top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
adhyatmika.jpg
pustaka-parichayaalu.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
alanati.jpg
paatasanchikalu.jpg

సంపుటి 7  సంచిక  4

అక్టోబరు-డిసెంబరు 2022 సంచిక

maagurinchi.jpg
rachanalu.jpg

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

 పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

twintowers.jpg
ravi.jpg
ennelamma.jpg

ట్విన్ టవర్స్: 

 

చెరుకూరి రమాదేవి గారు రాసిన నవల.  ట్విన్ టవర్స్ అనంగానే మనకు జ్ఞాపకానికి వచ్చేది వరల్డ్ ట్రేడ్ సెంటర్, సెప్టెంబరు 11, 2001 (9/11) లో జరిగిన అంతవరకు కనీ వినీ ఎరగని ఘాతుకమైన టెర్రరిస్టు చర్యల వల్ల కుప్ప  కూలిపోయిన రెండు టవర్లు, సుమారు మూడువేల మంది చనిపోయిన క్షణాలు మన మనసుల్ని కదిలించి వేస్తాయి.  అట్లాంటి సంఘటన ఈ నవలకు ఆయువు పట్టు.

 

రమాదేవి గారు అమెరికా వాస్తవ్యులు.  చాలా మంది పాఠకులకు ఆమె రాసిన ఎన్నోకథలు, మరియు  వ్యాసాలతో పరిచయం ఉంది. ఆవిడ రాసిన ‘గేయ రామాయణం’ వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించారు.  అంచేతే ఆవిడకు పెద్దగా ఉపోద్ఘాతం అక్కరలేదు.   పై చెప్పిన దుర్ఘటన జరిగిన సమయంలో ఆవిడ ఆక్కడే ఉండడం, చాలా మందికి లాగే ఆవిడ అల్లోచనల్లో చెరగని ముద్ర వెయ్యడం ఆశ్చర్యపోనక్కరలేదు.  ఆ దుర్ఘటన నేపధ్యంలో రాసిన ఈ నవలలో కూడా రెండు శక్తిమంతమయిన పాత్రలు, కళ్యాణి, రఘురాం, నవలకు మూలస్తంభాలు.  అయితే నవల చివరంటా నిలిచినా ఇద్దరూ ట్విన్ టవర్స్ లా కూలిపోలేదు.  వేగంగా వస్తున్న విమానాలలాంటి కష్టాలు రాకపోలేదు.  ఇద్దరిలో, అతి ధైర్యంతో ఎదుర్కున్న ధీమంతురాలు కళ్యాణి.  వృత్తి పరంగా ఎంతో ఎత్తుకెడిగినా వ్యక్తిగతంగా కష్టాలను ధైర్యంగా ఎదుర్కోలేకపోయిన మేధ రఘురాంది.

 

