top of page
Anchor 1

సంపుటి 2  సంచిక 2

కథా మధురాలు

Z

Hitesh Kollipera

మధు చిత్తర్వు

తెర తొలగించి కిటికిలోంచి చూస్తే దూరంగా కొండల మీద నుంచి లోయలోకి వ్యాపించిన చెట్ల మీదా, పొదల మీదా అస్పష్టంగా పరదా కప్పినట్లు బూడిదరంగులో వెన్నెల. తెల్లటి మేలిముసుగులా పొగమంచు పొర.

కనుచూపు మేర ఏమీ కదలిక లేదు. చీకటీ వెన్నెలా - మంచుతో తడిసిన చెట్లని ఆకుపచ్చని బూడిదరంగులోకి మార్చేశాయి. నల్లమబ్బు తునకలు నిండిన ఆకాశంలో పడమటి మూల అర్ధ చంద్రుడు పేలవంగా వెలుగుతున్నాడు.

"ఠక్" "ఠక్" "ష్ ష్... హ! హ!" అడుగుల చప్పుడు. ఎండుటాకుల నిండిన రాళ్ళమీద... ఏదో జంతువు ఊపిరిలాగా...!

ఇప్పుడు పూర్తిగా మెలకువ వచ్చి మెదడు చైతన్యవంతమైంది.

AK 47 రైఫిల్ వ్యూ ఫైండర్‌లో నుంచి ఫోకస్ చేయసాగాను. ప్లస్ ఆకారంలో ఉన్న ఎర్రని చారల మధ్యగా దూరంగా తూలుకుంటూ చేతులు అటూ ఇటూ బొమ్మలలాగా కదుల్తూ అడుగులు వంకరగా వేస్తూ ఊగిపోతూ వస్తున్నారు నల్లటి నీడల్లాగా. చీకట్లో వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనబడలేదుగానీ, రేగిన చింపిరి జుట్టు, నడిచే అవకతవక నడకా, క్రమంగా పెరిగి పెద్దదవుతున్న వాళ్ళ ఊపిరి చప్పుడు... వినిపిస్తూనే ఉన్నాయి.  కనీసం ఆరుమంది. ఇద్దరు విరబోసిన జుట్టుతో ఉన్న స్త్రీలు.

మరింత దగ్గరికి రాసాగారు. నేనున్న గెస్ట్ హౌస్ కొంచెం ఎత్తైన స్థలంలో ఉంది. చుట్టూ చిన్న కంచె మాత్రమే ఉంది. గేటు లోంచి సన్నని రాళ్ళదారి గెస్ట్ హౌస్ ముఖద్వారం దాకా వంకరలు తిరుగుతూ సాగివచ్చింది.

గురి పెట్టాను.

ఇప్పుడు భయం తగ్గి ఆలోచనా, విచక్షణా నశించి అసంకల్పిత ప్రతీకార చర్యలే అలవాటయిపోయాయి.

మరింత దగ్గరగా అడుగుల చప్పుడు! కంచెని తొక్కుతూ గేటుని తీయకుండానే దాని మీద నడిచి పడుతూ లేస్తూ ఊపిరి చప్పుడు గురకలా తీస్తూ వచ్చేస్తున్నారు!

తలలు పక్కకి తిప్పి సగం తెరిచిన జీవం లేని కన్నులు, మడతలు పడి శిథిలం అయిన దవడల్లోంచి కనిపించే దంతాలు కోరల్లాగా.. బ్రతికి ఉన్న చచ్చినవాళ్ళు; నడిచే శవాలు!

ఆకలితో ఉన్నప్పుడు వాటికి ఏ కంచే, గోడా, గేటూ, తలుపూ అడ్డం రావు..

క్రూర మృగాల్లాగా, వేటాడే దెయ్యాల్లాగా, ఒకటే లక్ష్యంతో ముందుకి నడుస్తూ వచ్చేస్తున్నారు.

వాళ్ళని నడిపించేది ఒకటే!

ఆకలి. ఇన్‌స్టింక్ట్. ఆఘ్రాణ శక్తి.

వాళ్ళకి చావు లేదు, నొప్పి లేదు, బాధా లేదు!

చనిపోయిన వాళ్ళకి చావేంటి మళ్ళీ?

వారి తలలకి గురి చూసి ట్రిగ్గర్ నొక్కాను. గన్ అటూ ఇటూ తిప్పాను.

ఎర్రగా పేలిన తల వంద ముక్కలుగా పీలికలుగా ఎగిరి గాలిలో కలిసింది.

పడిపోయిన ఆ శరీరం మీద వాళ్ళు.. మిగిలిన ఐదు ఆకారాలు తొక్కుకుంటూ నడుస్తూ వచ్చేస్తున్నాయి.

"తల... బ్రెయిన్... గురి చూడు" శేషగిరి, పాల్, సాదిక్ ముగ్గురూ అరుస్తున్నారు వెనుక నుంచి.

మళ్ళీ ట్రిగ్గర్ నొక్కాను. మళ్ళీ... మళ్ళీ మళ్ళీ...

ఐదు సార్లు. గురి తప్పలేదు. ఐదు తలలు పేలి ఎర్ర రంగు మంట జివ్వుమని చిమ్మింది. కకావికలైన పుర్రె ముక్కలు, శరీరాలు రాలిపోయి రేగిన దుమ్మూ, ధూళీ, ఎండుటాకులూ....

నడిచే శవాలు. వాటిని చంపాలంటే తలలో బ్రెయిన్, థలామస్, మెడుల్లాలలో బులెట్ తగిలితేనే నిర్మూలించగలం.

ఐదు నడిచే శవాలనీ పడగొట్టాను - నుదుటిమీద చెమట తుడుచుకుని, వేగంగా కొట్టుకునే గుండెని చిక్కబట్టుకుంటూ.

రెండు రోజుల్నించి ఇదే అలవాటయిపోయింది.

మామూలూగా అద్భుతంగా, స్వర్గంలా ఉండే మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ అనంతగిరి లోయ ఇప్పుడు ఆకలితో నిండిన నడిచే శవాల మయం అయింది.

అవును! "జాంబీ"లతో నిండిపోయింది!

