్వారా ప్రజల్లో ఈ జబ్బు గురించి పదిమందికీ తెలిసి, ఇది "పిచ్చి" కాదనీ, మెదడుకి సంబంధి చిన శారీరక రుగ్మత అనీ, దీనికి సిగ్గు పడక్కరలేదనీ జనాల్లో ప్రచారం అయ్యి రోగులు ముందుకురావడం మొదలెట్టారు.  ప్రస్తుతం అమెరికాలో ఈ జబ్బున్నవాళ్ళు  5.5 మిల్లియన్లని అంచనా. 

సైకియాట్రీ జబ్బులవల్ల బాధకి తోడు, ఆ జబ్బులంటే నామోషి, మిగిలిన ప్రజానీకానికి చులకన. ఇత్యాది బాధలవల్ల చాలామంది వైద్యానికి భయపడతారు.   

చాలా జబ్బులకిలాగానే ఈ జబ్బుకీ కారణం ఇదమిత్థమని చెప్పరు. కచ్చితంగా ఇదిగో ఇక్కడిదిగో ఇది ఉంది గాబట్టి ఇలా జరుగుతున్నదని చెప్పలేని అనేక వ్యాధుల్లో ఇదొకటి. సైకోఅనాలిసిస్  ఆదికవి ఫ్రాయిడ్ Doing and Undoing [Defense Mechanisms]  అని ఉదహరించాడు. టూకీగా ఒక చెడు ఆలోచన మెదడులో పుడుతుంది. జీవాత్మ కి  [Ego]  ఆ ఆలోచన నచ్చదు.  "ఛీ! అది తప్పు" అని కొంతమంది  టీన్స్ అన్నట్టు ఫీలింగ్ అన్నమాట. ఉదాహరణకి, చేతులు కడుక్కోవడం అతిగా చేయడానికి. వివరణ. చేతితో ముట్టుకోకూడని పనిచేస్తాడు,  అది వదిలించుకోవటానికి [Doing and Undoing ]   కడుక్కోవాలి. కడగాలన్న ఆలోచనలు ఆ పని చేసేదాకా వెంటవెంటనే వస్తూంటాయి. అనుకున్న పని    చెయ్యకపోతే పానిక్  ఫీలవుతారు.   

ఫ్రాయిడ్ ఆరోజుల్లో ఆస్త్రియా లో ఒక ఆస్పత్రిలో పథాలజి స్ట్ గా ఉండేవాడు. శవపరీక్ష చేసి ఆ రోగి ఏ జబ్బులతో బాధపడ్డాడూ, ఏ జబ్బులవల్ల ప్రాణం పోయింది. నిర్ణయించే ఉద్యోగం. అందులో సొంత తెలివితేటలకి పెద్ద చాన్స్ ఉండదు. డబ్బులూ ఎక్కువ రావు. ఆ తరవాత  న్యూరాలజీ. అదీ అంతే చాలా జబ్బులకి [అప్పట్లో] కారణం తెలీదు. ఆదాయం గూడా తక్కువ.

 అందుకని సైకోఅనాలిసిస్ అని ఒక కొత్త మానసిక వ్యాధుల ట్రీట్ మెంటు- మనిషి పుట్టుకతోనే 1.ID 2. Ego, 3. Superego [అదేనండీ కారణ, సూక్ష్మ, స్థూల శరీరాలు] తో పుడతాడనీ. అరచేత వైకుంఠమంటే ఇదే.

యూరప్ లో అమెరికాలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక గంటసేపు డాక్టర్ ఆఫీసుకి వెళ్ళి, తన మనసులోని ఆలోచనలూ, "కసీ" తీర్చుకొని , తేలికబడి" నవ్వుకుంటూ ఇంటికొస్తారని ప్రచారం జరిగింది.


