top of page
manaillu2.jpg
kathaamadhuralu-new.jpg
kavitamadhuralu.jpg
vyaasamadhuralu.jpg
pustaka-parichayaalu.jpg
alanati.jpg
vanguripi.pa.jpg
deepthi-muchatlu.jpg
bhuvanollasam.jpg
nri-column.jpg
saahiteesourabhaalu.jpg
tappoppula.jpg
paatasanchikalu.jpg
maagurinchi.jpg

సంపుటి  సంచిక  1

జనవరి-మార్చి 2023 సంచిక

rachanalu.jpg

పుస్త​క పరిచయాలు

నిర్వహణ: శాయి రాచకొండ  |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com

పుస్తక విశ్లేషణ

మేము ఎంపిక చేసుకున్న కొన్ని  పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.

సంక్షిప్త పుస్తక పరిచయం

పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.

పంపించవలసిన చిరునామా:

sahityam@madhuravani.com

 పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే. 

munneeti.jpg
tanalO nannu.jpg
ramaneeya-.jpg
cskathalu.jpg
maatrustavam.jpg

-శాయి రాచకొండ

 

మున్నీటి గీతలు 

 

2021 సంవత్సరంలో తానా (TANA సంస్థ, USA) వారు నిర్వహించిన నవలల పోటీలో ఉత్తమ నవలగా బహుమతి గెల్చుకున్న రెండు నవలలలో ఒకటి.  నవల వ్రాసింది చింతకింది శ్రీనివాసరావు గారు.  సుమారు ముప్ఫై మూడేళ్ళగా రచనా వ్యాసంగం చేస్తూన్న శ్రీనివాస రావు గారు ఎన్నో కథలు, నవలలు, నాటికలు వ్రాసారు.  ఎన్నో పురస్కారాలు కూడా పొందారు. 

ఎంతటి సాహితీ కారుడికైనా మనసు పెట్టి తయారు చేసే ఏ సాహితీ రూపమైనా ఒక కొత్త కళారూపమే.  అలాంటి మనసు పెట్టి వ్రాసిందే ఈ నవలకూడా. 

పుస్తకం చదవడం మొదలు పెట్టినప్పుడు కథ కోసం వెతికాను.  మొదలు పెట్టిన తరవాత బెస్తల జీవితంలో ఒక భాగమైపోయాను.  ఆ భాషలో నేనూ మాట్లాడుకున్నాను.  వారి ఆకలి పాటలకు నేనూ వంత పాడాను.  పుస్తకం పూర్తి అయేసరికి కథ నాకు అక్కరలేదనిపించింది. 

“ఇది భయభక్తులతో రాసింది”  అంటారు రచయిత నవల రాయడానికి నేపథ్యం వివరిస్తూ.... 

“కళింగాంధ్ర ఎక్కడ... కరాచీ మరెక్కడ..

నాగావళి ఏ మూల... సింధునది ఇంకేమూల...

తూర్పుతీరం ఇటుపక్క... అరబిక్ కడలి అటువైపు...

ఇంత దూరాన్నీ చెరిపి పారేస్తోంది ఆకలి..... ఉత్తరాంధ్ర జాలర్ల నేత్రాల్లోంచి ఉప్పుసముద్రాలు ఉరేలా చేస్తోంది ఆకలి.”

 

రచయితను ఈ పుస్తకం రాయించిన అసలు ప్రశ్న “చేపలు పట్టడానికి సిక్కోలు మత్స్యకారులు గుజరాత్ దాకా పోవడం ఏమిటి?” అని.  ఈ వలసపోయిన మత్స్యకారుల్లో ఎంతమంది తిరిగి వస్తారో తెలీదు.  ఎంతమంది అరేబియా సముద్రంలో పాకిస్తాన్ జవాన్లకు చిక్కి, అక్కడే కారాగారాల్లో గడుపుతూ కొన్ని నెలల తరవాతో కొన్ని ఏళ్ళ తరవాతో తిరిగి వచ్చేవారు ఉంటే ఉంటారు.  అది వాళ్ళ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది.  ఆ జాలర్ల పై ఆధారపడే తల్లితండ్రులు, భార్యలు, పిల్లల గతేమిటి? 

“వాళ్ళు కూటికి పేదలవచ్చు, గుణానికి మహనీయులని స్పష్టపడింది, వారి ఆప్యాయాలు, ప్రేమానురాగాలు మున్నీరంత పెద్దవని తేటతెల్లమయింది’ అంటారు బెస్తల జీవితాలలోకి తొంగిచూస్తూ.