పద్దెనిమిదేళ్ళకే కళ్యాణికి అమెరికా వెళ్ళబోయే రఘురాంతో అర్జెంటుగా, పెళ్ళిచూపులు దగ్గరనుంచి పెళ్ళి వరకు ఒక్క వారంరోజులు కూడా లేకుండా, ముఖ్యంగా తన ప్రమేయమేమీ లేకుండానే పెళ్ళి జరిగిపోతుంది.  అమెరికా వెళ్ళి రెండేళ్ల పాటు అధునాతన రీసెర్చ్ చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి డిస్కవరీ చేసే అవకాశం అతనికి.  అది పోగొట్టుకోకూడదనే పట్టుదల.  తల్లి పోరు పడలేక పెళ్ళి చేసుకున్నాడు.  రీసెర్చ్ తప్ప తన దృష్టి ఇంకెక్కడా ఉండకోడుదనే ఆలోచనతో కళ్యాణిని ఇంకో రెండేళ్ళవరకూ తీసికెళ్ళనని నిక్కచ్చిగా చెప్పడం అందరికీ తెలుసు. పెళ్ళయిన తరువాత మూడురోజుల కాపురం – స్త్రీ పురుషుల మధ్య అనుకోకుండానే పెంపొందే అనురాగం – రఘురాం అమెరికా వెళ్ళిన తరువాత తెలిసిన నిజం కళ్యాణి గర్భవతి అవడం జరిగిపోతాయి.  కళ్యాణేకాదు, ఇప్పుడు పుట్టబోయే బిడ్డ కూడా తన ప్రగతికి ఒక ప్రతిబంధకమే.  అబార్షనే ప్రస్తుతానికి పరిష్కారమని తానే నిర్ణయించి కళ్యాణికి చెబుతాడు.  అయితే కనీసం తనతో సంప్రదించకుండా రఘురాం తీసుకున్న నిర్ణయం కళ్యాణికి నచ్చదు.  అందరి అభిప్రాయాలనీ కాదని బిడ్డను కంటుంది.  కాలక్రమేణా భర్తా దూరమౌతాడు.  రఘు రాసే ఉత్తరాలు కూడా ఆగిపోతాయి.  అత్త మామలు దూరమౌతారు.  అమ్మా, నాన్న, పెద్దన్నయ్య, వదినల సహాయతో కొడుకుని పోషిస్తూ, చదువుకుని ఉద్యోగం చేస్తూ జీవితాన్ని సాగుతూంటుంది కళ్యాణి.

 

తను తీసుకున్న రెండో ముఖ్య నిర్ణయం రఘు విడాకులకోసం అడిగినప్పుడు కనీసం తనకు ఆస్తిలో తనకు, కొడుకుకి రావలసిన భాగాన్ని కూడా అడగకుండా సంతకం చేయడం.  రఘురాం పేరుమోసిన సైంటిస్టుగా స్థిరపడతాడు.  భారతదేశం కూడా అతని ప్రతిభను గుర్తిస్తూ పద్మ విభూషణ్ ఇస్తారు.

 

రోజులు, సంవత్సరాలు గడిచిపోతాయి.  కొడుకు మౌళి చదువుకోసం అమెరికా రావడం, అక్కడ అమ్మాయితో పెళ్ళి, ఆ పెళ్ళికి తనూ అమెరికా రావడం జరిగిపోతాయి.  కోడలూ అమెరికాలో పెరిగిన తెలుగమ్మాయే.  అత్తా కోడళ్ళ మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది.  కోడలి డెలివరీకి రెండోసారి వస్తుంది అమెరికాకి.  కోడలు ఆడపిల్లను ప్రసవిస్తుంది.  ఆ పిల్లను చూసుకుంటూ కోడలికి సాయం చేస్తున్న తరుణంలో జరిగిన దుర్ఘటన 9/11.  కోడలు ఆ సమయంలో ట్విన్ టవర్స్ లోని రెండో టవర్ లో పనిచేయడం, ఆ టవర్ కూలిపోయినప్పుడు ఆ అమ్మాయి గట్టి దెబ్బలు తగిలి బతికిన కొద్ది మందిలో ఒక్కర్తి.  ఇటు ఇంట్లో చంటిపిల్లను చూసుకుంటూ, అటు భీకరమైన సంఘటనలో చిక్కుకుని, తెలివి తప్పిన కోడలిని కళ్ళు తెరిపించడంలో కళ్యాణి చూపించిన వైనం డాక్టర్లనే ఆశ్చర్యపరుస్తుంది.  అనుకోకుండా కోడల్ని బతికించడంలో పేరుమోసిన డాక్టర్లను సమన్వయ పరచి సాయపడతాడు అక్కడికి వేరే కారణాల వల్ల వచ్చిన రఘురాం. రఘురాం కళ్యాణిని కలియడం, తన ఆలోచనలెలా సాగాయో, తన జీవితం ఏ మలుపులు తిరిగిందో చెబుతూ ఉత్తరం రాయడం, చివరలో కళ్యాణిపై ఆశతో తనతో భోజనానికి రమ్మనడం, కళ్యాణి తిరస్కరణతో నవల ముగుస్తుంది. 

