top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

మధురవాణి ప్రత్యేకం

తప్పొప్పుల తక్కెడ – 4

సౌష్టవం లేని వాక్యం వృధా!

elanaga.jpg

ఎలనాగ

ఉపోద్ఘాతం:

ఈ "తప్పొప్పుల తక్కెడ" శీర్షికకై ఎలనాగ గారు ప్రతీ సంచికలో ఒక చిన్న పేరాని అందిస్తారు. పాఠకులు/ భాషాభిమానులు అందులో తప్పులేవో కనిపెట్టగలిగితే కింద కామెంట్లలో చెప్పవచ్చు. లేదా sahityam@madhuravani.com కి  డిసెంబర్  15 లోగా పంపవచ్చు. గడువు తేదీ లోపల వచ్చిన జవాబులను పరిశీలించి, వచ్చే సంచికలో పాఠకులకు ఒక్కో పదం గురించిన తప్పొప్పుల వివరణ ఇస్తారు. ఔత్సాహికులైన సాహిత్యాభిమానులు మెండుగా ఉన్న మన పత్రిక లో మొదలవుతున్న ఈ వినూత్న ఈ శీర్షిక, పాఠకులకి ఆసక్తికరంగా మరియు ఉపయుక్తంగా ఉండబోతుందని సంతోషంగా ప్రకటిస్తున్నాము. 

మరి మీరు తప్పొప్పుల తూకానికి సిద్ధమేనా? తప్పులు కనిపెట్టిన వెంటనే చెప్పేయండి. 

 

గత సంచిక తప్పొప్పుల తక్కెడ – 3   లో తప్పులు గుర్తించినవారిలో అత్యధికంగా తప్పులని గుర్తించిన సాహితీ మిత్రులు పద్మశ్రీ చెన్నోజ్వల గారికి అభినందనలు.           

 

సాహితీ బంధువులిక మీ భాషాజ్ఞానాన్ని ఉపయోగించి, ఈ పారాగ్రాఫ్ లోని తప్పొప్పులను సూచించండి.                 

      

~~~~~~

                                 తప్పొప్పుల తక్కెడ – 4    :  సౌష్టవం లేని వాక్యం వృధా.

     సౌష్టవం లేని వాక్యం వృధా. వాక్యనిర్మాణంలో నిర్ధిష్టత లేకపోతే ఆ రచనలో సౌష్టవం కొఱవడొచ్చు. రచన బాగున్నదనే ప్రశంసే రచయితకు చేకూరే లబ్ది. అది దొరకనప్పుడు రచయిత మనసులో ఒక రకమైన శూన్యత చోటు చేసుకోవచ్చు. కాబట్టి, మనం రాసిన ప్రతి రచనను మరల మరల పరీక్షించుకొని, దోషాలను సరిదిద్దుకోవాలి. వీథిలోనికి పోయినప్పుడు మంచి రచయితగా మన్ననలు పొందడం మన థ్యేయం కావాలి. ఆ మన్ననలు మన మనోవీధిలో మనోహరమైన గ్నాపకాలను నెలకొల్పుతుంది. వాక్యం కుదురుగా, శ్రేష్టంగా, విశిష్ఠంగా వుండేలా రాయగలిగే నైపుణ్యతను సంపాదించితే, వచనరచన చాలా వరకు సులభం అవుతుంది. వర్థమాన రచయితలందరూ ఈ విషయాన్ని అనవతరం మనసులో పెట్టుకోవాలి.       

~~~~~~

ఇక గత జులై సంచికలోని "తప్పొప్పుల తక్కెడ – 3 : పౌరవిధిని పాటించాలి" లోని తప్పుప్పుల వివరణ పరిశీలిద్దాం.

 

రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు విసుగు చెంద దల్చుకోకూడదనుకుంటే కధల పుస్తకం చదవాలి. ఆ మాటకొస్తే మనకు నచ్చుతుందనిపించే ఏ గ్రంధాన్నైనా చదవవచ్చు. మనసు చికాకుగా ఉన్నప్పుడు అది కొంత ఉపషమనాన్ని కలిగించే అవకాశముంది. కళల పట్ల ఆసక్తి లేనివారు తమకు ఇష్టమైన పనులతో కాలక్షేపం చేస్తారు. ఉదాహరణకు కొందరు కార్డ్ గేమ్ ఆడుతారు. కొందరేమో లోకాబిరామాయణం మొదలు పెడతారు. సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం వినేవాళ్లు కూడా కొందరుంటారు. మధ్యపానం చేసేవాళ్లు కూడా అఱుదుగా దర్శనమిస్తారు. కొందరు వేరు శనక్కాయలు, అరటి పళ్లు మొదలైనవాటిని తిని, వాటి పొట్టులను, తొక్కలను తాము కూర్చున్న దగ్గరే కింద పడేస్తారు. అయితే వీళ్లందరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అదేమిటంటే, పక్కవారికి ఇబ్బందిని కలిగించక పోవడం. కార్డ్ గేమ్ ఆడుతూ పెద్ద పెద్ద శబ్ధాలతో నవ్వడం, అటూయిటూ విపరీతంగా కదులుతూ పక్కవారిని డీకొనడం... ఇది మంచి పని కాదు. పాటలు సంగీతం వినేవాళ్లు రేడియో, లేదా స్మార్ట్ ఫోన్ లోంచి సాధ్యమైనంత తక్కువ శబ్దం వచ్చేలా జాగ్రత్త పడాలి. రైలులో మందు తాగడం చాలా గర్హనీయం. పొట్టులను, తొక్కలను రైలుపెట్టె లోని చెత్తడబ్బాలోనే వేయాలి. ఈ జాగ్రత్తలన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తే, దేశపౌరులుగా బాధ్యతను నిర్వహించినవాళ్లమౌతాము.

                                           

జవాబులు (తప్పొప్పులు):

  తప్పు                                                   -               ఒప్పు

1. విసుగుచెందదల్చుకోకూడదనుకుంటే    –           విసుగుచెందవద్దనుకుంటే

2. కధల పుస్తకం                                                –           కథల పుస్తకం

3. గ్రంధాన్నైనా                                                 –           గ్రంథాన్నైనా

4. ఉపషమనాన్ని                                             –           ఉపశమనాన్ని

5. కార్డ్ గేమ్                                                         –          పేకాట, చీట్లాట

6. లోకాబిరామాయణం                                     –           లోకాభిరామాయణం

7. మధ్యపానం                                                   –            మద్యపానం

8. అఱుదుగా                                                      –           అరుదుగా

9. పొట్టులను                                                      –           పొట్టును

10. శబ్ధాలతో                                                        –           శబ్దాలతో

11. డీకొనడం                                                       –            ఢీకొనడం

12. పాటలు సంగీతం                                         –            పాటలు, సంగీతం

13. గర్హనీయం                                                      –            గర్హణీయం

14. తూచా                                                             –            తు. చ.

15. నిర్వహించినవాళ్లమౌతాము                        –            నిర్వర్తించినవాళ్లమౌతాము

 

వివరణలు:

1. రాయదల్చుకోలేదు, చదవదల్చుకోలేదు మొదలైన ప్రయోగాలు వ్యవహారంలో ఉన్నమాట నిజమే. అయినా ఇక్కడ రాయ, చదవకు బదులు విసుగు చెంద ఉండటం వల్ల పదబంధం (phrase) చాలా పెద్దదైపోయి అసహజంగా, అసౌకర్యంగా తయారైంది. కాబట్టి విసుగు చెందవద్దనుకుంటే అని రాస్తే ఆ ఎబ్బెట్టుతనం తొలగిపోతుంది. ఇక్కడ భాషాదోషం కంటె ఎక్కువగా అసమంజసత్వం ఉంది. ఆధునిక వచనరచనలో ఇటువంటి అసమంజసత్వాన్ని మానుకోవడం అవసరమే.

 

 2. కథకు బదులు కధ అని రాయడం, పలకడం చాలా మందే చేస్తుంటారు.  ఇంకా కత అని రాస్తే అది నయం. ఎందుకంటే, కథకు వికృతి కత. కానీ కధ అనే పదం లేదు.

 

3. గ్రంథంకు బదులు గ్రంధం అని రాసేవాళ్లు తక్కువగా ఏం ఉండరు. కానీ గ్రంధం తప్పు. అదేవిధంగా గ్రంధాలయం కూడా తప్పే. గ్రంథాలయం సరైన మాట.

 

4. నికషం, కల్మషం, పరుషం మొదలైనవి ఉన్నాయి గానీ, ఉపషమనం లేదు. ఉపశమనం సరైన మాట. ఉపశమనం అంటే ఊఱట. కానీ ఱ మాయమై చాలా కాలమే అయింది! ఆధునిక వ్యవహారంలో ‘ఊరట’ విస్తృతంగా వ్యవహారంలో ఉంది.

