bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

21 వ శతాబ్దపు స్త్రీల నవలలు

ఆచార్య శివుని రాజేశ్వరి

ఆగస్టు 29, 30 తేదీన ’21 వ శతాబ్ద స్త్రీల నవలలు’ అన్న అంశంపైన ఒక వెబినార్ జరిగింది. కథానిక, కవితలపైన చాలా సెమినార్లు, వెబినార్లు జరిగాయి. కానీ నవలపై ఈ మధ్య కాలంలో సెమినార్లు, వేబినార్లు  జరగలేదు. అందుకు కారణం నవలకు కాలం చెల్లిందన్న అపోహ. కథలు, కవితలు అంత విస్తృతంగా నవలలు రాకపోయినా, నెమ్మదిగా, మందగమనంతో సమాజంలోని కదలికల్ని గర్భంలో మోస్తూ నవల కదలిపోతూనే ఉంది. గతంలో లాగానే నవలా రచనలో స్త్రీలు ముందంజలో కనిపించారు. 21 వ శతాబ్దిలో అనగా గత 20 సంవత్సరాల కాలంలో వచ్చిన స్తీల నవలలు ఏవి? ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ స్త్రీలు నవలలు రాస్తున్నారు? నవలా రచన  ద్వారా వారు సమాజంలో ఏ విధంగా సంభాషిస్తున్నారు? ఒక నాటి స్త్రీల నవలలకు, ఈనాటి స్త్రీల నవలలకు ఏమైనా వ్యత్యాసం ఉందా? స్త్రీల జీవితంలోను, కుటుంబంలోను, సమాజంలోను, చోటు చేసుకుంటున్న పరిణామాలు స్త్రీల నవలల్లో ఉన్నాయా? అన్న ప్రశ్నలకు ఈ వెబినార్ లోని ప్రసంగాలు సమాధానం ఇచ్చాయి. ‘స్త్రీల నవలల్లో కుటుంబ జీవితమే ఉంటుందని నవలలు వండిపారేస్తున్నారని’ అంటున్న వ్యంగ్యాస్త్రాల్లో నిజం లేదని తేలింది. నేటి స్త్రీలు సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను, ఉద్యమాలను నవలీకరించారు. సమాజ దురాగతాలపై కలం కొరడా ఝుళిపించారు. స్త్రీవాద, దళితవాద, బహుజనవాద, ముస్లిం మైనారిటీవాద, ప్రాంతీయవాదాలతోను, ప్రపంచీకరణ నేపధ్యంతోను ఎన్నో నవలలు వెలువరించారు.

 

ఈ వెబినార్లో 16 మంది రచయిత్రులు తమ నవలలను వివరిస్తూ ఆ నవల రచన వెనుక ఉన్న నేపథ్యాన్ని కూడా తెలిపారు. ఇదొక కొత్త పరిణామం ఏ సామాజిక పరిస్థితుల్లో, ఏ మానసిక సంఘర్షణల్లో నవల వెలువడిందో అర్థమైనది. అంతేకాదు, ఆ నవల వెలువడ్డాక వారు ఎదుర్కొన్న విమర్శలు, పొగడ్తలు తద్వారా తమకు ఎదురైన అనుభవాలు వివరించారు. ఓల్గా ‘గమనమే గమ్యం’ నవలను, నల్లూరి రుక్మిణి ‘ఒండ్రు మట్టి’ ‘నిషిద్ద’  నవలలను, గీతాంజలి ‘ఆమె అడవిని జయించింది’ నవలను, కుప్పిలి పద్మ ‘మహి’ నవలను, శాంతి ప్రభోధ ‘జోగిని’ నవలను వివరించారు.

 

ఆ నవలల నేపథ్యాన్ని తెలపడంతో పాటు రచించేటప్పుడు తాము పడిన మానసిక సంఘర్షణను శ్రోతల ముందుంచారు. పాఠకులకు చెప్పని ఎన్నో విషయాలు ఈనాడు వెలుగుచూశాయి. నవల వెలువడిన తరువాత ఎదురైన సంఘటనలు తమ అనుభవాలు తెలిపారు. అమెరిక, లండన్, ఆస్ట్రేలియ వంటి దేశాల నుంచి రచయిత్రులు పాల్గొని తమ నవలలను వివరించారు.