 

నవలంతా ఉత్తమ పురుషలో రాయబడింది.  కళ్యాణి జీవితం తన మాటలలోనే మనకు తెలుస్తుంది.  కొన్ని సంఘటనలు ఎవరి చేతనైనా చెప్పించినా, అదికూడా ఉత్తమ పురుషలో తమ తమ అనుభవాలను కళ్ళకు కట్టినట్లీ చెప్పించడం రచయిత్రి ప్రత్యేకంగా వాడుకున్న ఒక టెక్నిక్.  ఆ టెక్నిక్ ఉపయోగించే కళ్యాణి కోడలు ట్విన్ టవర్స్ ని ఎటాక్ చేసినప్పుడు తన అనుభవాల్ని చెప్తున్నప్పుడు పాఠకుడికి కళ్ళకు కట్టినట్లుంటుంది. మరో సారి ఆ భీకర సంఘటనా, వంద ఫ్లోర్ల పైనుంచి కిందకు దిగుతున్నప్పుడు మనుషులలో ఆందోళన, పైనుంచి పడుతున్న భావనపు ముక్కలు తగిలిన గాయాలు, పొగ, దుమ్ములలోంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెడుతున్న మనుషుల ఆక్రోశం, పాఠకులను తిరిగి అనుభవింప చేస్తాయనడంలో ఆశ్చర్యం లేదు.  

కళ్యాణి తన జీవితంలో జరుగుతున్న విషయాలకు తను బాధ్యురాలు కాదని తెలిసినా చూపిన పరిపక్వత, ఇతరులకు సాయపడటంలో చూపిన పరిణితి, సమయస్ఫూర్తి, రచయిత్రి చాలా చక్కగా చూపించారు.  తెలియకుండానే పాత్రపై పాఠకులకు ఆరాధన ఏర్పడుతుంది.  పాత్ర చిత్రణ బావుంది.  నవల మొదలు పెట్టినదగ్గరనుంచి చివర వరకూ ఆపకుండా చదివిస్తుంది.  సస్పెన్సు నవల కాదు.  మూడొంతు నవల అయిపోయినా రఘు పాత్ర ఇంకా రాదేమిటి చేప్మా అనిపిస్తుంది.  అంతే కాదు రాక ఎక్కడికి పోతాడు అని కూడా అనిపిస్తుంది.  అనుకున్నట్లుగానే వస్తాడు.

 

పుస్తకానికి ముందుమాట రాస్తూ, వంగూరి చిట్టెన్ రాజు గారు అన్నట్లు ప్రతీ సంఘటనా, సహజమైనదే, ప్రతీ పాత్రా మనకి తెలిసినవే అనిపిస్తుంది.  అమెరికాలో జరిగే పెళ్ళిళ్ళ వైనం కూడా చాలా సహజంగా చిత్రించారు.  ఇంకోమాటన్నారు రాజు గారు – పాత్రల ద్వారా రచయిత్రి చేసిన సామాజిక విశ్లేషణా, పొగడ్తా, తెగడ్తా అన్నీ మనం కూడా చేసేవే... అన్నీ కథలో అలవోకగా ఇమిడిపోయేవే.  కొన్ని ఉదాహరణలు:

 

“ఒకరు చదువులో దిట్ట అయితే ఇక ఆ వ్యక్తి సర్వగుణ సంపన్నుడే!  చదువు వ్యక్తిత్వానికి ఆభరణం అనుకోరు చదువే వ్యక్తిత్వం అనుకుంటారు”

వివాహవ్యవస్థ గురించి చెబుతూ “ఏ మాత్రం పరిచయం లేని ఇద్దరినీ ఒక శుభ ముహూర్తంలో భార్యాభర్తలంటారు.  ఒకరికి ఒకరంటే ఎటువంటి అవగాహనా ఉండదు.  ఒక్కొక్కసారి ఆలోచనల్లో ఎటువంటి పొంతనా ఉండదు. ఒక కప్పు కింద ఉన్నత మాత్రాన అందరూ సంతోషంగా ఉంట్లేనా లెక్క?”

