bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

radhika.PNG
7th telugu sahiti sadassu -2020 .JPG

భానుమతిగారి సాహిత్యంలో అత్తగారు

రాధిక నోరి

అమ్మలగన్నయమ్మ, మగని కన్నయ్యమ్మ

మనువైన పిదప ఆ దేవుడిచ్చిన మరో అమ్మ

ప్రతి అమ్మా ఏదో ఒకనాడు మారే ఆ అత్తమ్మ

ఏ దేశమైనా, ఏ సంస్కృతైనా ప్రత్యేక స్థానమున్న ఆ కొత్తమ్మ    

 

అత్తా ఒకింటి కోడలే అన్నారు కదా! అంటే ప్రతి అత్తా ఒకప్పుడు ఎవరో ఒకరికి కోడలే అన్నమాట. అలాగే, అందరూ అని అనను కానీ, చాలామంది కోడళ్ళు భవిష్యత్తులో ఏదో ఒకనాడు అత్తలు అవుతారు. అయితే ఈ అత్తలు అందరూ ఒకేలాగా వుండరు. కానీ భానుమతిగారి అత్తగారిలాంటి అత్తగారు కావాలని మాత్రం కోరుకోని కోడలు ఎవరూ ఉండదు. దీనికి కారణం ఆ అత్తగారిలో వున్న ప్రత్యేకతలే! ఆవిడ మాములుగా అందరూ అనుకునేలాగా కోడళ్ళని ఆరళ్ళు పెట్టే అత్తగారు కాదు. ఆ గయ్యాళితనం ఆవిడలో అసలు లేనేలేదు. పసిపాపలాంటి అమాయకత్వం, అందరిపట్లా ఆవిడకున్న స్వచ్ఛమైన ప్రేమ, ఆవిడ ప్రతి మాటలోనూ, చేష్టలోనూ మనకి తెలిసిపోతూవుంటుంది. ఇంక ఆ కోడలు కూడా అంతే! ఆవిడ మంచితనానికి ఏమాత్రమూ తీసిపోదు.

అపోహల పాలు, అపవాదుల పాలు

మనిషి కంటే ముందు మారుపేరు చేరు

అత్తరికం కాదు, అమ్మరికమే దానికి మారు

తెచ్చును, అమ్మే కాదు, అత్త కూడా కావాలన్న పేరు

 

వీరిద్దరి మధ్య సహజంగా అత్తాకోడళ్ల మధ్య వుండే కస్సుబుస్సులు, చిటపటలు, చిర్రుబుర్రులు, ఏవీ వుండవు. ఈ అత్తగారికి కోడలంటే అలవిమాలిన ప్రేమ. ముద్దు, మురిపెం కూడాను. ఇంక ఆ కోడలు కూడా ఏమీ తీసిపోలేదు. అత్తగారి అడుగులకి మడుగులు ఒత్తుతూ, ఎంతో అణకువతో, ఆవిడ కనుసన్నలలో మసలుతూ, తలలో నాలిక లాగా వుంటుంది. వీరిద్దరి మధ్యా ఎటువంటి స్పర్థలు, పోటీలు, పొరపొచ్చాలు లేవు. ఇద్దరిలోను ఎంతో ఒద్దికా, పొందికాను. ఇంట్లో పెత్తనమంతా అత్తగారిదే. ఎంతో అణకువ, వినయవిధేయతలతో దానిని అమలు జరిపే ఒక నమ్మకమైన ప్రతినిధి మాత్రమే ఆ కోడలు.  