 

చెరుకూరి రమాదేవి ‘ట్విన్ టవర్స్’, ఉమా పోచంపల్లి ‘విచలిత’, గౌతమి సత్యశ్రీ ‘ఎగిసే కెరటం’, హేమ మాచెర్ల ‘బ్రీజ్ ఫ్రం ద రివర్ మంజీర’, కల్పన రెంటాల ‘తన్హాయి’, కె. గీత ‘వెనుతిరగని వెన్నెల, ఝాన్సీ కొప్పిశెట్టి ‘అనాచ్చాదిత’, లలితా రామ్ ‘అనంత కళ్యాణం’, మీనా రెంటచింతల ‘దొరసాని’, ఇంద్రాణి పాలపర్తి ‘ఱ’ నవలల నేపథ్యాన్ని వివరించారు. సందేశానికి దూరమై విదేశాలలో ఉన్నా, తమ మాతృభాషపైన, తెలుగు సాహిత్యంపైన వారికి ఉన్న అభిమానం, ఆసక్తి అబినందనీయం. ఊపిరి సలపని పనుల్లో కూడా నవల రచనకు ఉద్యమించడం అప్పటి తమ మానసిక సంఘర్షణను వారు వివరించారు.

 

ఈ వెబినార్లో 16 మంది అధ్యాపకులు పత్రసమర్పణ చేశారు. తొలితరం రచయిత్రులు 2000 తర్వాత రాసిన నవలలు (8) ఒక సమావేశంలో, ఉద్యమ నవలలు (8) మరో సమావేశంలో చర్చించబడ్డాయి. మాలతీ చందూర్, రంగనాయకమ్మ, డి. కామేశ్వరి, ఇంద్రగంటి జానకీబాల వంటి సీనియర్ రచయిత్రులు 1960 ప్రాంతాల నుంచే నవలలు రాస్తున్నారు. వీరు 2000 తర్వాత రాసిన నవలలపై ఈ వేబినార్ ల్లో పత్ర  సమర్పణ చేయడం జరిగింది. మాలతీ చందూర్ ‘సిసిర వసంతం’, ఇంద్రగంటి జానకీ బాల ‘కనిపించే గతం’, డి. కామేశ్వరి ‘మహిమ’, అత్తలూరి విజయలక్ష్మిల ‘అర్చన’ నవలలపై విశ్వవిద్యాలయాల ఆచార్యులు పత్రసమర్పణ చేసారు. ఆ నవలల్లోని వివిధ అంశాలపై లోతుగా విశ్లేషించారు. ఇవన్నీ కుటుంబం కేంద్రంగా వెలువడ్డ నవలలు కావడం విశేషం.

 

రచయిత్రులు సమాజంలో చోటుచేసుకున్న పరిణామాలను స్త్రీవాద, దళితవాద, బహుజనవాద, ముస్లిం మైనారిటీవాద, ప్రపంచీకరణ నేపథ్యలో నవలలు రాసారు. సి. సుజాత ‘చానల్ 24/7’, జాజుల గౌరీ ‘ఒయినం’, మంథా భానుమతి ‘అగ్గిపెట్టెలో ఆరుగజాలు’, షహనాజ్ బేగం ‘మానస బాంధవ్యం’, పుష్పాల సూర్యకుమారి ‘కరోనా శాపమా? వరమా? నవలల పై అధాపకులు పాత్ర సమర్పణ చేసారు. అందులోని ఉద్యమ వాతావరణాన్ని, సామాజిక నేపథ్యం ఆధారంగా విశ్లేషించారు.

 

ఈ వెబినార్ లో ప్రస్తావించకపోయిన 2000 తరువాత నవలలు రాసిన రచియిత్రులను వారి నవలలను (50) ఒక పత్రంలో పరిచయం చేయడం జరిగింది. దీనివలన దాదాపుగా ఆధునిక నవలా రచయిత్రులు వారి నవలల గురించి అందరికీ ఒక అవగాహన వచ్చింది. 21 వ శతాబ్ది నవలలు ఆధునిక పోకడలు తెలిపాయి.

స్త్రీల నవలలకు అండగా నిలబడిన స్త్రీల పత్రికలు గోపిక, విహంగ, జె.వి. ప్రచురణసంస్థల గురించి కూడా ఈ వెబినార్ ప్రస్తావించడమైయింది. స్త్రీల ఆధ్వర్యంలో ఉన్న పత్రికలు ప్రచురణసంస్థలు స్త్రీల నవలలకు ఇస్తున్న ప్రాచుర్యం, ప్రోత్సాహం ఎందరికో ఉత్సాహాన్ని ఇచ్చింది. సెమినార్లు, వెబినార్లకు తలమానికం ‘కీలకోపన్యాసాలు’. ప్రారంభంలోను ముగింపులోను వెలువడిన 2 కీలకోపన్యాసాలు స్త్రీల నవలల ప్రయాణాన్ని మనముందుంచాయి.