 

బెస్తల జీవితాలు, వారి భాష, ఆలోచనలు, పేదరికం, దాని వల్ల వారి మధ్య కలిగే కక్షలు, కావేశాలు, వారి నమ్మకాలు, మూఢనమ్మకాలు, మనుషుల మధ్య ప్రేమానురాగాలు, నవ్వులు, ఏడుపులు… వారు పాడే పాటలు... వాళ్ళల్లో ఒక్కడిగా ఇన్నిటినీ క్షుణ్ణంగా జీర్ణం చేసుకుని రాసిన పుస్తకం ఇది. 

“కళాసీలను వాడుకుని తాండేళ్ళు డబ్బులు చేసుకుంటారు.  తాండేళ్ళ శ్రమను గుంజుకుని సేట్ లు బాగుపడతారు.  ఆ సేట్ దగ్గర రాజకీయనాయకులు సొమ్ము దొబ్బుతారు.  ఇదంతా పెద్ద చక్రం.  చినచేపను పెదాచేప తిని పారేసే సూత్రం.”

ఇదీ దోపిడీ చక్రం.  ప్రపంచం అంతటా జరిగేదే.  ఈ బెస్తల జీవితాల్లో కూడా జరిగేదిదే.  అయితే చాలామందిమికి బెస్తల జీవితాలు తెలీవు.  వాళ్ళ ప్రపంచం వాళ్లది, మిగతా వారందరిది మరోటి.  నాకు గుర్తు, ఇంగినీరింగు చదివే రోజుల్లో జాలారి పేటకు తీసుకెళ్ళేవాడు మా స్నేహితుడు సత్యసాయి, వయోజన బెస్తలకి కనీసం అంకెలైనా నేర్పించే ప్రయత్నంలో.  రాత్రి ఏడింటికి అలసి సొలసి వచ్చే వాళ్ళకి ఎలా చెప్పాలో తెలిసేది కాదు.  వాళ్ళ భాష – యాస – అర్థమయ్యేది కాదు.  మాకు తెలిసినంతలో ఒక గంటో గంటన్నారో ఏదో నేర్పేమనుకుని వచ్చేవాళ్ళం, అదీ వారానికి రెండు సార్లేమో. వాళ్లకేమి వచ్చేదో రాలేదో కూడా అర్థమయ్యేది కాదు.

నవల చదువుతున్నప్పుడు నాకు బెస్తలకీ దూరం చాలా తక్కువేమోననిపించింది. నేనూ విజయనగరంలో పెరగడం వల్ల రచయిత రాసిన సంభాషణలు అర్థం చేసుకోవడం కష్టమవలేదు – ఒకప్పటిలాగా.  అయితే ఇన్నేళ్ళ తరవాత ఆ యాస వింటే అర్థమవుతుందా అన్నది నాకు తెలీని ప్రశ్న.

నవలకి హీరో పోలయ్య, ఒక యువ ఆదర్శవాది, ఉదాత్త హృదయుడు. తల్లినీ తండ్రినీ వాళ్ళు పోయేంతవరకు కంటికి రెప్పలా చూసుకున్నవాడు.  తనను బీదరికంలోకి తీసుకు వెళ్ళినా తల్లితండ్రులకోసం ఖర్చుకు వెరవని ఆదర్శ తనయుడు.  బవిరోడి కూతురు ఎర్రమ్మ. ఎర్రమ్మ పోలిగాడి మీద మనసు పారేసుకుంటుంది.  పోలిగాడికీ ఎర్రమ్మంటే ఇష్టమే.  ఎర్రమ్మ తల్లికీ పోలిగాడు అల్లుడవడం ఇష్టమే.  ఇష్టం లేనిదల్లా బవిరోడికే. పోలిగాడు ఎర్రమ్మకి మేనమామ కొడుకు.  బవిరోడికి పోలిగాడంటే ఇష్టం లేకపోడానికి కారణం వాడెందుకూ పనికిరాడని, పెద్ద పెద్ద ఆస్తులను తల్లి, తండ్రి రోగాలకు ఖర్చుపెట్టేశాడనీ, ఇవి కాక కొంచెం అసూయ, అన్నీ కలిసి ఉన్న కోపం.  ఎర్రని తన చెల్లెలి కొడుకునిచ్చి పెళ్ళిచెయ్యాలన్న పెద్ద ఆలోచన.  కథ చివరికి బవిరోడికి తన తన తప్పు తెలుస్తుంది.  ఎర్రనిచ్చి పోలికి ఇచ్చి పెళ్ళి చేస్తాడు.  పోలిగాడు, ఎర్రమ్మ కలిసి ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ, బెస్తలకు తగిన సౌకర్యాలు కల్పించాలని ధర్నా జరపడానికి వెళతారు – అందరు బెస్తల ఆశీస్సులతో – బవిరిగాడితో సహా...

