top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

7th telugu sahiti sadassu -2020 .JPG

కాలతీతం, సార్వజనీనం శ్రీ తెన్నేటి సూరి రచనలు

tenneti.PNG

డా. తెన్నేటి శ్యామకృష్ణ

1940ల నాటి సంగతి, మన తెలుగు ప్రాంతాలు మద్రాస్ ఉమ్మడి ప్రావిన్స్‌లో భాగంగా చలామణి అవుతున్న రోజులు. మన తెలుగు వారి దిన పత్రిక ఆంధ్ర పత్రిక ఒక దివిటీలా ఉజ్జ్వలంగా వెలుగుతూ తెలుగు వార్తలను అందించడం మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికి ఒక ఆలంబనగా  నిలిచిన రోజులు. నిత్యం ఉదయంపూట మద్రాసు హైకోర్ట్ ముందు లాన్స్‌లో కూర్చుని లాయర్లంతా ఆ దినం ఆంధ్ర పత్రిక వెలువడగానే అదొక అలవాటుగా సంపాదకీయం చదివేసినాక తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి ఉద్యుక్తులయ్యే రోజులవి ... ఆంధ్ర పత్రికను నడిపించిన సారధి శివలెంక శంభు ప్రసాద్ గారైతే, దాని సహాయ సంపాదకునిగా, సాహిత్య విభాగ సారధిగా, ఆయనకు కుడి భుజంగా నిలిచినవారు శ్రీ తెన్నేటి సూరి.      

 

శ్రీ తెన్నేటి సూరి పేరు చెప్పగానే మనకి మొట్టమొదట స్ఫురించేది ఆయన చారిత్రక నవల--ఛంఘిజ్‌ఖాన్. ఆంధ్ర పత్రికలో ఆయన వ్రాసిన చంఘిజ్‌ఖాన్ ధారావాహిక ప్రచురణ ఆరంభమై త్వరలోనే ప్రజాదరణ పొందింది. తరవాత అదే ధారావాహికను నవలా రూపంలో విశాలాంధ్ర వారు ప్రచురించినఫ్ఫుడు అది ఆయనకి శాశ్వతమైన పేరును సంపాదించి పెట్టింది. 1956 లో ప్రచురించబడిన ఒక నవల నేటివరకు ఎనిమిది పునర్ముద్రణలు నోచుకోవడం అరుదైన విషయం! ఐతే, శ్రీ సూరి తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అవగతమవాలంటే ఆయన రచనలను, దాని వెనకనున్న ఆయన వ్యక్తి త్వాన్ని సాకల్యంగా పరిశీలించవలసిన అవసరం ఉంది.  

 

సాహిత్యం పట్ల, రచయితల పట్ల తన అభిప్రాయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు తన నవల ఛంఘిజ్‌ఖాన్ ముందుమాటలో, "ఒక దేశపు అభ్యున్నతికిగాని, దాని వినాశనానికిగాని ఆ దేశపు రచయితలు కారణమనే విషయం -కొన్ని మొండిరకాల రాజకీయవాదులు అంగీకరించకపోయినా — పరమ సత్యం ..."

 

కత్తికంటే కలం పదునైనదంటారందుకే! తన భావజాలాన్ని ఆవిష్కరించడానికి ఆయన వినియోగించని సాహిత్య ప్రక్రియ లేదు-- కధ, వ్యాసం, కవిత, గేయం, నాటకం, నవల, అన్నింటినీ ప్రజల గుండె తలుపులను తట్టే సాధనంగా వాడుకున్నాడాయన. అలనాటి మేటి పత్రికలు భారతి, ఆంధ్ర పత్రికల సహాయ సంపాదకునిగా బాధ్యతలు నిర్వహిస్తూనే తన సాహితీ యజ్ఙం సాగించారు. 1940 లలో తెలుగు సాహిత్యం మీద తనదైన ముద్ర వేశారు తెన్నేటి సూరి. శ్రీ సూరి రచనా కాలాన్ని, ఆయన రచనలపై  అది ప్రతిఫలించిన తీరును పరిశీలించవలసి వున్నది. 