 

వీరిద్దరి మధ్య జరిగే రకరకాల సంఘటనల కూర్పిడే ఈ భానుమతిగారి అత్తగారి కథలు. ఇవన్నీ మనందరి మధ్య జరిగే సంఘటనలే కాబట్టి మనకి ఏవో కథలు చదువుతున్నట్లు అనిపించదు. ఆ సంఘటనలలో మనం జీవిస్తాం, అవన్నీ మనం కూడా అనుభవిస్తాం. అందుకే ఈ అత్తగారు ఎంతో సహజంగా, వాస్తవికత వుట్టిపడుతూ మన కళ్ళముందు ఒక సజీవ మూర్తి లాగా నిలుస్తారు. మనందరికీ ఎంతో వున్నతమైన వినోదాన్ని అందిస్తారు.  

 

ఈ అత్తగారిలోని పెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఈవిడలో పరస్పర విరుద్ధమైన గుణాలను చూస్తుంటాం మనం. అంటే, తెలివితేటలు, తెలివితక్కువతనం, అమాయకత్వం, గడసరితనం, అన్నీ తెలియటం, మళ్ళీ ఏమీ తెలియకపోవటం, ఇలా అన్నమాట. ఉదాహరణకి ఈవిడ చాలా అమాయకురాలు. అసలు ఆ అమాయకత్వం వల్లనే ఏ పని చేసినా అది తలక్రిందులయిపోయి, మనకి నవ్వుని కలిగిస్తూవుంటుంది. మళ్ళీ చాలా గడసరి కూడానండోయ్. ఆ హరిహరాదులు దిగి వచ్చినా సరే, తన మాటే నెగ్గించుకొంటుంది.

 

దొంగలంటే నాపరాళ్ళలాగా, నల్లగా, పట్టుకుంటే చిక్కకుండా జారిపోయి పారిపోయేందుకు వీలుగా ఒంటినిండా నూనె రాసుకుని వుంటారు అని ఆవిడ అభిప్రాయం. అలాగే ఎవరో నక్సలైట్లు పోలీసు కష్టడీ లోంచి తప్పించుకున్నారని, వాళ్ళు తెల్ల దుస్తులు, నల్ల కళ్ళజోడు పెట్టుకున్నారని తెలిసి, ఇంక వాటితో ఎవరు కనిపించినా వారు నక్సలైటులే అని అనుమానపడుతుంది. ఆ అమాయకత్వంలోనే అసలు నక్సలైట్లకి ఆశ్రయం ఇచ్చి, మారువేషాల్లో వున్న పోలీసులని నక్సలైట్లని అనుమానపడుతుంది.   

 

సినిమా పోస్టర్లమీద ముఖాలు కనిపించకుండా ముద్దలు ముద్దలుగా వుంటే అదేదో కొత్త తరహా పోస్టర్లు చేస్తున్నారేమో అనుకుంటుంది అమాయకంగా.  కానీ అసలు విషయం తెలిసిన తర్వాత మాత్రం ఇదేమిట్రా, ఇదేమన్నా పేడ హోలీనా అంటూ గదమాయిస్తుంది వాళ్ళని. ఒక చిరిగిన మడి చీర, ఏవో రెండు, మూడు జాకెట్లు స్టీలు సామానువాడికి ఇచ్చి, కూర, పప్పు, పులుసు, పాయసం వంటి రకరకాల వంటపదార్ధాల కోసం గిన్నెలని ఇవ్వమంటుంది ఆ గడసరి అత్తగారు ఎంతో అమాయకంగా.

 

అస్థిపంజరాలని చూసి ముందు భయపడినా, స్మశానాల్లో అలాంటి అస్థిపంజరాలని చూసే వేమనగారు యోగి అయ్యారని, అసలు మనందరిలోనూ అలాంటి అస్థిపంజరమే వుంటుందని, దాన్ని చూసి భయపడకుండా దాన్ని గురించి అన్ని విషయాలు చక్కగా విపులంగా తెలుసుకుంటే మానవసేవ చేయగలమని హరికథా భాగవతార్ చెప్తే విని తెలివిగా వెంటనే తన భయాన్ని తరిమేస్తుంది.

