top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

మధురవాణి ప్రత్యేకం

సాహితీ సౌరభాలు

మొల్ల రామాయణం - 2

ప్రసాద్ తుర్లపాటి 

 “ తేనె సోక నోరు తియ్యన యగురీతి తోడ నర్థమెల్ల “ తోచేట్టు తేట తెలుగు మాటలతో తీయనైన రామాయణం రచించి తెలుగు వారికి కానుకగా అందచేసిన ప్రముఖ కవయిత్రి ఆతుకూరి మొల్ల.   మొల్ల రామాయణం లోని వివిధ కాండలలో మొల్ల రచించిన ఉదాహరణ పద్యాలను, సాహితీ సౌరభాలను ఈ సంచికలో వివరిస్తాను.

కందువ మాటలు, సామెతలు మరియు చతురోక్తులతో తెలుగు పద్యాలకు సొబగులు అద్ది, అందముగా పద్యరచన చేసిన కవయిత్రి మొల్ల. ఆ కవితలే తెలుగుకు పొందై, వీనులకు విందై తెలుగు పాఠకులను అలరిస్తాయని మొల్ల ఉద్దేశ్యము.

అవతారికలో మొల్ల చేసిన సరస్వతి స్తుతి ని చూద్దాము -    

మేలిమి మంచు కొండ నుపమింపఁగఁజాలిన యంచ నెక్కి, వా
హ్యాళి నటించి వచ్చు చతురాస్యు నెదుర్కొని నవ్వు దేరగా
వాలిక సోగ కన్నుల నివాళి యొనర్చి, ముదంబు గూర్చు వి
ద్యాలయ, వాణి శబ్దముల నర్థములన్‌ సతతంబు మాకిడున్‌

మంచుకొండ  వలె తెల్లగా ఉన్న హంసమీద బ్రహ్మ విహరించి వచ్చాడు. ఎదురు వెళ్ళిన సరస్వతి దేవి ప్రేమతో ఎదురు వెళ్ళింది. ఆ సరస్వతి దేవి చిరునవ్వు ఆమె సోగ కన్నులలో ప్రతిఫలించి నివాళి అయినది. అప్పుడు విరించి ఎంతో సంతసమందినాడు. అటువంటి సరస్వతి మా కోరికలు తీర్చుగాక అని స్తుతించినది.

రామాయణం బాలకాండలో మొల్ల ఎక్కువగా వర్ణించినది – అయోధ్య పుర వర్ణన, సీత కళ్యాణ ఘట్టం, పరశురామ గర్వభంగఘట్టం తదితర అంశాలన్నీ ఒకటి, రెండు పద్యాలలో చెప్పటం జరిగింది. 

అయోధ్య పుర వర్ణన –

సరయూనదీతీర సతత సన్మంగళ-ప్రాభవోన్నత మహా వైభవమ్ము,
కనక గోపుర హర్మ్య ఘన కవాటోజ్జ్వల-త్ప్రాకార గోపుర శ్రీకరమ్ము,
గజ వాజి రథ భట గణికాతపత్ర చా-మర కేతు తోరణ మండితమ్ము,
ధరణీ వధూటికాభరణ విభ్రమ రేఖ-దరిసించు మాణిక్య దర్పణమ్ము,

భానుకుల దీప రాజన్య పట్టభద్ర-భాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము ,

నాఁగ నుతి కెక్కు మహిమ సనారతమ్ము-ధర్మ నిలయమ్ము, మహి నయోధ్యాపురమ్ము

 

సరయు నదీ తీరంలో ఉన్న ఆ సాకేత పురి శోభను ఎంతో అందంగా, వివరించినది మొల్ల రామాయణం లోనే.

 

మొల్ల కవితా మాధుర్యానికి, పదసౌందర్యానికి మచ్చు తునక బాలకాండలోని ఈ పద్యం. ఈ పద్యం లో అయోధ్య పురములో యున్న రాజుల వర్ణన చేసింది మొల్ల.   

 

రాజులు కాంతియందు, రతి రాజులు రూపమునందు, వాహినీ

రాజులు దానమందు, మృగ రాజులు విక్రమ కేళియందు, గో

రాజులు భోగమందు, దిన రాజులు సంతత తేజమందు, రా

రాజులు మానమందు, నగరమ్మున రాజ కుమారు లందఱున్‌

 

ఈ పద్యం లో  మొల్ల అయోధ్య లోని వివిధ రాజకుమారుల గుణగణాలను ఆయా గుణాలతో ప్రసిద్ధులైనవారితో పోల్చి వర్ణించింది.  ఆ నగరంలోని రాజకుమారులందరూ కాంతిలో చంద్రుని వంటివారు. రూపంలో మన్మథుని వంటివారు. దానగుణంలో సముద్రుని వంటివారు,  పరాక్రమంలో సింహం వంటివారు. వైభోగంలో వృషభాల వంటివారు, నిరంతర తేజంలో సూర్యుని వంటివారు మరియు  అభిమానంలో సుయోధనుడంతటివారు.  ఈ పద్యంలో  ‘రాజు’ శబ్దం పదే పదే  ప్రయోగింపబడటం వలన వీనులకు విందై తోస్తున్నది.

