top of page
bhuvanollasam.PNG
srinivyasavani.PNG

సంపుటి  6   సంచిక  1

Website Published &  Maintained by  Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.

కథా​ మధురాలు

నేనేం చెయ్యాలి చెప్పండి!

 

తమిళ మూలం: జయకాంతన్

అనువాదం : రంగన్ సుందరేశన్

Rangan Sudareshan.jpg

1969 లో ప్రఖ్యాత తమిళ పత్రిక "ఆనంద వికటన్" లో తొలిసారి ముద్రితమైన ఈ తమిళ మూలకథని రచయిత జయకాంతన్ గారు లాటరీ వ్యవస్థ మీద తన నిరసనగా పేర్కొన్నారు.

నలభై సంవత్సరాలైపోయాయి ఈ ఇంటికి నేను కోడలుగా వచ్చి.  చేతినిండా ఒక గంప పిడతలతో నాన్నగారు నన్ను తీసుకొచ్చారు. అప్పుడు అమ్మ - అంటే మా అత్తగారు - ఉండేవారు, అత్తగారికి అత్తగారుగా, తల్లికి తల్లిగా.

కన్నతల్లితో నేనున్నది ఐదు సంవత్సరాలేకదా? ఆ తరువాత అత్తగారికి కోడలేకదా? నాన్నగారు చావడిలో నన్ను దింపేసి అక్కడే నిలబడి తువ్వాలుతో మొహం కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. నాకేం బోధపడలేదు. అప్పుడు పెరడులో నిలుచొని - అప్పుడే మొండితనం అతనిలో బాగా కనిపిస్తోంది - నాలికని బయటకి తీసి, చేతివేళ్ళని తెంచుతూ, ఆ పచ్చి ఇటిక నేలమీద బొంగరం వదలుతానని హఠం చేస్తున్న అతనే నా భర్త అని తెలియడానికి చాలా రోజులు పట్టాయి. ఐతే, దానికోసం అతను నా తలమీద కొట్టాలా? నేనుకూడా ‘సరేరా’ అని ఒకసారి బాగా వాయించాను. వంటగదిలోనున్న మా అత్తగారు పరుగెత్తుకొని వచ్చారు.  “ఐయయ్యో, ఏమిటే ఇది? వాడు వీడు అంటున్నావు. ”మరి వాడెందుకు నన్ను కొట్టాలి?” ఆవిడకి ఒకటే నవ్వు. నన్ను కౌగిలించుకొని మా బంధుత్వం ఏమిటో వివరించి చెప్పారు. అన్ని సంగతులూ బోధపడే కాలం వస్తే అవే బోధపడతాయి. ఆలోచించిచూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది.  నాకు మావారిమీద ఎందుకు ఇంత భయం వచ్చింది? భయం అంటే అది ఒక సంతోషమైన భయం. మర్యాదతో వచ్చే భయం. భయం అని కూడా అనలేం, అది ఒకవిధమైన భక్తి. ఎలాగో వచ్చేసింది.  నలభై సంవత్సరాలుకి పైగా ఐపోయింది.  

‘ఇతన్ని పెళ్ళిచేసుకొని నేనేం సుఖపడ్డాను? నాకు ఇది ఉందా? అది ఉందా?’ అని వాపోతూ ఎంతమంది ఉన్నారు! అస్తమానం - ఈ చెరువుగట్టునుంచి ఆ కోవెల ప్రాకారం పరకూ మొరబెట్టుకొని తిరిగే వీళ్ళందరూ ఏం మనుషులో అమ్మా!

నాకెటువంటి కొరతా లేదు. అవును.  కావాలంటే ఏ కోవెలలోనైనా మడి కట్టుకొని ఖచ్చితంగా చెప్తాను: నాకు ఎటువంటి కొరతా లేదు. ఐతే చూసినవాళ్ళు అంటారు, నాకు పిల్లలు లేరనే సంగతి పెద్దగా చెప్తారు, చెప్తున్నారు. నేను కూడా విన్నాను, ఎందుకు అబద్ధం చెప్పాలి? ఒకప్పుడు నేను కూడా దాని గురించి బాధపడేదాన్ని, కాని అది ఎంత అజ్ఞానమని అర్ధం చేసుకున్నాను. నేనే తెలుసుకోలేదు, మావారు నాకు బోధపరిచారు. అతనికే అది సాధ్యం; నోరు తెరిచారంటే ఎక్కడనుంచి ఆ సూత్రాలన్ని చెయ్యికట్టుకొని అతనిముందు నిలబడతాయో? మన శాస్త్రాలనుంచి, వేదాలనుంచి నిదర్శనాలు చూపించి ఎటువంటి ప్రశ్న ఐనా, ఎటువంటి అజ్ఞానులు తెలుసుకోవాలన్నా, తన మాటలతోనే ఇతను వాళ్ళకి జవాబు చెప్తారు. అలాంటి వాక్చాతుర్యం.  అలాంటి జ్ఞానం.  అది అతనికే సాధ్యం.  ఎమో మావారి గురించి నేనేమో గొప్పగా పొగడుతున్నానని అనుకోకండి.  అతన్ని పొగడడానికి తగిన జ్ఞానం నాకు లేదు.  అటువంటి విద్వాంసుడికి నాలాంటి నిరక్షరకుక్షి భార్యగా వచ్చి చేరాను చూసారా? నేను దీనిగురించి అతనికి చెప్పాను, అతనొక ప్రసంగమే చేసేసారు.  అతనికి నేను భార్యగావుండడం ఎంత ఉచితమని, అతనికి నావల్ల ఎంత సంతోషమో అని అతను నాకు చెప్పినదంతా నేను మీకు చెప్పగలనా? నేను అతనికి భార్యగా ఉండనీ, అందువలన అతన్ని పొగడడానికి నాకు అర్హతవుందని చెప్పగలమా?

