

నేను హై స్కూలులో చదువుకునే రోజుల్లో, శరత్ నవలలు, టాగూరు కథలు, నాటికలూ, బెంగాలీ నుంచి తెలుగులోకి దిగుమతి కాకపోయుంటే, నా తెలుగు కాల్పనిక సాహిత్యాధ్యయనం ఏమై వుండేదో ఇప్పుడు చెప్పడం కష్టం! అంతేకాదు. ప్రేమ్‌చంద్ హిందీనుంచి తెలుగులోకి దిగుమతి కాకపోయుంటే హిందీలో కథలు, నవలలూ కూడా ఉంటాయా అని అనుమానంవచ్చి వుండేది. ఎన్నో అపరాథపరిశోధక కథలు, చవకబారు (# Sexton Blake#) సెక్స్‌టన్ బ్లేక్ లాంటి అనామక రచయితని కాపీకొట్టి మనకు దిగుమతి చేయబడ్డ అనువాదాలు -- అన్నీఇంగ్లీషునుంచి తెలుగులోకి తర్జుమా అయి మా రోజుల్లో విచ్చలవిడిగా వేడివేడి పకోడీల్లా గ్రంథాలయాల్లో దొరికేవి. ఆ రోజుల్లో అవన్నీ చదివేసే వాళ్ళం! ( అవికాకుండా, హిందీలోను, హిందీ నుంచి అనువదించబడిన బూతు పుస్తకాలు సరేసరి!)
అందాకా ఎందుకు? ఏవిషయానికి ఆవిషయం నిస్సంకోచంగా చెప్పుకోవాలి. తెలుగులో కి వచ్చిన “సాహిత్యం”, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యం అంతా సంస్కృతం నుంచి దిగుమతి అయ్యిందే కదా! ఆమాటకొస్తే భారతం, రామాయణం, భాగవతం, అన్ని భారతీయభాషల్లోకీ సంస్కృతం నుంచి అనువదించబడినవేకదా! దానికి నేను కాదు – ఎవరూ తప్పుపట్టలేరు. ఎటొచ్చీ, ఆ పురాణాలు, ఇప్పటి జనాభాకి కాస్తో కూస్తో అర్థమయ్యే సరళ గ్రాంథికభాషలోకి తిరగ రాసిన వాళ్ళని, వేళాకోళం చెయ్యటంతో సరిపోయిందే కాని, ఎలియట్ ఆంగ్లభాషకి చేసిన మహోపకారమే వాళ్ళు తెలుగు భాషకి చేస్తున్నారన్న మన వాళ్ళకి ఇంతవరకూ తట్టలేదు. కాలానుగుణ్యంగా, పురాణాలు తిరిగి రాయవలసిన అవసరం ఉన్నదని (#From time to time, epics are to be retold#) టి. యస్. ఎలియట్ చెప్పిన మాటలు, మనకి – అంటే ఈ కాలపు నవ్యసాహితీవేత్తలకీ, తెలుగు మేథావులకీ, ఎర్ర చొక్కా తొడుక్కున్న విమర్శకాగ్రేసరులకీ గిట్టలేదు.
ఇకపోతే, తెలుగులో మొట్టమొదటి --“నవల”-- దక్షిణ ఆసియాలోకే మొట్టమొదటి నవల కళాపూర్ణోదయం. పదహారవశతాబ్దం మధ్యభాగంలో, పింగళి సూరన్న రాసాడంటే, “హా” అని ముక్కుమీదవేలు వేసుకునే తెలుగు సాహితీవేత్తలని నేను ఎరుగుదును . అయితే, వీళ్ళే, (#Cervantes#) సెర్వాంటెస్ రాసిన (#Don Quixote#) డాన్ కిహోటే సుమారు అదే శతాబ్దంలో వచ్చిన మొట్టమొదటి పాశ్చాత్య నవల అంటే, కిమ్మనకుండా ఒప్పుకుంటారు. వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్ కలిసి , (# The Sound of the Kiss#) అనేపేరుతో పింగళి సూరన్న గారి కళాపూర్ణోదయాన్ని అనువదించి, ఈ రెంటికీ ఉన్న నవలా లక్షణాలు, #thematic commonalities# ఒక చక్కని వెనుకమాటలో పొందుపరిచారు. అనువాదం చదివే ఓపిక లేకపోయినా, మన సాహితీవేత్తలు ఆ వెనుకమాట చదివితే చాలు, సూరన్న గారు రాసింది నవలేనని ఒప్పుకోక తప్పదు. విజయనగరసామ్రాజ్యం పతనం - ఆంగ్లేయ పాలన హుటాహుటీగా రాగానే, తెలుగు వారి (# creativity#) సృజనాత్మకత దెబ్బతిని వెనకపడింది. బహుశా మాయమయ్యింది.