  బాగా డబ్బులు సంపాయించాడు. అప్పటికి బ్రెయిన్ ఫంక్షన్స్ బాగా తెలియదు. ఎపిలెప్సీ మీద కొన్ని ప్రయోగాలు చేరాయి. కానీ మందులు లేవు. 1930 నాటికి ఉన్న మందులు సంపూర్ణ అలోపతీ లో నాలుగు! 1. క్వినైన్, 2. ఎమెటిన్ [ లివెర్ జబ్బులకి] 3. మార్ఫిన్ [నొప్పికి] 4. పరాల్డిహైడ్ [పిల్లలకి నిద్రపుచ్చటానికి.]

మన వేదాంతంలో  మనసు గురించి, ఆత్మగురించి మాత్రమే చెప్పబడుతుంది. బ్రెయిన్ అనాటమీ గురించి చెప్పరు. ఎంతసేపూ, ఆత్మ పవిత్రం, అదే పరమాత్మ, మనం చూస్తున్నదీ, అనుభవిస్తున్నదీ మిధ్య.జ్ఞానం రాగానే అన్నీ మటుమాయమయి పోతాయి.వివేకానందుడు.1.conscious, 2. subconscious, 3. Supraconscious  అని విభజించి చెప్పాడు. ఘోష్ Superconscious అని ఉన్నదనీ [దేముడు] అది అందరికీ అందుబాటులోకి తేవచ్చనీ జీవితాంతం తపస్సు చేశాడు.

మరి ఫ్రాయిడ్ ఎక్కడ నేర్చుకున్నాడో, , ID,EGO,Super ego అని నిర్వచించాడు. వివేకానందుడి మూడు ఉంచాడు. నా ఉద్దేశం లో ఫ్రాయిడ్ వాళ్ళనీ చదివి మసిపూసి మారేడుకాయ చేశాడు.

   మనిషి జంతువులాగానే ఆహార నిద్రా మైథునాలతోనే పుడతాడనీ, సమాజం కట్టుబాట్లకి అనుగుణంగా అలవాట్లు ఆలోచనలూ మార్పు  చేసుకుంటాడనీ, వాటికీ వీటికీ మధ్య అంతరాలొస్తే, జబ్బులొస్తాయని.  ముఖ్యంగా అతని సిద్ధాంతం, మనిషి స్వతహాగా ధూర్తుడనీ , తన సంఘ చట్టుబాట్ల పోటీలో నెగ్గలేక, జబ్బులు తెచ్చుకుంటాడనీ, ఆ కారణం ఏమిటో తన అనాలిసిస్ లో తేలిపోతే, ఆ జబ్బు నయమవుతుందనీ.

 ఇప్పుడు ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని ఎవ్వరూ వాడటం లేదు. చాలా జబ్బులకి, బ్రెయిన్ లో  కెమికల్ చేంజస్ వచ్చి జబ్బులక్షణాలు కనిపిస్తాయని నమ్ముతారు. 

హిట్లర్ జర్మనీలో రాజ్యం పుంజుకొని, Jews ని అందర్నీ ఊచ కోస్తున్న సమయంలో ఆయన ఇంగ్లండ్ వెళ్ళి తలదాచుకున్నాడు. చాలా సంపాదించాడు.     


తుది పలుకు 

పూర్తిగా నయమవ్వలేదుగానీ జాన్ చాలావరకూ అడ్జస్ట్ అయ్యి ఉద్యోగం, చదువూ, సైకియాట్రిక్ హాస్పిటల్లో వాలంటీర్ వర్క్తో తలమునకలయ్యాడు. కానీ, ఎప్పుడు ఆ దారినపోతున్నా, సెంట్రల్  పార్క్ కి వెళ్ళి గాలిస్తాడు. ఎవరయినా పార్క్ బెంచ్ మీద పడుకున్నవాళ్ళెవరన్నా కనిపిస్తే, వెళ్ళి పరామర్శిస్తాడు. Just in case !!  తనలాంటి వాడెవరయినా కనిపిస్తాడేమోనని !!! 

**

ఒకరోజు నా ఆఫీసుకి ఒక అందమయిన యువతి వచ్చింది. ఒక నవ్వు నవ్వి, హాట్ తీసేసింది. అలా వరసబెట్టి "అంగాపహరణం" చేయడం మొదలెట్టింది.  ఈ ఉదంతం వచ్చే సంచికలో ---

bottom of page