మహా విద్వాంసులు శ్రీ ______________ అని చెప్తే ఈ రాజధానిలో అందరికీ తెలుసు. ఇతని ఖ్యాతి ఈ చెన్నపట్ణంనుంచి కాశీవరకూ వ్యాపించివుంది.

ఇతని దగ్గర చదువుకున్నవాళ్ళు - నాతో ఇంటిపనులు చేసినవాళ్ళు - ఎంతమంది కలెక్టరులుగాను, పెద్ద పెద్ద పనుల్లోనూ ఉన్నారు తెలుసా?

మనమే కని, మనమే పెంచి, పిల్లి, కుక్కల్లా జీవించాలా ఏమిటి?

ఇదిగో, ఇప్పుడు కూడా ఈ శంకరమఠం వాసరాలో పిల్లల్ని వరుసగా ఎదుట కూర్చోపెట్టుకొని ఇతను వాళ్ళకి విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇతని నాభినుంచి వెలువడే ఆ గంభీరమైన ధ్వని వింటే నా దేహం పులకరిస్తోంది! ఆ తరువాత ఆ పిల్లలందరూ సమశృతితో వల్లిస్తుంటే.  ఆ పిల్లలు అంత శ్రద్ధతో, భక్తితో, మృదువైన కంఠంతో, అతనిలాగే చెప్పాలని ప్రయత్నించి ఆ గాంభీర్యం లేక ఆ స్థాయిని మాత్రం అందుకోవాలని కడుపు కట్టుకొని, ఛాతీమీద చేతులువేసి ఉచ్చారణ చేస్తున్నారే.  అది చెవిలో పడితే నాకు కడుపులో ఏ మాయో చేస్తుంది.  ఇదేం కన్నవాళ్ళకి మాత్రం ఏర్పడుతుందా?

ఇతను అనేవారు: ‘పిల్లల్ని కనడం ఏం పెద్దపని కాదు; వాళ్ళ కడుపు నింపడం ఏం పెద్దపని కాదు; పాండిత్యం, శీలం ఇచ్చి, ఒక పిల్లవాడిని జ్ఞానవంతుడిగా చేయడమే ఒక పెద్ద పని. మనందరం సాధారణ పిల్లల్ని కన్నవాళ్ళం అనే పేరుకంటే ఇటువంటి జ్ఞానవంతులని ఉత్పత్తి చేసేవాళ్ళం అనే పేరే శ్రేష్టమైనది.’ ఇంకా ఏమేమో చెప్తారు, నాకు అవన్నీ తిరిగిచెప్పడం చేతకాదు. కాని అతను చెప్పేది ఎంత సత్యం అని నా మనసుకి అర్ధమవుతోంది. 

ఇతని దగ్గర చదువుకొని ఇప్పుడు చెన్నపట్నంలో ఏదో కాలేజీలో సంస్కృత ప్రొఫెసరుగా ఉన్నాడే చీమాచ్చు -వాడికి ఇప్పుడు పండితులు శ్రీనివాస శాస్త్రి అని పేరట! వినడానికి ఎంద ఇంపుగా ఉంది! కంటేనా? కన్న తల్లి ఈ ఊరులోనేవుంది.  తన కొడుకు తనను సరిగ్గా చూడటంలేదని నిత్యమూ శపిస్తోంది.  

మావారు ఒక్కొక్క సంగతి చెప్తున్నప్పుడు చమత్కారంగా వాదిస్తున్నట్టు అనిపిస్తుంది. ఐతే, గభీమని, అవాళ అతను ఎంత చక్కగా, ఉచితంగా చెప్పారన్నట్లు ఒక్కొక్క సంఘటన జరుగుతుంది. 

ఆరోజు కోవెలకి వెళ్ళి వచ్చే దారిలో చీమాచ్చు తల్లి నన్ను ఆపి చీమాచ్చు తన్ను తిరిగికూడా చూడకుండా తన అత్తగారింటికి వెళ్ళిపోయాడని, వాడిని పెంచి, చదివించడానికి తను పడిన కష్టాలని కృతజ్ఞత లేకుండా మరిచిపోయాడని, ఏడుస్తూ వాడిని శపించుతూంటే నాకు అనిపించింది: ‘ఇలాగ కనడం ఎందుకు? శపించడం ఎందుకు?’ ఏమో ఆవిడకి సమాధానంగా నా తల ఊపాను కాని నాకంతా అర్ధమైంది:  ఈ ముసలమ్మకి ఒకటే అసూయ! ఆవిడకి ఇక్కడ ఎటువంటి కొరతా లేదు, సౌఖ్యంగానేవుంది.  కాని తను కన్న కొడుకు మూలంగా తక్కినవాళ్లు సుఖపడుతున్నారనే కోపమే ఈవిడ మనసుని బాధిస్తోంది.  బాధ్యత కోరేవారు ఎందుకు మమకారం చూపలేక పోతున్నారు? 