“ఆనందం అనేది కేవలం మూడు అక్షరాలు మాత్రమే!  కాని దాని అనుభవం – అనిర్వచనీయమయినది. అనంతం.”

“ఓ మనిషి 80, 90 ఏళ్ళు బతికితే, ప్రతి ఈ‌డి‌యూ, ప్రతి రోజూ సుఖసంతోషాలే ఉండవు.  మధ్య మధ్య కష్టాలుకూడా వస్తాయి.  అప్పుడు నిలదొక్కుకున్నప్పుడే మనిషి స్థైర్యం తెలుస్తుంది.  సంతోషాలు వస్తే ఎగిరి గంటేసి, కష్టం రాగానే కృంగిపోవడం కాదు జీవితమంటే”

ఇలా సంభాషణాలలో పాత్రల మాటల్లో రచయిత్రి జీవిత రాగాల్ని పలికిస్తూనే ఉంటారు పుస్తకం నిండా.  

పెద్ద అక్షరాలతో పుస్తకం చదవడానికి వీలుగా ఉంది – కొంచెం పేజీలు ఎక్కువైనా.  ఆంధ్రభూమి దినపత్రికలో అయిదేళ్ళ క్రితం వరకు ధారావాహికంగా వచ్చిన నవల ఇది.  దాని ప్రభావమేమో గాని, ఒకటి రెండు చోట్ల కొంచెం సాగతీస్తున్నట్లుగా అనిపించింది.  అతి కొద్దిగా ఉన్నా, కొన్ని అచ్చు తప్పులున్నాయి. వాక్యాల కూర్పు అక్కడక్కడా సరి చేయవలసిన అవసరం ఉందనిపించింది.  9/11 దుర్ఘటన ఫలితాలు తెలియడానికి చాలా నెలలు పట్టింది.  అయితే రచయిత్రి జరిగిన కొద్ది వారాల్లోనే ఆ ఫలితాలను పాత్రచేత చెప్పిస్తారు.  చాలా శ్రద్ధతో ఎంతో  శ్రమ తీసుకుని రాసిన ఈ నవలలో దొర్లిన చిన్న చిన్న విషయాలను లెక్క చేయవలసిన పనిలేదు.

నవల మొదలు పెడితే ఆసాంతం చదివిస్తుంది.  రమాదేవి గారు ఎంతో సులభమైన శైలిలో అనుభవిస్తూ రాసిన నవల ఇది.  నాకనిపిస్తుంది, ఏ రచయితైనా భావిస్తూ రాసినప్పుడు తమ తమ అనుభవాలను, భావాలను, తెలిసో, తెలియకుండానో పాఠకుల ముందుంచడం జరుగుతుంది.  ఆవిడ ఆలోచనలు ముఖ్యంగా సాంప్రదాయాల కుటుంబాలలో ఇరుక్కున్న పోయిన స్త్రీల పట్ల సానుభూతి, అలా ఎందుకవాలని  సమాజాన్ని ప్రశ్నించే సందర్భాలు నవలలో చాలా ఉన్నాయి.  స్త్రీవాద సాహిత్యం అనే పేరు పెట్టకపోయినా, పాత్ర ద్వారా సమాజాన్ని ప్రశ్నిస్తూ ఒక స్వతంత్రంగా ఆలోచించగలిగే ఒక మహిళ కథ ఇది.  

వంగూరి ఫౌండేషన్ వారి 103వ ప్రచురణ ఇది.  తెలుగు దేశంలో అన్ని ప్రముఖ పుస్తక విక్రయశాలలలోనూ దొరుకుతుంది.  వెల రూ. 500.00.  అమెరికాలో vangurifoundation@gmail.com కి వ్రాసి తెప్పించుకోవచ్చు.  