ఆ తరువాత మనకి కోకొల్లలుగా ఇంగ్లీసు లోకి దిగుమతైన రష్యను సాహిత్యం అనువాదాలు వచ్చాయి. అదేమిటో, ఇంగ్లీషునుంచి వచ్చిన అనువాద సాహిత్యం మీద మనకి ఇప్పటికీ ఎనలేని మోజు. ఎక్కడో విన్నాను, ఈ మధ్యనే! మళ్లీ ముప్ఫైవ సారో నలభైవ సారో (#Tolstoy’s War and Peace#) యుద్ధము-శాంతీ అనువదించటానికి పూనుకున్నారట! వాళ్ళ డబ్బులు -- వాళ్ళు ఏ విధంగా ఖర్చుపెట్టుకుంటే మనం ఎవరం? అభ్యంతరం చెప్పటానికి? అల్లాగే, టాగూరు గారి గీతాంజలి ఎన్నోసారి తెలుగులోకి వచ్చిందో లెక్క తెలియదు. ఇవాళ్టికి కూడా చెకోవ్ మయకోవిస్కీమనల్ని వదల్లేదు. వాళ్ళకి తోడుగా, ఫైజ్, రూమీ, గాలిబ్ లు మళ్ళీ ఎన్నోసారో, తెలుగు లోకి దిగుమతి అవుతున్నారు. అందుకూ నాకేమీ బాధలేదు.
అయితే, నన్ను ఒక్క ప్రశ్న చాలాకాలం నుంచీ బాధిస్తూన్నది. అది “అటు” వేపు చదువరులకి (అంటే తెలుగేతరచదువరులకి) మన సాహిత్యం, నవీన సాహిత్యం ఎంతవరకూ పోయింది?
ముందుగా తెలుగు నుంచి ఇతర భారతీయభాషల్లోకి వెళ్ళిన తెలుగు సాహిత్యం ఎంత? సాహిత్య ఎకాడమీ వారు బహుమతి ఇచ్చిన పుస్తకాలు ఇతర భాషల్లోకి చాలా మెల్లిగా –( #worse than a dead snail pace#)- ‘చచ్చిన నత్తకన్నా మెల్లిగా కదులుతూ’ పోతున్నాయని నాతో ఒక ప్రసిద్ధ ఒడియా కవి, సౌభాగ్య కుమార్ మిశ్ర అన్నాడు. 1986 లో అతనికి కేంద్ర సాహిత్య ఎకాడమీ పురస్కారం తెచ్చిపెట్టిన కవితా సంకలనం – ద్వా సుపర్ణా - ఇప్పటివరకూ ఇతర భారతీయభాషల్లోకి అనువదించబడలేదట!( ఆ పుస్తకన్ని నేను, వెనిగళ్ళ బాలకృష్ణ రావు తెలుగులోకి 2019 లో అనువదించి ప్రచురించాం. అవ్యయ, ద్వాసుపర్ణా సంకలనాలని నేను ఇంగ్లీషులోకి అనువదించాను. ప్రస్తుతం ప్రచురణకి సిద్ధంగా ఉన్నాయి.)
ఒకప్పటి డబ్బింగు సినిమాల్లాగానే, తమిళ సాహిత్యం తెలుగులోకి బాగానే దిగుమతి అవుతూ వున్నది. పోతే, ఒకటో రెండో తెలుగు నవలలు – కాసిన్ని కథలూ – ‘ఏదో కళ్ళనీళ్ళు తుడిచినట్టుగా’ తమిళం లోకి ఈ మధ్య కాలంలో అనువదించబడ్డాయి. శుభం భూయత్. అటునుంచి ఇటు, ముమ్మరంగా తెలుగులోకి వచ్చిన, వస్తున్న, రాబోయే, అనువాదాల సంఖ్య పై నాకు కొంచెం కోపం, కించిత్ అసూయ కూడానూ!
నేను రెండు ప్రణాళికలు ముచ్చటించదలచుకున్నాను:
మొదటి ప్రణాళిక: మనం, కూడగట్టుకొని, తెలుగు నుంచి ఇతర భారతీయ భాషల్లోకి, ముఖ్యంగా హిందీ, బెంగాలీ, అరవం లోకి అనువాదాలు తీసుకొని రావటానికి ప్రయత్నించగలమా? చెయ్యగలం, చెయ్యాలీ, అని యువ రక్తం పెల్లుబుకుతున్నసాహితీ పిపాసకులంతా ఒక చిన్న బృందంగా కలిసి, అందుకు కావలసిన ప్రాతిపదిక తయారు చెయ్యటానికి సుముఖులేనా? ఆలోచించండి.
రెండవ ప్రణాళిక: ఇదికొంచెం కష్టంతో కూడుకొన్నది. అయినా ఐదు ఖండాల సాహితీవేత్తలు, సాహితీప్రేమికులూ కలుసుకున్న సమయంలో, ఇది ప్రస్తావించక తప్పదు. ఇంతకన్నా మంచితరుణం ఎప్పుడొస్తుంది?
తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదాలు తప్పక చెయ్యవలసిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను.