అన్నీ ఇతను చెప్తేనే నాకు బోధపడతాయి. లేకపోతే నేనుకూడా ఆ ముసలమ్మతో కలిసి ఆ చీమాచ్చుమీద ఒక పాట పాడి ఉంటాను.

  

ఇతను అన్ని విషయాలూ ఎంత కరాఖండిగా, దీర్ఘంగా విమర్శిస్తున్నారు! అందువలన తనకి నష్టమా, లాభమా అని కొంచెంకూడా ఆలోచించరు. ఎంతమంది తనతో ఒప్పుకుంటారు లేక ఒప్పుకోరు అనే విచారం అతనికి లేదు. అతని వాదానికి సరిరాని ఒక పనిని ఈ ప్రపంచమే అతని నెత్తిపై రుద్దుతే దాన్ని అలాగే తోసి పారేస్తారు. ఆ తరువాత తను అలా నిరాకరించడం ఎంత న్యాయమని ఈ ప్రపంచాన్నే లాగి పక్కన పెట్టుకొని వాదించడానికి సిద్ధమౌతారు. నేనూ ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నానుగా.  ఒక్కరైనా సరే ‘అదేమో స్వామి, మీరు చెప్పేది సరిగ్గా లేదు’ అని ఇంతవరకూ అనలేదు.  

వాళ్ళందరితో వసారాలో కూర్చొని ఇతను మాటాడుతుంటే నేను ఇతని వీపు వెనుక ఇంకొక గదిలోనుంచి వింటూవుంటాను. ఆతను చెప్పే చాలా మాటలు నాకు అర్ధం కావు. ఇతను ఎలా ఇంగ్లీషు మాటాడుతున్నారు! నాకు తెలిసి ఇతను తన ఇరవై వయస్సులో ఇంగ్లీషు చదివారు. ఒకతనికి ఇతను సంస్కృత పాఠాలు నేర్పిస్తూ - అతనికి మావారికంటే వయసు కొంచెం ఎక్కువ -అతని దగ్గర ఇంగ్లీషు నేర్చుకున్నారు. ఇక్కడనుంచి కుంబకోణం వెళ్ళి ఏవేవో పరీక్షలుకూడా రాసారు. 

ఇప్పుడు ఇతను రాసిన పుస్తకాలు అక్కడ విద్యార్ధులకి పాఠపుస్తకాలుగా ఉన్నాయట.

పది సంవత్సరాలముందు కాశీలో ఏదో ఒక సదస్సుకి ఇతను వెళ్ళినప్పుడు నేనుకూడా వెళ్ళాను. ఇతన్ని గౌరవించి ఏమేమో బిరుదులు ఇచ్చారు. అదిచూసి నేను గర్వపడ్డాను; ఒక వెండి బిందెలో గంగా జలం తీసుకొనివచ్చి ఊరిలో అందరికీ పంచాను. నాకేం తక్కువ? 

అప్పుడే కాశీనుంచి తిరిగివచ్చేటప్పుడు మేం చెన్నపట్నంలో చీమాచ్చు ఇంటిలో కొన్నిరోజులు గడిపాం. వాడు తన పెద్ద కారులో మమ్మల్ని రైల్ స్టేషన్ లో వచ్చి చూసాడు; మమ్మల్ని ప్లేట్ ఫారంలో నిలబెట్టి నమస్కారం చేసాడు; చెన్నపట్నంలో కారు లేకుండా ఏమీ వీలవదట. అప్పుడుకూడా ముందులాగే మావారి ఎదుట చేతులు కట్టుకొని మర్యాదగా ఏమేమో ప్రశ్నలు అడిగితే ఇతను బోధపరిచారు. కాని వాడిని కాలేజీకి బయలుదేరినప్పుడు చూస్తే నాకే భయం వేసింది. దొరలాగ ఏమేమో తొడుక్కున్నాడు; ఇతనేమో వాడినిచూసి హోరున నవ్వారు. 

తరువాత ఒకరోజు మా ఇంటిముందు ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఎవరెవరో పెద్దమనుషులు - చీమాచ్చు ప్రొఫెసరుగా ఉన్నాడే ఆ కాలేజీలో పనిచేసేవారు - అందరూ వచ్చి మా ఇంటి వసారాలో కూర్చున్నారు. చీమాచ్చు మాత్రం తన సొంతయిల్లులాగ వంటగది వరకూ వచ్చేసాడు. నేను వాడిని “నువ్వెందుకు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మీ అమ్మని చూసుకోకూడదు?” అని అడిగాను. “అదేం నాకు చేతకాదు. ‘నాతో వచ్చేయ్’ అని అంటే అమ్మ వినదు” అని విచారంతో అన్నాడు; ఆ తరువాత తను వచ్చిన పనిగురించి చెప్పాడు:

వీడు పనిచేస్తున్న ఆ కాలేజీలో మావారిని పెద్ద ఉద్యోగంలో నియమించడానికి అక్కడ తపస్సు చేస్తున్నారట; కాని ఇతన్ని నేరుగా అడగడానికి వాళ్ళకి భయం. ‘సరే, నేను మాటాడి అతను ఒప్పుకున్నట్లు చేస్తాను’ అని ధైర్యం చెప్పి చీమాచ్చు ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చాడట.  ఇంకా ఏమేమో చెప్పాడు.  నాకు కూడా మావారు ఒప్పుకుంటారేమో అని ఒక ఆశ.  