200 పేజీల నవలను 20 పదాల్లో చెప్పడం ఆ నవలకు అన్యాయం చేసినట్లు.  అదికాదు నా ఉద్దేశ్యం.  నేను మొదటే చెప్పాను నవలను కథకోసం చదవడం తప్పు.  రచయిత కథను విస్తరించ గలగాలి, పాఠకుడిని ఎంగేజ్ చెయ్యాలి, తాను పాఠకుడికి ఇవ్వదల్చుకున్న విషయం విప్పి చెప్పాలి.  ఇక్కడి రచయితకు కథ ముఖ్యం కాదు.  కథ హారానికి కావలసిన తాడు మాత్రమే.  బెస్తల ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పాలి.  బెస్తలు ఏ ఏ చేపలు ఎలా పడతారో చెప్పాలి. బెస్తల సాంఘీక జీవనమేమిటో చెప్పాలి.  వాళ్ళ పాటలెలా ఉంటాయో, వాళ్ళ భాష ఏమిటో చెప్పాలి.  వాళ్ళ ఆహారపుటలవాట్లేమిటో చెప్పాలి.  వాళ్ళు సంఘంలో ఎలాంటి దోపిడీకి గురి అవుతారో చెప్పాలి.  వాళ్ళల్లోనే ఉన్న చిన్న చేపలు, పెద్ద చేపల గురించి చెప్పాలి.  వాళ్ళెందుకు గుజరాత్ వెళతారో చెప్పాలి.  అక్కడ సేఠ్ వీళ్ళకి ఎలాంటి వసతులు కల్పిస్తారో చెప్పాలి.  అక్కడ సంస్థాయుతమైన పరిస్థితులని వర్ణించాలి.  సేఠ్ కి, బెస్తలకు వారి వారి భాషలలో ఉన్న తేడా, ఇద్దరి మధ్య సంధానం ఎలాగో చెప్పాలి.  బెస్తలకు సేఠ్ రోజుకి ఎన్ని టన్నుల చేపలు ఎలాంటివి పడితే ఎంత డబ్బిస్తాడో, ఆ చేపల్ని పట్టడంలోని కష్టనష్టాలు చెప్పాలి.  వాళ్ళు పాకిస్తాన్ సరిహద్దులకి ఎందుకు వెళతారో ఎందుకు పట్టుబడతారో, పట్టుబడితే అక్కడ వీళ్ళను హింస పెట్టే విధానమేమిటో, ఇటు భార్యా పిల్లలకు అటు జాలర్లకు ఎలాంటి మనోవ్యధో చెప్పాలి.  పాకిస్తాన్ లో న్యాయ విచారణ ఎలా ఉంటుందో, రాజనీతి ఎలా ఉపయోగపడుతుందో, ఎలా ఉపయోగిస్తారో చెప్పాలి.  ప్రభుత్వాలు ఎందుకు అన్నిచోట్లా ఒకే రకమైన సదుపాయాలు ఎందుకు ఇవ్వవో, ఇవ్వకపోతే ఏంచెయ్యాలో చెప్పాలి. 

రచయిత పై చెప్పిన అన్ని విషయాల్లోనూ, పాఠకులచేత చదివింపచేసి, తాను చెప్పదల్చుకున్న విషయాలను తగు పాళ్ళల్లో చెప్పవలసిన రీతిలో చెబుతూ అటు సందేశాన్ని ఇటు సాహితీ విలువలని ఇస్తూ అన్ని విధాలా సఫలీకృతం అయ్యారనడంలో అతిశయోక్తి లేదు.  కథ కూడా ఉంది, అది కావలసిన వాళ్ళకి.  మొదలు పెట్టిన దగ్గరనుంచి పూర్తయేదాకా పుస్తకాన్ని కిందికి దించనివ్వలేదు. 

అందుకే వచ్చింది తానా వారి ఉత్తమ నవల బహుమానం. 

శ్రీనివాసరావు గారు మనసు పెట్టి రాసిన నవల.  చదవవలసిన నవల. 

పుస్తకం కాపీలు అన్ని పెద్ద పుస్తక విక్రేతల దగ్గరా దొరుకుతాయి.  ఖరీదు రూ. 200 (యూ ఎస్ ఏ లో $ 10.00). 