***

వారం రోజుల క్రితం న్యూయార్క్ మన్‌హాటన్‍లో జెడ్‌కాన్ ఫార్మా హెడ్ క్వార్టర్స్‌లో కూర్చుని ఉన్నప్పుడు ఈ దృశ్యాలు కలలో కూడా ఊహించలేదు.

కంప్యూటర్ తెర మీద ఎన్‌క్రిప్టెడ్ సందేశం.

"టు జకియా సిద్ధిఖీ, ఆపరేషన్స్‌మేనేజర్@జెడ్‌కాన్‌ఫార్మా.కామ్ అడ్రస్‌తో విద్యుత్ లేఖ! ఎర్రటి అక్షరాలతో ఇంగ్లీషులో.

"మేడమ్ సమ్ హారిబుల్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ అవర్ కంపెనీ. మన అనంతగిరి ప్రాజెక్టులో ఏదో ఒక భయంకరమైన సమస్య వచ్చి పడింది. ఫేజ్ త్రీ ప్రయోగంలో పాల్గొన్నవాళ్ళు వింతగా ప్రవర్తిస్తున్నారు. అర్జంట్‌గా రావల్సిందే! ఈక్రింది కేస్ రిపోర్టులు చూడండి!

రంగయ్య పి. వయసు 72. రాత్రుళ్ళు హాస్పిటల్ పడక నుంచి నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు. అపస్మారకంలో ఉన్నాడు. వార్డు బోయ్‌లు వెదికి పట్టుకున్నారు. అతని ముఖం మీద రక్తపు మరకలు... దుస్తులన్నీ చిరిగిపోయాయి. అతను తిరగబడితే "హేలో పెరిడాల్ 1.5 m ఐవి ఇంజక్షన్, ఆ తర్వాత లొరాజ్‌పామ్ ఐవి, గ్లూకోజ్ బాటిల్స్ ఇవ్వాల్సివచ్చింది."

రంగయ్య ఫోటో. తెల్లని జుట్టుతో మడతలు పడిన ముఖంతో ఒక కన్ను మూసుకుని ఉంది. పూర్వం ఫెయిలయిన కంటి ఆపరేషన్ వల్ల ఒక కన్ను గుడ్డి. అతను నాకు గుర్తున్నాడు. "AZ" పేషంట్. నేనే ప్రోగ్రాంకి రిక్రూట్ చేసి తీసుకొచ్చాను.

"సుగుణమ్మ. 80. వృద్ధ స్త్రీ ఫోటో. కళ్ళజోడుతో. అదే కేస్ హిస్టరీ. అదే ప్రవర్తన. అవే మందులు."

ఇంకా ఇలాగే నలుగురు వృద్ధ రోగుల కేస్ హిస్టరీలు, ఫోటోలు.

ఇండియాలోని విశాఖపట్నం దగ్గర అనంతగిరిలో ఉన్న మా కంపెనీ బ్రాంచ్ చీఫ్ డాక్టర్ సాదిక్ పంపిన ఈమెయిల్ అది.

నేనే ఆ ప్రాజెక్టు మేనేజర్‌ని. ఆ ప్రాజెక్టు చాలా విలువైనది. కంపెనీకీ ప్రతిష్ఠాత్మకమైనది. ఇప్పుడు ఆఖరి దశ. మందుల తయారీ పరిశ్రమలో ఫేజ్ త్రీ అనబడే దశలో ఉంది.

రోగులు ఇప్పుడిలా ప్రవర్తిస్తుంటే వంద మిలియన్ డాలర్ల అంతర్జాతీయ వ్యాపారం కాగలిగే "మందు" భవిష్యత్తు ఏమిటి? త్వరగా వెళ్ళాల్సిందే.

ఫార్మకాలజీలో డాక్టరేటుని! పదేళ్ళ క్రితం ఇండియానుంచి వచ్చి ఎం.ఎస్. చేసి ఈ కంపెనీలోనే చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చిన స్త్రీలలో మొదటి భారతీయురాల్ని.

***

"AD" ఆల్జీమీర్స్ డిసీజ్. మేం దానికే AZ అని పేరు పెట్టుకున్నాం ముసలివారికి. "ముసలి" అనే పదం వాడకూడదు మరి, వయోవృద్ధులకి (సీనియర్ సిటిజన్స్) వచ్చే మతిమరపు వ్యాధి.  కొంచెం కొంచెం మతిమరపు వచ్చి చివరికి అన్నీ మర్చిపోయి, జీవితం దుర్భరం అయ్యే వ్యాధి. ఇది అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా ఈమధ్య పెరుగుతోంది. దానికి ఏ మందులూ సరిగా పనిచేయవు. "డొనెపేజిల్", "మెమాంటైన్" అనేవి కొంతవరకే పనిచేస్తున్నాయి. వ్యాధి ఎందుకొస్తుందో తెలియదు. మొదట్లో "అమైలాయిడ్" అనే పదార్థం పేరుకుంటుందనీ, నరాలు దెబ్బతిని "న్యూరో ఫెబ్రిల్లరీ టాంగిల్స్"లా కనిపిస్తాయనీ తప్ప ఏదీ కనిపెట్టలేకపోయారు. వ్యాధి వచ్చిన రోగి క్రమంగా అన్నీ మరచి, జీవితం దుర్భరమై... తనని తాను కాపాడుకోలేక క్రుంగి కృశించి మరణించడమే జరుగుతుంది.

ఆ వ్యాధికే నేను... డాక్టర్ జకియా సిద్ధిఖీ (పిహెచ్.డి)... ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, దాని మందు కోసం అన్వేషించాను. పరిశోధన చేశాను.  గ్రూప్ వైరస్ కోక్‌సాకీ వైరస్ A131 అనేది కొందరి మెదడుల అటాప్సీలలో బయటపడింది. దానికి విరుగుడుగా ఒక వాక్సిన్ తయారు చేసి కొంచెం కొంచెం ఇస్తే ఈ వ్యాధి తగ్గుతుందని కొన్ని జంతువుల మోడల్స్‌లో నిరూపించినందుకే నాకు పి.హెచ్.డి వచ్చింది.

మంచి జీతం, సౌకర్యాలు, ఉద్యోగం. అమెరికన్ కంపెనీలో ప్రమోషన్. అన్నీ నచ్చాయి. నా భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ఐ.టి.లో పని చేసేవాడు. మా ప్రవృత్తులు కలవక విడిపోయాం.