* * *

రావిశాస్త్రి – అక్షర స్ఫూర్తి:

 

విశాఖ రసజ్ఞ వేదిక (విశాఖ), విశాఖపట్నం వారు రావిశాస్త్రి గారి శతజయంతి సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచిక.  

నూరు కొత్త వ్యాసాలతో, ‘పాత బంగారం’ పేరుతో రావిశాస్త్రి గారి సమకాలీన సాహితీవేత్తలు రాసిన పంతొమ్మిది వ్యాసాలతో ప్రచురింపబడిన ఈ పుస్తకం ప్రముఖ సాహితీవేత్త రావిశాస్త్రి అని పిలవబడే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి నివాళి.  

"రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చేడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికిహాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను" అన్నారు రావిశాస్త్రి.  అనటమే కాదు, తను చెప్పింది నమ్మి ఆ సిద్ధాంతాన్ని అక్షరాలా పాటించారు.

శతపత్ర నివాళి అర్పిస్తూ, విశాఖ కార్యదర్శి ఆచార్య ప్రయాగ సుబ్రహ్మణ్యం గారు అంటారు, "ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి తన రచనలతో విశ్వవిఖ్యాతి నార్జించిన రావిశాస్త్రి గారి శతజయంతి వేడుక సందర్భంగా మహోన్నత మూర్తి, మహా రచయిత శ్రీ శాస్త్రి మానవతా పరిమళాలను, సాహితీ సౌరభాలను భవిష్యత్ తరాలకు అందించాలనె మహదాశయంతో వంద వ్యాసాలను, మరో పదిహేడు గతంలో ముద్రించబడిన వ్యాసాలను, అందిస్తున్నాము".  

విశాఖ వారికి ఈ ఆశయం కలగడం మనందరి అదృష్టం.  శాస్త్రి గారి సోదరులు, చెల్లెలు, కొడుకు, కూతురు, ఇలా రక్తసంబంధం కలిగిన వారినుంచి ఎంతో సన్నిహితమైన జీవితవరాలు చదువుతున్నా, శాస్త్రి గారి దగ్గర స్నేహితులు వారి అనుభవాలు చెబుతున్నా, సాహితీ పరంగా ఆయన రాసిన కథలు, నవలలు చదివినవారైనా, ఆయన సహ రచయితలైనా వారు రాసింది చదువుతూంటే, ఆయన గురించి ఇంకా ఇంకా చదవాలని, ఇన్నాళ్ళు నాకెందుకు ఆయన గురించి తెలియలేదో అన్న భావం/బాధ కలిగింది.  విశాఖ వారు ఈ కార్యక్రమం చేబట్టి ఈ మానవతా వాది శత సంవత్సరాన్ని జరుపుకుంటూ ఈ సంచికను వెలువరించినందుకు ముందుగా ధన్యవాదాలు.

“ఎంత తెలిసినా ఇంకా తెలియకుండా మిగిలే ఉంటారు.  మీగురించి ఏమీ తెలియదనిపిస్తూవుంటారు.  అందుకే నా ఈ 'అంజానా'?  తెలిసినా తెలియకపోయినా సదా గుబాళించే మీరు.” అంటారు, మెడికో శ్యామ్ ఒక వ్యాసంలో.  శాస్త్రి గారితో పరిచయం లేదని చెప్తూనే ఆయన రచనా వ్యాసంగాన్ని గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలు చెప్పారు.  శాస్త్రి గారిని ఉత్తేజ పరిచిన కథ, ఆయన చదివిన కథల విస్త్రుతి, ఆయనకి సంగితంలోనూ, సాహిత్యం లోనూ ఉన్న ప్రవేశం, ఇష్టం, ఇలా ఇలా ఇంకెన్నో.  ఆయన అవార్డులను తిరస్కరించిన రీతి, తిరిగి ఇచ్చేసిన వైనం కొద్ది మందిని కొంచెం కలత పెట్టిందని చెప్పవచ్చు.  