ఇతను రాగానే అందరూ వసారాలో కూర్చొని మాటాడారు, మాటాడారు, అలాగ మాటాడారు. నేను గదిలోనుంచి వింటూనేవున్నాను. ఇతను చెప్పేది నాకు బోధపడలేదు. కాని ఒకటి అర్ధమైంది. ఇతనిదగ్గర వాళ్ళ పప్పు ఉడకలేదు.  

ఆఖరికి వాళ్ళందరూ వెళ్ళిన తరవాత నేను మావారిని అడిగాను: “మీరు ఈ ఉద్యోగంకి ఎందుకు సమ్మతించకూడదు? అక్కడ చదివేవారూ విద్యార్ధులేకదా? మీకెందుకీ మొండితనం? పాపం.  చీమాచ్చు చాలా ఆశతో, నమ్మకంతో వచ్చాడు!” 

నా మాటలు విని ఇతను నవ్వారు.

ఈ నవ్వు ఇతనికి పుట్టుకతో వచ్చినది; అందులోనూ నా దగ్గరే ఆ నవ్వు.

ఇతను నవ్వుతూ చెప్పారు. 

“చీమాచ్చులాగ నేను కూడా వేషాలు వేసుకొని తిరగాలని నీకు ఆశగావుందా? నీకు తెలియదూ విద్యాభ్యాసం చేసేవాళ్ళు జీతం పుచ్చుకోకూడదని? పాఠం చెప్పేవాడికి కూలీ ఇచ్చిన తరువాత శిష్యుడికి అతనిమీద ఎలాగ మర్యాద ఉంటుంది? ఆ గురువు కూడా కూలీకోసం పనిచేసే మనిషైపోతాడు.  అంతేకాదు; ఒక జండా పట్టుకొని, గోల పెట్టడానికి నన్ను పిలవకపోయినా, నన్ను ఆ గుంపుకి ఒక నాయకుడుగా ఉండమంటారు.  నేనలాగ ఉండగలనా, నువ్వే చెప్పు. ” 

నేనేం చెప్పను? ఏమీ అనకుండా అతను చెప్పేది నోరుమూసుకొని విన్నాను.

నా ఊహలో అతను ఒక చొక్కా తొడుక్కొని  నిలబడితేనే నాకు నవ్వు వస్తోంది! ఆ ఆలోచనే అర్ధంలేకుండా ఉందికదా? నేనుకూడా ఇతనితోపాటు నవ్వేసి ఆ సంగతి వెంటనే మరిచిపోయాను.

ఇతనిగురించి ఇంత తెలిసికూడా అవాళ అతన్నిఅలాగ అడిగినందుకు నేను సిగ్గు పడ్డాను; అవును, ఈ నలభై సంవత్సరాలూ నేను జడ్డిగానే ఉన్నాను.  అప్పుడప్పుడు ఏమైనా ఒక పిచ్చిపని చెయ్యడం.  అదిచూసి ఇతను నవ్వడం.  నా జన్మ ఇలాగే ఐపోయింది.  

చూడండి.  పదిరోజులముందు – ఇలాగే.  ఇతనిదగ్గర చదువుకుంటున్న ఒక అబ్బాయి ఒక చీటీని నాదగ్గర తీసుకొని వచ్చాడు. “ఏమండీ, ఇది గవర్నమెంటు నడిపే లాటరీ పోటి.  ఒక రూపాయి మాత్రమే.  ఇది దొరకడం కష్టం, నేను మీకోసం కొని తీసుకొని వచ్చాను” అని చెప్పాడు. నేనుకూడా ఏమీ ఆలోచించక ‘పాపం, అబ్బాయి మనకోసం శ్రద్ధగా తెచ్చాడుకదా?’ అని ఒక రూపాయి ఇచ్చి దాన్ని పుచ్చుకున్నాను. 

ఆ అబ్బాయి దాని గురించి ఒక ప్రసంగమే చేసేసాడు; చాలామంది ఆ లాటరీ పోటీలో గెలిచి లక్షాధిపతులుగా మారిపోయారట. అందులో పేదవాళ్ళే గెలుస్తున్నారట. ఇంకా ఏమేమో చెప్పాడు. నేను ఊరికే తమాషా కోసం కొన్నాను. కాని ఆ సాయంకాలమే మావారు వసారాలో ఐదుగురో, ఆరుగురో మధ్య కూర్చొని ఆ లాటరీని ఖండించడం విని నేను ఉలికిపడ్డాను. 