*****

‘తనలో నన్ను’

 

‘తనలో నన్ను’ వర్ధమాన రచయిత పాణిని జన్నాభట్ల రాసిన పదమూడు కథల సంపుటం.  కొన్ని కథలు మధురవాణిలోనూ, కౌముది అంతర్జాల పత్రికలలో అచ్చైనవే. 

కథలు చదువుతూంటూంటే ఇవి అతని మొదటి కథల్లాగా అనిపించవు.  ఏదో చెయ్యి తిరిగిన వాటమే అని అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.  అదీ 2020 లో రాయడం మొదలు పెట్టారంటారు రచయిత.  పుస్తకానికి ముందుమాట రాస్తూ, కిరణ్ ప్రభ గారు అంటారు ‘కొత్తదనం నిండిన కథలకు కేరాఫ్ ఎడ్రస్’ ఈ పుస్తకం అని.  “పాణిని గారిని తెలుగు కథా సాహిత్యంలో స్థిరంగా, ప్రామాణికంగా ఎదుగుతున్న రచయిత అనడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదు” అంటారు కిరణ్ ప్రభ గారు.  ఒక ప్రముఖ సంపాదకుని దగ్గరనుంచి ఇంత మంచి సర్టిఫికేట్ కొట్టేసిన పాణిని గారికి మంచి భవిష్యత్తు ఉందనడంలో ఆశ్చర్యం లేదు.  దానికి ఈ కథలే సాక్ష్యం.

అన్ని కథల్లోకీ ‘తనలో నన్ను’ తలమానికం.  తన జీవితంలో స్పార్క్, థ్రిల్ లేని ఒక గృహిణి ఎదురు బిల్డింగ్ లోని ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్న జంటని చూస్తూ, దూరంగా కనబడుతూన్న వాళ్ళ నడకలు, హావ భావాల్ని బట్టి వాళ్ళ మధ్యలో ఉన్న బాంధవ్యాన్ని ఊహించుకుంటూండడం అతి సహజంగా అనిపిస్తుంది.  అయితే తను ఊహించుకున్న ఎదుటివాళ్ళ జీవితం నిజమై ఎదురింటి యువతి ఆత్మహత్య చేసుకుంటే?  ఎవరికీ చెప్పుకోలేని ఆ మనస్థితిని చాలా తక్కువ మాటల్లో చెప్పిన కథ ఇది.  కథకు మూలమైన ఆలోచన బాగుంది. 

ఐదేళ్ల క్రితం తన సరదా కోసం బలై ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్న కోమలి ముసలి అవ్వ రూపంలో కనబడి ‘శబరి’లా ఎంగిలి పళ్ళు ఇచ్చి తనతో పరలోకానికి తీసుకు వెళితే?

నాకు నచ్చిన ఇంకో కథ ‘మరో కురుక్షేత్రం’.  పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం ఎవరికి తెలీదు?  వాళ్ళిద్దరే కాక మూడో కోణం సృష్టించే ఆలోచన రచయితకి రావడం గిలిగింతలు పెట్టింది.  సోదర సమానులైన ‘త్రిపాలకులు’ కూడా యుద్ధానికి వస్తే?  త్రిపాలకులెవరు?  వాళ్ళెందుకు యుద్ధానికి వస్తారు?  యుద్ధం చేసారా? శ్రీకృష్ణుడికి కూడా వారి సంగతి తెలీదా?  కథ చదవవలసిందే. 

టెక్నాలజీ కథలు – ‘కలవరమాయే మదిలో’, ‘డిజిటల్ ఫ్రెండ్’, ఆర్ద్రత నిండిన కథ విద్యాదానం. 

ఇలా సాగుతాయి కథలన్నీ.  ఇది కేవలం పుస్తక పరిచయమే కాబట్టి మొదటి రెండు మూడు కథలను పరిచయం చేశాను.  మిగిలినవి చదివి ఆనందించవలసిందే.  విషయ వైవిధ్యం ఉన్న కథలు.  కొత్తదనం నిండి ఉన్న కథలు.  చదువుతూంటే తెలీని ఒక ఆనందం కలుగుతుంది. 

మంచి భవిష్యత్తు ఉన్న రచయిత.  ఇంకా ఇంకా మంచి కథలను మనకు అందిస్తారని ఆశిస్తాను.  అందుకు నా ఆశీస్సులు. 

పుస్తకం అన్ని పెద్ద పుస్తక విక్రయ కేంద్రాలలో దొరుకుతుంది.  వెల రూ. 150 ($5).  అన్వీక్షికి ప్రచురణ. 