ఏదో వెలితి. ఒంటరితనం. కోపం. అన్వేషణ. నా వృత్తిలో నేను ఇంకా ఎదిగి ప్రఖ్యాతి పొందాలి. అందుకనే మొత్తం నా జీవితంలోని సమయాన్నంతటినీ ఈ వైరస్ వాక్సిన్ కోసమే వినియోగించాను.

జెడ్‌కాన్ ఫార్మా ఎం.డి. ఆ రోజు నన్ను ఆఫీసుకు పిలిచి అంతర్జాతీయ పరిశోధనకి రీసెర్చ్ గ్రాంటు ఇచ్చి నన్ను ఈ మందు తయారు చేయడానికి అధిపతిగా ప్రమోషన్ ఇచ్చిన రోజు.

జీవితంలో టర్నింగ్ పాయింట్!

"త్వరలో ఈ మందు మనుషులలో ప్రయోగించి దాని ప్రభావం, సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవని నిరూపించాలి! AD పేషంట్లకి వారి బంధువులకి ఉపయోగం. మన కంపెనీకి మిలియన్ల మార్కెట్. ఇది నీకు అప్పగిస్తున్నాను, జకియా! ఒక రోజు నీకూ, మన కంపెనీకి నోబెల్ బహుమతి ఖాయం!"

మన్‌హాటన్‌లో 43వ అంతస్తులో సంవత్సరం క్రితం జరిగిన ఆ సమావేశంలో నేను, ప్రపంచ ఆల్జీమీర్స్ వ్యాధి పరిశోధనకి ఛీఫ్‍గా నియమింపబడ్డాను. జీతం కాక, పేటెంట్ వచ్చాక మందు అమ్మకాలలో 20 శాతం ఇస్తారు. కంపెనీ షేర్లు సంవత్సరానికి వేయి చొప్పున శాశ్వతంగా నా పేర ఇస్తారు.

అదీ కాక, పరిశోధన కొత్త చికిత్స కనిపెట్టడంలోని సవాలు... ఆనందం...

అందుకే ఈ మందు ప్రయోగించడానికి ఇండియాలో వృద్ధాశ్రమాలన్నీ వెదికి ప్రయోగానికి అనుకూలమైన వాళ్ళందరికి నచ్చజెప్పి అనంతగిరి జెడ్‌కాన్ బ్రాంచి కంపెనీ దగ్గరి కంపెనీ హాస్పిటల్‌కి తీసుకువచ్చాను. వాళ్ళ సంతానానికి డబ్బు ఆశ చూపితే ఆనందంగా ఒప్పుకున్నారు. అందరూ కాస్తో కూస్తో ఆల్జీమీర్స్ లక్షణాలు ఉన్నవాళ్ళే.

లేక అవి వృద్ధులకి సహజంగా వుండే జ్ఞాపకశక్తి లోపమా? అది తెలియదు.

వాలంటీర్లకి, వారి సంతానానికి అధిక మొత్తంలో పరిహారం ఇస్తామని సంతకాలు పెట్టించి... ఎవరికీ పబ్లిసిటీ లేకుండా ఏజన్సీ ప్రాంతంలోని మారుమూల ఈ ప్రయోగం మొదలుపెట్టాను.

ఒకటే చేసిన పొరపాటు!

సైంటిఫిక్ కమిటీ, ఎథికల్ కమిటీ (శాస్త్రజ్ఞుల బృందం, వైద్యనీతి నియమావళి పరిరక్షించే కమిటీలు) ఇలాంటి ప్రయోగాలకి త్వరగా ఒప్పుకోవు. అనేక యక్షప్రశ్నలడుగుతాయి. "అనుమతి" ఇవ్వవు. అందుకని ముందు ప్రయోగం, ఆ తర్వాత కమిటీకి చెబుదాం అన్న ఆదుర్దా... ప్రయోగం సక్సెస్ అయితే పర్మిషన్‍లకి ఎంతయినా ఖర్చు పెట్టవచ్చు మరి.

ఎందుకు పని చేయదు? ఆ వైరస్ వాక్సిన్ ఎలకలలో అద్భుతమైన జ్ఞాపకశక్తిని కలగజేసింది. కొంతమంది ఆల్జీమీర్స్ రోగులకి ఇండియాలో ఇచ్చి చూస్తే ఏమీ పెద్ద సైడ్ ఎఫెక్టులు లేవు. కొంచెం జ్ఞాపకశక్తి వృద్ధి అయిందా అనే అనిపించింది.

కాని అవి చాలవు. కనీసం రెండొందల మందికి రెండేళ్ళు ఇచ్చి శాస్త్రోక్తంగా నిరూపించాలి జ్ఞాపకశక్తి పెరిగినట్టు; అది కూడా శాస్త్రీయ గణాంకాల వల్ల నిరూపించాలి. అప్పుడే మందు అమ్మడానికీ, పేషంట్లకి ప్రిస్క్రైబ్ చేయడానికి అనుమతి దొరుకుతుంది. ముందు కొంతమందికి తగ్గినట్లు అవగాహన వస్తే ఆ తర్వాత కమిటీల పర్మిషన్లకి వాళ్ళు అప్లై చేయవచ్చు.

ఇండియాలో ఇలాంటి ప్రయోగాలు కొంచెం తేలిక. ఈ మధ్య కమిటీల అనుమతి తప్పనిసరి అయింది కాని రెండేళ్ళ క్రితం అంత ఇబ్బంది ఉండేది కాదు.

అందుకే ఈ ప్రాజెక్ట్ అనంతగిరిలో ఇండియాలో రెండేళ్ళ క్రితం మొదలుపెట్టాను... కొంచెం రహస్యంగా... అజ్ఞాతంగా.

ఇంతలో ఈ ఎమర్జెన్సీ. అతి వేగంగా న్యూయార్క్ హైదరాబాద్ విమానం ఎక్కి నిజంగానే ఆఘమేఘాల మీద భారతదేశంలో దిగిపోయాను.

న్యూయార్క్ నుంచి హైదరాబాద్ నాన్ స్టాప్. అక్కడ్నించి సాయంత్రం వైజాగ్ విమానం. ఆ రాత్రికే కార్లో ఏజన్సీ ఘాట్ రోడ్ మీదుగా అనంతగిరి లోయలోని జెడ్‌కాన్ కంపెనీ ఆఫీసులోని నా క్వార్టర్స్‌కి ప్రయాణం.