శాస్త్రి గారి రక్త సంబంధీకులు ఆయన చిన్నతనం గురించి, ఆయన సోదరుడిగా, తండ్రిగా తమ తమ అనుబంధాలు చెబుతున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం, ఆయన ఇష్టాయిష్టాలు, ఆప్యాయత, ఒక మనిషిగా, ఒక నిరంతరం చదివే ఒక వివేకమూర్తిగా, అతి చిన్న చిన్న విషయాలకు ఆనందపడే ఒక చిన్నపిల్లవాడి మనస్తత్వం గల మనిషిగా, ఒక సామాజిక న్యాయం కోసం పాటుపడే ఒక న్యాయమూర్తిగా, ఇలా ఎన్నో రూపాలలో కనబడతారు శాస్త్రి గారు. 

“మా అన్నయ్య సుఖాలతో పాటు ఎన్నో కష్టాలు కూడా అనుభవించడం నాకు తెలుసు.  102 డిగ్రీల జ్వరంతో కూడా రిక్షాలో కోర్టుకి వెళ్ళవలసిరావడం నాకు తెలుసు.  మరణ శయ్య నుండీ కూడా డ్రాఫ్టులు డిక్టేట్ చెయ్యడం నాకు తెలుసు.  ఆఖరు వరకూ తన సంపాదన మీదే బతికాడు.” అంటారు వారి సోదరుడు ఒక వ్యాసంలో.     

అందరు మనుషుల్లాగే శాస్త్రిగారు కూడా ఒక మనిషి.  ఆయనకు కొన్ని బలహీనతలుండవచ్చు. అవికూడా ఆయనని మనలో ఒకరుగా నిరూపిస్తూనే అందరికంటే పెద్ద పీఠంపై నిలబెడతాయి.  మేధలో, ఆలోచనలో, సృష్టించిన సాహిత్యంలో, బడుగు ప్రజలకు జరిగే అన్యాయాలను అతి సూటిగా, ధైర్యంగా, హత్తుకునేలా చెప్పగలిగే తీరులో,  ఆయనకు ఆయనే సాటి.  

పుస్తకంలో శాస్త్రి గారి విలక్షణ వ్యక్తిత్వం పైనా, ఆయన సాహితీ కృషి పైనా, ఎన్నో వ్యాసాలున్నాయి.  ఈ చిన్న వ్యాసంలో ఎన్నో చెప్పలేను.  

“ఆయన కథల్లోని నిత్యనూతనత్వాన్ని గురించి మరింక ఎందరో రాశారు.  ప్రత్యేకంగా కొన్ని కథల్ని విశ్లేషిస్తూ కొన్ని వ్యాసాలున్నాయి.  

ఆయనతో కొంచెం పరిచయం ఉన్న వారి నుండి అత్యంత అనుబంధం ఉన్న ఎందరో రాసిన వ్యాసాలు, ఆయనతో వారి వారి అనుభవాలు, ఎన్నో, ఎన్నెన్నో.  

పుస్తకం చదువుతున్నకొద్దీ ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్తున్నప్పుడు అన్నీ విడివిడిగానే ఉన్నా, అన్నిటిలోనూ ఉన్నది మానవతా వాది, సాహిత్య మూర్తి రావిశాస్త్రే.  ఒక అందరిలాంటి నాన్న, కొన్ని సెంటిమెంట్లు కొన్ని బలహీనతలు ఉన్న సగటు మనిషి.  వృత్తి రీత్యా న్యాయవాది.  ఒక “కథా రచయిత. కనబడతాడు.  అయితే సగటు రచయిత మాత్రం కాదు.  ఎందరో అందుకోలేని ప్రతిభాశాలి.