*****

  

‘రమణీయ హరి కథలు’

 

'రమణీయ హరి కథలు’ హరికథలు కావు.  “తనలో సగమై ‘పూర్ణం’ అయిన తనను తలచుకుంటూ” తనకోసం అక్కిరాజు శ్రీహరి రాసిన కథలు.  తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను, తను రమణిగారితో అనుభవించిన క్షణాలకు అక్షర రూపాన్నిచ్చి చిన్న చిన్న కథల రూపంలో ఆ అనుభవాలను మనతో పంచుకున్న పుస్తకం ఇది. 

“క్షణం క్షణం కలిస్తే ఓ జీవితం.  ఈ క్షణం మరుక్షణం గతంగా మారి ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది.  రాబోయే క్షణం ఓ కలగా వూహగా అలరిస్తుంది.  అయితే ఈ క్షణం ఒక్కటే ‘ప్రస్తుతం’.  అదే జీవనం.  అదే ప్రాణం, అదే కాలం, దైవం కూడా.” – రచయిత మాటలివి. 

గుర్తించాలే కానీ, మనందరి జీవితాల్లోనూ అటువంటి క్షణాలు ఎన్నో, ఎన్నెన్నో ఉంటాయి.  అయితే మనం గుర్తించం.  గుర్తించే సమయాన్ని మనం వెచ్చించం.  అదే మనకూ ఈ రచయితకూ తేడా. 

మళ్ళీ రచయిత మాటల్లో, “కొన్ని క్షణాలు ఈ విధమైన అలజడి లేకుండా చడిచప్పుడు చేయక గడిచిపోతాయి.  మరి కొన్ని ఆనందాన్ని, ఇంకొన్ని దుఖాఃన్ని ఇస్తాయి.  కొన్ని జీవితాన్ని మలుపు తిప్పుతాయి.  కొన్ని పాఠాలు నేర్పుతాయి.  మరికొన్ని జీవిత పరమార్థాన్ని విడమరచి చెప్తాయి.”

అలాంటి ఓ పద్నాలుగు క్షణాల్ని అక్షరీకరించారు రచయిత.   

వినాయకచవితికి చేసిన మట్టివిగ్రహాన్ని నిమజ్జనం చేసినప్పుడు తన కొడుకులో మమకారాన్ని పెంచుకున్న వస్తువును వదిలి ముందుకు పై అడుగు వేయగలిగే ధైర్యాన్ని చూసిన క్షణం, “భావోద్రేకాలను అదుపులో వుంచుకోలేక ఎదుటివారిని భయపెట్టే మనం ప్రత్యేక మనుష్యులమా, లేక మనసును అదుపులో వుంచి తనకిచ్చిన పాత్రలో జీవించిన అతను ప్రత్యేక మనిషా?” అని అనిపించిన క్షణం, భక్తికీ, భుక్తికీ తులసి దళాలనే ఆశ్రయించిన మనుష్యులను చూసిన క్షణం, తిరుపతి వేంకటేశ్వరస్వామి గుడిలో దేవుడిని చూస్తూ దైనందిన జీవితాన్ని మర్చిపోగలిగే ఓ క్షణం, మనం చేసుకునే ప్రతి పండుగలోనూ అటు భగవంతుడితో పాటు మానవత్వం చూసే క్షణాలు.... ఇలా ఎన్నో. 

అందరం చూడగలిగేవే, అయితే చూడం, అనుభవించం.  అలా అనుభవించడానికి జీవితం పట్ల నమ్మకం, ఎదురుగా కనబడే దృశ్యం వెనుక కొంచెం లోతుగా అర్థం చేసుకుని, ఆస్వాదించగలిగే మనసు ఉంచుకోగలగాలి.  అప్పుడు అందరం ఎన్నో క్షణాల్ని కనీసం మనసులోనైనా నిలుపుకోగలం. అంతకంటే ఏంకావాలి?

పుస్తకం ప్రతులకు రచయిత శ్రీహరినే (+91 9940116304) సంప్రదించండి. 

*****

సి. ఎస్. శర్మ రచనలు

చిర్రావూరి కుటుంబ సభ్యులు ప్రచురించిన మరో రెండు పుస్తకాలు ‘సి. ఎస్. శర్మ రచనలు’, ‘మాతృస్తవము మరియు ఇతర కవిత ఖండికలు’.  డా. శ్యామ్, డా. ఘనశ్యామ్, శ్రీమతి జఘనా రాణి, శ్రీమతి వల్లీ శ్యామల గార్లు వారి తండ్రి గారైన సర్వేశ్వర శర్మ (సి. ఎస్. శర్మ) గారి నూరవ జయంతి సందర్భంగా ప్రచురించిన పుస్తకాలివి.  మొదటిది శర్మ గారు వ్రాసిన కథాసంకలనం.  రెండవది వారి తాతగారు (శర్మ గారి తండ్రి, చిర్రావూరి కామేశ్వరరావు) వ్రాసిన రచనల సంకలనం. 