గదిలోనుంచి ఇతని మాటలు వింటూంటే నాకు అలాగే నా రెండు బుగ్గలమీద ఎవరో బాగా వాయించినట్టనిపించింది. 

అందులోనూ అవాళ ఇతను మాట్లాడడం మామూలుగా ఇతను నిదానంగా వాదం చేసేలాగ లేదు. ఈ ప్రపంచాన్నే శపిస్తున్నట్లు ఇతను ఆవేశంతో అరిచారు:

“ఈ దేశంలో ఇది జరగవచ్చా? జూదరి జూదం ఆడనీ, రంకుతనం చేసేవాళ్ళు రంకుతనం చెయ్యనీ.  కాని రాజరికం చేసేవారూ, రాజ్యమేలేవారూ ఇలా చెయ్యవచ్చా? ఈ కలియుగంలో మనం నాశమవడానికి ఇదే నిదర్శనం! నీతి తప్పకుండా పరిపాలన చేసిన ఆ ధర్మరాజు ఎలాగ నాశమయ్యాడు? బాగా ఆలోచించండి.  ధర్మరాజే జూదంవలన నాశమైపోయాడు. ‘జూదంలో గెలిచినా, ఓడిపోయినా, వాళ్ళ జీవితాలు వృధా!’ అనే సత్యాన్నేకదా మహాభారతం మనకి చెప్తోంది? జూదంలోనూ ఒక ధర్మం ఉంది, వినండి; సమ అంతస్తులో ఉన్నవాళ్ళే జూదమాడవచ్చు. అదీ ఒక పాపమే, కాని ఆ పాపానికి ఒక హద్దు ఉంది. రాజరికం చేసేవారూ, రాజ్యపరిపాలనకి బాధ్యత కలవారూ పామరజనులని ఇటువంటి మాయాజాలం చేసి జూదం ఆడుతున్నారే, ఇది న్యాయమేనా? అంతే, ఇక ప్రజల మధ్య ఎటువంటి వ్యవస్థా ఉండదు! ఇక దారిద్ర్యం వలన నాశమవడానికి బదులు జూదం మూలంగా ప్రజలు నాశమవుతారు!.  తిరువళ్ళువర్ పేరులో వీధికి వీధికి శిలలు పెట్టి ప్రతిష్ట చేస్తే సరిపోతుందా? అతనే జూదంగురించి రాసివున్నారే?” అని అంటూ ఇతను ఆ పది పద్యాలని వల్లించి అర్ధంకూడా చెప్పారు; మహాభారతంనుంచికూడా శ్లోకాలు చదివారు. “ఖర్మ, ఖర్మ,.  ఇక మీ బ్రతుకు అంతే!” అని నెత్తిమీద  కొట్టుకున్నారు. 

నాకు కడుపులో తిప్పినట్టుగా అనిపించింది. ఎందుకురా ఈ వెధవ లాటరీ టికెట్టు కొన్నానని వాపోయాను. ఐనాకూడా ఇతను ఎందుకు ఇంత ఆవేశంగా దీన్నిగురించి వాదిస్తున్నారని నాకు బోధపడలేదు; ఇతను చొక్కా తొడుక్కోరు; అందువలన ఈ ప్రపంచంలో అందరూ ఇతనిలాగే చొక్కా లేకుండా, పిలకతో, పంచాంగం చూసే క్షవరం చేసుకోవాలని ఇతను వాదిస్తారా?నేను చేసిన పనికి నేనుకూడా సరైన వాదం నా మనసులో తయారుచేసుకున్నాను. 

ఆ చీటీని పుచ్చుకొని ఇప్పుడు నాదగ్గర అదివుంటే దానివలన ఏం కష్టం? కాని మన దురదృష్టం వలన మనకి ఒక నూరు రూపాయలు వస్తే.  అది ఊరంతా తెలియదూ?

అంతేకాదు. ఇతను ఇలాగ మాటాడుతుంటే నేను లాటరీ టికెట్టు కొన్నది తెలుస్తే అందరూ మావారి చిత్తశుద్ధిని అనుమానించరూ? అప్పుడు నేనేం చేస్తాను?

ఆ అబ్బాయి - నాకు చీటీ ఇచ్చినవాడు - చెప్పాడు. పత్రికలవాళ్లు, ఫోటోగ్రాఫర్లతో ఎటువంటి గ్రామమైనా వెతికి ఆ లాటరీలో గెలిచినవారిని కనుక్కుంటారట. చెన్నపట్నంలో దీనికోసం పెద్ద ఉత్సవం జరిపి ఒక పెద్దమవిషి మూలంగా ఈ పురస్కారం ఇస్తారట. ఇదేం ఖర్మ, దేవుడా! 

‘సరే, ఏమో కొనేసాం, ఎందుకీ ఉత్త కల్పన?’ అని ఇతని దగ్గర దీనిగురించి నేను ఏమాటా అనలేదు.

కావాలనే ఒకరోజు ఇతనికి అన్నం వడ్డించినప్పుడు  నేనే ఆరంభించాను.