ఇక సీత స్వయంవర ఘట్టం ఎంతో ఆహ్లాదంగా సాగింది మొల్ల రచనలో.  “ నీ
శంకరు చాప మెక్కిడిన సత్త్వ ఘనుం డగువాని కిత్తునీ పంకజనేత్ర సీత, నరపాలకులార! “ . అన్నాడు జనక మహారాజు.

 

ఎప్పుడైతే విశ్వామిత్రుడు రామచంద్రుని వైపు శివధనుర్భంగమును గావింపమని ఆజ్ఞ ఇస్తూ రాముని వంక చూశాడో అప్పుడు లక్ష్మణుని చేత ఈ విధముగా పలికించింది మొల్ల.  ఈ శైలి మొల్ల ప్రతిభకు గీటురాయి.

కదలకుమీ ధరాతలమ, కాశ్యపిఁ బట్టు, ఫణీంద్ర భూ విషా
స్పదులను బట్టు, కూర్మమా రసాతల భోగి ఢులీ కులీశులన్‌
వదలక పట్టు, ఘృష్టి ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్‌
బొదువుచుఁ బట్టుఁడీ కరులు, భూవరుఁ డీశుని చాప మెక్కిడున్‌.

 

లక్ష్మణుడు ఈ విధముగా అంటున్నాడు – “ ఓ భూదేవి ! నువ్వు కదలబోకు, ఓ ఆదిశేషుడా ! నీవీ భూదేవిని గట్టిగా పట్టుకో ! ఓ కూర్మమా, భూమిని ఆదిశేషుని కదలకుండా ధరించు, ఓ వరాహమా, భూదేవిని, ఆదిశేషువుని, కూర్మాన్నీ, వరాహాన్ని గట్టిగా పొదివి పట్టుకోండి ! రామచంద్రుడు పరమేశ్వరుని చాపం ఎక్కుపెట్టబోతున్నాడు”.

ఉర్వీ నందనకై రా
మోర్వీపతి యెత్తు నిప్పు డుగ్రుని చాపం
బుర్విం బట్టుఁడు దిగ్దం
త్యుర్వీధర కిటి ఫణీంద్రు లూఁతఁగఁ గడిమిన్‌.  

సీతా రాముల కళ్యాణం – కడు రమణీయం, తెలుగు వారి వివాహ మధుర దృశ్యాలను గుర్తుకు వచ్చు విధంగా వర్ణించింది మొల్ల.

ఇక అయోధ్య కాండలో ప్రసిద్ధ మైన పద్యం – గుహుని చతుర భక్తి వివరణ. గుహుడి ఘట్టాన్ని రెండు పద్యాలలో సరిపెట్టినా , తన దైన  పద్య శైలిలో, కల్పన చమత్కృతి రచించిన ఈ పద్యం తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ది పొందినది.

సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యే

ర్పడ నొక కాంత యయ్యె నఁట, పన్నుగ నీతని పాద రేణు వి

య్యెడ వడి నోడసోఁక నిది యేమగునో" యని సంశయాత్ముఁడై

కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయమ్ము పెంపునన్‌

 

గుహుడు రామభక్తుడు. రాముని బాల్య లీలలన్నీ విని యున్నాడు. ఆ రాముని చూడటానికై ఎదురు చూస్తున్న వాడు. ఇక రాముని తన ఓడలో గంగా నదిని దాటించాలి. ఇక ఆ రామచంద్రుడు తన ఓడను తాకితే ఏమవుతోందో ! ఇంతకు పూర్వము రాయి నాతి గా మారినదని వినియున్నాడు. అందుకు ఆ రామచంద్రుని పాదపద్మలను కడిగిన తరువాత మాత్రమే తన ఓడను ఎక్కనిచ్చాడట. ఎంతటి మధుర భక్తి ! చతురత తో కూడిన భక్తి.  వాల్మీకి రామాయణం లో లేని ఈ కల్పనను ఆధ్యాత్మ రామాయణం నుంచి స్వీకరించి ఈ మధురమైన పద్యం లో మనకనదించింది మొల్ల.

ఇక అరణ్య కాండ లో శబరి యొక్క మధుర భక్తిని వర్ణించినది.