గతంలో 'నడచిన పుస్తకం' పేరిట శర్మగారి రచనలతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొందరు ప్రముఖుల ఆత్మీయ వ్యాసాలతో ప్రచురించారు. 

సాహితీ ప్రపంచంలో శర్మగారి గురించి చాలా తక్కువ మందికి తెలుసుననుకుంటున్నాను. ఒకటి తరాల అంతరం, రెండవది ఆయన మాస్ రచయిత కాకపోవడం.  అయితే ఆయన గురించి తెలిసిన వారికి ఎక్కువే తెలుసునని చెప్పవచ్చు.  ఆయన సాహిత్య పిపాస, ఆయన రచనల విలువ, ఒక మనిషిగా ఆయన సాధు స్వభావం, ఆ తెలిసిన వారికే పరిమితం.  ఆ సందర్భంలో శర్మ గారి కథలను సేకరించి ఒక సంపుటంగా వెలికి తెచ్చిన వారి పిల్లల దీక్ష మెచ్చుకోదగ్గది.  శర్మగారి పుస్తకంతో పాటు వారి తండ్రిగారి రచనలు కూదా ఒక పుస్తకంగా వేసి ప్రపంచానికి వారి రచనలను మళ్ళీ పరిచయం చేయడం నిజమైన నివాళి. 

ప్రచురణ కర్తలు చెప్పినదాని ప్రకారం, 'సి. ఎస్. శర్మ రచనలు ముఖ్యంగా ఈ పుస్తకంలోని కథలన్నీ రచయిత 1939-42 మధ్యలో రాసినవి/ వివిధ పత్రికలలో ప్రచురితమైనవి.  అంతే రచయితకు ఈ కథలు రాసే సమయానికి 17-20 సంవత్సరాల వయసేనన్న మాట.  కథలు చిన్నవే.  సగటున నాలుగైదు పేజీల కథలు.  "వయసుకు మించిన పరిణితితో రాసిన ఈ రచనా కుసుమాల గుబాళింపును మీకందజేయాలన్నదే మా ఈ చిన్ని ప్రయత్నం" అంటారు ప్రచురణ కర్తలు.  'ఇదీ వరస ' లో కథలు ప్రచురించిన పత్రిక పేరు, రచయిత కలం పేరు కూడా ఇచ్చారు.  కథలతో పాటు కలం పేర్లు కూడా వైవిధ్యంగా ఉన్నాయి.  'ప్రేమికుడు', 'స్మయిల్శ్’, 'నవ్వుల పాళి', 'కన్నీటి కలం', 'సమ్యుక్త', 'శరాని', 'అరుంధతి', ఇలా...

ఈ సంపుటంలో ఇరవై ఒక్క కథలు ప్రచురింపబడ్డవి (రెండు అనువాద కథలు), తొమ్మిది అముద్రితాలు ఉన్నాయి.  పుస్తకం చివరలో, వసుంధర దంపతులు పుస్తకాన్ని సమీక్షిస్తూ "కేవలం చదవవలసిన కథలు కావివి.  అన్నీ 'ఆస్వాదించవలసినవే" అని.  అన్ని కథలనీ వారు ద్రాక్ష (సరళం), కదళీ (కొంత సరళం, కొంత కఠినం), నారికేళం (కఠినం) వర్గాలుగా చేసి సమీక్షించారు.  ఈ సమీక్ష చాలా బాగుంది.  అది చదివినప్పుదు కేవలం కథల గురించే కాదు, రచయిత ఆలోచనలను కూదా వెలికి తెచ్చేలా రాసారు.  ప్రచురణ కర్తలు ఈ సమీక్షను పుస్తకం చివరలో ఎందుకుంచారో నాకు అర్థం కాలేదు.  ఇది మొదట్లోనే కనక ఉండి ఎవరైనా చదివితే కథలను ఒక అద్దంలో చూపించినత్లుండేది.    