'జెడ్', 'జెడ్', 'జెడ్' అన్ని చోట్లా అక్షరం నా జీవితాన్నీ, కెరీర్‌ని శాసిస్తోంది.

***

మలుపులు తిరిగిన ఘాట్ రోడ్డు లోయలోకి దిగేటప్పుడు ఏదో తెలియని భయం. తిరిగి రాలేని చిక్కుముడిలాంటి అరణ్యంలోకి వెళ్ళిపోతున్నట్టు. వైజాగ్‌కి సాదిక్ వచ్చాడు. పాల్, శేషగిరి అనంతగిరిలోనే ఉన్నారు.

నర్సీపట్నం దాటి ఘాట్ ‌రోడ్డులో కొన్ని కిలోమీటర్ల తర్వాత ఒక పక్కదారిలో లోయలోకి దిగాలి - ఈ ఏజన్సీ గ్రామంలోకి వెళ్ళాలంటే.

ఆ ఊర్లో మా కంపెనీదే పెద్ద భవనం. "జెడ్‌కాన్" కంపెనీ అనే బోర్డు దూరానికి మెరుస్తూ కనిపిస్తోంది ఎర్రటి అక్షరాలలో రాత్రి కూడా. దాని పక్కనే ఉద్యోగస్తుల క్వార్టర్లు. వాటికి కంపెనీకీ మధ్య జెడ్‌కాన్ హాస్పటల్ అనే పేరుతో వున్న మా ప్రయోగశాల!

సాదిక్ గురించి ఏం చెప్పను? ప్రియమిత్రుడు, సహోద్యోగి, సబార్డినేట్‍గా పనిచేస్తుంటే ఎలా ఉంటుంది? నన్నర్థం చేసుకున్నాడనిపిస్తుంది. భర్త మైఖేల్‌తో విడిపోయాక, మరో మగ వ్యక్తిని నమ్మకూడదనిపించింది. కాని సాదిక్ అంకితభావం, అతనికే తెలియని అతని ఆకర్షణ!

"జకియా! పేషంట్లందరూ వింతగా ప్రవర్తిస్తున్నారు. మన వాక్సిన్ మూడో డోస్ తర్వాత రెండు రోజులకి ఈ లక్షణాలు వచ్చాయి. అర్ధరాత్రి లేస్తారు. అడవిలో ఏవో వాసన చూస్తున్నట్లు వెళ్ళిపోతున్నారు. ఆల్జీమీర్స్ వ్యాధి తగ్గడం అటుంచి, ఉన్న జ్ఞాపకశక్తి పూర్తిగా పోయింది! విచక్షణా, తెలివి అనే కార్డినల్ ఫంక్షన్స్ పోయాయి!"

క్వార్టర్స్ చేరాక మాట్లాడుకుంటున్నాం.

పాల్ అన్నాడు: "నా ఉద్దేశం ఆ వాక్సిన్ మెదడులోని కార్టెక్స్‌ని పూర్తిగా డ్యామేజ్ చేసిందేమో."

"ఆటో ఇమ్యూన్రియాక్షన్" (శరీరంలో తన కణాలను తానే విధ్వంసం చేసే వ్యాధి నిరోధక ప్రక్రియ) ఏమో? ఉన్నతమైన ఆలోచనా సరళి నశించి, లింబిక్ సిస్టమ్, థలామస్ దగ్గరి అసంకల్పిత చర్యలు రిఫ్లెక్స్‌లు మిగిలాయి. వాసన చూస్తూ జంతువులు, సరీసృపాల్లా వెళ్ళిపోతున్నారు ఆహారం కోసం వెదికే జంతువుల్లా."

"నాలుగు రోజుల క్రితం హాస్పిటల్ నర్సుపై ఇద్దరు ముసలి రోగులు దాడి చేశారు. ఆమె మెడ కొరికి..." శేషగిరి ముఖంలో భయం రంగులు మారి నల్లటి చీకట్లు కమ్మినట్లు అయింది.

"ఆ దాడికి ఆమె మెడలో జుగులర్ నుంచి రక్తం కారి మరణించింది. వాళ్ళు ఆమెని తినేయడం మొదలుపెట్టారు. భయంకరంగా పళ్ళతో కొరికి. ఏం చేయాలో తెలియక నేను కర్రలతో కొడితే నన్ను ఎటాక్ చేశారు. పరిగెత్తుకొచ్చి హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్‌కి ఫోన్ చేశాను. వాళ్ళ దగ్గర్నించి వైజాగ్ వచ్చి ఆయుధాలు తీసుకోమని ఆర్డర్ వచ్చింది."

సాదిక్ అన్నాడు: "కంపెనీలో పెద్ద అధికారులకి ఏదో తెలుసు. వాళ్ళకి ఏమీ ఆశ్చర్యం కలిగినట్టు అనిపించలేదు. వైజాగ్‌లో ద్వారకా కాలనీలో ఒక రహస్య ఏజంటు దగ్గర ఏకె47 గన్నులు ఆరు, ఐదువందల బుల్లెట్స్ రహస్యంగా డెలివరీ తీసుకోమని ఆర్డర్స్. ఆ తర్వాత ఈమెయిల్‌లో వివరంగా సూచనలు ఇచ్చారు."

"ఇది అత్యంత గోప్యంగా వుంచాలి. వాక్సిన్ రియాక్షన్‌తో AZ రోగులు మానసికంగా మరింత దెబ్బతింటున్నారన్న విషయం బయటకి తెలియకోడదు. కంపెనీ పేరు పోతుంది.

ఆ తర్వాత ఇంకా వివరంగా సూచనలు.

వాళ్ళు కార్టెక్స్ పోయి లింబిక్ సిస్టమ్ మాత్రం పనిచేసే జంతుజాలంలా మారిపోయే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలలో తేలింది. వాళ్ళని చంపాలంటే తలలోనే బ్రెయిన్‌కి గురి చూసి కాల్చాలి. శరీరంలో ఎక్కడ తగిలినా వాళ్ళు చావరు. నడుస్తూనే మీదకి వస్తారు. వస్తూనే ఉంటారు. త్వరలో మేం మీకు ఇంకా సహాయం పంపిస్తాం..."