“అదేమిటి? ఏదో ప్రైజ్ టికెట్టు అంటున్నారు.  ఒక రూపాయి ఇచ్చి కొన్నవాళ్ళకి ఒక లక్షరూపాయలు దొరుకుతాయట. గవర్నమెంటులో ఉన్నవారే నడపడంవల్ల అందులో ఎటువంటి మోసం, దగా లేదంటున్నారు.  పక్కింటి అమ్మాయి పది టికెట్టులు ఒకేసారి కొందట.  అది.  అదేమిటి?” అని అడిగాను.

“ఈ సంగతి మన వంటగదివరకూ వచ్చేసిందన్న మాట! అది ప్రభుత్వం జరిపే జూదం! అంతే, మరేం కాదు. కలరాలాగ ప్రజలని పీడించే ఒక వ్యాధి అది. కలరా, మసూచి వంటి వ్యాధులని నివారించడానికి పనిచేసే ప్రభుత్వమే ఇదికూడ చేస్తోంది. అందువలన వాళ్ళకి డబ్బు వస్తోందట, పేదలు లక్షాధిపతులవుతున్నారట. ఎలాగో పోనీలే.  నువ్వూ, నేనూ లక్షాధిపతులవలేదని ఏడుస్తున్నామా? మనకేం దానిగురించి గొడవ?” అని అన్నారు. 

“ఎవరైనా మీదగ్గర వచ్చి లక్షరూపాయలు ఇస్తే, ‘వొద్దు!’ అని చెప్పేస్తారా?” అని అడిగాను. 

అతను నన్ను చూసి నవ్వారు; నాకు ఒకటే అవమానం; నా దేహం వొణుకుతోంది. 

‘నలభై సంవత్సరాలు నాతో కాపురం చేసిన నీకా ఇటువంటి సందేహం?’ అని అడుగుతున్నట్టుంది అతని చూపు.  నేను తల వంచుకున్నాను.

“మీరు ‘వొద్దు!’ అని చెప్తారు, అది నాకు తెలుసు.  కాని ఎందుకు అలాగ చెప్పాలి అని నేను అడుగుతున్నాను. మీ ముత్తాతలకి మాన్యంగా వచ్చిన ఈ ఇంటిలో, వర్షం వచ్చినప్పుడు పడమటి భాగం మూడు సంవత్సరాలుగా పగులు బారిన గోడలమధ్య పరదలో మునిగిపోతోందికదా - దాన్ని సరిచెయ్యడానికి దారి తెలియక మనం ఉన్నాం. మనకి డబ్బు అవశ్యకమేకదా? ‘మనం ఎందుకు అదృష్ట లక్ష్మిని నిర్లక్ష్యం చెయ్యాలి?’ అని ఆలోచిస్తున్నాను. అది తప్పంటారా?” అని అడిగాను. 

“ఓ, నువ్వు మాటాడడం చూస్తే నీకు ఆ లాటరీ టికెట్టు కొనాలని ఆశ. అవునా?”

నేను బదులు చెప్పలేదు. 

“వెర్రిదానా, ఆశ మానవునికి శత్రువు. లాటరీలో మనకి బహుమానం రాదనే కారణంవలన  నేను అది తప్పు అని అనలేదు; అది అధర్మంగా చాలామంది కడుపుమంటతో సంపాదించిన డబ్బు అని అంటున్నాను. యోగ్య మార్గంలో కాకుండా వచ్చే డబ్బు పాపాలమూట కదా? నువ్వు మా ముత్తాతలగురించి చెప్పావు.  వాళ్ళందరూ ఊంఛవృత్తి చేసి మహా మేధావులుగా జీవించారు.  నాకు బాగా జ్ఞాపకముంది.  మా నాన్నగారు ఇదే శంకరమఠంలో పగలంతా పిల్లలకి విద్యాభ్యాసం చేసేవారు, సాయంకాలం కాలక్షేపం చేసేవారు, ప్రొద్దూనే ఊంఛవృత్తికి వెళ్ళేవారు.  ఇంకొక వేళకి మిగిలేటట్టు కాకుండా ఆ పాత్ర ఉంటుంది. శ్లోకాలు వల్లించుతూ వీధిలో నడుస్తారు.  ఆ ఆ ఇంట్లోనుంచి పిల్లలు తమ చేతుల్లో బియ్యం తీసుకొనివచ్చి అతనికి భిక్ష ఇస్తారు.  ఎందుకో తెలుసునా పిల్లలే భిక్ష ఇవ్వాలని నియమం పెట్టారు? పెద్దవాళ్ళ చేతులైతే ఒక నాలుగిళ్ళ తరువాత ఆ పాత్ర నిండిపోతుంది.  తక్కినవాళ్ళందరూ వాళ్ళ వాళ్ల ఇంట్లో కాచుకొని ఉంటారే? వాళ్ళ కానుకని అడ్డగించిన పాపం వచ్చేస్తుంది కదా? అందువలనే ఆ పాత్ర నిండిన తరువాత ఎవరైనా భిక్ష ఇస్తే దాన్ని తీసుకోరు.  భిక్ష ఇచ్చినవారిమీద అందులోనుంచి రెండు మూడు అక్షింతలు తీసి వాళ్ళ తలమీద పోసి ఆశీర్వాదం చెస్తారు.  ఆ వంశంలో పుట్టిన పుణ్యం వలనే నాకు ఈ జ్ఞానం వచ్చింది.  ఇంతకంటే మరే అదృష్టం కావాలని నాకు తెలియదు. ఈ నెమ్మదిని, ఆరోగ్యవంతమైన మనసుని ఎన్ని లక్షలు ఇవ్వగలవు? జూదం మూలంగా, డబ్బు ద్వారా ఈ ప్రభుత్వం లక్షాధిపతులని ఉత్పత్తి చేయవచ్చు కాని ఒక జ్ఞానవంతుడినీ, ఒక చదుర్వేద పండితుడనీ వీళ్ళు ఇవ్వగలరా?” అని రోజంతా నా దగ్గర మాటాడారు.  