 

ఆచార్య కాత్యాయనీ విద్మహే ప్రారంభ సమావేశంలో ‘స్త్రీల నవలల వడక’ అంశంపై ప్రసంగిస్తూ తొలి తెలుగు నవలా రచయిత్రుల గురించి వివరించారు. వారి నవలల్లో చోటు చేసుకున్న వివిధ అంశాలు, ఆనాటి సామాజిక నేపథ్యం గురించి వివరించారు. చాలా నవలలు లభ్యం కాకపోవడం పట్ల ఆవేదన వెలిబుచ్చారు. ముగింపు సమావేశంలో ఆచార్య సి. మృణాళిని ‘విశ్వసాహిత్యంలో మహీతల నవలలు’ అన్న అంశంపై ప్రసంగిస్తూ ‘’ఇక్కడ తెలుగులో నన్నయ భారతం రాస్తున్న సమయంలోనే విదేశాల్లో మహిళ నవల రాయడం మొదలు పెట్టింది.’’ అని ఆసక్తికరంగా ప్రారంభించారు. ఫ్రెంచి భాషలో వెలువడిన స్త్రీల నవలల గురించి, ఆ నవలల పై వెలువడిన విమర్శలతో సహా వారు భద్రపర్చుకున్న విధానాన్ని తెలిపారు. ఈ విధంగా కీలకోపన్యాసాలు ద్వారా స్త్రీల నవలల గురించి ఎన్నో కొత్త విషయాలను వీరు వివరించారు.

 

ఈ వెబినార్ నిర్వహణ ద్వారా వెలుగు చూసిన అంశాలు ప్రధానంగా మూడు ఉన్నాయి.

1. కిందటి తరం రచయితలు, 80 సంవత్సరాల పైబడ్డవారు కొందరు ఈ నాటికీ నవలా రచనలో ముందంజలో ఉన్నారు. వారిలో 1960 ప్రాంతాలనుంచి రచనలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. అంటే వారు 20 సంవత్సరాల వయసు నుంచే నవలా రచన మొదుపెట్టి ఉండాలి. ఆచార్య రాచపాళెం గారు ఒక వెబినార్‌కు  ఇచ్చిన ముగింపు ఉపన్యాసంలో ఒక మంచి మాట చెప్పారు. ‘ఒక వ్యక్తి తన జీవితకాంలో 3 వంతుల్లో 2 వంతులు రచనా జీవితం గడిపి ఉంటే వారి జీవితం సార్థకమైనట్లే వారి నుంచి సమాజం ఆశించినంత కృషి జరిగిందని మనం భావించాలి’ అన్నారు ఆయన. ఈ తొలితరం రచయిత్రుల జీవితం సార్థకమయినది. వీరు తమ రచనా వ్యాసాంగాన్ని జీవిత పర్యంతం ఆస్వాదిస్తూనే ఉన్నారు. వీరిలో కలంపట్టిన వారూ ఉన్నారు. కలంతో కొరడా ఝుళిపించిన వారు ఉన్నారు. ఒక తరం పాఠకుకు బాగా తెలిసిన వీరి నవలల మీదే ఒక వెబినార్‌ ఏర్పాటు చేసి ఈ తరం పాఠకులకు వారిని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ వెబినార్‌ ద్వారా ఎక్కడో లైబ్రరీలో చీకటిలో దాక్కున్న వీరి రచను వెలుగుచూసే అవకాశముంది. స్కానింగ ద్వారా నెట్‌లో చిరస్థాయిగా నిలిచిపోగలదు. ఆ ప్రయత్నం ఈ వెబినార్‌లో జరిగింది. కరోనా నేపథ్యంలో, పుస్తకాల షాపుకు, లైబ్రరీలకు వెళ్ళే అవకాశంలేక ఈ వెబినార్‌ కోసం రచయిత్రుల పుస్తకాలు కానీ, వాటిని స్కాన్‌ చేసి కానీ, వాటి పిడిఎఫ్‌లు కానీ పంపమని అడగడం జరిగింది. కొందరు ప్రచురణ కర్తల నుంచి తమ నవల పిడిఎఫ్‌లు సేకరించి పంపారు. ఈ క్రమంలో కాపీలు ఎక్కడ దొరకని తమ నవలలు ఇంటర్నెట్‌ నెట్లో రావడం పిడిఎఫ్‌ రూపంలో పాఠకలోకానికి చేరే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషించారు. తమ రచనలను బద్రపరుస్తున్నారు.