 

అలాగే పళ్ళు కట్టించుకుందామనుకుంటే ఒక్కొక్క పంటికి పది రూపాయల చొప్పున మొత్తం పళ్ళన్నిటికీ చాలా ఖర్చు అవుతుందని, ఏదో, ముందు, వెనక, అటువైపు, ఇటువైపు, ఏవో, మొత్తం 14 పళ్లతో సరిపెట్టేసుకుందామని, ఎలాగూ ఇంత ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఏదో, కాస్త వెడల్పాటి పళ్ళు కట్టించేసుకుంటే చోటు కూడా కలిసొస్తుందని, డబ్బు ఆదా అవుతుందని పాపం, చాలా తాపత్రయపడుతుంది. అమాయకత్వం, గడసరితనం కలబోసుకోవటం అంటే అదే మరి. కానీ తీరా పళ్ళు కట్టించుకున్నతర్వాత మడినీళ్ళు తోడుకుంటున్నప్పుడు అవి నూతిలో పడిపోతే ఇహ ఆవిడ పడ్డ బాధ అంతా ఇంతా కాదు. అలాగే అవి దొరికినపుడు పొందిన ఆనందం కూడా తక్కువేమి కాదు. 

 

ఇలాగే ఆవిడలోని ఇంకో విరుద్ధమైన గుణం ఏమిటంటే ఆవిడకి మహా చాదస్తం. దానికి తోడు విపరీతమైన మూఢనమ్మకాలు కూడాను. కానీ వాటికి సమానంగా ఆవిడ ఆలోచనలు కూడా ఎప్పుడూ చాలా ప్రగతిపథంలో నడుస్తూ వుంటాయి. అందుకే తన చాదస్తం వలన ముదుకు అడుగేయలేక ఆవిడ ఎప్పుడూ వెనుక పడలేదు. మడి కట్టుకొని, పూజ, పునస్కారాలు పూర్తిచేస్తే కానీ ఆవిడ భోజనం కూడా చేయదు. అలా అని అర్థం లేని ఆచారాలని ఆవిడ అనుసరించదు. అతి ఆచారం అనవసరం అంటుంది ఆవిడ. 

 

శుక్రవారం నాడు తక్కువ కులంవాడెవడో అన్నం అండా ముట్టుకున్నాడని, అది అనాచారమని, ఆ అన్నం పారేయకుండా, దాంట్లో కాస్త తులసి తీర్థం పోస్తే చాలు, శుద్ధి అయిపోతుంది అని చాలా సునాయాసంగా అతి సులువైన చిట్కాను చెప్పేస్తుంది ఆవిడ. కర్ర విరగకుండా పాముని చంపటం అంటే ఇదే కదూ!  

 

అలాగే వృద్ధాప్యంలో తనకి లంకెబిందెలు దొరుకుతాయని ఎవరో జోస్యం చెప్తే అది నిజమని నమ్మి, పాపం, వాటిని పొందటం కోసం ఆవిడ నానా తిప్పలు పడుతుంది. చివరికి ఆ లంకెబిందెలేవీ లేవని, ఆ జోస్యం తప్పని తెలిసినపుడు తన తెలివితక్కువతనానికి, పాపం, నిజంగా, మనస్ఫూర్తిగా బాధపడుతుంది.

 

ఇంకో విషయం ఏమిటంటే ఈవిడ అన్నీ తనకు బలే బాగా తెలుసని అనుకుంటుంది. కానీ చాలా విషయాలు ఆవిడకేమి అసలు తెలీదు. జపాను ఎక్కడ వుందో నాకు తేలికపోవటమేమిటి? ఢిల్లీ పక్కనేగా, అనుకుని అక్కడకు వెళ్ళటానికి మడి బట్టలు, మడి వంటసామగ్రి, మడిగా ఒక మడి గోనెసంచిలో కట్టుకుని సిద్ధం అవుతుంది జపాను వెళ్ళటానికి. ఆవకాయ పెట్టడం, నిమ్మకాయ పెట్టడం లాగానే, తేడా ఏముంది అంటుంది ధీమాగా. ఆవిడ చేసిన వడియమొకటి తగిలి ఒక పిల్లవాడి కణత చిల్లు పడి, రక్తం వచ్చినా కూడా ఆవిడ మాత్రం తనకు వడియాలు పెట్టడం రాదు అని ససేమిరా ఒప్పుకోనూలేదు, అవి పెట్టడం మానుకోనూలేదు.     