నేను జకియాని. ఆపరేషన్స్ హెడ్‌ని. అన్ని విషయాలు త్వరగానే అర్థం చేసుకోగలిగాను. ఊరిలోని ఇతర ప్రజలు బయటకి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆర్డర్స్ కంపెనీ నుంచి. ఫోన్‌లో, ఈమెయిల్‌లో అవే ఆర్డర్స్, సూచనలు.

"ఎలా? మనం ఎలా ఆపుతాం?"

"ఆపి తీరాలి. ఇది వైరస్ అంటువ్యాధి. ఈ గ్రామం క్వారన్‌టైన్ చేస్తున్నాం. రెండు వారాలు అంటే పద్నాలుగు రోజులు అందరూ ఊర్లోనే ఉండాలి! ప్రభుత్వానికీ, పోలీసులకీ, వార్తాపత్రికలకీ, టీ.వీ.లకీ తెలియకూడదు."

"ఎలా? ఎలా?"

ఈమెయిల్‍లో వివరంగా సూచనలు.

"వీళ్ళందరూ మ్యూటేట్ అయిన వైరస్ సోకినవాళ్ళు. వాళ్ళకి బ్రెయిన్ నిర్మూలిస్తేనే చావు వస్తుంది. శరీరం ఎన్ని గాయాలైనా మళ్ళీ పని చేస్తూనే ఉంటుంది. వాళ్ళు అందర్నీ కరిచి తినేస్తారు. కరిచినవాళ్ళకి ఆ వ్యాధి వచ్చేస్తుంది. ఎన్‌సెఫలైటిస్ Z 365 వైరస్. అందుకని వ్యాధి సోకిన వాళ్ళని చంపేయండి. చనిపోయిన వాళ్ళని తగలబెట్టేయండి. మన హెలీకాప్టర్‌లు ఏజన్సీ అరణ్యంలో కాపలా కాస్తాయి. ఘాట్ రోడ్‍ దగ్గర సెక్యూరిటీ గార్డులు మిగిలిన పని చూస్తారు. ఎవరినీ బయటకి పోనీయరు. అంతే. పని అయిపోగానే మెసేజ్ ఇవ్వండి. హెలీకాప్టర్‌లో మిమ్మల్ని తీసుకువచ్చేస్తాం. ఓకే? డన్?! ఇది చాలా ముఖ్యమైన, కంపెనీ భవిష్యత్తుని, ప్రతిష్ఠని రక్షించే ప్రక్రియ. జకియా, నీ సహకారం కావాలి!"

"డన్!" అని రిప్లయి ఇచ్చాను. నా కంపెనీ ఎడల భక్తీ, విశ్వాసం ఉన్నాయి ఇంకా.

కాని మనసులో మారుమూల ఏవో అరుపులు, ఆక్రందనలు. మరణించిన వారి ఆత్మఘోషలా... గాలిమోత. నాకు తెలియనిది ఇంకేదో ఉందా?

***

రెండు రోజుల క్రితం మొదలైన ఆ పీడకల నడుస్తూనే ఉంది. మా క్వార్టర్స్‌లో నెల రోజులకు సరిపడే ఆహార పదార్థాలున్నాయి. బియ్యం డబ్బాలు, ఫ్రోజెన్ కూరగాయలు, బిస్కట్లు, ప్రోటీన్లున్నాయి, వాటర్ ట్యాంకులో నీళ్ళు రెండు రోజుల వరకూ ఉన్నాయి.

వచ్చిన రాత్రే నడిచే శవాల దాడి మొదలైంది. ఆ రాత్రి ఏకె47తో ఐదుగురిని చంపగలిగాను. కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ గుంపులుగా వస్తూనే ఉన్నారు.

"సాదిక్! మనం ఇక ఈ ఇంట్లో ఉండలేం. ప్రతీ రెండు గంటలకీ జాంబీలు వస్తున్నారు. లోయదాటి వెళ్ళిపోవాలి" అన్నాను.

రెండు రోజులయింది. ఆహారం ఉన్నా, నీళ్ళు లేవు. ఈమెయిల్ సూచనలు వస్తున్నా హెలీకాప్టర్ల జాడ లేదు.

రెండు వందలమంది రోగులుంటారనుకుంటే నా చేత్తో ఐదుగురు, శేషగిరి, పాల్ తలొక నలుగురిని, సాదిక్ ఐదుగురిని చంపగలిగాం!

అంటే హాస్పిటల్‌లో ఇంకా 176 మంది రోగులుండచ్చు. వాళ్ళు ఊరిలో వారిని కరిచి ఉంటే..... ఇంకా మిగిలిన వ్యాధిగ్రస్తులెంతమందో?

"అర్ధరాత్రి పారిపోవడం ఒక్కటే మార్గం" అన్నాను నేను. "జెడ్‌కాన్ మనల్ని రక్షించదు. ఎందుకంటే ఈ రియాక్షన్, జాంబీల విషయం బయటకి తెలియడం వాళ్ళకి ఇష్టం లేదు" అన్నాను.

"మనం ఎలాగో బయటపడి ఒకసారి హాస్పటల్ చూడాలి. అక్కడ్నించి ఘాట్ రోడ్ చేరుకుంటే ఏవో ఒక లారీనో, బస్సో దొరకకపోదు" అన్నాడు శేషగిరి.

సాదిక్ అన్నాడు: "జకియా! అది అంత తేలిక కాదు. మనం రాత్రి కంటే పగలే బయలుదేరిపోవడం మేలు. రాత్రిళ్ళు ఈ జాంబీలకి మరింత ఆకలి, ఆవేశం పెరిగిపోతాయి. పైగా చీకటి...."

రెండు రాత్రిళ్ళూ మాకు ఊరిలోంచి ఏవో అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. దూరంగా, మనుషులు, స్త్రీల కేకలు. పరిగెత్తుతున్న చప్పుళ్ళు ఒకసారి. ఒక్కోసారి బాధతో అరిచిన మూలుగులు. ఆ తర్వాత నిశ్శబ్దం.