“ఎందుకు రాసేను” అన్నది రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసిన వ్యాసం కూడా ఉంది ఈ సంపుటిలో.  తాను నేర్చుకున్నది ఇతరులతో పంచుకోవడానికి కథలు రాసేనన్నారు.  “నా కోపం, తాపం, దుఃఖం, సంతోషం, నా సరదా, నా క్యూరియాసిటీ, వగైరాలు ఇతరులకు తెలియజేయ్యడానికి కూడా నేను కథలు రాసేననుకుంటున్నాను” అంటారు.  

ఎందరో ఎన్నో చెప్పారు.  అన్నీ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది.  

ఈ పుస్తకాన్ని వెలికి తీసుకొచ్చిన విశాఖ రసజ్ఞ వేదిక వారికి కృతజ్ఞతలు.

 

* * *

 

ఎన్నెలమ్మ కతలు

 

లక్ష్మీ రాయవరపు గారు (కెనడా) రాసిన కథల సంపుటి.  లక్ష్మి గారు కెనడాలో నివసిస్తూ, అక్కడ తెలుగు సాహితీ ప్రియులను ‘తెలుగు తల్లి’ అనే ఒక సాహిత్య వేదిక ద్వారా, అందరినీ ఒక తాటిమీద నడిపిస్తూ ఎనలేని సేవ ఎడతెరిపిలేకుండా చేస్తున్నారు.  ఈ మధ్య ప్రపంచవ్యాప్తిగా సాహితీ సభలను నిర్వహిస్తూ, ప్రత్యేక యూట్యూబు కార్యక్రమాలలో పాల్గొంటూ, నిర్వహిస్తూ, ఎంతో మందికి పరిచయమయ్యారు. 

ఎన్నెలమ్మ కతల గురించి రాస్తూ, వంగూరి చిట్టెన్ రాజు గారు “ఎన్నెలమ్మ తనతో పాటు మనల్నీ ఆ ప్రయాణంలో తీసుకుపోయే మంచి గుణం కనబడుతుంది.  అదేదో ఉసూరుమంటూ సాగే , మామూలుగా సాగే ఆషామాషీ ప్రయాణం కాదు. హాయిగా, ఉల్లాసంగా ఆహ్లాదంగా కబుర్లు చెప్పుకుంటూ, ‘అరె అప్పుడే అయిపోయిందా’ అని ఆగి, నవ్వేసుకునే ప్రయాణం.... అంతా అయ్యాక కాస్సేపు ఆలోచించుకునే విషయాలు... ప్రతి కతకీ కాలక్షేపానికి మించిన ఏదో ఒక ప్రయోజనం... “  అంటారు.  ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజమని ఈ కతలు చదివిన ఎవరైనా ఒప్పుకోవలసిందే.  డా. కొండపల్లి నీహారిణి గారు కథలగురించి రాస్తూ, “ఆధునికంగా చెప్తూనే మూలాలను మరవనితనం లక్ష్మి కథలలో ఉన్నది.” అంటారు.  అది నిజం.  ఆంగ్ల పదాలున్నా, చక్కగా కథలలో ఇమిడిపోతాయి.  తెలంగాణా మాండలీకంలో ఎక్కువగా ఉంటాయి ఈ కతలు.  

ఈ సంపుటిలో 28 కథలున్నాయి. చాలా హాస్య కథలున్నాయి.  అవి రాయడం అంత సులభం కాదు.  కొంతమంది అలాంటి కథలు రాయాలని రాస్తారు.  మరికొందరు తమ తమ జీవితాల్లోంచి తమని తామే చూసుకుంటూ నవ్వుకుంటూ నవ్విస్తూంటారు.  లక్ష్మి గారు ఈ రెండో కోవకు చెందుతారు.  కథలు చాలా మటుకు తన జీవితానుభవాలలోంచి వచ్చినవేనని తెలియకే తెలుస్తూంటుంది.  అందుచేతే చదివేవారు కూడా తమని తాము కథలో చూసుకుంటూ హాయిగా నవ్వుకోవచ్చు.  అయితే ఇవి కథలా? నవ్వించే వ్యాసాలా?  అని కూడా అనుమానమొస్తుంది.  అందుకేనేమో లక్ష్మి గారు వీటిని కతలన్నారు.  