 

అలాగే ఎలక్షన్లు జరిగినప్పుడు రాట్నం అంటే ఇష్టమని రాట్నానికి, మనింట్లో ఆవు, దూడ లాగా వున్నాయని ఆవు, దూడలకి, సాక్షాత్తు ప్రత్యక్ష దైవమని సూర్యుడికి, ఎవరో పెద్దాయన ప్రాధేయపడ్డారు, అచ్చం ధ్రువ నక్షత్రం లాగా వుందట అని నక్షత్రానికి, ఇలా అన్ని గుర్తుల మీదా ముద్రలు వేసేసి, ఓటు అందరికీ వేసేసి, అందరినీ పక్షపాతం లేకుండా సరిసమానంగా చూసానని సంబరపడిపోతుంది ఆ వెర్రావిడ. కానీ దాని వలన ఆవిడ ఓటు అసలు లెక్కలోకే రాదనీ, ఆ అర్హతను పోగొట్టుకొందని ఆవిడకు అసలు తెలీనే తెలీదు.

 

ఇలాంటి పసిపాపలాంటి అమాయకత్వం, స్వచ్ఛత, నిజాయితీ, వాస్తవికత, ఏమాత్రం కల్తీ లేని ప్రేమ, ఇవన్నీ కలబోసుకున్న అత్తగారిని సృష్టించిన భానుమతిగారి ప్రతిభకు, తెలివికి, చాకచక్యానికి నా జోహార్లు. ఆమె అత్యున్నతమైన నటిగా, అలాగే ఒక ఉత్కృష్టమైన గాయనిగా మన మనస్సులో శాశ్వతంగా నిలిచిపోయారు. కానీ ఒక ఉత్తమ రచయిత్రిగా కూడా ఆమె పెద్ద స్థానాన్ని పొందటానికి ఈ అత్తగారే కారణం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని కూడా ఆవిడకి ఈ అత్తగారే సంపాదించిపెట్టారు. 

 

మనందరికీ తెలుసు, నవరసాల్లోనూ హాస్యరసం పోషించటం చాలా కష్టం. నటనైనా సరే, రచనలైనాసరే, తక్కువైతే నవ్వు రాదు, ఎక్కువైతే వెగటనిపించి, అపహాస్యం పాలవుతుంది. ఇటు తక్కువ, అటు ఎక్కువ కాకుండా సరిగ్గా సమపాళ్లలో వున్నప్పుడే ఆ హాస్యం పండుతుంది. అలాంటి అత్యున్నత స్థాయిలో వున్న హాస్యాన్ని మనందరికీ పుష్కలంగా పంచారు భానుమతిగారి ఈ అత్తగారు. ఈవిడ హాస్యం వెకిలిగా కాకుండా అతి సున్నితంగా మన మనసులని తాకి, మనకి మధురంగా గిలిగింతలు పెడుతుంది. మునిమాణిక్యంగారి కాంతంలాగా, చిలకమర్తివారి గణపతిలాగా, గురజాడవారి గిరీశం, బుచ్చమ్మ లాగా, భానుమతిగారి అత్తగారు కూడా ఆధునిక సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే అతి కొద్ది పాత్రాల్లో ఒకరు. ఇలాంటి అత్తగారిని సృష్టించి భానుమతిగారు తన బహుముఖ ప్రజ్ఞను మరోసారి నిరూపించుకున్నారు.

***