top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి 8  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

కథా​ మధురాలు

నవరాత్రి- 2

 

గిరిజా హరి కరణం

girija hari.PNG

 

శరన్నవరాత్రి పూజలలో రెండవ దినం విదియ, కలెక్టరు గారింట్లో అమ్మవారిని “బ్రహ్మ చారిణి” గా నిలిపి అలంకరించి, సకలోపచారాలతోనూ పూజించి, ధూప దీప నైవేద్యాలతో సత్కరించి, భక్తితో ప్రణమిల్లి, అందరికీ తీర్ధ ప్రసాదాలిచ్చి ఆశీర్వదించి, రమణమూర్తి వారిచ్చిన సంభావనలు పూచ్చుకుని కారెక్కారు శాస్త్రిగారు.

 

ఆ రాత్రి భోజనమయ్యాక అరుగుమీదికొచ్చి కూర్చున్నారాయన. గతమంతా చలన చిత్రమై కళ్ళ ముందుకొస్తోంది. శాస్త్రిగారి భార్య అన్నపూర్ణమ్మ వచ్చి కూర్చుని “మీకు లభించిన తల్లి దర్శనం గురించి నిన్న రాత్రి మీరు చెప్పింది విని వొళ్ళు పులకరించిందండీ. కళ్ళకు కట్టినట్టు మీరు వివరంగా చెప్తూంటే మేము కూడా ఆ తల్లిని దర్శించుకుని మనసు నిండా నింపుకున్నాము. మీకిలా లలితాదేవి దర్శనమిచ్చినట్టు మీరప్పుడప్పుడూ అనేవారే కానీ యింత వివరంగా మీరెప్పుడూ చెప్పలేదు" అంది అన్నపూర్ణమ్మ, భర్త మీది అభిమానం కళ్ళలో తొణికిసలాడుతుండగా.

 

“అవును, నీకింత వివరంగా చెప్పే వెసులు బాటు నాకెక్కడిది? ఆ భ్రమరాంబికా మాత నన్ను కరుణించి అయిదు రూపాలుగా నా నట్టింట వెలిసి, అయిదుగురు బిడ్డలకు తండ్రినిగా నన్నాశీర్వదిస్తే, వారి ఆలనా పాలనలతో బాటుగా నా తల్లి దండ్రులను కూడా కన్నవారిలా చూసుకుంటూ, నేను సంపాదించే మూడు దుగ్గాన్లతో గంపెడు సంసారాన్ని పళ్ళ బిగువున నిర్వహిస్తూ, నిరంతరం శ్రమించే నీకు మాత్రమెక్కడుండేది, నా మాటలు కబుర్లూ వినే తీరికా, ఓపికా" అంటుండగానే యింట్లో నుంచి లలిత కూడా వచ్చి, పాపను శాస్త్రిగారిముందు చాప మీద పడుకోబెట్టి "వొళ్ళు కాస్త వెచ్చగా వున్నట్టుంది చూడండి నాయనగారూ పొద్దుటినుండీ వొకటే యేడుపు, విసిగించేస్తూంది“ అంటూ ప్రక్కనే కూర్చుంది. అపర్ణ యేడుస్తూంది. మట్టి ప్రమిదలో ఆముదం వేసి దీపం వెలిగించి తీసుకువచ్చింది అన్నపూర్ణమ్మ. రామప్ప అప్పుడే తీసుకొచ్చిన తమలపాకులు తీసుకుని గోటితో గిల్లి మధ్యలో నయాపైసంత రంధ్రం చేశారాయన, వాటికి ప్రమిదలోని ఆముదం రాసి, ఒక్కొక్క ఆకూ రెండు చివరలా పట్టుకుని దీపం నల్లని పొగ వద్ద పెట్టారు, కొంత సేపటికి తమలపాకు వేడెక్కి కొంచం కమిలింది. దాన్ని మెల్లిగా అరచేతిలోవేసుకుని, మెల్లగా అపర్ణ బొడ్డు చుట్టూ అమర్చారాయన. అలా ఓ ఆకు చల్లారగానే మరోటి వేస్తూ పొట్ట నిమురుతూ, ఆమె తలపై చేయి వుంచి తగిలీ తగలకుండా సున్నితంగా చెంపలూ, భుజాలూ, గుండె, పొట్ట నిమురుతూ కాళ్ళూ చేతులూ మెల్లగా వత్తుతూ పక్కకు తిప్పి వీపు మీద రాస్తూ మెల్లని స్వరంతో యేదో లయబద్దంగా పలుకుతున్నారు మల్లప్పశాస్త్రి. కాసేపటికి పాప నెమ్మదై నిద్రపోయింది. "యీ రోజంతా నిద్రపోకుండా విసిగించేసింది నాయనగారూ, మీచేతిలో యే మహిముందోగానీ చిటికెలో నిద్రపోయింది" అంటూ పాపనెత్తుకోబోయింది లలిత. "వద్దమ్మా, ఇలా పడుకోనీ, మన పెద్దవారు పిల్లల్ని యిలాగే సముదాయించేవారు యిలా కూడా ఉపశమించకపోతే అప్పుడు యింట్లో వున్న పెద్దల సలహా తీసుకుని చిట్కా వైద్యంచేసేవారు. యిప్పుడు నేను చేసిందాన్నే యింకొంచం చిలవలూ పలవలూ కల్పించి యేవో కొత్తపేర్లు పెట్టి వైద్యమని డబ్బు గుంజుతున్నారు యీ కాలంలో.” అంటూ తన భుజం మీది కండువా పాపకు కప్పినారు శాస్త్రిగారు.