శర్మ గారి కథలకు ముందుగా డా. శ్యామ్ రాసిన 'కథలెందుకు రాస్తారు?' అన్న వ్యాసం ఉంది.  శర్మ గారు, అదే, శ్యాం గారి నాన్నగారు 'కథలెందుకు రాసారూ?’ అన్న ప్రశ్నతో మొదలై, తను రాయకుండా ఎందుకు ఆగాడో అని "అసలు రాసేనా?" అన్న ప్రశ్నతో ముగిస్తారు.  నాకెందుకో ఈ మంచి వ్యాసాన్ని ఈ పుస్తకం యొక్క ఆశయంతో పోలిస్తే తగిన చోటు కాదేమో అనిపించింది.  అయితే డా. శ్యాం గారి వ్యాసం, శర్మ గారి కథలు, కామేశ్వరరావు గారి ఖండికలు పక్క పక్కన పెట్టి చూస్తే, ఒకే కుటుంబంలోని మూడు తరాలలో నిక్షిప్తమైన సాహిత్యాభిలాష, శైలిలో వచ్చిన మార్పులు, ఆలోచనలలో కనిపించే తేడాలు సుస్పష్టంగా తెలుస్తాయి. 

శర్మ గారి కథల గురించి చెబుతూ, వసుంధర అంటారు “’నడిచిన పుస్తకం’ శర్మ గారి వ్యక్తిత్వం పరిచయం చేస్తే, ఈ కథలు శర్మ గారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి అని.  వాటిలో ఆయన సాంప్రదాయాన్ని నిరసించారు కానీ అందులోని హిపోక్రసీ, మూర్ఖత్వం పట్ల న్యాయమైన అసహనాన్ని ప్రకటిస్తారు.  విప్లవాన్ని ప్రోత్సహించినా, ఆవేశం కంటే తర్కానికే ప్రాధాన్యమిస్తారు.  స్పష్టమైన అవగాహనతో పాత్రల్ని కళ్ళకు కట్టిస్తారు.  ఆయన కథని ఆస్వాదిస్తే – మానమాయన స్థాయిని అందుకున్నట్లు.  ఆస్వాదించకపోతే- కథకుడిగా ఆయన అందుకున్న స్థాయిని పాఠకుడిగా అందుకునేందుకు మనమింకా కృషి చేయాల్సి ఉన్నట్లు” అని.

కథలు చదువుతున్నప్పుడు శర్మ గారు రాసిన కాలాన్ని (1937-40) గుర్తింపులో పెట్టుకుంటే, ఆయన ఆ కాలానికి చాలా ముందున్నారనే చెప్పాలి.  విదేశాలలో చదువుకుని విశాల దృక్పథం అలవరచుకున్న తమ్ముడిని చూసి అసూయ పడుతూ ఛాందస భావాల వెనక దాక్కునే మనస్తత్వాన్ని చూపినా (అసూయ), కలిమి లేములు అడ్డొచ్చి తనకి ఇష్టం లేకుండా కొడుకు చేసుకున్నమేనకోడల్ని కూడా పోయేంతరవారకూ రాచి రంపాన పెట్టి కోడలు పోయిన ఆరునెలలు తిరగకుండానే తన తమ్ముడితో బేరమాడి ఆ మేనకోడలితో పెళ్లిచేయాలని చూసే నరసమ్మలగురించి చెప్పినా, కొత్త సంవత్సరం మంగలాడికీ, స్నో సీసాలకీ స్వస్తి చెప్పడమా లేక కాఫీని మానెయ్యడమా అన్న డైలమాలో ఉన్నప్పుడు దగ్గు మందు కూడా ఖర్చులకు కలిస్తే కాఫీ రుచిగా ఉండదూ అని నవ్వుల పాళీ నవ్విస్తూ చెప్పినా, ఇంకా ఇంకా ఇలా ఎన్నో ఎంచుకున్న నేపథ్యంలోనూ, కథా శిల్పంలోనూ చూపిన వైరుధ్యం, ప్రతి చిన్న వాక్యంలోనూ మానవ నైజం ప్రతిబింబింపచేసిన శర్మ గారు కనిపించకుండా కనిపిస్తారు.   శర్మ గారి కథలలో కనబడే చిరు వాక్యాలు పాఠకులను ఆకర్షించక మానవు.

కొన్ని కథలు చదువుతూంటే మెడికో శ్యామ్ (డా. శ్యామ్) రాసిన కథలు జ్ఞాపకానికి వస్తాయి.  ‘రైల్లో కలలో – (కలం కిలం)’ ఒక ఉదాహరణ.  మెడికో శ్యామ్ ‘ఆలోచనల ట్రైన్’ ఇదే పంథాలో నడుస్తుంది.  తెలియకుండానే వచ్చే వారసత్వం. 

కథల గురించి నేను చెప్పేకంటే, వసుంధర గారు రాసింది చదివితే ఒక క్షుణ్ణమైన అవగాహన వస్తుంది. 