 

మొల్ల వర్ణించిన శబరి –

“ముక్తి వధూ విలాస కబరి శబరి “ .

చని చని, యెదుటను రాముఁడు
గనుఁగొనియె మహీజనోగ్ర కలుషాద్రి మహా
శని రూపం బనఁ దగు, నా
ఘన ముక్తి వధూ విలాస కబరిన్‌, శబరిన్‌

లోకంలోని జనుల పాపాలు అనే కొండలకు పిడుగు వంటిదట శబరి ! ముక్తి కాంత యొక్క సవిలాసమైన కేశపాసమట శబరి ! అద్భుతమైన భావన !!

ఇక అరణ్య కాండ లో మరియొక అద్భుతమైన పద్యం – సీతమ్మ వారి లోకోత్తర సౌందర్య వర్ణన.

షట్పదంబుల పైకి సంపెంగ పువ్వుల,-జలజాతముల పైకిఁ జందమామఁ,
గిసలయంబుల పైకి వెసఁ గలకంఠముల్‌,-సింధురమ్ములపైకి సింహములను,
దొండపండుల పైకి దొడ్డ రాచిలకల,-నలరుఁ దూఁడుల పైకి హంసవితతిఁ,
బండు వెన్నెల నిగ్గు పైకిఁ జకోరముల్‌,-పవనంబు మీఁదికి బాపఱేని,

మరుఁడు వైరంబు చేసిన మాడ్కి, నలక-నాసికా కరానన చరణ స్వనములు

వర పయోధర మధ్యోష్ఠ వచన బాహు-గమన హాసాక్షు లూర్పారు రమణి కమరె

    

క్రమాలంకారం లో రచించబడిన అందమయిన పద్యమిది.

పరస్పర శతృత్వం కలిగిన ఉపమానాలతో ఉపమేయ వస్తువుల్లోని సౌందర్యాతిశయాన్ని ధ్వనింప చేసింది మొల్ల.

 సీతమ్మ  వారి – ముంగురులు తుమ్మెదల్లా వుంటే, ముక్కు సంపెంగ పువ్వుల వుంది. తుమ్మెదలు సంపెంగ పువ్వుల మీద వాలవు (పరస్పర వైరం).  చేతులు పద్మాల వలే ఉంటే, ముఖం చందమామలా వుంది.  చంద్రోదయం అయ్యేసరికి పద్మాలు ముకుళించుకొని పోతాయి. (కనుక వైరం).  పాదాలు చిగురుటాకులు, అమ్మ వారి కంఠధ్వని కోకిలను స్పురింపచేస్తున్నది. (కోకిల చిగురుటాకులను తింటుంది – వైరం ).  గజకుంభాల వంటి ఆమె పయోధరాలు సింధూరాలు. నడుము సింహము నడుము. (గజ – సింహాలకు వైరం). పెదవి దొండపండులా ఉంటుంది. మాటలు చిలుక పలుకులు. చిలకలు దొండపండులను తింటాయి (వైరం). బాహువులు తామర తూడులులాగా ఉంటాయి. నడక హంస గమనం. హంసలు తామర తూడులను తింటాయి (వైరం).  సీతమ్మ వారి నవ్వు పండు వెన్నెల లాగా వుంటుంది. చూపులు చకోరాల్లా ఉంటాయి. చకోరాలు వెన్నెలను తాగుతూ ఉంటాయట (వైరం), ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలు పవనం. నుగారు (పాపరేడు) కృష్ణ సర్పం లా వున్నది (సర్పం వాయు భక్షణం చేస్తుంది – వైరం). ఈ పరస్పర వైరం కలవాటిని మరుడు ఒకటిపై నొకటిని ఉసిగొలుపుతున్నాడా అని అనిపిస్తున్నదట !!

ఈ విధముగా కడు సమర్ధతతో గడుసుగా వ్యంగ్యం చేసింది. ఈ విధముగా పైకి చెప్పకుండా సీత ముంగురులతో తుమ్మెదలకు, నాసికతో సంపెంగకు, కరములతో పద్మాలకు, వదనంతో చంద్రునికి, చరణాలతో చివురుటాకులకూ, కంఠంతో కోకిలకు, నడకలతో ఏనుగులకు, నడుముతో సింహానికి, పెదవితో దొండపండుకు, పలుకులతో చిలుకలకు, కన్నులతో చకోరాలకు,  ఉచ్చ్వాస నిశ్వాసాల తో  పవనానికి, నూగరుతో సర్పాలకు కల పోలికను వర్ణించింది. 