 

2. పత్రికారంగం, ముద్రణారంగం, బుక్‌ సేల్స్‌, బుక్‌ షాపు, గ్రంథావిష్కరణ సభలు, సమావేశాలు, చర్చలు, వర్క్‌షాపు పురుష ప్రపంచానికి చెందినవి కావడం వలన ఆ రంగాల్లోకి కూడా స్త్రీలు  ప్రవేశించి రచయిత్రుల రచనకు ప్రాచుర్యం కలిగిస్తున్నారు.

 

3. స్త్రీలు నవలలు రాయడమేకాక వాటిని పాఠక లోకానికి అందించడంలో సరికొత్త మార్గాలను వెతుక్కున్నారు. కొందరు తమ నవలలను సీరియల్స్ గా ఫేస్‌ బుక్‌ ద్వారా నేరుగా పాఠకలోకానికి చేరవేస్తే, మరికొందరు ‘కినిగె’, ‘అమెజాన్‌’ ద్వారా నవలలను ముద్రించి అందిస్తున్నారు. ఇంకొందరు ఆడియో రూపంలో యూట్యూబ్‌ ద్వారా అందిస్తున్నారు. స్వంత బ్లాగు వెబ్‌సైట్లు తయారు చేసుకుని తమ రచనను భద్రపరుస్తున్నారు. కొత్తగా సమాజంలోకి వచ్చిన ఇంటర్నెట్‌ సదుపాయాన్ని ఇన్ని రకాలుగా వాడుకోవడంలో స్త్రీలు ముందంజలో ఉన్నారు.  నట్టింటి నుంచి నెట్టింటిలోకి అడుగుపెట్టారు. విదేశాల్లో స్థిర పడ్డ రయిత్రులు ఈ రంగంలో ముందంజలో ఉన్నారు. స్వదేశానికి దూరమైన రచయిత్రి అయినా, సమాజానికి దూరమై ఇంటికే పరిమితమైన రచయిత్రి అయినా తమ స్వంత మార్గాన్ని తయారు చేసుకోవడం గమనార్హం. ఆధునిక నవలా రచయిత్రి ఫేస్‌బుక్‌లో సీరియల్‌ రాసి, జూమ్‌ఆప్‌లో నవలను రిలీజ్‌ చేసి, కినిగె ద్వారా పాఠకులకు అందిస్తోంది. ఆ నవలను పాఠకులు వాట్సప్‌ గ్రూప్‌లో షేర్‌ చేసుకొని చదువుకుంటున్నారు. పరిశోధనకు ఆ నవలను విశ్లేషించి వెబినార్‌ ద్వారా  ఆ నవలపై పత్రసమర్పణ చేస్తున్నారు.

 

ఈ వెబినార్‌లో నవలా రచయిత్రి, విమర్శకురాలు, ఉపన్యాసకురాలు, పరిశోధకురాలు, పత్రసమర్పకురాలు, సంపాదకురాలు, ముద్రణావ్యవస్థాపకురాలు, పాఠకురాలు, ప్రేక్షకురాలు, కార్య నిర్వాహకురాలు పాల్గొన్నారు. భాషలో ఇన్ని కొత్త పదాలు చోటుచేసుకున్నాయంటే, ఆయా రంగాల్లో స్త్రీలు నిష్ణాతులు కావడమే తల్లి, చెల్లి, భార్య, కూతురు, కోడుకు, వంటి గుర్తింపు నుంచి బయటపడి ఈ కొత్త గుర్తింపుతో స్త్రీలు సమాజంలో ముందంజలో ఉన్నారు. ‘‘ఆధునిక మహిళ చరిత్రను పునర్నిర్మిస్తుంది’’ అన్న గురజాడ మాటకు ఇంతకంటే నిదర్శనం ఏమికావాలి.

***

Website Designed

 &  Maintained

by

 Srinivas Pendyala 

Feedback

sahityam@madhuravani.com

 

©  2021 madhuravani.com

మధురవాణి కొత్త సంచిక విడుదల వివరాలు ఉచితంగా సకాలంలో అందుకోవాలంటే మీ పేరు, ఇ-మెయిల్ చిరునామా sahityam@madhuravani.com  కి పంపించండి.

మీ వివరాలు ఎవరితోనూ పంచుకొనబడవు.​

Website Designed

 &  Maintained

 by

Srinivas Pendyala