తెలుగు మా మాతృభాషగా చెప్పుకునే మనమందరం, ప్రతిఏటానో, రెండేళ్ళకోసారో కలుసుకొని, “మనభాష చాలా గొప్పది, మనభాష ఎంతోతీయనిది, మనసాహిత్యం ఎవరి సాహిత్యానికీ తీసిపోదు,” అని మైకుల్లో ఊదరకొట్టుకుంటూ, మనని మనం పొగుడుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటే, బయటి ప్రపంచానికి మనసాహిత్యం గురించి తెలుస్తుందనుకోను. వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు అనే వారితో నాకు పేచీలేదు. అయితే, ఈ పని మనం -- ప్రవాసంలో ఉన్న తెలుగు వాళ్ళం -- గత 40 సంవత్సరాలుగా ఏదో పేరుమీద చేసుకుంటూనే వున్నాం. అదే ధోరణి; అవే ఊకదంపుడు ఉపన్యాసాలు, అవే సినిమా సాహిత్యకళాకారులు, సాహిత్యరాజకీయనాయకులూ, రొద పెడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడు చెవిటి వాడిగా పుట్టి వుంటే బాగుండేదేమో, అని నాకు అనిపిస్తుంది.
దేశవ్యాప్తంగా అమెరికాలో వెలిసిన పెద్ద సంస్థలు, తెలుగునుంచి తెలుగేతరభాషల్లోకి మనసాహిత్యాన్ని తర్జుమా చేయించగల స్తోమతు, ఆర్థిక సంపదా ఉన్నప్పటికీ, ఏవీ తమంతతాముగా ముందుకొచ్చి ఈ పనికి పూనుకోవు. అందుకనే మనలో కొద్దిమంది ఒక చిన్న బృందంగా కలిసి, ఈ పనిచెయ్యటానికి ముందుకొస్తే, బహుశా, ఈ సంస్థల్లో కొన్నయినా, తమ బయస్కోపు బడ్జెట్ లో కొద్దిభాగం ఈ పనికి కేటాయిస్తాయని ఆశ! సరదాకొద్దీ కావచ్చు; తెలుగు సాహిత్యంపై మమకారం కావచ్చు; కొద్దిమంది అనువాదాలు చేసుకుంటూనే వున్నారు. అయితే, వారిప్రచురణలు, పదిమందికీ తెలియటల్లేదు. అందుబాటులోకి రావటల్లేదు. కారణం? పేరున్న ప్రచురణసంస్థలు ప్రచురించకపోవటం మొదటి కారణం. రెండవకారణం: వాటికి తగిన ఆదరణ, ప్రోత్సాహం, పత్రికలలో సమీక్షలూ రాకపోవటం.
అయితే, ఇంత సొదచెప్పావ్, వెంకటేశ్వర్రావూ? ఈ విషయం గురించి నువ్వేమిటి చేస్తావు, అని నిలదీసి అడిగితే నేను ఒక్కడినీ ఏం చెయ్యగలను? శ్రీశ్రీ ఎప్పుడో అన్నాడు: “దారులమధ్య రాటబల్ల మీఊరు ఎటుందో చెపుతుందే కాని, అదే ఆవూరు వెళ్ళదు,” అని. మీలోకొంతమందికన్నా నేను చెప్పింది ఆమోదకరం అయితే, వారితో నాకున్న ఇతర ఆలోచనలు, అభిప్రాయాయాలూ, లాజిస్టిక్స్ వగైరా వివరంగా మాట్లాడుతాను. ఇందులో నా స్వలాభం ఏమీ లేదు. ఇంకో రెండు రోజుల్లో నేనూ 83 వ పడిలో పడబోతున్నాను. ఇంకా నాకు స్వలాభమేమిటి?
వెల్చేరు నారాయణరావు, గత 40 ఏళ్ళుగా దగ్గిర దగిర 20 పైచిలుకు తెలుగు పుస్తకాలు, -- ప్రాచీన సాహిత్యంనుండి, నవ్య సాహిత్యం వరకూ -- అనువదించి ప్రఖ్యాత పాశ్చాత్య ప్రచురణకర్తలను ఒప్పించి ప్రచురించాడు. ఆ పని తెలుగు సాహిత్యసముద్రంలో ఒక తియ్యని వానబొట్టు మాత్రమే! ఇంకా ఎంతో మిగిలి ఉన్నదని మీకు తెలుసు. ఆ పని, ఆగిపోకండా, అవిచ్ఛిన్నంగా ముందుకు సాగిపోయేట్టు చెయ్యడం సాధ్యం అని అనుకుంటున్నాను. అయితే, ఇందుకు ఎందరి సహకారమో కావాలి. ఐదు ఖండాలవారు కలిస్తే ఏదీ అసాధ్యం కాదు. నా ప్రణాళికలతో ఏకీభవించేవారితో వేరుగా సంప్రదించడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమేనా?
***