 

రామయ్య తెచ్చిన తాంబూలం వేసుకుంటూ కాసేపు వూరికబుర్లు పిచ్చా పాటీగా మాట్లాడి, యిప్పటికే ఆలశ్యమైంది. నేను మీకీరోజు, నా తల్లి మా పైన దయచూపి, కాపాడిన సంఘటన మరొకటి చెపుతాను. అంటూ మొదలు పెట్టారు శాస్త్రిగారు.

 

 “నా పెద్ద కుమార్తె త్రిపురసుందరిని శ్రీశైలం నుండి నెల్లూరికి వెళ్ళే దారిలోని ఒక చిన్న వూర్లో యిచ్చాను. అల్లుడు ఆ వూర్లో స్కూలు టీచరు, తల్లీ తండ్రీ, పెళ్ళికావలసిన చెల్లెలూ పట్నంలో చదివే తమ్ముడూ వున్నారు, పెద్దల ఆస్తి నాలుగెకరాలు, యిల్లు వుంది. అందరూ కలిసే వుంటారు. అమ్మాయి గర్భవతి అని తెలిసి, చీరె సారెలెత్తుకుని నా యిల్లాలు అన్నపూర్ణ వెంట రాగా, కూతుర్ని ప్రసవానికి ఆహ్వానించి తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళాను. నల్లమల అడవుల్లో వుందావూరు. మరునాడు మా నాయన గారు పెట్టిన సుముహూర్తంలో తిరిగి మా వూరికి ప్రయాణమై బస్సుకోసం అరమైలు నడిచి రోడ్డు వద్దకొచ్చాము సాయంత్రం నాలుగ్గంటలయినా యింకా ఎండగానే వుంది. రెండు బస్సులొచ్చి మేము నిలపమని చేతులూపినా నిలవకుండా వెళ్ళిపోయాయి, పైనెక్కడో జాతర జరుగుతున్నదట, బస్సుల పైన కూడా జనమెక్కి వున్నారు. మా వూరెళ్ళాలంటే రెండుగంటలు పడుతుంది, సూర్యాస్తమయం అయింది. ఏమిచెయ్యాలో తోచడం లేదు."

 

“యిక లాభం లేదండీ. మంచి అడవిలో నుంచి వెళ్ళాలి. క్షేమం కాదు వెనక్కి మా యింటికెళ్ళిపోదాము. రేపు వెళ్దురు గాని“

అన్నాడు అల్లుడు.

 

“మా నాయనగారు మంచిముహూర్తం చెప్పారు నాయనా, యిది తప్పితే యిక దగ్గరలో మంచి రోజులేదు, అమ్మాయికి ఎనిమిదవనెల వచ్చేస్తుంది, అంతా ఆతల్లి దయే యిక " అన్నాను.

 

త్రిపురమ్మకు కష్టంగా వున్నట్లుంది నిండు చూలాలు. చెమటలు తుడుచుకుంటూ అటూ యిటూ చిన్నగా అడుగులేస్తోంది. నా చిన్నారితల్లి తన కడుపులో బ్రహ్మాండాన్ని మోస్తున్నది, కూర్చోడానికి కూడా ఆ చుట్టు పక్కలేమీ వసతి లేదు.

 

భ్రమరాంబికా స్తోత్రం చెప్తూ బిడ్డ తలనిమురుతున్నాను.

 

యింకో బస్సు కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. అమ్మను తలుచుకుని ధ్యానం చేసుకుంటూ వుండగా, ఒక జీపు శ్రీశైలంవైపుగా వెళ్ళింది. కానీ బస్సు వచ్చే సూచనలు లేవు. యింటికెళ్ళడమే కర్తవ్యమని అల్లుడికి చెప్పడానికిటు తిరిగాను, వెళ్ళిన జీపు రివర్సులో వచ్చి మాదగ్గరలో ఆగింది, డ్రయివరు దిగి వచ్చి "శ్రీశైలానికేనా సామీ" అని అడిగాడు అవునన్నాను. “అయ్యా !మా ఆఫీసరుగారు రమ్మంటుండారు. మీరాయనకు తెలుసంట, ఎల్దాం పదండయ్యా, ఈ దినమింక బస్సులు దొరకవు“ అన్నాడు.