ఇక సుందరకాండ –

 సుందరే సుందరో రామ:

సుందరే సుందరీ కథ:

సుందరే సుందరీ సీత

సుందరే సుందరం వనం

సుందరే సుందరం కావ్యం

సుందరే సుందరం కపి:

సుందరే సుందరం మంత్రం

సుందరే కిం న సుందరం?

 

సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథ ను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ.  సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ.  ఏ విధముగా చూసిన సుందర కాండ సుందరమే.

అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు. కాని సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించక పోయినా, నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది. అందుకే మొల్ల రామాయణం లో కూడా సుందర కాండ 249 పద్య గద్యాలతో అన్నీ కాండల కంటే ఎక్కువ విస్తారంగా రచించబడినది. ఈ సుందర కాండలో హనుమ చేసిన రామలక్షణుల వర్ణన అత్యద్భుతం.

నీలమేఘ చ్ఛాయఁ బోలు దేహమువాఁడు-ధవళాబ్జ పత్ర నేత్రములవాఁడు
కంబు సన్నిభమైన కంఠంబు గలఁవాడు-చక్కని పీన వక్షంబువాఁడు
తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాఁడు-ఘనమైన దుందుభి స్వనమువాఁడు
పద్మ రేఖలు గల్గు పద యుగంబులవాఁడు-బాగైన యట్టి గుల్ఫములవాఁడు

 కపట మెఱుఁగని సత్య వాక్యములవాఁడు-రమణి! రాముండు శుభ లక్షణములవాఁడు

ఇన్నిగుణముల రూపింప నెసఁగువాఁడు-వరుస సౌమిత్రి బంగారు వన్నె వాఁడు

 

హనుమ చేసిన రామలక్షణుల వర్ణనలో రామలక్ష్మణుల రూపు రేఖలు, గుణగణాలు ఒక్కటే, కాని లక్ష్మణుని మేని ఛాయ బంగారు వర్ణం.

ఇంకా హనుమ సీతమ్మ తో ఇలా అంటున్నాడు –

ఉన్నాఁడు లెస్స రాఘవుఁ,

డున్నాఁ డిదె కపులఁ గూడి, యురు గతి రానై

యున్నాఁడు, నిన్నుఁ గొని పో

నున్నాఁ, డిది నిజము నమ్ము ముర్వీ తనయా

 

సీతమ్మలో ఉన్న ఆందోళనను పోగొట్టటానికి ‘ఉన్నాడు లెస్స “ అని క్రియ వాచకం తో ప్రారంభించి   ఎంతో ఔచిత్యాన్ని ప్రదర్శించింది.  ఈ విధముగానే శ్రీ రామచంద్రునితో –

కంటిన్‌ జానకిఁ, బూర్ణ చంద్ర వదనన్‌, గల్యాణి నా లంకలోఁ,

గంటిన్‌ మీ పదపంకజాతము మదిన్‌ గౌతూహలం బొప్పఁగాఁ,

గంటిన్‌ మీ కరుణావలోకనము విఖ్యాతంబుగాఁ, గీర్తులం

గంటిన్‌ మా కపివీర బృందములలో గాంభీర్య వారాన్నిధీ

 

శ్రీరాముని లో  ఉన్న ఆందోళనను పోగొట్టటానికి ‘ కంటిన్‌ జానకిఁ...“ అని క్రియ వాచకం తో ప్రారంభించి   ఎంతో ఔచిత్యాన్ని ప్రదర్శించింది.  మొల్ల సంభాషణా శైలికి ఈ రెండు పద్యములు చక్కని ఉదాహరణలు.

మొల్ల కేవలం వాల్మీకి రామాయణాన్ని మాత్రమే కాక ఆధ్యాత్మ రామాయణం, భాస్కర రామాయణాలను అనుసరించి మనోహరమైన కల్పనలు చేసింది. తెలుగు వారికి అందిన అమూల్యమయిన కానుక ‘ మొల్ల రామాయణం’.

ఈ రామచరిత మెప్పుడు

వారక విన్నట్టివారు వ్రాసినవారున్‌

గోరి పఠించినవారును

శ్రీరాముని కరుణ మేలు సెందుదు రెలమిన్‌

 

అంటూ తన రామాయణానికి  ఫలస్తుతి గావించింది మొల్ల.

 

“ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు జంగమార్చన వినోద

సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి

తనయ మొల్ల నామధేయ విరచితంబైన

శ్రీ రామాయణ మహా కావ్యంబు.. "  

 

అంటూ మల్లె వలే సుగంధ భరితంగా రామాయణాన్ని మనకనదించిన మహా కవయిత్రి మొల్ల.


Feedback
editor@madhuravani.com
 
©  2022 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా editor@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed
 &  Maintained
 by
Srinivas Pendyala

bottom of page