ఆ రోజు ఉదయమే సూర్యకాంతితో పాటు బయటపడ్డాం. రాత్రి చీకట్ల కంటే పగలు తిరగడం మేలని అనుకున్నాం. గన్స్ అందరి చేతుల్లో. బయటకి అడుగుపెట్టిన కాసేపటికే జరిగిన విధ్వంసం అవగతమైంది.

నిశ్శబ్దం. మామూలుగా ఉదయం పనీపాటలకి తిరిగే గ్రామస్థులు, ఊరిజనాలు కనబడడం లేదు.

అక్కడక్కడా పూరి గుడిసెల్లోంచి చిన్నగా మూలుగులు.

"చూద్దామా?" అని పాల్ ఒక ఇంటి తలుపు మెల్లగా తెరిచి తొంగి చూశాడు.

"బాబోయ్! వీళ్ళని పీక్కుని తినేశాయి" అని అరిచాడు.

మరుక్షణం గుడిసెలోంచి చప్పుడయింది.

"ఓ మై గాడ్" అంటూ వెనక్కి వచ్చాడు.

"చచ్చినట్లు పడి ఉన్న శవాలు వేళ్ళు కదిలించాయి. లేస్తున్నాయి. నిలబడుతున్నాయి. తూలుతూ మన వైపే వస్తున్నాయి" అరిచాడు పాల్.

ఇది ఒక భయంకరమైన సత్యం. మరణించాయా లేక వైరస్ సోకి అవి అలా వింతజీవుల్లా పడి ఉన్నాయా నిర్ణయించడం కష్టం.

తలమీద కొప్పులున్న గిరిజన కోయ స్త్రీలు ఇద్దరు, ముసలి కోయ వికృతంగా తలలు పక్కకి పెట్టుకుని పళ్ళికిలించి భయంకరంగా నడుచుకుంటూ మా వైపు వస్తున్నారు.

వాళ్ళకి ఆకలి! ఇన్‍స్టింక్ట్‌గా నడుచుకుంటూ వస్తున్నారు.

ఇది ఎన్‌సెఫలిటిసా? కొత్త వైరసా? మ్యూటేషనా? చచ్చిన మనుషులు ఎలా బ్రతుకుతారు? వీళ్ళు ఒక రకమైన వ్యాధిగ్రస్థులు అంతే.

చూస్తుండగానే పాల్ మీద పడబోతున్న ఆ జాంబీలని గన్‌తో పేల్చాం.

పాల్‌కి తగలకుండా జాంబీల తలలోకి బులెట్ కొట్టాలి.

ఎలా? కష్టం?

అయినా అందరం గురి పెట్టాం.

పాల్ చేతిలోంచి గన్ పడిపోయింది. పెనుగులాడసాగాడు.

షూట్! షూట్! మళ్ళీ జాగ్రత్తగా షూట్ చేశాను! నా వెనుక సాదిక్, శేషగిరి కూడా గన్స్ ఎక్కుపెట్టి కాల్చారు.

రెండు జాంబీలు క్రింద పడ్డాయి. తల చిట్లి బులెట్ పేలి ఎర్రటి మంటలు వచ్చాయి.

కానీ మూడో ముసలి వ్యక్తి పాల్‌ మెడ కొరకసాగాడు.

నా గుండె ఆగినట్లనిపించింది. మై గాడ్! పాల్‌కి వైరస్ సోకిపోతోంది.

"పరిగెత్తండి" అన్నాను నేను.

సాదిక్ అన్నాడు: "జకియా, నేను పాల్‌ని తీసుకువస్తాను!"

శేషగిరీ, నేనూ.. "నో! నో!" అని అరిచాం.

"వద్దు! వద్దు! అతను కూడా ఇప్పుడు జాంబీ అయిపోతాడు. దగ్గరికి వెడితే డేంజర్".

సాదిక్ ఏడుస్తున్నాడు. "నో! నో! కలసి పనిచేశాం. అతన్ని వదలలేను.."

నేను సాదిక్‌ చేతిని బలంగా పట్టుకుని ఈడ్చుకుని పరిగెత్తసాగాను. సాదిక్ రాలేదు. తిరిగి పాల్ వైపు పరిగెత్తాడు.

శేషగిరి అటుఇటూ చూసి ఏం చేయలేక నా వెనుకనే పరిగెత్తుతున్నాడు.

ఇప్పుడు సూర్యకాంతి లోయ అంతా అలముకుంది. తడిగా ఉన్న ఆకుల మీద ముత్యాల్లా నీటి బిందువులు మెరుస్తున్నాయి.

"మనం త్వరగా ఊరి నుంచి బయటపడి హెలీకాప్టర్ల కోసం ఫోన్ చేయాలి" అన్నాను.

పల్లెలో దార్లు అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.

నా మనసులో వేల వేల ఆలోచనలు. భయాలు. ఎదురవుతున్న అనుమానాలు.

ఇది వైరస్ అయితే అది సోకిన వాళ్ళు ఊరిలో వాళ్ళనీ, హాస్పిటల్‍లో పారామెడిక్స్‌నీ తినడం కోసం కరిస్తే వాళ్ళకీ అది సోకి వాళ్ళు మిగిలినవాళ్ళని కరవడం మొదలయితే... ఇది ఒక అంటువ్యాధిలా ఎంతో త్వరగా పెరిగిపోతుంది. అది వైరస్ అయితే, మనిషిని కరిచిన తర్వాత ఇనాక్యులేషన్ పీరియడ్ ఎంత సమయం పడుతుందో!

"అటూ ఇటూ చూసుకుంటూ నడవండి, చెప్పలేం ఏ మూల ఎవరున్నారో?" అన్నాను.

గన్స్‌ని ఎత్తి పట్టుకుని మెల్లగా జాగ్రత్తగా నడుస్తున్నాం. ఇక్కడి నిండి కొండరోడ్డు మీద నాలుగు కిలోమీటర్లు నడిస్తే చింతపల్లి వెళ్ళే మార్గం వస్తుంది. అక్కడ ఏవయినా లారీలు కానీ బస్‌లు కాని ఆపి లిఫ్ట్ అడిగితే నర్సీపట్నం చేరచ్చు.

"హెలీకాప్టర్ కావాలి..." అన్నాడు శేషగిరి.