 ‘వాట్సాప్’ అన్న కథతో మొదలవుతుంది పుస్తకం. ఇది నిజంగా వాట్సాప్ కథే.  వాట్సాప్ అంటే ఏమిటో తెలియని రోజులతో మొదలై అది అర్థం చేసుకోవడంలో కష్టాలు, ఫ్యామిలీ గ్రూపుల్లో కోపాలు, తాపాలు, చివరికి బోల్డన్ని గ్రూపులలో చేరిపోయే అవస్థలు, ఒకటా?  “ఇంతకు ముందు గుడికో, గోపురానికో వెళితే అందరినీ గుర్తు పెట్టుకుని చల్లగా చూడమని రెక్వెస్ట్ పెట్టడంలో ఎవరో ఒకరిని మర్చిపొయ్యే దాన్ని.  ఇప్పుడలా కాదు.  ఇటు గన్నవరపు కజిన్స్ లో మెంబర్లని, అటు రాయవరపు కజిన్స్ లో మెంబర్లని, ఇటు కెనడా కుటుంబం మెంబర్లని, అటు ముఖపుస్తకం స్నేహితులని చల్లగా చూసేయ్ దేవుడా అనుకుంటే ప్రపంచంలో నాకున్న సమస్త బంధుగణమూ కవర్ అయిపోతోంది తెలుసా.. “ అంటుంటే హాయిగా నవ్వుకోమూ?  అంతే కాదు.  దేవుడిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వాట్సాప్ అంటే అన్నీ గ్రూపులనీ ఆయనే చూసుకుంటాడంటారు లక్ష్మి గారు. 

కెనడాలో జీవితం గడుపుతున్నప్పుడు అక్కడ అసలు పేరు, ఇంటి పేర్లతో వచ్చే గడబిడలు (అందరిలో మామయ్య), చిన్నప్పుడు విన్న ఆల్వాల్ దయ్యం, కెనడాలో ఆఫీసులో కనబడని బెట్టీల మధ్య సారూప్యత (ఓ ఉమన్ కామ్ టుమారో),  కెనడాలో తిండి పెట్టని పెళ్ళిళ్ళు (కాపీలు తాగారా, టిపినీలు తిన్నారా)… ఇలా సాగిపోతాయి కెనడా కథలు.  ఒకరకంగా అన్నీ డయాస్పోరా కథలు.  మన జీవనవిధానం (ముఖ్యంగా వలస వెళ్ళిన మొదటి తరం వారు) అక్కడి జీవితంతో ముడిపెట్టుకునే అవసరం ఉన్నప్పుడు మనం పడే కష్టాలను నవ్విస్తూ చిత్రీకరిస్తారు లక్ష్మి గారు.  

అయితే అన్నీ కెనడా కథలే అనుకునేరు.  కాదు కాదు.  మామూలు (అదే, మన తెలుగు గడ్డ నేపథ్యం) కథలు కూడా ఉన్నాయి.  కథలలో బాసాసురుడు లాంటి కొన్ని పద ప్రయోగాలు బాగున్నాయి. 

కథలను హాయిగా చదువుకోవచ్చు.  చిన్న చిన్న కథలే.  క్షమించాలి కతలే.  

ఈ పుస్తకం కూడా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణే, వారి 101 వ ప్రచురణ.  వెల రూ. 100.  చిన్న ధరే.  తెలుగు దేశంలో అన్ని ప్రముఖ పుస్తక విక్రయశాలలలోనూ దొరుకుతుంది.  అమెరికాలో vangurifoundation@gmail.com కి వ్రాసి తెప్పించుకోవచ్చు.

 

* * *

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 4
bottom of page