 

జీపుదగ్గరకెళ్ళి చూశాను, ఆయన శ్రీశైల ప్రాజెక్టు ఆఫీసులో పెద్ద ఆఫీసరు. గుడికొస్తుంటారు, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుని జీపెక్కాము.

 

చిక్కటి అడవి ఆకాశం కనబడనంత ఎత్తుగా వృక్షాల మధ్యగా రెండుగంటల ప్రయాణం, గొంతెత్తి అమ్మవారి స్తోత్రాలు చెప్తూ కూర్చున్నాను, అడవి మధ్యలోకొచ్చాము కన్నుపొడుచుకున్నా కానరానంత గాడాంధకారం.

 

“అయ్యా !జీవం వుండాదయ్యా ముంగల" అన్నాడు డ్రైవరు.

 

"ఏంచేద్దాం, వెనక్కెళ్ళిపోదామా?" ఖంగారుగా అడిగాడు ఆఫీసరు.

“ఎనక్కెళ్ళినా ఎంటబడతాదయ్యా, చానా దగ్గరగా వుండాది చిరత, జీపు రివర్స్ చేస్తే కంగారుపడి మీదికి దూకుతాది, సల్లంగా ముందుకెళ్ళి పోవటమే నయం, సామిదయ ఎట్టుంటే అట్ట, నేనుండే సైడే రోడ్డు పక్కన కూచోనుండాది. ఒక్క మడిసినే లాక్కపోతాది దేముడిమీద భారమేసి ముందుకే పోదామయ్యా" అంటున్నాడు డ్రైవరు, మా ముందు కాస్త దూరంగా పసుప్పచ్చటి రెండు జ్యోతులు వెలుగుతూ దగ్గరవుతున్నాయి వెనక సీట్లలో అమ్మ కూతురు వొకవైపు, నేను ఎదురు సీట్లోనూ కూర్చునివున్నాం” చివరనున్న వాళ్ళను ఒక్కరిని లాక్కుపోతుంది“ అని డ్రైవరు అనగానే, నా యెదురు సీట్లో కూర్చున్న తల్లీ కూతుర్లను ముందుకు జరగమని, నేను వాళ్ళ సీట్లోకి మెల్లిగా జరిగి వెళ్ళి చివరగా కూర్చున్నాను. ధ్యానంలో వున్నాను. చిరుతను దాటి ముందుకెళ్ళింది జీపు. కొంతదూరం వెళ్ళినాక వెనక్కి చూశాను. కొంత దూరాన అవే కళ్ళు పసుపురంగులో జ్వలనజ్యోతుల వలే మెరుస్తున్నాయి. మా జీపు పులికి వెనకగా ఉన్నప్పుడు ఆ వైపు తిరిగి వున్నదల్లా జీపు ముందుకు వెళ్ళగానే, యిటుతిరిగి మావైపే చూస్తూ ఉంది. అవాక్కైనాను. మమ్ము చూస్తూ యిటు తిరిగి కూర్చుని కూడా మా పైకి దూకకుండా, నా తల్లి నామనసులో నిండిపోయింది. అలాగే చూస్తున్నాను. పులి వీపు పైన ఏదో ఆకారం కనబడింది నాకు. నాది భ్రమ అంటే నేనొప్పుకోను, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ మేటిపెద్దమ్మ దయాంబురాశి, పులిమీద కూర్చున్న లలితాపరాభట్టారిక నా కళ్ళకు కనిపించింది. యింకా దూరం మేము వెళ్ళినా పులికో లెక్కకాదు, లేచి వొక్క పరుగున శరవేగంతో వచ్చి మాలో ఎవరినైనా లాక్కుపోవచ్చుకానీ తన కంటి వెలుగులతో మాకు దారి చూపుతూ అలాగే కూర్చుంది నా తల్లి ఆదేశంతోనే కదా? శ్రీశైలం దాపులకొచ్చినాము.

 

"మీరు భక్తిగా చదివిన స్తోత్రాలతోనే అమ్మవారికి దయకలిగి మనల్నందరినీ కాపాడింది శాస్త్రిగారూ" అన్నారు ఆఫీసరుగారు.

 

“మన మీద దయతో సురక్షితంగా అడవి దాటించడానికే తల్లి తన వాహనమెక్కి వచ్చి నిలిచింది అది తెలియక మనం భయపడ్డాం నాయనా" అంటూ భ్రమరాంభికా స్తోత్రం పూర్తిచేశాను. మా యింటివద్ద జీపు ఆపినారు. భయంతో వణికి పోతున్న మా త్రిపురమ్మను దింపి, ఆఫీసరుకు కృతజ్ఞతలు చెప్పి లోనికి నడిచాము."

 

ఇదంతా చెప్పి, భక్తి పారవశ్యంలో మునిగి పోయి అలాగే కూర్చుండి పోయిన శాస్త్రి గారిని - "మీజన్మధన్యమైందండీ”

అంటూ చేయి పట్టుకు లేపింది అన్నపూర్ణమ్మ.

bottom of page