 

కృష్ణా జిల్లాలోని ఒక పల్లెటూరు తెన్నేరు. అక్కడ 1911 లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు సూరి-- సూర్యప్రకాశరావు. తన పైచదువు నిమిత్తం బందరు  వెళ్ళడం, తరవాత ఒక ప్రింటింగ్ ప్రెస్సులోఉద్యోగిగా తన సాహిత్య ప్రస్థానం ప్రారంభించడం జరిగింది.   చారిత్రకంగా 1940  దశకం మనదేశంలో, ప్రత్యేకించి మన తెలుగునాట ఒక సంధి యుగమని చెప్పాలి. ఒక పక్క స్వాంతంత్ర ఉద్యమమం వువ్వెత్తున ఎగసిపడుతున్న సమయం. మరొక పక్క తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనలో, భుస్వామ్య వ్యవస్థలో, అణచివేతల నేపథ్యంలో చెలరేగిన రైతాంగ పోరాటం. కాంగ్రెస్ నాయకులతో, కమ్యూనిస్టు మేధావులతో ఏర్పడ్డ పరిచయాలు మనస్సును మధించాయి. తానెవరి పక్షమో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంట్లో అందరూ కాంగ్రెస్‌వాదులు. నిరంకుశత్వం ఎక్కడ ఉన్నా దానికి వ్యతిరేకంగా తన కలాన్ని ఝళిపించడం తక్షణ కర్తవ్యమని భావించారయన. తాను పనిచేసే ప్రెస్సే ఒక సాహిత్య వేదిక అయింది, ఒక చర్చా వేదిక అయింది. కార్మిక, కర్షక లోకం కోసం, మహిళా లోకాన్ని చైతన్యపరుస్తూ ఆయన వ్రాసిన పాటలు, కవితలు ఎన్నెన్నో! అలా ఆయన మొదటి తరం అభ్యుదయ రచయితలలో ఒకడుగా తన బాణీని వినిపించాడు. అరుణ రేఖలు కవితా సంకలనంలో ఇలాంటి కవితలు కొన్ని చూడవచ్చు.

 

తరవాతి కాలంలో ఆయన ఆంధ్ర పత్రిక కొలువులో చేరారు. అప్పటికి ఆంధ్ర పత్రికకు తెలంగాణలో పంపిణీ లేదు. మరి తన వాణిని అక్కడి వ్యధితుల దరికి చేర్చడం ఎలా? మరోపక్క వారి గోడును తన ప్రాంతం వారికి విడమరచాలి. ప్రజానాట్య మండలి ఆయన పాటలను, గేయాలను అందిపుచ్చుకుని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళింది. నోటీ ద్వారా వ్యాపించే పాటకు సరిహద్దులేమి అడ్డం!? అలా కాలక్రమాన కవి పేరు మరుగునపడిపోయినా తెలంగాణా ప్రజల నోట ఆ పాటలు పలికినై, గుండెల్లో మోగినయి. అదేగా ఆయనకు కావలసింది కూడా!

 

"సవాలన్న నైజాముకు జవాబెవ్వరు?", అనీ,

"బాల చంద్రుడెవ్వరు" అనీ

ఆనాడు పౌరుషాగ్ని రగిల్చిన పాటలు కాలాతీతంగా నేటికీ మన మనసులలో నిలిచిపోతాయి.   

ఆరోజుల్లోనే 'గొడ్లకాడ' అనే నాటకాన్ని వ్రాసి ప్రదర్శించడం జరిగింది. 

 

ఇక్కడ ఆయన చారిత్రక నవల 'చంఘిజ్‌ఖాన్' గురించి కొంత ప్రస్తావించాలి. 12, 13 శతాబ్దాలలో మంగోల్‌లో జన్మించి, గోబీ ఎడారిలో ఒక మహా సామ్రాజ్యాన్నే నిర్మించిన విజేత చంఘిజ్‌ఖాన్. ఆయన చరిత్రను నవలీకరించడమంటే అది కత్తి మీద సాములాంటిది. ఎందుకంటే, రచయిత చరిత్రలో జరిగిన సంఘటనలను వక్రీకరించడంగాని, మార్చడంగాని సబబు అనిపించుకోదు. కానీ తెన్నేటి సూరి హెన్రీ హౌవర్త్ దంపతులు రచించిన మంగోల్ చరిత్రను ఆధారంగా చేసుకొని దానిని తనదైన శైలిలో రచించారు. ఆవిధంగా చారిత్రక నవలకు ఒక కొత్త అర్థం చెప్పారు. చంఘిజ్‌ఖాన్‌నిలోని క్రౌర్యాన్ని తట్టిలేపిన ఆనాటి కుళ్ళు రాజకీయాలను విశ్లేషిస్తూ నవల సాగుతుంది. ఈ ధారావాహిక ఆంధ్ర పత్రికలో వెలువడుతున్న సమయంలో ఆయన మిత్రుడొకరు ఇలా వ్యాఖ్యానించారట,