నా ఫోన్ సిగ్నల్ వస్తోంది, కాని బ్యాటరీ చివరిలో వుంది. పవర్ ప్యాక్‌తో చార్జి చేశాను. హెడ్‌క్వార్టర్స్‌కి రింగ్ చేశాను.

"హలో! హలో! నేను జకియా సిద్ధిఖీ! అనంతగిరి జెడ్‌కాన్ ఆపరేషన్స్"

"జకియా! ఎలా వున్నావు? పాల్, శేషగిరీ, సాదిక్, హాస్పిటల్ ఎపిడమిక్ పరిస్థితి ఎలా వుంది?"

"చాలా ఘోరం. అందరూ ఎన్‌సఫలిటిస్ ఇన్‌ఫెక్ట్ అయి జాంబీలయిపోయారు. వాళ్ళ వ్యాధి వ్యాపిస్తోంది. దె బికేమ్ మానీటర్స్. యు నో! హారిబుల్. ప్లీజ్ సెండ్ హెలీకాప్టర్స్!"

"సారీ జకియా. అందుబాటులో లేవు. కాని చింతపల్లి స్టేషన్‌కి కంపెనీ వ్యాన్ పంపిస్తాం. అక్కడిదాక క్వారన్‌టైన్ ఉంది. మీరు ఎలాగొలా వచ్చేస్తే అక్కడి నుంచి తీసుకుపోగలం!"

"మై గాడ్! పది కిలోమీటర్లు. అసాధ్యం. క్విక్. హైర్ ఎ ఛాపర్. ఆర్ వియ్ ఆర్ డెడ్! మేం ప్రాణాపాయంలో ఉన్నాం."

"న్యూయార్క్ నుంచి ఆర్డర్స్! స్ట్రిక్ట్‌గా క్వారన్‌టైన్. హెలీకాప్టర్ దొరకడం లేదు. ప్లీజ్ జకియా! మీరు చింతపల్లి దాక పగలే వచ్చేయండి! కారు ఏదయినా ఉంటే ఎక్కి వచ్చేయండి" ఫోన్ డిస్‌కనెక్ట్ అయ్యింది.

"హాస్పిటల్ కార్లు, అంబులెన్స్‌లు రెండున్నాయి. అక్కడికి పదండి" అన్నాను.

దూరాన జెడ్‌కాన్ హాస్పిటల్ కనిపిస్తోంది.

"అదిగో సఫారీ. పరిగెత్తి ఎక్కుదాం" అన్నాడు శేషగిరి.

పరిగెత్తాం.

"ఆగు" అన్నాను.

ఎస్. యు. వి సఫారీ, ఆ పక్కన రెండు అంబులెన్స్‌లు, వెనుక పక్కన గుట్టలుగా మనుషుల శరీరాలు. డ్రైవర్లు ఇద్దరు ముగ్గురు, తెల్ల యూనిఫారాలలో నర్సులు. అందరూ శవాలే.

హాస్పిటల్ లోంచి పొగ వస్తోంది.

మెల్లగా అన్నాను: "అవి నిద్రలేచే ముందే సఫారీ స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి".

దగ్గరకి! ఇంకా దగ్గరకి! ఎండుటాకుల మీద మా బూట్ల చప్పుడు మాకే వెయ్యి ఏనుగుల శబ్దంలా వినిపిస్తోంది.

దగ్గరగా వెళ్ళి కారు ఫ్రంట్ డోర్ లాగాడు శేషగిరి. తెరుచుకోలేదు. లాక్ అయివుంది. డ్రైవర్ సీటులో విగతజీవిలా వికృతంగా పడి ఉన్నాడు.

హఠాత్తుగా అంబులెన్సుల చుట్టూ ఉన్న శవాలు కదలసాగాయి. అవి పడుతూ లేస్తూ శేషగిరిని చుట్టుముట్టాయి.

"గిరీ! పరిగెత్తు. వచ్చేయ్! అవి నిన్ను కరిస్తే, నీ పని ఫినిష్" అరిచాను.

కాని అతను తప్పించుకోలేదు. నడిచే శవాలు అతన్ని చుట్టుముట్టి మీద పడిపోయాయి. కొరుకుతున్నాయి.

ఒకే ఒక కెవ్వు కేక!

ఒకసారి ఏదో పార్టీలో బయోవెపన్స్ (జీవ రసాయనిక ఆయుధాలు) గురించి చర్చ జరగడం విన్నాను. 'మ్యూటేటెడ్ వైరస్‌లని ఇచ్చిన జాంబీలని యుద్ధానికి వాడితే?' అని ఒక సైంటిస్ట్ అంటున్నాడు మా మేనేజింగ్ డైరక్టర్‌తో. నన్ను చూడగానే వాళ్ళు పకపకా నవ్వి మాట మార్చేసారు. "జకియా! యూ ఆర్ టూ బ్యూటిఫుల్ ఫర్ ఎ సైంటిస్ట్! బట్ యూ ఆర్ ఎ జీనియస్!"

నడుస్తున్నాను వేగంగా. రోజూ చేసే ట్రెడ్ మిల్, జాగింగ్ ఇప్పుడు పనికొచ్చింది.

కాని జీవితంలో భయంకరమైన షాక్! ఆ రోజు మైఖేల్ నన్ను విడిచి విడాకులు ఇచ్చినప్పుడు; మళ్ళీ ఇప్పుడు! మైఖేల్ జొరాస్టర్ 'Z' తో!

ప్రేమ అబద్ధమని తెలిసినప్పుడు ఒకసారి; పరిశోధన వెనుక దుర్మార్గం ఉందని తెలిసినప్పుడు ఇప్పుడు మరొకసారి.

అందరినీ కడిగేయాలి! ఈ విషయం బోర్డ్ మీటింగ్‌లో చర్చకి పెట్టి బాధ్యుల్ని డిస్మిస్ చేసేవరకూ వదలకూడదు.

ఏదో పట్టుదల నన్ను నడిపించింది. ఎందుకో ఒక్క కారూ, లారీ, బస్ కనబడదు.

అర్ధరాత్రి దాటిన అరగంటకి దూరాన దీపాలు కొండమీద కనిపిస్తున్నాయి.