ఇదంతా జరిగి పదిరోజులైపోయాయి. నేను చీటీగురించి పూర్తిగా మరిచిపోయాను.

నిన్న, ఆ పిల్లవాడు - నాకు ఆరోజు టికెట్టు అమ్మిన అబ్బాయి - ఒక పేపరుని తీసుకొని వచ్చి  “ఇందులో గెలిచినవాళ్ల నంబర్లు వచ్చాయి.  మీ టికెట్టు తీసుకురండి. చూద్దాం.” అని ఉత్సాహంతో అరుచుకుంటూ వచ్చాడు. మంచి వేళ! ఇతను అప్పుడు ఇంట్లో లేరు.  

నాకు కడుపులో తిప్పినట్టుగా అయింది. ‘దేవుడా, నన్ను కాపాడు!’ అని నేను ప్రార్ధించడంతో ఒక యుక్తి తోచింది.

“దాన్ని ఎక్కడపెట్టానో జ్ఞాపకం లేదురా,” అని వాడితో ఒక అబద్ధం చెప్పేసాను. ఆ నంబరుకి ఏమైనా బహుమానం వస్తే ఈ ఊరులో అందరూ గుంపుగా మా యింటిముందు పుంజుకోరూ?

ఆ పిల్లవాడి మొహం అలాగే వాడిపోయింది. వాడు కోపంతో నన్ను చూస్తున్నట్టు ఆ పేపరుని పడేసి వెళ్ళిపోయాడు.

వాడు వెళ్ళిన తరువాత నేను ఆ పేపరుని తీసుకొని నా గదికి వెళ్ళి ఒంటరిగా దాన్ని చూసాను.

నాకు చదవడం తెలియదుగాని సంఖ్యలు అర్ధమౌతాయి. సంఖ్యలముందు ఏవో అక్షరాలున్నాయి; అవేమో నాకు తెలియదు. కాని అదేలాగ నా చీటీలోవుందా అని వెదికిచూసాను.

దేవుడా! మొట్టమొదటే అదేలాగ రెండు అక్షరాలు! తరువాత అదేలాగ . . .  మూడూ, ఏడు, సున్నా, ఒకటి, ఒకటి, ఆరు!

అంటే.  ఆ లక్షరూపాయల బహుమానం నాకే వచ్చిందా.  అయ్యయ్యో, నేను ఇప్పుడు ఏమి చేయను?

మధ్యాహ్నం ఆయన రాగానే ఆ చీటీని తీసుకొనివెళ్ళి, అతని కాలుకిందపెట్టి “నన్ను క్షమించండి!” అని ఏడ్చాను. 

“నేనేమో ఏదో తమాషాకి ఆ అబ్బాయి అడిగాడని కొనేసాను; దీనిగురించి మీరు ఇంత కోపంగా ఉన్నారని నాకు కొన్నతరువాతే తెలిసింది. ‘ఇందులో మనకేం బహుమానం వస్తుంది?’ అని నేను అజాగ్రత్తగా ఉండిపోయాను. నాకు బహుమానం రాకూడదని దేవున్నికూడా ప్రార్ధించుకున్నాను.  మరి ఇప్పుడు ఇలా ఐపోయింది. మీరు నన్ను క్షమించి దీన్నీ, నన్నూ ఏలుకోవాలి.” అని బతిమాలాను.  

అతను మళ్ళీ నవ్వారు. నవ్వుతూనే నన్ను ఎత్తి నిలబెట్టారు. మొహంలో నవ్వు మారనేలేదు. అతను అన్నారు:

“ఏమే, నువ్వు ఇప్పుడు లక్షాధిపతి ఐపోయావ్.  శభాష్!  ఇది నాకు సంబంధం లేకుండా నువ్వే సంపాదించుకున్న ధనం; నువ్వెందుకు దీన్ని నా కాలు కిందపెట్టి ఈ పాపాన్ని నా తలలో రుద్ది నన్ను మోయమంటున్నావ్? నేను ఈ లక్షరూపాయలు వొద్దు అని చెప్పినది తమాషాకి కాదు; నిజంగానే, నాకది వొద్దు. నాకిప్పుడు ఉన్న బెంగ అంతా ఇదే: ముందులాగ కాక, అంటే ఇరవై సంవత్సరాలముందు ఉన్నట్లు, ఇప్పుడంతా వేదాభ్యాసం చేసేవాళ్ళు తగ్గుతూ వస్తున్నారు. ఇంకొక పది విద్యార్ధులు దొరికితే నాకు చాలు; వాళ్ళు డబ్బువలన రాకూడదు, డబ్బుకోసమూ రాకూడదు.  అది నీకు బోధపడదు.  సరే, అది నీ ప్రశ్న. నేనెప్పుడూ ఊంఛవృత్తి చేసి జీవించే బ్రాహ్మణున్ని. మా నాన్నగారూ, తాతగారూ, ముత్తాతలూ - అందరూ ఆ మార్గంలోనే వచ్చారు. ఒక లక్షాధిపతికి భర్తగావుండే అంతస్తు నాకు లేదు.” అని ఏమేమో అంటున్నారు ఇతను.  