 

5. కార్డ్ గేమ్ సరైన ఆంగ్లపదమే. అది వాడుకలో ఉంది కూడా. కానీ అందరూ ఉపయోగించే పేకాట, చీట్లాట అన్న పదాలు ఉన్నప్పుడు అనవసరంగా ఆంగ్లపదాన్ని వాడటమెందుకు? బస్సు, రైలు, కారు, టీచర్ మొదలైన పదాలు ప్రజల నాలుకల మీద విరివిగా నాట్యం చేస్తున్నాయి కనుక, వాటి విషయం వేరు. కార్డ్ గేమ్ సాధారణ ప్రజలందరూ వాడే పదం కాదు. చాలా వరకు విద్యాధికులు మాత్రమే వాడుతారు దాన్ని. కాబట్టి పేకాట, చీట్లాట అని రాయడంలోనే ఔచిత్యముంది.

 

6. లోకాభిరామాయణం సరైన పదం. లోకాబిరామాయణం తప్పు.

 

7. మధ్యపానం అంటే మధ్య మధ్య సేవించే పానీయమా?! మద్యము అంటే సారాయి మొదలైన మత్తుపదార్థాలు. కనుక, మద్యపానం సరైన మాట.

 

8. కాలక్రమంలో ఱ, ఋ అక్షరాలు ర, రు గా మారడం ఉంది కానీ, దీనికి వ్యతిరేకమైన పద్ధతి లేదు. అఱుదు ‘అరుదు’గా రూపాంతరం చెందలేదు. కాబట్టి అరుదు అనే రాయాలి.

 

9. ఆంగ్లంలో collective nouns అని ఉన్నాయి. ఉదాహరణకు fruit, fish, hair. ప్రత్యేక సందర్భాలలో తప్ప వాటి చివర s రాదు. ఒకే రకానికి చెందిన పండ్లు ఒకే సమూహంగా ఉన్నా వాటిని fruit అంటాం. అదేవిధంగా ఒకే వ్యక్తికి చెందిన వెంట్రుకలను hair  అంటాం. కాని, వేరువేరు రకాల పండ్లను fruits అనీ,  రకరకాల చేపలు ఒకే చోట ఉంటే వాటిని fishes అనీ అంటాం. పలు రకాలకు లేదా వ్యక్తులకు చెందిన వెంట్రుకలు ఒకేచోట ఉంటే వాటిని hairs అనాలి. తెలుగులో సమూహం, గుంపు మొదలైనవి సాముదాయక నామవాచకాలు. పొట్టును అలానే పరిగణించాల్సి ఉంటుంది కనుక, ఇక్కడ పొట్టులను అని కాకుండా పొట్టును అని రాస్తేనే సవ్యంగా ఉంటుంది. ఇక్కడ వేరు శనక్కాయల పొట్టు మాత్రమే సూచించబడింది కనుక, పొట్టులను అనకూడదు, రాయకూడదు.

 

    12. ఇక్కడ పాటలు సంగీతం వేరు వేరు అంశాలు కాబట్టి, వాటిమధ్య అల్పవిరామచిహ్నం (comma) ను పెట్టాల్సి ఉంటుంది.

 

    13. గర్హణము అంటే నింద. కాబట్టి, నిందించతగినదాన్ని గర్హణీయము అని రాయడమే సబబు. గర్హనీయం తప్పు.

 

    14. సంస్కృతంలో తు.చ. అనే అక్షరాలు తెలుగులోని కాని, కాబట్టి, అందుకోసం వంటి conjunctions లాంటి పదాలు. వీటిని వైకల్పికావ్యయములు అని పేర్కొన్నారు ఒక నిఘంటువులో. అనుసంధాన అవ్యయములు అని కూడా అనవచ్చుననుకుంటాను. ఛందస్సులో గణాలను సరిపెట్టడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అంటే ఖాళీలను పూరించడానికి పనికొస్తాయన్న మాట. దేన్నైనా ఉన్నదున్నట్టుగా (ఒక్క అక్షరాన్ని కూడా విడవకుండా) రాయాలని/చెప్పాలని అనదల్చుకున్నప్పుడు తు. చ. తప్పకుండా అని చెప్పాలి. కాబట్టి, తూచా తప్పు. పైగా తూచా అంటే తూచాను అనే అర్థం రావడం లేదా?!

 

    15. నిర్వహించడమంటే manage చేయడం, లేదా conduct చేయడం. కానీ బాధ్యతలను మనం manage/conduct  చేయం. వాటిని తీరుస్తాం, లేదా నెరవేరుస్తాం, లేదా నిర్వర్తిస్తాం. కాబట్టి ఇక్కడ నిర్వహించినవాళ్లమౌతాముకు బదులు నిర్వర్తించినవాళ్లమౌతాము అని రాయాలి.

                                       

    ***    

    

bottom of page