చింతపల్లి! ఎట్‌ లాస్ట్. బస్ స్టాండ్ ఊరి చివరన ఉంది. ఏదో బస్ కానీ, మా కంపెనీ వ్యాన్ కానీ దొరకచ్చు. బహుశా ఇక్కడ దాకా క్వారన్‌టైన్ చేసి ఉండచ్చు. ఎవరో ఇది ప్రభుత్వం దాకా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకనే ఇక్కడ వాహనాల జాడా, సంచారం లేదు!

ఊరి బయట మెలికలు తిరిగిన దారికి అటూ ఇటూ నిశ్చలంగా నీడల్లాంటి దట్టమైన చెట్లు.

ఆ నీడల్లోంచి హఠాత్తుగా ఒక గుంపు తూలుకుంటూ నడుస్తూ వస్తోంది.

నాకెదురుగా... అదే నడక. వంకర టింకరగా తల ఆడిస్తూ చేతులు మెకానికల్‌గా కదులుతూ. కళ్ళు జంతువుల కళ్ళలా మెరుస్తున్నాయి.

మై గాడ్! గన్ తీసి గుంపు కేసి ఎక్కుపెట్టాను.

"ధన్ ధన్ ధన్!" కాల్చసాగాను. వాళ్ళకి తగలలేదు. నడుస్తూ వస్తూనే ఉన్నాయి.

మళ్ళీ కాల్పులు.

ఈసారి రెండు తలలు పేలాయి. మిగిలిన ఆకారాలు నడుస్తూ వస్తూనే ఉన్నాయి.

చాలా ఉన్నాయి. కనీసం ఇరవై మంది గుంపు.

భయంతో వెనక్కి తిరిగాను.

షాక్‌తో కొయ్యబారిపోయాను. ఇటు మరొక గుంపు. నలుగురున్నారు. వాళ్ళు పడుతూ లేస్తూ నన్ను వెంబడిస్తున్నారు చీకట్లలో.

గన్ ఎక్కుపెట్టాను. చేయి వణికింది. భయంతో కాదు, నీరసం వల్ల.

బుల్లెట్ తగల్లేదు.

వాళ్ళు మరింత దగ్గరగా. ఇప్పుడు గుర్తు పట్టాను. సాదిక్.

సాదిక్! ముఖం అంతా వికృతంగా గాయాలు, జీవం లేని కళ్ళు! జాఫర్ సాదిక్! జాఫర్ విత్ జెడ్!

పాల్, శేషగిరి... మరో ఇద్దరు! అందరూ జాంబీలయిపోయారు.

సాదిక్ కండలు తిరిగి గిరిజాల జుట్టుతో ఉండే ఆజానుబాహుడు. తెలివితేటలతో, చిరునవ్వుతో. కొన్ని రోజుల తర్వాత నేను ప్రొపోజ్ చేసి నా జీవితంలోకి ఆహ్వానిద్దామనుకున్న సాదిక్! ఇతను కూడా జెడ్!

చేతిలోని గన్ కింద పడిపోయింది. భయంతో నా ఒళ్ళు కొయ్యబారిపోయింది.

లాభం లేదు! వాళ్ళని చంపాలి. మిత్రులు అని చూడకూడదు. సహ ఉద్యోగులు కాదు. నడిచే శవాలు వాళ్ళు.

వణుకుతో ఏకె47 గన్ తీసి ఎక్కుపెట్టసాగాను.

"ఢాం! ఢాం! బులెట్లు ఆకాశంలోకి వెళ్ళాయి గానీ తగలలేదు. అప్పటికే ఆలస్యం అయిపోయింది.

విగత జీవులు. నడిచే శవాలు. అన్నీ నా చుట్టూ మూగాయి.

మరో నిమిషంలో నా మెడలోకి పదునైన పళ్ళు గుచ్చుకున్నాయి.

కింద వెల్లకిలా పడిపోయాను. మరో అరగంటలో నేనూ వారిలాగానే అయిపోతాను. నాకు వ్యాధి సోకింది. ఐయామ్ ఇన్‌ఫెక్టెడ్.

ఆకాశంలో ఎర్రని లైట్లతో రెండు హెలీకాప్టర్లు. భీకరమైన దాడి చేస్తూ ఎక్కడి నుంచో ప్రత్యక్షమయ్యాయి.

వాటి నుంచి మెరిసే మంటల ముద్దలలాగా బాంబులు క్రింద పడసాగాయి.

అర్థం అయింది. కంపెనీ ఎవరినీ బ్రతకనీయదు. "జెడ్‌కాన్" ఆ ప్రాంతాన్నంతటినీ... మండించి మాడ్చి నిర్మూలించి వెళ్ళిపోతుంది. వాళ్ళు చేసిన పనికి ఏ ఆధారం ఉండకూడదు. ఎవరినీ రక్షించదు.

చూస్తుండగానే మంటలు వ్యాపించసాగాయి. అవే మంటలు దూరాన అనంతగిరి లోయలో కూడా ఎర్రని వెలుగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

జాంబీల గుంపు భయంతో ఒక్కసారి నన్ను వదిలి వెనక్కి... వెనక్కి పారిపోసాగాయి.

అప్పుడే నాకు స్పృహ తప్పింది. ఆ ఆఖరి చేతనలో నా మనోనేత్రం ముందు అదే అక్షరం తిరుగుతోంది.

జెడ్ జెడ్ జెడ్.

*****

Bio
Comments

మధు చిత్తర్వు

విద్యార్థి దశ నుంచి కధలు నవలలు రాస్తున్నాను.ఐ సి సి యు ,బై బై పొలోనియా  ఎపిడెమిక్ ,కుజుడి కోసం నీలిఆకుపచ్చ్చ లాంటి నవలలు మొత్తం 13, ఒక కధా సంకలనం ,డయాబిటీస్   మీద ఒక  పుస్తకం,మళ్ళీ  ఈమధ్య  షుమారు ముప్ఫయ్ కథలు రాసాను.వైద్య నేపధ్యం లోని థ్రిల్లర్లు, సైన్స్ ఫిక్షన్, అంతరిక్ష సాహిత్యం రాయడం ఇష్టం ,ఈ కధ అలాంటిదే.ఇంగ్లీష్ లో వార్ ఫార్ మార్స్  అనే ట్రయాలజీ రాసి ప్రచురించాను.హైదరాబాద్ లో కార్డియాలజిస్ట్ అండ్ డయాబిటాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను.

Mani vadlamani
bottom of page