“ఎందుకు మీరు మన ఇద్దరినీ ఇలా విడదీసి మాటాడుతున్నారు?  ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పండి, అది నేను తప్పక చేస్తాను.  నాకిలా జరుగుతుందని తెలియదు.  జరిగిపోయింది.  ఇక నేను ఏం చెయ్యాలి?” అని మళ్ళీ మళ్ళీ నేను అడుగుతున్నాను.  

ఎటువంటి దయా, దాక్షిణ్యం లేనట్టు అతను మళ్ళీ నవ్వుతూ చెప్పారు:

“ఈ లాటరీ టికెట్టుని ఉపయోగించుకోవాలి అని నువ్వు నిశ్చయిస్తే అది నీ ఇష్టం. తిన్నగా వెళ్ళి ఫోటో తీసుకొని పత్రికలలో అది ప్రచారమై నువ్వు హాయిగా ఉండవచ్చు. నువ్వు ఎవరి భార్యవని చెప్పకూడదు.  నీ తృప్తికోసం ఆ అబద్దం చెప్పుకొని కాలం గడుపుకో.  లేకపోతో ‘ఈ మాయ వలలో నేను చిక్కకుండా ఉంటాను!’  అని ఈ వెధవ టికెట్టుని చింపేయ్, అవును, దాన్ని చింపి పారెయ్! మరెవరికైనా ఇచ్చి దానికి వడ్డీ తీసుకొని జీవించితే అదీ పెద్ద పాపమే! పాపిష్టి మనసుకి ఇటువంటి ఆలోచనలు వస్తాయి. వాటికి బలి అవకుండా ఎటువంటి కుటిలమైన దారిలోనూ పడకుండా ఆ టికెట్టుని చింపి పారెయ్. ఈ రెండు దారులూ నీ ఇష్టం. పాపమా, భాగ్యమా అని నిర్ణయించేది నువ్వే. ఇక నేను వెళ్ళాలి ”  అని అంటూనే వెళ్తున్నారే ఇతను.  

ఇప్పుడు నేనేం చెయ్యను చెప్పండి.  దేవుడా!  ఒక లక్ష రూపాయలు! ఈ ఒక లక్ష రూపాయలని, అదృష్ట లక్ష్మిని ఎటువంటి దాక్షిణ్యం లేకుండా తోసి పారేయడం ఎలాగ? అతని చేతిలో పడితే చింపి పారేస్తారు! అది జ్ఞానులకి సులభం.

మనలాంటి అజ్ఞానులకి అది వీలవుతుందా, చెప్పండి!

ఎన్నో లక్షలకంటే ఇతను పెద్దవారే, నేను కాదనను. ఈ లక్ష రూపాయలని కాలి ధూళితో సమానంగా భావిస్తూ, ఊంఛవృత్తి చేసే ఇతనికి ఏ లోపమూ రాదు. అటువంటి మహనీయులతో సంసారం చేసి ఊంఛవృత్తి జీవితంలో పాల్గొన్న నాకుకూడా ఖ్యాతి లభిస్తుంది.  

ఏది గొప్ప - డబ్బా, జ్ఞానమా? అది నాకు తెలియదు. కాని డబ్బు ఎలాగ, ఎంతవున్నా శాశ్వతం కాదో అలాగే మానవులు కూడా.  ఎంత జ్ఞానులైనా వాళ్ళ జీవితం శాశ్వతం కాదే.  

అలాగ తలచడమే, చెప్పడమే పెద్ద పాపం. కాని ఈ రోజుల్లో ఎటువంటి పతివ్రత కూడా తన భర్తతో తనూ దహనమవడం లేదే? ఒక వేళ నేను అలాగ ఉండవలసి వస్తే? శివ శివా.  

ఇతను ఊంఛవృత్తి చేస్తే నాకేం గొప్ప? అందరూ నన్ను ఒక ముష్టిదనే అంటారు; కట్టిన భార్యని వీధుల్లో బిచ్చగత్తెగా వదిలేసారని ఈ మహా పండితుడి గురించి పోచికోలు కబుర్లు చెప్తారు.  

ఇతనైతే దీన్ని చింపి పారేస్తారు, కాని నేనలా చెయ్యగలనా? కాని, అతనలా చెప్పి వెళ్ళిపోయారు. 

 

ఇప్పుడు నేను ఆ చీటీతో నిలబడివున్నాను. ఇది నా చేతిలో బరువుగావుంది. నేనేం చెయ్యాలి చెప్పండి!

*****

bottom of page