 

"నువ్వు వ్రాస్తున్నది చంఘిజ్‌ఖాన్ జీవితమా లేక వారం వారం వెలువడుతున్న వర్తమాన రాజకీయ వార్తల సమీక్షా?" అని.

ఈ రోజు తిరిగి ఆ నవలను చదివితే మనకు తోచేది అదే మాట: బలవంతుడు బలహీనుణ్ణి పడగొట్టాలని చూడటమనేది, జరిగిన, జరుగుతున్న చరిత్రే అని! దాశరథిగారి మాటల్లో చెప్పాలంటే,

"మనిషి మనిషిగ బ్రతుకుటెంత దుర్లభమ్ము!"

-- అందుకే అది నాటికీ, నేటికీ తెలుగువారి ప్రజాదరణను నోచుకున్న నవల అయింది.

 

ఇంకా ఆయన గ్రంధ సమీక్షలు చేశారు. విషయం ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఆయనకు అలవాటు. అయితే ఆయనలో ఒక హాస్యశీలి, వ్యంగ్య రచయిత దాగివున్నాడని చాలా మందికి తెలియదనిపిస్తుంది. ఉదాహరణకు, సంగీత రీతులను ఒక ఉపన్యాసకుడు వర్ణించడం కడుపుబ్బ నవ్విస్తుంది (శరభాచార్యులవారి సంగీతోపన్యాసం). రుంజ సంగీతం (వాయిద్యాల ఘోషలో గాయకుడి పాట ముణిగిపోయి వినిపించకపోడం), అలాగే, సాహిత్య ఖూనీ సంగీతం (పదాలను ఎక్కడికక్కడ విరిచి అర్థంకాకుండా పాడటం) ఈనాటి సినీ సంగీతానికి కూడా వర్తించడం విశేషం. సినీమాలు మంచి చైతన్య సాధనాలుగా ఆనాడే గుర్తించి 'టాకీ టెక్నిక్' అనే గ్రంధాన్ని వ్రాశాడు. ఆయన తన కాలాన్ని మించి ముందు చూపుతో ఆలోచించాడనడానికి ఇంతకన్న నిదర్శనం అవసరం లేదు.  

 

ఇక సూరి గారు తెలుగులోకి అనువదించిన చార్ల్‌స్ డికెన్స్ ఆంగ్ల నవల 'టేల్ అఫ్ టూ సిటీస్' 'రెండు మహానగరాలు' గా తెలుగు పాఠకలోకం మన్ననలను అందుకున్నది. సూరి గారు ఎంత కవితాత్మకంగా అనువదించారో చూడాలంటే మొదటి పంక్తి చదివితే చాలు, అర్థమైపోతుంది. ఫ్రెంచ్ విప్లవకాల పరిస్థితులను అభివర్ణిస్తూ  మూలంలోచెప్పిన మాటలు- 'ఇట్ వజ్ ద బెస్ట్ అఫ్ టైంస్, ఇట్ వజ్ ద వరస్ట్ అఫ్ టైంస్.'  దానికి ఆయన తెనిగింపు:

"అది ఒక వైభవోజ్వల మహాయుగం-- వల్లకాటి అధ్వాన్న శకం ..." తెలుగు అనువాదకులకు ఈ రచన మార్గదర్శనం చేస్తుందంటే అతిశయోక్తి కాదు! స్వేఛ్చానువాదానికి ప్రతీక ఈ నవలానువాదం!

 

తన చివరి రోజులలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే, తుదివరకు తన రచనల్ని కొనసాగించాడాయన. ఆయన సంపూర్ణ సాహిత్యాన్ని ఆయన శతజయంతి సందర్భంగా మూడు సంపుటాలుగా ముద్రించి అందించిన నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారిని తెలుగు వారంతా అభినందించాలి.

***

bottom of page