అయితే, ఈ పుస్తకం అన్నిచోట్లా దొరుకుతుందనుకోను.  ప్రతులకు శ్రీమతి వల్లీ శ్యామల (+91 9346821416) గారిని సంప్రదించండి. 

మాతృస్తవము మరియు ఇతర ఖండికలు

 

 చిర్రావూరు కామేశ్వరరావు గారు రాసిన కవితల సమాహారం.  కొన్ని గద్య కవితలు కూడా ఉన్నాయి.  ఇవి సుమారు 1923 – 1939 మధ్యలో రాసినవి, ప్రచురించబడినవి అని అంటారు ప్రచురణ కర్తలు.  ఇంకా ఆయన గురించి చెబుతూ “బాల్యంలోనే చిన్నపాయగా మొదలయిన తాతగారి సాహిత్య వెల్లువ, వారితో పాటు పెరిగి పెద్దదై మహా ప్రవాహమైంది.  1918-38 మధ్య సాగిన వీరి రచనా ప్రస్థానం వీరిని మాహాకవుల స్థానంలో నుంచోపెట్టింది.  గంజాం కలెక్టరు గారు వీరిని తెలుగు కవిగా గుర్తించి మే 7, 1935 న స్వర్ణపతకం బహూకరించారు” అని.  అంటే చిన్నవయసులోనే, సుమారు 35 ఏళ్ళకే ఆయనకు గుర్తింపు లభించింది.  

శ్రీ సుధామ పుస్తకానికి ముందుమాట ‘కవిత్వ పిపాసులకు దారి దీపం’ లో “కామేశ్వరరావు గారి కవిత్వంలో సంప్రదాయ అనురక్తి, దేశభక్తి, శాంతికాముకత, మానవీయ విలువలు ప్రధానంగా కనిపిస్తాయి.....” అని. 

సంకలనం పై శ్రీ విహారి గారు, డా. జ్యోస్యుల కృష్ణ బాబు గార్లు రాసిన సమీక్షలను పుస్తకం చివరలో ఉంచారు.  మూల రచనల నమూనాలను కూడా పుస్తకం చివరలో చూడవచ్చు. 

‘మాతృస్తవము’ లో ఎంతో అణకువతో సరస్వతిని ప్రార్థిస్తూ..,

“వ్రాసెద నీ ప్రభావమున గీతములు

పదగుంభ నోద్దీప భావము కలిగి

మంజులమై మృదు మధురంబు నాగుచు,

సరళమై నాభాష స్రవయించు గాక!”

బహుశా ఆయన రాసిన ఏ కవితకయినా, ఏ రచనకైనా పై వాక్యాలే దారి చూపాయేమోననిపిస్తుంది.  ‘అనంతాలోకము’ కవితలో పోతన గారి ‘ఎవ్వని యందు డిందు...” పద్యం గుర్తొస్తుంది.

ఎవడు విశ్వ సంసారము సృజన జేసె?

నే యుపాయమున? బాదార్ధమేమి నుగొచు?

నేమి కారణమున? నెవ్వడెరుంగ గలడు?

జలధి గర్భము వెదురుతో కొలువ గలమె?

అంటూ...

నాకు నచ్చిన అక్కడా అక్కడా కొన్ని మచ్చు తునకలు...

“కడచిపోయిన దానికై కలత లేదు

ముందు రానున్నదానికి మురిసిపడను!”

 

“సకల భవరోగ జీవనౌషధము శాంతి!

దురిత భవసాగరము దాట తరణి శాంతి!“

 

శ్మశాన భూమి గురించి చెప్తూ,

“బ్రతుకులన్నియు  దెల్లవారునిచ్చట

ఇది సత్సుఖావాస, మిది శాంతిగృహము”

 

“ప్రేమ రసవంతమైన ఈ సృష్టి కావ్య కర్త వీవు – నీ రచనలు కడు మనోహరములు కావే నీకు?”

ఇలా సాగిపోతాయి కవితలన్నీ.  సరళమైన భాష.  మృదువైన భావాలు.  వేదాంతపరమైన ప్రశ్నలు, అహంభావం లేని భావాలు.

ఈ పుస్తకం కూడా అన్నిచోట్లా దొరుకుతుందనుకోను.  ప్రతులకు శ్రీమతి వల్లీ శ్యామల (+91 9346821416) గారిని సంప్రదించండి. 

ఈ రెండు పుస్తకాలూ ప్రచురించి చిర్రావూరి సంతానం తమ వంతు ఋణం కొంచెమైనా తీర్చుకున్నారేమో ఈ రూపంలో!

*****

Anchor 1
Anchor 2
Anchor 3
Anchor 4
Anchor 5
Anchor 5
bottom of page